మెరుపు

కేవలం కొన్ని సంఘటనలు చరిత్రనుండి తీసుకోబడినప్పటికీ...ఇదొక కల్పిత కథ మాత్రమే.

***********************************

ప్రతి వైపరీత్యం వెనుక మానవుని విపరీత బుద్ధి ఉంటుంది.కొన్నిసార్లు పెదాలకన్నా కళ్ళు మాత్రమే బాగా మాట్లాడగలుగుతాయి.అదేంటోగానీ విఫలమైన ప్రేమకథల్లో విషాదం మాత్రం చాలా వరకు మగాడివైపే ఉంటుంది. ఉన్నట్లుండి ఆకాశంలో మెరుపు మెరిసింది.

అతని కళ్ళు భారంగా మూతబడ్డాయి.

ప్రారంభం :

డిసెంబరు 24, 2004 వ సంవత్సరం.

హిమాలయాలకు మధ్యలో ప్రపంచంలో సంబంధం లేని ఒక సామ్రాజ్యం.!

సమయం : ఉదయం ఏడు గంటలు.

హిమగిరి రాజ్యం మొత్తం నిశ్శబ్దంగా ఉంది.రాజు హేమంతుడు కోట పై భాగం నుండి నిలబడి రాజ్యం మొత్తాన్ని చూస్తున్నాడు.

అప్పుడే వచ్చిన మంత్రిగారు రాజుగారికి నమస్కారం చేశాడు.

“ఏంటి రాజుగారూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.?” అడిగాడు మంత్రి.

“ఈ రాజ్యం భవిష్యత్తు గురించి..” అని ఓ క్షణం ఆగి తిరిగి కొనసాగించాడు రాజు. “ఇప్పటికైతే మనకేమీ సమస్యలేదుగానీ ఆ ఆధునిక ప్రపంచంతో ఏదో ఒకరోజు మనం సంబంధం పెంచుకోక తప్పదు.అప్పుడు మనవాళ్ళు వాళ్ళతో కలిసి ఉండగలరా. ?” అని చెప్పడం ఆపాడు రాజు.

మంత్రి ఓ నిమిషం మౌనం వహించి ఇలా అన్నాడు. “ నిజమే ప్రభూ.కానీ మన ప్రజలు అంత అమాయకులు కాదని నా విశ్వాసం.అంతా ఆ భగవంతుని దయ.”

అలా అని అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు.


హిమగిరి - హిమాలయాల మధ్యలో గల అందమైన సామ్రాజ్యం.అయితే ఆ సామ్రాజ్యం చుట్టూ దట్టమైన మంచుకొండలతో ఉండటం వలన అక్కడ ఒక సామ్రాజ్యం ఉన్నట్లు ఎవరికీ తెలీదు.

మహారాజుకి,మహా మంత్రికి తప్ప. !

రాజ్యం మొత్తానికి ప్రత్యేకమైన అందం మాత్రం ఆ మధ్యలో ఉన్న అడవి.ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటం వలన ఆ అడవి అందరినీ తనవైపు ఆకర్షిస్తూ ఉంటుంది.

గౌతముడు అతని మిత్రబృందం అప్పుడే అడవిలోకి ప్రవేశించారు." ఈరోజు ఏంటి?" ప్రశ్నించాడు నాగేంద్రుడు.

“ఏముంది.షరా మామూలే.రోజూ చేసే పనేగా..” బదులిచ్చాడు గౌతముడు.

అక్కడున్న వాళ్లంతా గౌతముని వైపు కొరకొరా చూస్తూ నిలబడ్డారు. “ఇది చాలా అన్యాయం మిత్రమా”అన్నాడొకడు.

గౌతముడు చిత్రంగా చూసేసరికి “అవును అన్యాయమే.” అంటూ నాగేంద్రుడు అందుకున్నాడు.

“నీ ప్రియురాలి కోసం మేము పూలు కోయడం ఏంటో..దాన్ని నువ్వు తీసుకెళ్ళడం ఏంటో..పోనీ తీసుకెళ్ళాక అయినా ఇస్తావా..? లేదు. అక్కడే చెట్టు కింద ఉంచేసి పక్కగా వెళ్ళి దాక్కుంటావ్.కనీసం నువ్వే అక్కడ పూలు ఉంచింది అని తనకి తెలియాలిగా.. ఇలా అయితే ఏం లాభం” ఆవేశంతో అన్నాడు నాగేంద్రుడు.

