మనసుపొరల్లో..

మనసుపొరల్లో..

జి.ఎస్.లక్ష్మి..

ఏప్రిల్, 24 ఆదివారం "మన తెలంగాణ" దినపత్రిక హరివిల్లు

తెల్లవారుఝాము మూడుగంటలయింది. మంచి నిద్రలో వున్న గురుమూర్తి ఒక్కసారి ఉలిక్కిపడిలేచాడు. పక్కన సుమతి ప్రశాంతంగా గాఢనిద్రలో వుంది. మళ్ళీ నిద్రపోదామని శతవిధాల ప్రయత్నించాడు. ఊహు.. సాధించలేకపోయాడు. లేచి హాల్లోకి వచ్చి టివి పెట్టుకు కూర్చున్నాడన్న మాటే కానీ తనకెందుకిలా అవుతోందన్న ఆలోచనను మాత్రం ఆపలేకపోయాడు.

గురుమూర్తికి అరవయ్యేళ్ళు. మూడు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదించాడు. నాలుగునెలలక్రితమే అమెరికాలో వుంటున్న కొడుకూ, ఆస్ట్రేలియాలో వుంటున్న కూతురూ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి, గురుమూర్తి షష్టిపూర్తిని ఘనంగా జరిపించి వెళ్ళారు. తను ఉన్నతస్థానంలో నిలబడడమే కాకుండా పిల్లలని కూడా అంతకన్న ఉన్నతంగా నిలబెట్టాడు. భార్య సుమతి అనుకూలవతి. మనవలు, మనవరాళ్ళ ముచ్చట్లతో హాయిగా గడపాల్సిన అతనికి ఈ మధ్యనే ఈ కొత్తరకం జబ్బు వచ్చింది. అసలు దాన్ని జబ్బు అనాలో లేదో కూడా తెలీటంలేదు అతనికి. రాత్రి పడుకుందామని మంచమెక్కుతాడేకానీ, యెంత దొర్లినా అదేమిటో పన్నెండు దాటితే కానీ కంటిమీద కునుకే రాదు గురుమూర్తికి. కాస్త మంచినిద్రలోకి వెళ్ళిన కాసేపట్లోనే రెండూ మూడూ మధ్య యెవరో తట్టి లేపినట్టు మెలకువ వచ్చేస్తుంది. యేదో చెయ్యాల్సిన పని మర్చిపోయినట్టూ, అది చెయ్యకుండానే తన ప్రాణాలు పోతాయేమోనన్నట్లూ ఆలోచనలు బుర్రలో గింగిరాలు తిరుగుతాయి. కానీ యెంత బుఱ్ఱ బద్దలు కొట్టుకున్నా ఆ చెయ్యవలసిన పని మటుకు గుర్తు రాదు. చక్కగా సాగుతున్న గురుమూర్తి జీవితంలో అపశృతిలాగ ఈ అర్ధంకాని జబ్బేమిటో అతనికే కాదు ఆ యింట్లో వాళ్ళెవరికీ అంతుపట్టలేదు. అందుకే ఈ సమస్య శరీరానికి సంబంధించిన సమస్య కాదనీ, మనస్సుకు సంబంధించిందనీ తేల్చుకుని సైకియాట్రిస్ట్ ని కలవమని సలహా యిచ్చారు పిల్లలు. మొట్టమొదట ఆ మాట వినగానే గురుమూర్తికి యెక్కడలేని కోపం వచ్చింది. తనకేమైనా పిచ్చెక్కిందనుకుంటున్నారా వీళ్ళు అనుకున్నాడు. కానీ, పిల్లలిద్దరూ అతనికి నచ్చచెప్పారు. చిన్న చిన్న మానసిక సమస్యలకోసం సైకియాట్రిస్ట్ ని కలిసినవాళ్లందరూ పిచ్చివాళ్ళుకాదని యెంతో నచ్చచెప్పిన మీదట ఫేమస్ సైకియాట్రిస్ట్ డాక్టర్ మధుసూదన్ దగ్గరికి ఆరోజు వెళ్ళాడు గురుమూర్తి.

