అంతరాలు

(నవ్య వీక్లీ సెప్టెంబరు 22, 2010 సంచికలో ప్రచురితం)

సినిమా చూస్తున్నంత సేపూ సైలెంట్‌గా కూర్చునే ఉంది వేదవతి. మధ్యలో రెండుమూడు సార్లు పలకరించబోయాడు రవికాంత్. వేదవతి ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకుంది. సినిమా మొదలైన పావుగంటకే దాని మీద ఆసక్తి పోయింది రవికాంత్‌కి. హీరోయిన్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ లాంచీమిద అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చెయ్యటం తప్ప కథేమీ లేదు.

రవికాంత్ సీటుమీద వెనక్కి జారగిలబడి వేదవతి వంక చూశాడు. ఆమె అతనితో మాట్లాడే ప్రసక్తే లేనట్లు శ్రద్ధగా సినిమా చూస్తోంది. రవికాంత్‌కి అక్క హితబోధ గుర్తొచ్చింది. "ఒరేయ్! మరదలూ, నువ్వూ ఏ సినిమాకో, షికారుకో వెళ్ళండి. పిల్లల్ని వెంట తీసుకు వెళ్ళొద్దు. మీరిద్దరే వెళ్ళండి. ఇద్దరే అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది" అన్నది.

కానీ వేదవతి ధోరణి చూస్తే అంత త్వరగా సన్నిహితంగా వచ్చేటట్లు లేదు. ఇంటర్వెల్ అయింది. అందరూ బయటకు వెళుతున్నారు.

"దాహం వేస్తోంది. కూల్‌డ్రింక్స్ తెస్తాను. నీకేది కావాలి?" అని లేచి నిలబడుతూ అన్నాడు.

"నాకు పెప్సీ తీసుకురండి" అన్నది. అంత ఖచ్చితంగా ఆమె తన ఇష్టం చెప్పటం అసంతృప్తిగా అనిపించింది రవికాంత్‌కి. "మీ ఇష్టం. మీకు ఏది ఇష్టం అయితే నాకూ అదే ఇష్టం" అన్నట్లయితే బాగుండేది అనుకున్నాడు.

ఆమెకు పెప్సీ తనకు మజా తీసుకువచ్చి సీట్లో కూర్చున్నాడు. సినిమా మొదలైంది. వేదవతి మళ్ళీ సీన్మాలో లీనమైంది. రవికాంత్ సహనం తెచ్చిపెట్టుకుని చూశాడు.

సినిమా అయిపోయింది. ఇద్దరూ స్కూటర్ మీద ఇంటికి తిరిగి వ్స్తున్నారు. సినిమా గురించి ఏమైనా మాట్లాడుతుందేమో తన అభిప్రాయం చెపుదాం అనుకున్నాడు. కానీ ఆమె మాట్లాడే ప్రయత్నమేమీ చేయలేదు. ఇంటికి వచ్చేదాకా మౌనంగానే ఉంది.

"మీరు భోంచేసి పడుకోండి. నాకు ఆకలిగా లేదు" అని వేదవతి బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది.

"సుజయ్! భోం చేశావా?" లుంగీ కట్టుకుంటూ అడిగాడు రవికాంత్.

"లేదు డాడీ! మీ కోసమే ఎదురు చూస్తున్నాను" అన్నాడు సుజయ్.

"ఇంతసేపు ఎందుకున్నావు? తినెయ్యక పోయావా?"

"నిన్నటిదాకా మీరొచ్చేవరకూ ఆగమన్నారు. ఇప్పుడేమో తినెయ్యమంటున్నారు. మీకోసం ఆగాలా? మానాలా?ఏదో ఒకటి చెప్పండి డాడీ! మాటిమాటికీ మార్పులు నాఖు గిట్టవు" అన్నాడు సుజయ్.

రవికాంత్ మనసు చివుక్కుమన్నది. భోజనం చేయకుండా ఆగటం తన మీద ప్రేమతో కాదు. తను చెప్పాడు కాబట్టి ఆగాడు. తను బజారు నుంఛి వచ్చేసరికి కొడుకు భోంచేసి పడుకుంటే ఏదో బాధగా, వంటరిగా ఉండేది. అందువల్ల తను వచ్చేవరకూ ఆగమనేవాడు. అంతేకాని తప్పనిసరిగా ఆగాల్సిన పని లేదు. ఎదుటివారి మనసు అర్థం చేసుకుంటే చాలు అనుకున్నాడు.

