డాక్టర్ ఆఫీసు లో కుర్చుని ఆమె కోసం ఎదురు చూస్తుంటే ఎందుకో ఆమె చెప్పే విషయం నా జీవితాన్ని మర్చేస్తుందేమో అనిపిస్తోంది .ఏదో తెలియని ఒక బాడ్ ఫీలింగ్ నన్ను స్తిమితం గా ఉండనీయడం లేదు .అంతలో డాక్టర్ రావడం తో నా ఆలోచనలకూ బ్రేక్ పడింది ." రచనా కంగ్రాట్స్ యు ఆర్ ప్రగ్నేంట్ .రచన నీ డెలివరీ అయ్యి ఇంకా ఏడాది కుడా కాలేదు ...మళ్లి ప్రగ్నేంట్ నువ్వు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి "అంది .ఆవిడ చెప్పిన వాటికంతా తలూపి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని ముగించి పాప ను డే కేర్ నుంచి తీసుకుని ఇంటికి వెళ్లేసరికి సురేష్ ఇల్లంతా బొకేలతో నింపేసాడు.నాకు మటుకు మళ్లి ప్రగ్నేన్సి అంటే చాలా బెంగగా ఉంది .ఒక పక్క పాప మరో పక్క ఆఫీసు పనులతో సతమతమయిపోతున్నా ....అలాంటిది ఇంకొక బేబీ అంటే ....సురేష్ కు ఇవన్ని అర్థం కావు.సురేష్ అప్పుడే ఇండియా లో అందరికి ఫోన్ చేసి చెప్పేసాడు .ఒక్కో సారి చిన్న పిల్ల వాడికన్నా అద్వాన్నం .అత్తగారు చాలా ఆనందపడ్డారు .అమ్మఎందుకో కొంచెం ముబావం గా మాట్లాడింది .సురేష్ పక్కనే ఉండడం తో నేను పెద్దగా రెట్టించలేదు .కాని ఇది ఏదో పెద్ద మార్పునే జీవితం లో తీసుకుని రాబోతోందని అర్థం అయ్యింది.
మరుసటి రోజు ఆఫీసు నుంచి అమ్మ కు ఫోన్ చేశాను .అమ్మ "కొంచెం టైం తీసుకుని ఉంటె బావుండేది ?నీ ఆరోగ్యం పాడవుతుంది .రెండో ప్రగ్ననేన్సి కొంచెం కష్టమే తల్లి ...నువ్వేమో అంత దూరంలో ఉన్నావు .నేను సురేష్ ముందర ఏమి మాట్లాడలేక పోయాను .నీకు రెస్ట్ లేకుండా పోతుంది.మీ అత్తగారేమో మనవడి కోసం చూస్తున్నారు కాబట్టి ఆవిడ చాలా ఆనందం గా ఉన్నారు .మొదటిసారి పాప అనితెలిసినపుడు సురేష్ సంతోషపడ్డాడని మీ అత్తగారు ఏమి మాట్లాడలేదు .....ఈ సారి ఏమవుతుందో ?".
"ఎంటమ్మ ?ఏ కాలం లో ఉన్నావు .....మా అత్తగారు అంటే పాతకాలం మనిషి .సురేష్ కు నాకు ఎవరయినా ఒకటే .ఈ కాలం లో ఎవ్వరు పుట్టిన ఉద్దరించేది ఏమి లేదు .మొన్న మా మామగారికి హార్ట్ ఎటాక్ వచ్చి బై పాస్ చేస్తే వదిన వెళ్లి చూసుకుంది కానీ సురేష్ వెళ్ళలేదు .నాకు కుడా ఎలా చేస్తానో అని బెంగ గా ఉంది .ఉద్యోగం మానేద్దాం అంటే ఇల్లు కొన్నాం ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కానీ కుదరదు అని మొదలుపెడతారు సురేష్ .సరయు ను రోజు డే కేర్ లో వదలి పెట్టాలి అంటే ఏడుపు వచ్చినంత పని అవుతుంది .కాలం మారింది కానీ ఆడవాళ్ళ సమస్యలు ఏమి తగ్గలేదు .నిన్న డాక్టర్ కూడా గ్యాప్ లేకుండా పోయింది చాలా కేర్ ఫుల్ గా ఉండాలి అంది .ఈ సారి డెలివరి అవుతూనే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయి౦చుకుందాం అనుకుంటున్నాను సురేష్ తో కుడా అదే అన్నాను .కానీ తను అంత సీరియస్ తీసుకోలేదు .నేను ఈ సారి డాక్టర్ తో మాట్లాడుతాను లే అమ్మ .నువ్వు బెంగ పెట్టుకోవ్వద్దు ".అనిఫోనే పెట్టేసింది .కానీ అమ్మ చెప్పిన మాటల్లో ఏ మాత్రం నిజం ఉన్న తన అత్త గారికి ,సురేష్ కు బాబు కావాలని ఉంటె .......?నాకు నిన్న మొదలు అయిన ఫీలింగ్ ఎక్కువ అయ్యింది ".