“ఎందుకో ధైర్యం చాలట్లేదు మిత్రమా” అని గౌతముడు ఆ పూలను చెట్టు కింద ఉంచాడు.ఇంతలో ఎవరో వస్తున్నట్లు చప్పుడవడంతో “వచ్చేసినట్లున్నారు.పదండి” అంటూ చకచకా పొదల వెనుక దాక్కునేందుకు పరిగెత్తిన గౌతముడు తన మెడలోని హారం కింద పడటాన్ని గమనించలేదు.

ఇంతలో స్వాతి తన స్నేహితురాళ్ళతో అక్కడికి వచ్చింది.

దూరంగా పొదల చాటున దాక్కున్న గౌతముడు వాళ్ళని గమనిస్తున్నాడు.స్వాతి తనకు అలవాటైన రీతిలో అక్కడ ఉన్న పూలను తీసుకుని ఆ సువాసనకి మురిసిపోయింది.

రోజూ ఇక్కడ మనకోసమే అన్నట్లు ఈ పూలను ఎవరు ఉంచుతున్నారు..? అక్కడున్న వాళ్ళంతా ఒకర్నొకరు చూసుకుని అయోమయం చెందారు.

ఆ మాటలకు పొదల చాటున గౌతమునితో పాటు దాక్కొన్న నాగేంద్రునికి కోపం వచ్చింది. “ఈ అపర మేధావులు వాళ్ళకోసం అనుకుంటున్నారు.నిజానికి అవి మా వాడి ప్రియురాలు స్వాతిప్రియ గారి కోసం .” మెల్లగా అన్నాడు.

“ఎవరో మనలానే ఇక్కడికి వస్తూ ఉంటారేమో రోజూ.” అన్నారు స్వాతి వాళ్ళ స్నేహితురాళ్ళు.

“అవును.కాకపోతే మగవాళ్ళు.” అంది స్వాతి.కింద పడిన హారాన్ని చేతిలోకి తీసుకుంటూ.

“వామ్మో నీ ప్రియురాలు సామాన్యురాలు కాదురోయ్” అని అందరూ అక్కడినుండి మెల్లగా జారుకున్నారు.

సరిగ్గా అదే రోజు సాయంత్రం..

రాజస్థాన్ లోని థార్ ఎడారి.

ప్రొఫెసర్ శ్రీనివాస్ మొహం టెన్షన్ తో ఉంది.

ఆయన కనిపెట్టిన అణ్వస్త్రం తరంగ్ ను ఆ రోజు ప్రయోగించబోతున్నారు.

కౌంట్ డౌన్ మొదలై అప్పటికే రెండుగంటలైంది.ఇంతలో అక్కడికి ఓ అధికారి ఓ కాగితంతో వచ్చాడు. “సర్.ఇందులో మీరు సంతకం చేయాలి” అన్నాడా అధికారి.

దాన్ని అందుకొని పరిశీలించాడు ప్రొఫెసర్.ఒకవేళ ఈ ప్రయోగంలో నా ప్రాణం పోతే అందుకు భారత ప్రభుత్వం ఎటువంటి బాధ్యతా వహించదు అని రాసుంది అందులో.

దాన్ని చూసి చిరునవ్వుతో సంతకం చేశాడు శ్రీనివాస్.

కాంట్ డౌన్ పూర్తయింది.తరంగ్ ను ప్రయోగించారు.

దాదాపు 2000 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించేందుకు అతి వేగంగా దూసుకెళ్తోంది తరంగ్.

ఉన్నట్లుండి ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది.!

ఇంతలో ఏదో ఆటంకం ఏర్పడింది.!! వారి ముందున్న పరికరంలో ఏవో కదలికలు రాసాగాయి.తరంగ్ లక్ష్యంవైపు వేగంగా వెళ్తూనే ఉంది.

