నిర్ణయం

ఆదివారం మధ్యాహ్నం భోజనాలై పనంతా ముగించుకుని ఇలా సోఫాలో నడుం వాల్చానో లేదో ఫోన్ మ్రోగింది. అక్క కూతురు శృతి నుండి . “పిన్నీ మేము ఫ్లాట్ కొనుక్కున్నాము, ఇక్కడే హైటెక్ సిటీలో, మా ఆఫీస్‌కి దగ్గరలో. ఈ నెల పద్ధెనిమిదిన , రాత్రి రెందు గంటలకు గృహ ప్రవేశం. నువ్వు, బాబాయి, పిల్లలూ తప్పకుండా రావాలి. నాల్గురోజులముందే వచ్చేయండి “ ఇదీ ఆ ఫోన్ సారాంశం.

రెందు సంవత్సరాల క్రిందట దాని పెళ్ళి ఆహ్వానం కూడా ఇలానే ఫోన్‌లో అందిన విషయం ఙ్ఞప్తి కి వచ్చి మనసు గతంలోకి జారింది.

***

శృతి మా అక్కయ్య ఒక్కగానొక్క కూతురు. ఎంతో గారాబం గానూ, మరెంతో పద్ధతిగానూ పెరిగింది. మంచి ర్యాంకు తెచ్చుకుని ఇంజనీరింగ్ కాలేజీలో చేరి క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం తెచ్చుకుంది. ట్రైనింగ్ తరవాత హైదరాబాద్‌లోనే పోస్టింగ్ వచ్చేసరికి యిక ఇంట్లో పెళ్ళి ప్రయత్నాలు మొదలయ్యాయి.

బావా వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. ఆక్కా, బావా ఇద్దరూ గవర్నమెంట్ అఫీసర్స్‌గా పని చేస్తున్నారు. ఫరువు, ప్రతిష్ట, సాంప్రదాయం వీటన్నింటికి పెద్ధ పీట వేసే మనస్థత్వాలే ఇద్దరివీనూ.

చక్కటి సాంప్రదాయిక కుటుంబం నుండి వచ్చిన అబ్బాయితో శ్రుతి పెళ్ళి నిశ్చయం అయ్యింది. ఆబ్బాయి అందగాడు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. ఒక్కడే కొడుకు. రావ్ అండ్ రావ్ గ్రూప్ ఆఫ్ కంపనీస్‌కి ఏకైక వారసుడు. ఎంగేజిమెంట్ ఎంతో ఘనంగా స్టార్ హోటల్లో జరిగింది.

అందమైన జంటకి ఊరందరి దిష్టి తగిలిందేమో అన్నట్లు నెల రోజుల్లొ జరగాల్సిన పెళ్ళి ఆగిపోయింది. కారణం శృతికి పెళ్ళికొడుకు ప్రవర్తన నచ్చలేదు. ఆక్కా బావా ఎంత నచ్చచెప్పటానికి ప్రయత్నించినా శృతి మొండికేయటంతొ పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది. ఆక్కా, బావా చాలా అప్సెట్ అయ్యారు. ఫరువు పోయిందని బాధ పడ్డారు. కాలం అన్ని గాయాలనీ మానుపుతుంది కదా. కొన్నాళ్ళకి మళ్ళీ పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలో మరో అవాంతరం. శృతి తన కోలీగ్ అంటూ మనోజ్‌ని ఇంటికి తీసుకువచ్చి అమ్మా , నాన్నా లకి పరిచయం చేసింది. అతన్నే పెళ్ళి చెసుకుంటాననీ , ఇక తనకి వేరే పెళ్ళి సంబంధాలు చూడొద్ధనీ చెప్పింది. సాంప్రదాయానికీ, కట్టుబాట్లకీ ప్రాణమిచ్చే అక్కా బావా యీ కులాంతర వివాహాన్ని ఆమోదించలేకపోయారు. నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. వాళ్ళని ఒప్పించటానికి తను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా చివరకి ఫ్రెండ్స్ సాయంతొ ఆర్య సమాజంలొ పెళ్ళి చేసుకుంది శ్రుతి. ఆ రోజూ ఇలాగే దాని దగ్గరనుండి ఫోన్ - “ పిన్నీ , నా పెళ్ళి వచ్చే శుక్రవారం, తప్పకుండా రండి “ అని.

