మలివయసులో

‘ఆ మూలాన ఒక రూమ్ వేద్దా మనుకుంటున్నాన్రా....’హఠాత్తుగా కొడుకులిద్దరినీ చూస్తూ అన్నాడు శివశంకర్- అందరూ భోజనాలు చేస్తుండగా.

భార్య ఉమ వడియాలు వేయిస్తుంటే, కోడళ్ళిద్దరూ వడ్డిస్తున్నారు.

‘ఎందుకు నాన్నా...మా ఇద్దరికీ గదులున్నాయిగా...’ పెద్ద కొడుకు మధు అన్నాడు.

‘మాకు లేదుగా....’

కోడళ్ళు తుల్లిపడ్డారు. కొడుకులు ఉలిక్కిపడ్డారు. భార్య ఉమామహేశ్వరి సిగ్గుతో తలదించుకుంది.

‘వసారాలో పడుకుంటూన్నారుగా...’చిన్నకొడుకు రాము అన్నాడు అర్ధం కానట్లు.

కొడుకులిద్దరూ రెండు రూముల్లో ఉంటుండగా, తల్లీ తండ్రీ..... వసారాలో ఉన్న దివాన్ బల్లపై ఒకరూ, మడత మంచం వాల్చుకుని ఒకరూ పడుకుంటారు.

‘మేస్త్రీని పిలిచి చూపించాను. రేపటినుండి పని మెదలుపెడతానన్నాడు’ చేయి కడుక్కుని వెళ్ళిపోతూ అన్నాడు శివశంకర్-నిర్ణయం తీసుకున్నాను... అందులో చర్చలకు తావులేదన్నట్లు.

‘అంతా మాట్లాడాక మరి చెప్పడం ఎందుకో’ మామ లేనిది చూసి పెద్దకోడలు రమ దీర్ఘం తీసింది.

‘ఇన్ని రోజులు లేనిది ...ఇప్పుడెందుకో..’ చిన్నకోడలు మాలతి అంది.

కొడుకులు మౌనంగా వెళ్ళిపోయారు. కోడల్లతో పాటు తినడానికి కూర్చున్నా ముద్ద దిగలేదు ఉమకి.

ఎవరేమనుకున్నా కాలం తన పని తానూ చేసుకుపోయినట్లు , వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా పనులు వేగం పుంజుకున్నాయి. నెలరోజుల్లో గది తయారయ్యింది. కొత్తగా ఉన్న ఆ గది ముందు వెలవెల బోతున్న తమ పాత గదులు చూసుకుని మూతులు ముడుచుకున్నారు కోడళ్ళు. గోడమీది పిల్లుల్లా మౌనం వహించారు కొడుకులు. ఎవరేమనుకుంటే నాకేం అన్నట్లు ఎవర్నీ పట్టించుకోలేదు శివశంకర్. అందరిమధ్య బితుకు బితుకు మంటూ కాలం వెళ్ళదీస్తోంది ఉమ. మంచి మంచి ఆకర్షణీయమైన రంగులతో చక్కగా ముస్తాబయ్యింది గది.

అందరినీ ఆశ్చర్యపరిచేట్లు ఆ రోజు మధ్యాహ్నం కార్పెంటర్లు మంచి డేకోలం మంచం –పైనున్న చెక్క పైకెత్తితే కింద ఏమైనా దాచుకునేట్లు పెద్ద పెద్ద అరలు ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆ గదిలో పెట్టి వెళ్ళారు. అంతా ఆశ్చర్యంగా , అసూయగా చూశారు.నిన్నకాక మొన్న పెల్లయినట్లు-రిటైర్మెంట్ కి దగ్గరలో ఉండి ఈ వయసులో ఈ శోకులేంటీ అని విడ్డూరంగా చూశారు. వారి అసూయను రెట్టింపు చేస్తూ, కిటికీలకు అందమైన కర్టెన్లు కూడా వేయించి లోపలివేవీ బయటకు కనబడకుండా చేశాడు శివశంకర్. ఇక కోడళ్ళ సనుగుడికి అంతులేకుండా పోయింది. పనులన్నీ ఆఘమేఘాలపై జరిగిపోయాయి.