డాక్టర్ మధుసూదన్ గురుమూర్తి టెన్షన్ తగ్గించి మామూలుగా మాట్లాడడానికి వీలుగా చాలాసేపు లోకాభిరామాయణం మాట్లాడాడు. డబ్బు, షేర్లు లాంటి విషయాలు వచ్చేసరికి గురుమూర్తి ఉత్సాహంగా మాట్లాడడం గమనించి వాటి గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. కొంతసమయం గడిచేటప్పటికి ఆ డాక్టర్ కి అర్ధం అయిపోయింది. ఈ కేసుని గురుమూర్తి చిన్నతనంలోకి తీసుకెడితే తప్ప దానికి దారి దొరకదని. అందుకని గురుమూర్తి పుట్టిన ఊరు గురించీ, అతను చిన్నతనంలో పెరిగిన పరిస్థితుల గురించీ అడగడం మొదలుపెట్టి, నెమ్మదిగా అతన్ని ట్రాన్స్ లోకి తీసికెళ్ళాడు. సుమతి ఏకాగ్రతగా వింటోంది. డాక్టర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ గురుమూర్తి వివరంగా జవాబులిచ్చాడు.

“మీ తాతగారికి మీ ఊళ్ళో చాలా పేరుండేదన్నారు కదా.. ఎటువంటిపేరు? అంటే ధనవంతుడనా, మంచివాడనా, పండితుడనా.. . యేమనేవారు ఆయన్ని..” “అన్నీనండీ.. మా ఊరు సోమేశ్వరంలో మా తాతగారికి యాభై యెకరాల మాగాణీ వుండేది. అదికాక మెట్టభూమి మరో పదెకరాలుండేది. పొలాల్లో పనిచేసే పాలేర్లకి ఇంత పని చేసావు కనక ఇంత కూలీ తీసుకో అని ఆయన వాళ్లకెప్పుడూ లెక్కలు కట్టేవారుకాదుట.. నీ కుటుంబానికి ఇంతిస్తే హాయిగా బతుకుతావంటూ ఆ కుటుంబాన్ని బట్టి ధాన్యం కొలిచేవారుట. మా ఊర్లో వున్న సోమేశ్వరాలయానికి కూడా మా తాతగారే ధర్మకర్తలు. ఆ రోజుల్లోనే ఆయనతో తర్కంలో సందేహాలు తీర్చుకుందుకు యెక్కడెక్కడినుంచో పండితులు వస్తుండేవారుట. మా ఇంట్లో యే పూటా కూడా యాభైకి తక్కువ విస్తరి లేచేదికాదుట. బెల్లం చుట్టూ చేరే చీమల్లాగా మా బంధువులు చాలామంది రకరకాల కారణాలతో మా ఇంట్లోనే తిష్ట వేసేవారుట,” డాక్టర్ మధ్యలో ఆపి అడిగాడు. “ట ట అంటున్నారు. స్వయంగా ఈ విషయాలేవీ మీకు తెలీవా? ఎవరి దగ్గర విన్నారు?’

ఆ ట్రాన్స్ లోనే జవాబిచ్చాడు గురుమూర్తి. “మా నాన్నగారు చెప్పేవారు. నాకు ఆరేళ్ళుండగా మా తాతగారు పోయారు. ఆయన పోయాక కానీ మా నాన్నకి ఆయన చేసిన అప్పుల సంగతి తెలీలేదుట. అడిగినవారికి లేదనకుండా ప్రతీ ఇంట్లోనూ, పెళ్ళికీ, శుభకార్యాలకీ అప్పులు చేసి అందరి అవసరాలూ తీర్చిన ఆయన పోయాక ఆ అప్పులు బయటపడ్డాయి. అప్పుడే మా నాన్నగారు ఆ ఊరు వదిలి రాజమండ్రి వచ్చేసి చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి, రూపాయిని పాపాయిలాగా పెంచేరు. నాకు కూడా అదే నేర్పించేరు. పైసా ఖర్చు పట్టేముందు ఫదిసార్లు ఆలోచించమని పాఠాలు చెప్పేవారు. ఆయన బోధలవల్లే నేనింతటి వాణ్ణయాను.” కించిత్ గర్వం తొంగిచూసింది గురుమూర్తి గొంతులో.

