" లోపలిమనిషి "

గుండెలమీద ఎవరో కూర్చుని....ఎవరో ఏమిటీ తన భర్తే ,చేతిలో తాడు...అయ్యో ఇదేమిటీ ఇలా ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది..తన గొంతుని ఆ..ఆ తాడుతో బలంగా ,…మూసుకు పోతున్న కనురెప్పల్ని బలవంతంగా ఎత్తి చూసింది ..అది తన మెడలోని తాళే ...తాడు కాదు...మిలమిల మెరుస్తున్న సూత్రాలతో ఉన్న బంగారు గొలుసు...పోనీలే తన చావు కూడా ఖరీదైన ఆయుధంతో ...బంగారంలాంటి మొగుడని అందరూ అన్నా..తనకు తెలుసు అది నకిలీ బంగారమేనని..కానీ తను చావబోతున్నది మాత్రం స్వచ్చమైన మేలిమి బంగారు తాడుతోనే..తప్పు తప్పు గొలుసుతోనే...

ఊపిరి ఆడక తను గింజుకున్నకొద్దీ ' ఆ ' కళ్ళలో కనపడే ఆనందం దశాబ్దాలుగా తనకు సుపరిచితమే. శూలాల్లాంటి మాటలు ఎన్ని సార్లు తన గుండెల్లో గుచ్చుకుని గాయం చెయ్యలేదూ...తన గుండె తడిమి చూసుకుంటే నిండా గాయాలే నెత్తురోడుతూ...

ఆర్నీ ,కనీసం ఇప్పుడైనా రాముడా దేముడా అనుకోక ఈ శవపరీక్ష,శల్యపరీక్షాదేనికీ?తన జీవితం ముగిసిపోయి చాలా ఏళ్ళే అయింది..జీవచ్చవమేతను,అలాగే ఇద్దరు పిల్లలకు తల్లయింది ...తను గడిపిన బ్రతుకంతాయాంత్రికతే.

"ఏమిటా వెధవ ముఖం? పెద్ద ఐనస్టీన్ లా ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటావ్? తెల్లారి ఇంతసేపయింది లేచి నా ముఖాన యిన్ని కాఫీ నీళ్ళు పోసేదేమైనా ఉందా? లేదా? ఎలాగైతే నువ్వే చేసావు బోడి పి.హెచ్ .డీ...." ఖంగుమంది ఆయన గొంతు....

తుళ్ళిపడి కళ్ళు తెరిచి అయోమయంగా చూసింది శాంతి..తను పక్క మీదే ఉంది, మెడ తడిమి చూసుకుంది ,నిక్షేపంగా ఉంది..తను చచ్చిపోలేదా? మరి తన గొంతుకు బిగించిన ఆ గొలుసు...ఫక్కున నవ్విందిఅంతరాత్మ, తనకంత అదృష్టమా? అది తనకు తరచూ వచ్చే కలలాంటి అనుభవం... మళ్ళీ అదేమిటీ...కల అనుకోవచ్చుకదా...కలలాంటి అనుభవం ఏమిటీ…తన పైత్యం కాకపోతే...నిజమే ఈయన అన్నట్లు తను ఎక్కవ చదువుకోవడం వలన జరిగిన అనర్ధాల్లో ఇదొకటీ...

"నువ్వుండగా నాది వెధవ ముఖం ఎందుకైందీ? " ఆ ప్రశ్న మనసులోనే, పెదవి దాటిందా థియరీ నుంచి ప్రాక్టికల్ కి వెళ్ళిపోతాడు...భగవంతుడు మొగాడికి ఆ పశుబలం పెట్టింది పెళ్ళాల్ని హింసించడానికేనేమో...ఏమో … ‘ఆ దేముడూ మొ’గాడేగా ‘ ...మళ్ళీ ఫక్కున నవ్వింది.

ఆహా ఇప్పుడు కూడా నా బుర్ర ఎంత బాగా పని చేస్తోందో ...తిట్టడం లోంచి కొట్టడంలోకి అనేది థియరీ లోంచి ప్రాక్టికల్స్ కి అనీ... ' దేముడూ మొ’గాడూ ‘… లాంటి పద ప్రయోగాలు... ఎంతైనా మీ ఆయన అన్నట్లు నువ్వు జీనియస్ వే శాంతీ.

"మాట్లాడితే అయోమయం లాంటి చూపు...అర్ధంపర్ధం లేని వెకిలి నవ్వు ...నా ఖర్మ కొద్దీ దొరికావు ,సాదాసీదా దాన్ని పెళ్ళాడితే కనీసం ' పెళ్ళాం గా' అయినా పనికొచ్చేది..." కసిగా అంటూ ప్రతిస్పందన కోసం శాంతి ముఖం లోకి చూసాడాయన.

