ఓ రైతన్న కథ

రామాపురం అనే ఊరిలో సుబ్బారావు అనే ఒక చిన్న రైతు నివసిస్తుండేవాడు. ఆ రైతుకి ఇద్దరు ఆడపిల్లలతో పాటు ఓ కొడుకు కూడా ఉండేవాడు.సుబ్బారావు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఆ ఊరికి తీవ్ర స్థాయిలో కరువు వచ్చింది. సంవత్సరం పాటు వానలు పడక పంటలు పండలేదు. సుబ్బారావు పంట వేయడానికి అప్పు ఇచ్చిన దళారులు తమ డబ్బులు చెల్లించమని రోజురోజుకీ వేధించసాగారు.

సుబ్బారావుకి ఏమి చేయాలో అర్ధం కాని పరిస్ధితి. అప్పులెలా తీర్చాలి. పిల్లల్నెలా చదివించాలి... ఇవే ఆలోచనలు రోజూ మనసును అల్లకల్లోలం చేస్తుండేవి. ఆఖరికి కూటికే గతిలేని పరిస్థితి తలెత్తడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో చనిపోవడానికి తన పొలంలోనే ఒక చోటుని సిద్ధం చేసుకున్నాడు. రోజూ పొలానికి వెళుతూ అన్నం మూట పట్టుకెళ్లే సుబ్బారావు ఆ రోజు మాత్రం.. పలుపు తాడు తీసుకుని వెళ్లాడు.

అయితే ఈ విషయాన్ని గమనించిన సుబ్బారావు కొడుకు కూడా తన తండ్రి ఏం చేస్తున్నాడో చూడాలని అతని వెనకాలే వెళ్లాడు.

దూరం నుండి తన తండ్రి ఏం చేస్తున్నాడో నిశ్శబ్దంగా గమనించసాగాడు. సుబ్బారావు చెట్టుకు తాడు తగిలించి, క్రింద ఒక స్టూలు సిద్దం చేసుకొని, దానిపై కెక్కి మెడకి తాడుని చుట్టుకోవడానికి ప్రయత్నించడం గమనించిన ఆ కుర్రాడు హతాశుడయ్యాడు.

అనుకోకుండా తన తండ్రి అలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు ఆ కుర్రాడు.

వెంటనే గబగబా తండ్రి దగ్గరకు వెళ్లి వెనుక నుంచి గట్టిగా పట్టుకొని ఏడ్వడం మొదలుపెట్టాడు. "నాన్న.. నువ్వు చనిపోతే మాకు దిక్కు ఎవరు.. నువ్వు ఇలా చేస్తే ఇక అమ్మ, అక్కలు ఎలా బతుకుతారు నాన్న.. నీ బాధ ఏంటో నాతో చెప్పు నాన్న." అని ఏడుస్తూ తన తండ్రిని వదిలిపెట్టకుండా గట్టిగా హత్తుకుంటాడు ఆ కుర్రాడు..

కొడుకు స్పర్శకు గుండె చలించి పోయి తన మనసు కూడా మార్చుకుని, ఇక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను పక్కనపెట్టి.. తన కొడుకుతో ఇంటికి వెళతాడు సుబ్బారావు. ఇంట్లో అన్నం వండి ఇంకా తినకుండా.. తనకోసమే ఎదురుచూస్తున్న భార్య, కూతుళ్లను చూసి మరీ చలించిపోతాడు.

తనను ఎంతో ప్రేమగా చూస్తున్న వీళ్లనా తను వదిలేసి వెళ్లిపోవాలని అనుకుంది.. అని చాలా బాధపడతాడు.

ఇక సుబ్బారావుది ఆ రోజు నుండీ ఒకటే లక్ష్యం.. తనకు తన కుటుంబం కన్నా ఏదీ ముఖ్యం కాదు..

పొలాలు పండకపోతే ఏం.. చనిపోవాలా.. అవును.. వర్షాలు పండక పొలాలు ఎండిపోతాయి.. ప్రభుత్వం పట్టించుకోదు.. దళారులు భూమి, ఇల్లు, పొలం, పుట్రా అన్నీ అప్పు పేరుతో స్వాధీనం చేసుకుంటారు.. అయితేనేం.. అప్పుడూ చనిపోవాలా..

తను ఎప్పుడూ ఎవర్ని బాధపెట్టలేదు, అందరూ పచ్చగా ఉండాలనే కోరుకున్నాడు..

అయితే పరిస్థితులే తనతో ఆడుకున్నాయి..

దానికి తను కారణం కాదు.. అన్నీ పోయినా తన శ్రమతో తన పిల్లల్ని ఎలాగోలా పోషించుకుంటాడు. ఇలా సాగాయి తన ఆలోచనలు..

ఆ ఆలోచనే సుబ్బారావుకి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.

అందరికీ ఒకటే సమాధానం.. తను శక్తి మేరకే ఏదైనా చేయగలడు. అంతకు మించి తను చేయాలనుకున్నా ఏదీ చేయలేడు కదా..

ఆ ఆత్మస్థైర్యమే సుబ్బారావుని కాపాడింది.