డాక్టర్ కాసేపు ఆలోచించాడు. ఇప్పుడున్న అతని పరిస్థితికి గురుమూర్తికి మనసు బాధపడే అవకాశం లేదు. తండ్రి గురించి చెప్పినప్పుడు కూడా ఎక్కడా అసంతృప్తి కనిపించటంలేదు. అంటే అంతకన్నా చిన్నప్పుడే యేదో విషయం గురుమూర్తి మనసులో బాగా ముద్ర పడి వుండాలి. మళ్ళీ నెమ్మదిగా సంభాషణని గురుమూర్తి బాల్యంవైపు మళ్ళించాడు డాక్టర్. “మీ తాతగారి గురించి ఇంకా మీకేం గుర్తుందో చెప్పండి.”

“మా తాతగారికి నేనంటే చాలా ఇష్టం. . రోజూ రాత్రి భోజనం అయ్యాక ఇంటిముందు ఆరుబయట మంచం మీద ఇద్దరం పడుకునేవాళ్ళం. అప్పుడు నేను తాతయ్య పక్కన పడుకుని అలా ఆకాశంలోకి చూస్తుంటే బోల్డు కథలు చెప్పేవాడు మా తాతయ్య.” గబుక్కున అందుకున్నాడు డాక్టర్. “ఏం కథలు చెప్పేవారూ?”అంటూ..“ఏం కథలంటే పురాణాల్లోవి చాలా కథలు చెప్పేవారు. కథలు చెప్పడమే కాదు. నేనడిగే పిచ్చిపిచ్చిప్రశ్నలకి కూడా సమాధానాలు ఎంతో ఓపికగా వివరంగా చెప్పేవారు.” “పిచ్చిప్రశ్నలా?” డాక్టర్ కుతూహలంగా అడిగాడు.

చిన్నగా నవ్వుతూ గురుమూర్తి నెమ్మదిగా అన్నాడు. “పిచ్చిప్రశ్నలు కాపోతే మరేంటి? దేవుడు మనకే ఇన్ని డబ్బులెందుకిచ్చాడూ? మనం వాళ్ళకి ధాన్యం ఎందుకు కొలవాలీ? వాళ్ళకి మనం బట్టలివ్వకపోతే దేవుడు మన ముక్కు కోసేస్తాడా? అసలు మనం వాళ్ళకి డబ్బులిచ్చినట్టు దేవుడికి ఎవరు చెప్తారు లాంటివి పిచ్చిప్రశ్నలే కదా మరి? దానికాయన ప్రతివాళ్ళ మనసులోనూ దేవుడుంటాడు. చూసేవాళ్లకి కనపడతాడు..మనం చూడగలగాలి, అంతే. పైగా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో అనేవారు.“ “ఏంటది?” కుతూహలంగా అడిగాడు డాక్టర్.

“ఆఖరికి మనకి మిగిలేవి రెండే..మనం తిన్నదీ, ఇంకోళ్ళకి పెట్టిందీను. మనం తిన్నది ఈ జన్మలో బతకడానికి పనికొస్తే ఇంకోళ్ళకి పెట్టింది వచ్చే జన్మలో పనికొస్తుంది అనేవారు.” “అంత ఖచ్చితంగా చెప్పేవారా?” “ఊ.. రోజూ అదే పాఠం. నలుగురికి పెట్టడానికే దేవుడు మనకింత డబ్బిచ్చేడు. అలా ఇంకొకరికి పెట్టకుండా తినడం పాపం అని చెప్పేవాడు. నీకు నా పేరు పెట్టినందుకు ఆ పేరుని నువ్వు సార్ధకం చేసుకోవాలి.. అనేవాడు.”