ఎంతో ఆర్భాటంగా జరగవలసిన దాని పెళ్ళి సింపుల్‌గా దాని స్నేహితుల అధ్వర్యంలో జరిగిపోయింది. ఆక్కా, బావా, నేనూ, అమ్మా, నాన్నా కేవలం అతిథుల్లాగా దాని పెళ్ళి చూసి వచ్చాము. మా కుటుంబంలో మొట్టమొదటి అమ్మాయి పెళ్ళి అలా జరగడం మా అందరికీ ఎంతో బాధగా అనిపించింది. కానీ ఏదీ మన చే తుల్లో లెదు. ఫిల్లలని పెంచడం, పెద్ద చేయడం వరకే మన బాధ్యత, కర్తవ్యం. ఆ తరవాత వాళ్ళ అభిప్రాయాలూ, నిర్ణయాలూ వాళ్ళవే. తరాల అంతరాలు ఎప్పుడు వుంటూనే వుంటాయి.

మళ్ళీ ఇన్నాళ్ళకి, పెళ్ళైన రెండేళ్ళకి శృతి నుండి గృహప్రవెశ ఆహ్వానం. ఛాలా సంతొషమేసింది, మా కళ్ళ ముందు పెరిగిన పిల్ల అప్పుడే పెళ్ళి చేసుకుని, స్వంత యిల్లు కట్టుకుందంటే.

ఫిల్లలకి పరీక్షలు, యింకా టెన్నిస్ సెలక్షన్స్ వుండడంతో మా శృతి కోరినట్టుగా నాల్గు రోజులు ముందుగా వెళ్ళలేకపోయినా, పన్లన్నీ తెముల్చుకుని , పిల్లల బాధ్యత మా వారి మీద పెట్టి గృహప్రవేశం రోజుకి వెళ్ళగలిగాను.

ఇల్లు చాలా బావుంది. ఫెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఏడవ అంతస్థులో వున్న త్రి బెడ్రూం ఫ్లాట్. ఆన్ని బెడ్రూముల్లోనూ అటాచ్డ్ బాత్రూంస్, విశాలమైన బాల్కనీలతో ఇల్లెంతో ముచ్హటగా వుంది. గృహప్రవేశం బాగా జరిగింది. రెండు రాత్రులు వరసగా నిద్ర తక్కువైనందుకో ఏమో గాని భొజనాలైన తరవాత అలా కుర్చీలో కూర్చోగానే కునుకు పట్టేసింది.

గిన్నెలు సర్దుతున్న శబ్దానికి మెలుకువ వచ్చి చూస్తే, అతిధులంతా వెళ్ళిపోయినట్టున్నారు, క్యాటరింగ్ వాళ్ళు సామాన్లు సర్దుకుంటున్నారు. ఇంక నిద్ర తేలిపోయింది. ఏదో చిన్నపిల్లల మాటలా వినిపిస్తే గుమ్మం బయటకొచ్చి చూసా. బూరెల్లాంటి బుగ్గలతో ముద్దులు మూటగట్టే పాప. మూడేళ్ళుంటాయేమో. తొంగి , తొంగి లోపలకి చూస్తుంటే ‘ఎవరు కావాలి పాపా “ అని అడుగుతుండగానే, పాపని వెతుక్కుంటూ వచ్చిన స్త్రీని చూసి వెంటనే పోల్చుకున్నా. ఆనందంతొ “ విద్యా, నువ్వేనా “ అంటూ దాదాపుగా అరిచేసాను. తనూ అంతే ఆనందంతో “ఎన్నాళ్ళకి నిన్ను చూసాను స్వాతీ , ఐనా నువ్వేంటీ ఇక్కడ “ అని అడిగింది. “ఇది మా అక్క కూతురి ఫ్లాట్, దాని గృహప్రవేశానికి వచ్చాను” అని చెప్పగానే “ ఔనా, మా అమ్మయిది ఈ పక్క ఫ్లాటే , ఇది నా మనవరాలు అనన్య “ అని చెబుతూ పాపని ఎత్తుకుని “ రావే మా ఫ్లాట్ కి వెళ్దాం “ అంటూ నన్ను తీసుకు వెళ్ళింది.