రోజులు ఏదోలా గడచి పోతున్నాయి .ఐదో నెల వచ్చింది .అత్త గారు ఫోన్ చేసినప్పుడల్లా "స్కానింగ్ అయ్యిందా ..... ఎవరని చెప్పారా ?"అని అడగడం తో అమ్మ చెప్పిన విషయం నిజం అని నిర్ధారణ అయ్యింది .సురేష్ నాకు సపోర్ట్ గా ఉన్నంత కాలం తను పెద్దగా వర్రీ కావలసిన అవసరం లేదు అని సర్ది చెప్పుకున్నాను .అంతకన్నా ఈ విషయం గురించి ఆలోచించే టైం లేకపోయింది .అమ్మ భయపడింది నిజమేనేమో .ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రమ్మంటే ఏదో రకం గా తప్పించుకుంటాడు సురేష్ ....అలాంటిది స్కానింగ్ రోజు తనే ఆఫీసు కు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాడు . స్కానింగ్ లో పాప అని చెప్పారు .ఇండియా లో అలా చెప్పరు కదా ..అది ఎంత మంచిదో . ఆతరువాత కూడా సురేష్ పెద్ద గా మారలేదు నా భయాలన్నీ నిజం కాలేదని చాలా సంతోషించాను .కానీ అత్త గారు చాలా బాధ పడ్డారు .నాతొ కొంచెం ముబావం గా ఉండడం మొదలుపెట్టారు .కానీ నాకు ఆఫీసు పని .పాపా,ఇంటిపనితో పట్టించుకునేంత టైం లేక పోయింది .
డెలివరీ తరువాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయ్యమని డాక్టర్ ను అడిగాను .ఆవిడ సురేష్ కొన్ని పేపర్స్ మీద సైన్ చెయ్యాలని చెప్పింది .నేను ఇంటికి తెచ్చి వాటిని సురేష్ కు ఇచ్చి సైన్ చెయ్యమన్నాను .తను నేను సైన్ చేసి పంపిస్తాను అనేసరికి నేను ఆ విషయం గురించి మర్చిపోయాను .కానీ అదే నా జీవితాన్ని మార్చేసింది .ఇంకా డెలివరీ కి నెల రోజులు ఉంది అనగా అమ్మ వచ్చింది .నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది .సరయు అమ్మ కు త్వరగానే అలవాటు అయ్యింది.
నేను ఒకరోజు ఆఫీసు లో ఉండంగానే నొప్పులు మొదలుఅయ్యయ్యి.సురేష్ వచ్చి హాస్పిటల్ కు తీసుకెళ్ళారు .పిల్లలను తీసుకురాకూడదు కాబట్టి అమ్మ రాలేకపోయింది.ఒక ఇరవై నలుగు గంటల తరువాత పాప పుట్టింది .ఆ నిముషం లో ఆ ఆనందం మాటల్లో చెప్పడం ఏ తల్లికి సాద్యం కాదేమో.సురేష్ మటుకు సరయు పుట్టినప్పుడు ఉన్నంత ఉత్సాహం గా లేరు.
