గత రెండు మూడు గంటలుగా ప్రసవ వేదనతో బాధ పడుతున్న తన భార్యకి Normal Delivery కష్టం, సిజేరియన్ చెయ్యాల్సిందే అని డాక్టర్ చెప్పటంతో, ఒక్క క్షణం అలోచించి సరే అని అంగీకారం పత్రం మీద సంతకం పెట్టి ఇచ్చాడు అతడు. భార్య పడుకుని ఉన్న స్ట్రెచ్చేరు ఆపరేషన్ రూమ్ వరకు తానూ తోసుకుంటూ వెళ్లి, థియేటర్ లోనికి వెళుతున్న భార్యని తనివితీరా ఒకసారి చూసుకుందాం అనుకున్న అతడి ప్రయత్నాన్ని కళ్ళ వెంట వస్తున్న నీరు, కళ్లజోడుకి అంటుకున్న చమట రెండు కలసి భగ్నం చేసాయి. జీవితంలో చివరి సారి ఇంతలా ఎప్పుడు టెన్షన్ పడ్డాడో అతడికే గుర్తు లేదు.. ఆపరేషన్ థియేటర్ బయట నిర్మానుషమైన వాతావరణంలో తన గుండె చప్పుడు తనకే వినిపించే అంత నిశ్శబ్దంలో అతడు ఉన్నాడు. కాళ్లు చేతులు వణుకుతున్నట్టు అనిపిస్తుంటే ఆధారం కోసం అక్కడే ఉన్న బల్లపై కూలపడ్డాడు…
మనం ప్రేమించే వాళ్ళకి బాధ కలగటం మనకి కష్టం, ఆ బాధలో మనం పాలు పంచుకోలేకపోవటం మరింత కష్టం. పైగా ఆ కష్టానికి మనమే కారణం అన్న గిల్టీ ఫీలింగ్ కూడా కలిస్తే అది కష్టానికే పరాకాష్ట. ఇప్పుడు అలాంటి స్థితిలోనే అతడు కొద్దీ నిముషాలు గడపబోవుతున్నాడు. మనకి ఏదైనా కష్టం రాగానే మన మనసులో కలిగే మొదటి ప్రశ్న why me? మనిషి మనసుని, ఆలోచనలని, బాహ్య ప్రపంచంతో విడదీసి అతడిని అంతర్ముఖుడిని చేసే గుమ్మానికి మొదటి తలుపు ఈ WHY ME? చాలామంది అక్కడే ఆగిపోయి ఏ సిగరెట్టో వెలిగిస్తారు. అలా కాకుండా అంతర్ముఖ ప్రయాణం చేసిన వారు మాత్రం మరో ప్రపంచాన్ని దర్శిస్తారు.. ఎన్నో సత్యాలను కనుగొంటారు.
ఆమెని ఆపరేషన్ థియేటర్ బల్లపై పడుకోపెట్టి, హార్ట్ బీట్ మానిటర్ పై చూపే పరికరం తాలూకు క్లిప్ ఆమె వెలికి తగిలించి, ఆమె కళ్ళకి గంతలు కట్టారు. ఆమెని ఒక ప్రక్కగా తిప్పి, తలని, కాళ్ళని పొట్టలోకి వంచి వెన్నుముక మీద సరైన ప్రదేశం దొరకబట్టుకుని anesthesia ఇచ్చారు. తిరిగి ఆమెని యధావిధిగా వెల్లికిలా పడుకోపెట్టేసారు. కడుపు నుండి క్రింది భాగంలో ఆమె క్రమంగా స్పర్శ తెలికుండా పోసాగింది.
బల్లపై కూలబడ్డ అతడి కళ్ళు మూతలు పడ్డాయి. అతడి ఆలోచనలు గతంలోకి, మనసు సత్యాన్వేషణలోకి జారుకున్నాయి. బాహ్యంలో ఏమి జరుగుతోందో అతడికి తెలియటం లేదు. అసలెందుకింత ప్రసవ వేదన? ఒక మనిషి పుట్టుక ఇంత వేదన భరితమైనా కూడా ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారా? యెంత మంది తల్లుల కడుపు కోతలో కదా. ఇంత బాధ పడాలి అని ముందే తెలిస్తే వేరే alternative ఏమైనా అలోచించి ఉండేవాళ్ళం కదా? ఏ టెస్ట్ ట్యూబ్ బేబీనో, సరోగసీనో ఫాలో అయ్యి ఉండేవాళ్ళం కదా అని అనుకున్నాడు. ఛ! ఇలాంటివి ఏమైనా ఉంటె ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ
వేస్ట్ ఆలోచనలు అని అనుకుని మరింత అంతర్ముఖుడు అవసాగాడు.