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ "నువ్వు కూడా రా సుజయ్!" పిలిచాడు రవికాంత్. సుజయ్ వచ్చి కూర్చున్నాడు.

"తమ్ముడు ఏడిరా? ఇంకా రాలేదా!" అడిగాడు.

"లేదు డాడీ! ఈ రోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్‌డే ఉన్నదట. వచ్చేసరికి లేటవుతుందని చెప్పాడు" అన్నాడు సుజయ్.

ఆ తరువాత సంభాషణ జరగలేదు. సుజయ్ అడిగిన దానికి సమాధానం చెబుతాడు. తనకి తానుగా ఏమీ మాట్లాడడు.

భోజనం అయిన తరువాత సుజయ్ తన రూంలోకి వెళ్ళిపోయాడు. రవికాంత్ బెడ్ రూంలోకి వచ్చి పడుకున్నాడు. ఒకే ఇంట్లో ఉంటున్నా, తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, పిల్లలు ఒక చోట. ఎవరి లోకం వాళ్ళది. అరమరికలు లేకుండా కాసేపు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది? ప్రేమలు లేవు, అభిమానాలు లేవు. రవికాంత్ నిట్టూర్చాడు.

వాళ్ళు అలా అవటానికి కారణం ఎవరు? నువ్వు కాదా! అంతరాత్మ నిలదీసింది. అవును నేనే! అక్షరాలా నేనే! అనుకున్నాడు రవికాంత్. అతనికి జరిగిపోయినవన్నీ గుర్తొచ్చాయి.

పెళ్ళినాటికి వేదవతి ఇంటర్ వరకే చదువుకునంది. రవికాంత్‌కి వేళకు అన్నీ అమ్ర్చిపెట్టటం, ఇంటి పనంతా చేయటం, పిల్లల్ని చూసుకోవటం చేసేది. ఆమె చేసే చిన్న చిన్న పొరపాట్లనే భూతద్దంలో చూసి విమర్శించేవాడు. కాఫీ తాగగానే కప్పులు తీసి కడగలేదనీ, ఇలాంటివే చిన్న చిన్న కారణాలకే నిలదీసేవాడు.

తనలో పొరపాట్లను వేదవతి ఎత్తి చూపిస్తే వళ్ళు మండిపోయేది. తనని తప్పుపట్టటం సహించలేకపోయేవాడు. రానురాను వేదవతి విసిగిపోయి అతనికి సమాధానం చెప్పటం మానేసింది. దృష్టి చదువు వైపు మరల్చుకుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీకి కట్టింది. పరీక్ష ఫీజు కట్టటానికి రవికాంత్ అతి కష్టం మీద ఒప్పుకునేవాడు.

ఎప్పుడైనా ఇంట్లో చేయలేక బయటికెళ్ళి టిఫెన్ తీసుకురమ్మంటే పొదుపు గురించి గంటసేపు లెక్చర్ ఇచ్చేవాడు. వేదవతికి తినాలనే ఇచ్ఛ చచ్చిపోయి ఊరుకునేది.

వేదవతి డిగ్రీ అయిపోగానే కాన్వెంట్‌లో టీచర్‌గా జాయినైంది. ఒక పక్క ఇంటిపనంతా చేస్తూ, మరో పక్క ఉద్యోగం చేస్తూ మరో పక్క ఉద్యోగం చేస్తూ బి.యిడి. చదివింది. బి.యిడి అయిపోగానే డియస్సీ రాసింది. టీచర్‌గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది.

రవికాంత్,వేదవతి విడిపోయే రోజున ఉద్యోగం చుసుకునే పొగరుతో తననుంచీ దూరమౌతోందని అన్నాడు. అతనివల్ల ఎప్పుడు, ఏ విధంగా, ఎలాంటి విషయాల్లో అసంతృప్తి కలిగిందో వంద ఉదాహరణలు చెప్పింది వేదవతి. ఉద్యోగం కారణం కానేకాదు అన్నది. పదిమందిలో తన తప్పులు చూపించడం, నిలదీయటం అవమానంగా ఫీలయ్యాడు రవికాంత్. అగ్గిమీద గుగ్గిలం అయిపోయి ఆమెతో కాపురం చేయనని ఖచ్చితంగా చెప్పేశాడు. చివరకు పిల్లల్ని ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు. వేదవతి ఒంటరిగా పుట్టింటికి వెళ్ళిపోయింది.

