కనువిప్పు

బోళా సుబ్బారావు కాశీ నించి కన్యాకుమారి వరకూ నెలరోజులు భార్యా పిల్లలతో వినోద యాత్రలకి వెళ్ళి ఇవాళే ఊళ్ళో దిగాడు. ఇంటి తాళం తీస్తూ భార్యకేసి చూసాడు.సుబ్బలక్ష్మి పిల్లలిద్దరూ ఉత్సాహంగా పోటీ పడుతూ తమ యాత్రగురించిన విశేషాలు ముచ్చటిస్తుంటే ఆనందంగా వింటోంది.

‘సుబ్బలక్ష్మి అంత నిశ్చింతగా ఎలా ఉండగలుగుతోంది? తామిద్దరూ కలిసిఉండేది ఇంక కొన్నిరోజులే , అయినా ఆమెలో ఇసుమంత బాధ కూడా ఉన్నట్లు లేదు. పిల్లలకి తమ మధ్య జరుగుతున్నదేమి తెలియదు. అందుకే వాళ్ళ గొడవలో వాళ్ళున్నారు’ అని అనుకున్నాడు . బోళా సుబ్బారావుకి కవలపిల్లలు ఒక ఆడా ఒక మగా. కల్లాకపటం తెలియని అతని తత్వంవల్ల బోళా అనే రెండక్షరాలు అతని పేరుకి ముందు ఒక బిరుదులాగా ఎవరూ ఇవ్వక్కర్లేకుండానే ఆపాదింపబడ్డాయి!! దాంతో ఉత్తి సుబ్బారావు కాస్తా బోళా సుబ్బారావయ్యాడు.

‘చూద్దాము ఏమిజరగనుందో’ అనుకుని బాధగా నిట్టూరుస్తూ తలుపు తాళంతీసాడు. భార్యా పిల్లలు ఇంట్లోకి వెళ్ళాక తాను బయటున్న సామాను తేవటానికి వెళ్ళాడు.

ఇంతలో " నాన్నా!" అని పిల్లలిద్దరూ ఒక్కసారే కెవ్వుమని కేక పెట్టటంతో , సామాను తీసుకుని ఏమైందో అనుకుంటూ లోపలికి పరుగెత్తాడు.

"ఏమైందర్రా ఎందుకలా కేక పెట్టారు? ఇంటికి రాగానే అల్లరి మొదలు పెట్టేసారా?" అన్నాడు కోపంగా.

"నాన్నా కుళ్ళు వాసన! మీకు రావట్లేదా? " అడిగారు పిల్లలు.

అప్పుడు తగిలింది సుబ్బారావు నాసికలకి కుళ్ళు కంపు. "అవును ఏమిటీ భరించలేని వాసన?" అనుకున్నాడు.

సుబ్బలక్ష్మి కూడా ‘ఊరుకి వెళ్ళేటప్పుడు అన్నీ జాగ్రత్తగా చూసుకునే వెళ్ళానే? ఏమై ఉంటుందబ్బ?’ అనుకుంటూ గబగబా ఇల్లంతా కలియతిరిగింది ‘అంతా బాగానే ఉందే? మరి వాసన ఎక్కడనించి వస్తోంది’ అనుకుంది.

ఇంతలో మళ్ళీ పిల్లలు " నాన్నా ఇటురండి " అని గట్టిగా పిలిచారు సుబ్బారావుని. వెంటనే అటు వెళ్ళాడు "అటు చూడండి నాన్నా” అని కూతురు వేలు పెట్టి చూపించిన వైపు చూడగా చీమలు బారులు బారులుగా తమ గదిలో కొంచెం సరిగ్గా మూసుకోని కిటికీ గుండా బయటికి వచ్చి పక్కింట్లోకి వెళ్ళటం కనిపించింది.

‘పక్కింట్లో వాళ్ళు మేము ఊరికి వెళ్ళే నెల ముందరే తాళం పెట్టి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినదీ వాళ్ళు చెప్పనూ లేదు నేను అడగనూ లేదు. అది వాళ్ళ సొంతిల్లే’ అనుకుంటుండగానే మళ్ళీ ఒక్కసారిగా కుళ్ళు వాసన నాసికాపుటాలని తాకింది. అప్పుడు అర్థమైంది సుబ్బారావుకి ఆ వాసన తమ ఇంట్లోంచి కాదని, పక్కింట్లోంచి వస్తోందని.

