అమ్మో.. అమ్మాయీస్..

“అమ్మా..నాన్నా..డాడీ మమ్మీ..! రవితో పెళ్లి..కేన్సిల్..వాళ్ల డాడీ మమ్మీలకు ఫోన్ చేసి చెప్పేయండి..”బట్టీపట్టి చెప్పిన డైలాగ్ అప్పచెప్పేసి నిష్ర్కమంచిన ఇంపోర్టెడ్

హీరోయిన్లా తన రూంలోకి దూరిపోయి డోర్ లాక్ చేసేసుకుంది సుమన .

హాల్లో మిగిలిన అమ్మానాన్నలు సుజనా రమణలు కూతురి డైలాగ్ అర్దంకానట్లు తెలుపెక్కిన ముఖాలతో చిన్న కూతురు కీర్తిని బ్లాంక్గా చూశారు. నాకేమి తెలియదన్నట్లు భుజాలెగరేసింది.

‘ఏంకాలమో ఏంపాడో పోయిన వారం.. లవ్వన్నారు..మొన్నేమో.. పెళ్లన్నారు..నిన్నేమో.. ఎంగేజ్ మెంటయింది..యిప్పుడేమో కేన్సిలంటున్నారు..అసలు నాకేమీ అర్దంకావడం లేదు.”.జుట్టు పీక్కున్నాడు రమణ. “అసలీ కాలంలో అమ్మానాన్నల బ్రతుకులే జూనియర్ ఆర్టిస్టుల స్తాయికి ధిగజారి పోయాయి..పిల్లలేమో డైరెక్టర్ ల స్తాయికి ఎదిగి పోయారు..వాళ్లెయ్యమంటే అక్షింతలెయ్యాలి..లేదంటే మానేయాలి.” అక్కసంతా కక్కేసింది సుజన.

“ఐతే అమ్మా! అక్క పెళ్లి కేన్సిలేనా?..పెళ్లికని కాస్ట్లీ డ్రస్సులు కొన్నాను..వేలకువేలు తగలేసి మెహందీ పెట్టించుకున్నాను..ఫేషియల్ చేయించుకున్నాను..అంతా వేస్టేనా”..అంటూ ఏదేదో మాట్లాడుతున్న కూతుర్ని వింతగా చూస్తుంటే ఎదురుగా వున్న లేండ్ ఫోన్ మోగింది. ముగ్గురికీ అది రవి ఫోనేనని అర్దమై పోయి ఏంచెప్పాలో అర్ధంకాక డెంగ్యూదోమను చూసినట్లు బెదిరిపోయి..నువ్వెత్తు అన్నట్లు కీర్తికి సైగలు చేశారు. 

కీర్తి ఫోనెత్తి.”.హాయ్ బావా! ..అక్కా? యిక్కడలేదు..తన రూంలోవుంది..సెల్లుకు చేయండి.”.సలహా యిచ్చింది. “అదీ అయ్యింది..తన ఫోన్ స్విచ్చాఫ్ లోవుంది.మార్నింగ్ ఫోన్ చేసి మన పెళ్లి కేన్సిల్ అని కట్ చేసింది..అంతే..నీకేమైనా చెప్పిందా?..”ఆశగా అడిగాడు రవి..”నాకా నాకేం చెప్పలేదు బావా.” “ .ప్లీజ్ కీర్తీ ప్లీజ్ అక్కనడిగి చెప్పవా”..రిక్వెస్ట్ చేశాడు.” ట్రై చేస్తాగాని బావా ..నిన్నేమైనా జ్యూయలరీ షాప్ లో భేటా ఆఫ్ కోటాగా బిహేవ్ చేశావా..?” డైరెక్టుగా అడిగేసింది బావ స్వభావం తెలిసిన కీర్తి..” ఛా అదేంలేదు ..నా క్రెడిట్ కార్డు తన దగ్గరే వుంది..నిన్న ఎంగేజ్ మెంటుకి వన్ లేక్ రింగ్ కొనుక్కుంది..ప్లీజ్ కీర్తీ కొంచెం అడిగి చెప్పవా”.. “ట్రై చేస్తాగానీ..ముందు మీరు నాకో ప్రామిస్ చేయాలి”..బేరం పెట్టింది..”ష్యూర్ ష్యూర్ ప్రామిస్..”కమిటై పోయాడు రవి.” మీ పెళ్లికని బోల్డంతఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకున్నాను..

