గడుసు కాకికి గడిచిన గండం (బాలల కథ)

(ఈ కథ ఆంధ్రభూమి మెరుపు శీర్షికలో ప్రచురితమైంది)

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి చివర ఒక ఇల్లు. దానిని ఇల్లు అనేకంటే తోట అంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ అన్ని రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటి నిండా రంగు రంగుల పూలు. రకరకాల పండ్లు, పిచ్చుకలు, కాకులు, చిలుకలు, గోరువంకలు, ఇంకా రకరకాల పక్షులు ఆ చెట్లకొమ్మల్లో గూళ్లు కట్టుకొని ఉంటున్నాయి. పక్షులే కాదు ఉడుతలు కూడా సందడి చేస్తుంటాయి. సీతాకోకచిలుకల సంగతి వేరే చెప్పాలా!

ఆ ఇంట్లో, అదే ఆ తోటలో పసి అనే ఓ చిన్న అమ్మాయి ఉంది. రోజూ పొద్దునే్న ఆ పక్షుల కూతలు, అరుపులతోనే పసి నిద్రలేస్తుంది. నిద్రలేచి పక్షుల సందడి వింటూ, ఆనందిస్తూనే కొద్దిసేపు బడిలో చెప్పిన పాఠాలు వల్లెవేస్తుంది. తన పనులన్నీ పూర్తి చేసుకుని బడికి తయారవుతుంది. ఇంతలో పసి నాయనమ్మ అల్పాహారం సిద్ధం చేస్తుంది. పసి దానిని ప్లేటులో పెట్టుకుని ఇంటి పంచలోకి చేరుతుంది. అంతే! ఠంచనుగా రెండు కాకులు వచ్చి పసికి దగ్గరలో వాలతాయి. అప్పుడప్పుడు అతిథిలా మూడో కాకి కూడా వస్తూంటుంది.

పసి తను తినేది ఏదైనా సరే చిన్నచిన్న ముక్కలు చేసి కొన్ని ముక్కల్ని కాకులకు వేస్తుంది. ఇలా చాలాకాలంగా జరుగుతోంది. రెండు కాకుల్లో ఒకటి తనకు అందినది తిని తృప్తిపడేది. రెండో కాకి గడుసుది, ఆశపోతుది. పసి వేసిన ఆహారంలో అధిక భాగం గడుసు కాకి గబుక్కున ముక్కున కరుచుకుని ఎగిరి వెళ్లి అవతల ఎడంగా వాలేది. పసి మరో ముక్క విసరగానే మళ్లీ రివ్వున వచ్చి తన నేస్తం అందుకోబోయే ముక్కనూ టక్కున తానే తన్నుకుపోయేది. పాపం! మొదటి కాకి ఉసూరుమని చూసేది. గోలచేసేది కాదు. పసికి జాలేసి దానికి దగ్గరగా పడేలా మరికొన్ని ముక్కల్ని విసిరేది.

ఇది చూసి పసివాళ్లీ నాయనమ్మ ‘నీకు పెట్టేదే కాస్త. బతిమాలగా బతిమాలగా అందులో నువ్వు తినేది కొద్ది. కాకులకూ, పిట్టలకూ పందేరం జాస్తి’ అని పసిని అరిచేది. ఆమె అరుపులకి పసి పకపక నవ్వేది. వీళ్ల గోలకి బెదిరిన కాకులు ఏ చెట్టు కొమ్మలమీదనో వాలి ఇంకో ముక్క ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేవి.

ఇలా జరుగుతుండగా, ఒకరోజు అల్పాహారంలోకి క్యారెట్ కూర చేసింది పసి నాయనమ్మ. అలవాటు ప్రకారం పసి చపాతీ ముక్కలతో పాటు క్యారెట్ ముక్కలు కూడా కాకులకు వేసింది.