నేను డాక్టర్ ను "నాకు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు ?అని అడిగాను.ఆవిడ"మీ హస్బెండ్ నాకు పేపర్స్ సైన్ చేసి ఇవ్వలేదు.ఆ పేపర్స్ లేకుండా నేను ఆపరేషన్ చెయ్యలేను....ఇంకో ఫైవ్ వీక్స్ తరువాత ప్లాన్ చేసుకోవచ్చు"అనింది .నాకు ఒక్క నిముషం ఆవిడ ఏం చెపుతుందో అర్థం కాలేదు.అంత ఇంపార్టెంట్ విషయం ఎలా మర్చిపోయారు అని అనుకుంటుండగానే సురేష్ లోపలి వచ్చారు."సురేష్ ...పేపర్స్ డాక్టర్ కు సైన్ చేసి ఇవ్వలేదంట ?మర్చిపోయారా"అన్నాను ."మర్చిపోలేదు రచన కావాలనే ఇవ్వలేదు ..........."అన్నాడు సురేష్.
"కావాలని ఇవ్వలేదా ?.....మనం అనుకునే కదా డాక్టర్ తో మాట్లాడాము.ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు సురేష్ "."అప్పుడే ఆపరేషన్ ఎందుకు....... మళ్ళి కావాలంటే పిల్లలు పుట్టరు కదా ?ఈ సారి అన్ని ప్లాన్ చేసుకుని అబ్బాయిని కందాం .....అమ్మ కూడా ఇదే చెప్పింది .మనవడి కోసం ఆవిడ చాలా ఆశలు పెట్టుకున్నారు.ఈ సారి ఏదో మనం ప్లాన్ చేయకుండా ఇలా అయిపొయింది . ఇప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళను కనడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి ఇండియాలో .....ఇక్కడ కుడా ఉన్నాయి కానీ ఇక్కడ ఖర్చు చాలా ఎక్కువ అట నేను కనుక్కున్నాను .....అమ్మకు తెలిసిన వాళ్ళు చాలా మంది అలాగే చేసారంట...మనం అదే పని చేద్దాం ".
"సురేష్ ...మీరేనా ఇలా మాట్లాడుతుంది.....పిల్లలు పుట్టని వాళ్ళు అలాంటివి చేయించుకున్నా ఒక అర్థం ఉంది .మనకెందుకు ....మనం రాతి యుగం లో ఉన్నామా....ఒకరిని కనడమే కష్టం అనుకుటే మనం ఇద్దరినీ కన్నాం ..ఏదో ఒకరికి ఒకరు తోడూ అనుకుందాం . ఇప్పుడు ఇద్దరినీ కాక మూడో వాళ్ళను కంటామా ....అది మగ పిల్లాడి కోసం మీరు అన్ని ఆలోచించే మాట్లాడుతున్నారా? ....ఈ కాలం లో ముగ్గురిని కని పెంచడం ఎంత కష్టమో తెలుసా ?నేను డబ్బు గురించి మాట్లాడం లేదు.ఇప్పుడే ఉన్న పిల్లను డే కేర్ అని ప్రొద్దున వదలిలేసి సాయంత్రం వరకు దాన్ని చూడను అదే నన్నుచాలా భాద పెడుతోంది ..ఇప్పుడు రెండో దాన్ని అదే పని చేయాలి .ఒక తల్లీ కి అది ఎంత కష్టమైన విషయమో తెలుసా ?మీకు మొగపిల్లవాడు కావాలా .వాడు పుట్టి ఏమి ఉద్దరిస్తాడు...ఒక్క నిముషం ఆలోచించండి మగపిల్లవాడు గా పుట్టి మీరు ఏమి చేసారు.మొన్న మామ గారికి అంత బైపాస్ సర్జరి చేస్తే నాకు ఇప్పుడు వెళ్ళడం కుదరదు నేను వెళ్లి ఏమి చేస్తాను అని వెళ్ళలేదు .ఇక వంశం అది ఇది అని నాకు చెప్పకండి .....ఇప్పుడు మనం మనల్ని కన్నా వాళ్ళకు ఏమి చేసాం..... అని మనం కన్నవాడు మనకు ఏమి చేస్తాడు ".
" నేను అవన్నీ ఆలోచించలేదు ..ఐ వాంట్ మై అప్షన్స్ ఓపెన్ అంతే.అంత మాత్రానికే నువ్వు అలా మాట్లాడక్కరలేదు .అబ్బాయిలంటే నీకు ఎందుకంత అయిష్టత.ఒక్క అబ్బాయిని కంటే ఏం అవుతుంది ?".