మెహందీ పెట్టించుకున్నాను..కాస్ట్లీ డ్రస్సులు కొనేసుకున్నాను..యివన్నీ మీ రిద్దరూ బేర్ చేస్తానంటేనే”! “”అక్కనొదిలెయ్..మైహూనా.”రవి..సర్ది చెప్తుంటే ..”ఔరేక్ హై” ..అంటూ గారాలు పోయింది.”.ముందు పెళ్లవనీ తల్లీ..నువ్వు ఏదడిగితే అది.” .”అంతొద్దు బావా..పార్లమెంటులో మాటిచ్చిన మన్ మోహన్ సింగ్ మాటలకే దిక్కులేదు..అయిదు కాదు పదేళ్లు ఫ్రత్యేక హోదా అన్న వెంకయ్య నాయుడు గారే నాలుక మడతేసుకుంటున్నారు..” “సరే కీర్తీ సరే..ఫుల్ టెన్స్ లో వున్నాను..చెప్పు” నీరసంగా అన్నాడు..

“సరే బావా నీ టెన్స్ నాకు అర్దమైపోయింది. క్లైమాక్స్ లో ఆడుగుతా ..పోన్ డాడీకిస్తున్నా”..ఫోన్ డాడీకిచ్చేసి జంపైపోయింది కీర్తి. ఎంగేజ్ మెంటును కూడా కేర్ చేయని సుమన గురించి తాము తలలు బద్దలు కొట్టుకుంటుంటే యిదేమో డ్రెస్సుల గురించీ మెహందీ గురించి వాగ్దానాలు తీసేసుకుంటోంది..నవ్వాలో ఏడవాలో అర్దంగాక పోనందుకున్నారు రమణ.

“అక్కా! ఆ బుంగమూతి అస్సలు నీ ఫేసుకు సూటవలా..కారణమేంటో కనుక్కోమని బకరా బావ బావురుమంటున్నారు..అసలేమైందక్కా..?” నువ్వు ముందు నోర్ముయ్ అన్నట్లు చూసింద సుమన.. మళ్లీ గోడమీది బల్లి మీద చూపు నిలుపుతూ..”అక్కా! కోపంలోకూడా నువ్వింత అందంగా వుంటావు కాబట్టే బకరా బావ బల్లిలా నీకతుక్కు పోయాడు..సరే ..నాకేం చెప్పొద్దుగానీ యిప్పుడుమాత్రం రవి బావనే చేసుకుని బావ నాకిచ్చిన వాగ్దానాలతోబాటు ఐఫోన్ సెవెన్ కొనిచ్చాక కావాలంటే డివోర్సిచ్చేయ్”..గడ్డం పట్టేసిన చెల్లిని ముద్దాడి “అవన్నీ నేను కొనిపెడతాగానీ రాయబారం సీను కట్టేసి ముందు హాల్లోకి జంపైపోయి రవితో చెప్పు నో రాయబారాలని.”..కీర్తిని బయటకు నెట్టేసి డోర్ లాక్ చేసేసుకుంది సుమన.

*******

హాలంతా రవి, రవి తల్లి సరోజిని తో బాటు రవి తాతయ్య నాయనమ్మ యిద్దరన్నయ్యలు వదినలతో నిండిపోయింది. అమ్మా నాన్నలతో బాటు సుమన, కీర్తులు సోఫాలో సెటిలై పోయారు. రమణ సుజనలు డల్ గా వుంటే సుమన మాత్రం మామూలుగా వుంది.ఫాలిపోయిన ముఖంతో అయ్యో పాపం అనిపించేలా వున్నాడు రవి.” అంకుల్.. డాడీ అర్జంట్ పని మీద నిన్న రాత్రే ఢిల్లీ వెళ్లిపోయారు.” తొలిసారిగా ఆతి కష్టంమీద నోరిప్పాడు రవి.”

 అమ్మా సుమనా..అయిదేళ్లనుండి ప్రేమలో వున్నారు..మీ యిద్దరిఇష్ట ప్రకారమే ఎంగేజ్ మెంట్ చేశాం. మన మధ్య కట్నాల గొడవల్లేవు..కులమతాల పట్టింపుల్లేవు..పెట్టిపోతలమాటలే లేవు..నిన్నటివరకూ అంతా సవ్యంగానేవుండింది..ఇంతలోనే ఏమయ్యిందిరా..వీడేమో బిక్కముఖం పెట్టేశాడు..నువ్వేమోమౌనవ్రతం పూనేశావు..మీరిద్దరూ నోళ్లిప్పకఫోతే మాకెలా తెలుస్తుంది చెప్పు”..వయసైపోయిన లక్ష్మీదేవిలా వున్న రవి నాన్నమ్మ లక్ష్మీదేవమ్మ అనునయంగా అడిగింది. సుమన ఉడెన్ ఫేసుతో ఉలుకూ పలుకూ లేకుండా వుండి పోయింది.” మనమడా నువ్వన్నా విప్పరా నోరు..”రవి తాతగారు రాఘవయ్యగారు అడిగారు.

