ముగ్గురమ్మాయిల కథరంగురంగుల విద్యుద్దీపాలతో గుంటూరు వేంకటేశ్వర విఙ్ఞానమందిరం కాంతులు విరజిమ్ముతూ కళకళలాడుతోంది. ఈరోజు అభ్యుదయ సేవాసమితి ద్వారా వివిధ రంగాలలో తమ స్వయంకృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి తమవంతు సేవలు అందిస్తున్న మహిళలకు అవార్డుల ప్రదానోత్సవం.

అవార్డుకు ఎన్నికయిన లక్ష్మి, సుమిత్ర, శశి - ఈ ముగ్గురమ్మాయిలు , నేను గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ జిల్లాపరిషత్ స్కూలులో ప్రధాన - ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నప్పుడు నా శిష్యులు . పదిరోజుల క్రితం నాకు నా శిష్యులనించి ప్రత్యేక ఆహ్వానం రావటంతో నేను నిర్ణీత సమయానికే వచ్చి ఆడిటోరియం లో వేదికకు ఎడమవైపున ప్రత్యేక ఆహ్వానితుల కోసమై నిర్దేశించిన ముందు వరసలో ఆశీనురాలినయ్యాను. నా శిష్యులు ఇంత గొప్పవారయ్యారంటే నాకు చెప్పలేనంత ఆనందంగా, గర్వంగా ఉంది.

అవార్డుకు ఎంపికైన వారందరూ వేదికకు కుడివైపున ముందు వరుసలో ఆసీనులై ఉన్నారు. నేను రావటం చూసి నాదగ్గరికి వచ్చి “మేడమ్ నమస్కారమండి” అని నన్ను పలకరించి వెళ్ళారు ఆ ముగ్గురమ్మాయిలు.

ఆ ముగ్గురమ్మాయిలనూ చూస్తుంటే , జీవితంలో ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవటానికి వారు ముగ్గురు ఎదుర్కొన్న సవాళ్ళు వాళ్ళ ముఖతః విన్నవన్నీ ఒకటొకటిగా జ్ఞప్తికి వచ్చాయి ……………………

లక్ష్మి: పుట్టిపెరిగింది అంతా పిడుగురాళ్ళ లోనే. లక్ష్మి వాళ్ళది ఆచార వ్యవహారాలకి ప్రాధాన్యత ఇచ్చి , ఆడవారికి పెద్ద చదువులు అనవసరము అనుకునే ఉమ్మడి కుటుంబం. స్వతహాగ తెలివిగలదైన లక్ష్మికి చిన్నప్పటినించీ డాక్టరు అవ్వాలని కోరిక . కాని ఇంట్లో చెప్పటానికి భయం. పదవతరగతి చదువుతుండగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసేశారు పెద్దవాళ్ళు. పరీక్షలవ్వగానే అత్తవారింటికి కాపరానికి వెళ్ళిపోయింది లక్ష్మి. అత్తవారిది వ్యవసాయ ప్రధాన కుటుంబం.

లక్ష్మి భర్త సహృదయుడు చదువు విలువ తెలిసినవాడు. ఒకరోజు లక్ష్మి “ నాకు డాక్టరు అవ్వాలని ఉంది ” అంటూ తన కోరికను భర్తకు తెలియచేసింది.

కుటుంబ బాధ్యతలవల్ల తాను చదువు సాగించ లేకపోయినప్పటికీ తన భార్యకి డాక్టరు చదవాలని ఉన్న ఆసక్తి, పట్టుదల గమనించి ప్రోత్సహించాడు. ఇంటి బాధ్యతల వల్ల తమ కొడుకు చదువుకోలేకపోయాడని బాధ పడుతున్న లక్ష్మి అత్త మామలు , కొడుకు ద్వారా కోడలి కోరిక విని ఎంతో సంతోషించి ఆమెని ఆశీర్వదించారు. దానితో కొండంత బలంవచ్చినట్లయ్యింది లక్ష్మికి.


ఆ విధంగా భర్త ప్రోత్సాహంతో , సహకారంతో , అత్త-మామల ఆశీర్వాదంతో , ఇంటర్మీడియట్ ఫస్టు మార్కులతో ఉత్తీర్ణురాలై అనంతరం వైద్య ప్రవేశ పరీక్షలో కూడా మొదటి ఐదు ర్యాంకులలో స్థానం సంపాదించుకుంది. గుంటూరు వైద్య కళాశాలలో ప్రవేశం దొరికింది లక్ష్మికి. భార్య కోసం లక్ష్మి భర్త గుంటూరు మకాము మార్చాడు. డాక్టరు చదువు పూర్తి చేసి గైనకాలజిలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు తన స్వగ్రామంలోనే ప్రాక్టీసు పెట్టి ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తోంది లక్ష్మి . “మంచి హస్తవాసి గల డాక్టరమ్మ “ అని అనతికాలంలోనే పేరు సంపాదించుకుంది లక్ష్మి.

............................

సుమిత్ర: తండ్రి గవర్నమెంటు ఉద్యోగి. తల్లి గృహిణి. తండ్రి ఉద్యోగరీత్యా దాదాపు దేశమంతా తిరగవలసి వచ్చింది. ఆ విధంగా సుమిత్రకి పలు భాషలు నేర్చుకునే అవకాశం కలిగింది. ఇంకా ఎన్నో భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి , జిఙ్ఞాశ పెరిగాయి. పలు దేశ భాషలలో ప్రావీణ్యం సంపాదించడమే తన లక్ష్యంగా నిర్దేశించుకుంది . సుమిత్ర తండ్రికి పిడుగురాళ్ళ బదిలీ అవ్వటం , సుమిత్ర నేను పనిచేసే స్కూలులోనే తొమ్మిదవ తరగతిలో చేరడం, అలా నా శిష్యురాలు అవ్వటం జరిగింది.

