ప్రేమ పలకరించిన వేళ

నీ జ్ఞాపకాలు మనసును జల్లెడ పడ్తోంటే, జీవితంలోని మధురానుభూతులు ఒక్కొక్కటిగా పలకరించి పోతున్నాయి. తొలిసారి నిను చూసిన క్షణంలో నాలో కలిగిన స్పందనలు మరీచికలా నా మనోప్రాంగణాన మరల ఆవిష్కరించ బడ్డాయి.

నా స్వప్నం సాకారం చెందిన వేళ, నీ సాక్షాత్కారం నా కనుల ముందర ...

నయనం నయనం పలుకరించుకున్న క్షణం, వలపు సాగర మధనం ....

స్వాగతిస్తూ విచ్చుకున్న రెండు ఎర్ర గులాబీలు...

చెలిమికి చిరునామాలా ఆ గులాబీ కొసల నుండి జారుతున్న నవ్వులు. అవి నన్ను అచేతనావస్థ లోకి నెట్టినప్పుడు.... గుండెల్లో తియ్యని బాధ.

నా ప్రేమ మందిర ద్వారాలన్నీ ఒక్కసారిగా తెరుచుకున్నాయి. నిన్ను స్వాగతిస్తూ..

అలా నేల జారిన పువ్వుల్ని ఏరుకుంటూ నా మనసు నెక్కడో పారేసుకున్నా బహుశా నీ విశాల నేత్రాల ముంగిటిలో ననుకుంటా..??”

ఎదో తెలియని స్థితి నన్ను మతిలేనివాడ్ని చేసింది.

దాన్నెమంటారో చెప్పేవారెవరు?

అది ప్రేమా? ఏమో? సందిగ్దంలో నేనుంటే. నవ్వుతూ నా ఎదురుగా నువ్వు.

నీకు తెలుసా ? అయోమయంగా చూసా.

నాకేం తెల్సన్నట్లుగా పెదాలు విరిచి హరివిల్లు సంధించావు.

“అధరాల విరుపులో కదిలిందొక హరివిల్లు

అది వదిలిన శరములకే ఎదనంత గాయాలు....”

నవ్వులు రువ్వి మనసుని హరించావు. పెదవులు విరచి గుండెను గాయ పరిచావు.

అప్పటికప్పుడే నా బాధ తెలియ చేయాలనుకున్నాను. నా మనసుకేదో అయ్యిందని, నువ్వే కారణమని చెప్దామనుకున్నా. మాటలు రాలేదు ?

ఏం మాయ చేసావో? ...

ఎక్కడో సన్నగా అనురాగ స్వరాల జల్లులు. సౌందర్య ప్రపంచంలో స్వప్న గీతికల సౌరభాలు.

కనులు మూసిన నీ వాయే, నే కనులు తెరచినా నీ వాయే..

మనసు లేని మనిషి నయ్యాను. కాదు, మతి లేని మనిషి నయ్యాను.

తిలక్ “అమృతం కురిసిన రాత్రి”....ఎద లోతుల్లో ధ్వనిస్తోంది!

“ఆకాశపు వొంపులోన ఆర్ద్ర వెనుక నీ నవ్వు

పాతాళం లోతులలో ప్రతిధ్వనించి సాగింది....”

ఎంత హృద్యమైన కవిత. గుండెను తాకి మంటను రేపింది.

నా గుండెలోతుల్లో నీ నవ్వు ప్రతిధ్వనిస్తూనే ఉంది. తీయని బాధను రగిలిస్తోంది.

ప్రేమ ఒక తీయని బాధని అనుభవపూర్వకంగా తెలిసింది. ఆ బాధ నన్నునిలవనీయడం లేదు.

నిలకడలేని, నిలబడలేని స్థితి.

భూమ్యాకర్షణశక్తికే సవాలులా నీ ఆకర్షణా శక్తి.

అసలు నిన్నెందుకు నాకు తారసపడేలా చేసావని ఆ భగవంతుడిని తిట్టుకున్నా.

అందుకే శపించాడేమో నిన్ను తప్ప అన్నీ మర్చిపోయేలా ? మాటిమాటికి నువ్వే గుర్తోస్తున్నావు.

నా ఆలోచనా ప్రపంచం ఒక ఆకాశం . అక్కడ మెరిసే నక్షత్రాల్లా ఆశలు.

ఆశే నా శ్వాశ....

ఒక అందమైన ఆకృతికి ఎంత బలమైన ఆకర్షణా శక్తి. సుడిగాలులే లేపింది. సునామీలనే సృష్టించింది. శరదృతువు వెన్నెల్లా బాధిస్తోంది.

తిలక్ మళ్లీ అమృతం కురిపిస్తున్నాడు.

జలజలమని కురిసింది వాన,

జాల్వారింది అమృతంపు సోన”..

కాలాన్ని త్రాగి కురుస్తున్న అమృతానివి నువ్వు.. ప్రేమామృతానివి ....

ప్రేమదప్పిక తీరేలా గ్రోలాలని వుంది ..

వేరే ఆలోచన లేదు. మరే భావనా లేదు. నువ్వే...నువ్వే.. రాత్రి, పగలు, ఎండా, వాన అన్నీ నువ్వే..

నీ నవ్వులు నా గుండె అంతరాంతరాలలో ప్రతిధ్వనిస్తూ ఉంటే, నే వెదుకుతున్నాను . ఆశగా నిన్ను చూస్తూ ...నీ కన్నుల్లోకి చూస్తూ...

“మధు గ్రోలు తూనీయలా కదలాడు నీ కనుల

మెదిలేటి నీడలలో వెదికాను నా మదికై......ఆశతో ,

ఆశ పడడం, ప్రేమించడం నేరమైతే,

ఆశ పడకపోవడం, ప్రేమించ బడకపోవడం శాపమే.

శాపానికి శిలగా మారడం కంటే, నేరం చేసి బందీ నవుతా నీ హృదయంలో..

ప్రేమఖైదీగా... మిగిలిపోతా !

మరొకసారి గతంలోకి నడచినట్లయ్యింది. ఎన్నో ప్రేమ ఉసులు, మరెన్నో ప్రేమ బాసలు, మరపురాని అనుభూతులు, అందమైన అనుభవాలు, కలగలిపి అందమైన జీవితం.

లక్క-బంగారం, ఓ మిధునంలా మనమిద్దరం ఉండాలనుకునే,

నేను....నీ ప్రియ నేస్తాన్ని...!!


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.