***

నేనూ, విద్యా ఫోర్త్ క్లాసు నుండి టెంత్ వరకూ తెనాలిలో ఒకే స్కూల్‌లో ఒకే సెక్షన్‌లో కలిసి చదువుకున్నాము. బెస్ట్ ఫ్రెండ్స్‌మి. ఎప్పుడూ కలిసేవుండేవాళ్ళం. మా స్నేహాన్ని చూసి టీచర్స్ అంతా ముచ్చటపడితే , మా క్లాస్‌మేట్స్ చాలా మంది ఈర్ష్యతో మమ్మల్ని విడదీయాలని ఎన్నో ప్లాన్స్ వేసి విఫలమయ్యేవారు. టెంత్ తర్వాత మా నాన్నకి హైదరాబాద్‌కి ట్రాన్స్ఫర్ కావడంతో , కొన్నాళ్ళపాటు మా మద్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా, ఆ తరవాత స్టడీస్ , కోచింగ్స్‌తో ఇద్దరమూ బిజీ కావడంతో మా మద్య కమ్యూనికేషన్ తగ్గుతూ వచ్చింది. ఇప్పటిలాగా అప్పట్లో సె ల్‌ఫొన్లూ, ఈమెయిల్స్ లేవు కదా. అడప దడపా తన నుండి వచ్చిన ఉత్తరాల వల్ల , తనకి మ్యారేజ్ అయిందనీ, ఒక పాప పుట్టిందనీ మాత్రం తెలుసు. నా పెళ్ళి తరవాత నేను బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాక తనతో కాంటాక్ట్స్ పూర్తిగా కట్ అయాయి. మళ్ళీ యిన్నేళ్ళ తరవాతే కలిసాము.

విద్యా, నేనూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము. మా చిన్ననాటి సంగతులన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుని మళ్ళీ చిన్నవాళ్ళమైపోయాము ఇద్దరమూ కొంతసీపు. “అన్నట్టు, మీ అమ్మాయి పేరు కీర్తి కదే , తనెలా వుందీ, ఎం చేస్తోందీ, మీ అల్లుదు ఏం చేస్తున్నాడూ “‘ అన్న నా ప్రశ్నకి దాని మొహం కళ తప్పడం గమనించాను. కొంతసేపటికి సర్దుకుని “ అంతా మా ప్రారబ్దమే స్వాతీ “ అంటూ చెప్పుకొచ్చింది.

***

కీర్తి మా అమ్మాయని కాదే స్వాతీ, చిన్నతనం నుండీ ఎంతో పొందిగ్గా వుండేది, చెప్పిన మాట వినేది, క్లాస్‌లో ఎప్పుడూ ఫస్టు ర్యాంకు తెచ్చుకునేది. ఐఐటి చెన్నైలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో సీట్ తెచ్చుకుని, క్యాంపస్ సెలక్షన్‌లో అమెజాన్‌లో జాయిన్ అయింది. ఆ తరవాత దానికి సంబంధాలు చూడడం మొదలు పెట్టాము. ఒక సంబంధం నాకూ, మా వారికీ ఎంతో నచ్చింది. ఆబ్బాయి అందగాడు, కోట్లల్లో వున్న బిజినెస్‌కి వారసుడు. మంచి సాంప్రదాయికమైన కుటుంబం. దాదాపు ఖాయం చేసుకుందాం అనుకునేంతలో , కీర్తి “ మా కోలీగ్” అంటూ రోహిత్‌ని ఇంటికి తీసుకుని వచ్చి , తనూ, అతనూ ప్రేమించుకున్నాము అని చెప్పగానె, మా వారు అంతెత్తున ఎగిరారు. కులాంతరానికి ససేమిరా అన్నారు. నేనెంత కన్విన్స్ చేయాలని చూసినా మా వారు ఒప్పుకోలేదు. వారి బీపీ రైజ్ అయి హార్ట్ అటాక్ రావడంతో , కీర్తి వాళ్ళ నాన్న కోసం తన ప్రేమని వదిలేసి, మేము చూపించిన సంబంధమే చేసుకుంది.

మా అల్లుదు కార్తీక్ మంచివాడే, దీనిని మొదట్లో బాగానే చూసుకునేవాడు. కానీ తనతో చాలా తక్కువగా మాట్లాదేవాడు. ఏ విషయమూ కీర్తితో షేర్ చేసుకునేవాడు కాదు. ఇదే ఏదైనా కల్పించుకుని మాట్లాడబోయినా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. మొదట్లో అతను రిజర్వుదు టైపేమో అందుకే ఎక్కువగా మాట్లాడడులే అనుకుని ఇదే సర్దుకుంది. ఆతని మనస్థత్వం అర్థం చేసుకునేంతలోనే పాప పుట్టింది. పాపతోనూ అతనికి అంతగా అటాచ్‌మెంట్ వుండేది కాదు. ఫాపని పెద్దగా దగ్గరికి తీసేవాడు కాడు. రాను రాను అతని విపరీత స్వభావం భరించడం కష్టం ఐపోయింది. నిర్ణయాలన్నీ తనే తీసుకునేవాడు. రోజుకి ఎన్ని పాల ప్యాకెట్లు కావాలి అనే చిన్న విషయం మొదలు ఏ లొకాలిటీలో ఎలాంటి ఇల్లు కొనాలి అనే వరకూ కీర్తితో ఏ విషయమూ సంప్రదించకుండా తనే నిర్ణయించేసేవాడు.

