కౌలు

‘ఏంట్రా దీపూ... ఈసారి కూడా పెళ్లికొడుకును తిప్పి పంపావట...’ అడిగాడు బాలరాజు.

‘నా పెళ్లి... నా ఇష్టం’ అంది దీప్తి నిర్లక్ష్యంగా.

‘కాదనను బంగారూ... అత్తయ్య బాధపడుతూ ఫోన్ చేసింది. నిన్ను పెళ్లికి ఒప్పించే బాధ్యత అప్పగించింది..’ చెప్పాడు.

‘ఆ... చెప్పొచ్చాడమ్మా పెద్ద మనిషి. ఈయనగారు చెప్పగానే ఒప్పేసుకుంటారు...’ ఎగతాళి చేసింది.

‘ఇంకెవరు చెప్పాలి... నాన్న కూడా బ్రతిమాలారట కదా...’ అన్నాడు కాస్త కోపంగా బాలరాజు.

‘ఓయ్ దద్దోజనం... వాడు నన్ను చేసుకొని యు.ఎస్.కి తీసుకువెళ్తాడట. అదే జరిగితే అందర్నీ ‘మిస్’ అవుతాను’ అంది దీప్తి.

‘ఎన్.ఆర్.ఐ. సంబంధం ఎవరైనా వదులుకుంటారా. నువ్వే దద్దోజనానివి...’ అన్నాడు వెక్కిరింపుగా.

‘సర్లే... నీ ఎస్‌ఎస్‌సి బుర్రకి అంతకంటే ఎక్కదు కానీ... నువ్వా పురుగుల మందులు కొనుక్కొని రా’ అంది వెక్కిరింపుగా.

‘ఏంటి ఇష్టంలేని పెళ్లి చేస్తున్నందుకు పురుగు మందు తాగుతావా? ఏంటి...’ అన్నాడు నవ్వుతూ.

‘కాదు... నన్ను వెళ్లగొట్టాలని అనుకుంటున్నందుకు నీతో తాగించి చంపుతా...’ అంది దీప్తి.

‘అంతమాత్రపు దానివేలే...’ అన్నాడు నవ్వుతూ.

‘సర్లే... నువ్వు రా బావా మాట్లాడాలి’ అంది దీప్తి.

‘ఓకేరా...’ అని ఫోన్ పెట్టేశాడు బాలరాజు.

పొలానికి కావాల్సిన పురుగు మందులు కొని బస్సెక్కాడు.

బస్సులో కూర్చున్నాక బాలరాజు కళ్ల ముందు మరదలు దీప్తి కన్పించింది.

నెల రోజుల క్రితం హఠాత్తుగా వచ్చింది.

వాళ్లుండేది పక్క గ్రామంలోనే.

ఆ రోజు అమ్మ శారదకి.. ఆరోగ్యం బావోలేదు.

‘మీకు బావోలేదని తెలిసి వచ్చాను అత్తయ్యా..’ అంది - మంచం మీద అత్త పక్కన కూర్చని.

శారదకి ఆర్థరైటిస్ సమస్య ఉంది. దానికి తోడు బి.పి. షుగర్ కూడా.

‘అత్తయ్యని సిటీకి తీసుకెళ్లి మంచి మందులు ఇప్పిద్దాం బావా...’ అంది.

‘ఎందుకమ్మా.. జ్వరమేగా తగ్గిపోతుందిలే...’ అంది శారద.

పేరుకు అత్తని చూడ్డానికని వచ్చింది కానీ..

బావతో మాట్లాడాలని ఆ అమ్మాయి మనసు తహతహలాడుతోంది.

‘పిల్లకి... ఎలాగోలా ఓపిక చేసుకొని మంచి కూర చేసి పెట్టవా...’ చెప్పాడు రామరాజు.

‘అబ్బో కోడలు పిల్లకి మావయ్యగారు వి.ఐ.పి. ట్రీట్‌మెంట్ ఇస్తున్నారన్న మాట...’ అన్నాడు బాలరాజు నవ్వుతూ.

‘అది నీలా మొద్దు కాదురా... పట్నంలో అగ్రికల్చర్ బిఎస్సీ చదివింది’ ఎద్దేవా చేశాడు రామరాజు.

‘మీరూ చేశారుగా బి.టెక్. ‘కట్’ చేస్తే వ్యవసాయం చేస్తున్నారు’ అన్నాడు బాలరాజు.

కొడుకు వైపు నిరసనగా చూసి.. బయటకు కదిలాడు రామరాజు.

దీప్తి బావ దగ్గరకొచ్చి ‘ఏంటి మావయ్య మీద ఒంటి కాలితో లేస్తున్నావ్...’ అంది.

‘ఆయన గారికి కోడలి పిల్ల సపోర్టా..’ అన్నాడు నవ్వుతూ.

‘అవును.. ఆయనకి నిజంగా కాబోయే కోడల్నే కదా...’ అంది.

దీప్తి ముఖంలోకి తేరిపార చూసి.. ‘చెవిలో నాకు పువ్వులు లేవు బంగారం...’ అన్నాడు.

‘నీకేం తక్కువ బావా.. యువరాజులా ఉంటావు..’ అంది దీప్తి మురిపెంగా.

‘రాజునే కానీ.. యువరాజుని కాదు. నాకు నువ్వు జోడీ కాదు’ అన్నాడు నవ్వుతూ.

‘ఏం.. అందంగా లేనా? అస్సలేం బావోలేనా..’ అంది గోదావరి సినిమాలోని కమలినీ ముఖర్జీ పాటనందుకుంటూ.

‘నీకేంటి చంద్రబింబానివి... దానిలో మచ్చ ఉంటుంది.. నీకు ఉండదు’ అన్నాడు.

దీప్తి కళ్లల్లో మెరుపు.

‘మరి ఈ అందాన్ని సొంతం చేసుకోవాలని లేదా బావా...’ అంది.

కోడి కూరలో ఉప్పూ... పసుపు కలుపుతూ, ‘అలాంటి అత్యాశలేం లేవు... గానీ నువ్వెళ్లి కూర స్టౌవ్ మీద పెట్టు.. ఈలోపు ‘మసాలా’ రెడీ చేస్తా’ అన్నాడు బాలరాజు.

‘నువ్వేం మనిషివయ్యా బాబూ...’ అని స్టౌ వెలిగించి కూర స్టౌ మీద పెట్టింది.

నాటు కోడికూరతో మావయ్యకి భోజనం పెట్టింది.

‘నీతో చేయించారా? వీళ్లు...’ అన్నాడు రామరాజు కోడలి వైపు చూస్తూ.

‘నా ఇంట్లో నేను చేస్తే తప్పేంటి మావయ్యా..’ అంది.

