పిలుపు

‘అమ్మా! నాన్నగారు వెళొస్తాం’

‘అదేంటిరా అబ్బాయి! పెళ్ళై మూడు రోజులైనా కాలేదు, అప్పుడే తిరుగు ప్రయాణమవుతున్నావు? కనీసం వారమైనా ఉండకుండా వెళిపోతున్నావు! ఏం బాగోలేదురా , అయినా అదేం ఉద్యోగంరా మరీను...’

ఇలా పెళ్ళైందో లేదో అలా నెల్లూరు బయలుదేరుతున్న కొడుకుని చూసి వాపోయారు అత్తయ్య నర్మద.

‘ఏం చేయనమ్మా? ఒక ప్రోజెక్టు గురించి అర్జంటుగా ఢిల్లీ లో మీటింగు ఉంది రమ్మని పై ఆఫీసరు ఫోను. ఒకరి దగ్గర చాకిరీ మరి, తప్పదు. నువ్వు బెంగపడకు . మళ్ళీ త్వరలోనే కలుసుకుందాము . అప్పుడు కచ్చితంగా పదిహేను రోజులు ఉంటానుగా నీ దగ్గర, సరేనా!’ దిగులుపడుతున్న అత్తయ్యని కౌగలించుకుని ఓదార్చి కాళ్ళకి నమస్కరం చేస్తున్న విభవ్ ని చూస్తే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాలకి చనువుకి నాకెంతో సంతోషం కలిగింది.

నా ఆలోచనలు ఒక్కసారిగా నా పుట్టింటివైపుకి మళ్ళాయి.........

నాన్నగారు మమ్మల్ని కఠినమైన కట్టుదిట్టాల్లో పెంచారు. ఆయన మాటకి మా ఇంట్లో ఎదురు మాట్లాడేవాళ్ళము కాము . నేను పుట్టగానే, తొలిచూలు మగపిల్లవాడు కాకుండా, ఆడపిల్ల పుట్టిందని నాన్నగారు నిరాశపడ్డారుట. అటువంటప్పుడు పేరు మాత్రం లక్ష్మీస్వరూప అని ఎందుకు పెట్టారో ????

నేను ఇంటికి పెద్ద కూతురిని అనేది నామ మాత్రంగానే! సాధారణంగా ప్రథమ సంతానానికి అన్ని ఇళ్ళల్లో దొరికే మాదిరి ఆప్యాయత దర్జా లేశమాత్రంగానైనా నాకు దొరకలేదు!! నా తరువాత ముగ్గురు తమ్ముళ్ళు. వాళ్ళని మాత్రం మహరాజుల్లా చూసేవారు. ఎందులోనూ వాళ్ళకిచ్చినంత స్వేచ్చ కూడా నాకు ఇవ్వలేదు ఎప్పుడూ . కానీ నాకు చదువు మాత్రం చెప్పించారు. అది కొంతలో కొంత నయం ...

అమ్మ సంగతి సరేసరి. ఆవిడొక యంత్రమే ఆ ఇంట్లో ! తనేదో తన లోకమేదో .....నాన్నగారు చెప్పినది విని తలూపడం తప్ప ఎప్పుడూ ఆయన అన్నదానికి ఆవిడ సమాధానం చెప్పగా కూడా నేను చూడలేదు. అసలు ఆయన చాలా విషయాలు అమ్మతో చెప్పేవారే కాదు! ఆవిడకి వాళ్ళ ద్వారా వీళ్ళద్వారా తెలియాల్సిందే....

ఆఫీసు ఇంటికి దగ్గర కావడం వలన నాన్నగారు మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేవారు. ఆ సమయంలో మాకు సెలవై మేము ఇంట్లో ఉన్నప్పుడు అందరం ఎక్కడివాళ్ళక్కడనే గప్...చుప్.... సూది నేలమీద పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం తాండవించేది ...అంత భయం ఆయనంటే మాకు.

పుట్టింటిలో గడిచిన నా 22 సంవత్సరాల జీవితంలో ఒక్కనాడు కూడా అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకుని గానీ, నాన్న మమ్మల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం గానీ ఎరగను నేను.....ఎప్పుడూ మమ్మల్ని మోచేతి దూరంలోనే ఉంచారు ఆయన... ఎక్కువగా చనువిస్తే నెత్తికెక్కుతామని భయపడేవారేమో తెలియదు.