“నాకేం తెలయదు తాతయ్యా..సుమీ మార్నింగు పోన్ చేసి మన మేరేజ్ కేన్సిల్ ఆని ఒకే ఒక్క మాట చెప్పి పోన్ స్విఛ్చాప్ చేసేసింది” . బిక్కముఖం పెట్టేశాడు. ఇప్పుడే సుమీ ఆంటున్నావు బావా..పెళ్లైయ్యా క కొంచెం లావైతే సుమో ఆంటావేమో కొంపతీసి..మనసులోనే మదనపడి పోయింది..కీర్తి.

“తాతయ్యా అమ్మమ్మలు అడుగుతుంటే నోరిప్పవే.”.చిరాకు పడి పోయింది సుజన.

“నువ్వు తనను మరీ సతాయించకు..చెప్పమ్మా..చెప్పు తల్లీ..నిన్ను బలవంతం చేస్తున్నామనుకోకు..అంతా నీయిష్టప్రకారమే చేస్తున్నాంకదా..యిష్టం లేదంటున్నావ్..ఓకే..కారణమేంటో చెప్పు..నేను వియ్యాలవారికి సర్ది చెప్పుకుంటాను. రవిని నువ్వే కన్విన్స్ చేద్దువు గాని” .

సుమీ ఒక్కసారి యిటు చూడు ప్లీజ్..మనసులోనే డైనమైట్లు పేల్చేసుకుంటున్నాడు రవి..ఫంక్షన్

లో తనేమైనా అతిగా ప్రవర్తించానా అని..ఫ్లాష్ బ్యాక్ రీళ్లు చుట్టేసుకుంటూ కలవరపడిపోతుంటే నానుంచి ఇంతకాలం..ఆ భయంకరమైన సీక్రెట్ దాచి పెట్టినందుకు నీకీ శిక్ష తక్కువే బాబూ..తన్నిపెట్టకొస్తున్న కోపాన్ని అణిచి పెట్టకుంటూ..తలవంచుకునే తను సంధించబోయే ప్రశ్నాస్త్రాలకు పదును పెట్టేసుకుంటోంది సుమన ..

“కొంచెం నోరిప్పు తల్లీ..మా రవి బాబేమన్నా హద్దులు మీరాడా..?అతిగా ఏమైనా వాగాడా..? మా అందరికీ బిపీలు పెరిగి పోతున్నాయ్ “.. మళ్లీ లక్ష్మీదేవమ్మ గారే సుమన ప్రక్కన కూర్చుంటూ తల నిమురుతూ అడిగారు. అబ్బే..అదేం కాదండీ అన్నట్లు తలూపింది సుమన. హమ్మయ్య అనేసుకున్నాడు రవి .

“అదేదీ కాదంటున్నావ్..నువ్వు నోరిప్పకపోతే మాకెలా తెలుస్తుంది చెప్పు”..రవి మదర్ సరోజిని అడిగింది.

మొదటిసారిగా తలెత్తి ఆందరినీ చూసింది.అందరి ముఖాల్లోనూ..ఆతృత.. “అక్కా !బకరా బావ భయంతో గుడ్లు..తేలేసే లా వున్నాడే..కొంచెం కరుణించవే బాబూ”.. చెవిలో గుసగుస లాడేసింది... కీర్తి . “షటప్పువర్ బ్లడీ మౌత్.”

అని వార్నింగిచ్చి..”నిన్న ఫంక్షన్లో మామయ్యగారిని చూశాను..” ఆగిపోయింది సుమన..అందరూ నోళ్లు తెరిచేశారు..మామయ్యగార్ని చూడ్డానికీ ..పెళ్లి క్యాన్సిలేషన్కీ సబంధ మేంటా అనుకుంటూ..ఒక్క నిమిషంపాటు అనిమిషులై శిలా విగ్రహాల్లా అచేతనులై పోయారు.

“రాత్రి వాట్స్ యాప్ లో రవి నిన్నటి ఫంక్షన్ ఫొటోలతో బాటు తన ఫ్యామిలీ ఫొటోస్ కూడా పంపించాడు..”