డాక్టర్ ఒక్క నిమిషం అలోచించాడు. గురుమూర్తి తండ్రి చెప్పిన పాఠాలకి పూర్తిగా విరుధ్ధంగా వున్నాయి తాత చెప్పారంటున్న మాటలు. ఇంతకన్న అతని బాల్యం గురించి తెలుసుకోవలసిందేమీ లేదనిపించింది. నెమ్మదిగా గురుమూర్తిని ట్రాన్స్ లోంచి బయటికి రప్పించి, ఒక ప్రశ్న వేసాడు. “మీరు యేమైనా ధర్మకార్యాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ చేస్తూంటారా..” అంటూ. ట్రాన్స్ లోంచి బయటికి వచ్చిన గురుమూర్తి “ఎందుకొచ్చిన ధర్మకార్యాలండీ..మన దగ్గర డబ్బులేనప్పుడు ఒక్కడు మనకి సాయం చెయ్యడు.. మనమెందుకు మన డబ్బులు ఇవ్వాలీ..అలా ధర్మకార్యాలంటూ మొదలెడితే రేప్పొద్దున్న నా పిల్లలు రోడ్డున పడతారు.” అన్నాడు నిర్మొహమాటంగా. కేసేమిటో అర్ధం అయిపోయింది డాక్టర్‍కి.

గురుమూర్తిని, సుమతిని కూర్చోబెట్టుకుని వివరించాడు. “చాలా చిన్నతనంలోనే మనకున్నది నలుగురికీ పెట్టాలనే మీ తాతగారు చెప్పిన మాటలు, అలా పెట్టకపోతే పాపమొస్తుందన్న భావం మీ మనసులో బాగా ముద్ర పడిపోయింది. అది మీకు తెలీకుండానే మీ సబ్ కాన్షస్ లో వుండిపోయింది. పోయిన ఐశ్వర్యాన్ని తిరిగి సంపాదించడానికి మీ నాన్నగారు చాలా కష్టపడవలసొచ్చింది. ఆ క్రమంలో రూపాయికున్న విలువ యెంతటిదో, దానిని చేతిలోంచి జారిపోకుండా యెలా జాగ్రత్తపడాలో మీరు యెదుగుతున్నప్పుడు పాఠాల్లా చెప్పారు మీ నాన్నగారు. జ్ఞానం వచ్చి యెదుగుతున్నప్పుడు మీ నాన్నగారు చెప్పిన ఉపదేశాలు మీకు అర్ధమయి బాగా ఒంటబట్టాయి. యితర విషయాలేవీ ఆలోచించకుండా పిల్లలకోసం, కుటుంబంకోసం కష్టపడి పనిచేస్తూ మంచి స్థాయికి ఎదిగారు. ఇన్నాళ్ళూ పని మిమ్మల్ని ఆలోచించనివ్వలేదు. ఇప్పుడు అరవయ్యోపడిలో పడ్డారు. పని వత్తిడి తగ్గింది. పని గురించిన ఆలోచనలూ తగ్గాయి. సరిగ్గా ఇప్పుడే యెప్పుడో చిన్నప్పుడు మీ మెదడులో ముద్ర పడిన మీ తాతగారు చెప్పిన విషయాలు మీకు తెలీకుండానే మీ ఆలోచనల్లో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మీరు ఈ పనుల ఆలోచనలు మాని సుషుప్తావస్థలోకి వెళ్ళినప్పుడు అవి గుర్తొస్తున్నాయి. మీకు తెలీకుండానే మిమ్మల్ని దానధర్మాలు చెయ్యమంటున్నాయి. అలా చెయ్యకపోతే వచ్చే జన్మలో ఆ దేవుడు మీకు మంచి చేయడన్న మీ తాతగారిమాట మీకు సబ్ కాన్షస్‍లో వుండిపోయింది. అందుకనే నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తున్నారు. యే పని చెయ్యడం మర్చిపోయానా అని సతమతమవుతున్నారు. పాపభీతి మీకు నిద్ర లేకుండా చేస్తోంది. ”

డాక్టర్ చెప్పింది శ్రధ్ధగా వింటున్న గురుమూర్తి, సుమతి తెల్లబోయారు. “చిన్నతనంలో జరిగినవి ఇంకా అంత ప్రభావం చూపిస్తాయా?” ఆశ్చర్యంగా అడిగాడు గురుమూర్తి. “తప్పకుండా చూపిస్తాయి. ఫరెగ్జాంపుల్.. భయాలే చూడండి.. చిన్నప్పుడు బూచాడికిచ్చేస్తాను, రూమ్‍లో పెట్టి తాళం వేసేస్తాను..అంటూ పిల్లల్ని భయపెడుతుంటారు తల్లితండ్రులు. అప్పుడు చెప్పిన ఆ మాటకి ఆ పిల్లలు పెద్దయ్యాక కూడా ఆ భయం పోదు. కొందరికి చీకటంటే భయం. మరికొందరికి ఎత్తంటే భయం, ఇంకొందరికి ఒంటరిగా వుండడం భయం.. ఇలాంటి ఫోబియాలన్నీ చిన్నతనంలో పడిన ముద్రలవల్ల వచ్చినవే..” “కానీ నాది భయం కాదే..”

