చితికిన బతుకులు

1984 సంవత్సరం....జులై నెలలో ఒక రోజు....

ఇంకా తెల్లవారలేదు! పౌర్ణమి నాటి చంద్రుడు తెల్లని వెన్నెలని కురిపిస్తూ, తన తెల్లదనాన్ని చూసి గర్వపడుతున్నట్లు నిండుగా వెలిగిపోతున్నాడు. ఊరు మొత్తం నిద్ర పోతోంది. కాని నిద్ర పట్టని రామశాస్త్రి నులక మంచం మీద అటూ ఇటూ పొర్లుతున్నాడు. నుసి పట్టి తెగిపోగా మిగిలిన నులక మీద వేసిన బొంతతో సహా రామశాస్త్రి ఇంచుమించు నేలకు తాకుతున్నాడు. రేపటి గురించి ఆలోచిస్తున్నాడు. 'అతను వస్తాడా!' అతను వస్తాడని నీరు గట్టు ఖాజామియ్యా పొద్దున చెప్పాడు. అలా చెప్తూనే....'ఆళ్ల మాటలేడ నమ్మిక సామి గెవర్నెమెంటోడి బుద్ధి యాడ సరిగుంటింది' అని నిరాశ మాట జత గలిపాడు. నిజమే కొత్తగా వచ్చిన విలేజ్‌ అసిస్టెంట్‌ పేరుకే అసిస్టెంట్‌గాని ఎంత గౌరవముంది ఆ ఉద్యోగానికి. ఉండదూ రామశాస్త్రి గ్రామానికి కరణంగా ఉన్నప్పుడే ఎంత మర్యాదిచ్చేవాళ్లు, అలాంటిది ఇప్పుడతను పది గ్రామాలకు కరణం మునసబు రెండూనూ....అనుకొంటా. ''సర్లేరా వాళ్లకెన్ని పనులో. ఒకవేళ వస్తాడేమో వస్తే టిఫిన్‌ మనింట్లోనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఏమంటావ్‌'' అన్నాడు రామశాస్త్రి.

'అవుమల్లా అట్నే సేద్దాం'' దానికి వంత పాడాడు ఖాజామియ్యా.

''మరి ముందుగా డబ్బులు అడిగి తీసుకోకపోయావా సర్పంచ్‌ నడిగి''

''ఆయన ముందుగా యాడ ఇస్తడు. వచ్చినాక రాపో అంటావుండాడిప్పుడు. ఆయప్ప రాంగానే సర్పంచ్‌నడిగి సణంలో అన్ని సిద్ధం చేయను''

''పూరీ వడల్లాంటివి అంటాడేమో అవి మీ అమ్మయ్యకు చేసే ఓపిక లేదు. కాదు కూడదు అంటే చేస్తుందనుకో... దానికన్నా ఓ పిరికెడు ముంత మామిడి పప్పు వేసి ఉప్మాచేసి నెయ్యి, పప్పులు పొడి లేదా మాగిన ఊరగాయ వేసుకొంటే మహా బేషుగ్గా ఉండదు. ఏమంటావ్‌..?'' నోట్లో ఊరుతున్న నీళ్లను దిగమింగుతూ అన్నాడు.

''మీరెట్టాగంటే అట్టాగే..! ఆయప్ప రానీండి'' జరిగిన సంభాషణలను నెమరువేసుకుంటూ, లేవలేక లేచి ఓ చెంబుడు నీళ్లతో కడుపు నింపుకొని తెల్లవారుతుందనగా నిద్రలోకి జారుకున్నాడు రామశాస్త్రి.

***

చెదలు పట్టి శిథిలావస్థలోనున్న ఆ బోద కొట్టం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది! సుమారు ఇరవై అంకణాల లోగిలిలో చుట్టూ పెద్దరాళ్లతో కట్టిన ప్రహారీగోడ తెల్లటి సున్నంతో మరక అనేది కనపడక మెరిసి పోతుండేది. లోపల రకరకాల పూలచెట్లు, కాయగూరల చెట్లు విరగబడి గాసేవి. పేరుకు బోదకొట్టమే కాని పీచు లేకుండా పుల్లల్లోనే బోద కప్పు వేయడంతో చాలా అందంగా కనపడేది. ఇక ఇంట్లోంచి ఎప్పుడూ వచ్చే కర్పూరం, సాంబ్రాణి, అగరుబత్తిల వాసన నిత్యం ధూపదీప నైవేద్యాలందుకొంటున్న దేవాలయాలను గుర్తుకు తెచ్చేలా ఉండేది. ఇంట్లో పూజ అయ్యాక హరిరామ శాస్త్రి (రామశాస్త్రి తండ్రి) బైటకి వచ్చి బైట నిలబడిన జనాలందరికీ తన రాగి చెంబులోని తీర్థాన్ని ఓపిగ్గా పోసేవాడు. తరువాత అతని భార్య ప్రసాదం పంచేది. మునసబైనా, మోతుబరైనా వాళ్ల నీడ తన మీద పడుతుందేమో, వాళ్లు పీల్చిన గాలి తాము పీల్చాలేమో అన్నట్లు ఓ అడుగు పైనుంచే వాళ్లకు తీర్థ ప్రసాదాలిచ్చేవాడు. మంచి జరుగుతుందన్న నమ్మకంతో గ్రామస్తులు తీసుకుపోయే వాళ్లు.