అలాగని పూర్తిగా మాపట్ల నిర్లక్ష్యంగా ఉండేవారా అంటే అదీ కాదు... మమ్మల్ని దగ్గర కుర్చోబెట్టుకుని చదివించడం, మా సందేహాలు తీర్చడం...ఇత్యాదివన్నీ చేసేవారు.... అంతే..అంతకు మించి చనువు ఇవ్వలేదు ఎప్పుడూ!!!! అందువల్లనేనేమో నాకు ఎవరి ఎదుటైనా మాట్లాడాలంటేనే బెరుకుగా ఉంటుంది. నేను పెరిగిన వాతావరణానికీ ఇక్కడ అత్తవారింట్లో చూస్తున్నదానికీ హస్తిమశకాంతరం తేడా పైగా ఇక్కడ అందరూ నాకు కొత్త కూడా.......!!!

‘రూపా.. రూపా.... ఏమాలోచిస్తున్నావు?’ అంటూ భర్త విభవ్ అనురాగపూరితమైన పిలుపుతో ఆలోచనలలోంచి బయట పడి ‘ఏమీ లేదు’ అన్నట్లుగా తల ఊపి మామయ్య కాళ్ళకి నమస్కారం చేసి ‘వెళ్ళొస్తామండీ’ అన్నాను.

‘సౌభాగ్యవతీ భవ’ ఆశీర్వదించారు మామయ్య.

‘లక్ష్మీ ! మీరిద్దరూ అరమరికలు లేకుండా కలిసిమెలసి ఉండాలి సరేనా?’

అత్తయ్య చెప్పిన తీరుకి ఆ పిలుపులోని ఆప్యాయతకి నాకు చెప్పలేని సంతోషం కలిగింది.

‘అలాగే అత్తయ్యా’ అంటూ వంగి ఆవిడ కాళ్ళకి కూడా నమస్కరం చేయబోతున్న నన్ను మధ్యలోనే ఆపి దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు.

ప్రక్కనే నిలబడి నాకేసి దిగులుగా చూస్తున్న అపర్ణ నా దగ్గరగా వచ్చి చేతులు పట్టుకుని ‘వదినా ఇంకొన్ని రోజులు ఉండకూడదూ..’ అంది.

అపర్ణ , విభవ్ చెల్లెలు, అంటే నా ఆడపడుచు. ఇద్దరం సమవయస్కులమే అయినప్పటికీ తను నన్నుపేరు పెట్టి కాకుండా ప్రేమగా వదినా అని పిలవడం నాకెంతో నచ్చింది. అపర్ణ అభిమానానికి గొంతులో ఏదో అడ్డుపడ్డట్లై మాట పెగలలేదు. ఆప్యాయంగా అపర్ణను దగ్గరకు తీసుకున్నాను.

ఈ క్రొత్త రకమైన అభిమానము ఆప్యాయత అనురాగాలని విడచి దూరంగా వెళుతుంటే నా హృదయంభారమైంది. అందరి వద్దా వీడ్కోలు తీసుకుని బయలుదేరాము.....!+!+!+!

క్రొత్త కాపురం. అంతా సర్దుకుని తేలేటప్పటికి వారం రోజులు పట్టింది. ఆ రోజు ఆదివారం. క్రితం రాత్రి విభవ్ ఆఫీసునుండి ఆలస్యంగా వచ్చారు. భోజనాలు కూడా ఆలస్యమై పడుకునేటప్పటికే అర్థరాత్రి దాటింది. ఉదయం మెలకువ వచ్చి టైం చూసాను.

‘అమ్మయ్యో అప్పుడే ఎనిమిదయ్యిందా’ అనుకుంటూ గబ గబా ముఖం కడుక్కుని హాలులోకి వచ్చాను.

విభవ్ ఎవరితోనో ఫోనులో మాట్లాడుతున్నారు.

‘రూపా ఇద్దరికీ టీ కలిపాను. నేను త్రాగేశాను. నీకు ఫ్లాస్కులో ఉంచాను’ అని చెప్పి మళ్ళీ ఫోన్ మాట్లాడ సాగారు

‘హలో ! కళ్యాణిగారూ నిద్ర లేచారా? మీరు బాబుగారు కాఫీ త్రాగడం అయిందా?’

వంటగదిలోకి వెళుతుంటే వెనకనుండి విభవ్ స్వరం వినిపిస్తోంది నాకు

‘కళ్యాణి ఎవరో? బాబుగారెవరో?’ అనుకున్నాను కానీ అడగాలంటే బెరుకు అడ్డుపడింది.