“నిజమే.. మీది మరో రకమైన భయం. చిన్నప్పుడు మీ తాతగారు మీ బుఱ్ఱలో పాపభీతిని ప్రవేశపెట్టారు. మీరు మీ నాన్నగారి పాఠాలు ఫాలో అయిపోయి బిజీగా వున్నన్నాళ్ళూ మీకు ఇది గుర్తు రాలేదు. కానీ ఎప్పుడైతే సంపాదన మీద మీరు అంత దృష్టి పెట్టవలసిన అవసరం లేకపోయిందో అప్పుడు మీ బుఱ్ఱలో ఎక్కడో మూలగా సబ్ కాన్షస్‍లో దాక్కున్న ఈ పాపభీతి బయటకొచ్చింది. దానివల్ల ఇంత సంపాదించాను.. ఎవ్వరికీ ఒక్క పైసా అయినా దానం చేసి గోరంత పుణ్యమైనా సంపాదించుకోలేకపోయానే.. వచ్చే జన్మ ఎలావుంటుందో అన్న ఆలోచనతో మొదలైన మీ ఆందోళన మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా లేపి కూర్చోబెట్టింది. ఎటొచ్చీ ఆ చెయ్యవలసిన పనేమిటో తెలీకే మీరింత ఆందోళన పడ్డారు.”

డాక్టర్ చెప్పింది విన్న గురుమూర్తి మొహం చేదు తిన్నట్టయిపోయింది. “అంటే ఇప్పుడు నాకున్నదంతా దానం చేసేస్తే కానీ నాకు ఈ నిద్ర పట్టని జబ్బు తగ్గదంటారా?” విసురుగా అడిగాడు. డాక్టర్ నవ్వాడు. “కాదండీ. పరస్పర విరుధ్ధమైన అభిప్రాయాలు మీ మెదడులో వున్నాయి. సబ్ కాన్షస్‍లో అలాంటి భావాలున్నాయని ఇప్పడు నేను చెప్పాకే కదా మీకు తెలిసిందీ. మీరు నిద్ర మధ్యలో యెందుకు లేస్తున్నారో కారణం తెలిసింది కనుక దానిని యెలా నివారించుకోవాలో తెలుసుకోవడం కష్టం కాదు.” సుమతి కల్పించుకుంది. “అంటే ఇప్పుడు మేమేం చెయ్యాలో చెప్పండి ప్లీజ్” అంది డాక్టర్ తో.

“చూడండీ. ఆయనకి ప్రపంచజ్ఞానం వుంది. లోకంతీరు తెలిసినవారు. ప్రతీ మనిషిలోనూ మంచీ, చెడూ రెండూ వుంటాయి. మెదడులో రెండు విరుధ్ధమైన భావాలున్నప్పుడు వాటిని విశ్లేషించుకుని యేదో ఒకదానివైపు మొగ్గడం ఆ మనిషి వ్యక్తిత్వం మీద అధారపడి వుంటుంది. ఇప్పుడు మీవారు తాతగారిమాట పాటిస్తారో, లేక తండ్రి చెప్పిన పాఠాలనే అనుసరిస్తారో ఆయనే విజ్ఞతతో తేల్చుకోవాలి. బైటవాళ్లం ఆయనని ఆదేశించి చేయించే పని కాదిది.” అన్నాడు డాక్టర్ మధుసూదన్. డాక్టర్ దగ్గర శెలవు తీసుకుని ఇంటికి బయల్దేరారు భార్యాభర్తలు. దీర్ఘాలోచనలోవున్న గురుమూర్తిని కదిలించే సాహసం చెయ్యలేకపోయింది సుమతి.