అతనికి గ్రామంలో పొలాల గురించి కాని, ప్రజల గురించి కాని తెలియని విషయమంటూ లేదు. రబీ, ఖరీఫ్‌ కాలాల్లో నౌకర్లనే ఇంటి దగ్గరికి పిలిపించుకొని గ్రామలెక్కలు రాసేవాడు. తహశీల్దారు వస్తే తప్ప బైట కాలు పెట్టి ఎరగడు. తన తండ్రి సంపాదించిన పది ఎకరాలు మాగాణి మీద వచ్చిన గుత్తగింజలు కరణీకం ద్వారా వచ్చే ఆదాయం తప్ప మరేది ఆశించే వాడు కాదు. కానీ దుర్వాసుని మించి కోపిష్టి. తన కులం గొప్పదని, తాను కారణజన్ముడని మిగతా వారంతా అల్పులని భావన కలిగి, సంప్రదాయపు ముసుగులో మతమౌఢ్యం నరనరాన వంట పట్టించుకొన్న ఓ అహంకారి. అదే తన పతనానికి కారణమవుతుందని అతను కలలో కూడా ఊహించి ఉండడు. హరిరామ శాస్త్రికి ఒక్కగానొక్క కొడుకు రామశాస్త్రి. పట్నంలో తమ బంధువుల దగ్గరుంచి చదివిస్తున్నాడు. భార్య వంటింటికి, పూజా గదికి మాత్రమే పరిమితం. ఇక మిగిలింది ఆండాళ్లు. ఇంట్లో పనులన్ని చూసే శాస్త్రి దూరపు బంధువు. ఏ దిక్కులేని వితంతువు. వేళ కింత భోజనం తప్ప జీతం రాళ్లాశించని పని మనిషి.

