“నవ వసంతం”

నాలుగు తరాలు కలసి మెలసి ఒకే కప్పు క్రింద కాపురం చేయడమంటే .... అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ సుబ్బరామయ్య గారి కుటుంబానికి మాత్రం అది సాధ్యమయింది. సుబ్బరామయ్య గారికి వందేళ్ళు దాటుతాయి వచ్చే పున్నమినాటికి. పన్ను కదల లేదు, కంటి మసకలేదు. మంచి విగ్రహ పుష్టి గల శరీరం. గాంభీర్యం ముఖంలో తాండవిస్తూ వుంటుంది. అతనిలోని గంభీర్యమే ఆ కుటుంబాన్ని చెక్కు చెదరనీయడం లేదని ఊరి జనమంతా ముక్త కంఠంతో అనుకుంటుంటారు.

కుటుంబ సభ్యులంతా సుబ్బరామయ్యగారి నూరవ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు, సుబ్బరామయ్యగారు వద్దు వద్దంటున్నా, మొట్ట మొదటి సారిగా అతని మాటను జవదాటుతూ!

చిన్నాపెద్దా అందరితో కలిపి మొత్తం డెబ్బై మంది పైనే వుంటారు ఆ కుటుంబంలో. ఒకే వంట. ఒకే పంక్తి. ప్రతి పూటా విందు భోజనాలే. పండుగ రోజుల్లో అయితే ఇక చెప్పనే అక్కరలేదు. వెయ్యెకరాల మీద వచ్చే ఫలసాయం వుంది కనుక నల్లేరు మీద బండిలా సాగిపోతోంది కుటుంబం, ఖర్చెంతయినా తేలిగ్గా తట్టుకుంటూ.

సుబ్బరామయ్యగారిది దూర దృష్టి. ఇప్పటికయితే డోకా లేదు. కానీ, మరి రేపటి మాటో!? కుటుంబం చెదిరిపోయే అవకాశం వుందని, ఇంతవరకు వ్యాపారాల జోలికి ఉద్యోగాల జోలికి పోలేదు. భూమి ఒక్కటే మనుషులను కలిపి ఉంచే ఏకైక బంధమని సుబ్బరామయ్యగారి ప్రగాడ విశ్వాసం. అందుకే ఇతర వ్యాపకాల పట్ల కుటుంబ సభ్యుల దృష్టిని మరలనీయ లేదు. తాను మరలలేదు. కానీ ఇప్పుడు తప్పేట్టు లేదు. తమది నిర్మాణం అవుతున్న నవ్యాంద్ర రాజధానికి అనుకుని వున్న గ్రామం. తనతరం నాటికి కాకపోయినా తరువాతి తరానికైనా భూముల మీద ఆశ వదులుకోక తప్పదు. నగరంతో పాటు జన సాంద్రత, దానితో పాటు వాతావరుణ కాలుష్యము పెరుగక తప్పదు. తాగునీటికి ప్రాధాన్యత పెరిగి సాగు నీటికి ఎద్దడి రావచ్చు. ఇప్పుడు సాగు చేస్తున్నంత భూమిని అప్పుడు సాగు చేయలేక పోవచ్చు. సాగు చేసినా ఇంత దిగుబడి రాక పోవచ్చు. నవీకరణ కొండసిలువ లాంటిది. నగరానికి చుట్టుపక్కల ప్రాంతాలను యిట్టె మింగేస్తుంది. జరగబోయేది తలచుకుంటుంటే అతని వళ్ళు జలదరించింది.

తన ప్రమేయం లేకుండానే పుట్టినరోజు పండుగకు కావాల్సిన ఏర్పాట్లు జరిగి పోతున్నాయ్. చెక్కుల మీద చెక్కులు చెల్లిపోతున్నాయ్. ఖర్చు మితిమీరిపోతోంది. తన మీద అభిమానానికి సంతోష పడాలో, నీళ్ళ ప్రాయంగా చేస్తున్న ఖర్చుకు చింత పడాలో సుబ్బరామాయ్యకు అర్ధం కావడంలేదు. పిలుపుల లిస్టు తయారవుతోంది. బంధు వర్గమంతా దాదాపు చుట్టు ప్రక్కల ఊళ్ళల్లోనే వున్నారు. దురాబారం పిలుపులు ఆట్టే లేవు.