వేదవతి వెళ్లిపోయిన తర్వాత ఇంటిపనై చేయటానికి పని మనుషుల్ని పెట్టుకున్నాడు. వాళ్ళు డబ్బు తీసుకోవటమే కానీ పని సరిగ్గా చేసేవాళ్ళు కాదు. పైగా పిల్లల్ని చూసుకోవడం అదనపు బాధ్యత. ఈ బాధలన్నీ పడలేక పిల్లల్ని హాస్టల్లో చేర్పించాడు. డబ్బు కడితే చాలు. చదువుతో పాటు తిండి, తిప్పలు అన్నీ వాళ్ళే చూసుకుంటారు అనుకున్నాడు. తను వండుకుని తినేవాడు. వండుకోలేని రోజు హోటల్లో తినేవాడు.

భార్య ఉన్నప్పుడు ఇల్లు ఊడవటం, అంట్లు తోమటం వంటి ఏ పనులు నామోషీగా భావించేవాడో అవే పన్లు అనేకసార్లు చేయాల్సివచ్చింది. ఏ టిఫిన్ కొనటానికి పది రూపాయలు ఖర్చుపెట్టటానికి పొదుపు గురించి ఆలోచించేవాడో ఇప్పుడు అలాంటి వాటికోసం అంతకు వందరెట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

అప్పుడప్పుడు అక్క శ్యామల ఇంటికి వెళ్ళేవాడు. తను ఎప్పుడు వెళ్ళినా అక్క ఆప్యాయంగా చూసి అన్నం పెట్టేది. శ్యామల కూడా ఉద్యోగస్తురాలే. బావ అక్కకి ఇంటిపనుల్లో సహాయం చేస్తూండేవాడు. ఏ పనైనా ఇద్దరూ చర్చించుకుని చేసేవారు. ఆఖరుకి పిల్లల విషయం కూడా. పెళ్ళయిన నాలుగేళ్ళకి మొదటిబిడ్డ పుట్టాడు. తర్వాత ఐదేళ్ళు గ్యాప్ ఇచ్చి రెండో బిడ్డని కన్నారు.

రవికాంత్‌కి పెళ్ళయిన రెండేళ్ళలోపే ఇద్దరు పిల్లలు పుట్టారు. అందువల్ల శ్యామల పిల్లలు రవికాంత్ పిల్లల కన్నా చిన్నవాళ్ళు.

శ్యామల, ఆమె భర్త ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేసుకునేవారు. ఒకరికొకరు కష్టనష్టాలు చర్చించ్కుంటారు. స్వంత ఇల్లు కట్టుకున్నారు. ఇంట్లో ఖరీదైన వస్తువులు ఏర్పరచుకున్నారు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ తీసుకునేవారు. ఆ పిల్లలు కూడా ఎంతో క్రమశిక్షణతో ఉంటారు.

రవికాంత్‌కి అక్కడికి వెళితే హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. శ్యామల తమ్ముడికి తప్పొప్పులు వివరించి చెప్పేది. రవికాంత్, వేదవతి విడిపోయి ఎనిమిదేళ్ళు అయింది.

"ఒరేయ్! మీరిద్దరూ విడిపోయి ఎనిమిదేళ్ళు అయింది. ఎవరి పంతం మీద వాళ్ళున్నారు. ఈ ఎనిమిదేళ్ళు విడిగా ఉండి ఏం సాధించావు? జీవితంలో ఎనిమిదేళ్ళ కాలం కోల్పోయినట్లే కదా! అంతేకాదు, నవమాసాలు మోసి, కని పెంచిన తల్లికి బిడ్డల్ని దూరం చేయటం ఎంత వరకు సబబు? నా మాట విని ఇద్దరూ కలసి ఉండండి. నేనూ బావగారు వెళ్ళి మాట్లాడతాం. ఆ అమ్మాయికి నచ్చచెబితే కాదనదని నా నమ్మకం" అన్నది శ్యామల.

రవికాంత్ ఆలోచించాడు. తన పంతం నెగ్గించుకున్నాడనే పేరేకానీ, ఈ ఎనిమిదేళ్ళలో సుఖపడింది ఏముంది? తనకీ వయసు మీద పడుతోంది. మంచికీ చెడుకీ తోడు ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్దవాడు సుజయ్ ఇంటర్మీడియట్‌కి వచ్చాడు. చిన్నవాడు సుశీల్ టెంత్‌కి వచ్చాడు. ఇవన్నీ ఆలోచించి రవికాంత్, భార్యను తీసుకురావటానికి ఒప్పుకున్నాడు.