ఇంతలో ఒక్కసారిగా ప్రొఫెసర్ శ్రీనివాస్ ముందున్న కంప్యూటర్ , వివిధ యంత్రాలు ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ భారీ విస్పోటనం జరిగింది. ఆ దెబ్బతో శ్రీనివాస్ ముప్పై అడుగుల దూరంలో పడ్డాడు.!

“తరంగ్‌” క్షిపణి కూడా వెళ్ళాల్సిన లక్ష్యం వైపు గాక మరోవైపు తిరిగి హిమాచల్ ప్రదేశ్ లోని ఓ అడవిలో

దూసుకుపోయింది.

ఆ తరంగ్ కలిగించిన విస్ఫోటనానికి హిమాచల్ ప్రదేశ్ లోని ఆ అడవి పూర్తిగా నాశనమైంది.

అయితే ఈ వైఫల్యాన్ని అధికారులు బయటకు పొక్కనీయలేదు.

ఫిబ్రవరి 24, 2004 వ సంవత్సరం. :

దాదాపు రెండు నెలలుగా ఇదే త౦తు జరుగుతోంది.! రోజూ రావడం ,ఫూలు కోయడం, దాన్ని ఆమె చిరునవ్వుతో వచ్చి తీసుకోవడం,...దీన్ని చూసీ,చూసీ గౌతముని స్నేహితులకి విసుగొచ్చింది.

ఇలా అయితే కుదరదనుకొని ఒకరోజు వద్దు వద్దంటున్నా వినకుండా నాగేంద్రుడు గౌతముడ్ని స్వాతి దగ్గరకు లాక్కెళ్ళాడు.

మొదట వారందరినీ చూసి స్వాతి , ఆమె స్నేహితురాళ్ళు బెదరిపోయినా తర్వాత ధైర్యం తెచ్చుకొని “ఎవరు మీరు..? మీకు ఏం కావాలి” అని అడిగారు.

నాగేంద్రుడు ఆ మాటలకు తడబడి అంటే మేము.., అదే ఆ పూలు.. అంటూ ఏదో చెప్పడానికితడబడుతూ ఉండగా గౌతముడు తెగించి ముందుకు వచ్చాడు.

“నేను మీతో మాట్లాడాలి” స్వాతిని సూటిగా చూస్తూ అన్నాడు గౌతముడు.

స్వాతి ఆ మాటలకు అదిరిపడి. “అమ్మో నాకు భయం.., నేను వెళ్ళిపోతాను” అంది.

“ఆగండి..మీరేం భయపడాల్సిన అవసరం లేదు.ఇక్కడ అందరూ ఉన్నారుగా” అన్నాడు గౌతముడు.

స్వాతి మొదట భయపడినా చుట్టూ తన స్నేహితురాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో ఏం మాట్లాడాలి.? అంది.

“నాకు మీరంటే ఇష్టం!” అన్నాడు గౌతముడు.

ఒక్కసారిగా స్వాతి మనసు చలించింది.

“మిమ్మల్ని చాలా రోజుల్నుంచి ప్రేమిస్తున్నాను.మీ నిర్ణయమేంటో ఎప్పుడైనా చెప్పండి.నేను ప్రతిరోజూ ఉదయం ఇక్కడే ఎదురుచూస్తుంటాను…,” గౌతముని మాటలు పూర్తి కాలేదు.అప్పటికే స్వాతి అక్కడి నుండి వెళ్ళిపోయింది.!

ఆరోజు నుంచీ స్వాతి అడవికి రావడం మానేసింది.! కానీ గౌతముడు అడవికి రావడం మాత్రం మానలేదు. !!

కొన్ని నెలలు గడిచాయి.ఇప్పటికీ అతను ఆమెకోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.

స్వాతికి కూడా అతనంటే ఇష్టమే అయినా ధైర్యంగా అతని ఎదుట నిలబడి చెప్పలేకపోయింది.

ఇలా ప్రేమకథ కొనసాగుతుండగా ఒకరోజు రాజు హేమంతుడు రాజ్యంలో ఉన్న యువకులనందరినీ వచ్చి కలవమని ఆజ్ఞాపించాడు.గౌతముడు, నాగింద్రునితో పాటు దాదాపు రాజ్యంలోని యువకులంతా ఆ రోజు రాజుగారితో సమావేశమయ్యారు.