రోజూలాగే ఆమె ఏటికెళ్లి చెలిమి తీసి బిందెకు నీళ్లు నింపుకొని పొలం గట్టుమీద జాగ్రత్తగా భయం భయంగా నడవ సాగింది.. ఎవరైనా తనను తాకుతారేమోనని. ఇంతలో ఓ పిల్లవాడు 'పాము పాము' అని అరుస్తూ గట్టు వెంట ఆమెకెదురుగా పరిగెత్తుకరాసాగాడు. ఆండాళ్లుకు గుండె ఆగినట్టయింది. అడుగు ముందుకు పడలేదు. పాము భయంతో కాదు. ఆ పిల్లవాడు వచ్చి తనను ఎక్కడ తాకుతాడోనని. చుట్టూ వరి నాట్లు వేసి ఉండడంతో పక్కకు వెళ్లేందుకు వీలు లేదు అంతా బురదే. 'దూరం దూరం' అంటూ గట్టిగా అరవ సాగింది. వాటిని వినిపించుకోకుండా పాము భయంతో ఆమెను తాకుతూ వెళ్ళి ఆమె వెనక నిల్చున్నాడు. పిల్లవాడు తాకగానే కంపించిపోయిందామె. 'ఎంతపని చేసావురా వెధవా' అంటూ అంత దూరం నుంచి మోసుకొచ్చిన బిందెడు నీళ్లను నెత్తిన కుమ్మరించుకుంది. పిల్లవాడికి మొదట ఆమె చేసిన పని అర్థం కాలేదు. అర్థమయ్యాక వాడికి పాము భయం పోయి ఆమెను ఏడిపించాలన్న చిలిపి కోరిక బయలు దేరింది. ఆమె ఏట్లో నీళ్లు తీసుకుని కొద్ది దూరం రాగానే అటూ ఇటూ చూసి మళ్లీ ఏడిపించాడు. ఆండాళ్లు పిచ్చి కోపంతో ఊగిపోయింది. తరువాత తన ఆశక్తతకు కంట్లో నీళ్లు తిరిగాయి. మరుసటి రోజు అదే తంతు. విషయం హరిరామ శాస్త్రికి చెప్పటంతో అగ్గిమీద గుగ్గిలంలా ఎగిరిపడ్డాడు. వాడి నాన్నను పిలిచి కోప్పడటంతో వాడి చేష్టలు ఆగినా విషయం తెలిసిన వాడి స్నేహితులు ఎవడో ఒకడు ఆమెను ఏడ్పించడం మానలేదు. అలాంటి స్థితిలో ఒక రోజు తీర్థం కోసం ఆ పిల్లవాణ్ని వెంట పెట్టుకొని వచ్చింది అతడి అమ్మ. వాడు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లినా తగ్గకపోవడంతో పిచ్చి నమ్మకంతో వచ్చింది అక్కడికి. వాడ్ని చూసి గుర్తుపట్టిన హరిరామ శాస్త్రికి కోపం ముంచుక రాగసాగింది. పిల్లవాడు శాస్త్రిని గమనించే స్థితిలో లేడు. చాలా సేపు నిలబడి ఉన్నాడేమో నీరసంగా తల్లి పట్టుకొని నడిపిస్తుంటే ముందుకు నడుస్తున్నాడు. హరిరామ శాస్త్రి దగ్గరకు రాగానే ఆమె పిల్లవాడిని వదిలి హరిరామ శాస్త్రికి రెండు చేతుల్ని జోడించడంతో పిల్లవాడు పట్టు వదలటంతో తూలి హరిరామశాస్త్రి మీద పడ్డాడు. అంతే అతనికి కోపం తారా స్థాయినంటుకొంది. వాడు ఏ స్థితిలో పడ్డాడన్న ఆలోచన కలగలేదు అతనికి. ఆండాళ్లను ఆట పట్టించటమే కాకుండా తనను కూడా ఆట పట్టిస్తున్నాడన్న మితిమీరిన కోపంతో ఊగిపోతూ కాలితో బలంగా తన్నాడు. జ్వరంతో నీరసంగా ఉన్న పిల్లవాడు సమ్మెటలాంటి శాస్త్రి కాలి దెబ్బతో బాధగా అమ్మా అని అరుస్తూ బంతిలాగ ఎగిరి రాతి బండమీద పడటం.. తల పగిలి తుది శ్వాస వదలడం క్షణాల్లో జరిగిపోయాయి. చూస్తున్న జనాలకి ఏం జరిగిందో తెలియక క్షణకాలం బొమ్మల్లాగా నిలబడిపోయారు. తేరుకొన్న పిల్లవాడి తల్లి.. రక్తంతో తడిసి విగతజీవుడైన తన కొడుకును పరుగున వెళ్లి వొళ్లోకి తీసుకొని మిన్ను మిన్ను ఏకమయ్యేలా గుండెలు పగిలేలా ఏడుస్తూ... హరిరామ శాస్త్రిని శాపనార్థాలు పెట్టసాగింది. నిమిషాల వ్యవధిలోనే ఊరు ఊరంతా అక్కడికి చేరుకొంది. గుండెలు పిండేలా ఉన్న ఆ దృశ్యం చూసి మండే గుండెలతో... ఎన్నో ఏళ్లుగా వంగి వంగి దండాలు పెట్టిన చేతుల్తోనే దండనకు సిద్ధమయ్యారు. సమయానికి ఊరి మునసబు రాకపోయినట్లైతే హరిరామశాస్త్రి మీద పడి చావ గొట్టేవారే. వాళ్ల ఆగ్రహానికి మునసబు నక్క తెలివితో అడ్డుకట్ట వేశాడు. పోలీసు కేసు లేకుండా కొద్ది భూమి పిల్లవాడి తల్లిదండ్రులకిచ్చేటట్లు పంచాయితీ చేశాడు. కాని హరిరామశాస్త్రి ఆ సంఘటననను జీర్ణించుకోలేకపోయాడు. తన మూలంగా ఒక పిల్లవాడు చనిపోవడం, దేవుడిగా చూసిన ప్రజల ముందు అవమానపడటం అతన్ని నిస్తేజుడ్ని చేశాయి. ఆ రోజు నుంచి గంట గణగణల్లేవు. ధూపదీప నైవేధ్యాలు లేవు. మూసిన తలుపులు తెరుచుకోలేదు. తరువాత ఒక నిశ్చయానికి వచ్చిన హరిరామ శాస్త్రి కొడుకు రామశాస్త్రికి కుటుంబ వ్యవహారాలు అప్పజెప్పి కాశీకి వెళ్లిపోయి తిరిగిరాలేదు. రామ శాస్త్రి అర్ధాంతరంగా చదువు చాలించి కరణం పని చేపట్టాడు. అతని తల్లి కొంతకాలానికి మరణించింది. ఆండాళ్లు మరో బంధువు ఇంటికి వెళ్లి పోయింది. సంసారం చిన్నాభిన్నం కావడంతో దూరపు బంధువులు రామశాస్త్రికి పెళ్లి చేసి ఓ ఇంటివాణ్ని చేశారు. పట్నం పోకడలకు అలవాటు పడ్డ రామశాస్త్రి కరణీకం వల్ల వచ్చే డబ్బులు సరిపోక ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయి చివరికి ఉంటున్న ఇళ్లు మిగిలింది. ఇంతలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం గ్రామాధికారి వ్యవస్థను రద్దు చేసి కరణం, మునసబులను తీసేసి గ్రామ సహాయకుల్ని నియమించింది. దాని మీదనే ఆధారపడి జీవనం గడిపే రామశాస్త్రి ఓ మామూలు వాడైపోయాడు. సిగ్గు విడిచి పలకరించినా ఏమైనా సహాయం అడుగుతాడేమోనని తప్పించుకుపోయేవాళ్లు కొంత మంది. వట్టిచేతుల్తో సానుభూతి తెలిపేవాళ్లు కొందరు. రైతులకు కావాల్సిన ప్రభుత్వ పనులకు సాయం చేస్తూ గడుపుకొచ్చాడు రామశాస్త్రి.

