కలిసి నడుద్దాం


రుద్రయ్యగారు పేరుకు తగినట్లే మహా కోపదారి మనిషి . ఆయన అనుకున్నట్లే అన్నీ జరగాలనుకునే మనస్తత్వం. ఆయన భార్య మీనాక్షీదేవి శాంత స్వభావురాలు కానీ కొంచం దుబారా మనిషి .

ఆ దంపతులకి ఐదుగురు సంతానం - ఇద్దరు అబ్బాయిలు , ముగ్గురు అమ్మాయిలు. కంపెనీ ద్వారా అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు , కారు ఉన్నప్పటికీ ఆడంబరమైన జీవితం , పెద్ద సంసారం , భార్య దుబారా కారణంగా రుద్రయ్యగారు పెద్దగా ఆస్తి అంటూ ఏమీ కూడబెట్టలేకపోయారు.

అప్పుడు ఇప్పుడు అవసారలకని పదవీ విరమణ అనంతరం రావలసిన ప్రావిడెంట్ ఫండ్ ని ముందుగానే వాడేయటం జరిగింది. అంతేకాక ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి సాగనంపేటప్పటికి ఉన్న కొంచం హరించుకు పోయింది. పెద్ద కొడుకు పెళ్ళయి కోడలు స్వాతి కాపారానికి వచ్చింది.

ఆరోగ్యకారణాల వల్ల రుద్రయ్యగారు ముందస్తు పదవీ విరమణ చేయవలసి రావడంతో తమ్ముడి చదువు , ఆఖరి చెల్లెలి పెళ్ళి బాధ్యత పెద్ద కొడుకైన శరత్ పైన పడింది. అయినప్పటికి ఏమాత్రం ఆందోళన చెందకుండా ఇంటిని నడిపే బాధ్యతతో సహా అన్ని బాధ్యతలు ఆనందంగా తన భుజస్కంధాలపై వేసుకున్నాడు.

శరత్ భార్య స్వాతి కూడా భర్తకు తగిన ఇల్లాలు. అత్తమామలను ఆదరించడంలోను, మరిది ,ఆడపడుచులను అభిమానించడంలోను ఏమాత్రం లోటు చేయకుండా నలుగురిలోనూ మంచి పేరు సంపాదించుకుంది.

కొడుకు కోడలు ఎంత బాగా చూసుకుంటున్నప్పటికి , చింతచచ్చినా పులుపు చావదన్నట్లు రుద్రయ్యగారి కోపం తగ్గలేదు , మీనాక్షీదేవి దుబారా లోను కూడా ఏమాత్రం మార్పురాలేదు. పైగా ఇంకా ఏదో తక్కువైనట్లుగా సూటిపోటి మాటలతో ఇద్దరినీ బాధపెట్టసాగారు. కొడుకు కష్టపడి సంపాదిస్తుంటే తాము అతనికి చేదోడువాదోడుగా ఉండాలనే ఆలోచనేలేకుండ ప్రవర్తించసాగారు .

ఇటు తల్లిదండ్రుల ప్రవర్తనకు ఎదురాడలేక అటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనలేక శరత్ మానసికంగా నలిగిపోతూ జబ్బు పడి మంచం పట్టాడు. దాంతో ఆందోళన చెందిన స్వాతి శరత్ ని ఎంత మంది డాక్టర్లకి చూపించినా అతనికి ఏమి జబ్బు లేదని , మానసికంగా ఏదో బాధపడుతున్నాడని ఎవరైనా సైకాలజిష్టుకి చూపించమని సలహా ఇచ్చారు.

శరత్ ని ఆ నగరంలోని ప్రముఖ సైకాలజిష్టు వద్దకు తీసుకుని వెళ్ళిన స్వాతి ద్వారా ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి గురించి తెలుసుకున్నాక ఆయనకు శరత్ పరిస్థితికి కారణం అర్థమయింది.


తదుపరి రుద్రయ్యగారిని మీనాక్షిదేవిని కలుసుకుని మాట్లాడాలని తెలపటంతో వారిరువురు డాక్టర్ ని కలవడానికి వచ్చారు.


“కూర్చోండి” అంటూ దంపతులకు సైగ చేశారు డాక్టర్.


“మా అబ్బాయి ఆరోగ్యం ఇలా ఎందుకయింది డాక్టర్? మమ్మల్ని ఎందుకు కలుసుకోవాలని అన్నారు ?”


“మీ అబ్బాయి కానీ కోడలు కానీ మీ ఇరువురి సంరక్షణలో ఏదైనా లోపం చేస్తున్నారా?”


ఆయన అడిగిన దానికి తమ కొడుకు ఆరోగ్యానికి సంబంధమేమిటో ఆ దంపతులకు అర్థం కాలేదు. అయినప్పటికి “లేదు” అన్నట్లుగా ఇద్దరు ఒక్కసారే తలూపారు.


మళ్ళీ ఆయనేమీ అనకుండానే కొడుకు కోడలు తమని ఎంతో ఆదరిస్తారని తమ మాటకు అసలు ఎదురాడరని తాము ఎంతో అదృష్టవంతులమని చెప్పారు.


“అటువంటి మంచి కొడుకు ఆరోగ్యం దెబ్బ తినడానికి కారణం ఒక విధంగా మీరిరువురే ” అన్న డాక్టర్ గారి నిందా పూరితమైన వాక్కులు విని ఇద్దరు అవాక్కయ్యారు.


‘ఒకప్రక్క తల్లిదండ్రులైన మీ పట్ల భక్తి ప్రపత్తులతో మీకు ఎదురుచెప్పలేక ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమవుతానేమో అనే దిగులు , ఇంకోప్రక్క మీరే పరిస్థితులు అర్థంచేసుకోకుండగా సూటి పోటీ మాటలనడం చేతను దిగులు చెంది విపరీతమైన మానసిక ఒత్తిడికి గురై మీ అబ్బాయి శరత్ ఈ స్థితికి వచ్చాడు ఇదిలాగే కొనసాగితే అతని ప్రాణానికే ప్రమాదం’ అని డాక్టర్ గారు చెప్పారు.

ఆయన చెప్పిన విషయం ఆందోళన కలిగించగా రుద్రయ్య దంపతులు కాసేపు మిన్నకుండిపోయారు. తమ అజ్ఞాన పూరితమైన ప్రవర్తన కొడుకుని ఎంత మానసిక వ్యధకు గురిచేసిందో తెలుసుకుని వ్యధ చెందసాగారు.

అది గమనించిన డాక్టర్ గారు వారిని ఓదారుస్తూ “ఏమి ఆందోళన చెందవలసిన అవసరంలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు . ఇకమీదటైనా సాధ్యమైనంతవరకు శరత్ సంతోషంగా ఉండేలా చూసుకోవడం ఇంటిలోని అందరి బాధ్యత” అని తెలిపి అదెలాగో కూడా సూచించారు.

ఆనాటి నుంచి కొడుకు మనసు నొప్పించక మసలుకోసాగారు రుద్రయ్య దంపతులు. కుటుంబ సభ్యుల సహకారంతో శరత్ త్వరగా కోలుకుని మామూలు మనిషయ్యాడు .

ఈ అనుభవం తరువాత రుద్రయ్య దంపతులు కొడుకు కోడలికి అన్నిటా చేదోడువాదోడుగా ఉంటూ గౌరవం ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటూ వారితో కలిసి నడవడంలోనే సంతోషముందని తెలుసుకుని తమ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు.

***************************

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.