ఆ మాటలకీ, చేష్టలకీ స్పందించడం, ప్రతిఘటించడం మానేసి చాలా కాలమే అయింది....తన మౌనం , నీ స్థాయి అంతేలే అన్నట్లు చూసే చూపూ ఆయనను మరీ వెర్రెక్కించి మృగాన్ని చేస్తాయి...కానీ ...లేకపోతే తను ఏం మాట్లాడినా పెడర్ధం తీసి చెయ్యి చేసుకోవడం కూడా మొదలు పెట్టాకా తనకు ఈ మార్గమే బాగుంది...ఓపికున్నంత సేపూ అరచి అరచి ఆయనే ఊరుకుంటాడు.

"ఏమిటీ వినబడలేదా? ఇంకా ఎంతసేపు పడుకుంటావ్?మహారాణిలా… ఎవరైనా తెల్లారి లేస్తూనే దైవనామం జపిస్తారు ...నా బతుక్కి ' కాఫీ' నామమే...కాకిలా కా కా అని అరచి అరచి గొంతు ఎండిపోతే తప్ప రాణిగారికి కరుణ కలిగి నా ముఖాన కప్పుడు కాఫీ తగలబడదు..." చేతిలో పేపరుతో సహా దగ్గరకొచ్చి పలికిన శ్రీవారి సుప్రభాతం...

"ఇదుగో లేస్తున్నానండీ...ఇంకా అయిదేగా అయింది..ఆదివారమేగా అనీ.."

"ఏమిటో ఆదివారం అంత స్పెషల్...పెద్ద మిగతా రోజుల్లో పెద్ద పాటుపడిపోతున్నట్లు.." వెటకారం గొంతునిండా...

ఠక్కున మెదడు స్విచాఫ్ చేసేసింది శాంతి... లేకపోతే ఆ సుప్రభాతం అంతా చెవికెక్కి అక్కడనుంచి తలకెక్కి...రోజంతా అర్ధం పర్ధం లేని ఆలోచనలు, తలనెప్పి అవసరమా?

లేచి స్టవ్ వెలిగించి డికాషంకి నీళ్ళు పడేసింది ,ఫిల్టర్ లో కాఫీపొడి వేసి మరిగిన నీళ్ళు పోసి , ఫ్రిజ్ లోంచి పాలపేకట్ తీసి కిచన్ గట్టు మీద పెట్టి వెళ్ళి బ్రష్ చేసుకు వచ్చింది.

పాలు కాచి ,డికాషన్ బాగా తిరగబోసి పాలలో కలిపి రెండు కప్పుల్లో పోసింది మౌనంగా ఆ కప్పు తీసికెళ్ళి ఆయన దగ్గర నిలబడింది.

కింద పెట్టినా తప్పే, చేతికిచ్చినా తప్పే...ఆయన మూడ్ ని బట్టి అక్కడ పెట్టు అంటే టీపాయ్ మీద పెట్టాలి.. చెయ్యి చాపితే చేతికివ్వాలి...

ఈవాళ ఉదయం కళ్ళుతెరవకుండానే అర్ధమైంది అయ్యగారి మూడ్...

" అక్కడ తగలెయ్ " విసురుగా విసుగ్గా ...

అసలు తనకెప్పుడూ ఒక సందేహం ..ఆ విధాత ఏ దరిద్రగొట్టు మూడ్ లో ఉండి ఈ మనిషినిసృష్టించాడా ? అని..అదీ తనకోసమే అన్నట్లు...

ఆలోచనల్లోంచి తేరుకుని ఆ కప్పు అక్కడపెట్టి మవునంగా వంటింట్లో కి వెళ్ళి తన కప్పు తీసుకుని పెరట్లో కి వచ్చింది...విరిసీవిరియని పూబాలలతో ,మధురమైన సువాసనలతో ,చిక్కనిచీకట్లని తొలగించుకుంటూ వచ్చే వేకువఝాము, అరవిరిసిన పూబాలలాంటి ప్రభాత సుందరి ఎంత మనోహరంగా ఉంటుందీ...చల్లగా , హాయిగా. అక్కడ సిమెంట్ బెంచ్ మీద కూర్చుని కళ్ళు మూసుకుని కాఫీ తొలి గుటక వేసింది...ఎంత రుచిగా ఉంది...తన చేతి కాఫీ తాగిన ప్రతి ఒక్కరూ అంటారు నీ చేతిలో ఏముంది శాంతీ కాఫీ ఇంత రుచిగా ఉంటుందీ ? అని ఒక్క ఆయన తప్ప...

ఆ అంత స్పెషల్ ఏముందీ? మంచి కాఫీ పొడీ, చిక్కటి పాలూ ఉంటే ఎవరు కలిపినా బానే ఉంటుంది అంటారు.. అబ్బా...స్వర్గానికెళ్ళినా సవతిపోరే అన్నట్లు..ఇంత ప్రశాంతమైన ప్రభాతంలో, చక్కటి పూతోటలో కూర్చుని కమ్మని కాఫీ తాగుతూ కూడా భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు తన ఆలోచనలు ఆ మనిషి మాటలూ,చేష్టల చుట్టే తిరుగుతాయే...ఖర్మ కాకపోతే.