పండుగ రోజు దగ్గర పడుతోంది. దగ్గరి చుట్టాలు గుంపులు గుంపులుగా రావడం మొదలు పెట్టారు. డెబ్బై మంది పై చిలుకు కుటుంబ సభ్యులు వారి వారి బంధువులు. ఇల్లు వారద భాదితుల పునరావాస కేంధ్రముగా తయారయింది. ధాన్యం గదిలో మెట్టు గట్టిన బస్తాలు ఒక్కటొక్కటిగా తరిగిపోతున్నాయి. వంట వారికి చేతి నిండా పని. ఊరి వాళ్ళు చాలక పోరుగూళ్ల నుంచి కూడా వంట మేస్త్రీలు దిగబడిపోయారు వారి వారి అంగ బలంతో. వండి వడ్డిస్తున్న ఘుమ ఘుమలు ప్రక్క ఊళ్ళకు పాకుతున్నాయి. గ్రామం చుట్టూ ఉన్న రెండెకరాల కైవారంలో వున్నా పొలాలన్నీ పోగ చూరిపోయాయి.

గంటలు గడిచే కొద్దీ సుబ్బరామయ్య గుండెల్లో దిగులు పేరుకుపోతోంది. కుటుంబ సభ్యులకు రోజులు క్షణాల్లా గడుస్తున్నాయి. సుబ్బరామయ్యకు క్షణాలు యుగాలుగా మారుతున్నాయి.

సుబ్బరామాయ్య ఆలోచనలన్నీ భవిష్యత్తు గురించే. మనసుకు తోస్తోంది. పెను ప్రమాదం పొంచి వుందని. కుటుంబ సబ్యులకిదేమీ పట్టడం లేదు. అది వారి తప్పు కాదు. సుబ్బరామయ్య లాంటి వట వృక్షం నీడలో వారికి స్వంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవసరం కలుగలేదు. పని విభజన జరిగి పోతుంది. సుశిక్షిత సైనికుల్లా అప్పగించిన పనిని చేసుకు పోవడమే. నోరు తెరచి అడగవలసిన అక్కర లేకుండానే అవసరాలన్నీ సమకూరుతుంటాయి. అసంతృప్తికి అసహనానికి ఆస్కారమే లేదు. ఇక ఉమ్మడి కుటుంబం విడిపోయే అవసరం కలిగేదేక్కడుంది!?

ఆడవారికి కూడా అంతే. ఇది కావాలి అని మగవారిని అడుగవలసిన అవసరమే ఉండదు. వంట సామాను గదిలో యెంత విరివిగా వాడినా సంవత్సరానికి సరిపడా సరుకులు నిల్వచేసి వుంటాయి. ఇతరా అవసరాలయినా అంతే. ఖచ్చితమైన అంచనాలతో క్రమం తప్పకుండా సమకూర్చబడుతుంటాయి. ఇవన్నీ సుబ్బరామయ్య వ్యవహార దక్షతకు నిదర్శనాలు.

ఆలోచించగా ఆలోచించగా ఒక పరిష్కారం దొరికింది సుబ్బరామయ్యకు. సమయం చూసుకుని, కుటుంబ సభ్యులందరినీ ఒక చోటకు చేర్చి తన ఆలోచనల్ని వారితో పంచుకోవానుకున్నాడు. తొందరపడే తత్వం కాదు సుబ్బరామయ్యది. ప్రతి అడుగు ఆచి తూచి వేసే మనస్తత్వం ఆయనిది.

పండుగరోజు రానే వచ్చింది. రాజు గారింటి పెళ్లి సందడిలా వుంది ఊరంతా. కోలాహలం మిన్ను నంటుతోంది. ఐదు రోజుల వేడుకలలో, హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు , కోలాటం భజనలు, భారత నాట్యాలు ఓహ్... ఒకటేమిటి కళారూపాలన్ని ప్రదర్శించ బడ్డాయి. కళాకారులు మున్నెన్నడు ఎరుగని బహుమానాలందుకున్నారు. వేడుకలు ముగిశాయి.