ఎదో ‘మమ’ అన్నట్లు కొబ్బరికాయ కొట్టి, గృహప్రవేశం లాగా కూడా చేశారు. ఆ తెల్లవారి కొత్తచీర కట్టుకోమని బార్య కిచ్చి, తానూ కొత్త బట్టలు వేసుకుని ‘త్వరగా తయారవు...గుడి కేలదాం’ అంటూ తొందరపెట్టాడు. కోడళ్ళ కొరకొర చూపుల మద్య కొడుకులు గుచ్చి గుచ్చి చూసే చూపుల మధ్యా భర్తతో బయటికేల్లింది ఉమ.

బండిపై అతని పక్కన కూర్చోగానే ‘ఏమిటండీ, మీ విపరీత బుద్ధులు...నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వయసులో పెద్దవాళ్ళయిన పిల్లల ముందు మీరు ప్రవర్తించే విధానం’ అంది నిష్టూరంగా.

మారుమాట్లాడకుండా కోవెలకు తీసుకెళ్ళి కొబ్బరికాయ తీసుకుని అర్చన చేయించాడు. పూజారి అడుగుతుంటే ‘పెళ్లిరోజు శుభసందర్భాన’ అని అతనంటున్టే గానీ తమ పెళ్లిరోజు గుర్తురాలేదామెకు.

‘ఇంటిపనిలో పడి నేను మర్చిపోయాను సుమండీ..’ అంది నొచ్చుకుంటూ.

దేవుడి ఆశీర్వచనం తీసుకున్నాక, పూజారి ఆశీర్వచనం తీసుకున్నారు. కలకాలం చల్లగా వర్ధిల్లమని అక్షింతలు చల్లారాయన, తర్వాత ఆలయ ప్రాంగణం లో కూర్చుని ఉమ కొబ్బరి తీసి ఇస్తుంటే,’ఉమా...మన పెళ్ళయి నలబై సంవత్సరాలు గడిచాయి. కానీ ఇప్పటివరకు ఎ పెల్లిరోజయినా ప్రశాంతంగా గడుపుకున్నామా! పెళ్లి కాగానే బాబు కడుపులో పడి , కాన్పులు కష్టమై...ఆ తర్వాత వారికి ఆరోగ్యాలు బాగాలేక,,,,వారు బడికి వెళ్ళడానికి అన్నీ సమకూరుస్తూ ఆరాటపడుతూ.....ఇలా ప్రతి స్థాయిలో వాళ్ళే ముఖ్యమంటూ ప్రవర్తించావు. ఇప్పుడు పిల్లలు ఎదిగాకయినా కొన్న బాధ్యతలు నువ్వు వాళ్ళపై వదిలివేయాలి. ఎంతకాలమైనా నాకు నువ్వు, నీకు నేను...ఎవరూ మన కష్టం అర్ధం చేసుకోరు. ఇంతకాలం వాళ్ళ కోసం పడిన శ్రమ చాలు. ఇప్పటికయినా నీ ఆరోగ్యం చూసుకో..ఎవరో ఏమో అనుకుంటారనే ఇన్ని రోజులూ ఏమీ అనుభవించలేకపోయాం. ఇక ఎవరికోసమో మనం బతకొద్దు. ఇప్పుడు ఇక్కడి నుండి బీచ్ కెళ్ళి అక్కడి నుండి మంచి హోటల్ లో భోంచేసి ఇంటికేలదాం. మరేం మాట్లాడకు’ అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి, వెహికిల్ దగ్గరకు నడిపించాడు శివశంకర్.

ఇద్దరూ బీచ్ లో కూర్చుని ఎన్నో రోజుల నుండి మాట్లాడాలనుకుంటున్న ఎన్నో విషయాలు హాయిగా మాట్లాడుకున్నారు. మాట్లల్లో తెలీకుండా కాలం గడిచిపోయింది. కడుపులో ఎలుకలు పరుగేత్తడంతో హోటల్ కి దారితీశారు. ఎప్పుడూ ఇంట్లో బడ్జెట్ చూసుకుంటూ ఖర్చు పెట్టడం వల్ల హోటల్ మొహం ఎరుగదు ఉమ. ఆమెకు వెజ్ మంచూరియా, వెజ్ బిర్యాని, ఆపై ఆమె కు ఇష్టమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీం తినిపించి పాన్ వేయించాడు. కోడళ్ళు చూస్తె బావుండదు అంటూ మొండికేసినా వినలేదాయన. తర్వాత ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీం తీసుకుని ఇంటికోచ్చ్చారు. ‘ఇదిగొండ్రా ఐస్ క్రీం....మేం బయట తినేశాం’ అంటూ కోడల్లకందించాడు.