‘నీ ఇల్లు కాదని ఎవరన్నారే... ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు..’ అన్నాడు రామరాజు.

‘పొయ్యేదెక్కడికి... ఇంట్లోనేగా ‘తిష్ట’ వేసేది...’ అంది.

రామరాజు కోడలి పిల్లని అదోలా చూస్తూంటే.. ‘మన బాలుని పెళ్లి చేసుకుంటానని గొడవ చేస్తోంది...’ చెప్పింది శారద.

రామరాజు కోడలి పిల్ల వైపు చూస్తూ

‘మాకంత అదృష్టం లేదురా... వీడు కూడా నీ అంత చదివుంటే... సంతోషంగా చేసుండేవాణ్ని. అయ్యగారు పదో క్లాసుతో ఆపేశారుగా..’ అన్నాడు కోపంగా రామరాజు.

బయట వరండాలో కూర్చున్న బాలరాజుకి అంతా వినిపిస్తోంది.

తండ్రీ కొడుకులూ ఉప్పు.. నిప్పులా ఉన్నారని అర్థమైంది దీప్తికి.

రామరాజు భోజనం చేసి ‘రెస్ట్’ తీసుకోడానికి పక్క గదిలోకి వెళ్లాడు.

శారద మజ్జిగన్నం వేసుకొని తిని తన గదిలోకి వెళ్లింది.

భోజనానికి కూర్చున్నాడు బాలరాజు.

బావకి వడ్డించింది దీప్తి.

రెండు ముద్దలు కలిపి తిన్న తర్వాత ‘ఎలా ఉంది కూర...’ అడిగింది దీప్తి.

‘సూపర్‌గా చేశావ్... మా అమ్మకంటే కూడా...’ అన్నాడు అభినందిస్తూ.

భోజనం చేసి... కాసేపు భుక్తాయాసం తీర్చుకున్నాక.. ‘దీప్తీ రా..’ అని తన మోటార్ బైక్ మీద దీప్తిని ఎక్కించుకొని తీసుకెళ్లాడు బాలరాజు.

కాసేపటి తర్వాత.. ఒక దగ్గర ఆపి.. ‘ఈ పొలం ఎవరిది?’ అడిగాడు.

‘మన తాతయ్యది..’ అంది.

‘అది ఒకప్పుడు’ అన్నాడు.

‘అప్పుడైనా.. ఇప్పుడైనా దీన్ని రాజుగారి పొలమే అంటారు...’ అంది.

‘అవును... పేరు మాత్రమే మనది.. వాస్తవంగా కాదు కదా...’ అన్నాడు.

‘ఇదంతా ఎందుకు చెప్తున్నావ్?’ అడిగింది.

‘యాభై ఎకరాల ఆసామి తాతయ్య. నాన్న చదువు కోసమో... ఇంటి అవసరాల కోసమో ఈ భూమిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ భూమిని కౌలుకి తీసుకొని బతుకుతున్నాం. ఈ పేద రైతుకి.. నువ్వు భార్యవి ఎలా కాగలవు...’ అన్నాడు.

‘ఈ విషయం ఇంట్లో కూడా చెప్పగలవు... ఇక్కడదాకా ఎందుకు తెచ్చావు. ఈ భూమి పోయిందనే బాధని వ్యక్తం చేయడానికేగా. భూమి లేని వాడ్నని చెప్పడానికేగా ఇక్కడిదాకా తెచ్చావ్...’ అంది.

అదోలా చూశాడు.

‘నేను అగ్రికల్చర్ బిఎస్సీ చేసింది మన భూమిని మళ్లీ మనం సాధించుకోవడానికే’ అంది దీప్తి.

విస్తుపోయి చూశాడు బాలరాజు.

‘నిజం బావా! మన భూమిని మళ్లీ మనం సాధించుకుందాం. ముందు నా మెడలో మూడు ముళ్లు వెయ్యి’ అంది దీప్తి.

‘ఊహాగానాలతో బతుకు చిత్రం గీసుకోలేను...’ అని మోటార్‌బైక్ స్టార్ట్ చేశాడు.

ఊరు రావడంతో బాలరాజు జ్ఞాపకాలు తెగాయి. దీప్తి తల్లి సునందను ఆమె తండ్రి ఆనంద గజపతి రాజు పక్కన గ్రామానికి చెందిన అశ్వత్థామరాజుకి ఇచ్చి చేశాడు. ఆ ఊళ్లో జరిగే జాతరలో పరిచయం అయిన అశ్వత్థామను సునంద ఇష్టపడటంతో పెళ్లి చేయక తప్పలేదు గజపతిరాజుకి.

నిర్ద్వంద్వంగా బాలరాజు వద్దనడంతో దీప్తికి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు ఆమె తల్లిదండ్రులు.

ఇంటికి చేరుకున్నాక తల్లి శారదతో ‘అదొక మెంటల్ కేసమ్మా... బంగారం లాంటి సంబంధం... మళ్లీ కాలదన్నుకుంది...’ చెప్పాడు బాధగా బాలరాజు.

దీప్తి తిప్పి కొట్టడం అది మూడోసారి.

‘మనసొక దగ్గరా... మనువొక దగ్గరా... గడపడం ఆడపిల్లకి కష్టంరా..’ అంది శారద.

‘దాన్ని చేసుకొని... దాని గొంతు కోయలేను. ఎందుకంటే అదంతా నాకిష్టం. దాని బతుకు బావుండాలి...’ అన్నాడు బాలరాజు.

‘నీది గిల్టీ ఫీలింగ్‌రా... నువ్వు చదువుకోలా.. తను చదువుకుంది. అదేగా నీ కభ్యంతరం...’ అంది శారద.

‘అది కూడా ఒక కారణం..’ చెప్పాడు బాలరాజు.

శారద ఆలోచనల్లో పడింది. ఆమెకి తెలుసు. ఆమె మావయ్య ఆనంద గజపతిరాజు.. తన భర్తని చదివించడం కోసం ఎంత తాపత్రయపడ్డాడో.

రామరాజు చదువు కోసం... గజపతిరాజు ఉన్న ఆస్తిని కరిగించాడు. భూమి పేపర్లు పెట్టి వీరభద్రం దగ్గర తీసుకున్న అప్పు... వడ్డీ.. చక్రవడ్డీలతో కలిపి తడిసి మోపెడైంది. రామరాజు జిఆర్‌ఇ రాశాడు. విదేశాల్లో యం.ఎస్. చదువుకొనే అవకాశం వచ్చింది. గ్యారంటీగా.. ఆస్తిని చూపాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా అప్పుడే ఆనంద గజపతి కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. రామరాజుకి ఏదో ఒక ఉద్యోగం వస్తుందని.. కొంత పొలం పసుపు కుంకుమ కింద ఇచ్చి కూతురు సునందకి పెళ్లి చేశాడు.