ఆమె పూర్తిగా మత్తుకి లోను అయ్యాక, తాపీ లాగా ఉండే ఒక పదునైన సర్జికల్ నైఫ్ ని తీసుకుని ఆమె పొట్ట అడుగు బాగాన అడ్డంగా, లోతుగా ఒక ఘాటు పెట్టింది డాక్టర్. కడుపు ఆమె లోపలి భాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎనిమా చెయ్యగా మిగిలిన వ్యర్ధ పదార్ధాలని గ్లోవ్ ఉన్న చేతితో తొలగించి, అంతా క్లీన్ అయ్యాక చేతిని కడుపులోపలకి చొప్పించి దేనికోసమో వెతుకుతోంది.
ఈ హాస్పిటల్స్, ఆపరేషన్స్ ఇవి అన్ని గత రెండు మూడు దశాబ్దాలుగా బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి, మరి అంతక ముందు డెలివెరీస్ ఎలా జరిగేవో. పైగా ఆ తరంలో అందరికి అధిక సంతానం కూడా అంటూ ఆశ్చర్య పోయాడు. ఎవరి దాకానో ఎందుకు? తన తల్లి సంగతే తీసుకో.. Normal Delivery.. . పాపం యెంత కష్టపడి కని ఉంటుందో? ఇన్నేళ్ళలో ఏనాడైనా అడిగాడా? అమ్మ నన్ను కనడానికి నువ్వెంత కష్ట పడ్డావ్ అని? అసలా సందర్భమే రాలేదే? ఇప్పుడు తన ఆలి అమ్మ అవుతుంటే తెలిసి వస్తోంది. అమ్మ పడ్డ కష్టం ఏమిటో? అన్న ఆలోచన దగ్గర ఆగి, ఆ తర్వాత ఆలోచన రాక, వచ్చి రాని ఆలోచనల మధ్య
శున్యంలో అతడు కొట్టుమిట్టులాడుతున్నాడు….
డాక్టర్ చెయ్యి కడుపు లోపలి పోనిచ్చి వెతుకుతున్నది దొరికింది. అది గర్భ సంచి. అది వలయాకారంలో ఉండి, దాని నిండా ఉమ్మ నీరు నిండి ఆ నీటి మధ్యలో బేబీ ని సురక్షితంగా కాపాడుతోంది.
తన ఫామిలీ, తన ఉద్యోగం, తన చదువు, తన ఆటపాటలు, తన హై స్కూల్, తన ప్రైమరీ స్కూల్, తన నర్సరీ స్కూల్, తన తప్పటడుగులా నడక, తాను పాకటం, తాను బోర్లా పడటం, తాను పొత్తిళ్ళలో పాలు తాగటం.. ఇదేగా నేను? అవునా? మరి అంతకు ముందు? ఇవన్నీ చెయ్యటానికి నాకు దేహం ఇచ్చిన అమ్మ పడ్డ ఆవేదన? అప్పటి నేను గురుంచి తెలియాలి అంటే’ అమ్మనే అడగాలి.. లేదా ఇప్పటి తన భార్య పరిస్థితిని చూసినా అర్ధం అవుతుంది.
9 నెలలుగా బిడ్డని కాపాడుతున్న ఉమ్మనీరుని, ఆ వలయానికి చిన్న రంధ్రం చెయ్యటం ద్వారా బయటకి తీసేసారు. బేబీ తలని పట్టుకుని వెలుపలికి తీశారు. ముందు తలా, తర్వాత మొండెం, తర్వాత కాళ్ళు బయటకి వచ్చాయి. చిమ్మ చీకటి లోంచి ఒక్కసారిగా బయటకి వచ్చిన బేబీ పరిసరాలు చూసి బయపడి ఏడవటం మొదలెట్టింది. ఆ ఏడుపు విని అప్పటి వరకు అచేతనంగా ఉన్న ఆమె ఎరుకలోకి వచ్చింది. బేబీ ఏడుపు విని ఆమె పెదాలపై సన్నని చిరునవ్వు. పది నెలలుగా తాను ప్రాణంలో ప్రాణంగ పొదివి పట్టుకుని పెంచుకుంటూ వచ్చిన ప్రాణమున్న ఆణి ముత్యాన్ని ప్రపంచం లోకి తెచ్చిన వేళా, అమ్మతనంతో తాను నవ్వుతున్న వేళా, తనకి – బిడ్డకి అనుబంధంగ ఉన్న ప్రేగుని డాక్టర్ కత్తిరించి బిడ్డని పక్కన పెట్టి మళ్ళి కడుపు కుట్టటం మొదలుపెట్టారు.
