ఒక మధుర జ్ఞాపకం

.... వాయుగుండ్ల శశి కళ

''ఓయ్ బుజ్జి తల్లి ఈ రోజు మీ నాన్న వస్తున్నాడు తెలుసా ?''

చిన్ని కళ్ళు తెరిచి నన్ను చూసి అయితే నాకేంటి అన్నట్టు

ఆవలించి మళ్ళా పడుకుంది నెల రోజుల పాప . తాకుతుంటే ఎంత

మెత్తగా రబ్బరు బొమ్మ లాగా . అప్పుడే ఇది పుట్టి నెల దాటి పోయింది .

ఏమి వి . ఐ . పి ఇది ఇంట్లో వాళ్ళందరికీ . అమ్మకు సరె....

ఇక అమ్మమ్మకు ముద్దుల మొదటి మనుమరాలు . ఇక మా చెల్లికి

అయితే దీని సపర్యల తోనే సరిపోతుంది . రోజుకు ఒక గౌన్ వేయడం ,

మేకప్ చేయడం ..... అబ్బో ఈవిడగారు ఇప్పుడు మా అమ్మగారింట్లో

పెద్ద యువరాణి . ఇంతా చేస్తే మూడు కిలోలే !ఎవరికి తల వంచని

మా నాన్న కూడా దీని ఏడుపు వినగానే జీ హుజూర్ అని వచ్చేస్తాడు .

''ఏమి చేస్తుందే మాధురి ?''అమ్మ వచ్చి కూర్చుంది . వంట అయిపోయింది

కాబోలు . వంట కాకపోయినా అరగంటకు ఒక సారి దాన్ని చూడందే తోచదు

అమ్మకు ఈ నెల రోజుల నుండి .

''మాధురి యువరాణి గారు నిద్ర పోతున్నారు '' నవ్వి చెప్పాను .

'' దీని మూతి చూడవే వాళ్ళ నాయనమ్మ చెప్పినట్లు పి . టి . వక్క అంత

గుండ్రంగా , పెదాలు చూడు ఎంత రోజా రంగులో ఉన్నాయో !''

బాగానే ఉంది కిరాణాషాప్ వాళ్ళు అయితే మాత్రం వక్కలతో ,తమల పాకులతో

పోలుస్తారా ?ఒకటి నిజం దీని పెదాలు నిజంగానే గులాబి రంగులో ...

చాలా మంది దగ్గర నేను అవి చూడలేదు . ఇది నాకే అపురూపం .

''సర్లేవే అది నిద్ర పోయేటప్పుడే నువ్వు కూడా నిద్ర పో . మళ్ళా బాలింతవి

అన్నం తిన్నాక నిద్ర పోకూడదు . ఇంతకీ మీ ఆయన ఎప్పుడు వస్తాడు ?''

అంది అమ్మ మనుమరాలిని చేత్తో నిమురుతూ .

''స్కూల్ వదిలినాక ఇంటికి వెళ్లి రెడీ అయ్యి బస్ ఎక్కి రావాలి . పొద్దు

పోతుంది ఏమో !'' చెప్పాను .

సరే నిద్రపో చెప్పి వెళ్లిపోయింది అమ్మ .

****************

''బాగున్నారా '' నీళ్ళు ఇస్తూ అడిగింది అమ్మ ఈయనని .

''బాగున్నాను అత్తమ్మా . అమ్మా వాళ్ళు అందరు అడిగినట్లు చెప్పమన్నారు ''

''ఇదిగోయ్యా నీ కూతురు '' మెల్లిగా పాప మెడ కింద ఒక చేయి , వీపు కింద

ఒక చేయి ఉంచి ఈయనకు అందించింది పాపని . ఇబ్బంది పడుతూ ఎత్తుకున్నాడు

అపురూపంగా . పట్టుకోవడం చేత కావడం లేదు .

''అత్తమ్మా నాకు ఎత్తు కోవడం రావడం లేదు . పాప మెడ వాలి పోతుంది ''

అన్నాడు .

సరే అని తీసుకొని ఆయన పక్కనే మంచం మీద పడుకో పెట్టింది .

'' ఏ మాధురి లేయ్యవే . మీ నాన్న వచ్చాడు '' చెప్పింది అమ్మ .

అది లేస్తుందా ? దానిష్టం . అది లేసినపుడే మనం హాజరు వేయించుకోవాలి .

మెల్లిగా దాని గుప్పెట్లో ఈయన వేలు పెట్టి ఇంకో చేత్తో నిమిరాడు .

చిన్ని పాపలు నిజంగా దేవుడు ఇచ్చిన వరాలు .

''రేపు విశేషం గుర్తుందా ?''అడిగాను .

''గుర్తు లేదే ?ఏమిటో విశేషం ?''కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి .

''పోండి '' కోపంగా విసుక్కున్నాను .