కొన్ని రోజులకు రామశాస్త్రి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రైతులకేమో ఇతనితో పని పడలేదు. ఇంట్లో బియ్యపు గింజలు కరువయ్యాయి. అప్పిచ్చే నాధుడు లేడు. పూట గడవడం గగనమైంది. భార్య తరపువారి పరిస్థితి అంతంత మాత్రమే. పట్నం వెళ్లి ఏదైనా ఉద్యోగం చేయాలన్నా చదువు అంతంత మాత్రమే. గుమస్తా పనిచేసేందుకు అహం అడ్డు. వారం రోజుల నుంచి ఇంటి పాడి ఆవు పాలే వాళ్లిద్దరి ఆకలిని తీరుస్తున్నాయి. గ్రామ సహాయకుడు పంట అజామాయిషీకి వస్తూ తన సహాయం కోరడంతో కొండంత ఆశ పుట్టుకొచ్చింది రామశాస్త్రికి. దూరం నుంచే ఖాజమియ్యా, నర్శితో పాటు వస్తున్న విలేజ్‌ అసిస్టెంట్‌ను చూచి ఇంట్లో నుంచి బైటకు వచ్చి నమస్కారం పెట్టిన రామశాస్త్రికి, ప్రతి నమస్కారంగా తల ఊపుతూ... కరచాలనం చేయడానికి చేయి చాపుతూ 'ఇదేనా శాస్త్రి మీ ఇల్లు' అన్నాడు. వయస్సులో పెద్దవాడైన తనని, బ్రాహ్మణుడైన తనని అలా పేరుతో పిలుస్తూ ఏక వచన ప్రయోగం చేయడం కలుక్కుమంది శాస్త్రికి. అయిష్టంగా అంటీ అంటనట్లు చేయి అందిస్తూ.. ''మంచినీళ్లు తాగుతారా టిఫిన్‌ చేశారా'' అడిగాడు ఆతృతగా. ''లేదు శాస్త్రి''

ప్రాణం లేచి వచ్చినట్లైంది రామశాస్త్రికి. ''ఒరే ఖాజా'' అని పక్కకు పిలిచి ''నువ్పు సర్పంచి దగ్గరకు వెళ్లి డబ్బు తీసుకొని చెప్పిన సరుకులు తీసుకురా త్వరగా వెళ్లు'' అంటూ తొందర పెట్టాడు.

''ఏమిటి? ఎక్కడికీ పంపుతున్నావ్‌ అతణ్ని'' అర్థం కాక అడిగాడు విలేజ్‌ అసిస్టెంట్‌. ''అబ్బే ఎక్కడికీ లేదు. మీరు కొద్దిసేపు కూర్చొండి. పది నిమిషాల్లో టిఫిన్‌ రెడీ చేయిస్తాను. మీరు నమ్మకంగా వస్తారని తెలియదు. లేకపోతే ఈ పాటికి టిఫిన్‌ రెడీగా ఉండేది. అరే నర్సిగా రెడ్డిగారింట్లోకెళ్లి కుర్చీ పట్టుకురాపో'' అని పురమాయించాడు.

