సొంత ఇల్లు (కథ)

(ఈ కథ ఆంధ్రభూమి మెరుపు శీర్షికలో ప్రచురితమైంది)

ఉంటున్నది అద్దె ఇల్లయినా..సొంత ఇంటి కన్నా.. ఎక్కువగా చూసుకునే శంకరయ్య గుండెపోటుతో ఆకస్మిక మరణానికి గురయ్యాడు. గట్టిగా ఏడుపులు విన్న ఇంటి యజమాని రామారావు ఖంగారు పడుతూ వచ్చాడు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఆదుర్ధాగా ‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది! చెట్టంత మనిషిని కాలం పొట్టన పెట్టుకుందని’ బాధపడుతూ పార్వతమ్మకు ధైర్యం చెప్పారు. అన్నీ అయ్యాక ‘శవాన్ని మాత్రం ఇక్కడ వుంచకండి! మా ఆచారం ఒప్పుకోదు. ఏ సత్రానికో తీసుకెళ్లండి’ అంటూ ఖచ్చితంగా చెప్పి అక్కడ్నుంచి కదిలారు.

‘అదేంటండీ! నిన్నటి దాకా ఇక్కడ తిరిగిన మనిషే కదా! శవంలా మారాక కొన్ని గంటలు కూడా ఈ నేలమీద పడుకునే అర్హత లేదా! ఇప్పుడే కదా! దేవుడిలాంటి మనిషని అన్నారు. దేవుడు ఇక్కడ వుండ కూడదా? కొడుకు ప్రసాద్ అడిగేశాడు కళ్లు తుడుచుకుంటూ! ‘నీకు తెలియదు ప్రసాద్! మా ఇంట్లో ఇలా శవానికి ఏర్పాట్లు అవీ చెయ్యకూడదు అంతే’ ఖచ్చితంగా చెప్పాడు రామారావు.

‘మరి మీ ఇంట్లో ఎవరైనా పోతే!’ అన్నాడు చిన్న కొడుకు కృష్ణ కోపంగా.

‘ఇది మా సొంత ఇల్లు. మేము ఏదైనా చేసకునే హక్కు మాకుంది’. అనవసరంగా వాదించక బాడీని ముందు తరలించండి అన్నాడు రామారావు కోపంగా.

చేసేదేం లేక అందరూ వౌనం వహించారు. అందరి మనసుల్లో బాధ. ఆవేశం పెల్లుబుకుతున్నా ఏం చేయలేని పరిస్థితి. కారణం వాళ్లు ఉండేది అద్దె ఇల్లు కనుక.

చివరికి శవాన్ని ఓ సత్రానికి తరలించారు. ఇంట్లో వాళ్లు, బంధువులు, కావలసిన వాళ్లు అందరూ సత్రానికి బయల్దేరారు.

పదేళ్ల నుండి ఆ ఇంట్లోనే అద్దెకుంటున్నారు శంకరయ్య కుటుంబం. కలెక్టర్ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసి రిటైరయ్యాడు శంకరయ్య. ఆయన సంపాదనతోనే పిల్లలకి మంచి చదువులు చెప్పించాడు. పెళ్లిళ్లు జరిపించాడు. ఇవన్నీ చెయ్యగలిగాడు కానీ తను ఉండేందుకు, తనకంటూ ఒక సొంత ఇంటిని అమర్చుకోలేకపోయాడు. వచ్చినదంతా కుటుంబ ఖర్చులకే సరిపోయేది. పిల్లలు వృద్ధిలోకి వస్తే చాలు! అంటూ సంపాదించినదంతా పిల్లల చదువులకీ, వాళ్ల పెళ్లిళ్లకీ ఖర్చు పెట్టేశాడు.

‘పార్వతీ మన పిల్లలు కడతారు లేవే సొంత ఇల్లు. అప్పుడు మనిద్దరం హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుందాం’ అంటూ గల గల నవ్వేసేవాడు శంకరయ్య.

పిల్లలకు మంచి వుద్యోగాలు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నాన్న కోరిక తీర్చాలని కొడుకులకూ ఉంది. కానీ ఇప్పుడు ఇల్లు కట్టడమంటే మాటల్లో పనికాదు. అపార్ట్‌మెంట్ తీసుకోవాలన్నా లక్షలతో పని. ఎంత లోన్ తీసుకున్నా స్వంత డబ్బు చేతిలో కొంతైనా వుంటే మంచిదని వాళ్ల వుద్ధేశం. అందుకే ఆగారు. దాన్ని శంకరయ్య కూడా సమర్థించాడు. ఇప్పుడు మనిషి పోయాక ప్రాణం లేని శరీరంపైన ఈ ఆంక్షలు, ఆచారాలు, కట్టుబాట్లు, వాటిని వదిలించడం చాలా కష్టం అని అర్థమయింది పిల్లలకి.