ఎప్పటిలాగే గడుసు ఆశపోతు కాకి హడావుడి చేస్తూ ఆ ముక్కల్ని ఆత్రంగా గబగబా ముక్కున కరుచుకు వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఈ తొందరలో క్యారెట్ ముక్కలు గొంతులోకి జారాయి. గొంతులో అడ్డం పడ్డాయి. అంతే! ఆశపోతు కాకి అయోమయంలో పడిపోయింది. కక్కలేదు, మింగలేదు, అరవలేదు, అటు గెంతింది, ఇటు గెంతింది. మెడ సాచి అరవబోయింది. ఏమిచేసినా ఆ ముక్కలు దాని గొంతులోంచి బయట పడలేదు. లోపలికి పోలేదు. దాని నోరు మూత పడలేదు. గిలగిలలాడిపోతోంది.

నేస్తపు కాకి దాని బాధను చూసి తల్లడిల్లిపోయింది. నిలువునా కరిగిపోయింది. దాని చుట్టూ చుట్టూనే తిరుగుతోంది. వాటి భాషలో ఏదేదో చెపుతోంది. పసి కూడా కంగారుగా, ఏమవుతుందోననే ఆందోళనతో వాటినే చూస్తోంది. ‘స్కూల్ టైమ్ అయింది. నీ టిఫిన్ ఎంతసేపు? కానీ తొందరగా. తినకుండా అలా దిక్కులు చూస్తావేం?’ అని గట్టిగా అరుస్తోంది పసి నాయనమ్మ.

‘ఉండమ్మా!’ అన్నదే గాని, పసి చూపుల్ని కాకుల నుండి తిప్పలేదు. ఆ కాకికి ఏమవుతుందోననే పసి ఆందోళన. వాటినే చూస్తోంది.

మొదటి కాకికి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. చుట్టూ చూసింది. చివర్న చిన్న వంపు తిరిగిన పొడుగాటి గట్టిపుల్ల ఒకదాన్ని తెచ్చి కాలి కింద పెట్టుకుంది. గడుసు కాకి ఇదేం పట్టించుకునే స్థితిలో లేదు. మొదటి కాకి గడుసు కాకితో గొడవ పెట్టుకుంది. ముక్కుతో పొడిచి, కాళ్లతో తన్నబోతోంది. అమాయకంగా మెత్తగా ఉండే దీని చేష్టలకి గడుసు కాకి ఆశ్చర్యపోయింది. అసలే కిందా మీదా పడుతూ తలకిందులవుతున్న దానికి అంతలోనే బాగా కోపం వచ్చింది. పెద్దగా అరిచేందుకు ప్రయత్నిస్తూ నోరు బాగా తెరచి మొదటి కాకి మీదకు ఎగబడింది. మొదటి కాకి సరైన అదను చూసి కర్రపుల్లను గడుసు కాకి నోట్లోపెట్టి మెల్లిగా నెట్టింది. దాంతో క్యారెట్ ముక్కలు గొంతులోంచి దాని పొట్టలోనికి జారిపోయాయి. అంతే! గడుసు కాకి బాధ చటుక్కున మాయమయింది. మెడ అటూ ఇటూ తిప్పింది. హాయిగా రెక్కలు ఆడించింది. ‘కావ్.. కావ్..’ అని అరిచింది.

అంతవరకూ ఊపిరి బిగపట్టుకొని చూస్తున్న పసి ‘హమ్మయ్య!’.. అంటూ గబగబా తన అల్పాహారం తినడం పూర్తిచేసి స్కూలుకు వెళ్లిపోయింది. తన గడుసుదనం, దురాశ వలన కలిగిన ముప్పును, స్నేహితుని మంచితనం వలన కలిగిన మేలును ఆశపోతు కాకి తెలుసుకుని తన బుద్ధిని మార్చుకుంది. అప్పటి నుండి ఏ ఆహారాన్ని అయినా చెరిసగంగా పంచుకుని హాయిగా, ఆనందంగా తినేవి ఆ రెండు కాకులు.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.