ఎర్రగా పండిన వారి నోళ్ళు చూస్తూ ‘వీళ్ళకి అరవై లో ఇరవై వచ్చిందిలా ఉంది’ అంటూ సనుక్కున్నారు కోడళ్ళు.

అక్కడ-వారి శల్య పరీక్షకు నిలవలేనట్లు, చీర మార్చుకునే నెపంతో కొత్త గది లోకి వెళ్ళింది ఉమా. బట్టలు మార్చి, లుంగీ కట్టుకుని పేపర్ చదువుతూ హాల్లో ఉండి పోయాడు శివశంకర్.

ఐస్ క్రీం తింటూ ‘ఈ రోజు విశేషమేంటి నాన్నా... కొత్త బట్టలు..ఐస్ క్రీం...’అన్నాడు మధు.

‘మా పెళ్లి రోజురా’ అన్నాడు శివశంకర్.

‘అలాగా, మరి చెప్పలేదేం?’అంటూ విషెస్ చెప్పారంతా.

కొత్త రూమ్ కట్టాక మొట్టమొదటిసారి భార్యా భర్తలిద్దరూ ఆ రాత్రి ఆ గదిలో పడుకున్నారు. రాత్రి పొద్దుపోయాక దాహంగా అనిపించి బయటకొచ్చిన ఉమకి పెద్దకొడుకు గది నుండి గట్టిగానే వినబడిన మాటలు మనసుకు క్షోభ కలిగించాయి.

‘ఛీ...సిగ్గుండాలి...ఈ వయసులో పెళ్లి రోజు అంటూ టింగురంగా అని తిరగడానికి. ఆయనకు సిగ్గు లేకపోతె ఈవిడైనా చెప్పొద్దూ...’

‘అబ్బా...నీకేందు కులెద్దూ....వాళ్ళెలా ఉంటె’ కొడుకు సమర్ధింపు.

కంటి కొలుకుల నుండి నీళ్ళు ఉబుకుతుంటే ఇంకొంచెం ముందుకొచ్చింది. వంటగదికి వెళ్ళాలంటే ఇద్దరు కొడుకుల గదులూ దాటి వెళ్ళాలి.

‘నేను వాళ్ళు వేలుతుంటేనే అన్నాను. ‘ముసలాయన మహా జోరుమీదు న్నాడు....ఎ హోటల్ లోనో భోంచేసినా చేయోచ్చు’ అని. హవ్వ...ఈ వయసులో అలా మొగుడి వెనకాల హోటల్లు తిరగడానికి ఆవిడే మైనా పదహారేళ్ళ బాలకుమారినా....ఛీ...ఛీ... నాకే ఎబ్బెట్టుగా ఉంది. కనీసం ఇంట్లో కోడళ్ళు కొడుకులూ ఉన్నారన్న ఇంగితమైనా లేదు’ చిన్న కోడలి గొంతు.

‘పోనీలేద్దూ...వారి సరదాలు వాళ్ళవి’ అది కొడుకు గొంతు.

ఇక మంచినీళ్ళ వరకు వెళ్ళే శక్తి లేనట్లు వెనక్కోచ్చేసింది ఉమ. ఆగకుండా ఉబుకుతున్న కన్నీళ్ళతో వస్తున్న భార్య ను చూడగానే విశ్రాంతిగా పడుకున్న శివశంకర్ లేచి,’ఏమయ్యిందంటూ’ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ ఆసరా చాలన్నట్లు అతన్ని పట్టుకుని భోరుమంది.

‘ఉమా...నువ్వు ఇలా ప్రతి చిన్న విషయానికీ మనసు పాడు చేసుకోవద్దు. మనమేమీ చేయరాని పని చేయడం లేదు. నువ్వు నా భార్యవు కాదా....నా భార్య తో నేను నా గదిలో పడుకుంటే తప్పేంటి?’ విషయం గ్రహించి అనునయించాడాయన. ఇలా వారం గడిచింది.