ధాన్యపు గిడ్డంగి ఒట్టి పోయింది. సామాను గది చిన్న బోయింది. పంట చేతికి రావడానికి రెండు నెలల సమయముంది. పూత మీదకు వచ్చి వున్నాయి చేలన్నీ. నిల్వ రొక్కం అరకొరగా వుంది. ఖర్చుల నియంత్రణ అవసరమయింది. సభ్యుల అవసరాలు తీరడం ఆలస్యమవుతోంది.

ఇక తాత్సారం చేయడం మంచిది కాదని సుబ్బరామయ్యకు అర్ధమయ్యింది. ఆ సాయంత్రమే సమావేశ పరచి, సభ్యులందరికీ తన నిర్ణయాన్ని తెలియ జేశాడు సవివరంగా.

ఉపన్యాస ధోరణిలో కాకుండా అనునయ వాక్యాలను పేరుస్తూ చెప్పడం మొదలు పెట్టాడు.

“మనం నాల్గు తరాలుగా ఉమ్మడిగా ఉంటున్నాం. ఆస్తులు, పొలాలు, గొడ్డు గోదా నగా నట్రా, రొఖ్ఖం గిక్కం అంతా ఉమ్మడే. వ్యవసాయం తప్ప మారో ఆదాయ వనరుల జోలికి పోలేదు. పోయివుంటే పరిస్తితి మరోవిధంగా వుండేదేమో. ఇప్పుడు సమయమొచ్చింది. వ్యవసాయేతర రంగంలో మనం కాలు పెట్టాలి. తప్పదు. ఆది భూ క్రయ విక్రయ వ్యాపారమా మరొకటా తరువాత నిర్ణయిద్దాం. మరో రంగంలో ప్రవేశించడానికి, సరిపడినంత రొఖ్ఖం ఇప్పుడు మనదగ్గర లేదు. కనుక మనం కొంత భూమిని రొఖ్ఖంగా మార్చుకోవాలి. అంటే కొంత భూమిని విడుదల చేయాలి!”

ఆగి సభ్య్లులను చూశాడు. రాముడు మంచిబాలుడు అన్న చందంగా వింటున్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకుని తిరిగి చెప్పడం ప్రాంభించాడు.

“అంటే కొంత భూమిని మనం అమ్మాలి”

సభ్యుల నుంచి ఏ స్పంధనా లేదు.

“రాజధానిని ఆనుకుని వున్న భూముల్ని అమ్మడం మంచిది. ఉత్తరోత్రా అవి వ్యవసాయానికి పనికి రాక పోవచ్చు. రాజధానితో పాటు పరిశ్రమలు వస్తాయి. జనాలు పెరుగుతారు. కొన్ని భూముల్లో అపార్టుమెంట్లు నిర్మిద్దాం. రాబోయే కాలంలో అద్దె ఇళ్లకు గిరాకీ పెరగొచ్చు. అవి నిఖరమయిన అదాయాన్నందిస్తాయి. అలాగే అమ్మిన భూమికి సరిపడా తక్కువ ధరలు ఉన్న చోట భూముల్ని కొందాం. వ్యవసాయాధారిత వ్యాపారాలు పెడదాం. అంటే ఎరువుల ఉత్పత్తి, పనిముట్ల అమ్మకం, విత్తనాలు, పురుగుమందులు వగైరా. మనకు తెలిసిన వ్యాపారాలే చేద్దాం. ఏమంటారు”.

“మీ నిర్ణయమే మా నిర్ణయం పెద్దా” ముక్త కంఠంతో చెప్పారు అందరూ.

సుబ్బారామయ్యి కుటుంబంలో కొత్త శకం ప్రారంభమయింది. అది అవిచ్చిన్న ఉమ్మడి కుటుంబం. భవిష్యత్తులో కూడా.

*****

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.