అదొక ప్రభుత్వోన్నత బాలికల పాఠశాల .


అమ్మా! పంతులమ్మా!దండాలమ్మా ఇది మా చిట్టితల్లి ! . దీన్ని ఆరులో వెయ్యాలమ్మా !."రొప్పుతూ అందొక ముసలావిడ .

ఆ! ఆ! నమస్తే! ఆ టేబుల్ దగ్గరకి వెళ్ళండి . లక్ష్మి టీచర్ గారూ ! "ఈవిడ సంగతి చూడండి" .అంది అదే స్కూల్ లో p .d మేడం .

ఆ! ఆ! సరే ఇలారండి . ఏది టి, సి. ఆధార్ కార్డు , ఇవ్వండి . మీ వివరాలు చెప్పండి. " అన్నట్టు మీ మనవరాలు డే స్కాలరా హాస్టలరా అనడిగింది" లక్ష్మి టీచర్. ..

"అమ్మా హాస్టలమ్మా !వీళ్ళ నాన్న తాగుబోతు! . గొడవలొచ్చి మొగుడు పెళ్ళాం విడిపోయారమ్మా .దానితో వాళ్ళ ముందుటేడు ఉరేసుకుని సఛ్చిపోయిందమ్మా .నేను దీనికి అమ్మమ్మ నమ్మా! . రెక్కాడితేగాని డొక్కాడదు . ఎదో చదువబ్బితే సుఖపడతారని .అంది ఆ ముసలావిడ .

ఆ! ఆ ! సరే ! పేరెంట్స్ మీటింగ్స్ కి కబురు పెట్టినప్పుడు రండి .

ఇవాళ సుమారు 200 మంది జాయిన్ అయ్యారు .పి .డి గారూ ! ఎవరేనా పేరెంట్స్ వస్తే వెయిట్ చేయమని చెప్పండి .కొంచం టీ తాగి వస్తాను . అంది లక్ష్మి .ఇదిగో నేను వస్తున్నా లక్ష్మి గారూ . అంది పక్కనే ఉన్న శిరీష టీచర్.

శిరీష ఆ స్కూల్ లో ట్రాన్స్ఫర్ మీద కొత్తగా వచ్చిన టీచర్ . అభ్యుదయభావాలు ఉన్న టీచర్ . సమాజానికి తనవంతు సేవ చేయాలని తాపత్రయపడుతుంది .పిల్లలని ఎంతగానో అభిమానంచే టీచర్ .పిల్లలకి కూడా ఆవిడ అంటే అభిమానం .

.......................................................

చిట్టితల్లి !"ఇదిగో నీ ప్రోగ్రెస్ కార్డు నువ్వు నాలుగు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యావు . ఇలా అయితే రేపు ఎలా పాస్ అవుతావు ? ఈసారి మీ అమ్మమ్మ వచ్చినపుడు చెప్పు నేను మాట్లాడాలి" .అంది శిరీష .

టీచర్ ! చిట్టితల్లి వాళ్ళ అమ్మమ్మ వచ్చింది .అన్నారు పిల్లలు .

అమ్మా! ఇలా రండి . "పిల్లలని జాయిన్ చేస్తే బాధ్యత తీరిపోదు . తన అవసరాలు కూడా మీరు చూస్తుండాలి . చూడండి! తను సోప్ లేక రెండు రోజులనించి స్నానం చెయ్యట్లేదు . చూడండి! జాకెట్ నిండా చిరుగులే . నోటుబుక్స్ లేవు పైగా తనకి ఇచ్చిన డబ్బులు కూడా మీరు అడిగి తీసేసుకుంటారట ." ఇలా అయితే ఎలాగమ్మా.మీకు కుదరకపోతే ఇంటికి తీసుకునివెళ్లిపొండి ".అంది శిరీష చిట్టితల్లి వాళ్ళ అమ్మమ్మతో.

అంత మాటనకమ్మా. పిల్ల పాస్ అవ్వక పోయినా పరవాలేదు. ఇంట్లో కనిపెట్టుకుని ఉండడానికి ఎవరూ లేరనే కదమ్మా! ఈ ఆడపిల్లల స్కూల్ లో వేసింది.ఈ సారి తప్పు కాయండమ్మా. అంది చిట్టితల్లి వాళ్ళ అమ్మమ్మ.

చిట్టితల్లి! ఇవాళ వార్డెన్ గారు డబ్బులిచ్చారుట కదా! పేస్ట్, సోప్, బుక్స్ కొనుక్కో! సరేనా అంది శిరీష .

"అమ్మమ్మ కి ఇచ్చేసాను టీచర్" . అంది చిట్టితల్లి .

"సరే! నేను కొనిస్తాలే" అని ఆలోచనలో పడింది శిరీష .

.......................................

"చిట్టితల్లి ఈ మధ్య నోట్స్ తెచ్చుకుంటోంది . దాని చేతిలో బిస్కేట్ పాకెట్స్ కూడా కనిపిస్తున్నాయి . కొత్త గాజులు...., కొత్త గొలుసు... మెరిసిపోతోంది .పోనిలే! నేను వాళ్ళ అమ్మమ్మకి గట్టిగ చెప్పడం మంచిదయ్యింది ". అనుకుంది శిరీష .