''మీకా శ్రమెందుకండి హోటల్‌ ఏదైనా ఉంటే.. అక్కడే టిఫిన్‌ చేసి అజమాయిషీ పోదాం పదండి.'' అన్నాడు విలేజ్‌ అసిస్టెంట్‌. ఆ మాటకు కుర్చీల కోసం పోతున్న నర్సిగాడు ఆగిపోయాడు. ఎవరైనా అధికార్లు గ్రామానికి వస్తే వాళ్లకు వండి పెట్టే ఓపిక తీరిక లేని గ్రామం అది. అందుకే దానికి కావాల్సిన దినుసులన్నీ రామశాస్త్రికిస్తే భోజనం ఏర్పాట్లు చేసేవాడు. అలా తనూ ఓ ముద్ద పడేవాడు. ఈ మధ్యనే కొత్తగా హోటల్‌ పడటం, విలేజ్‌ అసిస్టెంట్‌ హోటల్‌కి వెళ్దామనటంతో రామశాస్త్రి ఆశకు దెబ్బ తగిలింది. జీవం లేని నవ్వుతో.. కోపాన్ని దిగమింగుతూ ''అలా చేస్తే సర్పంచ్‌కు తల కొట్టేసినట్లుంటుంది. ఆయన ఫీలవుతారు. ఎవరు ఆఫీసర్లు వచ్చినా మా ఇంటే చేయి కడగాల్సిందే.'' అని అన్నాడు రామశాస్త్రి.

బీదరికానికి చిహ్నంగా ఉన్న ఆ ఇంటిని, రామశాస్త్రిని చూసి అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టడమెందుకని మరేం ఫర్వాలేదు ''శాస్త్రి వెల్దాం పదా'' అంటూ మరో మాటకు ఆస్కారమియ్యకుండా ముందుకు నడిచాడు. కాని నిజమేమిటో తెలిస్తే అలా చేసుండేవాడు కాదేమో?

నోటి దగ్గరకొచ్చిన ముద్ద నేలపాలైనట్లు రామశాస్త్రి ముఖం పాలిపోయింది. చేసేది లేక ''టిఫిన్‌ అంటే వద్దన్నారు. భోజనమన్నా తప్పక తినాలి మా ఇంట్లో. హోటల్‌లో భోజనం దొరకదు'' అంటూ ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోకి నడిచాడు రామశాస్త్రి. రెండు చెంబులు నీళ్లు గుమ్మరించుకొని, చెంబుడు నీళ్లు తాగి ఆ తరువాత గ్లాసుడు పాలు తాగుతూ కడుపు నింపుకొంటున్న శాస్త్రిని చూచి కంట తడిపెట్టుకున్న భార్యను చూసి ''ఎందుకే పిచ్చిదానా ఏడుస్తావ్‌ మనకెంత ప్రాప్తమో అంత'' అంటూ తన కంట్లో నీళ్లు భార్యకు కనపడనీకుండా బయటకు నడిచాడు.

***

వాళ్లు హోటళ్లో టిఫిన్‌ చేస్తుంటే తానేం చేయాలని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ రామశాస్త్రి నడుస్తుంటే... సర్పంచ్‌ కోసం వెళ్లిన ఖాజామియ్యా వట్టి చేతుల్తో ఎదురయ్యాడు. ''ఏమైందిరా వట్టి చేతుల్తొ వచ్చావ్‌'' అన్నాడు ఆదుర్దాగా. ''ఇంట్లో సర్పంచ్‌ లేడు సామి పొలంకాడికి పోయినాడంట. మనం పోయేకాడ్నే కదా... ఆయన పొలం. ఆడ్నే అడుగుతా, నేను పొద్దుటే సద్దికూడు తిన్లా ఏదో ఒకటి తినొస్తా..!'' అంటూ ఖాజా కూడా హోటల్‌ వైపు వెళ్లాడు.