ఆ రోజు పొద్దుపోయి ఎనిమిది గంటలైనా వారిగది తలుపులు తెరుచుకోలేదు. ‘ఏమిటోనమ్మా, పొద్దెక్కి ఇంత టైమైనా ఇంకా కొత్త దంపతుల్లాగా తలుపులు బిగించుకుని పడుకోవడం మా ఇంటా వంటా లేదు’ కోడలు రమ అంది.

వాళ్ళు లేరు, వినడం లేదనేమో....’ఎ వయస్సులో ఆ పెద్దరికం నిలుపుకోవాలి... మరీ కొడుకులు ఇంట్లో తిరుగుతుంటార నైనా లేకుండా సిగ్గులేకుండా, పొద్దుపోయిందా క పడుకోవడం వీళ్ళకే చెల్లింది’ చిన్న కోడలి మూతి విరుపు.

అప్పుడే వంటింట్లోకి అడుగుపెడుతున్న ఉమకి కళ్ళ నుండి నీళ్ళు జలజలా రాలాయి.

‘ఉమా...నువ్వెళ్ళి పడుకో...కాఫీ నేను తెస్తాను’ అన్నాడు శివశంకర్.

ఉమ గిర్రున వెనుదిరిగి రూమ్ లోకేల్లింది.

చప్పున నోరు మూశారు కోడళ్ళు. కొడుకుల చూపులు కూడా ఈసడింపు గానే ఉన్నాయి. శివశంకర్ నోరు విప్పాడు.’అమ్మకు రాత్రంతా జ్వరం...నిద్ర పోలేదు...దానితో తెల్లవారి నాలుగు గంటలకు నిద్ర పట్టింది. ఎప్పుడూ పొద్దుటే లేచే అమ్మ ఇంతవరకు లేవలేదంటే, పెద్దవయసు ఏమి ఉంటుందో...’ అని ఎవరైనా ఆలోచించారా ‘ మాకంటూ ప్రత్యేకంగా ఒక గది, మంచం చేయించు కున్నందుకే అదేదో వింతగా చూసి రకరకాల కామెంట్లు చేసారే... ఎం కట్టించుకోకూడదా ... పెల్లయినదగ్గర్నుంచి ఎప్పుడూ ఇంట్లో అమ్మా, నాన్న, చెల్లెళ్ళు, మరుదులు అని అందరితో కలిసి ఉమ్మ్మడి కుటుంబం లో గుట్టుగా బతికాము. మీ రిద్దరూ పుట్టాక అమ్మకు ఆరోగ్యం చాలా పాడయింది. బతుకుతుందో, లేదో అన్నారు. అతికష్టం మీద గండం గడిచింది. తర్వాత కూడా , ఇంట్లో పక్షవాతం వచ్చి మంచాన పడిన అమ్మ, తనమాటే చెల్లాలని దర్పం కనబరిచే నాన్నను సంతృప్తి పరుస్తూ , చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి, మీ ఆలనా పాలనా చదువులు చూడటం లో క్షణం తీరిక లేకుండా గడిచిపోయింది. అమ్మ ఎప్పుడూ తన ఆరోగ్యం గురించి చూసుకోలేదు. ఈ మధ్య దాదాపు నాలుగు నెలలుగా చూస్తున్నా- కాళ్ళు లాగుతున్నాయని, చేతులు లాగుతున్నాయని బాధపడుతోంది. వసారాలో మంచం వేస్తె పొద్దుటి నుండి పని చేసి అలా పడుకుని తన కాళ్ళు తానె ఒత్తుకుంటూ ఉండేది. ఎ మధ్యాన్నమో కాసేపు కునుకు తీయాలనుకుంటే ఇంటికి ఎవరో ఒకరు రావడం వారి ముందు పడుకోలేక, విశ్రాంతి లేక అలసిపోతుంది. నాకు ఆమె కాళ్ళు పట్టాలని ఉన్నా , హాల్లో అలా పడితే ఎవరు చూసినా బావుండదని ఏమీ చేయలేక ఊరుకునేవాన్ని. నేను వయస్సులో పురుషాహంకారం తో అంతో ఇంతో వేదించిన వాన్నే. కానీ వయస్సు మీదపడ్డాక అమ్మ కళ్ళ కింద నల్లటి చారలు, కాళ్ళ నొప్పులతో కుంటు కుంటూ నడవడం , రక్తం లేక పాలిపోయిన కళ్ళు , ముడతలు పడుతున్న ముఖం.... నాకు నిద్దర లేకుండా చేశాయి. అమ్మకు ఎప్పటి నుండో విడిగా ఒక గది, తన అభిరుచి మేరకు ఉండాలని కోరిక. ఇప్పటి వరకు ఆ కోరిక తీర్చలేదు. ఇక జీవిత చరమాంకానికి వచ్చ్చాము. ఇప్పుడైనా తీర్చలేక పొతే ఎలా...? ఇటీవల నా ఫ్రెండ్ కలిశాడు. అతని భార్య చనిపోయిందని చెబుతూ...ఆమెకు గుండెజబ్బు ఉందని నాలుగు సంవత్సరాల ముందే తెలిసినా, రోజువారీ పనులూ ఒత్తిళ్ళతో తను పట్టించుకోలేదనీ, మనం ఆలస్యం చేసినా కాలం ఆలస్యం చేయదనీ, అందుకే తన నిర్లక్ష్యం వల్లే భార్య తనను విడిచిపోయిందనీ బాగా ఏడ్చాడు. అంతకు ముందు భార్య ఉండగా రాజాగా ఉండే అతను, తనపై తనకే ధ్యాస లేక బికారిలా అయ్యాడు. ఆ సంఘటన నా మనసుని కలచివేసింది. డాక్టర్ దగ్గరకు అప్పుడెప్పుడో అమ్మను తీసుకెళితే ‘చాలా బలహీనంగా ఉంది, కాలూ చేయి లాగడం ఒక్కోసారి గుండె జబ్బుకి గుర్తు. కాస్తా జాగ్రత్తగా చూసుకోండి. వీలయితే టెస్టులు చేయించండి; అన్నాడు. అమ్మ మనకందరికీ కష్టం కలగకుండా ఉండటం కోసం తన ఆరోగ్యాన్ని మరిచిపోయింది. ఆ తర్వాత డాక్టర్ల ద గ్గర పరీక్షలు చేయిస్తే గుండె జబ్బు సూచనలు కనబడుతున్నాయన్నాడు.