ఆతని దృష్టిలో భార్య అంటే కేవలం తన కోర్కె తీర్చి తనకి వారసులనిచ్చేందుకే. భార్యకి ఒక వ్యక్తిత్వం అంటూ ఉండకూడదన్నట్టు ఉండేది అతని ప్రవర్తన. తను ఎక్కడికి వెళ్ళేది, ఎప్పుదు వచ్చేది కూడా కీర్తికి చెప్పేవాడు కాదు. ఛివరకి అతను టూర్స్‌కి వెళ్ళినా దీనికి తెలిసేది కాదు. ఇండిపెండెంట్‌గా , చక్కటి వ్యక్తిత్వంతో పెరిగిన కీర్తికి ఇదంతా ఎంతో కష్టంగా ఉండేది. ఇవన్నీ నాతో చెప్పుకుని బాధపడేది. ఇదంతా విన్నాక , అమ్మగా కంటే కూడ , ఒక ఆడదానిగా ఎంతో బాధేసింది. ఏ ఆడపిల్లైనా భర్తనుండి కోరుకునేది ఏమిటి స్వాతీ – మంచి కంపానియన్‌షిప్‌ని, ఏ అరమరికలూ లేకుండా అన్నింటినీ పంచుకుంటూ , కలిసి, మెలిసీ వుండాలనేగా. అలాంటి దాంపత్యంలో అడప దడప గొడవలు, అలకలూ వున్నా మళ్ళీ ఈజీగా కలిసిపోగలుగుతారు. అంతే కాని యిలా ఏవీ పంచుకోకుండా , మాటలే లేకుండా , మౌనంలో గడపాల్సి రావడం ఏ అమ్మాయికైనా పెద్ద శాపమే కదూ స్వాతీ. అప్పటికీ మా వారూ, నేనూ ఒకసారి వెళ్ళి మా వియ్యంకుడు, వియ్యపురాలితో మాట్లాడాము, వారేమైనా వాళ్ళ అబ్బాయికి కాస్త నచ్చజెబుతారేమోనని. కాని వారి నుండి వచ్చిన సమాధానం “ మేం మా ఇంట్లో ఒకరి విషయంలో మరొకరు జొక్యం చేసుకోము “ అని.

అతనితో కలిసి ఒకే ఇంట్లో వుంటు న్నా, మానసికంగా ఒంటరితనంతొ క్రుంగిపోయింది కీర్తి. వేళకి తిండి, నిద్ర అన్నీ మానేసి డిప్రెషన్‌లో పడిపోయినా అతనేమి పట్టించుకోకపోయేటప్పటికి యింక ఊరుకోలేకపోయాము. మా వారి ఫ్రెండ్ సైకాలజిస్ట్. ఆతని వద్దకి కీర్తిని తీసుకుని వెళ్ళి , విషయమంతా చెప్పి సలహా అడిగాము.

ఈ రకమైన విపరీత స్వభావం ఒక మానసిక రోగమనీ, ఎదో నోరు తిరగని వ్యాధి పేరు చెప్పి, ఇలాంటి వ్యక్తితో కలసి జీవించేవాళ్ళు మానసికంగా క్రుంగిపోయి జీవఛ్ఛవాలుగా మారుతారనీ, విడాకులు తీసుకొవడమే మంచిదనీ చెప్పాడు.

కీర్తితొ విడాకులకి అప్ప్లై చేయించాము. కార్తీక్ ఒక పట్టాన విదాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ముప్పుతిప్పలు పెట్టించాడు. నీకు తెలుసుగా , మా వారు ఐపియస్ ఆఫీసరని. పోలీస్ ఇన్‌ఫ్లుయెన్సూ, పవరూ చూపిస్తేగాని లొంగలేదతను. ఆలా విడాకులు మంజూరయి దాదాపు సంవత్సరం కావచ్చింది. ఇప్పుడిప్పుడే కీర్తి కొద్ది కొద్దిగా కోలుకుంటొంది.