“నేను పిలవగానే వచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు.మన రాజుయంలో ప్రతి రాజుకు గుర్తుగా ఏదో ఒక కట్టడం నిర్మించడం ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది.అయితే నేను నిర్మించే కట్టడం మాత్రం చరిత్రలో నిలిచిపోవాలని నా కోరిక.అందుకే ‘ విలాసమందిరం’ పేరుతో ఓ నిర్మాణం చేపట్టాలని ఆశిస్తున్నాను.కాబట్టి దానికి మీ అందరి సహకారం కావాలి.” అన్నాడు రాజు.

ఉన్నట్లుండి ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది.అయితే ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు, ఒక్క నాగేంద్రుడు తప్ప. !

రాజుగారి మాటలకు సభ మొత్తం చప్పత్లతో దద్దరిల్లింది.అందరూ సంతోషంతో తమ అంగీకారాన్ని తెలియజేశారు.

“అంతే కాదు, ఆ విలాసమందిరం మీకోసమే, మీరు అందులో భోగ భాగ్యాలనూ అనుభవించవచ్చు.”అన్నాడు రాజు.

రాజుగారికి మరొక్కసారి చప్పట్లతో తమ అంగీకారాన్ని తెలియజేసి,యువకులంతా అక్కడినుంచి నిష్క్రమించారు.

ఆరోజు రాత్రి రాజుగారు ఏకాంతంగా ఉన్నప్పుడు మంత్రిగారు లోపలికి ప్రవేసించారు.

“ప్రభూ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి” అన్నాడు మంత్రి.

“చెప్పండి” అన్నాడు రాజు.

“నాకెందుకో ఈ విలాసమందిర నిర్మాణం అంత మంచిదికాదనిపిస్తోంది!” అన్నాడు మంత్రి.

ఆ మాటలు వినగానే రాజు భృకుటి ముడిపడింది.

“ఎందుకలా అనిపిస్తోంది..?”

“మీరు ఈ రోజు యువకులతో సమావేశమైనప్పుడు ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది గమనించారా..?”

“దాందేముంది..? ఆకాశమన్నాక మెరుపులు మెరవడం సామాన్యమైన విషయమే కదా?!” అన్నాడు రాజు.

“రాజుగారూ! మీరు మరచినట్టున్నారు.మన రాజ్యంలో సంవత్సరానికి కేవలం ఒక్క నెల మాత్రమే వర్షాకాలం ఉంటుంది.అది ఎప్పుడో గడచిపోయింది.ఇలా సమయంకాని సమయంలో వచ్చిన మెరుపులు మనకంత మంచివి కావు.” అన్నాడు మంత్రి.

“మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు మంత్రిగారూ” అన్నాడు హేమంతుడు.

“చివరిసారి ఇలాగే సమయంకాని సమయంలో మెరుపు మెరిసినప్పుడు పూజ్యులైన మీ తండ్రిగారు గుర్రం మీదినుండి పడి మరణించారు.మన రాజ్యంపైకి చివరిసారి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు కూడా ఇలాగే ఓ మెరుపు మెరిసింది.” అన్నాడు మంత్రి.

“ఈ మూఢ నమ్మకాలన్నింటినీ పక్కన పెట్టండి.ముందు విలాసమందిర నిర్మాణానికి ఓ మంచి ప్రదేశాన్ని వెదకండి.” అన్నాడు రాజు చిరాగ్గా.

మంత్రి అక్కడి నుండి నిరాశతో వెళ్ళిపోయాడు.

మరుసటిరోజు రాజ శాసనంలో ఇలా రాయబడింది.

విలాసమందిర నిర్మాణానికి రాజ్యం మధ్యలో ఉన్న అడవిని అనువైన ప్రదేశంగా రాజుగారు నిర్ణయించారు కావున ప్రతీ ఒక్కరూ విలాసమందిర నిర్మాణంలో పాలు పంచుకోవాలన్నది రాజాజ్ఞ.