ఇదంతా చూస్తున్న పార్వతమ్మా కుళ్లి కుళ్లి ఏడుస్తున్నది. ‘మీకు ఈ విధంగా జరగాలని రాసి వున్నదండీ. అంటూ కన్నీరు మున్నీరవుతున్నది. తతంగాలన్నీ పూర్తి చేశాక..పాడెను లేవనెత్తారు. హరోం హర మహదేవ, శంభోశంకర అంటూ కొడుకులు, కొంత మంది బంధువులు, మిత్రులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

అప్పుడు కూడా తల్లిదండ్రులు ఉన్న వాళ్లు కానీ, ఆడవాళ్లు కానీ అంతిమయాత్రలో పాల్గొనకూడదని ఆంక్షలు పెట్టారు. దహన కార్యక్రమానికి వెళ్లిన వాళ్లంతా తిరిగి వచ్చాక స్నానాలు చేసి దీపం చూశారు. తరువాత భోజనాలు మొదలయ్యాయి. ఇంతలో ఇంటియజమాని రామారావు నుండి ప్రసాద్ మేనమామకు ఫోన్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతుంటేనే ఆయన మొహం వివర్ణమయింది.

‘ఏమయింది మామయ్యా!’ అంటూ ఆదుర్ధాగా ప్రసాద్, కృష్ణ అడిగారు.

‘ప్రసాదూ! మీ ఇంటి యజమాని ఫోన్ చేశాడు. అమ్మను వాళ్ల ఇంటికి తీసుకెళ్ల కూడదట. ఈ పది రోజులు పూర్తయి కర్మకాండలయ్యేంతవరకు ఆవిడను మీరే ఎవరైనా తీసుకెళ్లండి అన్నాడు రా’ అన్నాడు గోపాల రావు.

‘మామయ్యా! మనుషులు మరీ ఇంత దారుణంగా వుంటారా? అన్నారు. అన్నదమ్ములిద్దరూ బాధపడుతూ. అవునురా కొంత మంది మనుషుల కన్నా, ప్రాణాల కన్నా ఆచారలకే విలువనిస్తారు. ఆ విషయాలలో వాళ్లు రాజీపడరు. తమ ఇంటికి అరిష్టం చుట్టుకోకూడదు అని అనుకుంటారు వాళ్లు బాగుండాలి అనుకుంటారే కానీ ఎదుటి వాళ్ల ఇబ్బందులను పట్టించుకోరు’ అన్నాడు గోపాల రావు అనుభవాలతో పండిన వయసుతో. మనుషులకన్నా పశువులూ పక్షులే నయం’! వాటిల్లో ఏదైనా చనిపోతే అరచి గోలపెట్టి అన్నింటినీ పిలుచుకుంటాయి. వాటి భాషలో ఏడుస్తాయి. వాటికన్నా హీనంగా తయారయ్యాడు మనిషి.

సరే మామయ్యా! ఇప్పుడేం చేద్దాం! అన్నాడు ప్రసాద్. ‘ఏం చెద్దాంరా! మీ అమ్మను ఎవరింటికైనా తీసుకెళ్లమని అడగడం, వాళ్లు కాదేనలేక ఇబ్బంది పడడం, మనం అడిగి లేదనిపించుకోవడం కంటే వేరే మార్గం ఆలోచిద్దాం అన్నాడు’ ఆయన.

చివరికి ఆవిడని ఆ సత్రంలోనే ఓ రూం తీసుకుని అక్కడే ఉంచడానికి నిర్ణయించారు.

ఏ రోజూ భర్తను వదిలి పరాయి ఇంటికి కూడా వెళ్లని పార్వతమ్మ మొట్టమొదటిసారిగా బయట ఉండాల్సి వచ్చింది. ‘పచ్చని చెట్టులా వుంటావమ్మా! పొద్దున లేస్తే నీ మొహం చూస్తే అంతా మంచే జరుగుతుందని’ పొగిడిన నోళ్లే ఇప్పుడు వౌనం వహించాయి. ఎవరి దోవన వాళ్లు వెళ్లిపోయారు. శుభకార్యాలకు నాలుగు రోజులు ముందుగా వచ్చి నాలుగు రోజుల తర్వాత వెళ్లే వాళ్లు. మనిషి కష్టాలలో వున్నప్పుడు ఒంటరిని చేసి వదిలి వెళ్తారు.

వారం రోజులకే పార్వతమ్మ జీవచ్ఛవంలా తయారయింది. ‘అమ్మా! ఇలా అన్నం నీళ్లు ముట్టుకోకుండా ఏడుస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది’ అంటూ తల్లిని దగ్గరకు తీసుకుంది మాధవి.

ఈ పరిస్థితులలో ఉన్న అమ్మను చూశాక సొంత ఇల్లు అనేది ఎంత అవసరమో కొడుకులిద్దరికే అర్థం అయింది. అమ్మ పరిస్థితి నాన్నలా కాకూడదని గట్టి నిర్ణయానికొచ్చారు!

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.