రేవంత్ ,రాజు ఒకే పాఠశాలలో ఐదవతరగతి చదువుతున్నారు . రేవంత్ కి చదువు తో పాటు అన్నిరంగాలలో ఆశక్తి ఉన్నవాడు. ఉపాధ్యాయులందరి మన్ననలుతో పాటు స్నేహితులు యెక్క అభిమానానాన్ని కూడా మెండుగా కలిగినవాడు. రేవంత్ వాళ్ళ ఇంటి దగ్గరనే రాజు ఇల్లు కూడా. రేవంత్ కి అన్ని పరీక్షలలోనూ పోటీలలోను మంచి మార్కులు వస్తూ ఉంటాయి. రాజు దేనిమీదకూడ కుదురుగా ధ్యాసపెట్టడు సరికదా ఎలా అందరినీ ఏడిపించాలా అని చూస్తూ ఉంటాడు. రాజు వాళ్ళ అమ్మనాన్న ఎపుడు రేవంత్ ను ఉదహరిస్తూ వాడు చూడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడో, వాడిలా నువ్వూ చక్కగా చదువుకోవచ్చుకదా అంటూ ఉంటారు. వాళ్ళమాటలను రాజు తట్టకోలేకపోయేవాడు. ఏలాగైనా రేవంత్ ను ఒక్క పరీక్షలోనైనా తక్కువ మార్కులు వచ్చేలా చేయాలనుకున్నాడు. అంతేకాని తను బాగా చదువుకొని రేవంత్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుందాం అనుకోలేదు. హాఫ్ ఇయర్లీ పరీక్షలు దగ్గరపడుతున్నాయి రేవంత్ నోట్సులు అన్నీ దొంగతనం చేద్దామనుకున్నాడు కుదరలేదు. ఇకలాభంలేదనుకొని రేవంత్ ని నా నోట్సులు పోయాయి దయచేసి నీ నోట్సులు ఇస్తే కాపీ చేసుకొని రెండురోజులలో ఇచ్చేస్తానన్నాడు. రేవంత్ నమ్మి నోట్సులు ఇచ్చాడు. కాని రాజు రెండురోజులు తరువాత రేవంత్ దగ్గరకి వచ్చి దొంగ ఏడుపు ఏడుస్తూ నీ నోట్సులు మా గేదె తినేసిందిరా అని చెప్పాడు. దానికి రేవంత్ చాలాబాధ పడ్డాడు. రాజు మనసులో సంతోషించాడు. కానీ రేవంత్ మాష్టారిదగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి అన్ని నోట్సులను రాయడం మూడురోజులలో పూర్తి చేసాడు. దీని వలన రేవంత్ కి మరింత అన్ని సబ్జక్టులలో పట్టుసాధించాడు. హాఫ్ ఇయర్లీ పరీక్షలయిపోయి తరువాత మాష్టారు మార్కులు ఇచ్చారు.రేవంత్ కి అన్నీ తొంభైఎనిమిది శాతం మార్కులు వచ్చాయి. రాజుకి ఇరవైశాతం మార్కులు మించి రాలేదు. రాజు ఆశచర్యపోయి రేవంత్ ని నీకు ఎలా ఇన్ని మార్కులు వచ్చాయి? అని అడిగాడు. ఏంలేదురా మా ఆవు మీ గేదెని రిక్వస్ట్ చేసి నానోట్సులు తెచ్చేసిందిరా అందుకే బాగా చదివా అని సమాధానమిచ్చాడు. బిత్తరపోయిన రాజు మాష్టారి దగ్గరికి వెళ్ళి సార్ నామార్కులు అంటుండగా ,అబ్బే ఏంలేదురా నీకు వందకు వంద వేసానుకాని మా పెరట్లో కోతి ఎనభై మార్కులు పట్టుకు పోయిందిరా మరేమీ అనకోకేం!అని మాష్టారన్నారు. రాజు మొహం తెల్లబోయింది.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.