ఆ శాసనం చదవగానే అందరూ మరో క్షణం ఆలోచించకుండా తమ చేతికి దొరికిన పనిముట్లను తీసుకొని అడవిని చదును చేసేందుకు బయలుదేరారు.

గౌతముడు కూడా బయలుదేరుతూ నాగేంద్రుడ్ని కూడా తనతో పాటు రమ్మని పిలిచాడు.

“నాకెందుకో ఈ నిర్మాణం అంత మంచిది కాదు అనిపిస్తోంది”. అన్నాడు నాగేంద్రుడు.!

“ ఎందుకు..?”

“ ఏమో తెలీదు.నాకు అంత అందమైన అడవిని నాశనం చేసి విలాసమందిరం నిర్మించాలన్న ఆలోచనే నచ్చలేదు.అయినా ఆ అడవిని నాశనం చేయడమేంటి మిత్రమా..? నాకైతే అస్సలు నచ్చలేదు.అందులో మనం ఎంత సంతోషంగా తిరిగివాళ్ళం..? మరచిపోయావా..? నీ ప్రేమకథ మొదలైంది కూడా అక్కడే కదా?” అన్నాడు నాగేంద్రుడు.

“అవును మిత్రమా, కానీ నా ప్రేమకథ అంతమైందికూడా అక్కడే” అంటూ ముందుకు కదిలాడు గౌతముడు.

************************************

నవంబర్ 25, 2004 వ సంవత్సరం..

ప్రొఫెసర్ శ్రీనివాస్ కొన ప్రాణాలతో బయటపడిన విషయం చాలామందికి తెలియలేదు.!!

చాలా రహస్యంగా తన పరిశోధనలను కొనసాగించిన శ్రీనివాస్ తిరిగి ‘తరంగ్’ ను కొత్తగా రూపొందించాడు.ఈసారి ఒకే అస్త్రంలో రెండు అణ్వాయుధాలను ఉంచి రూపొందించాడు.అయితే ఇందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోదని తెలిసి ఈసారి విదేశీయులతో చేతులు కలిపాడు.!!

గత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి తనకు ఓ అసిస్టెంట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఆ రోజు విదేశీ అధికారులతో మాట్లాడి వచ్చాడు.

“ఇంతకీ మన తరంగ్ లాంచింగ్ ఎప్పుడు సర్..?”

ప్రొఫెసర్ శ్రీనివాస్ స్పష్టంగా బదులిచ్చాడు “డిసెంబరు 24.”

******************


డిసెంబరు 21 , 2004.

విలాసమందిర నిర్మాణం పూర్తయిపోయింది.ఇంతకుముందు ఉన్న అడవిని నాశనం చేసి కట్టిన ఆ భవనంలోకి నాగేంద్రుడికి వెళ్ళాలని అనిపించలేదు.

మరోపక్క విదేశీయులతో కలిసి ప్రొఫెసర్ శ్రీనివాస్ థార్ ఎడారిలో సెటిల్ అయ్యాడు.

“మిస్టర్ శ్రీనివాస్, మనం ఎప్పుడు లాంచింగ్ చేస్తున్నాం?” అడిగాడో విదేశీ అధికారి.

“ఇంకో నాలుగు రోజుల్లో” అన్నాడు ప్రొఫెసర్.అతను ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఉన్నట్లుండి ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది.

“సర్..ఏంటది..?” అన్నాడు అసిస్టెంట్.

“ ఏం లేదు.అయినా ఇండియాలో వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేంగా, అయిన ఒక చిన్న మెరుపు వలన మన ప్రాజెక్ట్ కి ఏం కాదు.” అన్నాడు శ్రీనివాస్.

డిసెంబరు 25 , 2005. :

తరంగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.

ఇంకో నిమిషంలో లాంచింగ్ జరుగుతుందనగా టెన్షన్ తట్టుకోలేక ప్రొఫెసర్ ఓ సిగరెట్ వెలిగించాడు.!

ఉన్నట్లుండి ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది.

తరంగ్ లక్ష్యంవైపు దూసుకెళ్తోంది.

“ఇంతకీ రెండు లక్ష్యాలు ఏవి సర్.?” అడిగాడు అసిస్టెంట్.

