కేరింత (శీర్షిక కథ)

శీర్షిక : జత

రచయిత : బివిడి.ప్రసాదరావు

"ఈ టిక్కట్లు ఏ ఇక్కట్లుకో" అన్నారు మావారు.
"చాల్లెండి. మీరు, మీ చోద్యం" అన్నాను నేను.
"అది కాదే, వారు మనకు టిక్కట్లు ఇవ్వడ మేమిటి, మనను సినిమాకు వెళ్ళ మనడ మేమిటి" అన్నారు మావారు వంకర్లు పోతూ.
"చెప్పాగా. వారు వెళ్ళాలని తెచ్చుకున్నారట. కానీ సావిత్రికి ఒంట్లో నలతగా ఉందట. అందుకే వాళ్ళు వెళ్ళలేక మనకు ఇచ్చేరు" చెప్పాను నేను విసుగ్గా.
అప్పుడే కుక్కరు మూడో విజిల్ వేసింది. నేను వంట గది వైపు కదిలాను.
సావిత్రిది మా పక్క ఇల్లే. కాపురానికి వచ్చి కొద్ది కాలం అయినా, ఆమెలో కూడా నాలా చాలా కలుపుగోలుతనం ఉండడంతో నాతో బాగా కలిసిపోయింది.
నా ఇద్దరు పిల్లలు కూడా సావిత్రి చెంతన హుషారుగా ఉంటుంటారు. ఆమెకు పిల్లలంటే ప్రీతి. అందుకే నా పిల్లల్ని ఇట్టే చేరిక చేసుకుంది.
పిల్లలు సెలవులకు మా కన్నవారింటికి వెళ్ళారు ఈ మధ్యనే. వాళ్ళు లేక ఇల్లు బోసిపోయిన మాట వాస్తవమైనా, సావిత్రి కూడా బోసిపోయింది. నాకు జాలి అనిపించింది.
నా వెనుకే వంట గదిలోకి వచ్చిన మావారు, "వాళ్ళ ఇంటిలో అంత మంది ఉన్నారు గదా. టిక్కట్లు వాళ్ళకు ఇవ్వవచ్చు కదా" అని మళ్ళీ అన్నారు సొదగా.
"అయ్యా ఎన్నిమార్లు చెప్పాలి. ఆఁ. వాళ్ళింటిలో ఒకరా ఇద్దరా, మీకు తెలియందా! వాళ్ళది ఇల్లా, చిన్న హాస్టల్ లాంటిది కదూ. వాళ్ళలో ఏ ఇద్దరికైనా టిక్కట్లు ఇస్తే మిగతా వారు గోల చేయరా. నిత్యం ఆ ఇంటి భాగోతం మనం చూస్తుందే కదా" అన్నాను చిరాకుగా.
మావారు ఏమనుకున్నారో ఏమో, వెంటనే వంట గదిలోనించి వెళ్ళిపోయారు.
సావిత్రి ఆ ఇంటికి మొదటి కోడలు.
ఆమెతో పాటు ఆ రెండు గదుల ఆ ఇంటిలో ఆమె అత్తమామలు, ఆమె భర్త, పెళ్ళి కావలసిన ఇద్దరు మరుదులు, భర్త చనిపోతే ఇద్దరు పిల్లలతో కన్నవారింటికి వచ్చి ఉంటున్న ఆడపడుచు ఉంటున్నారు.
నేను తయారయ్యిపోయాను. మావారూ సిద్ధమై ఉన్నారు.
నేను సావిత్రిని పిలిచాను.
ఆమె వచ్చింది తన ఇంటిలోనుండి.
చెప్పాను, "నువ్వు మా ఇంటిలో ఉండు. మేము సినిమాకు వెళ్లి వస్తాం" అని.
సావిత్రి సరేనంది, హుషారుగా.
నేను వీథిలోకి నడిచాను. నా వెంటే మావారు వచ్చారు.
"టైం అవుతోంది. స్కూటర్ తీయండి" చెప్పాను తొందర చేస్తూ మావారుతో.
మావారు అలానే చేశారు.
నేను స్కూటర్ వెనుక కూర్చుంటూ, "ఇక పదండి" అన్నాను.
మావారు అలానే చేశారు.
దార్లో, "ఏమిటి ఆమెను ఇంట్లో ఉండమన్నావు. తాళం వేసి మనం వెళ్ళ వచ్చుకదా" అని అడిగారు మావారు.
"ఈ మధ్య ఊర్లో దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయిగా. అందుకే, ఆమెను ఉండమన్నాను" చెప్పాను.
మావారు, "బీరువా తాళాలైనా..." అని అంటుండగా, నేను ఒక్కమారుగా కసురు కోవడంతో మావారు గుప్పున కామ్ ఐపోయారు.
అది మొదలు మావారు అనీజీగానే మూవ్ అవుతున్నారు.

