ఆ ఇద్దరు

(పెళ్ళివారి ఇల్లు సందడిగా ఉంది...ఓ గదిలో ఒకామె ఒంటరిగా అద్దంలో చూసుకుంటూ...)

అబ్బఁ, నా రూపం నాకే మత్తెక్కిస్తోంది.

(అంతలో మరో ఆమె ఆ గదిలో ప్రవేశిస్తుంది.)

మొదటి ఆమె: హాయ్, నా పేరు వరలక్ష్మి. పెళ్ళికూతురి జిగ్రీ దోస్త్ ని.

రెండవ ఆమె: హాయ్… నా పేరు మోహిని. పెళ్ళికొడుకు గర్ల్ ఫ్రెండ్ ని.

వరలక్ష్మి : (ఆశ్చర్యంతో) గర్ల్ ఫ్రెండా...!?

మోహిని : ఊఁ. మేం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం.

వరలక్ష్మి : (సంభ్రమంతో) మరి...ఇప్పుడు ఈ సంబంధం..!?

మోహిని : (నిట్టూర్చుతుంది) విధి ఆడిన ఆటలో ఓడిపోయాం మేము.

(ఓ క్షణం వారి నడుమ నిశ్శబ్దం...)

వరలక్ష్మి : నీకో విషయం తెలుసా? పెళ్ళికూతురు కమలా, నేనూ ఎల్కేజీ నుండి కాలేజ్ వరకు కలసి చదువుకున్నాం. ఇద్దరమూ ఒకేసారి పెళ్ళిచేసుకోవాలనుకున్నాం...ప్చ్! మా కోరిక నెరవేరలేదు.

మోహిని : ఎంచేత?

వరలక్ష్మి : నేను గీతాసింగులా బొద్దుగా ఉండేదాన్ని. మొద్దును చూసినట్టు పెళ్ళికొడుకులు బెదిరిపోయేవారు. దాంతో నాకిక పెళ్ళికాదని డిసైడైపోయారు మావాళ్ళు.

మోహిని : అయ్యో, పాపం!

వరలక్ష్మి : అప్పుడే చూసాను టీవీలో ఆ ప్రకటన.

మోహిని : ఏ ప్రకటన?

వరలక్ష్మి : ’మీరు చాలా లావుగా ఉన్నారా? ఐతే మా చికిత్సతో నెల రోజుల్లో సన్నబడండి..!’ అన్న ప్రకటన...వెంటనే పాతికవేలు చెల్లించి చికిత్స ఆరంభించాను.

మోహిని : (కుతూహలంగా) ఫలితం కనిపించిందా?

వరలక్ష్మి : భేషుగ్గా! వారం తిరక్కుండానే...ఇదిగో, ఇలా స్లిమ్ గా తయారయ్యాను.

మోహిని : (విభ్రాంతితో) ఓఁ, మై!

వరలక్ష్మి : నా ఫోటోని నెట్ లో పెడతాను. అది చూసి పెళ్ళికొడుకులు వెర్రెక్కిపోవాలి!

(సెల్ ఫోన్లో తన రూపాన్ని క్లిక్ చేసుకుంటుంది. ఆ ఫోటోని చూసి ఉలికిపడి, అయోమయంగా)

అరె! ఇదేమిటీ, నా రూపానికి బదులు... మబ్బులాంటి ఈ ఇమేజ్ ఎక్కణ్ణుంచి వచ్చింది!? సెల్ క్యామ్ పాడయినట్టుంది.

మోహిని : (నవ్వి) అది కెమేరా తప్పుకాదు, వరం! ప్రేతాత్మలకు కొన్ని హద్దులు ఉంటాయి...!!


(‘కామెడీ స్కిట్ పోటీలలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

  • (హాస్యానందం మాసపత్రిక, ఫిబ్రవరి 2014)


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.