వాళ్ళెవరోగానీ చాలా సేపు మాట్లాడారు విభవ్....

పది రోజుల తరువాత ఒకనాడు రాత్రి మేము భోజనాలై పడుకున్నాము. సమయం పదకొండు గంటలయింది. కాలింగ్ బెల్ మ్రోగింది.

‘ఈ సమయంలో మనింటికి వచ్చే వాళ్ళెవరో?’ అని లేవబోయాను .

‘నేను చూస్తాను నువ్వు పడుకో’ అంటూ లేచి తలుపు తీయడానికి వెళ్ళారు.

నేను కూడా లేచి జుట్టు , దుస్తులు సవరించుకుని విభవ్ వెనకాలే హాలులోకి వచ్చి చూస్తే ఎదురుగా అత్తయ్య మామయ్య నవ్వుతూ నిలబడి ఉన్నారు.

నేను ఆశ్చర్యం నుండి తేరుకునేలోగానే “అహా! ఏమి నా భాగ్యము! కళ్యాణి గారూ, బాబుగారూ ఇలా చెప్ప పెట్టకుండా వచ్చారేమిటో?’ అంటూ విభవ్ ఇద్దరినీ ఆనందంగా చుట్టేసి కబుర్లు మొదలు పెట్టేశారు.

నేను కూడా గబ గబా వెళ్ళి వాళ్ళ చేతిలోని సామాను అందుకుని ఇద్దరికీ నమస్కారం చేశాను.

‘అయితే విభవ్ ఫోనులో కళ్యాణిగారు, బాబుగారు అంటూ మాట్లాడిన వ్యక్తులు అత్తయ్యా మామయ్యానా? అదేమిటీ విభవ్ తల్లిదండ్రులని అలా పేరు పెట్టి పిలుస్తున్నారేమిటీ?అయినా అసలు వాళ్ళ పేర్లు అవి కాదుగా?

అదలా ఉంచితే పేర్లు పెట్టి సంభోదించినందుకు ఆ పెద్దవాళ్ళకి కోపం రాకపోగా అంత ఆనందంగా నవ్వుతున్నారేమిటీ? ఏమిటో అంతా అయోమయంగా ఉంది’ అనుకుంటూ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడానికి వంటింటివైపు కదిలాను.

‘లక్ష్మీ మేము వచ్చేటప్పుడు భోజనం చేసే వచ్చాము. నువ్వు ఇప్పుడేం శ్రమ పడకు. రా ఇలా వచ్చి కూర్చో’ అన్న అత్తయ్య పిలుపువిని వచ్చి వాళ్ళ ప్రక్కనే సోఫాలో కూర్చున్నాను.

‘రూపా , అమ్మా వాళ్ళకి పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను, నువ్వు మాట్లాడుతుండు’ అని విభవ్ లోపలికి వెళ్ళారు.

పెద్దవాళ్ళిద్దరూ పడుకున్నాక హాలులోకి వచ్చిన విభవ్ తో ధైర్యంచేసి ‘అదేమిటి మీరు అత్తయ్య మామయ్యని అలా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. తప్పుకాదా, వాళ్ళు బాధపడరూ?’ అన్నాను.

అమాయకంగా నేను అడిగిన ప్రశ్నకి ‘అదా ..అదీ...’ అని ఏదో చెప్పబోయారు

‘’అయినా అత్తయ్య పేరు నర్మద , మామయ్య పేరు విశ్వనాథ్ కదా?’ మళ్ళీ సందేహం వెలిబుచ్చాను

ఇంతలో అత్తయ్య గదిలోంచి వస్తూ ‘‘నీ సందేహం నేను తరువాత తీరుస్తానుగానీ ముందు మామయ్యకు ఇంకో మెత్తటి దిండు కావాలిట ఇస్తావా?’ అంటూ సోఫాలో కూర్చున్నారు. మా సంభాషణ విన్నట్లుగా ఆవిడ చిరునవ్వు చెబుతోంది.

అల్మైరా లో పెట్టిన మెత్తటి దిండు ఒకటి తీసి మామయ్యకు ఇచ్చివచ్చాను.

