ఫలించని మోసం


అనగనగా ఒక గ్రామంలో ఒక చాకిరేవు. గ్రామస్థుల బట్టలు తెచ్చి ఆ చాకిరేవులో ఉతికి ఆరవేసి తిరిగి ఎవరివి వారికి వారి ఇంట్లో ఇచ్చేస్తారు చాకలివాళ్ళు. ఆ గ్రామాన్ని ఆనుకునే ఒక అడవి.

ఒకరోజు రాత్రి అడవిలోంచి ఒక నక్క తిరుగుతూ తిరుగుతూ చాకిరేవువద్దకు వచ్చింది. అక్కడ ఒక చాకలివాడి ఇంటి ముందున్న నీటితొట్టి చూడగానే దాహంగా అనిపించి తొట్టిలో నీరు త్రాగబోయి కాలుజారి అందులో పడిపోయింది.

నీలిరంగు నీటితో నిండి ఉన్న తొట్టిలోంచి పైకి వద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యపడకపోవడంవలన ఆ రాత్రంతా నీళ్ళలోనే నానుతూ ఉండిపోయింది నక్క . అందువలన నీళ్ళ తాలూకు నీలిరంగు శరీరమంతా పట్టి నక్క శరీరం నీలముగా మారిపోయింది.

మరునాడు ఉదయం చాకలివాడు వచ్చి చూడగా తొట్టి నీళ్ళలో పడిఉన్న నక్క కనిపించింది.

నక్కలో కదలిక లేకపోవడంతో అది చచ్చిందనుకుని దానిని తీసుకుని పోయి దూరంగా గ్రామం అవతల పడవేసి వెళ్లిపోయాడు చాకలివాడు.

అప్పటిదాకా చచ్చినట్లుగా నటిస్తున్న నక్క “అమ్మయ్య బ్రతికాను” అనుకుంటూ నెమ్మదిగా లేచి అడవిలోకి బయలుదేరుతూ తన శరీరమంతా నీలంగా మారి ఉండటం గమనించి ఎంతో ఆశ్చర్యపోయింది.

అడవిలోకి వస్తున్న నీలంరంగులో ఉన్న నక్కను చూసి జంతువులన్నీ ఏదో క్రొత్త, వింత జంతువు వచ్చిందనుకుని భయపడి పారిపోసాగాయి.

అది అవకాశంగా తీసుకుని ఆ జిత్తులమారి నక్క వాటితో “నన్ను చూసి మీరు భయపడవలసిన పనిలేదు . మీరందరూ సుఖముగా ఉండాలనుకుంటే నన్ను మీ రాజుగా ఎన్నుకోండి. అప్పుడు మీకు నావలన ఎలాంటి హాని కలుగదు” అని చెప్పింది.

కాదంటే ఈ క్రొత్త జంతువు ఎక్కడ తమని చంపేస్తుందోనని భయపడి అడవిలోని జంతువులన్నీ సరేనన్నాయి. అప్పటినుండి ఆ మోసకారి నక్క జంతువులకి రాజుగా సుఖాలన్నీ అనుభవిస్తూ రాజునయ్యాననే గర్వంతో తోటి జంతువులని చులకనగా చూస్తూ అవమానిస్తూ ఆనందపడసాగింది.

ఇలా కొంతకాలం జరిగింది....

ఒకనాడు జంతువులన్నీ సమావేశమైనాయి.

ఆనాడు సమావేశానికి ఏదో కారణంవలన నక్కలు మాత్రం రాలేదు.

జంతువులన్నీ ఏదో చర్చలో మునిగి ఉన్న సమయంలో ఉన్నట్లుండి వాటికి బిగ్గరగా నక్కల ఊళలు (కూతలు) వినపడ్డాయి.

ఆ అరుపులు విని రాజుగా సమావేశం నిర్వహిస్తున్న నీలిరంగు నక్క కూడా జాతి సహజమైన స్వభావంతో తనను తాను మర్చిపోయి ఊళ పెట్టసాగింది.

అది విని మిగిలిన జంతువులన్నీ తమ రాజు కేసి చూసి ఆశ్చర్యపోయి “అయితే ఇది మామూలు నక్కయే గాని క్రొత్త జంతువు కాదన్నమాట. దాని నీలిరంగుని చూసి అందరమూ భయపడటంతో ఇన్నాళ్ళూ మనల్ని మోసం చేసిందన్నమాట, ఎంత ధైర్యం! దీనికి తగినశాస్తి చేయాలి ” అనుకుని కోపంతో అన్నీ కలిసి ఒక్కసారిగా దాని పైకి దూకి చితకబాది ఆ మోసకారి నీలిరంగు నక్కని ఆ అడవిలోంచే తరిమికొట్టాయి .


నీతి : ఎవరైనా తమ అసలు స్వభావాన్ని దాచిపెట్టి ఎదుటివారిని మోసగించాలనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ మోసం బయటపడక తప్పదు. మోసం ఎక్కువకాలం దాగదు .

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.