''తెలుసులెండి అమ్మాయి గారు తమరు నా జీవితం లోకి వచ్చిన రోజు ''

మెల్లిగా నా చేతిని చేతి లోకి తీసుకున్నాడు . ఇంతలో అమ్మ వచ్చేసరికి

సర్దుకొని ....

''అత్తమ్మా ఎల్లుండి అమ్మ వస్తుందంట పాపను చూడను '' చెప్పాడు .

ఇదిగో ఈవిడ పుట్టినప్పటి నుండి ఇదో కొత్త అలవాటు . మా అత్తగారింటి

నుండి అత్తమ్మా , మావయ్య , మరుదులు ఇలా ఎవరో ఒకరు పాపను

చూసేదానికి వస్తూనే ఉంటారు .

'' అలాగే లేయ్యా రమ్మనండి . వచ్చేటపుడు మాచికాయ మంచిది ఉంటె

తెమ్మనండి . రేపు మీ పెళ్లి రోజు కదా , పాపను నేను చూసుకుంటాను ,

ఉదయాన్నే సాయి బాబా గుడికి వెళ్లి రండి . మొదటి పెళ్లి రోజు కదా !''

చెప్పింది అమ్మ .

అబ్బ నిజం ... ఎంతలో ఇంత బాధ్యత వచ్చేసింది మాకు . అదీ ఏడాది

పూర్తి కాకుండానే . అంతా ఈ బుజ్జి పిల్ల వల్లే .... నవ్వుకున్నాను . నా వైపే చూస్తూ

నా నవ్వులో నవ్వు కలిపిన ఈయన కళ్ళలో కాసింత గర్వం .

''అత్తమ్మా త్వరలో మూడో నెల పెడుతుందంట. మా నాన్న వచ్చి శశి ని పాపని

చెన్నూరు కు తీసుకెళతారు , మంచి రోజు చూసి ఫోన్ చేయమన్నారు ''చెప్పారు .

''అంతేలే నాయనా ,ఏ రక్తం అక్కడికే పోతుంది . మేము ఎంత ముద్దుగా

చూసుకుంటే మాత్రం ఏమిటి ?ఏమి మాధురి అమ్మమ్మ గారి గుడిసె మీద

దెబ్బ వేసి నాయనమ్మ ఇంటికి వెళ్ళిపోతావా ?'' బాధగా అంది పాపను

చూస్తూ .

ఏమో అర్ధం అయినట్లు కళ్ళు తెరిచి అమ్మమ్మను చూసి మళ్ళా కళ్ళు

మూసుకుంది .... అవునని చెప్పినట్లు .

''చూడవే దీనికి ఏమైనా బాధ ఉందేమో . ఇక పదండి బోజనాలకి ''

చెప్పేసి వెళ్లి పోయింది అమ్మ .

***************

కొందరికి బాధ , కొందరికి ఆనందం చిన్న పిల్లల స్థల మార్పిడిలో

ఒక అలల తూగు ..... వీళ్ళు ఎటు వైపు వెళితే అటు నవ్వుల జల్లు .

హుషారు . అత్తగారింటికి వెళ్ళే రోజు రానే వచ్చేసింది . ఈయనగారికి

అక్కడ ఈ రోజు నెల మీద కాళ్ళు ఆని ఉండవు .

మావయ్య, నేను, పాపను ఎత్తుకొని నన్ను వదిలి రావడానికి అమ్మ

అందరం కారు ఎక్కాము . శకునం చూసుకొని బయలుదేరగానే

కిటికీ లో నుండి చల్లటి గాలి వీడుకోలు చెపుతున్నట్లు . ఇక్కడ

ఉన్న దగ్గరితనం ఇంకా ఆ ఇంట్లో రాలేదు . నాకంటే నాకే ఉండే తోడు

ఈ రోజు నాతో వస్తూ ఉందని .... ఇది ఎన్నో కొత్త రేకులు విప్పి

తన ఎదుగుదలతో నా మనసును ఊయలలు ఊగిస్తుందని నాకు

ఇంకా అప్పటికి తెలీదు .

అమ్మ అన్నట్లు ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మన రక్తం మన వాళ్ళ

వైపే పారుతుంది . ప్రేమలో హాయిగా ముంచుతుంది .


******************

''నీకు ఇప్పుడే పూలు పెట్టకూడధమ్మ బంగారు,మాడు మెత్తగా ఉంటుంది కదా ,ఐదొ నెలలో పెడుతాను''చిన్న యెర్రని పెదాలు విచ్చుకున్నాయి తులసి కోట అరుగు మీద పడుకో బెట్టిన మూడు నెలల బుజ్జి పాపవి.

సాయంత్రం పెరటిలో అరుగు మీద కూర్చొని పూలు కడుతూనో ,దానికి నూనె పెడుతూనో ఇలాగ మాట్లాడుకోవడం మూడో నెలలో అమ్మ వాళ్ళు వచ్చి నన్ను పాపని మా అత్తగారింట్లో వదిలి వెళ్లి నప్పటి నుండి కొత్తగా అయిన అలవాటు.

అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దీనికి ఇన్ని నవ్వులు లేవు . ఇక్కడకు వచ్చినాక నవ్వులతోనే బోలెడు కబుర్లు చెప్పేస్తుంది .

''రేపు శుక్రవారం కదా నీకు నాన్న తెచ్చిన కొత్త గౌన్ వేస్తాను సరేనా?'' ఏదో పర్మిషన్ కోసం అడిగినట్లు అడిగాను .

చిత్రం అది ''ఊ '' అంది . నేను ఉలిక్కిపడి ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అయిపోయాను .

''హేయ్ నీకు అర్ధం అయిందా?

ఊ కొట్టటం ఎప్పుడు నేర్చుకున్నావు?ఇప్పుడేనా?'' ఒక్క నిమిషం ఏదో శ్రద్దగా వినింది ఆలోచిస్తున్నట్లు

మళ్ళా ''ఊ '' నేను పొంగిపొయాను.

అరె ఇది నాన్న వాళ్ళతో ఎలా పంచుకొవడం ....

ఫోన్ చేయాలంటే పి.పి కాల్ . మనం ఫోన్ చేసి ఫలానా వాళ్ళు కావాలి అని చెప్పాలి . తరువాత వాళ్ళు పనులు ఆపుకొని వచ్చి అప్పుడు మళ్ళా ఫోన్ చేయాలి అందుకే అవసరం అయితే తప్ప ఫోన్ చేయం . ఉత్తరం వ్రాస్తే అది రేపు చేరుతుంది . మళ్ళా వాళ్ళు వ్రాస్తే ఇక రెండు రోజులకు వస్తుంది .

నిజం గా ఈ బుజ్జి తల్లి ''హేమ మాధురి''నాకు దేవుడు ఇచ్చిన ఫ్రెండ్ .

ఇదే లేక పోతే పెళ్ళికి ముందు చదువులు ,ఫ్రెండ్స్ ,బాబాయి పెదనాన్నల ఇళ్ళు ,ఆటలు అంటూ తిరిగే తూనీగ జీవితానికి ..... పెళ్లి అయిన తరువాత అత్తా మామ్మలు,

మరుదులు,ఆడబిడ్డ,తోడు కోడలు బావగారు ,అమ్మమ్మ గారు,చిన్న అత్తా గారు ,

ఇంటికి వచ్చి పోయే చుట్టాలు అంత పెద్ద ఇల్లు లో ఒక ఒద్దికైన కోడలు బాధ్యత మధ్యన గల గ్యాప్ కి నేను అలవాటు పడేవరకు ఈ బుజ్జి తల్ల్లి తో కబుర్లు నాకు మంచి ఎనెర్జీ .

పెళ్లి అయిన నెలకే నాలోకి వచ్చేసింది మొదలు అది ఎలా పెరుగుతుందో ,

సీమంతం ,డాక్టర్ చెక్ అప్ లు ,వేళకు మందులు ,ఆహారం ఇలాగా దీని ఆలోచనలతోనే మా అమ్మా వాళ్ళ మీద బెంగ కొంత వరకు మర్చిపోగలిగాను .

ఇంకో రోజు మర్చిపోలేను . పాపకు కబుర్లు చెపుతూ పాటలు కూడా వినిపించెదాన్ని.

చిన్నగా ''ఆ .... ఆ..... ''

ఒక ఆలాపన చేసాను . చిత్రం మూడు నెలల పసి పాప శ్రద్ధగా వినింది .

నాకు ముచ్చట వేసి మళ్ళా అదే రాగం ''ఆ ''అంటూ పాడాను . చిత్రం అది పది సెకన్లలో తిరిగి అలాగే శృతి తప్పకుండా ఆలపించింది .

ఒక్క క్షణం ఆనందం తో మాట రాక ఎత్తుకొని ముద్దులతో నింపేసాను. .

అప్పటి నుండి ఎవరైనా చిన్న పిల్లలు కనిపిస్తే వాళ్ళ దగ్గరకు వెళ్లి అలాగే రాగం తీస్తాను .

కొంత మంది తిరిగి ఆలపించినపుడు నాకు ఆ రోజు జరిగింది గుర్తుకు వచ్చి మనన్సు అంతా

భలే ఆనందం తో నిండి పోతుంది .

తల్లి బిడ్డలు కబుర్లు చెప్పుకోవడం అనేది వాళ్ళ హక్కు ఆ హక్కు వాళ్ళు తృప్తి దీరా అనుభవించేందుకు మనం వారికి సహకరించాలి. అప్పుడే ఒక చక్కని మానసిక ఆరోగ్యం గల తరువాతి తరాన్ని మనం పొందగలం .

@@@@@@@@@@@@@@********

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.