ఆ తరువాత సుమిత్ర చెప్పిందేమంటే ... ఆమె తండ్రికి బాగా సుస్తీ చెయ్యడంతో ఆయన ముందస్తు ఉద్యోగ విరమణ చెయ్యవలసివచ్చిందని దాంతో తమ తాతగారి ఊరికి మకాము మార్చేశామనీ , ఆమె తండ్రి “నేను ఆరోగ్యంగా ఉండగానే నా కూతురిని ఒక ఇంటి దానిని చేస్తే మంచిది “ అని నిశ్చయించుకుని సుమిత్ర డిగ్రీ చదువుతుండగానే మంచి సంబంధం చూసి వివాహం జరిపించేశారని .

సుమిత్ర భర్త పట్టణంలో పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం . బాగా స్థితిమంతులైన కుటుంబం. అత్యవసర పరిస్థితులలో తమ వివాహం జరగవలసి రావటం, అయినప్పటికి “నీకు ఇష్టమైతే ఆ తరువాత కూడా నువ్వు చదువు కొనసాగించవచ్చు" అని భర్త చెప్పటంతో సుమిత్ర డిగ్రీ పూర్తి చేసింది. తరువాత దాదాపు పది దేశ భాషలలోను నాలుగు విదేశీ భాషలలోను డిగ్రీలు, ప్రావీణ్యం సంపాదించుకుంది.

ప్రస్తుతం ప్రభుత్వం తరఫున భాషా-తర్జుమా అధికారిగా పనిచేస్తోంది. బహు భాషా ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా భోధిస్తూ తన వంతు సహాయ-సహకారాలు అందిస్తోంది. అంతే కాకుండా ఎన్నో ఇతర భాషల పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేస్తూ తెలుగు సాహిత్య ప్రచారణకి తనవంతు కృషి చేస్తోంది.

“తెలుగు భాషా ప్రాశస్త్యం కోసం , తెలుగు సాహిత్య ప్రచారానికి" నిర్విరామ కృషి చేసిన సుమిత్ర ఈ నాడు ఈ అవార్డుకి ఎంపిక కాబడింది.

................................

శశి: స్వస్థలం రాజమండ్రి. తల్లిదండ్రులిద్దరూ బ్యాంకు ఉద్యోగస్తులు. మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీల నియమావళిలో మా ఊరికి వచ్చినప్పుడు , శశి నేను పనిచేస్తున్న స్కూలులోనే చేరటం జరిగింది. ఆ విధంగా వీళ్ళు ముగ్గురూ నా శిష్యులయ్యారు .

శశి చెప్పిన కథనం ప్రకారం ఆమె ప్రయాణం , మ్యాథమేటిక్స్ లో పి.హెచ్.డి. చేసి తనకెంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే , ఆమె లక్ష్యం వైపు అంత సాఫీగా జరగలేదు.

కారణం వివాహానంతరం --- ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యటమేమిటనే అత్త మామలు , ఒకవైపు భార్య న్యాయమైన కోరిక కాదనలేక ఇంకొక వైపు తల్లిదండ్రులకి ఎదురుచెప్పలేని తన భర్త అసహాయ స్థితి , పిల్లలు , వాళ్ళ చదువులు ....... వీటన్నిటి మధ్యా సంయమనం చేసుకుంటూ ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే తను అనుకున్నది సాధించటానికి శశి చేసిన పోరాట ఫలితమే ఈ రోజు .

“ అత్యుత్తమ ఉపాధ్యాయినిగా" విద్యార్థుల ప్రశంసలకు పాతృరాలైన శశి ఇప్పుడు ప్రభుత్వం వారి మన్ననలు కూడా అందుకోబోతోంది.

..................................

ముఖ్య అతిధిగా విచ్చేసిన మహిళా సంక్షేమ మంత్రి ఉపన్యాసం ముగిసినట్లుంది . కరతాళ ధ్వనులు వినిపించడంతో ఆలోచనలలోంచి బయటపడి వేదికవైపు చూసాను.

“ తదుపరి కార్యక్రమం అవార్డుల ప్రదానోత్సవం" అని ప్రకటించారు.

లక్ష్మి, సుమిత్ర , శశి ముఖ్య అతిథి చేతుల మీదుగా తమ తమ అవార్డులు అందుకున్నారు.

“ ఎవరైనా, తన జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యం నిర్దేశించుకుని , దానిని ఎలాగైనా సాధించాలని నిశ్చయించుకుని, నిరంతర కృషి చేసినట్లయితే , ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ఆ లక్ష్యాన్ని సాధించవచ్చును" అని ఆ ముగ్గురు అమ్మాయిలు తమ మాటగా శ్రోతలకు చెప్పారు.

......................................................

తమ లక్ష్య సాధనలో ఉన్నత శిఖరాలను చేరుకున్న నా ప్రియ శిష్యులని గురించి గుర్తుచేసుకుంటుంటే , ఈ ముగ్గురమ్మాయిల జీవిత గమనాన్ని ఒక కథగా వ్రాస్తే....... అనే ఆలోచనకలిగింది ఒకనాడు. ఆ ఆలోచనకి ఒక రూపమే ఈ “ముగ్గురమ్మాయిల కథ"


…………………………….X…………………………………..

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.