తనకు అప్పు ఇచ్చిన వాళ్లను మళ్లీ అప్పు అడగకుండా.. తన సమస్య చెప్పుకోవడానికి జిల్లా కలెక్టరు వద్దకు వెళ్లాడు.. ప్రభుత్వం తనలాంటి రైతుల కోసం ఏం చేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. తనకు ప్రభుత్వ రుణాలు ఎలా మంజూరు అవుతాయో.. వాటిని ఎలా తీర్చాలో తనలాంటి రైతులతోనే కలిసి ఒక చిన్న మీటింగ్ లాంటిది పెట్టుకొని ఒక ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు.

ఉన్నంతలో తన పొలంలో కొంత తనఖా పెట్టి.. ఉన్న అప్పులు తీర్చేసి.. ఇక బాధ్యతను ఇద్దరి మీద పెట్టాడు.. ఒకటి తనలాంటి రైతుల కోసం పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాధికారి మీద.. మరొకటి తన కొడుకు మీద..

తన కొడుకుని పిలిచి.. ఒరేయ్ ఇక నా ఆశలు అన్నీ నీ మీదే.. నీ ఇంజినీరింగు పూర్తి అయ్యే దాకా ఏదో కష్టపడి చదివించగలను. మరోలా అనుకోవద్దు.. నీ కోర్సు పూర్తయ్యాక జాబ్ వస్తే నువ్వు ఇంటి మీద ఉన్న అప్పు తీర్చేయాలి అని అడగకూడదనుకున్నా.. తన కొడుకుకి కూడా బాధ్యతలు తెలియాలని అడిగాడు.

సుబ్బారావు కొడుకు రఘు తన తండ్రి కోరికను తీర్చడమే తన లక్ష్యంగా చేసుకున్నాడు.

ఇంజినీరింగ్ కోర్సులో బాగా మార్కులు తెచ్చుకోవడానికి రేయింబవళ్లూ కష్టపడి ఒక లక్ష్యసాధనగా చదవడం ప్రారంభించాడు.

మరోవైపు సుబ్బారావు వ్యవసాయంలో సరికొత్త పద్ధతుల గురించి వాకబు చేయసాగాడు. కల్తీ విత్తనాలతో దిగుబడి పెంచే పద్ధతులకు స్వస్తి చెప్పి, వ్యవసాయానికి సంబంధించి ప్రతీ విషయాన్ని బాగా తెలుసుకోవడం కోసం స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి వెళ్లసాగాడు. వారు వివరణ సరిగ్గా ఇవ్వకపోతే జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసేవాడు. దళారులను సంప్రదించడం మానేసి, ప్రతీ సమస్యను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లడం ప్రారంభించాడు.

ఒక సంవత్సరం తర్వాత..

సుబ్బారావు తన ఒడిదొడుకులను తట్టుకొని వ్యవసాయాన్ని ఒక కొలిక్కి తీసుకురాసాగాడు. ఉన్నంతలో ప్రభుత్వ రుణాలను తీర్చేశాడు.

అదే విజయాన్ని అతని కొడుకు కూడా సాధించాడు. కష్టపడి చదివినందుకు క్యాంపస్ లో అతని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు లక్షకు పైగానే జీతం.

అందుకే కొన్ని నెలల్లోనే ఇల్లు, భూమి మీద దళారుల వద్ద తీసుకున్న అప్పును తీర్చడం పెద్ద కష్టమేం అనిపించలేదు ఆ కుర్రాడికి.

ఓ రోజు తన తండ్రిని చూడడానికి సొంతవూరికి వచ్చాడు రఘు.

ఎండలో ఎడ్లను తోలుతున్న తన తండ్రిని చూశాడు.. చాలా బాధేసింది.

తన తండ్రి వద్దకు వచ్చి ఓ మాటన్నాడు.. " నాన్నా.. నిన్ను, అమ్మను, అక్కలను నాతో పాటు సిటీకి తీసుకెళ్లిపోవాలని అనుకుంటున్నాను. ఇక నువ్వు ఇలా కష్టపడడం మానేయ్"

దానికి ఆ తండ్రి చెప్పిన మాట ఇదే "ఒకప్పడు పంటలు పండక వ్యవసాయం దండగ అనుకొని చనిపోవాలనుకున్నా.. కానీ నువ్వు నన్ను కాపాడావు. నా బాధ్యతను గుర్తు చేశావు.. అప్పుడు నీ చదువుకి పెట్టిన ఖర్చు కూడా ఈ వ్యవసాయం చేసి సంపాదించిందే కదా.. ఈ వ్యవసాయమే మనకి అన్నం పెట్టి.. దేశం మొత్తానికి అన్నం పెడుతోంది.. దీనిని వదిలి నేను రాలేనురా.. ఇది నా ప్రపంచం చనిపోయే వరకూ" అన్నాడు.

మొత్తానికి ఈ కథలో ఇద్దరూ విజేతలే..

(రైతే దేశానికి జీవం.. ఆ రైతును కాపాడుకుందాం..)

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.