ఫ్రాజెక్ట్ పని మీద లండన్ వెళ్ళిన రోహిత్‌, అదే, కీర్తి పెళ్ళికి ముందు ప్రేమించిన అబ్బాయి , ఆర్నెళ్ళ క్రిందట ఇండియాకి తిరిగి వచ్చాదు. కీర్తి ఇక్కడే వుందని, ఎవరో చెబితే వచ్చి, విషయం అంతా తెలుసుకొని చాలా బాధపడ్డాడు. ఆతను కీర్తిని గాఢంగా ప్రేమించాడేమో ఇంకా పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగానే వుండిపోయాడు. ఆతని మోరల్ సపోర్ట్ వల్లే కీర్తి కొద్దిగా తొందరగా కోలుకోగల్గుతోంది. ఆతను కీర్తిని పాపతో పాటు స్వీకరించడానికి సంసిధ్ధతని వ్యక్తం చేసాడు. ఇలాంటి ఆణిముత్యాన్నా తను కులం, పరువు, ప్రతిష్టల పేరుతో కాదన్నది అని మా వారు పశ్చాత్తాపంతో , క్షమించమని అతని చేతులు పట్టుకున్నారు.

ఒక పెళ్ళి అనుభవం వల్ల కలిగిన విరక్తి నుండి కీర్తి ఇంకా పూర్తిగా బైటపడకపోవడం వల్ల మళ్ళీ పెళ్ళి అంటే ఆలోచిస్తొంది. కానీ , రోహిత్‌ తన ప్రేమతో కీర్తిని త్వరలోనే పెళ్ళికి తప్పకుండా ఒప్పించగలడనే మా నమ్మకం. ఆ ఆశతోనే జీవిస్తున్నామే స్వాతీ “ అని ముగించింది.

“మీ ఆశ తప్పకుండా నిజమౌతుంది విద్యా " అని దానికి ధైర్యం చెప్పి, "అన్నట్టు విద్యా, ఈ కార్తీక్ వాళ్ళ బిజినెస్ ఏంటి “ అని అడిగాను , ఏదో అనుమానం నాలో లీలగా మెదలుతుండగా. “ అదా, రావ్ అండ్ రావ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని , చాలా ఫేమస్ కంపెనీ వాళ్ళది, పేరు వినే వుంటావు “ అని చెప్పింది విద్య. అంతే , ఇందాకటినుండీ మనసులో బిగుసుకుంటున్న చిక్కు ముడి వీడినట్టైంది. ఇది మా శృతికి తప్పిపోయిన సంబంధమే. ఆనాడు శృతి , వాళ్ళ అమ్మా, నాన్నల యిమోషనల్ బ్లాక్‌మెయిల్‌కి కనక లొంగిపోయి వుంటే ఈరోజు కీర్తి స్థానంలో శృతి వుండేది. శృతి తీసుకున్న తెలివైన నిర్ణయమే దాన్ని కాపాడింది.

విద్యా, నేనూ సెల్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాక “ యింక వెళ్ళొస్తానే “ అని దానికి చెప్పి గుమ్మం బయటకి రాగానే, గుమ్మం ప్రక్కనే అక్క, దాని కంట్లో నీళ్ళు - చూడగానే అర్థమైంది మా సంభాషణంతా తన చెవులపడిందని. “మన శృతికి ఎంత ప్రమాదం తప్పిందే స్వాతీ “ అని తను నాతో అంటుండగానే “ అమ్మా, పిన్నీ ఇక్కడున్నరా మీరు, మీ కోసం అంతా వెతుకుతున్నాను “ అంటూ శృతి వచ్చింది. అక్క “అమ్మా శృతీ “ అంటూ దాన్ని ఆప్యాయంగా దగ్గరకి తీసుకుంది. పెళ్ళైన ఈ రెండేళ్ళనుండీ అక్క, బావా తనతో అంటీముట్టనట్టంటున్నారేమో, మునుపటి ఆప్యాయత మళ్ళీ ఒక్కసారిగా దొరికేటప్పటికి శృతి ఆనందానికి అంతు లేదు.

తల్లీ కూతుళ్ళ గాఢ పరిష్వంగాన్ని చూస్తూ అనుకున్నాను "పిల్లలు పెద్దై స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకుంటుంటే వాళ్ళ నిర్ణయాలని సరైనవా , కావా అని పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవంతో బేరీజు వేసి చూడాలే కానీ గుడ్డిగా కాదనకూడదూ “ అని. నాకూ పెళ్ళీడుకొచ్చిన ఇద్దరు పిల్లలున్నారు మరి.telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.