తనతో పరిచయం అయిన చాలామంది అనే మాట 'మీరు అందరిలాంటివాళ్ళూ కాదు, సంథింగ్ స్పెషల్ , మీది ప్రత్యేకమైన వ్యక్తిత్వం అని ' తను మనసులోనే నవ్వుకుంటుంది ఏడవలేక...నిజమే తన బ్రతుకు అందరిలాంటి బతుకూ కాదు..అంతా ప్రత్యేకతే..తను బాల్యం అందరిలా గడపలేదు..చిన్నప్పటి నుండీ..తెలివైన పిల్లగా, జీనియస్ లా,చైల్ద్ ప్రాడిజీ గా గడచింది...పదేళ్ళ వయసులో అందరి పిల్లల్లా అమాయకంగా హాయిగా ఆడుకోకుండా సైన్స్ లేబ్ లో ప్రయోగాలతో గడిపింది...అంతా శభాష్ అన్నారు తల్లి తండ్రీ పొంగిపోయారు...ప్రాయం వచ్చాకా అందరి ఆడపిల్లల్లా కన్నె మనసు ఊసులూ, బాసలూ, ఊహలూ ఏమీ లేవు..అంత చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు ..తమ దేశం తరపున విదేశాలలో సైన్స్ సదస్సులలో మాట్లాడడానికి విశిష్ట అతిధిగా...ఆ బిజీలో .. ఆ మత్తులో యవ్వనం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తను గమనించలేదు...పి.హెచ్ .డీ ...తను మిస్ శాంతి కాస్తా డాక్టర్ శాంతి అయింది అతి చిన్న వయసులోనే.. ఎన్నో దేశాల్లో ఎన్నో మంచి మంచి పరిశొధనా సంస్థలవారు.. మంచి జీతంతో అక్కడ పని చెయ్యడానికి తనను ఆహ్వానించారు.. తను తిరస్కరించింది... అసలు మొదటినుంచీ తనకు ఏం కావాలో, ఎలా ఉండాలనుకుంటోందో ..ఏదీ తనకు స్పష్టంగా తెలియదు... తెలివితేటలు ఉండడం వేరు.. అవి తనకు ఉపయోగపడేలా, తన జీవితాన్ని తీర్చి దిద్దుకునేలా ఉండడం వేరు...అది తనకు అర్ధం అయ్యేటప్పడికే తన జీవితం తన చేతుల్లోంచి జారిపోయింది.

తనకు డాక్టరేట్ వచ్చాకా తన ప్రతిభ, చదువులో తన మార్కులూ..తన గుర్తింపూ వలన తనకు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా జాబ్ వచ్చింది...వచ్చింది అనే కంటే తనకు వచ్చిన ఎన్నో ఆఫర్స్ లో అది తను ఎన్నుకుంది.. తనకు చిన్నప్పటి నుండీ పరిశోధనలంటే ఎంత ఇష్టమో , బోధన అన్నా అంతే ఇష్టం అందుకే అది ఎన్నుకుంది...అసలు తన మనసులో పెళ్ళి..పిల్లలు సంసార జీవితం అనే ఆలోచనలు రావలసిన వయసులో రానే లేదు..తల్లి తండ్రులూ మా అమ్మాయి అందరికంటే స్పెషల్ అనుకుని మురిసిపోయారే కానీ , మామూలు ఆడపిల్ల తల్లితండ్రులుగా ఆలోచించలేదు..ఫలితంగా మూడుపదుల వయసు వరకూ...అదీ తన కొలీగ్ విశ్వనాథ్ తనకు ప్రపోజ్ చేసేవరకూ తన పెళ్ళి విషయం స్పురణకు రాలేదు.

విశ్వనాథ్ ప్రపోజల్ కాదనేందుకు ఏమీ కారణాలు కనబడలేదు మనిషి అందగాడు, తనలాగే ప్రొఫెసర్ ..తల్లి తండ్రులకు ఒకడే కొడుకూ...ముఖ్యంగా తనంతట తనే ఇష్టపడి అడిగాడు..లక్కీ గా తమ వాడే కావడంతో తల్లి, తండ్రీ కూడా ఏం అభ్యంతరం పెట్టకుండా అంగీకరించారు...ఇద్దరూ బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఆ వయసులో పీటలమీద కూర్చుని పెళ్ళి అంటే కొంచెం ఎంబరాసింగ్ గా ఫీల్ అయి తను రిజిస్టర్ మేరేజ్ అంది...తను ఓ.కే అన్నాడు... పెళ్ళి అయింది...