"నాకు మగపిల్లలు అంటే అయిష్టత ఏమి లేదు ....ఇద్దరు పిల్లల తరువాత మూడో వాళ్ళను కనీ పెంచే శక్తి నాకు లేదు .తల్లి కడుపులో ఎవరు ఉన్న ఒకే రకం గా చూస్తుంది......అంతే జాగ్రత్త గా తోమ్మిదినెలలు మోస్తుంది .....వాళ్ళను కనడానికి పడే భాద ఒక్కటే .....వాళ్ళ మీద ప్రేమ ఒక్కటే వాళ్ళు బాగా ఉండాలనే తపన ఒకటే ....మనకు దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడదాం అంటున్నాను ....రేపు మనం మగపిల్లడిని కన్నామే అనుకుందాం అత్తయ్య వాళ్ళు వీళ్ళ ఇద్దరి ముందు వాడిని నువ్వు వంశోద్దారకుడని ...మగపిల్లడని ప్రత్యేకం గా చుస్తే వీళ్ళకు ఎలా ఉంటుంది.వీళ్ళను ఎంత గాయపరుస్తుందో తెలుసా.ఇప్పుడు రెండో బేబీ ని తీసుకుని వెళ్తే సరయు ఎలా రీఅక్ట్ అవుతుందో అని నేను భయపడుతున్నాను. కొంచెం పెద్దయ్యాక వీళ్ళు ఆడపిల్లలు కాబట్టి మూడో వాళ్ళను కన్నాం అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద ఎంత ప్రభావం కనిపిస్తుందో మీకు అర్థం కాదు ....అంతెందుకు మీ విషయమే తీసుకుందాం ...మీ అక్క స్టేట్ రాంక్ తెచ్చుకుని మెడిసిన్ చేసి ఇప్పుడు సిటీలోనే పెద్ద హార్ట్ సర్జన్ ....కానీ అత్తయ్య ఎప్పుడు మిమల్నే పొగుడుతారు ఎందుకంటే మీరు మగపిల్లాడు అన్న ఒకే ఒక కారణం వల్ల....... తను ఆడపిల్ల కాబట్టి తను ఎంత సాదించిన తక్కువే అని తనకు చెప్పినట్టే కదా. ఒక్కోసారి వదిన ఎంత భాదపతారో తెలుసా .తను పెళ్లి చేసుకుని వేరే ఇంటికి కోడలు అయ్యింది కానీ మీ ఇంటి పిల్లనే ...తనే కాదు ఏ ఆడపిల్ల అయిన అంతే.మామయ్య ఎంత గర్వం గా చెప్పుకుంటారు తన కూతురి గురించి అప్పుడు వదిన ముఖం లో ఎంత ఆనందం ఉంటుందో చుస్తే ఈ విధం గా అలోచించి ఉండరు మీరు అత్తయ్య .ప్రపంచం ఎంత ముందుకు వెళ్లి ...ఎంత ప్రగతి సాదించిన ....ఆడపిల్లను ఇంకా ఇలాగె చూస్తాము.ఆడపిల్లలుగా పుట్టిన వాళ్ళు తమ తల్లితండ్రుల పేరు నిలబెట్టడానికి పనికిరారా ?ఆడపిల్లగా పుట్టిన తరువాత చాలా ప్రాబ్లంస్ వస్తాయి ......వాటిని ఎలా పేస్ చెయ్యాలో మన పిల్లలకు నేర్పాలి అంతేకాని మనం వాళ్ళ ప్రాబ్లంస్ ను మన ఇంటి నుంచే మొదలు పెట్టకూడదు .మనం ఇప్పుడో మగపిల్లడిని కంటే మీరు చెయ్యలేని పనులు వాడు చేస్తాడు కాబట్టి వాణ్ణి కన్నాం అని చెప్పినట్టుఅవుతుంది .పిల్లలను రేపొద్దున వాళ్ళ జీవితంలో వచ్చే ఒడుదుడుకులను తట్టుకుని దైర్యం గా ముందుకు పోవడానికి మనమే సన్నధం చేయాలి ...అది ఎంత పెద్ద భాద్యతనో తెలుసా మీకు?".

"అవన్నీ ఎందుకు రచన మనం మా అమ్మ కోసం ఒక అబ్బాయిని కనిద్దాం ....ఆవిడ నన్ను ఇంత వరకు ఏమి అడగలేదు ...ఆవిడ కోసం ఈ మాత్రం చెయ్యగలనని అనుకుంటున్నాను ".