***

సినిమా మొదలైంది.
కొంతసేపు తర్వాత, "కడుపు గుర్రు మంటుంది. బయటకు వెళ్ళి వస్తాను" అన్నారు మావారు.
"ఎక్కడకి" అడిగాను విసురుగా.
"ఇక్కడే, థియేటర్ లోని టాయిలెట్ కు" చెప్పారు మావారు. ఆ వెంటనే బయటకు నడిచారు.
కొంతసేపు గడిచిన పిమ్మట, మావారు ఇంకా రాకపోవడంతో నేను సినిమా వైపు దృష్టి నిలపలేకపోతున్నాను. మావారికై చూస్తున్నాను.
టైం గడుస్తున్నకొద్దీ నాలో ఇబ్బంది చిక్కబడుతోంది.
సుమారు అర గంట గడిచినట్టు ఉంది.
నేను బయటకు వెళ్ళాలనుకుంటుండగా, మావారు వచ్చారు.
"ఇంతసేపా" అనేశాను.
మావారు ఏమీ అనలేదు వెంటనే.
తర్వాత, "ఇంటికి వెళ్ళాను" అని చెప్పారు.
నేను తెల్లబోయాను.
తేరుకుంటూ, "ఎందుకు?" అని అడిగాను జోరుగా.
"సావిత్రి ఇంటి మందంతా మన టివీ, లైట్లూ, ఫేన్లూ లాంటి వస్తువులను వాడేసుకొని, మన ఇంటిని ఎంతగా చిందరవందర చేసేస్తున్నారో అని. పైగా బీరువా తాళాలు గురించి నువ్వు ఏమీ చెప్పలేదాయే" చెప్పారు మావారు.
"ఐతే అక్కడ అలాంటిదేమైనా ఉందా" అడిగాను విసురుగానే.
"హలో ఏమిటి మీ మాటలు. సినిమాను చూడనివ్వరా" అని ఎవరో విసుక్కుంటున్నారు.
దాంతో, మావారు, నా వైపుకు ఒరిగి, నెమ్మదిగా, "ఉహూ, వీధి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. సందు వైపు కిటికి కేసి వెళ్లాను. లోపలి నుంచి ఏవో గుసగుసలు వినిపిస్తే, కిటికీ సందు లోనించి లోనికి చూశాను" అని చెప్పుతున్నారు.
నేను చిఱ్ఱుగా కదిలాను.
"లోపల ... ఆ సావిత్రి, ఆమె భర్త, మన బెడ్ మీద, ఛ ... బెడ్ లైట్ కాంతిలో ... వాళ్లును గుర్తించాను ... ఆ ఇద్దరూ ... ఛ ..." అని మెల్లి మెల్లిగా చెప్పుతున్నారు మావారు.
అంతలోనే నేను, "చాల్లే ఊరుకోండి" అనేశాను. తర్వాత, "నేనే వాళ్ళకు ఆ అవకాశం కల్పించాను" అని చెప్పేశాను అతి నెమ్మదిగా.
"ఏమిటీ, నువ్వా! ఎందుకు?" అడిగారు మావారు గమ్మున.
"ఏమండీ చెప్తే మీక్కాదా. అంతగా మాట్లాడుకోవాలంటే బయటకు వెళ్లండి" అని అన్నారు ఎవరో.
నేను మౌనం వహించాను.
మావారూ మాట్లాడలేదు.

***

సినిమా ఐపోయింది.
ఆయన స్కూటర్ ని తెచ్చి, నా వద్ద ఆగుతూనే, "ఏమిటి నీ ఈ పని." అని అడిగేశారు.
"వాళ్ళు కొత్త దంపతులు. వాళ్ళు మన ఇరుగు వాళ్ళు. వాళ్ళ ఇబ్బంది గుర్తించాను. కనుకనే నేనే వాళ్ళకు ఆ అవకాశాన్ని కల్పించాను" అని చెప్పుతున్నాను నేను.
"అంటే, టిక్కట్లు..." టక్కున అడ్డు పడ్డారు మావారు.
"నేనే తెప్పించుకున్నాను. మీతో వేగలేను కనుకనే ముందే ఇవేమీ మీకు చెప్ప లేకపోయాను" చెప్పాను.
"మరే నీ సంగతి తెలిసే, అలా వాళ్ళను అక్కడ చూసినా నేను తమాయించుకొని తిరిగి నీ ముందుకు వచ్చాను. విషయం ఏమిటై ఉంటుందా అని అడిగేయాలని" అన్నారు మావారు.
"సంగతి తెలిసిందిగా. ఇక ఇంటికి పదండి" అని నేను అన్నాను.
మావారు, "హోటల్ లో డిన్నరు చేద్దాం. పిమ్మట ఇంటికి వెళ్దాం" అని అన్నారు నవ్వుతూ.
"నేను వండేశాను" చెప్పాను.
"పోనీ" అన్నారు మావారు ఈజీగా.
మావారి తీరు నాకేమీ అర్ధం కావడంలేదు.
మావారు స్కూటర్ స్టార్ట్ చేశారు.
"రా, కూర్చో" అన్నారు.
నేను కదిలి, స్కూటర్ వెనుక కూర్చున్నాను.
దార్లో, "నీ టిక్కట్లు మరి కాస్తా ముచ్చట్లు వారికి అందివ్వనీ" అన్నారు మావారు.
నాకు ముచ్చటయ్యింది.
"నీ మది వాళ్ళ ఇల్లులా ఇరుకు కాదుస్మీ" అన్నారు మావారు, నిండుగా.
నేను పొంగిపోయాను. ఆ వెంటనే చిన్నగా కేరింత వేసేశా.
మావారు ఆ స్టార్ హోటల్ ముందు స్కూటర్ ఆపారు.


***


(ఈ కథ "పత్రిక" - మాస పత్రిక - జూలై, 2006 సంచికలో ప్రచురితమైనది)


***

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.