పెణం మీద దోసెల్ని నెయ్యి వేసి కాలుస్తుంటే వస్తున్న వాసన ఘుమఘుమలాడుతూ శాస్త్రి నాసికలకు తాకింది. దోరగా కాలుతున్న దోసెలపైన పప్పుల పొడి చల్లి లోపల ఆలుగడ్డ కుర్మాను చూసి శాస్త్రి నోట్లో నీళ్లూరాయి. బలవంతంగా దాని మీద నుంచి దృష్టిని మరల్చుకున్నాడు. అప్పుడే రామశాస్త్రిని చూసిన విలేజ్‌ అసిస్టెంట్‌ ''రా శాస్త్రి నువ్వు టిఫిన్‌ చేద్దువు''అన్నాడు. హోటల్‌ నుంచి వస్తున్న వాసనలు.. కడుపులో ఆకలి.. మనసును ఊరిస్తుంటే జిహ్వా చాపల్యాన్ని చంపుకోలేక ఓ అడుగు ముందుకు పడింది. కాని సంప్రదాయ, ఆచార వ్యవహారాలు, కులం అడ్డుగోలుగా నిలబడి ఆహాకారాలు చేస్తుంటే వాటిని దాటలేని అశక్తుడిగా రెండడుగులు వెనక్కి వేస్తూ... ''మీరు కానీయండి. నా టిఫిన్‌ అయ్యింది లెండి.'' అని అక్కడ నిలబడలేక వడివడిగా ముందుకు నడిచాడు. తన చేతగానితనంతో పస్తులుంటూ... భార్యను పస్తులతో చంపుతున్న నికృష్ట జీవితం చూసి విరకి ్తకలిగింది.. రామశాస్త్రికి. అజమాయిషీ పని మొదలైంది. కనుచూపు మేర ఉన్న సర్వే నెంబర్లు గురించి తెలుపుతూ పంట చెప్పసాగాడు. కొత్తగా వచ్చిన విలేజ్‌ అసిస్టెంట్‌కు అవగాహన లేకపోవటంతో అతను చెప్పింది రాసుకొంటున్నాడు. రామశాస్త్రి ఆలోచన్లన్నీ సర్పంచ్‌ దొరుకుతాడా? డబ్బులిస్తాడా? డబ్బులివ్వకపోతే?...ఖాజామియ్య కోసం చూపులు వెతుకుతున్నాయి. ఓ గంట గడిచిపోయింది. ఎదురు చూస్తున్న ఖాజామియ్యా వచ్చి సర్పంచ్‌ పొలం దగ్గర లేడని మామిడి తోట దగ్గరకు వెళ్లాడని చెప్పిన కబురు వినగానే రామశాస్త్రి వళ్లంతా సొమ్మసిల్లినట్లయింది. రామశాస్త్రికి ఆశ చావక మామిడి తోట దగ్గరికి పోలేక పోయావు అన్నాడు దీనంగా. దూరంగా చూస్తూ ''ఆ వస్తున్నది రామయ్యే కదూ'' అన్నాడు రామశాస్త్రి. దానికి తలూపాడు ఖాజా. తన పాలేరు పెద్ద పెద్ద చేపలు పట్టుకొని ముందు నడుస్తుంటే వాడి వెనకే గంభీరంగా నడుస్తూ వచ్చాడు రామయ్య. వాళ్లు దగ్గర పడగానే చేపల వాసనకు ముక్కు మూసుకున్నాడు రామశాస్త్రి. అది చూసి పాలేరుతో ''యాడికిరా అట్టా సామిమీదకి పోతుండావ్‌ సామికి తాకిస్తావా ఏంది'' అని గట్టిగా అరిచి రామశాస్త్రితో ఎవరు సామి ఆ కొత్తాయన అని అడిగాడు.

''మన ఊరికి కొత్తగా వచ్చిన విలేజ్‌ అసిస్టెంట్‌. పంట అజమాయిషీ చేయుస్తున్నా. అన్నట్లు ఆయనకు భోజనం ఏర్పాటు చేయాలి. సర్పంచ్‌ అందుబాటులో లేడు'' అంటూ నసిగాడు రామశాస్త్రి.

''సరే దానిదేముందిలే ఖాజాను పంపు డబ్బులిస్తా'' అన్నాడు. రామశాస్త్రికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. పెద్ద ఖజాన తన సొంతమైనట్లు ముఖం వెలిగిపోయింది. ఖాజాతో ''రామయ్య వెంట వెళ్లరా'' అన్నాడు సంతోషంగా. ''నమస్కారం సార్‌'' అంటూ విలేజ్‌ అసిస్టెంట్‌ చేతులు కలిపాడు రామయ్య. విలేజ్‌ అసిస్టెంట్‌ ప్రతిగా కరచాలనం చేస్తూ ''ఎవరు మీరు''అన్నాడు. శాస్త్రి కల్పించుకొని ''ఈయన రామయ్య అని ఈ ఊరికి పెద్ద మోతుబారి రైతు'' అని చెప్తుంటే, శాస్త్రి మాటలకు మధ్యలోనే దూరి ''నా పేరు రామయ్య అండి. సర్పంచ్‌ నాకు తమ్ముడు వరసౌవతాడు. అద్గదిగో ఆ కనపడే ఈత సెట్ల వరుకు ఉండే పాతికెకరాలు మాగాణి మనదే'' అన్నాడతను గర్వంగా.

''ఉహూ పెద్ద మోతుబరి రైతువేనన్నమాట. ఇత నెవరు మాంచి బొమ్మడాయిలు కొరమీన్లు పట్టుకొస్తున్నాడే'' అన్నాడు.. చేపల్ని చూస్తు విలేజ్‌ అసిస్టెంట్‌.