‘ఊళ్ళో లేకపోవటం వల్ల గత నెలరోజుల్లో ఏం జరిగిఉంటుందో ఊహించటం నాకూ కష్టమే’ అనుకుని వెంటనే పోలిసులకి ఫోన్ చేసి చెప్పాడు .

పోలిసులు వచ్చి సుబ్బారావుని అడిగి జరిగినదంతా తెలుసుకున్నారు. ఇంటివాళ్ళు ఎక్కడికి వెళ్ళిందీ, వాళ్ళ తాలూకు సమాచారంగానీ, ఫోన్ నంబరు గానీ తెలుసునా అని అడగగా సుబ్బారావు తన దగ్గర ఉన్న నంబరు పోలీసులకి ఇచ్చాడు. పోలీసులు ఆ నంబరు ప్రయత్నించగా ‘ఈ నంబరుతో ఉన్న ఫోను ప్రస్తుతము ఉపయోగములో లేదు’ అని వచ్చింది.

ఆ తరువాత పోలిసులు తాళం పగులగొట్టి లోపలికి వెళ్ళటం , అక్కడ చీమలు పుట్టలుగా ఉన్నచోట తవ్విచూడటం చక చక జరిగిపోయాయి. తవ్విన చోట ఒక చిన్న పిల్ల మృతదేహం???

‘ఈ మృతదేహం ఎవరిదో మీకు తెలుసా?’ అని అడిగారు పోలిసులు సుబ్బారావుని.

ఆ మృతదేహం చూడగానే వాంతి చేసుకున్నాడు సుబ్బారావు. అది ఆ ఇంటివాళ్ళ అమ్మాయిది . తమ పిల్లలకి మంచి స్నేహితురాలు. అదే చెప్పాడు సుబ్బారావు పోలీసులకి.

‘అయినా నాకు తెలిసినంతవరకూ పక్కింట్లో ఉండే దంపతుల మధ్య గొడవలు ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదూ కనిపించలేదూ కూడా?? లోగుట్టు పెరుమాళ్ళకెరుక అని ఊరికే అన్నారా?’ అనుకున్నాడు మనసులో. ఈ విషయం తెలిస్తే తన పిల్లలు ఎలా స్పందిస్తారో అనుకున్నాడు.

విషయం తెలిసి సుబ్బలక్ష్మికి మతిపోయింది. తమ నేస్తం చనిపోయిందని తెలిసి పిల్లలు ఏడుపు లంకించుకున్నారు. వాళ్ళని ఓదార్చటంలో పడ్డాడు సుబ్బారావు.

పోలిసుల విచారణలో బయటపడినదేమంటే …… .....

సుబ్బారావు వాళ్ళు ఊళ్ళో లేనప్పుడు ఒక రోజు ఆ ఇంటి తాళం తీసి ఉండటం ఎవరో చూశారని కానీ ఎవరనేదీ తెలియలేదనీ. బహుశః భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. అలా అనుకోవటానికి కారణం ఆ దంపతులిద్దరూ ఈ మధ్యనే విడాకులకి అర్జీ పెట్టుకున్నారని విచారణలో బయటపడింది. పోలీసులు ఇప్పుడు ఆ దంపతుల వేటలో పడ్డారు.

కాలం ఎవరికోసమూ ఆగదన్నట్లుగా రోజులు గడిచినా సుబ్బలక్ష్మిని మాత్రం ఆ సంఘటన తాలూకు ఛాయలు వదలలేదు. ‘ఆ చిన్నారి ముఖమే పదే పదే గుర్తుకువస్తోంది. ఎంత అన్యాయం? అలా నిర్దాక్షిణ్యంగా పసికందుని చంపటానికి ఆ తల్లిదండ్రులకి మనసెలా వచ్చిందో? తమ మధ్య గొడవలు ఉంటే వాటిని ఏదో విధంగా పరిష్కరించుకోవాలి అంతేకానీ ఇదేం విపరీతం?’ అని ఆలోచిస్తుంటే ఎవరో చెంప మీద ఛెళ్ళుమని కొట్టినట్లనిపించి అసంకల్పితంగా ఆమె చెయ్యి చెంపపైకి వెళ్ళింది.