చెల్లి కోసం విదేశాల్లో చదవాలన్న ఆలోచన విరమించుకున్నాడు రామరాజు. కంపెనీల చుట్టూ తిరిగినా అతడికి సంతృప్తి కలిగే జీతంతో ‘జాబ్’ రాలేదు. దాంతో తండ్రికి వ్యవసాయానికి ‘సాయం’గా ఉండేందుకు పల్లెకి వచ్చాడు. కాలం గడిచేకొద్దీ వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులు పెరిగాయే కానీ.. తరగలేదు. పొలం హరించుకుపోయింది.

పొలం పొయ్యిందన్న ‘మనోవ్యధ’ ఆనంద గజపతిరాజులో పెరిగిపోయింది. మనిషి మెత్తబడ్డాడు. సిటీలో ఉద్యోగానే్వషణ దరిదాపు వదిలేశాడు రామరాజు.

రామరాజుకి తండ్రంటే చాలా ఇష్టం. తల్లి లేకపోయినా అన్నీ తానై పెంచాడు గజపతిరాజు.

తన చదువు కోసమే అప్పులు చేసి తండ్రి పొలం పోగొట్టుకున్నాడని రామరాజులో కూడా బాధ మొదలైంది. గ్రామాల్లో పొలమే మనిషికి గౌరవం. ఎంత పొలం వుంటే అంత గౌరవం దక్కుతుందనుకుంటారు.

వీరభద్రం దయదల్చినట్టు ‘నీ పొలం నువ్వే కౌలుకి చేసుకో గజపతీ. చాతనైతే పొలంపైన డబ్బు సంపాదించి, మళ్లీ నువ్వే కొనుక్కో’ చెప్పాడు.

బ్రతికి వుండగా గజపతికి పొలం సాధించుకోవడం సాధ్యం కాలేదు.

పండిన పంట సగం వీరభద్రంకి ఇవ్వడంతో తిండి గింజలు నిల్వ చేసుకోవటం తప్ప.. పెద్దగా మిగుల్చుకుంది లేదు.

కుర్రోడు ఇంజనీర్ అని శారద తల్లిదండ్రులు రామరాజుకి పిల్లనిచ్చారు.

ఉద్యోగం ఊసెత్తకుండా వ్యవసాయం మీద దృష్టి పెట్టడం మొదట్లో శారదకి అర్థం కాలేదు.

తను కూడా గ్రాడ్యుయేట్ కావడంతో ‘పట్నం వెళ్లి ఉద్యోగం చేసుకుందాం’ అంది.

‘నాన్న పోగొట్టుకున్న భూమి తిరిగి సాధించి పెట్టాలి..’ చెప్పాడు రామరాజు.

ఆ తర్వాత అది సాధ్యం కాలేదు. చూస్తుండగానే బాలరాజు శారద కడుపున పడ్డాడు.

భూమి పోయిందన్న వ్యథతో ఆనంద గజపతి కాలం చేశాడు. అతివృష్టి, అనావృష్టి, గిట్టుబాటు ధరలు లేకపోవడం... తదితర కారణాలతో మరింత అప్పుల్లో కూరుకుపోయాడు రామరాజు. భూమి

హక్కు బదలాయించడంతో వీరభద్రానికే బ్యాంకులు రుణం ఇచ్చాయి. ఆ డబ్బును మళ్లీ వడ్డీకి ఇచ్చేవాడు వీరభద్రం.

ఊరు వదులుకొని పోలేని పరిస్థితి. ఊరొదిలి వెళ్తే తండ్రికి చెడ్డ పేరు ‘ససేమిరా’ వెళ్లకూడదనుకున్నాడు రామరాజు.

బాలరాజుకి ఊహ తెలిసింది.. పదో తరగతితో చదువు ఆపేశాడు.

వ్యవసాయంలో సాయం చేస్తానన్నాడు.. రామరాజు తీవ్రంగా వ్యతిరేకించాడు.

‘నా చదువు కోసం అమ్మడానికి నీ దగ్గర ఏం లేదు నాన్నా...’ అన్నాడు బాలరాజు.

‘ఎక్కడో ఒక దగ్గర అప్పు చేస్తా. తల తాకట్టు పెడతా... పట్నం వెళ్లి చదువుకోరా...’ బతిమాలాడు రామరాజు.

‘ఆల్రెడీ నీ తల తాకట్టులో ఉంది నాన్నా. తీసుకున్న ప్రామిసరి నోట్లు ఒకసారి చూడు’ అన్నాడు బాలరాజు.

దాంతో బాలరాజు చదువు కొండెక్కింది. సునందకి కట్నంగా వచ్చిన పది ఎకరాలని జాగ్రత్తగా సాగు చేసుకొని కూతుర్ని చదివించాడు ఆమె తండ్రి అశ్వత్థామరాజు.

దీప్తి కూడా తెలివైంది కావడంతో మెరిట్ స్కాలర్‌షిప్ సంపాదించింది.

ఎస్‌ఎస్‌ఎస్ స్టేట్ ఫస్ట్ రావడంతో ఒక కార్పొరేట్ స్కూల్ ఆ అమ్మాయి ఫ్రీ సీట్ ఇచ్చింది.

సెలవులు దొరికినప్పుడల్లా ఇంటికి వచ్చిన ప్రతీసారి అత్త శారద ఇంటికి వచ్చేది దీప్తి.

కానీ కాలం గడిచేకొద్దీ.. భూమిని నమ్ముకొని తన బావ కుటుంబం బతుకుతోందని అర్థం చేసుకుంది.

బాలరాజు అభీష్టం మేరకే పెళ్లి సంబంధాలు చూట్టం మొదలుపెట్టారు. చూసిన ప్రతీ సంబంధం తిప్పి కొడుతోంది దీప్తి.

ఏం చేయాలో అర్థంకాక జుట్టు పట్టుకున్నారు సునంద, అశ్వత్థామ దంపతులు...

శారదలో ఆలోచనలు తెగాయి. ‘నువ్వే దాన్ని ఎలాగోలా కన్విన్స్ చెయ్యరా...’ అంది శారద.

‘అదొక మొండిఘటం అమ్మా..’ అన్నాడు బాలరాజు.

‘రేపు వెళ్లు... వెళ్లి దానితో క్లారిటీగా మాట్లాడి రా...’ కొడుకుని పురమాయించింది.

పొలంలో నుంచి వచ్చిన రామరాజు.. విషయం తెలుసుకొని

‘ముందు వీడి పెళ్లి చేస్తే.. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది...’ అన్నాడు.