అనిమిషులప్పటికే మనుషులైపోయి సుమన చెప్పిన అక్షరాల్ని..అరగదీసేస్తున్నా..అందులో ఆవగింజంత కూడా..అర్ధం స్పురించక పోవడంతో..తుస్సుమన్న..తురుంఖాన్లై..తెల్లబోయారు.

“అమ్మాయ్ రవి పంపిన ఫొటోలకీ..ఈ పెళ్లికీ సంబంధమేంటో వయసైపోయిన ఈ ముసలి బుర్రకసలేమీ తట్టడంలేదురా..కొంచెం వివరంగా”..లక్ష్మీదేవమ్మ సుమన గడ్డం పట్టకుని అడిగింది..

“అమ్మమ్మగారూ..త్రినాధ్ అంకుల్ది..బ..ట్ట..బు..ర్రా..ఐమీన్ క్లాత్ హెడ్డా..?”

అక్షరాల్ని కూడపలుక్కుంటూ..అడిగేసింది. అందరూ తెల్ల ముఖాలు పెట్టేస్తే..తాతగారు రాఘవయ్యగారు..మాత్రం..పకపకా నవ్వేస్తూ.. “పెద్ద దెభ్బే కొట్టావ్ మనమరాలా..బియ్యంలో వడ్లగింజ..ఇదేనా నీ సమస్య.”? తేలికపడిన మనసుతో అడిగేశారు.

“ఔనండీ తాతయ్యగారూ..నిన్న ఫంక్షన్ లో ఒత్తైన జుట్టుతో కన్పిచారు..రవి పంపిన ఫొటోలో బట్టతల..”

“ఔనే తల్లీ వాడిది బట్ట..బుర్రే..మరీ ముప్పై అయిదేళ్లకే ..నువ్వేమన్నావ్ అదే క్లాత్ హెడ్ అయిపోయింది..రేపు రవి బుర్ర కూడా క్లాతై పోతే ?”ఇదేగా నీ అనుమానం..

ఔనన్నట్లు బుధ్దిగా తలూపింది సుమన. “సుమనా..మాకు ముగ్గరు కొడకులు ..మీ మామయ్యత్రినాధ్ పెద్దోడు..వాడి తర్వాతి వాడు శ్రీనాధ్. ఆఖరి వాడు..విశ్వనాధ్..త్రినాధ్.. కొక్కడికే..మేనమామ పోలికలొచ్చాయి..మాకుటుంబంలో

ఎవ్వరికీ బట్టతలలు లేవు.. వీళ్లని చూడు రవి అన్నయ్యలు..వీళ్లెవరికీ బట్టతలలు కాదు..నీ రవికి కూడా రాదు..నాదీ గ్యారంటీ..”రాఘవయ్యగారు కుండ బద్దలు కొట్టేసారు.” అమ్మాయ్ నీ అనుమానం నూటికి నూరుపాళ్లూ కరెక్ట్. ఏం..? అమ్మాయిలే అందం గా వుండాలా..? అబ్బాయిలు ముప్పై ఏళ్లకే బట్టతలా బానపొట్టల్తో వుంటే అసహ్యంగా వుండరా..? మా కాలంలో మీఅంత బుర్రల్లేక మీమామయ్య గారి బట్టతలకు నేను బలైపోయాను..కంగ్రాట్స్ రా..”లేచొచ్చి కోడల్ని ముద్దాడేసింది..సరోజిని. ఒక్క సారిగా వంగి అత్తగారితోబాటు తాతయ్యా అమ్మమ్మల పాదాలకు నమస్కరించేసింది సుమన. “అక్కా..హిందీ సీరియల్స్ చూసి కదా యిలా బూందీ పెట్టడాలు నేర్చుకున్నావ్..?

అంటూ చెవి కొరికేసి బకరాబావ పక్కన చేరిపోయి.. “క్లైమాక్సులో అడుగుతానన్నాగా..బావా ..ఐపోన్సెవెన్ ”అంటూనే షేక్ హ్యాండ్ యిచ్చేసింది.

హఠాత్తుగా వచ్చి.. సుమన రవిని లాక్కుపోయి..తన గది లాక్ చేసేసుకుంది.

సుమన స్పీడుకు అమ్మమ్మాతాతయ్యలు..నోళ్లు తెరిచేస్తే..మిగతా జనాలు..నవ్వుల పువ్వులు పూయించేశారు ***


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.