‘మరి నేను చేయబోతున్నదేమిటి? నేను కూడా సుబ్బారావు నించి విడాకులు కోరుకుంటున్నానుగా? సుబ్బారావుకి నేనన్నా పిల్లలన్న ఎంత ప్రేమ! కానీ అతని బోళాతనం , ప్రవర్తన వల్ల నేను జీవితంలో ఎన్నో కష్టాలనీ అవమానాలనీ ఎదుర్కోవలసి వస్తోంది. చాలాసార్లు అతనికి నచ్చచెప్పటానికి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. ఇంతకాలం భరించినా నావల్ల కాదనిపించి విడిపోవటానికే నిశ్చయించుకున్నాను. ఆ విషయమే సుబ్బారావుకి చెప్పటం జరిగింది కూడా తాము ఊరికి వెళ్ళే ముందర. ఇంతలో ఈ సంఘటన!’

‘దంపతులు భార్యాభర్తలుగా విడిపోవచ్చుగాని తల్లిదండ్రులుగా విడిపోకూడదు . దాని పర్యవసానంగా అభంశుభం తెలియని పిల్లలు బలి అయిపోయే అవకాశం ఉంది’ అని తను ఎక్కడో చదివింది. అది ఎంతనిజం అనిపిస్తోంది ఈ సంఘటన చూసాక.

‘భవిష్యత్తులో తమ విడాకుల తరువాత ఏదైనా కారణాలవల్ల పిల్లలకెమైనా అయితే తాను భరించగలదా? జీవించగలదా? ఎలాగైనా సరే ఎంత కష్టమైనా సరే ప్రయత్నించి సుబ్బారావుని మార్చుకోవటానికి ప్రయత్నిస్తాను . అంతేకానీ .......’ అని మనసులోనే నిశ్చయించుకుని భర్తా పిల్లలూ ఏమిచేస్తున్నారో చూద్దామని ముందు గదిలోకి వచ్చింది. అక్కడ ఎవరూ కనిపించక పోయేటప్ప్పటికి ‘ ఎక్కడున్నారబ్బా’ అనుకుంటూ పడకగదిలోకి వెళ్ళింది.

అక్కడ సుబ్బారావు కూడా ఈ సంఘటన గురించే ఆలోచిస్తున్నాడు. ‘పిల్లల పైన ప్రేమ తల్లిదండ్రుల మధ్య గొడవల కారణంగా సమయం గడిచేకొద్దీ ద్వేషంగా మారుతుందా? మా విషయంలో కూడా అలా జరిగితే? అమ్మో ! ఆలోచించటానికే భయంగా ఉంది. నా ప్రవర్తన వల్ల పాపం సుబ్బలక్ష్మికి నలుగురిలో ఎంతో అవమానం జరిగింది ఎన్నోసార్లు . అయినా సుబ్బలక్ష్మి మాత్రం ఏమి కోరుకుంటోంది? నా ప్రవర్తన మార్చుకోమనేగా!!! నేనన్నా పిల్లల్లన్నా ప్రాణం పెట్టే సుబ్బలక్ష్మి కోసం ఈ మాత్రం చేయలేనా? ఎలాగైనా సుబ్బలక్ష్మితో ఇంకొకసారి మాట్లాడతాను’ అని నిశ్చయించుకుని సుబ్బలక్ష్మి ఏంచేస్తోందో చూద్దామని లేచాడు.

ఇంతలో సుబ్బలక్ష్మి గదిలోకి వచ్చి "ఈ జరిగిన సంఘటన నా మనసు కలచివేసింది. మన పొరపాట్లవల్ల మన పిల్లలు బాధపడకూడదు. ఇద్దరమూ కలిసి మన సమస్యలు పరిష్కరించుకుందాము. సరేనా? అంతకంటే ముందు మిమ్మల్ని బాధపెట్టినందుకు మీరు నన్ను క్షమించాలి " అంది సుబ్బారావుతో..

సుబ్బారావు కూడా "అవును, నేను కూడా ఈ మాట చెప్దామనే వస్తున్నాను . నువ్వు కూడా నన్ను క్షమించాలి" అని సుబ్బలక్ష్మిని ఆప్యాయంగా దగ్గరికి తీసున్నాడు .

‘అనుకోకుండా ఎదురైన ఈ సంఘటన మా ఇద్దరి జీవితాలకీ ఒక కనువిప్పు’ అనుకున్నారు ఇద్దరూ మనసులోనే.

*********************

** ఈ కథ నేటినిజం దినపత్రిక గురువారం ప్రత్యేక సంచిక లో 30/07/15 తేదీన ప్రచురింపబడినది

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.