తాను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం, 9 నెలలు అమ్మ పట్టిన దీక్ష, 2 రోజులు అమ్మ అనుభవించిన శిక్ష, తన నెత్తుటితో, రక్త మాంసాలతో పెట్టిన ప్రాణబిక్ష, మూడు నెలలు అమ్మచేసిన పత్యం తన ఆరోగ్యానికి శ్రీరామరక్ష …
అది తన ఉనికి, అది తన ఆరంభం. ఈ విషయం ఇన్నాళ్లు ఎరుక లేక, ఎన్ని ఏక సెక్కాలు పోయమో… యవ్వనం లోకి రాగానే ఎన్ని పాడు అలవాట్లతో ఈ శరీరాన్ని ఎన్ని తూట్లు పొడుచుకున్నామో .. ఇన్ని చేసిన సున్నితంగా చెప్ప చూసిందే తప్ప… నీ శరీరం నేను పెట్టిన బిక్ష.. నేను చెప్పినట్టు విను అని ఏనాడూ శాసించలేదే? అదే కాబోలు అమ్మతనం అంటే..
కడుపు కుట్టటం పూర్తి అయ్యాక, బిడ్డ పుట్టిన టైం నోట్ చేసి, బిడ్డ వెయిట్ చూసి, మంచి వెయిట్ అని డాక్టర్ అంటుంటే, విజయ గర్వంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే, ఇంతలో కుట్ల బాధ ఏ మూలనో తెలిసి, బాధతో కన్నీరు ఉబికి వస్తుంటే, కనురెప్పలతో వాటిని చెంపల పక్కనున్న చెవుల వరకు దారి మళ్లించి, పెదవులకున్న చిరునవ్వు చెరిగిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది ఆమె.
ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. ఒక ట్రేలో బిడ్డను తెచ్చి చూపించారు. 10 నెలలుగా తనకి ఆహారాన్ని అందిస్తున్న అమ్మ ప్రేగు ఆ బిడ్డ బొడ్డు నుండి వేలాడుతూ క్లిప్ పెట్టి కొద్దిగా నెత్తురోడుతూ ఉంది. ప్రేగుబంధం అన్నమాట చాల సీరియల్స్ లోను, సినిమాలలోనూ విన్నాడు. పెద్దగా పట్టించుకోలేదు. చిమ్మ చీకటిలో తొమ్మొది నెలలపాటు, నోటితో తినటం కుడా రాని తనకి ఆహారాన్ని అందించిన సంజీవని అమ్మ ప్రేగు అని అర్ధమయింది. వీటన్నిటిని మర్చిపోకుండా అనుభవించడానికి మళ్ళి పుడితే బాగుండును అనిపించింది అతడికి. కళ్ళు తుడుచుకుని బిడ్డని చూసాడు. బిడ్డ లక్షణంగా ఉంది. మదర్ ని రూమ్ లోకి షిఫ్ట్ చేసాం అని చెప్పారు. అతడు వేగంగా రూమ్ వైపుకి కదిలాడు.
రూంలో బెడ్ మీద పడుకోపెట్టి, కుట్ల బాధ తెలీకుండా మందులు ఇచ్చి, ఒకటి రెండు రోజులు లిక్విడ్స్ మీద సర్వైవ్ అయ్యేలా సెలైన్ బాటిల్స్ పెట్టి ఉంచారు. మనసులో బెరుకుగా ఉన్నా… ధైర్యం చేసి ఆమె ముందుకి వెళ్లి నిలబడ్డాడు. ఎలా ఉన్నావు అని అడగబోతుండగా.. ఆమె పెదవులమధ్య నుండి స్లోగా బేబీ ఎలా ఉంది అని అడిగింది. ఆ అడగడం లోనే నాకు ఆల్రెడీ

తెలుసు అన్న నవ్వు కూడా దాగి ఉంది. ఆ నవ్వు లో అతడికి ఎన్నో వేల ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి.