‘అదీ అయ్యింది. నన్ను కన్విన్స్ చేయకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే అదే రోజు బావిలో దూకి చస్తానంది...’ చెప్పాడు తండ్రికి వినపడేలా.

‘మరి వెళ్లి రమ్మను.. వెళ్లి మాట్లాడి రమ్మను.. మా చెల్లాయి బాగా సఫరవుతుంది...’ చెప్పాడు రామరాజు.

ఆ మర్నాడు బాలరాజు వెళ్లాడు.

అతడెళ్లేసరికి దీప్తి.. ల్యాప్‌టాప్‌లో ఏదో సెర్చ్ చేస్తోంది.

‘ఏంటి ఇది...’ అడిగాడు.

‘బుద్ధావతారం... దీన్ని ల్యాప్‌టాప్ అంటారు. ఇందులో భూగోళం ఉంటుంది...’ చెప్పింది.

‘ఆకాశం ఉండదా...’ అడిగాడు అల్లరిగా.

అప్పుడే నీళ్లు తెచ్చిన సునంద.. ‘అమ్మ ఎలా ఉందిరా?’ అడిగింది.

‘బాగానే వుందత్తయ్యా...’ చెప్పాడు.

‘చూడ్రా ఇది. ఆ ఎన్‌ఆర్‌ఐ సంబంధం వద్దని అంటోంది..’ అంది బాధగా.

‘అదే మాట్లాడటానికి వచ్చాను అత్తయ్యా..’ అన్నాడు బాలరాజు.

‘అనుకున్నా. అయ్యగారు వేం చేసింది ఇందుకేనని...’ అంది నవ్వుతూ దీప్తి.

పక్కింటి వనజ ప్రసవించటంతో చూసి వస్తానని వెళ్లింది సునంద.

‘బావోయ్... ఏంటి నీ అభ్యంతరం... నేను చదువుకున్నాను అనా..? ఆడపిల్లకి కావలసింది చదువుకున్న మగాడు కాదు.. తనని చదివిన మగాడు కావాలి... నా ప్రతి ఎమోషన్ నీకు తెలుసు.. నీకంటే బెస్ట్ ఛాయిస్ నాకు ఈ భూమి మీద లేదు. ఇక నీ రెండో సందేహం... నేను కేవలం కౌలు రైతుని నేనెక్కడా? నువ్వెక్కడా అంటావ్.. అంతేగా?’ అని బాలరాజు ముఖంలోకి చూసింది దీప్తి.

‘ప్రశ్నా.. జవాబు నువ్వే చెప్పుకుంటున్నావుగా. ఇక నా ముఖంలోకి చూడ్డం ఎందుకు?’ అన్నాడు నవ్వుతూ..

‘అయ్యగారి ముఖారవిందాన్ని చూద్దామని...’ అంది నవ్వుతూ.

‘చూసింది చాలు... ఎన్‌ఆర్‌ఐ సంబంధం చేసుకో... అందరూ సంతోషిస్తారు’ అన్నాడు.

‘అందరూ ఏమో... నన్ను తరిమెయ్యాలని నువ్వు తెగ సంబరపడిపోతున్నావు...’ అంది.

‘లేదు.. బంగారం నువ్వు నా మాట విను...’ అన్నాడు అభ్యర్థిస్తూ.

‘ఐతే... నువ్వు కూడా... నా మాట విను.. యాభై ఎకరాల ఆసామి నా మామ... ఆయన్ని ఆ భూమికి మళ్లీ యజమానిగా చేస్తా... అప్పటి వరకు పెళ్లి ఊసెత్తకు...’ అంది.

‘రెండు జనరేషన్లు దాటిపొయ్యాయి. ఇప్పుడు నువ్వు చేస్తావా?’ అన్నాడు ఎద్దేవా చేస్తూ బాలరాజు.

చప్పున కుర్చీ దిగి మోకాళ్లపై నిల్చొని.. ‘ప్లీజ్ నాకొక అవకాశం ఇవ్వు బావా...’ అంది.

ఆ అమ్మాయి కళ్లల్లో కన్నీళ్లు. ‘ఏయ్ ఏంటిది లే..’ అన్నాడు.

అతడి కళ్లల్లో కూడా అప్రయత్నంగా కన్నీళ్లు. ‘ఏంటి బంగారూ నీ బాధ..’ అన్నాడు లాలనగా.

‘కోల్పోయిన మన భూమిని మళ్లీ సాధిద్దాం... నాకొక అవకాశం ఇవ్వు బావా...’ అంది ఆర్తిగా దీప్తి.

తన భుజాలు పట్టుకొని పైకి లేపి కుర్చీలో కూర్చోబెడుతూ ‘ఎలారా? ఎలా సాధ్యం..? తాతయ్య.. నాన్నలాంటి వాళ్లు వ్యవసాయంలో పండిపోయారు.. నాకూ కాస్తో కూస్తో అనుభవం ఉంది... మేం సాధించలేంది నీకు సాధ్యమా..?’ అన్నాడు.

‘సాధ్యమే బావా... నన్ను నమ్ము... రెండేళ్లు నాకు సహకరించు... లక్ష్యం సాధించలేకపోతే.. నీ మీద ఒట్టు.. నువ్వేం చెబితే అది చేస్తా..’ అంది. దీప్తి ఆఖరి మాటలు అతడ్ని ఆలోచనలో పడేశాయి.

తాను చెప్పినంత సులభం కాదు.. వ్యవసాయం. ఎలాగూ ఫెయిలవుతుంది.

ఆ విధంగానైనా తన జీవితం ఒక కొలిక్కి వస్తుంది అన్న నిర్ణయానికి వచ్చి ‘డన్’ చెప్పాడు.

దీప్తి ముఖం వెలిగింది.

‘ఇప్పుడు నేనేం చేయాలి..’ అడిగాడు.

‘నన్ను మీ ఇంటికి తీసుకెళ్లాలి...’ అంది.

‘ఆ పప్పులేం ఉడకవ్..’ అన్నాడు.

‘అందుకు కాదురా.. మగడా... నా ఆపరేషన్ మొదలుపెట్టేది మన పొలంలోనే కదా..’ అంది.

‘సరే.. అక్కడ అల్లరి పనులేం చేయకూడదు.. బుద్ధిగా ఉండాలి...’ అన్నాడు.

‘కష్టమే ట్రై చేస్తా... పైగా లక్ష్యం కదా..’ అంది నవ్వుతూ.

విషయం విన్న దీప్తి తల్లిదండ్రులు తటపటాయించారు. ఎట్టకేలకు దీప్తి ఒప్పించింది.

రామరాజు కూడా గొణిగాడు. ‘పెళ్లి కావాల్సిన పిల్లని ఇంట్లో ఎలా పెట్టుకుంటామన్నాడు..’ కొడుకుని కోపంగా చూస్తూ.