పిల్లల్ని హాష్టల్ నుంచీ తీసుకు వచ్చాడు. రవికాంత్, శ్యామల, ఆమె భర్త మూగ్గురూ వేదవతి వాళ్ళింటికి వెళ్ళారు. ఆమె అన్నయ్య, అమ్మతో మాట్లాడారు. వేదవతి భర్త దగ్గరికి వచ్చేసింది.

అప్పుడప్పుడు రవికాంత్ జరిగినవన్నీ ఆలోచిస్తుంటే సుజయ్‌కానీ, సునీల్‌కానీ ఈ ఎనిమిదేళ్ళలో ఒక్కసారి కూడా "డాడీ! మమ్మీ ఏమయింది? ఎక్కడికి వెళ్ళింది?" అని మాటవరుసకైనా అడగలేదు. తను మూడు నెలలకోసారి హాస్టల్‌కి వెళ్ళి ఫీజు కట్టి వస్తుంటాడు. సునీల్‌కి ఎంతస్సేపూ ఫ్రెండ్స్ లోకం, సుజయ్‌కి తన చదువు, కెరీర్ గురించే ఆలోచన. అది కొంతవరకూ నయమే కానీ, ఇంట్లో ఒక మనిషి కనపడకపోతే ఏమైంది? అనే ఆలోచన కూడా రాదా? రేపు నాలుగు రోజులు కనపడకపోతే తనని కూడా ఇలాగే మర్చిపోతారేమో! ఆలోచిస్తున్న రవికాంత్ మనసు వ్యథాభరితంగా అయిపోయింది.

వేదవతి వచ్చిన దగ్గర్నుంచీ ఎక్కువకాలం మౌనంగానే ఉంటోంది. అన్నిపనులూ యథావిధిగా చేస్తోంది. తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటం లేదు. స్కూలు, పాఠాలు, ఇల్లు అంతే! ఒక విధంగా ఆలోచిస్తే మొదట్లో కూడా ఇలాగే ఉండేది. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో పెద్ద మార్పేమీ లేదు. తనే అతిగాపోయి బాధ పెట్టాడు. రవికాంత్‌లో క్రమక్రమంగా పశ్చాత్తాపం కలగసారింది.

సెల్‌ఫోన్‌లో రింగ్‌టోన్ వినిపించింది. దీర్ఘాలోచనలో మునిగిపోయిన రవికాంత్ చేయి చాపి టీపాయి మీదున్న సెల్ ఫోన్ అందుకున్నాడు. వేకప్ అలారం ఐదుగంటలు సూచిస్తోంది. దాన్ని ఆపి కళ్ళు మూసుకున్నాడు అలసటగా.

* * *

వేదవతి వచ్చి ఆరునెలలైంది. ఆరోజు రవికాంత్ ఆఫీస్ నుంచి వచ్చాడు. వేదవతి మంచి నీళ్ళు అందిస్తూ "అమ్మకి ఆరోగ్యం బాగాలేదట. అన్నయ్య ఫోన్ చేశాడు. నాన్నగారు పోయిన తర్వాత అమ్మ బాగా డల్ అయిపోయింది. వెళ్ళి చూడాలనిపిస్తోంది. మీరు వెళ్ళమంటే వెళతాను" అన్నది.

తను వద్దంటే మానివేస్తుంది. అందులో సందేహం లేదు. ఆడపిల్లకి కన్నతల్లిని చూడటానికి కూడా భర్త పర్మిషన్ కావాలా? రవికాంత్‌కి చాలా అన్యాయంగా అనిపించింది. "అలాగా వెళ్ళిరా! తగ్గే వరకూ వారం, పదిరోజులైనా ఉండిరా. నాకేమీ ఇబ్బంది లేదు" అన్నాడు.

వేదవతి ఊరు వెళ్ళింది. రెండు రోజుల తర్వాత శ్యామల తమ్ముడిని చూడటానికి వచ్చింది. అక్కా తమ్ముళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు.

సునీల్ స్కూల్ నుంచీ వచ్చి బ్యాగ్ సోఫాలో గిరాటుకొట్టాడు.

