కుందేలు తెలివి


అనగనగా ఒక అడవిలో ఒక పొగరుబోతు సింహం నివసిస్తుండేది . అది బలవంతుడననే గర్వంతో అడవిలోని జంతువులన్నిటికి తానే రాజునని తలచి మిగిలిన జంతువులన్నిటిని భయపెడుతూ ఆకలి వేసినప్పుడల్లా గుహలోంచి బయటకు వచ్చి అడవిలోకి వేటకు వెళ్ళి ఎదురుగా ఏ జంతువు కనపడితే దానిని చంపి తిని ఆకలి తీర్చుకుంటుండేది.

సింహం గుహలోంచి బయటకు రాగానే జంతువులన్నీ ఆ రోజు అది ఎవరిని చంపి తింటుందో అని భయపడుతూ గజగజా వణికి పోతుండేవి.

ఒకనాడు జంతువులన్నీ కలిసి సమాలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి సింహం వద్దకు వెళ్ళి భయం భయంగా “మృగరాజా! నీవిలా రోజు లెఖ్ఖలేకుండా జంతువులను చంపితింటుంటే అడవిలోని జంతువులన్నీ నశించిపోయే ప్రమాదముంది కనుక అలా చేయవలదు . నీవు వేటకు రావలదు అందుకు మారుగా మేమే రోజుకి ఒకరు చొప్పున నీకు ఆహారంగా వస్తాము” అని మనవి చేసుకున్నాయి .

అది విని సింహం ఆలోచనలో పడింది. ‘అవును అన్నిటిని ఒక్కసారే తినేస్తే నాకు ఆహారమే దొరకని పరిస్థితి వస్తుంది . పైగా రోజుకి ఒకరుగా తామే నా వద్దకు ఆహారంగా వస్తామంటున్నాయి కనుక ఈ ఏర్పాటేదో బాగున్నట్లుగా అనిపిస్తోంది . నేను గుహలోంచి బయటకు వెళ్ళఖ్ఖర లేకుండానే ఆహారం నా నోటి వద్దకు వస్తుంది’ అని సంతోషించి “సరే .

కానీ మాట తప్పకుండా రోజు నాకు ఆహారం రావాలి లేకపోతే మీరు నా కోపానికి గురికావలసి వస్తుంది !” అంటూ వాటిని బెదిరించింది.

మాట ప్రకారం ఆ రోజు నుండి జంతువులన్నీ వంతులవారిగా సింహానికి ఆహారంగా వెళ్ళసాగాయి. సింహం కూడా వేట మానేసి మహా సంతోషంగా కడుపులో చల్ల కదలకుండా గుహలోనే ఉంది ఆహారంగా వచ్చిన జంతువుని చంపి తిని తన ఆకలి తీర్చుకోసాగింది.

ఇలా కొన్ని రోజులు గడిచాయి......


ఒకనాడు సింహానికి ఆహారంగా వెళ్ళవలసిన వంతు కుందేలుకి వచ్చింది. అది ఒక ప్రక్క ప్రాణభయంతో వణికిపోతూనే మరొక ప్రక్క ఈ ఆపద నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుండగా దానికి ఒక ఉపాయం తట్టింది.

అంతే ఇంక మనసులో ధైర్యం తెచ్చుకుని కావాలనే కొంచం ఆలస్యంగా సింహం వద్దకు వెళ్లింది. ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా ఆకలిగొన్న సింహాన్ని చూడగానే కుందేలుకి కాళ్ళు వణక సాగాయి .

ఆ రోజు తన ఆహారం రావడం ఆలస్యమయేటప్పటికి సింహం కూడా ఆకలితో నక నక లాడుతూ కుందేలుని చూడగానే “ఒరే చెవుల పిల్లి ! ఎందుకింత ఆలస్యమైందిరా ?” అంటూ కోపంతో గర్జించింది .

దాంతో కుందేలు గజ గజ వణుకుతూ “మృగరాజా , నేను మీ వద్దకు వద్దామని ఎప్పుడో బయలుదేరి పరుగు పరుగున వస్తుండగా దారిలో నన్ను ఇంకొక సింహం అడ్డగించి “ఎక్కడికి వెళుతున్నావు?” అంటూ గదిమింది.

“నేను మా మృగరాజుకి ఆహారంగా వెళుతున్నాను” అని చెప్పాను

“ఎవరా మృగరాజు ? ఈ అడవికి నేనే రాజును. నన్ను మించిన వారెవరూ లేరు అంటూ మిమ్ములను నానా దుర్భాషలాడి వెళ్ళడానికి వీల్లేదని నన్ను బెదిరించింది. నేనే నిన్ను తింటాను అంది. వద్దు వద్దు నేను వెళ్ళి మా రాజుగారిని మీ వద్దకు తీసుకుని వస్తాను అని ప్రమాణం చేసి దానిని తప్పించుకుని పరుగున వచ్చేటప్పటికి ఈ వేళయింది” అంటూ దీనంగా విన్నవించుకుంది.

కుందేలు చెప్పినది విన్న మృగరాజుకి తనని మించిన వాడెవడో ఉన్నాడనగానే ఒక్కసారిగా ఒళ్ళు తెలియని కోపం వచ్చింది.

“ఎవడు నన్నుమించిన వాడు? ఎక్కడున్నాడు? నన్నే దుర్భాషలాడతాడేం ? నేనిప్పుడే వాడిని చూడాలి . పద నాకు చూపించు” అంటూ బయలుదేరింది.


“పద మృగరాజా” అంటూ కుందేలు సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకుని వెళ్ళి “మిమ్మల్ని మించినవాడినని చెప్పిన వాడు ఇదిగో ఇందులోనే దాక్కొని ఉన్నాడు చూడండి” అంటూ బావిలోకి చూపించింది.

అంతట ఆ సింహం గర్జిస్తూ బావిగట్టు ఎక్కి లోనికి తొంగిచూడగా అందులో తనలాంటి మరో సింహం కనిపించాగా దానిని తన విరోధిగా తలచింది.

గర్జన ప్రతిధ్వనించడం వలన లోన ఉన్న తన విరోధి కూడా తనని చూసి గర్జిస్తున్నట్లే భావించింది .

శారీరిక బలం తప్ప బుద్ధిబలం ఇసుమంతైనా లేని సింహం బావిలోని నీటిలో తన నీడని చూసి దానిని మరొక సింహమనుకుని భ్రమిసి “నువ్విక్కడే ఉండు నన్ను దూషించినవాడిని చంపివస్తాను” అని కుందేలుకి చెప్పి ముందువెనుకలు ఆలోచించకుండా బిగ్గరగా గర్జిస్తూ బావిలోనికి దూకింది.

బావి చాలా లోతుగా ఉండటమేకాకుండా నీరు కూడా తక్కువగా ఉండటంతో దూకీ దుకాగానే ఆ సింహం తల పగిలి మరణించింది.

“అమ్మయ్య నా ప్రాణాలు నిలవడమే కాకుండా ఈ రోజుతో అడవిలోని జంతువులన్నిటికి ఈ పొగరుబోతు సింహం పీడ వదిలింది” అని సంతోషించింది కుందేలు.


నీతి : బుద్ధిబలం ఉంటే ఎవరైనా ఎటువంటి ఆపదనుంచైనా బయట పడవచ్చును.telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.