ఇంటికి రాగానే తన వ్యవహారాలన్నీ చూసే సెక్రటరీకి ఫోన్ చేసాడు గురుమూర్తి. అటు అతను లైన్ లోకి రాగానే “ చూడు ఆనంద్, నేను చెప్పేది శ్రధ్ధగా విను. మనకి వచ్చే లాభాలు అన్నింటిలోనూ పదిశాతం విడిగా పెట్టి ఒక ట్రస్ట్ లా ఏర్పాటు చెయ్యి. ఆ ట్రస్ట్ కి నేనూ, నా భార్యా, మా పిల్లలూ, మా ఫామిలీ లాయరూ ఎక్జిక్యూటివ్ మెంబర్స్ గా వుండేట్టు చూడు. ఆ ట్రస్ట్ ద్వారా ఎవరెవరికి ఎలాంటి సహాయాలు అందించాలో నిజాయితీగా సమాచారం అందించే ఒక కమిటీని ఏర్పాటు చెయ్యి. తిండి, బట్ట, నీడ, వైద్యం, విద్య..ఎటువంటిదైనా సరే, ఏ సహాయమైనా సరే అది అందుకునేవారికి సవ్యంగా చేరాలి. ఇవన్నీ మన లాయర్ తో మాట్లాడి, ఫైల్ తయారుచేసి, వీలైనంత తొందరలో తీసుకురా.. “ అంటూ ఫోన్ పెట్టేసాడు.

అంతా వింటున్న సుమతి, “మీరు ట్రస్ట్ పెడతారా..?” అంది ఆశ్చర్యంగా. “ఏం.. అంత ఆశ్చర్యమెందుకు?”

“అహా.. ఆశ్చర్యంకాదు. ఇంత సంపాదించారు కదా.. ఒక్క పదిశాతమే ఎందుకు? ఇంకాస్త ఎక్కువ ఇస్తే మరి కొంతమందికి ఉపయోగపడుతుంది కదా.. మీక్కూడా హాయిగా నిద్ర పడుతుంది..” డాక్టర్ మాటలు మనసులో మెదులుతుంటే అంది సుమతి. నవ్వాడు గురుమూర్తి.

“ఇది నేను నా నిద్రకోసం చేస్తున్నది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినందుకు నా మనసులో యే భావాలు మెదులుతున్నాయో నాకు స్పష్టంగా అర్ధమైంది. అంతమాత్రం చేత నేను నా డబ్బంతా దానం చేసెయ్యక్కర్లేదు. ఆయనే అన్నాడు కదా.. నా విజ్ఞతను ఉపయోగించుకొమ్మని. లోకంతీరు ఎలాంటిదో చూస్తున్నావుగా.. ఉట్టినే వస్తోందంటే ఎంతమందో ఎగబడతారు. అలా అడిగినవాళ్లందరికీ తాతగారిలా అర్ధంపర్ధం లేకుండా ఇచ్చుకుంటూ పోతే మన పిల్లలు కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడవలసొస్తుంది. అందుకే పెద్దలంటారు తనకు మాలిన ధర్మం పనికిరాదని. అలాగని మా నాన్నగారిలాగా అస్సలు ఎవ్వరికీ చెయ్యి విదల్చకుండా కూడా వుండలేం. మనకి కూడా మనసంటూ ఒకటి వుంటుంది కదా. అందుకే ఆ ఇద్దరి అనుభవాలూ దృష్టిలో పెట్టుకుని నేను ఈ పని చేస్తున్నాను. విసిరేసేటప్పుడు కూడా యెంచి విసిరెయ్యమంటారు పెద్దలు. ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, పదోవంతు అవసరమైనవాళ్లకి ఇవ్వడంలో నాకు, నా పిల్లలకూ వచ్చే నష్టం ఏమీ వుండదు. అందుకనే మధ్యేమార్గంగా నేను ఈ పధ్ధతి ఎంచుకున్నాను. అప్పుడు ఇంత కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అపాత్రుల పాలబడదు.”

కళ్ళప్పచెప్పి అతని మాటలు వింటున్న సుమతి పక్కన కూర్చుని, “సుమతీ, ద్వైదీభావాల మధ్య నలిగే నా మనసుకి ఒక మార్గం చూపించాను. ఇంక నాకు హాయిగా నిద్ర పడుతుంది.” అన్నాడు నవ్వుతూ గురుమూర్తి. సుమతి సంతోషంగా నవ్వింది.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.