‘వీడికి మామీద ప్రేమ ఉప్పొంగి పొర్లినప్పుడల్లా అలా ముద్దుగా నన్ను మామయ్యను పేర్లు పెట్టి సంభోదిస్తుంటాడు. ఇది మాకేం కొత్త కాదు. చిన్నప్పటినుండీ ఇంతే. వాడికి మేమిద్దరం పంచప్రాణాలని , అంతకు మించిన భక్తి గౌరవం అనీ మాకు తెలుసు. అందుకే వాడు సరదా కొద్దీ అలా పిలిస్తే తప్పేముందిలే అనుకున్నాము’ మురిపెంగా కొడుకువైపు చూసి అన్నారు అత్తయ్య. ఆవిడ చూపులో విభవ్ పట్ల ప్రేమానురాగాలు తొణికిసలాడుతున్నాయి.

‘కానీ మీ పేరు కళ్యాణి కాదుగా? మామయ్య పేరు బాబు కాదుగా?’ నా సందేహాలకి అంతున్నట్లుగా నాకే అనిపించడం లేదు.....

‘ఓహ్! అదా! మా అత్తగారు అంటే విభవ్ నాయనమ్మ నన్ను కళ్యాణీ అని మీ మామయ్యను బాబూ అని పిలుస్తుండేవారు. చిన్నప్పటినుండీ ఆ పిలుపులు వినీ వినీ వీడు కూడా మమ్మల్ని సరదాగా అప్పుడప్పుడూ, అదే చెప్పాగా నీకు , వాళ్ళ నాయనమ్మలాగే పిలవడం మొదలుపెట్టాడు’

‘మరి మొదటిసారి అలా పిలిచినప్పుడు మీకు కోపం రాలేదా?’

‘నిజం చెప్పాలంటే వచ్చిందనుకో కానీ విభవ్ అలా పిలిచినప్పుడు వాడి భావాలలో లేశమంతైనా అమర్యాద కనిపించలేదు సరికదా వాడు వాళ్ళ నాయనమ్మను అనుకరిస్తూ చిలిపిగా పిలుస్తున్నాడని అర్థమై హాయిగా నవ్వుకున్నాము. అలా అలా అలవాటైపోయింది’

‘నీ సందేహాలు తీరాయా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంక అమ్మ వెళ్ళి పడుకోవచ్చా’ నవ్వుతూ అన్నారు విభవ్

‘తీరాయి’ అని సిగ్గుగా నవ్వి ‘సారీ! అత్తయ్యా ఇంక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ’ అని మంచినీళ్ళు త్రాగుదామని వంటగదిలోకి వెళ్ళాను.

పడుకున్నానన్న మాటేగానీ ఒకంతట నిద్ర పట్టలేదు. ఒక కుటుంబంలో ఒకరినొకరు పిలుచుకునే ,పలకరించుకునే పిలుపులో ఇంత మాధుర్యం దాగి ఉంటుందా? ఇది నాకు క్రొత్త అనుభవం.

ఆడవాళ్ళంటే చులకన అభిప్రాయం ఉన్న నాన్నగారు, ఆయన పంథాలోనే నడిచిన ముగ్గురు తమ్ముళ్ళూ ..ఏనాడూ నన్ను ఆప్యాయంగా పిలవగా విని ఎరుగను నేను...నాకు అందమైన పేరు లక్ష్మీస్వరూప అని పెట్టినా

‘లచ్చూ ఎక్కడున్నావే?’ అంటూ నాన్నగారు, అంతకంటే అధ్వాహ్నంగా, అక్క అని పిలవకపోగా , నాన్నగారు ఇంట్లో లేని సమయం చూసి, కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ‘ఏయ్....ఓయ్......’ అంటూ హుకుం చెలాయించిన తమ్ముళ్ళ మధ్య భయపడుతూ పెరిగిన నాకు ఇక్కడ అత్తవారింట్లో సభ్యుల మధ్య పరస్పర అనురాగం , పిలుపులోనే తొంగిచూసే ఆప్యాయత చూస్తుంటే మన అనుకునే వారి నోటినుండి మనకోసం వచ్చే ఒక కమ్మనైన పిలుపు మనసుకి ఎంత ఆనందం కలుగజేస్తుందో ,అనుబంధాలను ఎంత పఠిష్ఠం చేస్తుందో తెలిసింది........

‘అమ్మలూ ! లక్ష్మీ’ అని నాన్నగారి ప్రేమపూర్వకమైన పిలుపు , ‘అక్కా..అక్కా...’అంటూ తమ్ముళ్ళ ఆప్యాయభరితమైన పిలుపు వింటున్నట్లు ఆనందంగా ఊహించుకుంటూ......నాకు తెలియకుండానే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను.........

*****సమాప్తం*****

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.