పరిశోధనలూ, పాఠాలూ, ఉద్యోగం కాకుండా వేరే ప్రపంచం ఉంది అన్న విషయం తనకు అప్పుడే తెలిసింది...ఎక్కువ తెలివైన వాళ్ళందరూ తేడాగా ఉంటారు అన్న నానుడి నిజం చేస్తూ...తమ జంట అలాగే ఉంది..విశ్వనాథ్ కి కోపం, స్వార్ధం, అహం..అన్నీ ఎక్కువే తెలివిలాగే...అన్నిటికంటే ముఖ్యం తన తెలివి, గుర్తింపు..గౌరవం అతనికి ఒక మొగుడిగా, మొగాడిగా భరించడం కంటకప్రాయమైంది...

తను చేసే ప్రతి పనికీ.. నువ్వు తెలివైనదానివి గా...అలాగే చేస్తావ్ అంటే మొదట్లో అదొక మెచ్చుకోలుగా అనుకునే తనకు అది మెచ్చుకోలుగా కనబడే..వెటకారం అనీ...తీపి మాట వెనుక చేదు మనసు ఉందనీ అర్ధం అయ్యేటప్పడికీ ఇద్దరు పిల్లల తల్లయ్యింది... తనలో ఉన్న సౄజన,తెలివి..ప్రతిభలు అడుగడుగునా కపట ప్రేమ, వంచనా, కనపడని పురుషాహంకారానికి బలయి తను ఒక నిర్జీవమైన మనిషిగా మిగిలిపోయింది.

ఏదైనా సెమినార్ కి తనను ఆహ్వానిస్తే...’ తనకు ఆరోగ్యం బాగా లేదండీ,రాలేదు.. తనకు ‘అవి ‘ముఖ్యమైనా...నాకూ పిల్లలకూ ‘తను ముఖ్యం ‘ లాంటి సుగర్ కోటెడ్ మాటలతో తనను తెలివిగాబంధించి తన వ్యాపకాలకూ, ఇష్టాలకూ దూరం చేసేసాడు...మెల్లి మెల్లి గా జనం తనను మరచిపోయారు...తనూ అన్నీ మరచిపోయి యాంత్రికంగా తయారయింది.

" అమ్మ గారూ అప్పుడే లెగిసి పోయారేం? ఆదారమే కదా కూసంతసేపు పడుకోనేకపోయినారా? " సుహాసిని పలకరింపుతో ఆలోచనల్లోంచి బయటపడింది శాంతి.

చక్కగా తీర్చి దిద్దిన రూపం ,నిడుపాటి జుట్టును గట్టిగా బిగించి జడ అల్లి ,దానిని కొప్పుగా పెట్టుకుని , ఆ కొప్పులోంచి తొంగి చూసే ముద్ద నందివర్ధనం ,తూరుపు కట్టు ,బొట్టు , మాటలో శ్రీకాకుళం యాస ...పదహారేళ్ళ పిల్లగా, తమ యూనివర్శిటీలో బంట్రోతు సింహాద్రి అప్పన్నతో పెళ్ళయి అక్కడకు వచ్చిన అప్పలనర్సి ... తను చిన్న పిల్లలతో అవస్థపడడం చూసి తనకు చేదోడు వాదోడుగా ఉండడానికీ , వాళ్ళకూ ఆర్ధికంగా కొంత వెసులుబాటుగా ఉంటుందనీ పనిలో చేరింది... ఎప్పుడు చూసినా కిల కిలా నవ్వుతూ..గలగలా కబుర్లు చెబుతూ చురుకుగా ఉండే నర్సికి తనే ' సుహాసిని ' అని పేరు పెట్టింది... దానికీ ఆ పేరు బాగా నచ్చి అదే దాని పేరు అయిపోయింది ,అసలు పేరు మర్చిపోయి.

" ఏటమ్మా... అట్టా కొత్తగా సూస్తన్నారూ? " తదేకంగా తననే చూస్తున్న శాంతిని అడిగింది..కంగారుగా చీర సర్దుకుంటూ.

" ఏమే నిన్న మళ్ళీ తాగొచ్చి కొట్టాడా మీ ఆయన ? " ఒంగుని వాకిలి తుడుస్తున్నప్పుడు దాని పొట్ట మీద, వీపు మీదా కనబడిన దెబ్బలూ, మెడ చుట్టూ కమిలిపోయిన గుర్తులూ చూస్తూ

" ఆ ఏదో మామూలేనమ్మ గారూ...వారంలో ఓ పాలి ఆడు తన్నడం..నేను తినడం..మామూలేగందా... ఎంత నాగరీకం నేర్చుకున్నా...సదువూ సందే లేని మూర్ఖులం ....మా జీవితాలింతేనమ్మా... " తేలిగ్గా అనడానికి ఎంత ప్రయత్నించినా జీరబోయిన దాని గొంతూ, నీళ్ళు నిండిన దాని కళ్ళూ దాని బాధను తెలియచేస్తున్నాయి.