''ఈడు మా పాలేరులెండి. సెరువులో పట్టిండు. సెరువులో సేపలకు కూడా నేనే కాంటాక్టు తీసుకున్నాలే. దాంట్లో బొమ్మడాయిలు, కొరమీన్లే కాదు.. మట్టగిడెసలు వాలుగులు కూడా దండిగుండాయి. సేపల గురించి మీకు బాగా ఎరికైనట్టుండాదే సూడ గానే చెప్పేసారు.''

''అవును పిల్లప్పుడు సెలవుల్లో చెరువు దగ్గరికి పోతే నా మాదిరిగా చేపలు పట్టేవాళ్లు లేరు మా ఊళ్లో''

''అట్టాగా సేపలంటే సానా ఇట్టమున్నట్టుండాదే మద్దినేలకి భోజనానికి మా ఇంటికి రండి మా ఆడది బాగా రుచిగా సేస్తది.'' అని రామయ్య విలేజ్‌ అసిస్టెంట్‌ను భోజనానికి పిలవడంతో శాస్త్రి నెత్తిమీద బండ పడబోతున్నట్లనిపించింది. శాస్త్రి కొండచరియల మీద నుండి లోయలోకి పడిపోతున్న వాడిలా అయిపోయాడు. కడుపులో పేగులు అరుస్తున్నాయి. అతను చెప్పలేని బాధ తాము చెప్తున్నట్లు కాళ్లు చేతులు అతనిపై సమ్మె చేస్తున్నట్లు నడవడానికి సహకరించకపోవటంతో గట్టు మీద కూలబడ్డాడు కొద్ది సేపు. తరువాత యాంత్రికంగానే అజమాయిషీ చేసాడు ఒంటి గంట వరకు. సర్పంచ్‌ బోరు బావి దగ్గర మోటరాడుతుంటే కాళ్లు చేతులు కడుక్కొని ముఖం మీద నీళ్లు చల్లుకొని నీళ్లు తాగాడు కడుపునిండా. విలేజ్‌ అసిస్టెంట్‌ రామయ్య ఇంటికి భోజనానికి పోతూ ''శాస్త్రి ఈ అజమాయిషీ ఏమిటో నాకు తలకెక్కడం లేదు. ఈ సీజన్‌కు నువ్వే కానిచ్చేరు. నీ కష్టానికి తగ్గ ఫలితముంటుందిలే'' అన్నాడు.

అతడేమైనా డబ్బు ఇస్తాడేమోనని ఆశగా చూస్తుంటే.. అతని చూపుల్ని అర్థం చేసుకొన్న వాడిలా ''ఏమైనా కేసులుంటే తీసుకో నీకు అందులో అంతో ఇంతో ఇస్తాలే'' అన్నాడు విలేజీ అసిస్టెంట్‌.. ప్రస్తుతానికి ఏమి లేదన్నట్లు. విలేజ్‌ అసిస్టెంట్‌తో పాటు పోతున్న ఖాజామియ్యా ''దస్తరం మల్ల తెచ్చిస్తాలే'' సామి అంటూ వెళ్లి పోయాడు. శాస్త్రి ఒక్కడే నీరసంగా ఇంటి దారి పట్టాడు.

***

చీకటి పడింది. దీపం వెలిగించేందుకు నూనె కూడా లేని ఆ ఇళ్లు చీకట్లో గుహలా ఉంది. నిరాశగా నీరసంగా నులక మంచం మీద పడిపోయి ఉన్నాడు.. రామశాస్త్రి. అతని భార్య లోపల ఎక్కడో ముడుచుకొని పడుకొని ఉంది. కుక్కలు మొరుగుతుండడంతో ఎవరో వస్తున్న అలికిడి విని కూడా కళ్ళు తెరిచి చూసేందుకు ఓపిక లేక అలాగే ఉండిపోయాడు రామశాస్త్రి. అక్కడికి వచ్చిన ఖాజామియ్యా ఆ చీకట్లో ఏమి కనపడక జేబులోంచి అగ్గిపెట్టి తీసి వెలిగించి చుట్టూ పరికించి చూస్తూ ''సామి సామి'' అని పిలిచాడు.

పిలుపు విని 'ఏరా ఖాజా' అన్నాడు నీరసంగా మంచం మీద నుంచే. ఖాజా మంచం దగ్గరకొచ్చి చంకలో దస్త్రం కింద పెడ్తూ.. ''ఏంది అప్పుడే లాంతరులాపి నిద్రపోతుందారే'' అంటూ, మళ్లీ ఒక అగ్గి పుల్ల గీసి ఆ వెల్తురులో పీక్క పోయిన శాస్త్రి ముఖాన్ని చూసి చలించిపోయాడు. శాస్త్రి వారం రోజుల క్రితం ఇంట్లో బియ్యం నిండుకొన్నాయని... అతను పంపగా చాలా మంది దగ్గరికి పోయి వట్టి చేతుల్తో తిరుగొచ్చిన విషయం గుర్తుకొచ్చింది. అంటే వారం రోజుల్నుంచి శాస్త్రి, అతని భార్య పస్తులున్నారా?

