రహస్యం

పెసరపాడు గ్రామాధికారి భూషయ్య ఏడేళ్ళ కూతురు కమల తండ్రి వద్దకు వచ్చి, "నాన్నా, రహస్యం అంటే ఏమిటి?" అనడిగింది. "ఎందుకూ?" అనడిగాడతను.

కమల తన స్నేహితురాలు వనజ ఇంట్లో ఆడుకుంటూంటే, ఒకావిడ వచ్చి వనజ తల్లితో, "ఈ సమాచారం నీకు తెలుసా?" అంటూ ఏదో చెప్పబోయింది. అప్పుడు వనజ తల్లి పిల్లలతో, "రహస్యాలు పిల్లలు వినకూడదు. మీరు బైటకు వెళ్ళి ఆడుకోండి’ అంది.

ఆ విషయం చెప్పి, "సమాచారం, రహస్యం అంటే ఏమిటి నాన్నా?" అనడిగింది కమల మళ్ళీ.

భూషయ్య ఓ క్షణం ఆలోచించి, "వాటి అర్థం తరువాత చెబుతాను కాని, ముందు నువ్వు రచ్చబండ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నవారందరితోనూ సాయంత్రం నేను మామిడితోపు దగ్గరకు రమ్మన్నానని చెప్పిరా" అన్నాడు. కమల వెంటనే పరుగెత్తుకు వెళ్ళి చెప్పి వచ్చింది.

కాసేపటి తరువాత భూషయ్య కొబ్బరితోటకు వెళ్తూ కూతుర్ని కూడా రమ్మన్నాడు. ఎగిరి గంతేస్తూ తండ్రితో బైలుదేరింది.

త్రోవలో ఓ ఇంటి వద్ద ఆగి, ఆ ఇంటి ఆసామీని పిలిచాడు భూషయ్య. అతను బైటకు వచ్చి నమస్కరించగానే, గొంతు తగ్గించి, "వచ్చే నెలలో పెసర వెల పెరగబోతున్నట్టు సమాచారం అందింది. తొందరపడి నీ పంటంతా చవగ్గా అమ్మేయకు. ఈ సంగతి ఎవరికీ చెప్పకు" అని చెప్పాడు భూషయ్య.

కొంతదూరం వెళ్ళాక మరో వ్యక్తి కనిపిస్తే అతన్ని పక్కకు పిలిచి, ముందు వ్యక్తికి చెప్పినట్టే చెప్పాడు భూషయ్య. అనంతరం త్రోవ పొడవునా మరో అరడజనుమందికి అలాగే చెప్పాడు.

అదంతా గమనిస్తూన్న కమల విస్తుపోతూ, "అదేంటి నాన్నా, ఎవరికీ చెప్పొద్దంటూ అందరికీ నువ్వే చెప్పేసావు?" అనడిగింది.

భూషయ్య నవ్వి, "రహస్యమంటే ఇదేనమ్మా. ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్కరికే చాటుగా చెప్పేదే రహస్యం!" అన్నాడు. "సమాచారమంటే బాహాటంగా పదిమందికీ తెలియపరచేది. నువ్వు రచ్చబండకు వార్త మోసుకుపోలే? అదన్నమాట". ఆ బుల్లి బుర్రకు ఏమి అర్థమయిందో ఏమో, "రహస్యమంటే ఇదా!?" అంటూ బుర్ర గోక్కుంది కమల సాశ్చర్యంగా.

ఆ విషయం తెలియజెప్పడానికే కూతుర్ని తనతో కొబ్బరితోటకు తీసుకువెళ్ళిన భూషయ్య, చెట్లనుండి బొండాలు దింపించి తీయటి నారికేళ జలాలను కమలకు ఇప్పించాడు.


  • (చందమామ మాసపత్రిక, జూన్ 2012)
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.