ముందు జాగ్రత్త


అనగనగా ఒక గ్రామం. అందులో ఒక చెరువు. ఆ చెరువులో కాలజ్ఞాని, చురుకు , అజ్ఞాని అనే మూడు చేపలు నివసిస్తూ ఉండేవి. ఒక సంవత్సరం వర్షాలుపడక చెరువులో నీరు క్రమక్రమంగా ఎండిపోసాగింది.

ఒకనాడు కాలజ్ఞాని అనే చేప చురుకు, అజ్ఞాని అనే తన స్నేహితులైన చేపలను పిలిచి “మిత్రులారా ఈ చెరువు వర్షాభావం వల్ల ఎండిపోతోంది. అందువల్ల చేపలు పట్టే జాలరివాళ్లు వచ్చి వల విసిరితే మనం అందులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. కనుక ముందు జాగ్రత్తగా మనం వేరే చెరువుకి వెళ్ళి నివసిద్దాము” అంది.

అందుకు చురుకు “ఇప్పుడు ఇంకా నీరు ఉన్నదిగా , అంతగా నువ్వు చెప్పే అపాయమే వస్తే అప్పుడు ఆలోచిస్తానులే” అన్నది.

అజ్ఞాని అనే చేప మాత్రం స్నేహితుడు కాలజ్ఞాని మాటలను వినిపించుకొనట్లే ఉండిపోయింది.

“సరే మీ ఇష్టం” అని కాలజ్ఞాని ఆరోజే వేరే చెరువుకి వెళ్లిపోయింది.

ఆ మరునాడే కాలజ్ఞాని ఊహించినట్లు జాలర్లు వచ్చి చేపలకోసం చెరువులో వల విసరగా అందులో చురుకు, అజ్ఞాని చిక్కుకుపోయాయి.

వల పైకి తీసి చచ్చిన చేపలు ఇంక ఎటూ తప్పించుకుని పోలేవు కనుక వాటిని తరువాత తీసుకుని పోవచ్చు అనుకుంటూ ఆ జాలరి ఒక్కొక్క చేపనే ఒడ్డున పడవేయసాగాడు.

అది గమనించిన చురుకు వెంటనే చచ్చిపోయినట్లుగా నటిస్తూ కదలకుండా ఉండిపోయింది. దాంతో అది చచ్చిన చేప అనుకుని జాలరి దానిని ఒడ్డుకి విసిరేశాడు.

వెంటనే చురుకు జాలరికి కనపడకుండా నెమ్మదిగా చెరువులోకి జారుకుని ప్రాణాలు కాపాడుకుంది.

అలాంటి ఉపాయాలేమీ తట్టని, తెలివిలేని అజ్ఞాని నీటిబయట ఉన్న కారణాన గిలగిల కొట్టుకోవడం చూసి జాలరివాడు అది తప్పించుకుని పోకుండా బుట్టలో వేసుకున్నాడు.


చెరువులో నీరు ఎండిపోవడంతో అపాయం సంభవిస్తుందని తెలిసి కాలజ్ఞాని మాటలను పట్టించుకోక పోవడమే కాకుండా అటువంటి అపాయం ఎదురైతే తప్పించుకోవడానికి స్నేహితుడు చురుకు లాగా తగినంత సమయస్ఫూర్తి కూడా లేని ఆజ్ఞాని అనే చేప స్నేహితుడు కాలజ్ఞాని ముందుజాగ్రత్తగా చెప్పిన మంచిమాటలు వినక ప్రమాదంలో చిక్కుకుపోయింది.


నీతి : ఏదైనా అపాయం సంభవించినప్పుడు తెలివిగా దానినుండి తప్పించుకోవాలి లేదా మన శ్రేయస్సుకోరి ముందుజాగ్రత్తగా ఎవరయినా సలహా ఇస్తే శ్రద్ధగా విని పాటించాలి.


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.