మీ బతుకులే నయమే ...చదువూ సంస్కారం అనే ముసుగులేకుండా కొట్టుకున్నా, తిట్టుకున్నా కాస్త పైకి చెప్పుకునే స్వాతంత్ర్యం...ఆ కాసేపు కొట్టుకున్నా మళ్ళీ కలసిపోయే అమాయకత్వం అయినా ఉన్నాయి...మరి మా బ్రతుకులు ఎప్పుడూ నాగరికత, పై పై నవ్వులూ అనే మేకప్ వేసుకుని ఈ జీవిత నాటకంలో చచ్చేదాకా నటిస్తూనే బతకాలి...బ్రతుకంతా నటిస్తూనే చావాలి.

చదువుకోక నీ బతుక్కీ....చదువుకున్న నా బతుక్కీ పెద్ద తేడా ఏం లేదు...తిడితే పడుతున్నాం , .కొడితే భరిస్తున్నాం..మొత్తానికి ఆ మొగుడనేవాడి ఆగడాల్ని సహిస్తున్నాం...

" అమ్మ గారూ... కాఫీ..." తుడవడం పూర్తి చేసి ఎప్పుడు లోపలికెళ్ళిందో చక్కటి కాఫీతో తిరిగొచ్చింది... నాకలా ఎవరైనా కాఫీ తెచ్చిస్తే కూర్చుని ప్రశాంతంగా తాగడం ఇష్టమని దానికెప్పుడో చెప్పిన మాట గుర్తుంచుకుని ,రోజూ తన చేత్తో కాఫీ కలిపి అందిస్తుంది...ఎప్పుడో కానీ మరచిపోదు.చక్కగా రుచిగా శుచిగా కాఫీ కలపడం, వంట చెయ్యడం తన దగ్గరే నేర్చుకుంది...

తన పిల్లలు చదువులూ, ఉద్యోగాలూ వచ్చి పెళ్ళిళ్ళై వెళ్ళిపోయినా,దాని పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చినా అదితమ ఇంట్లో పని మాత్రం మానలేదు..తనంటే దానికో అద్భుతం...ఇష్టం. తన బ్రతుకులో చీకటి దానికి కూడా తెలియదు ఎందుకంటే ఆయన ఆరితేరిన నటుడు... గుడ్డిలో మెల్ల అన్నట్లు బయటవారి ముందుతనంటే పంచప్రాణాలూ , అద్భుతమైన ,అపురూపమైన వ్యక్తిగా చూడడంలో ఆయన నటన... విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదుకి తగినది, ఆస్కార్ అవార్డ్స్ ఎన్నయినా యివ్వచ్చు... అదీ ఒకందుకు మంచిదే...కనీసం బయట ప్రపంచానికితనొక గౌరవనీయమైన వ్యక్తిగా మిగిలిపోయింది.

"ఏటమ్మా...చేతిలో కాఫీ పెట్టుకు తాగకుండా ఆలోచిస్తారు...సక్కగా తాగండి ..ఈ లోగా నే నూనె ఏడి సేసుకు తెత్తా... కళ్ళు మూసుకు కూసుని గమ్మునుండండి మర్దనా సేత్తా..." ఎక్కువగా చదివి, ఆలోచించి బుర్ర వేడెక్కి ఆరోగ్యం పాడవుతుందని దాని భయం...కన్న తల్లిలా వారం వారం ,వద్దన్నా వినకుండా ఈ మర్దనా కార్యక్రమం జరగాల్సిందే... దాని ప్రేమనీ, ఆప్యాయతనీ ఆస్వాదించే తనకు...అదే కొంత సాంత్వన.

గోరువెచ్చని నూనెతో పాయ పాయ తీసి నూనె రాసి మృదువుగా మర్దనా చేస్తూ సగం తెచ్చిపెట్టుకున్న నాగరిక భాష ,సగం జన్మతహా వచ్చిన యాస భాషతో ఏవేవో విశేషాలు చెబుతూ ఉన్న దాని మాట, స్పర్సా అందులోనీ ఆత్మీయత అనుభవిస్తున్నా తెలియకుండానే మనసు అది వెళ్ళిపోయాకా ఆయన చేసే వెటకారపు వ్యాఖ్యానాలని నెమరువేసుకుంటోంది....

"చక్కనమ్మ చిక్కినా అందమేనని ...ఈ వయసులో కూడా ఎంత బాగుంటారమ్మా...ఇంకా వేళకి తినకా ..ఓ ఆ పుస్తకాలు ముందేసుకుని సరిగా కంటినిండా నిద్ర లేకా కానీ , అందుకే అయ్యగారు మిమ్మల్ని అంత బాగా పేమగా చూసుకుంటారు ... అదిగో పేపర్ సదవడం పూర్తయినట్లుంది అయ్యగారికి, సక్కగా తలారా తానం సేసి ఈ మల్లెమాల ఎట్టుకోండి...కొత్త సీరె మీ గదిలో మంచం మీద ఎట్టా ...కట్టుకుని మీరూ అయ్యగారూ గుడికెల్లి రండి ...మర్సే పోయారుగా మల్లీ, ఈ యాల మీ పెల్లి రోజు... అంత మతిమరుపేటమ్మా... పెతీ సారీ సూస్తా మీరే ముందుగా సెబుతారేమో అనీ...ఊహూ మీకు గుర్తే ఉండదు...అయ్యగోరు మంచోరు కాబట్టి సరిపోయింది అదే మా మావయితే పీకి పాకం పడతాడు...నీకు 'పెల్లి రోజు ' కూడా గురుతులేదూ అంటా...ఈ ఏడు ఏం బగుమతీ ఇస్తారో అయ్యగారు తమకి ...సాయంత్రం సూపించండేం..." మర్ధనా పూర్తి చేసి జుట్టంతా దువ్వి, చిక్కు తీసి ముడి వేస్తూ చనువుగా మందలించింది.

