క్లాక్ టవర్

రాత్రి 11.30 గంటలు

ఊరంతా నిశ్శబ్దం.. అలాంటి సమయంలో నైట్ డ్యూటీ చేసి, ఒక్కడే స్కూటర్ మీద తన ఇంటికి వెళ్తున్నాడు పోలీసాఫీసర్ రాజన్. విచిత్రమేంటంటే.. తొలిసారి ఆ ఇంటిలో అడుగుపెట్టబోతున్నాడు అతను. మొన్నటి వరకు స్టేషన్ గెస్ట్ హౌస్‌లో ఉన్న రాజన్‌కు దొరికిన అద్దె ఇల్లు అది.

స్టేషన్ నుంచి ఆ ఇల్లు దాదాపు ఓ ఎనిమిది కిలో మీటర్లు దూరం ఉంటుంది.

కొత్తగా ఆ వూరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చినా, ఒక వారంలోనే ఏరియా మీద మంచి అవగాహనకు వచ్చాడతను.

వూరికెక్కడో దూరంగా ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంది ఆ ఇల్లు.

రాజా విక్రమ్‌దేవ్ కోటనే ఇల్లుగా మార్చి ఓ శేఠ్ రాజన్‌కి అద్దెకు ఇచ్చాడు..

దూల్‌మెట్ట పీఎస్ ఏరియాలోకి వచ్చే ఆ ఇల్లు గురించి చాలామంది అనేక కథలు చెప్పుకుంటూ ఉంటారు...

బాగా పురాతనమైన ఆ ఇంటిలో ఒకప్పుడు రాజా విక్రమ్‌దేవ్ ఓ ఇంగ్లీష్ దొరసానితో కలిసి కాపురం పెట్టాడని.. తర్వాత అదే ఇంటిలో ఆ దొరసాని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని వదంతులున్నాయి. ఆ ఇల్లు అతీంద్రియ శక్తులకు ఆలవాలమని కూడా కొందరు అంటారు.

స్టేషన్‌లో ఛార్జ్ తీసుకున్నాక.. రాజన్‌కి ఆ ఇంటి విషయంలో ముందుగానే హెచ్చరించాడు కానిస్టేబుల్.

"సాబ్.. ఆ ఇంటిలో అద్దెకు దిగకండి.. అందులో ప్రేతాత్మలు తిరుగుతాయని అంటారు" అని కానిస్టేబుల్ చెప్పినా.. దెయ్యలు, భూతాలు అనేవి మనిషి భయానికి కారణమయ్యే కల్పితాలని ఎప్పుడూ భావించే రాజన్ అతని మాటలను పట్టించుకోలేదు.

కానిస్టేబుల్ తర్వాత చాలామంది ఆ ఇంటి గురించి రాజన్‌తో చెప్పారు.

అందరూ ఎందుకు ఆ ఇంటి గురించి చెడుగా చెబుతున్నారని శేఠ్‌‌ను అడిగాడు రాజన్ ఇంతకు ముందే..

"అలాంటిదేమీ లేదు సాబ్.. ఈ ఊరిలో జనాలకు కాస్త మూఢనమ్మకాలు ఎక్కువ. అందుకే ఏవేవో కహానీలు చెబుతారు. కావలిస్తే మన ఇంటి వాచ్‌మన్‌ని అడగండి. గత 5 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాడు" అని వాచ్‌మన్ రంగాని పరిచయం చేశాడు శేఠ్.

కాకపోతే రంగా పుట్టు మూగవాడు. ఏమడిగినా మౌనంగా ఉంటాడే.. తప్పితే నోరు కనీసం మెదపడు.

.....

ఈ రోజు నిజంగానే ఆ ఇంటి రహస్యం చేధించాలనే అనుకున్నాడు రాజన్.. అందుకే నైట్ డ్యూటీ తర్వాత పోలీసు జీప్‌లో కాకుండా, ఒక్కడే కానిస్టేబుల్ దగ్గర స్కూటర్ అడిగి తీసుకొని, చిమ్మచీకట్లో ఒంటరిగా ప్రయాణం చేస్తూ వెళ్లాడు..