కడుపులో ఏదో దేవినట్లన్పించింది ఖాజాకు. ''మీ వాలకం సూత్తుంటే సానా దినాలు నుంచి పస్తులున్నట్టుండారే? ఏంది సామి నువు సేసే పని. ఇట్టాగైతే మీరెట్టా బతుకుతారు. సదువు రానోళ్లే కూలి నాలి సేసుకొని బతుకుతుంటే మీరేంటి. కూటికి, గుడ్డకు రాని ఆచారం.. మడి మట్టి అని గిరి గీసుకొని పస్తుల్తో బతుకుతుండారు. బతికేందుకు సెడ్డ పని సేయకుండా... మిగితా ఏంది సేసినా తప్పేంటి'' అన్నాడు శాస్త్రి మీద జాలి పడుతూ.

శాస్త్రి నోటమాట రాక మౌనంగా ఉన్నా, ఆయన కంట్లోని నీళ్లు 'నేనేం చేయగలన్రా' అన్నట్లు ఉబికి చెంపల మీద నుంచి ధారాపాతంగా కారుతున్నాయి.

''ఏంది సామి పలకవు'' అని ఖాజామియ్యా అనగానే.. రామశాస్త్రి గుండెల్లోని దు:ఖాన్ని తమాయించుకొని ''నేనేం పాపం చేసానని నాకీ శిక్ష'' అంటూ బోరున ఏడ్వసాగాడు చిన్న పిల్లాడిలా!

ఖాజామియ్యాకు కంట్లో నీళ్లు తిరిగాయి. రామశాస్త్రి భుజం మీద చెయ్యి వేసి ఓదార్చి ఊరటనివ్వాలని మనసు ఉవ్విళ్లూరుతున్నా... చేతులు రాలేదు ముందుకు అంటూ మంటూ అడ్డొచ్చి.

''బాధ పడకండి. మగాళ్లే మీరట్టా బాధ పడితే ఎట్టా. నిన్నటి నుంచి మీ తపన సూసి ఏందో అనుకున్నా. మీరు పస్తులుండారని తెలిసి సావలా. మీరేం అనుకోకుంటే కొద్దిగా బియ్యం, కందిపప్పు, వెచ్చాలు తీసుకొత్తా. వంట సేసుకొని ఎంగిలి పడండి. నాను ఇంట్లోదేను లెండి. అంగట్లో తెస్తా. ఇట్టాంటి దారునం నేను చూడలేను.'' అని ఖాజా చెబుతుండగా ఆ మాటలకు తన మీద తనకే అసహ్యమేసింది.. రామశాస్త్రికి. కుక్కి మంచంలో లేవలేక లేచాడు.. కూరుకుపోయిన మౌఢ్యం ఊబిల్లోంచి బైటకి వచ్చినట్లు.

''వద్దురా! సరుకులు అవేమి ఇప్పుడొద్దు. అవి చేసే ఓపిక మీ అమ్మయ్యకు లేదు. కానీ, చూడు గువ్వలా ఎలా ముడుచుకుపోయి పడుందో. శ్రమ అనుకోక పోతే మీ ఇంట్లోనే ఇంత అన్నం, కూరా చేసుకొని తీసుకొని రారా'' అన్నాడు. కన్నీళ్లు కారుతుంటే బొంగుర గొంతుతో. ''సామి...!'' అన్నాడు ఖాజామియ్యా గద్గద కంఠంతో చితికిన బతుకుల దీనస్థితి చూసి!

''అవునురా! నువ్విన్నది నిజమే. అంతే కాదు ఇంతకు ముందు నువ్వన్నదీ నిజమే. కూడు గుడ్డా పెట్టలేని వాటి కోసం పాకులాడటమెందుకురా! మనిషిని మనిషిలా చూడలేని ఈ మూఢత్వమెందుకురా! బతికేందుకు ఏదో ఒకటి చేస్తా. అందరిలో కలుస్తా..!'' అన్నాడు రామశాస్త్రి.. ఖాజా భుజం మీద చేయి వేస్తూ కృతజ్ఞతగా! పాడ్యమి నాటి చంద్రుడు ఆలస్యంగా ఆకాశం మీదికి వస్తున్నాడు.... చీకటి తరిమేస్తూ వెన్నెల్ని నింపుతూ!

- శేష చంద్ర

9440581463


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.