“ఒకటి హిమాచల్ ప్రదేశ్ లో, ఇంకోటి మధ్యప్రదేశ్ లో ఉంది.” బదులిచ్చాడు ప్రొఫెసర్.

ఈసారి మరో సిగరెట్ వెలిగించాడు.! ఇప్పుడు ఇంకోసారి మెరుపు మెరిసింది. !!

ఆ కాంతికి శ్రీనివాస్ ముందున్న పరికరాలన్నీ చెల్లాచెదురయ్యాయి.! ఆ విధ్వంసానికి విదేశీయుల ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయాయి. !!

ఆ మెరుపు కలిగించిన విస్ఫోటనానికి ప్రొఫెసర్ శ్రీనివాస్ దూరంగా ఎగిరి పడ్డాడు.

పక్కనే అసిస్టెంట్ కూడా రక్తపుమడుగులో పడి ఉన్నాడు.

తాను చనిపోబోతున్నానన్న బాధ కన్నా తాను మరోసారి విఫలమయ్యాయన్న బాధే శ్రీనివాస్ కు ఎక్కువగా ఉంది.

“దీన్ని బట్టి నీకేం అర్థమైంది?” పక్కనే ఉన్న అసిస్టెంట్ ను అడిగాడు ప్రొఫెసర్.

“నాకేం అర్థం కాలేదు సర్” అన్నాడు అసిస్టెంట్.

ప్రొఫెసర్ స్పష్టంగా ఇలా అన్నాడు…

“ ధూమపానం నిజంగానే ఆరోగ్యానికి హానికరం. ”

తరంగ్ మాత్రం కొద్ది దూరం సరిగ్గా వెళ్ళి తర్వాత అనూహ్యంగా దిశను మార్చుకుంది.!

రెండు మిసైళ్ళుగా విడిపోయిన తరంగ్ ఒకటి హిమాలయాలవైపు, మరోటి హిందూ మహాసముద్రం వైపు దూసుకెళ్ళసాగింది.

ఇక్కడ స్వాతి ఆ రోజు ఎలాగైనా గౌతమునితో మాట్లాడాలని అనుకుంది.!!

దారిలో వెళుతుంటే నాగేంద్రుడు కనబడ్డాడు.నేరుగా అతని దగ్గరికి వెళ్ళి “ మీ స్నేహితుడు ఎక్కడున్నాడు?” అంది.

మొదట ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకొని నాగేంద్రుడు ఇలా అన్నాడు. “విలాసమందిరానికి వెళ్ళాడు.ఇప్పుడు వస్తూ ఉంటాడు.”

“మీరు వెళ్ళలేదా?” అడిగింది.

“లేదు.ఆ అడవిని నాశనం చేయడం నాకు నచ్చలేదు అన్నాడు నాగేంద్రుడు.” ఇంతలో గౌతముడు తిరిగి వస్తూ కనబడ్డాడు.

స్వాతిని చూడగానే అతని సంతోషం తారాస్థాయికి చేరింది.

ఆమె నేరుగా అతని దగ్గరకు వెళ్ళి “మీ జీవిత భాగస్వామిని కావడం నాకు ఇష్టమే” అంది. !

ఉన్నట్లుండి ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది. !!

తరంగ్ లోని ఓ మిసైల్ వేగంగా వచ్చి విలాసమందిరాన్ని తాకింది.ఏంటా అని చూసేలోగా విలాసమందిరం భస్మీపటలమైంది.

ఆ శబ్దానికి భయపడ్డ స్వాతి అనాలోచితంగా గౌతముడ్ని హత్తుకుంది.!

ఆ విస్ఫోటనం కలిగించిన వేడికి హిమగిరి రాజ్యం చుట్టూ ఉన్న మంచుకొండలు కరగడం మొదలెట్టాయి.

క్షణాల్లోమొత్తం మంచు కరిగి నీరులా మారింది. !!

తరంగ్ లోని రెండో క్షిపణి హిందూ మహా సముద్రం వైపు దూసుకెళ్ళి సరిగ్గా హిందూ మహా సముద్ర మధ్యభాగంలో చొరబడింది.ఆ వేడికి అలలు ఎగసిపడి తీరాన్ని బలంగా తాకాయి.!

