బేరం

‘ఇగో .....మంగమ్మక్క....ఇదిన్నావా.....గదేదో షాప్ లో చీప్ గా చీరలిత్తాండ్రట ...ఆరొందలది , రెండొందలకే నట .....గందుకే వుశుకపోస్తే రాలనంత మంది ఉన్నారట....

గందుకే ...గియ్యాల తొందరగా పనిదీర్సుకుని వచ్చిన......నువ్వు వత్తావానక్క ......’పర్సుతోనొచ్చి నించున్న పక్కింటి లక్ష్మి ని సూసి , ‘వత్త... వత్త...గదేదో ......సగం ధరలకే ఇత్తున్నారని ......టీ వి ల,రేడియోల ఒకటే లొల్లి

ఎట్లయినా పండుగకు తీస్కోవాలి .......ఎప్పుడైనా ఆడబిడ్డలొస్తే పెట్టాలి.... .పనికొత్తయి ....డిస్కౌంట్ కొచ్చినప్పుడు తీసుకుంటే అగ్గువకు పడతాయి కదా...’అంటూ, సంచి తో చేతుల పరుసు తో వచ్చింది మంగమ్మ. ‘గదె అక్క, వచ్చేప్పుడు...దార్లోనే కదా ...మార్కెట్ల కూరగాయలు కొందామని సంచి తెస్తున్నా....పా పా ......మంచి మంచి డి జైన్ లన్ని అయిపోతాయి...’ తొందరపెడుతూ అంది...

ఎప్పుడైనా ఆషా డ మాసం ల ఉండేది గీ డిస్కౌంట్,,,, ఈ సారి జరంత ముందరే వచ్చింది.....’ సంతోషం తాండవిస్తుంది లక్ష్మి గొంతులో.

షాప్ ల యాడ సూసినా విపరీతమైన జనం.......చీరలన్నీ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.

‘గిదెంది అక్క... ఏ చీరె సూస్తే గదె తీసుకోబుద్దవుతాంది ………ఇంకో రెండువేలు తెచ్చినా బావుండేది.....గిన్ని ఉంటాయనుకోలే......’

‘ మరే..... నా సంగతి గూడ గట్లనే ఉన్నది....ఇప్పటికే అయిదు తీసుకున్నా...అయినా ఏది సూత్తే గదె తీసుకోబుద్దవుతుంది ........’

ఎట్లా నో చీకటిపడే యాళ కి చేతుల్లో చీరేల సంచులతో తిరుగు ముఖం పట్టారు..దారిలో దారెంబడి కూరగాయలమ్మే వారిని సూడగానే కూరగాయలు కొనాలనుకున్నది గుర్తొచ్చింది

‘అమ్మా.... తాజా మాలమ్మా.....తాజా వంకాయలు... పావు ఆర్రూపాయలు మాత్తరమే నమ్మా...’ అంటూ అరుస్తున్న కూరగాయలమ్మి దగ్గరకెళ్లింది మంగమ్మ.నిజంగానే చాలా తాజాగా ఉన్నాయి.

ఎంత కిత్తవెంది ........’ ఆమె మొహం సూసింది...బక్కగా , పాత చీరలో ఉంది. అంత చిక్కిన పానం నుండి, అంత పెద్ద అరుపేలా వస్తుందో నని ఆశ్చర్యం ఎసినా , అవసరం అలాంటిది అని జాలి పడుతూ బేరం ఆడింది. పావు నాలుగు కె ఇయ్యాలని పట్టు పట్టి, ఇయ్యనంటే ఎల్లిపోతానని, వెనుదిరిగింది. రమ్మని పీల్చి మరీ అరకిలో ఇచ్చింది ఆమె. అప్పటికి ఆమె సణుగుతూనే ఉంది’ కాయలను సూసి డబ్బులివ్వండమ్మ... బస్ ఛార్జీలు పెట్టుకుని ఇంత దూరం వచ్చి సలిల వణుక్కున్ట వత్తే మాకేమ్ వత్తదమ్మ... ఏదో రాత్తిరి అయితుందనే గాని....’ అంటూ ఇస్తుంటే, తాను అన్న మాట నుండి తగ్గనందుకు గర్వంగా మొహం వెలిగిపోయింది మంగమ్మకు.

‘ నీకు తెలీదు లక్ష్మి .....గీడ గిట్లనే బేరమాడాలే...శీకటి పడ్డదిరా...రా....’

************

తెల్లవారి పట్నం నుండి ఆడిబిడ్డ వచ్చింది మంగమ్మ ఇంటికి.....ముందు బయటకెల్లే మొగనికి అన్నం పెట్టి, ఆడిబిడ్డ శారద తో మాట్లాడుతూ కూసున్దీ మంగమ్మ.

మాటల మధ్యల నిన్నే తెచ్చిన చీరేలు ఎంత తక్కువ పడ్డాయో చెపుతూ సూపించింది.అవి సూడంగానే, ‘అయ్యో ...గీ చీరె గింద డబ్బులు పెట్టి ఎందుకు కొన్నావొది నే.....దీని ధర ఇంకా తక్కువే ....నేనూ తీస్కున్న..అచ్చం ఇలాంటిదే.... మొన్న... పెళ్లిరోజు కట్టుకుని ఉతికితే సూద్దును కదా... దీని ప్రింటన్తా పోయింది....నిన్ను భలే మోసం చేసిండ్రు’ అన్న శారద మాటలకు అయ్యో ... ఎంత మోస మయ్యింది...గిందుకేనా వాడసలే వాపస్ తీసుకొనన్నాడు... పైగా ఎంత జనం.. ఎంత డిమాండ్....అక్కడ ఎంత రాసిపెట్టి ఉంటే అంతే...బేరం ఆడదానికే లేదు....’ మంగమ్మ అంటుండగానే, లోపల్నుండి మంగమ్మ భర్త బయటకొస్తూ,’ ఆహా...వంకాయ కూర అమృతమ్లాగుందనుకో...ఎడ కొన్నవే మంగా, మా శారదకి బాగా ఇట్టమ్....తాజా వంకాయల్లగున్నాయి...ఓ ముద్దెక్కువే తిన్నాననుకో.....’ అన్నాడు బ్రేవ్ మని తెనుస్తూ.

మంగమ్మ కు వెంటనే ఆ కూరలమ్మి బక్క చిక్కిన దేహం గుర్తొచ్చింది... అందాలకు వందలు పోసి గ్యారెంటీ లేని చీరలు కొనడానికి చేతులు వచ్చినాయి కానీ ఎదురుగా తాజాగా ఉన్న కూరగాయలను సూసి ఏ మోసం ఉండదని తెల్సినా , ఆమె మొహం సూసి జాలిపడినా కూడా గీచి గీచి బేరమాడి అయిదు రూపాయలివ్వడానికి కూడా చెయ్యి రాలేదు... మంగమ్మ కు తన మీద తనకే అసహ్యం వేసింది....ఇలా కనీసం తనకు బుద్ది వచ్చేలా సేసిన షాప్ వానికి ఒక రకంగా మొక్కాలెమో అని కూడా అనిపించింది.

***********************

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.