"డాడీ! మా ఫ్రెండ్ బర్త్‌డేకి సఫారీ సూట్ కొనుక్కున్నాడు. నాకు కూడా సఫారీ సూట్ కావాలి" అన్నాడు.

"నువ్వు చదివేది టెంత్ క్లాసే కదరా! అప్పుడే నీకు సూట్ ఎందుకు? నేను ఇంటర్లో కూడా నిక్కరుతోనే వెళ్ళేవాడిని తెలుసా?" అన్నాడు రవికాంత్ నవ్వుతూ.

"డాడీ! కావాలంటే ఇప్పుడు కూడా నిక్కరుతోనే ఆఫీస్‌కి వెళ్ళండి. నాకేం అభ్యంతరం లేదు. నాకు మాత్రం సూటే కావాలి" అన్నాడు సునీల్.

నవ్వుతున్న రవికాంత్ ముఖం చిన్నబోయింది.

"సునీల్! ఏమిటా మాటలు? డాడీతో అలాగేనా మాట్లాడేది?" శ్యామల మందలించింది.

"నీకు తెలియదులే ఆంటీ!" అని వెళ్ళిపోయాడు.

"కన్నబిడ్డ సంతోషం కన్నా నాకు ఏంకావాలి? నాకున్న ప్రేమలో వెయ్యోవంతన్నా వాడికి నామీద ఉన్నదా? పెద్దవాళ్ళన్న గౌరవం లేదు. నోటికి ఎంతమాట వస్తే అంత" అన్నాడు రవికాంత్ బాధగా.

"ఇప్పటి జనరేషన్ పిల్లలంతా అలాగే ఉన్నారు. పెద్దయితే వాళ్ళే తెలుసుకుంటారు. ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు" అన్నది శ్యామల.

ఆరోజు రవికాంత్‌కి ఉదయం నుంచీ తలనొప్పిగా, బడలికగా ఉంది. అదే పోతుందిలే అనే ఉద్దేశంతో ఆఫీస్‌కి వెళ్ళాడు.

సాయంత్రం అయ్యేసరికి తలనొప్పి, జ్వరం ఎక్కువయ్యాయి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టాబ్లెట్ కొనుక్కుని వేసుకుని ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వేదవతి ఇంకా ఊరినుంచి రాలేదు. సునీల్ ట్యూషన్‌కి వెళ్ళాడు. సుజయ్ టి.వి. చూస్తున్నాడు. చాలా ఒంటరిగా అన్పించింది.

"సుజయ్ ఇలా రా!" పిల్చాడు.

"ఏమిటి డాడీ!" సుజయ్ వచ్చాడు.

"కూర్చో!"

"ఫర్వా లేదు, పనేంటో చెప్పండి"

"ఏమీ లేదు, నాకు చాలా లోన్లీగా అన్పిస్తోంది. కాసేపు నా దగ్గర కూర్చో!"

సుజయ్ తండ్రి బెడ్ పక్కన కుర్చీలో కూర్చున్నాడు.

"మీ కాలేజీ విశేషాలు ఏమిటి?" అడిగాడు రవికాంత్.

"ఏం లేవు"

"మీ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా?"

"ఆఁ"

సుజయ్ సమాధానం చెప్పి గోళ్ళు చూసుకుంటూ మౌనంగా కూర్చున్నాడు. ఆ మౌనం ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది.

కొంచెం ఆగి "సరే! వెళ్ళు" అన్నాడు రవికాంత్. సుజయ్ లేచి వెళ్ళిపోయాడు. కుర్చీలో కాకుండా తలదగ్గర కూర్చుని "ఎలా ఉంది డాడీ!" అని నుదిటి మీద చెయ్యివేసి చూస్తే, కాసేపు కణతలు నొక్కితే పొంగిపోయి ఉండేవాడు రవికాంత్. ఆ కొంచెం ఆదరణ, అభిమానం కూడా చూపలేదు కొడుకు.

సాయంత్రం సునీల్ స్కూల్ నుంచి వచ్చాడు. రవికాంత్‌కి కొడుకుల దగ్గర్నుంచి కాస్తంత ఆప్యాయత, మరేదో కావాలనిపిస్తోంది. దగ్గర కూర్చుని తనని కుశల ప్రశ్నలు అడగాలనీ, ఆదరణగా మాట్లాడాలనీ అనిపిస్తోంది.