పాపం దానికేం తెలుసు ఈ రోజు ఎప్పుడూ మరచిపోననీ, మరచి పోలేననీ, ఉదయాన్నే నిద్రమంచం మీదనే, కళ్ళు తెరవకుండానే బహుమతీ వచ్చేసిందనీ..

అయినా సాయంత్రం అది వచ్చేసరికి తన దగ్గర ఓ మంచి ,ఖరీదైన నగో, వస్తువో బహుమతి గా ఉంటుంది...తమ నటనకి బహుమతి గా . కేవలం మనసు మనసుతో మమేకం అవడమే నిజమైన దాంపత్య జీ'వనం' అన్నది ఎంతమందికి తెలుసు ?

" ఓ శాంతీ డార్లింగ్ ...మెనీ మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ... మనం మరీ బిజీ అయిపోయి ఆఖరకి మన పెళ్ళి రోజు కూడా మరచిపోతున్నాం..థేంక్స్ హాసినీ...నువ్వు గుర్తుచెయ్యకపోతే మరచిపోయే వాళ్ళం...నీకు ఓ మంచి చీర ప్రెజెంట్ చేస్తుంది మీ అమ్మగారు..." చేతిలో ఓ చక్కటి ఎర్ర గులాబీ ఆకులతో సహా తెంపి చేతికిస్తూ అన్న ఆయన కళ్ళలోకి తను చూసిన చూపు , ' ఆ మేధావి కి ' బాగానే అర్ధం అవుతుంది... అయినా పట్టించుకోకుండా నటించగలగడంలోనే ఉంది అతని టేలెంట్ అంతా.

" థేంక్స్ అండీ.. మరచేపోయాం... త్వరగా స్నానం చేసి వస్తా...గుడికి వెడదాం..ఈ లోగా మీరూ రెడీ అయిపోండి...మీకు మళ్ళీ కాఫీ ఇవ్వనా ? " తనకూ ఎంతో కొంత నటించడం తప్పనిసరి అయిపోయింది మరి.

" వద్దులే ..నేనూ స్నానం చేసి వచ్చేస్తా... అప్పుడు కాఫీ తాగి గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ,దసపల్లా లో టిఫిన్ ....సరదాగా మధ్యాహ్నం వరకూ తిరిగి భోజనం కూడా బయటే చేసి వచ్చేద్దాం...ఈ రోజు నో పని నీకు ,రోజూ ఇంటా బయటా చాలా కష్ట పడుతున్నావుగా ..ఈ రోజు అంతా విశ్రాంతి...సరదాగా జాలీగా గడపడమే..."

అమ్మయ్యా...హాసిని దగ్గర నూటికి నూరు మార్కులూ కొట్టేసారుగా...వెర్రిది నిజంగా అదంతా తన మీద ప్రేమే అనుకుంటుంది..సాయంత్రంలోపు ఎన్ని ఈటెలూ, శూలాలూ మనసుని చ్చిద్రం చేస్తాయో దానికేం తెలుసు?...

" అయినా నీకు కాఫీ అంటే చాలా ఇష్టంగా ఒక్క పది నిముషాలాగు నా చేత్తో నీకు బ్రహ్మాండమైన కాఫీ యిస్తా...తాగి స్నానాలకు వెడదాం..." వంటింట్లోకి వెడుతూ అన్నారు. నటనకి పరాకాష్ట...ఏ సమయంలో ఎలా నటన పండించాలో, రక్తి కట్టించాలో తెలిసిన మహానటుడు.

" అయ్యగారంటే అయ్యగారే మరి... చూడండి మీరంటే ఎంత ప్రేమో...నేనా మాట అంటే మీకంతా నవ్వులాటగా ఉంటుంది..." సుమారు పాతికేళ్ళుగా ఇంట్లో మనిషిలా తిరిగిన దానికే అనుమానం రానంతగా నటించడం మరి ఆయనకే చెల్లింది.