‘నాది కాదు. ఈ ప్రపోజల్ తనది. మీరే కన్విన్స్ చేయండి...’ చెప్పాడు.

దీప్తి మావయ్యతో అంది. ‘మావయ్యా.. నీ కోడలిగా అనుకోకు. నీ కూతురిగా రెండేళ్లు నన్ను ఉండనివ్వు... బావపైన నాకు నమ్మకం ఉంది...’ చెప్పింది.

వారం రోజుల్లో దీప్తి కోసం ‘చొప్ప’తో కప్పు వేసి ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేశాడు రామరాజు.

ఆ గదిలో అన్ని సౌకర్యాలు కల్పించాడు. ‘కోడలి మీద ఎంత శ్రద్ధో...’ అన్నాడు నవ్వుతూ బాలరాజు.

ఒక ముహూర్తాన తన ‘లగేజీ’తో దిగేసింది దీప్తి. తొలి రోజు మావయ్యతో అంది.

‘మావయ్యా.. వీరభద్రం తన భూమిని మనకు కనీసం ఐదేళ్లు కౌలుకి ఇవ్వాలి.. విత్ డాక్యుమెంట్స్‌తో..’ అంది.

‘సరే’నని కోడలు పిల్లని తీసుకొని వెళ్లాడు రామరాజు.

దీప్తి ప్రపోజల్ విని, ‘ఐదేళ్లు కాకుంటే పదేళ్లు తీసుకోండి. అది మీ పొలమే కదా...’ అన్నాడు నవ్వుతూ.

‘కావచ్చు.. తాతయ్యా... మిమ్మల్ని అడగడం మా బాధ్యత కదా...’ అంది దీప్తి.

‘సేంద్రియ వ్యవసాయం’ చేస్తామని చెప్పడంతో అతడు నవ్వి పెదవి విరిచాడు.

‘ఆయుర్వేదం మంచిదే... ‘అల్లోపతి’ని ఎవరు వదులుకుంటున్నారు మనవరాలా?’ అన్నాడు నవ్వుతూ.

‘మీరు బ్లెస్ చేయండి తాతగారూ విజయం సాధిస్తాం...’ అంది.

వీరభద్రయ్య నవ్వి ‘సరే... కానివ్వండి’ అన్నాడు.

దారిలో చెప్పాడు రామరాజు.

‘ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో... నీ ధైర్యం ఏంటో అర్థం కావట్లేదు తల్లీ... దశాబ్దాల తరబడి నేనూ, మీ తాతయ్యా వ్యవసాయంలోనే ఉన్నాం. ఏదో చిన్నపాటి ఖర్చులూ... తిండిగింజలూ తప్పా... లక్షల కొద్దీ ఆదాయాలు మాకెప్పుడూ రాలేదు..

ఒకసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి. లాభనష్టాలతో సంబంధం లేకుండా రైతుకి కౌలు సొమ్ము... పంటలో భాగం కూడా ఇవ్వాలి... గుల్లబారిపొయ్యాం...’ అన్నాడు బాధగా.

‘అంతా నాకు తెలుసు మావయ్యా. భూమి తల్లి మనకు అన్యాయం చెయ్యదు. మనం ఇప్పటివరకు రసాయనిక మందులు వాడి భూసారం పోగొడుతున్నాం.. నా అవగాహన, విజ్ఞానం మన కుటుంబాన్ని ఒడ్డుకు చేరుస్తుందని నమ్ముతున్నా. నాకు మీ ఆశీస్సులు ఇవ్వండి చాలు..’ అంది నమ్రతగా దీప్తి.

రామరాజు మేనకోడలి ఆత్మవిశ్వాసాన్ని అభినందనగా చూశాడు.

‘నువ్వు సక్సెస్ కావాలనే ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా తల్లీ..’ అన్నాడు.

రామరాజు మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు.

దీప్తి ఎక్కి కూర్చుంది.

ఇంట్లోకి రావడంతోనే శారద ఎదురొచ్చింది.

‘వీరభద్రంగారు ఏమన్నారు...’ అడిగింది.

‘ఎంతకాలమైనా సాగు చేసుకోమన్నారు... అమ్మాయి లీగల్ అగ్రిమెంట్ అడిగింది. ఆయన ‘సరే’నన్నారు’ చెప్పాడు.

‘అనక ఏమంటాడు.. పదో పరకో ఇచ్చి మావయ్య దగ్గర్నుంచి భూమి గుంజాడుగా...’ అంది అక్కసుగా.

బాలరాజు ఎంటరై పోయి ‘అమ్మా... వీరభద్రం తాతయ్య బలవంతంగా మన భూముల్ని లాక్కోలేదు. మనమే మన అవసరాల కోసం వదులుకున్నాం. సర్లే అవన్నీ ఎందుకు... జరగాల్సింది చూద్దాం’ అన్నాడు బాలరాజు.

‘యూ ఆర్ రైట్ బావా. భోజనం చేశాక ప్లానాఫ్ యాక్షన్ మొదలు పెడతాం’ అంది.

నవ్వుతూ చూశాడు రామరాజు.

భోజనం చేశాక లాప్‌ట్యాప్ ఓపెన్ చేసి.. అత్త శారదకు.. బావ బాలరాజుకి తన ఆలోచనలను వివరించింది దీప్తి.

రామరాజు గమనిస్తూ చూస్తూ కూర్చున్నాడు.

‘మనం ఇప్పటి వరకూ రసాయనిక ఎరువుల ద్వారా పండించిన పంటల్లో రసాయనిక అవశేషాలు చేరి... అవి మన ఆరోగ్యాన్ని మనకు తెలీకుండానే గుల్లబారుస్తున్నాయ్ అత్తయ్యా.. సేంద్రియ ఎరువుల ద్వారా పండించే పంటలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. బి.పి. షుగరు వంటి వ్యాధులు రాకుండా అవి అడ్డుకుంటాయి. వచ్చినా జీవన కాలాన్ని పెంచుతాయ్. దీనే్న మనం మార్కెటింగ్ స్ట్రాటజీలో ప్రధానాంశంగా తీసుకోవాలి.. భూమికి నవామృతం ఇవ్వాలి...’ అంది.

‘అంటే...’ అడిగింది శారద.

‘ఆవు పేడ, మూత్రం, పెసర, మినుములు, శనగ పిండి మిశ్రమాన్ని భూమిలో చల్లితే.. భూమి సారవంతంగా మారుతుంది...’ చెప్పింది.

‘వీటి మిశ్రమాన్ని కలపడం.. చల్లడం టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా తల్లీ...’ అన్నాడు రామరాజు తను కూడా ఎంటరై...