"సునీల్! స్కూల్ అయిపోయిందా?" అడిగాడు.

"అయిపోయింది డాడీ! మళ్ళీ సిక్స్‌కి స్టడీ అవర్‌కి వెళ్ళాలి"

"రెండు రోజుల నుంచీ నాకేమీ బాగా లేదురా...!" చిన్నగా అన్నాడు.

"ఇప్పుడు ఓకేనా? ప్రాబ్లం ఏమీ లేదుగా!" అనేసి రెండో మాటకి అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు సునీల్.

రవికాంత్ గాఢంగా నిట్టూర్చాడు.

మర్నాడు వేదవతి ఊరినుంచి వచ్చింది. రవికాంత్ దుప్పటి కప్పుకుని ఉన్నాడు.

"అలా ఉన్నారే! ఒంట్లో బాగాలేదా?" నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అన్నది.

"ఏమీ లేదు. కొంచెం తలనొప్పిగా ఉంది. టెంపరేచర్ పెరిగింది."

వేదవతి పక్కగదిలోకి వెళ్ళి జెండూబామ్ తీసుకువచ్చి అతని తలదగ్గర కూర్చుని నుదుటికి రాసి వేళ్ళతో నొక్కసాగింది.

"నువ్వు అప్పుడే వచ్చావే? మీ అమ్మగారికి ఎలా ఉంది?"

"అమ్మ స్వంత ఇంటిని వదిలి రానని గోల. ఒక్కదానివే ఎలా ఉంటావు? నా దగ్గరికి వచ్చేయమని అన్నయ్య అంటాడు. అందరం నచ్చజెప్పిన తర్వాత ఒప్పుకుంది. అన్నయ్యతో వెళ్ళిన తర్వాత నాకు నిశ్చింతగా అనిపించింది. మీరు ఎలా ఉన్నారు? భోజనం అదీ..."

"బ్రెడ్ తెచ్చుకున్నాను. తినాలనిపించలేదు. ఇంకా మిగిలి ఉంది"

"పిల్లలు డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్ళలేదా?"

"చదువుకునే పిల్లలు, పాపం వాళ్ళకెక్కడ వీలవుతుంది?" అన్నాడు.

"సుజయ్! సునీల్! ఇలా రండి" వేదవతి కేకేసింది.

ఇద్దరూ వచ్చారు. "డాడీకి ఫీవర్‌గా ఉంటే మీరేం చేస్తున్నారు? హాస్పటల్‌కి తీసుకు వెళ్ళఖ్ఖర్లేదా?"

"నాకేం తెలుసు మమ్మీ! నేను ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను" అన్నాడు సుజయ్.

"తెలియక పోతే తెలుసుకోవాలి. మీ చదువులకీ, సరదాలకీ ఎంతెంత ఖర్చు అవుతోంది? అవన్నీ డాడీ కష్టపడి సంపాదించబట్టే కదా! ఇప్పుడు నేనున్నాను. నేను రాక ముందు డాడీనేగా మీ గురించి పట్టించుకుంది? డాడీ పట్టించుకోకుండా వదిలేస్తే మీరిద్దరూ ఎక్కడుండేవారు? అంత కష్టపడే మనిషి కదలకుండా పడుకున్నారంటే ఏమైందో అని ఆలోచించనవసర్ లేదా? సునీల్! టాక్సీ పిలుచుకురా! డాడీని హాస్పటల్‌కి తీసుకువెళదాం" అన్నది.

"మమ్మీ! నా కోసం ఫ్రెండ్స్ ఎదురు చూస్తుంటారు. నేను వెళ్ళాలి"

"నోర్మూయ్! డాడీని ఈ స్థితిలో వదిలి వెళతాననడానికి సిగ్గులేదు! నీలాంటి ఫ్రెండ్స్ వందమంది ఉంటారు వాళ్ళకి. నువ్వు నచ్చకపోతే నిన్ను వదిలేసి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు అలా వదిలి వెళ్ళగలరా? ఇక మాట్లాడకు. వెళ్ళు. వెళ్ళి టాక్సీ తీసుకురా!" ఆజ్ఞాపించింది వేదవతి.

సునీల్ కిక్కురు మనకుండా వెళ్ళిపోయాడు.

వేదవతి, సుజయ్ అతన్ని లేపి కూర్చోబెట్టారు. సుజయ్ తండ్రికి చలి వేయకుండా భుజం చుట్టూ శాలువా కప్పాడు.