పెళ్లయినప్పటి నుండి తనకు ఇష్టమైన తీరని చిన్ని కోరికలు తీర్చి...చిన్న చిన్న సంతోశాలకే ఆనందపడి పోతే ఆమెను చూసి సంతోషించాలనుకున్నాను. కానీ చిన్న చిన్న మాటలు కూడా మనసును తూట్లు పొడవగలవని అర్ధమయ్యింది. మీ అందరి పుట్టినరోజులనీ, పెల్లిరోజులనీ గుర్తుపెట్టుకుని జరిపి ఆనందపడే అమ్మకు సంబంధించిన ఎ రోజునయినా మీరు గుర్తుపెట్టుకున్నారా? రూమ్, మంచం చూసి షోకనుకున్నారు. కేవలం ఆమెకు ఇబ్బంది లేకుండా విశ్రాంతి తీసుకోవడానికీ, నేనేమైనా సేవలు చేయడానికే అవన్నీ. అయినా , నా సొంత డబ్బుని నాకిష్టమైన విధంగా ఖర్చు పెట్టె అధికారం కూడా నాకు లేదా?’ ఇంకా మాట్లాడ బోతున్న ఆయన మాటలకి ఆడ్డువస్తూ కొడుకులిద్దరూ ‘మమ్మల్ని క్షమించండి’ అంటూ ఆయన చేతులు పట్టుకున్నారు. కోడళ్ళు తలలు దించు కుంటూ,’మమ్మల్ని క్షమించండి మామయ్యా’ అన్నారు.

‘రేపే టికెట్లు బుక్ చేస్తాను. మీకిష్టమైన ప్రదేశాలన్నీ చూసి రండి నాన్నా’ అన్నాడు పెద్ద కొడుకు , అమ్మ అభీష్టం గుర్తోచ్చ్చి.

‘అవును నాన్నా’ అంటూ గొంతు కలిపాడు చిన్న కొడుకు.

అపుడే హాల్లోకి వస్తూ ఆ మాటలు విన్న ఉమ ముఖం లో సంతృప్తి తో కూడిన చిరునవ్వులో...వెయ్యి శరత్ చంద్రికలు ప్రకాశించినట్లుగా అనిపించింది శివశంకర్కి.

*************

ఈ నాడు ఆదివారం 9-9-2012 తేదీన ప్రచురించబడిన నా కధ.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.