అలా వెళ్తున్నప్పుడు ఆ ఇంటి గురించి చాలా మంది చెప్పిన విషయాలు ఒక్కొక్కటే అతనికి గుర్తుకురాసాగాయి..

అందులో ముఖ్యమైంది క్లాక్ టవర్..

విక్రమ్‌దేవ్ కోటకి, దూల్‌మెట్ట రోడ్డుకి మధ్యనున్న పాత సిన్మాహాలు దగ్గర ఉంటుంది ఆ క్లాక్ టవర్.. ఆ సిన్మాహాలు మూసేసి ఓ పాతిక సంవత్సరాలు అవుతుంది. అక్కడక్కడ కనిపించే ఇల్లులు తప్పితే.. పూర్తిగా జనసంచారం లేని ప్రాంతం అది.. ఆ క్లాక్ టవర్ దాటి ఓ రెండు కిలోమీటర్లు దాటితే గానీ మెయిన్ రోడ్ రాదు..అంటే తన ఇంటి నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే గానీ, తను బస్టాపు గానీ, పొలాలు గానీ, జనాలను గానీ చూడడానికి అవ్వదన్నమాట.

ఇంతదూరంలో ఎందుకు కట్టారు ఇల్లు.. మనసులో అనుకున్నాడు ..

ఆ క్లాక్ టవర్ గురించి కూడా చాలామంది చాలా కథలు చెప్పారు.. ప్రతి రోజూ రాత్రి 12.00 గంటకు ఆ క్లాక్ పన్నెండు గంటలు కొడుతుంది.. కానీ ఒకానొక రోజు అది పదమూడు గంటలు కూడా కొడుతుంది..

ఆ గంటలు చాలా దూరం వినిపిస్తాయి.. ఆ క్లాక్ పదమూడు గంటలు కొట్టిందంటే ఎవరికో మూడిందన్న మాటే..

రాజన్ వేగంగా తన బైక్ మీద ప్రయాణిస్తున్నాడు...

సరిగ్గా క్లాక్ టవర్ దగ్గరకు వచ్చేసరికి.. ఎందుకో బాగా చెమటలు పట్టేశాయి..

టైమ్ చూశాడు... 12.00 గంటలు వాచీ మీద దర్శనమిచ్చాయి..

అంతే.. ఒక క్షణం ఆలోచించి.. ఎన్ని గంటలు కొడుతుందో టెస్ట్ చేద్దామనుకున్నాడు..

గడియారం ముల్లు సరిగ్గా.. 12.00 దగ్గరకు వచ్చేసరికి.. మొదటి గంట కొట్టింది..

తర్వాత రెండు.. ఆ తర్వాత మూడు..

రాజన్ లెక్కబెడుతూనే ఉన్నాడు...

గడియారం పన్నెండు గంటలు కొట్టింది... హమ్మయ్య అనుకున్నాడు..

స్కూటర్ స్టార్ట్ చేశాడు..

కానీ అనుకోకుండా మళ్లీ విచిత్రం జరిగింది... గడియారం పదమూడో గంట కూడా కొట్టింది...

ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు రాజన్..

ఇంకా ఆశ్చర్యమేంటంటే... అది కేవలం పదమూడో గంటతో ఆగలేదు..

రాజన్ తేరుకొనే లోపు అది ఇంకో గంట కొట్టింది.. ఆ తర్వాత మరో గంట... అలా టవర్ గంటలు కొడుతూనే ఉంది..

రాజన్ చెవులు చిల్లులు పడిపోతూనే ఉన్నాయి.. స్కూటర్ వదిలేసి.. ఆ రొద తట్టుకోలేక.. చెవులు మూసుకున్నాడు...