"నేను ఆ పని చెయ్యలేను సురేష్ మీరు ఎమన్నా సరే ....దేవుడు నాకు ముత్యాల లాంటి ఇద్దరు పిల్లలను ఇచ్చాడు .నేను ఇంకోక్కళ్ళను కనదలచుకోలేదు ..కనను ".

"నాకు ఒక అబ్బాయి కావాలి .ఇది నా నిర్ణయం .ఇది జరిగి తీరుతుంది ఆ తరువాత నీ ఇష్టం "అని అక్కడ నించి కోపం గా వెళ్లి పోయారు .

ఇంత చదువుకొని రాకెట్ యుగం లో ఉన్న సురేష్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు .ఒక కాలం లో అబ్బాయి కోసం ముగ్గురు నలుగుర్ని కనేవాళ్ళు .ఆడపిల్లలు అన్ని చెయ్యగలం అని నిరుపించుకున్న రోజుల్లో కుడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ?ఒక ఆడదాని గా నా మనసును చంపుకుని నేను ఈ పని చెయ్యను .పరిణామం ఏమైనా సరే వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు .

విషయం అమ్మ కు చెపితే" ఒక మగపిల్లవాణ్ణి కనేస్తే పోతుంది కదా తల్లి !అనవసరం గా నీ సంసారం లో కలతలు వస్తాయి .ఈ విషయం ఎంత పెద్దది అవుతుందో ఎక్కడి వరకు వెళ్తుందో ?నాకు చాలా భయం గా ఉంది "అంది తల్లి కదా ఆవిడ భయం ఆవిడది . "ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కాని నా మనసాక్షి అంగీకరించని పని నేను చెయ్యను .సురేష్ ఎమన్నా అనుకోని .ఇక ఇంత దూరం వచ్చాకా నేను వెనక్కు పోదలచుకోలేదు ".

అమ్మ కు తెలుసు అంత దూరం వచ్చాక నన్ను కన్విన్స్ చెయ్యలేనని ...... ఇంక ఏం మాట్లాడలేదు .నాన్న తో చెప్పిదామని ట్రై చేసింది కాని నాన్న నాకే సపోర్ట్ చేసారు .సురేష్ కు నాకు కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది .అమ్మ ఇది చూస్తూ భాద పడడం చూసి నేను అమ్మ ను తీసుకుని ఇండియా వచ్చాను .
మామయ్య ,వదిన నన్నే సపోర్ట్ చేసారు కాని సురేష్ ,అత్తయ్య మాత్రం మొండి గా ఉన్నారు .నేను నా భర్త తో ఇలాంటి ఒక విషయానికి పోట్లడాల్సివస్తుందని కల లో కుడా అనుకోలేదు .నాలుగు నెలలు భారం గా గడిచాయి .ఏమనుకున్నారో సురేష్ ఇండియా వచ్చారు నన్ను కన్విన్స్ చెయ్యాలని చాలా చూసారు నేను అదే పని చేశాను కాని అబ్బాయి కావాలనే అనే పట్టుదల వదలడం లేదు .