సునీల్ ఐదు నిమిషాల్లో టాక్సీతో తిరిగివచ్చాడు.

టాక్సీలో వెళుతూంటే రవికాంత్‌కి అటుప్రక్క, ఇటుప్రక్క భార్య పిల్లలు కూర్చున్నారు. అతనికి చాలా సంతృప్తిగా, సెక్యూరిటీగా అనిపించింది. డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేశాడు. మెడిసిన్స్ వ్రాశాడు. సెలైన్ పెట్టాడు.

ఇంటికి తిరిగి వచ్చారు. వేదవతి బ్రెడ్ పాలల్లో టోస్ట్ చేసి భర్తకి అందించింది. సునీల్, సుజయ్ వాళ్ళ రూముల్లోకి వెళ్ళారు. వేదవతి భర్త బెడ్ మీద కూర్చుంది.

"పిల్లల్ని చూస్తుంటే ఒక్కోసారి నాకు చాలా బాధ వేస్తుంది. అన్న అనే అనురాగం వాడికి లేదు. తమ్ముడనే అభిమానం వీడికి లేదు. వాళ్ళిద్దరికీ నేనంటే గౌరవం లేదు" అన్నాడు రవికాంత్.

"వాళ్ళని అనటానికి కూడా లేదు. వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం అధికంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉండి, పిల్లలు ప్రేమాభిమానాల మధ్య పెరిగితే మంచిగా తయారవుతారు. మీ అక్కయ్య గారి పిల్లలు చూడండి. తల్లిదండ్రులతో ఎంత ఎటాచ్‌మెంట్ ఉంటుందో? మీ అమ్మ నాన్న కూడా మిమ్మల్ని ప్రేమాభిమానాలతో చూడబట్టే కదా, మీరు మీ అక్కయ్యగారు ఇప్పటికి కూడా అంత అభిమానంగా ఉంటారు.

మన ఇంట్లో ఎప్పుడూ మనస్పర్థలే! అయినా నేను సర్దుకు పోవాటానికే ప్రయత్నించాను. తర్వాత సుజయ్‌నీ, సునీల్‌నీ హాస్టల్‌లో చేర్పించారు. ఏళ్ళ తరబడి హాస్టల్‌లో ఉండటం వల్ల వాళ్ళు అక్కడి మెకానికల్ లైఫ్‌కి అలవాటు పడిపోయారు. సడన్‌గా ఇంటికి తీసుకువచ్చేశాం. అక్కడి వాతావరణం వేరు. ఇక్కడి వాతావరణం వేరు. ఈ అంతరాల వల్లే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు.

వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు, వాళ్ళ ప్రవర్తన వల్ల మీకు ఎంత బాధ కలుగుతుందో అర్థమయ్యేటట్లు విడమరిచి చెపుదాం. మరీ చిన్న వయసు కాదు కాబట్టి అర్థం చేసుకుంటారు. నేను కూడా ఇక్కడికి వచ్చిన తరువాత మీతో మనస్ఫూర్తిగా కలవ లేక పోయేదాన్ని. సుదీర్ఘ కాలమే దూరంగా ఉండడం వల్ల మన బంధం బలహీన పడింది. వియోగం అనేది కొద్ది కాలమే ఉండాలి. మరీ ఎక్కువ కాలం ఉంటే మనుషుల మధ్య బంధాలు తెగిపోతాయి. మీలో రియలైజేషన్ కలిగిందని క్రమక్రమంగా అర్థం చేసుకున్నాను" అన్నది వేదవతి.

"నీకు దూరంగా ఉండడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. దూరంగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా సంతోషంగా గడిపింది లేదు"

"గతం గురించి బాధపడుతూ ఉంటే వర్తమానం కోల్పోతాం. ఇక నుంచీ మనం ఇద్దరం ఒకటిగా ఉండి పిల్లల మనసుల్లో అంతరాలను తొలగిద్దాం. వాళ్ళల్లో నిదానంగా మార్పు వస్తుంది" అన్నది.

"అలాగే! ఈ విషయంలో నేను నా పూర్తి సహకారం అందిస్తాను" అన్నాడు రవికాంత్ మనస్పూర్తిగా.

(నవ్య వీక్లీ సెప్టెంబరు 22, 2010 సంచికలో ప్రచురితం)

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.