‘పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది మావయ్యా’ అంది.

‘ఆల్ ది బెస్ట్ గో... ఎ హెడ్..’ అన్నాడు రామరాజు.

పక్కరోజు వీరభద్రంతో ఐదేళ్లు భూమి కౌలుకి ఇస్తున్నట్లు అగ్రిమెంట్ తీసుకుంది దీప్తి.

‘డైరీ’ ఫామ్ నుండి పేడని కలెక్ట్ చేసే బాధ్యతను బాలరాజుకి అప్పగించింది.

జీవామృత తయారీ అది భూమిలో చల్లే బాధ్యతను మావయ్య రామరాజుకి అప్పగించింది.

అత్త శారద డిగ్రీ వరకూ చదివి ఉండటంతో ల్యాప్‌టాప్ వినియోగం నేర్పించింది.

‘రాజుగారి పండ్లూ.. కూరగాయల’ పేరుతో ‘పోర్టల్’ తయారుచేయించింది. అన్ని రకాల కూరగాయల సాగు మొదలు పెట్టింది. రెండో నెల నుండే ఆన్‌లైన్ సప్లై మొదల పెట్టింది. కొంత భూమిలో పండ్ల తోటలకు ప్లాన్ వేసింది.

‘సురక్షితమైన ఆరోగ్యానికి రాజుగారి కూరగాయలు, పండ్లూ వాడాలన్న’ ప్రచారం సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేసింది. ఫేస్‌బుక్‌లో అకౌంట్ సైతం ఓపెన్ చేసింది. తాము చేస్తున్న ప్రయత్నానికి స్థానిక బ్యాంక్ మేనేజర్‌ని కలిసి సహకారం కోరింది.

బాలరాజు ఆమె వెంట వచ్చాడు. మేనేజర్ చక్రధర్.. దీప్తి ఇండస్ట్రీని గమనించాడు. తమకు వచ్చే లాభాలు.. వగైరా ల్యాప్‌టాప్ తెచ్చి ‘డెమో’ కూడా ఇచ్చింది.

పదో తరగతి వరకూ చదువుకొని ఆగిపోయిన ‘యూత్’తో వర్మీ కంపోస్ట్ కేంద్రాలు పెట్టించింది.

ఆర్థిక సాయం తనే చేసింది. పండిన కూరగాయలూ.. ఆకుకూరలు పాకెట్లుగా చేసి ఆన్‌లైన్ ద్వారా.. ఆర్డర్ ఇచ్చిన వాళ్లకి సప్లై చేసే బాధ్యతను ఆమె మావయ్య రామరాజుకి అప్పగించింది.

బ్యాంక్ సహకారంతో కొన్ని ట్రక్కుల్లో కూరగాయలు సరఫరా చేసే బాధ్యత కూడా రామరాజుకే అప్పగించింది.

చూస్తూండగానే దీప్తి చేపట్టిన సేంద్రియ వ్యవసాయ విధానం, పక్క గ్రామాలకూ పాకింది. చుట్టుపక్కల రైతుల ద్వారా కూడా ‘సేంద్రియ వ్యవసాయ’ ఉత్పత్తులు తయారుచేయించడానికి సహకార సంఘాలు ఏర్పాటు చేసింది.

సంఘాల ఏర్పాటు.. బాలరాజుకి అప్పగించింది. రోజుకు ఇరవై నాలుగు గంటలుంటే ఇరవై గంటలూ ముగ్గురూ పని చేశారు.

‘రాజుగారి పండ్లు.. కూరగాయలు’ నాణ్యమైనవి... ఆరోగ్యవంతమైనవన్న ప్రచారం ఊపందుకుంది. సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలను తాము మార్కెటింగ్ చేసుకోలేక ‘దీప్తి’కే అప్పగించారు చాలామంది రైతులు. అన్ని మార్కెటింగ్ యార్డుల్లో స్టాల్స్ ఏర్పాటు చేసింది దీప్తి.

కాలం ఏడాది.. గిర్రున తిరిగింది..

‘మామయ్యా... వీరభద్రం తాతయ్యని కలుద్దాం..’ అంది.

‘ఎందుకమ్మా’ అని అడగలేదు రామరాజు.

ఇప్పుడు దీప్తికి సొంత కారు ఉంది. కానీ రామరాజు తన వెహికల్‌ని తీశాడు. ఆ బైక్‌లోనే తనూ బయలుదేరింది దీప్తి. దీప్తిని చూడగానే వీరభద్రయ్య బయటకు వచ్చి..

‘ఏంటమ్మా.. ఎక్కడ చూసినా రాజుగారి పేరే మ్రోగుతోంది...’ అన్నాడు నవ్వుతూ.

‘అంతా మీ బ్లెస్టింగ్ తాతయ్యా..’ అంది.

‘నాదేముందమ్మా.. అంతా నీ కృషి పట్టుదల... నువ్వు చెప్పినప్పుడు ఇదంతా ఈ పిల్ల ‘కల’నుకున్నా... కలను నిజం చేసుకున్నావ్...’ అన్నాడు.

‘నా అసలు కల నెరవేర్చడం మీ చేతుల్లో ఉంది తాతయ్య...’ అంది.

‘ఏంటమ్మా...’ అన్నాడు.

మార్గమధ్యంలో వెహికల్ ఆపి చెక్‌బుక్ తీసి తన చేత సంతకం పెట్టిస్తుంటే ‘కౌలు’ డబ్బు స్వయంగా ఇవ్వడానికి తీసుకెళ్తుందనుకున్నాడు రామరాజు.

వాలు కుర్చీలో కూర్చున్న వీరభద్రయ్య దగ్గరకెళ్లి... ఆయన పాదాల దగ్గర కూర్చుని ‘బ్లాంక్ చెక్’ ఇచ్చింది.

‘ఏంటమ్మా ఇది...’ అన్నాడు వీరభద్రయ్య.

‘మా పొలం మాకు శాశ్వతంగా ఇవ్వండి తాతయ్యా...’ అంది.

వీరభద్రం నోటి వెంట మాటలు రాలేదు.

‘ఆ... పొలంకి వెలగట్టడం మాకు సాధ్యం కాదు తాతయ్యా... మా తాతయ్య ఆనందగజపతి రాజు... మా మామయ్య రామరాజు... మా బావ బాలరాజు స్వేదం చిందించిన భూమి అది. ఐదు దశాబ్దాలుగా ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. యాజమాన్యం స్థాయి నుండీ కారణాలు ఏవైనా కావచ్చు. కౌలుకి తీసుకొనే స్థాయికి జారాం... ఇప్పుడు మీరు అనుగ్రహిస్తే.. ఆ భూమికి మళ్లీ యజమానుల మవుతాం.. తాతయ్యా’ అంది.