అలా 2005 డిసెంబరు లో వచ్చిన సునామీ భారతదేశాన్నే గాక,ఇండోనేషియా, శ్రీలంక దేశాల్లోని ఎంతోమంది ప్రాణాలను బలిగొని మరెంతో మందిని నిరాశ్రయులను చేసింది.!!

హిమగిరి రాజ్యం ఉన్నట్లు ఎవరికీ తెలియదు.చివరికి కూడా ఎవరికీ తెలియకుండానే పోయింది.

********************************

ఉదయం ఆరుగంటలకు హిమాలయాల ముందు నిలుచున్న ప్రజలకు ఓ గంట తర్వాత అది సముద్ర రూపంలో దర్శనమిచ్చింది. !

తీరంవైపు అందరి శవాలూ కొట్టుకొస్తున్నాయి.!!

అయితే నాగేంద్రుడు, గౌతముడు, స్వాతి మాత్రం కొన ఊపిరితో తీరానికి కొట్టుకొచ్చా రు.మొదట కళ్ళు తెరచిన నాగేంద్రునికి గౌతముని కౌగిళ్ళో క్షేమంగా ఉన్న స్వాతి కనబడింది.!

“అంటే అప్పటినుండి స్వాతిని ఇలా వదలకుండా పట్టుక్కునే ఉన్నాడా..?” నాగేంద్రుడు విస్తుపోయి చూస్తూ నిలబడ్డాడు.

“చరిత్రలో ఎన్నో ప్రేమకథలు గొప్పగా ఉండొచ్చుగాక.కానీ ఇటువంటి ప్రేమికుడిని మాత్రం భవిష్యత్తు తప్పకుండా గుర్తిస్తుంది” అనుకున్నాడు నాగేంద్రుడు.

ముందుగా స్వాతి కళ్ళు తెరచింది.

తను అసలు ఎక్కడుందో అర్థంకాక లేచి అటూ ఇటూ చూసి ముందుకు కదిలింది.ఆమెకు బాధతో అసలు కన్నీళ్ళు ఆగట్లేదు.అమ్మా,నాన్నా,స్నేహితురాళ్ళు అందరూ గల్లంతయ్యారు.

ఇంతలో గౌతముడు అతి కష్టం మీద కళ్ళు తెరిచాడు. ఎదురుగా స్వాతి నాగేంద్రుడు కనబడ్డారు.

గౌతముడికి వెన్ను భాగంలో ఏదో నొప్పిగా అనిపిస్తే తడిమి చూశాడు.

ప్రవాహంలో వెన్నుకు గుచ్చుకున్న కొయ్యను అతి బలవంతంగా లాగాడు.!దాన్ని చూసి స్వాతి విస్తుపోయింది.!!

“ఏంటది..ఆ రక్తమేంటి..?” అంటూ గౌతముడికి దగ్గరగా వచ్చిన స్వాతి ఆ రక్తాన్ని చూసి వణికిపోయింది.

నాగేంద్రుడు జీవంలేని శవంలా గౌతముడ్ని చూస్తూ నిలబడ్డాడు.

గౌతముడు ఓ విషాదభరిత చిరునవ్వుతో స్వాతిని దగ్గరకు తీసుకుని చివరిమాటగా ఇలా అన్నాడు.

“ఈ గౌతమునికి స్వాతిముత్యాన్ని అందుకునే అదృష్టం లేదు.” అలా అని నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

కొన్నిసార్లు పెదాలకన్నా కళ్ళు మాత్రమే బాగా మాట్లాడగలుగుతాయి.అదేంటోగానీ విఫలమైన ప్రేమకథల్లో విషాదం మాత్రం చాలా వరకు మగాడివైపే ఉంటుంది. ఉన్నట్లుండి ఆకాశంలో మెరుపు మెరిసింది. !

గౌతముని కళ్ళు భారంగా మూతబడ్డాయి.

అలా ఆధునిక మానవుని విపరీత బుద్ధి వలన నాశనమైపోయినవారి జాబితాలో గౌతముడు కూడా చేరిపోయాడు.!!

********సమాప్తం********

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.