ఇంతలో సురేష్ వాళ్ళ మేన మామకు సీరియస్ గా ఉంది అంటే చూడడానికి హాస్పిటల్ కు వెళ్ళాం .ఆయన కు మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చింది వదినే ఆయనకు సర్జరీ చేసారు.ఆయన పిల్లలంతా అమెరికా లో ఉన్నారు .నేను పెళ్లి అయిన తరువాత సురేష్ వాళ్ళ బంధువులతో పెద్ద గా కలిసింది లేదు ఆయన గురించి నాకు పెద్ద గా తెలియదు .అప్పుడే వదిన ఆయన గురించి చెప్పారు "ఆయనకు మగపిల్లలు అంటేనే ఇష్టం...వాళ్ళు వంశాన్ని వృద్ధి చేస్తారని .అమ్మ తన పెళ్ళికి ముందు ఆయన దగ్గరే పెరిగింది కాబట్టి ఆయన ఆ ఆలోచనలన్నీ అమ్మకు ఎక్కించారు నాకు స్టేట్ రాంక్ వచ్చినప్పుడు కుడా "ఆడపిల్లలకు ఇంత పెద్ద చదువులు ఎందుకు ...మనం పెంచి చదివించి ఎవరికో అప్పగించడానికి ?"అని మా నాన్నతో అన్నారు . మా అమ్మ కుడా ఆయన లాగే ఆలోచిస్తుంది .నాన్న సపోర్ట్ ఉంది కాబట్టి సరిపోయింది లేకుంటే నన్ను డిగ్రీ తో సరిపెట్టే వాళ్ళు .ఆయన కొడుకు కోసం ముగ్గురు కూతుళ్ళను కన్నాడు ఆ తరువాత ముగ్గురు కొడుకులు పుట్టారు ఆ కూతుళ్ళను ఏదో చదివించి పెళ్ళిళ్ళు చేసారు .కొడుకులంతా అమెరికా లోనే ఉంటారు .ఇప్పుడు ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది అంటే కొడుకులు మాకు ఆ పని ఉంది ఇది ఉంది అంటూ ఇంకా రానేలేదు .కూతుళ్ళు ఈయన వాళ్ళను ట్రీట్ చేసిన పద్దతికి జీవితం లో ఈయన ముఖం చుడకుడదనుకున్నారు .ఈయన ఒంటరిగా మిగిలారు ".

హాస్పిటల్ కు నేను ,సురేష్,మా అత్తగారు వెళ్ళాం .ఆయన మా అత్తగారిని దగ్గరికి పిలిచి "సుశీల ...నేను నా పిల్లల మద్య అంతరం చూపించి అందరిని దూరం చేసుకున్నాను .ఆడపిల్లలు ఎందుకు పనికి రారు అనే భావం నన్ను ఎవరికీ కాకుండా చేసింది .ఆడపిల్ల మహాలక్ష్మి అని ఎవరు చెప్పినా నేను వాళ్ళనే తప్పు పట్టాను వంశోద్దరకులు అని మగపిల్లలను నెత్తిన పెట్టుకున్నాను .నువ్వు ఆ తప్పు చెయ్యొద్దు .ఇది నా ఆఖరి కోరిక అనుకో .నేను నా కూతుళ్ళను చూడాలనుకుంటున్నాను నన్ను మన్నించి నా దగ్గరికి రమ్మని చెప్పు .నేను ఆడపిల్ల తనకు పెద్ద చదువు ఎందుకు అన్న నీ కూతురు నాకు ప్రాణం పోసింది .పిల్లలు ఆడ,మగ అనేది కాదు ముఖ్యం వాళ్ళు ఎంత ప్రయోజకులు అనేదే ముఖ్యం .ఇది నేను తెలుసుకునే సరికి చాలా ఆలస్యం అయ్యింది .నీకు అలాంటి ఆలోచనలే నేర్పినందుకు నన్ను మన్నించు ". ఆయన తో మాట్లాడాక మా అత్తగారిలో చాలా మార్పు వచ్చింది .
నా దగ్గరికి వచ్చి "రచన ....ఈ గొడవకంతా నేనే కారణం .నాకు మనవడు లేకుంటే నా వంశం ఏమవుతుందో ?అని లేని పోనీ పిచ్చి ఆలోచనలు చేసాను .మీ మామగారు ఎంత చెప్పిన వినలేదు .నేను సురేష్ కలసి నిన్ను భాద పెట్టాము .నీకు ముత్యాల లాంటి పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళను చదివించు అందరు మెచ్చుకునే విధం గా తయారు చెయ్యి నా కూతురి లా "అనేసరికి పక్కనే ఉన్న వదిన ముఖం లో ఆనందం చెప్పతరం కాదు .
మా అత్తగారి లో మార్పు వచ్చింది కాబట్టి సరిపోయింది లేకుంటే ?ఇలాంటివి చుస్తే కాలం ఏమి మారలేదు అనిపిస్తుంది .ఆడపిల్లలు దేశాలు పరిపాలించినా ...నోబెల్ ప్రైజ్ లు గెలిచినా ...అంతరిక్షం లోకి వెళ్ళినా తమను తాము ప్రతి నిముషం నిరుపించుకుంటూనే ఉండాలి అంటే ఎలా? నా పిల్లలకు ఈ భాద రాని కాలం వస్తే అంటే చాలు .

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.