వీరభద్రం నోటి వెంట మాట రాలేదు. చెక్ వైపు... దీప్తి వైపు చూశాడు.

‘మొత్తం నలభై ఎకరాలు... మాది మీరు ఎంతకి అమ్మదల్చుకుంటారో అంత అంకె వేసుకొని క్యాష్ చేసుకున్నాకే మాకు రిజిస్టర్ చెయ్యండి తాతయ్యా...’ అంది.

వీరభద్రం కాసేపు ఏమీ మాట్లాడలేదు.

లోపలికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత... బయటకు వచ్చి.. ‘మీ తాతయ్య భూమిని సంతోషంగా మీకు ఇచ్చేస్తున్నా మనవరాలా...’ అన్నాడు అభినందనగా.

రామరాజు వైపు తిరిగి ‘రామరాజూ... ఈ పిల్ల నీ ఇంటికి దీపమేరా..’ అన్నాడు.

రామరాజు కళ్లల్లో సన్నటి కన్నీటి తడి. తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు... పొలం దగ్గర బైక్ ఆపాడు.

‘కౌలు’ బంధనాల నుండి.. తమను బయటకు తెచ్చిన ‘దీప్తి’ని అలా చూస్తూండిపోయాడు కాసేపు.

‘ఏంటి మామయ్యా...’ అంది.

‘రెండు తరాల్లో సాధ్యం కానిది... నువ్వు సాధించావమ్మా..’ అన్నాడు అభినందనగా.

‘నీ రుణమెలా తీర్చుకోవాలి..’ అన్నాడు మళ్లీ తనే.

‘‘అయ్యో నా పిచ్చి మావయ్యా మీరు నాకు రుణపడటమేంటి? ఇది నా బాధ్యత. మీరు ఫారిన్‌కి వెళ్లే ఛాన్సు వచ్చినా.. ఆగిపోయి పొలం అమ్మకిచ్చి పెళ్లి చేశారు. ఆ పొలంలో కొంత అమ్మే.. నాన్న నన్ను చదివించాడు. నా చదువు మీ భిక్షే... అయినా ఆ ఇంటి కోడలిగా.. ఇది నా బాధ్యత కదా... మీ అబ్బాయిని నాకిచ్చి చెయ్యండి’ అంది నవ్వుతూ.

రామరాజు ముఖంలో కళతోపాటూ ఆందోళన కూడా దోబూచులాడింది.

‘వాడు మూర్ఖుడమ్మా.. నిన్ను పెళ్లి చేసుకోడు...’ అన్నాడు బాధగా.

‘అవునా... చూద్దాం’ అంది అల్లరిగా.

* * *

పట్టా కాగితాలు తీసుకొచ్చి బావ బాలరాజు చేతుల్లో పెట్టింది దీప్తి.

‘రెండేళ్లలో సాధించాలనుకున్న లక్ష్యాన్ని ఏడాదిలోనే సాధించాం.. బావా’ అంది దీప్తి.

పట్టా కాగితాలు తీసి తడువుకున్నాడు బాలరాజు.

అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

‘కలనైనా ఊహించలేదు దీప్తి... మళ్లీ భూమి మన చేతికి వస్తుందని.. ఈ మొత్తం క్రెడిట్ నీకు దక్కుతుంది...’ అన్నాడు మనస్ఫూర్తిగా.

‘ఇది మనందరి సమష్టి విజయం బావా...’ చెప్పింది.

దీప్తి కళ్లల్లో కూడా ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఆ మరుసటి రోజు

‘అమ్మా.. నాన్నలను చూసి చాలా కాలమైంది బావా’ అని వెళ్లింది దీప్తి.

సడెన్‌గా ఎందుకు వెళ్లిందో అతడికి అర్థం కాలేదు.

* * *

‘బావా... వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు వస్తున్నాయ్... నువ్వెందుకు పోటీ చేయకూడదూ..’ అంది దీప్తి.

‘నేనా?...’ అన్నాడు ఆశ్చర్యపోతూ బాలరాజు.

అప్పటికి దీప్తి ఊరెళ్లి వారమైంది.

దీప్తి ఫోన్... అతనికి చాలా ఆనందాన్నిచ్చింది.

‘యస్. సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకత రాష్టవ్య్రాప్తం చేయాలంటే ముందు మనం జిల్లా స్థాయిలో గెలవాలి... బావా’

‘రాజకీయాలు మనకు పడవులే దీప్తి. పైగా డబ్బు వరదలై పారించాలి...’ అన్నాడు.

‘ప్రజల మద్దతు లేనివాళ్లే డబ్బు పెట్టాలి... మనకు అవసరం ఏముంది... మనం ఏర్పాటు చేసిన సంఘాలు ఉన్నాయి కదా...’ అంది.

ఆలోచనలో పడ్డాడు బాలరాజు.

‘అవును బావా... రైతులు వాడే ప్రమాదకర రసాయనిక ఎరువుల వల్ల ప్రజల ఆరోగ్యం గుల్లబారుతుంది. రైతు కూడా ఖరీదైన ఎరువులు, పురుగు మందులు కొనలేక అప్పులు పాలవుతున్నారు. అంతేకాదు.. వాటి వాడకం వల్ల భూసారం కోల్పోతున్నాం... ఈ ఎన్నికల్లో మనం పోటీ చేయించే వాళ్లు గెలిస్తే కోపరేటివ్ బ్యాంక్ ద్వారా... సేంద్రియ వ్యవసాయానికి ముందుకు తీసుకువెళ్లవచ్చు’ చెప్పింది దీప్తి. ‘అవుననుకో...’ అని అర్ధోక్తిగా ఆగాడు.

‘ఇక నువ్వేం మాట్లాడవద్దు బావా... నామినేషన్ వేస్తున్నాం’ అంది.

బాలరాజు ‘ఊ’ కొట్టక తప్పలేదు.

వ్యవసాయ పరపతి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో సింగిల్ విండో ప్రెసిడెంట్‌లుగా బాలరాజు మద్దతిచ్చిన అభ్యర్థులందరూ అప్రతిహత విజయం సాధించారు. ఆ సంఘాల ద్వారా ఏర్పడిన బ్యాంక్‌కు జిల్లా స్థాయిలో చైర్మన్‌గా ఎంపికయ్యాడు బాలరాజు. సి.ఎం. సమక్షంలో అతనికి అభినందన సభ జరుగుతోంది.

సహకార సంఘాల చైర్మన్‌కి మంత్రి హోదా కూడా ప్రకటించాడు సి.ఎం. జనార్దన్ నాయుడు.