ఇన్ని ఏళ్ళ వైవాహిక జీవితంలో, ఏకాంతంలో తన అనుభవాలు పల్లేరులతో నిండిన దుర్గంధ వైతరణీ స్నానాలే కానీ పన్నీటి జలకాల పులకింతలు కావుగా మరి ...తను ఎంతగానో ప్రయత్నించింది ..ఆయనకు నచ్చినట్లే ఉండడానికి కానీ అది మాత్రం సాధ్య పడలేదు...కారణం అసలు తను ఏం చేసినా ఆయనకు నచ్చకపోవడమే...అంత జన్మజన్మల శతృత్వం ఉంది కాబోలు తామిద్దరి మధ్యా... అది తీర్చుకొమ్మనే ఆ విధాత , జగన్నాటక సూత్రధారి తామిద్దరినీ మంగళసూత్రాలతో ముడివేసాడు కాబోలు. తనకు తెలిసిన తన పరిభాషలో తామిద్దరూ ' సేం పోల్స్ రిపెల్ ' ఇక ఈ జీవితంలో తమ ఇరువురిలో ఎవరో ఒకరు నిష్క్రమించే దాగా ఈ రెండు పాత్రల నాటకం ఇలా నడవాల్సిందే...ఇందులో ఇక ఎటువంటి మార్పూ ఉండదు...ఉండబోదు.

ఆయన కాఫీ గ్లాసులతో రావడం తన చేతికందించడం చూసి హాసిని ముసిముసి నవ్వులతో గబగబా మిగతా పనంతా చేసి వెళ్ళిపోవడం... తాము రెడీ అయి ఔట్ డోర్ షూటింగ్ కి బయలుదేరడం చక చకా జరిగిపోయాయని వేరే చెప్పాలా?


" ఇంతేరా ఈ జీవితం...తిరిగే రంగుల రాటనం " దూరంగా పక్కింట్లో… టీ.వీ లోంచి వస్తున్న పాట విని తల పంకిస్తూ జీవం లేని నవ్వు పెదాలమీద వచ్చి చేరింది శాంతికి , పేరులోనే తప్ప జీవితంలో ' శాంతి ' లేని శాంతికి.

***

మర్నాడు తెల్లవారుతూనే యధావిధిగా పేపరు చదువుతున్న ఆయనకు ఫోన్ కాల్ రావడం...అది వింటూనే " హా అలాగా ఇప్పుడే వస్స్తున్నా..." అంటూ హడావుడిగా వెళ్ళిన ఆయన ఎక్కడకు వెళ్ళారో, ఎప్పుడొస్తారో తెలియక , తను యూనివర్సిటీ కి ఫోన్ చేసి ఇద్దరూ సెలవని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉండిపోయిన శాంతికి రాత్రి సుమారు తొమ్మిది గంటల వేళ నీరసంగా ...జీవం లేని ముఖంతో తిరిగి వచ్చిన ఆయనను ఏం అడగాలో ,ఎలా అడగాలో తెలియక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది శాంతి.

వస్తూనే బాత్ రూంలో దూరి తలారా స్నానం చేసి బట్టలు మార్చుకుని మంచం మీద పడి , కళ్ళ మీద చేతులుంచుకుని అసహనంగా కదులుతున్న ఆయనను ఎలా కదపాలో?అసలు ఏం జరిగిందో ?ఎందుకలా ఉన్నాడో తెలియక తమ పెళ్ళి అయిన ఇన్ని ఏళ్ళలో అతనిని ఎప్పుడూ అలా చూడక చాలా కలవరంగా అనిపించింది శాంతికి.

"ఏమయింది? ఎందుకలా ఉన్నారు? ఎలాగో ధైర్యం తెచ్చుకుని అడిగింది...బదులు లేదు...

భోజనానికి రమ్మని పిలిచిన పిలుపుకీ మౌనమే సమాధానం .

తనకు తెలుసు ఆయన ఆకలికి ఉండలేడని...వాలకం చూస్తుంటే ఉదయం నుంచీ ఏమీ తిన్నట్లు లేదు...

సరే ఏమయితే అయిందని కంచంలో అన్నం కూరా అన్నీ వేసుకుని పట్టుకొచ్చింది అక్కడికే....

" లేవండి ...కొంచెం అన్నం తిని పడుకోండి.." ఎలాగో గొంతు పెగల్చుకుని చెప్పింది.

చివ్వున లేచాడు అన్నం కంచం తీసుకుని పక్కన టీపాయ్ మీద పెట్టేసి తనను రెండు చేతులా పొదుపుకుని...శాంతీ నన్ను క్షమించు..నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను...అసలు నిన్ను క్షమించమనే అర్హత కూడా లేదు నాకు..కానీ నీ మనసు , నీ ఔదార్యం నాకు తెలుసు అందుకే ఇంత ధైర్యంగా అడుగుతున్నాను...నిన్ను మాటలతో నొప్పించి నా కంట్రోల్ లో ఉంచుకున్నాను అనుకున్నానే కానీ ఎదురు తిరగకపోవడం..తిరిగి నన్ను బాధ పెట్టకపోవడం నీ మంచితనం, గొప్పతనం అని అర్ధం చేసుకోలేక పోయాను... అందమైన మన జీవితాల్ని అహంకారం, అభిజాత్యమనే వేరు పురుగులు దొలిచేసి డొల్ల చేస్తున్నాయన్న ఇంగితం లేకుండా ...ప్చ్ నీ సహనం , నీ మంచితనమే కనక లేకపోతే మన జీవితాలు ఎప్పుడో చిన్నాభిన్నమయ్యేవే...నన్ను క్షమించు శాంతీ.....ఇన్నేళ్ళుగా కరడుగట్టిన అతని మనసు కరిగి అతని కళ్ళల్లోంచి స్రవించడం చూసిన శాంతి బిత్తరపోయింది.

