మహిళలే గొప్ప

ఈ కథ 09/02/2014 తేదీన ఆంద్రభూమి మెరుపు శీర్షికలో ప్రచురితమైంది

అదొక పల్లె. అక్కడ వీరయ్య, సన్యాసమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరయ్య రోజూ తాగి వచ్చి సన్యాసమ్మ మీద అరిచేవాడు. ఈ విషయం ఊరిలో ఉన్న ఉపాధ్యాయుడు వెంకటరమణాచారికి తెలిసింది. వెంటనే వాళ్ళింటికి వెళ్లాడు. వెంకటరమణను ఊరిలో వారంతా దేముడిలా పూజించి గౌరవిస్తారు.

వెంకటరమణగారిని చూసిన వీరయ్య ‘‘నమస్తే...మాస్టారండీ...మీరేంటి మా ఇంటికొచ్చారు’’ అన్నాడు తూలుతూ. ‘‘నువ్వు రెండు రోజుల నుండి పనిలోకి వెళ్ళకుండా ఇలా నడిరోడ్డు మీద అరుస్తూ ఇల్లాలిని అల్లరి చేయడం ఏమైనా బాగుందా? నువ్వు ఈ విధంగా తాగుతూ ఉంటే పొట్టగడిచేది ఎలా? పని చేసేది ఎలా? నీ ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది’’ అని మృదువుగా హితబోధ చేస్తాడు.

‘‘మాస్టార్ గారండీ! మీరంటే నాకు ఎంతో గౌరవం. నేను తాగొస్తే నా సన్యాసమ్మ నన్ను తిడుతుంది. నా డబ్బు నేను తాగితే తప్పా చెప్పండి....మాస్టారండీ అసలు ఆడోళ్ళ గొప్పేంటో నాకు ఈ రోజు ఇప్పుడే తెలియాలి’’ అన్నాడు.

దానికి తెలుగు పండితుడు బాగా ఆలోచించాడు. ‘‘మగవాడు అనే పదానికి మరో పదం చెప్పు అన్నాడు’’

‘‘పురుషుడు, యువకుడు’’ అని రెండు పదాలు చెప్పాడు వీరయ్య.

‘‘వీరయ్యా నువ్వు మగవాడికి రెండు పదాలే చెప్పగలిగావు...

అదే ఆడవారికైతే అంగన, అంచయాన, అంబుజలోచన, అంబుజవదన, అంబుజాక్షి, అంబుజావన, అంబురుహాక్షి, అక్క, అతివ, అన్ను, అన్నువు, అన్నువ, అబల, అబ్జనయన, అబ్జముఖి, అలరుబోడి, అలివేణి, అవ్వ, ఆడది, ఆడకూతురు, ఆడబుట్టువు, ఇంచుబోడి, ఇతి, ఇందీవరాక్షి, ఇభయాన, ఇందునిభాస్య, ఇందుముఖి, ఇందువదన, ఇగురాకుబోణి, ఇగురుబోడి, ఇభయాన, ఉగ్మలి, ఉజ్జ్వలాంగి, ఉవిద, ఎలతీబోడి, ఎలనాగ, ఏతుల, కంజముఖి, కంబుకంఠి, కంబుగ్రీవ, కనకాంగి, కన్నులకలికి, కప్పులగంధి, కమలాక్షి, కరబోరువు, కర్పూరగంధి, కంకంఠి, కలశ్వసని, కలికి, కలువకంటి, కళింగ, కాంత, కించిద్విలగ్న, కిన్నెరకంది, కురంగనయన, కురంగాక్షి, కువలయాక్షి, కూచి, కృశమధ్యమ, కౌశిని, కొమ, కొమరాలు, కొమిరె, కొమ్ము, కోయ, కోమలాంగి, కోమలి, క్రాలుగంటి, గజయాన, గరిత, గర్తి, గుబ్బలాడి, గుబ్బెత, గుమ్మ, గోతి, గోల, చంచరీకచికుర, చంచలాక్షి, చంద్రముఖి, చంద్రవదన, చక్కనమ్మ, చక్కెరబొమ్మ, చక్కెర, ముద్దుగుమ్మ, చాన, చామ, చారులోచన, చిగురుటాకుబోణి, చిగురుబోడి, చిలుకలకొలికి, చెలి, చెలియ, చెలువ, చెడియ, చోరబుడుత, జక్కవచంటి, జని, జలజనేత్ర, జోటి, ఝషలోచన, తనుమధ్య, తన్వంగి,తన్వి, తమ్మికంటి, తరళలోచన, తరళేక్షణ, తరుణి, తలిరుబోడి, తలోదరి, తాటుకవతి, తాటంకిని, తామరకంటి, తామరసనేత్ర, తియ్యబోడి, తీగబోడి, తెరవ, తెలిగంటి, తొగవకంటి, తొయ్యలి, తాయజలోచన, తోయజాక్షి, తోయలి, దుండి, ధవళాక్షి, ననబోడి, నళినలోచన, నళినాక్షి, నవల, నాంచారు, నాచారు, నాచినాతి, నాతుక, నారి, నితంబవతి’’ ఆగకుండా చెప్పాడు మాస్టారు.

అలా మొత్తం 294 పేర్ల వరకు చెప్పగానే ఒక్కసారిగా వీరయ్య కళ్ళు తిరిగినట్లు అనిపించింది.

‘‘మగవారికి కనీసం పది అర్ధాలు కూడా లేవు. అది ఆడవాళ్ళ గొప్ప. అందుకే మనం ఆడదేవతలను, ఆడవారిని గొప్పగా పూజిస్తాం. అంతే కాకుండా మీ వంశం అభివృద్ధి చెందడానికి ఆడవాళ్లే కావాలి. ఈ సృష్టిలో గొప్పది స్ర్తి ఒక్కటే’’ అని చెప్పగానే వీరయ్య వెంకటరమణ కాళ్ళమీద పడి

‘‘క్షమించండి సారూ... నా ఆడదాన్ని ఇప్పటికే చాలా బాధపెట్టాను... ఇక నుండి నా భార్యను ఏమీ అనను, అసలు తాగుడు జోలికి పోను’’ అన్నాడు. అప్పటికే అక్కడ నిలబడి కళ్ళింత పెద్దవి చేసుకుని చూస్తున్న సన్యాసమ్మ దగ్గరకు వెళ్లి నాకు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయే... నీ ఇలువ నాకు తెలిసిందే... మగాడి కంటే మీరే గొప్పొళ్లు... మీరు దేవతలు... మా ఇంటి శ్రీలక్ష్ములు అంటూ ఆమెను పొగుడుతాడు వీరయ్య.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.