ఏరా చిట్టితల్లి! అమ్మమ్మ కొనిచ్చిందా అనడిగింది శిరీష .చిట్టితల్లికి శిరీష టీచర్ అంటే చాలా ఇష్టం .మరి.... మరి... అని ఏదో చెప్పబోయి ఆగిపోయింది .శిరీషకి అర్ధమైంది .ఏదో దాస్తోంది అని. "చిట్టితల్లి చెప్పరా! ఇవన్నీ ఎవరిచ్చారు ? నేనెవరికీ చెప్పనులే." అంది శిరీష .

చిట్టితల్లి చెప్పడం మొదలు పెట్టింది . అది పూర్తి చేసేటప్పటికి శిరీషకి స్పృహతప్పుతున్నట్టయింది. పడిపోకుండా టేబుల్ అంచు గట్టిగా పట్టుకుంది .చిట్టితల్లి లాంగ్ బెల్ కొట్టడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది .

తన్నుకుంటూ వస్తోంది కడుపులోంచి దుఃఖం శిరీషకి . ఇంక ఆగలేకపోయింది ఆలా ఏడుస్తూనే ఉంది వెక్కి వెక్కి ."ఇది అందరికి తెలుసా! తెలిసినా పట్టించుకోవట్లేదా! .దేవుడా! ఇప్పుడు ఏం చెయ్యాలి ?శిరీషకి తల బద్దలైపోతుంది " .చిట్టితల్లి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి ..

టీచర్! మరి...పదోతరగతి అక్కలుఒక పది మంది ౩ రోజుల ముందు మా రూమ్ కి వచ్చారు .మా రూమ్ లో కొత్తగా వచినవాళ్ళం అన్ని క్లాసులు కలిపి ఒక 20 మంది ఉన్నాం . మొన్న రాత్రి 11 గంటలకి వచ్చి మాకు చెప్పారు . ఎవరో అంకుల్స్ దగ్గరకి తీసుకెళ్తారట . వాళ్ళు మాకు అన్ని కొనుక్కోమని 500 ఇస్తారట . ఎవ్వరికి చెప్పద్దని వార్నింగ్ ఇచ్చారు . మొన్న మారూమ్ లో అక్కని, నన్ను తీసుకెళ్లారు .నన్ను బయటే ఉండమన్నారు . అక్కని గదిలోకి పంపించారు .నన్ను కాపలా కాయమన్నారు. నాకు 200 ఇచ్చారు . అక్కకి 500 ఇచ్చారు. అక్క బయటకు వచ్చినతర్వాత చూసాను. పాపం! అక్కవీపంతా గీరుకు పోయి ఉంది టీచర్ !.ఆ అంకుల్ మంచివాడు కాదు టీచర్!. నేను ఆ అక్కని అడిగాను "ఎందుకు వీపలా అయిపోయింది" అని . రూమ్ సరిగ్గా తుడవలేదని అంకుల్ గీరేశాడని చెప్పింది . ఎవ్వరికి చెప్పద్దని అమ్మ మీద ఒట్టు వేయించుకుంది .కానీ మా అమ్మ చచ్చిపోయింది కదా! అని చెప్పేసాను.

నిన్న ఇంకో అక్కని తీసుకెళ్లారు . నన్నే కాపలా ఉండమన్నారు . ఒక పోలీస్ అంకుల్ లోపలి వెళ్ళాడు . నాకు ఎంత ధైర్యం వచ్చిందో తెలుసా! టీచర్ ! అంకుల్ పోలీస్! కదా ఎవ్వరూ అక్కని కొట్టలేరు . ఆ పోలీస్ అంకుల్ చాలా మంచివాడు ఆ అక్కకేమో 500 నాకేమో 100 ఇచ్చాడు టీచర్.

.............................................

శిరీషా ...ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నీకెందుకు? నోరుమూసుకుని బుద్ధిగా ఉద్యోగం చేసుకో. అంటోంది మనసు .నోరుమూయి ఇదేనా నీ కర్తవ్యం? ఆ పిల్లలం అనాధల్లా వదిలేస్తావా ? వాళ్ళు తోటలో పూచే మందార మొగ్గల్లాంటివాళ్ళు .వాళ్ళ జీవితాలు మొగ్గలోనే చిదిమేస్తున్నారు. లే ...!వెళ్ళు... నీలోనే ఉంది ఆ కాళికామాత . తెలుసుకో !దుష్టసంహారం చేసే దుర్గాదేవి అవతారం ధరించు. అంటోంది అంతరాత్మ .

.................................

ఒక్కసారి ఆ గర్జనలకి ఊరంతా ఉలిక్కిపడింది !. ఆ పిల్లలందరూ సింహనాదాలు చేస్తున్నారు!. "విద్యార్థినుల కి న్యాయం కావాలి:"...."అత్యాచారాలు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలి" . ఆకాశం ఆక్రోశంతో ఉరుముతోందా ... భూమాత కోపంతో రెండుగా చీలిపోతోందా...అన్నట్టుంది .అధికారులందరూ అప్రమత్తమయ్యారు .ఆ ఘోర అకృత్యానికి కారణమైన పెద్దమనుషులందరూ కటకటాల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. పిల్లలకి కౌన్సిలింగ్ క్లాసెస్ నిర్వహించారు .

ఆ మర్నాడు చిట్టితల్లి టీచర్.... అంటూ వచ్చి చేతిలో ఉంచింది . అది! పూర్తిగా విరిసిన ముద్ద మందారం . "ఎంత ముద్దొస్తోందో "అనుకుంటూ తృప్తిగా మెరిసే కళ్ళతో జడలో తురుముకుంది . శిరీష .


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.