ఆ గంటల శబ్దానికి చెవుల నుండి రక్తం కారసాగింది.. భయంతో పరుగెత్తడం ప్రారంభించాడు రాజన్..

సడెన్‌గా గంటల శబ్దం ఆగింది...

ఒక్క క్షణం తేరుకొని చుట్టూ కలియజూశాడు.. అంతా నిశ్శబ్దం..

ఒక పెద్ద గాలివాన వచ్చి పోయినప్పుడు కలిగేంత నిశ్శబ్దం అది..

ఆ నిశ్శబ్దంలో నుంచి లీలగా ఓ పాశ్చాత్య సంగీతంతో కలసి ఇంగ్లీష్ సాంగ్ వినబడసాగింది..

రాజన్ ఆ పాట వస్తున్న చోటుకి వెళ్లాడు... అక్కడ ఓ బాగా పాడైపోయిన ఓ పాతకాలం నాటి రోల్స్ రాయిస్ కారు కనిపించింది.. ఆ కారులో నుండి వస్తుందా పాట.. రాజన్ వెళ్లి ఆ కారు డోరు తెరిచాడు..

అక్కడ ఓ సెల్ ఫోన్ ఉంది.. ఆ సెల్ ఫోన్‌రింగ్ టోన్ ఆ పాట...

ఏదో ఇన్ కమింగ్ కాల్.. వస్తున్నప్పుడు ఫోన్ రింగ్ అయ్యి ఆ పాట వచ్చిందని అనుకున్నాడు రాజన్...

రాజన్ ఆ కాల్ రిసీవ్ చేసుకోవాలా లేదా అన్న సంశయంలో పడ్డాడు.. అంతలోనే కాల్ కట్ అయ్యింది.. రాజన్ ఆ ఫోన్‌ని చేతిలోకి తీసుకున్నాడు...

తర్వాత నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు. చూస్తే అక్కడ తన స్కూటర్ లేదు..

ఇంతలో ఫోన్‌లో ఒక మెసేజ్ వచ్చింది.. రాజన్ ఆ మెసేజ్ చదివాడు

"CAN I DROP YOU IN MY ROLLS ROYCE"

అదీ మెసేజ్ సారాంశం..

రాజన్ మళ్లీ పరుగెత్తుకుంటూ ఇంతకు క్రితం కార్‌ని చూసిన ప్రాంతం దగ్గరకు వెళ్లాడు...

అక్కడ ఓ సంఘటన చూసి భయంతో అతని ఒళ్లు మొత్తం కంపించింది.. గుండె వేగంగా కొట్టుకోసాగింది

తనకు ఇల్లు అద్దెకిచ్చిన శేఠ్ అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్నాడు..

ఓ కుక్క శేఠ్ కాలర్‌ని పట్టి లాగుతుంది..

రాజన్ కుక్కను అదిలించడానికి ప్రయత్నించాడు... ఆ కుక్క ఒక్కసారి రాజన్ వైపు చూసింది..

దాని కళ్లు చింతనిపుల్లా ఎర్రగా ఉన్నాయి... రాజన్ పరిగెత్తాలనుకున్నాడు..

కానీ పరుగెడదామనుకున్నా అతని శరీరం సహకరించడం లేదు... ఎవరో తనను పట్టి లాగేస్తునట్లు అనిపించసాగింది..

అయినా ధైర్యం చేసి శక్తి మొత్తం కూడదీసుకొని పరుగెత్తడానికి ప్రయత్నించాడు..

కానీ.. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.. భయంతో రివాల్వర్ తీయడానికి జేబుతో చేయిపెట్టాడు..

కానీ.. జేబులో రివాల్వర్ లేదు..

ఓ కీ చెయిన్ కనిపించింది... దానిని తీసి చూశాడు..

దాని మీద మూడు పదాలు కనిపించాయి..

'GAME IS OVER'

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.