నీకు తెలుసుగా మన మేథ్స్ ప్రొఫెసర్ మాధవ రావ్ ...ఈవేళ ఉదయమే తన పిల్లలిద్దరినీ పీక నొక్కి చంపేసి తను, తనూ ఆత్మహత్య చేసుకుని...చెప్పలేక భోరుమన్నాడు...

షాక్ కొట్టినట్లు అయిపోయింది శాంతికి... మాధవ రావ్ ...అయ్యో పాపం బాగా చిన్నవాడే ...ఏమయింది? అంత కష్టం ఏం వచ్చింది? పెళ్ళయి నాలుగైదేళ్ళ కంటే అవదు...తమ కాలేజ్ కి వచ్చాకానే అతని పెళ్ళయ్యింది...భార్య శ్యామ ఏదో కంపెనీలో పెద్ద ఎగ్జిక్యూటివ్ రేంక్ లో ఉందనీ... అతనిని ఇష్టపడి...ప్రేమించి వెంటపడి మరీ పెళ్ళి చేసుకుందనీ... పెద్ద చదువూ, అందం, మంచి పొజిషన్ వీటితో బాటు బాగా డబ్బూ ఉండి సున్నిత మనస్కుడైన మాధవ్ ని ఎప్పుడూ చీటికీ మాటికీ చిన్నబుచ్చుతూ.... అతనిని వేధిస్తూ ,అతనితో తగవులాడుతూ అతనినీ, ముచ్చటైన మూడేళ్ళ కవల పిల్లలనీ పట్టించుకోక సంసారాన్ని అల్లరల్లరి చేస్తున్నా అతని అతి మంచితనమే అతని పాలిట శాపం అయి జీవితాన్ని అస్థవ్యస్థం చేసేసిందని అందరూ అనుకునే వారు... అందరికీ తెలిసేలాగే అవమానించినా ,సహనంతో సర్దుకు పోయే అతని మనసు ఎంత విరిగిపోయి దెబ్బ తినక పోతే అంతటి సాహసం చేస్తాడు...అంత చదువూ సంస్కారం ఉన్న అతను అమానుషంగా ఇద్దరు పసివాళ్ళని చంపడమంటే ఎంతటి వేదన అనుభవించి ఉంటాడో పాపం...

"శాంతీ ... నాకు తెలుసు నేను నిన్నూ..నీ మనసునీ శ్యామ కంటే దారుణంగా ...ఎన్ని సంవత్సరాలనుంచీ అవమానించి , బాధపెట్టానో … ఏనాడూ నువ్వు కనీసం గొడవ కాదు కదా కనీసం చిన్న మాట కూడా తూలకుండా ఎలా భరించావో, ఎంత సహించావో... కానీ ఆ వేదన నీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నా లక్షపెట్టనంత రాక్షసత్వం నాలో...ఎలా భరించావు ఇన్నేళ్ళూ? శాంతీ, తలుచుకుంటేనే నాకు చచ్చిపోవాలన్నంత ద్వేషం నా మీద నాకే కలుగుతోందే...ఎలా భరించావమ్మా ?...అసలు మొదటే నువ్వు ఎదురుతిరిగి ఉంటే నేనంత రాక్షసంగా రెచ్చిపోయేవాడిని కానేమో...ఏది ఏమయినా జరిగిపోయిన కాలాన్ని ...అప్పటి చేదునీ నేను మార్చలేను ...కానీ ఇకముందు మన జీవితం మాత్రం ...అసలు ఆ మాట అనడంలో అర్ధమే లేదు...నాలుగేళ్ళ కాలమే భరించలేక పసివాళ్ళని చంపి, తను చచ్చిపోయాడే...అలాంటిది..ఒకటా రెండా...ఇన్ని సంవత్సరాలు నన్నూ...నా మూర్ఖత్వాన్నీ... రాక్షసత్వాన్ని ఎలా భరించావు శాంతీ...అందుకేనేమో స్త్రీని, ఆమె సహనాన్ని...భూదేవితో పోలుస్తారు...నన్ను క్షమించవూ... అతని కన్నీళ్ళు ఆమె గుండె గాయాలను కడిగేస్తూ... చల్లదనాన్ని కలిగిస్తుంటే ...అలా ఉండిపోయింది శాంతి.


***

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.