సభికుల్లో దీప్తి, రామరాజు, శారద, సునంద, అశ్వత్థామ కూర్చున్నారు.

దీప్తి కళ్లల్లో సన్నటి తడి గమనించాడు రామరాజు.

‘ఎందుకమ్మా కన్నీళ్లు’ అడిగాడు.

‘ఇవి కన్నీళ్లు కాదు మామయ్యా.. ఆనందబాష్పాలు...’ అంది దీప్తి.

ఊరికెళ్లే ముందు రోజు రాత్రి మావయ్య, బావ బాలరాజు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.

ఆ రోజు రాత్రి తండ్రితో మాట్లాడేందుకు గదిలోకొచ్చాడు బాలరాజు.

తల్లి శారద నిద్రపోతోంది.

‘మీతో మాట్లాడాలి నాన్నా...’ అన్నాడు బాలరాజు.

ఊహ తెలిశాక ఎప్పుడూ తండ్రితో అతడు అంత సౌమ్యంగా మాట్లాడింది లేదు.

తండ్రీ కొడుకులకు శారద వారధిలా ఉండేది. అటువంటిది అమ్మతో రాయబారం లేకుండా కొడుకు నేరుగా రావడం రామరాజుకి ఆశ్చర్యం కల్గించింది.

‘ఏంటి నాన్నా...’ అడిగాడు లాలనగా.

‘పర్సనల్‌గా మాట్లాడాలి నాన్నా...’ అన్నాడు నిద్రపోతున్న తల్లిని చూస్తూ..

ఇద్దరూ బయటికి వచ్చారు.

‘దీప్తి గురించి మాట్లాడాలి నాన్నా...’ చెప్పాడు బాలరాజు.

రామరాజు ఆశగా, ఆసక్తిగా ముఖంగా పెట్టాడు. ‘చెప్పురా...’ అన్నాడు.

‘తాతయ్యని కనిపెట్టుకొని ఉండాలని, ఆయనకి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండాలని... ఊర్లోనే ఉండిపోయావ్ నాన్నా. వ్యవసాయానే్న జీవితకాలం నువ్వు నమ్ముకున్నావు. ఏడాదికేడాది అప్పు మిగలడం తప్పా. ఎకరా కూడా మనం సంపాదించలేక పోయాం. మా నాన్నను మరింత కష్టాల పాలు చేయకూడదని నేను కూడా నా చదువుని కొండెక్కించాను. మన పొలానికే కౌలు రైతులుగా మారి చావలేక బతుకుతున్నాం. మన జీవితాల్లోకి దీప్తి ఒక వెలుగులా వచ్చింది నాన్నా... తన జీవితం బాగుండాలి...’ అని ఆపాడు.

‘ఇప్పుడేమయింది నాన్నా...’ అడిగాడు రామరాజు.

‘తన తెలివితేటలు కష్టంతో సంపాదించిన భూమి తనకే ఇద్దాం. మన భూమిని మనం సాధించుకున్నామన్న తృప్తి చాలు మనకి. మంచి కుర్రాణ్ణి చూసి గ్రాండ్‌గా పెళ్లి చేద్దాం. తననకి కన్విన్స్ చేసే బాధ్యత నువ్వే తీసుకోవాలి నాన్నా...’ అన్నాడు.

రామరాజు నోటి వెంట మాట రాలేదు.

‘దాని మనసంతా నువ్వే ఉన్నావురా...’ అన్నాడు బాధగా రామరాజు.

‘వద్దు నాన్నా.. తన చేయి పట్టుకొనే అర్హత నాకు లేదు..’ అని వెనుదిరిగాడు బాలరాజు.

రామరాజు చాలాసేపు అలాగే నిల్చొండిపోయాడు. ఆ ఇద్దరికీ తెలీదు. తమ సంభాషణ దీప్తి విందని... అదే గుర్తొచ్చింది దీప్తికి.

ఆ పక్కరోజే.. ఇంటికెళ్లింది. బావ స్థాయిని పెంచాలని ఆ నిమిషమే డిసైడై పోయింది.

వచ్చిన అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. సహకార ఎన్నికల్లో దించి అతడ్ని విజయపథాన నిల్పింది.

‘ఇప్పటికైనా నన్ను మీ అబ్బాయి చేసుకుంటాడా మావయ్యా’ అంది దీప్తి.

రామరాజు హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది.

‘వాడ్ని చేరుకునేందుకే నువ్వింత శ్రమ పడ్డాక అంత స్థాయికి వాడ్ని పెంచాక నిన్ను వదిలి వాడెలా బతగ్గలడే...’ అంది శారద అంతా గమనిస్తూ.

.........................................................................

సామాజిక సమస్యలు, మానవసంబంధాల నేపథ్యంలో కథ సాగాలన్న బలమైన భావోద్వేగం..తన లక్షణమని చెబుతున్న శరత్‌చంద్ర పుట్టింది శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన జర్నలిస్టుగా ప్రముఖ పత్రికల్లో పనిచేశారు. ఆ తరువాత ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగినా సమాజసేవకోసం రాజీనామా చేసి సేవాకార్యక్రమాల్లో తలమునకలయ్యారు. అక్షరసేద్యంపై మక్కువతో కలంపట్టి ‘కథ’ మొదలెట్టడం, బహుమతులు కొట్టడం ఆయనకు కొత్తకాదు. బాగాపేరున్న వార, మాస పత్రికలు నిర్వహించిన పోటీల్లో ఆయన రాసిన ఎన్నో కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. ‘పతిచరామి’, ‘ఔషధం’, ‘వేస్ట్‌ఫెలో’, ‘కిక్’, ‘శాస్ర్తీగారి వీలునామా’, ‘రిజిస్ట్రేషన్’ కథలు వాటిలో కొన్ని. తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో ఆయన రాసిన కథల సంపుటి ‘సమాహారం’ వెలువడింది. మూడు నవలలు ప్రచురితంకాగా వాటిలో ‘జీవనయానం’ టెలీసీరియల్‌గా రూపుదిద్దుకుంటోంది. రెండు ప్రముఖ పత్రికల్లో ‘జీవితం చేజారిందా’, ‘సమంత బ లవ్’ ధారావాహికలు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఆయన రాసిన కథల్లో కొన్ని తమిళ, కన్నడ భాషల్లో అనువాదమైనాయి. తన మనసు చెప్పిన విధంగా రాసిన ‘కౌలు’ కు బహుమతి రావడం ఆనందం కలిగించిందంటున్న శరత్‌చంద్ర, కాగితాల్లో తప్ప ఆచరణలో హక్కులు లేని కౌలు రైతులకు ఈ కథను అంకితమిస్తున్నట్లు చెప్పడం విశేషం.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

శరత్‌చంద్ర


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.