తాను కాస్త కోపంగా కసిరితేనే కన్నీళ్ల పర్యంతం అయిపోయే తన భార్య, తాను కాస్త మొరటుగా సరసం ఆడితేనే కమిలిపోయి, కందిపోయే తన భార్య, తాను చిన్నప్పటినుండి ఆట పాటల్లో తగిలించుకున్న దెబ్బలు తాలూకు మచ్చలు చూసి అబ్బురపడిపోయే తన భార్య…. ఇలాంటి విషయాలలో మగవాడి అహం ఎంత బాగా satisfy అవుతుందో కదా?
కానీ తన భార్యా, తనని తండ్రిని చెయ్యటం కోసం.. ఒక ప్రాణిని పుట్టించడం కోసం, తన శరీరాన్నే చీల్చి, అవసరం అయితే తన ప్రాణాన్నే ఫణంగా పెట్టగలదని అర్ధమైన నాడు…. ఇవన్నీ హనుమంతుని ముందు కుప్పి గెంతులే అని అర్ధం అయిన నాడు.. అతడు తనలో తానె కుంచించుకు పోతున్నాడు …. ఇన్నాళ్లు ఈ విషయాలు ఏవి అమ్మ తనతో చెప్పనందుకు చిన్నబుచ్చుకుంటున్నాడు.. అసలు తానే ఎందుకు అడగలేదు అని తనలో తానే మదనపడుతున్నాడు.. అమ్మ ఏదైనా విషయం ఒకటికి రెండు సార్లు చెప్పగానే… చాల్లే ఊరుకోమ్మా నీకేం తెలీదు అని తాను ఎన్నిసార్లు అన్నాడో తల్చుకుని కుమిలిపోతున్నాడు. తన కన్నీటితో తన మనసుని తానె ప్రక్షాళన చేసుకుంటున్నాడు… తెలిసి తెలియని తనం తోనో, అహంకారం తోనో, అజ్ఞ్యానం తోనో, అమ్మని ధిక్కరించిన క్షణాలన్నిటికి క్షమాపణలు చెప్పుకుంటూ, పశ్చాతాపం పడుతున్నాడు.
ఇంతలో బిడ్డని ఎత్తుకుని అతడి తల్లి అక్కడికి వచ్చింది. కన్నీటి పర్యంతం అయిన అతడిని చూసింది. ఆ క్షణం ఆమెకి చేతిలో ఉన్న బిడ్డ, చేతికి అంది వచ్చిన బిడ్డ ఇద్దరు ఒకలాగే కనిపించారు. చేతిలోని బిడ్డని అమ్మ దగ్గర పడుకో పెట్టి, తన కొడుకు తలని నిమిరి “ఏమి పర్వాలేదులే” అని అంది. తన కన్నీళ్లు ఎందుకో అతడు చెప్పబోయాడు.
“నీకేమి తెలీనప్పుడే, నీకేం మాటలను రానప్పుడే నీ ఏడుపు ఏంటో నాకు స్పష్టంగా అర్ధం అయ్యేది. అలాంటిది ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళి నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో నాకు వేరే చెప్పాలా? ఇప్పటికి అయినా నా కష్టం ఏమిటో తెలుసుకున్నావ్, నా విలువ ఏమిటో గుర్తించావ్? చాలా సంతోషం” అంది. అతడికి ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. అతడి మనసు తేలిక పడింది. ఆత్మీయంగా అతడు తన అమ్మని హత్తుకున్నాడు. అతడి భార్య అపురూపంగా తన బిడ్డని అక్కున చేర్చుకుంది.
ఒకే పుట్టుకలో గొంగళి పురుగు ప్రకృతి పెట్టె పరీక్షలను తట్టుకుని అందమైన సీతాకోక చిలుకలా మారినట్టు.. తన భార్య ఫీజికల్గా అనుభవించిన ప్రసవ వేదనని, అతడు మానసికంగా అనుభవించి, అమ్మతనం లోని గొప్పతనం తెలుసుకుని… అందమైన బిడ్డని అందిపుచ్చుకుని… మళ్ళి పుట్టాడు బాధ్యతాయుతమైన తండ్రిగా…..
కిషన్
అంకితం
అమ్మ సువర్చలా దేవికి….

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.