మనసంతా మల్లెల వాన

అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు తెల్లగన్నేరు ఆకుల మధ్య నుండి ఇంటి గడపముందుకు పడి ఊగుతున్నాయి. చల్లగాలికి రాలిన పచ్చపూలు తమకంత అందాన్నిచ్చిన భూమాతకు ప్రణమిల్లాలని పొర్లుదండాలే పెడుతున్నాయి. పక్కింట్లో నుండి ధూపపు సువాసనలు చిరు గంటల సవ్వడి నెమ్మదిగా నన్ను చేరుతున్నాయి. విచ్చుకుంటున్న ఎర్ర మందారం చిరునవ్వుతో పెదాలను సాగదీస్తున్నట్టుంది.
రాత్రి విచ్చుకున్న మల్లెలు వీస్తున్న గాలికి ఒక్కొక్కటిగా రాలుతున్నాయి.
తనను తాను వేలాడదీసుకుని నన్ను నెమ్మదిగా ఊపుతోంది ఊయల.
ఘుమఘుమలాడే ఫిల్టర్‌ కాఫీ తాగుతూ దినపత్రిక తిరగేస్తున్నా క్రిష్ణా నగర్‌లో చైన్‌ స్నాచింగ్‌ వార్త కన్పించింది. కాస్తంత వేగంగా విషయమంతా చదివేశా. 'మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ మహిళ మెడలోని గొలుసును బైక్‌ మీద వేగంగా వెళ్తూ లాక్కెళ్ళిన దుండగులు'' అని వుంది.
ఇంకా ఆ మహిళ పోలీసు కంప్లెయింట్‌ ఇచ్చినట్టుగా అందులో వారు కళాశాల విద్యార్థుల్లాగా వున్నారని చక్కటి డ్రెస్‌ సెన్స్‌ ఉందని తాను వాళ్ళను చూస్తే గుర్తు పడతానని, బైక్‌ నెంబర్‌ చూడలేక పోయానని చెప్పినట్టుగానూ పోలీసులు కేసు రిజిష్టర్‌ చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని చదివా?
ఇంత చక్కటి వాతావరణంలో ఆ వార్త బాధ అనిపించింది. బంగారాన్ని పోగొట్టుకున్న ఆ మహిళ మానసిక వ్యధ మంగళ సూత్రం పోయిందన్న సెంటిమెంట్‌ ఆమెను ఎంతగా కృంగ దీస్తాయో? ఆమె ఇంట్లో అందరికి సమాధానం ఎట్లా చెప్పుకోవాలి అని చాలా సేపే ఆలోచించాను?
ఆమె భర్త అత్తమామలు ఆమెను అర్థం చేసుకొని పోయిన దానికి ఆమె బాధ్యత లేదని ఆమెను ఓదారుస్తారో లేక వస్తువును జాగ్రత్త చేయలేక పోయిందని సుమారు లక్ష రూపాయలు పోగొట్టిందని సాధిస్తారో?
ఏంటో ఆడాళ్ళ జీవితం?
జరిగిన దాంట్లో తన బాధ్యత ఎంత అన్నది కూడా పరులే నిర్ణయిస్తారు. కారణం తాను ఐనా కాకపోయిన బాధ్యత తానే వహించి అందరితో మాటలు పడాల్సి వస్తుంది. పూర్తిగా తన బాధ్యత లేదన్న విషయం తనకు తెలిసినా తప్పంతా తనదే అన్నట్టుగా బాధగా అన్నీ ఓర్చుకోవాలి. నిన్న ఐతే క్రిష్ణా నగర్‌ రైల్వేగేట్‌ దగ్గర గేట్‌ వేయబడి వుంది. ఓ 60 సంవత్సరాల పెద్దాయన స్కూటర్‌ డ్రైవ్‌ చేస్తున్నాడు. అతని వెనుక సమాన వయసున్న ఓ పెద్దావిడ కాస్త పొట్టిగా లావుగా ఉంది. చాలా పెద్ద బ్యాగ్‌ బహుశా నెల సరుకులు అనుకుంటా మీద పెట్టుకొని జాగ్రత్తగా కూర్చొని ఉంది. కాసేపట్లో రైలు వెళ్ళిపోయింది.
గేట్‌ తీయడంతో ఒక్కసారిగా రెండు వైపుల ఉన్న వాహనాలు వెంట వెంటనే వచ్చేశాయి.
ఆ గ్యాప్‌లో ఆ పెద్దాయన గేర్‌ సరిగా మార్చలేకపోయాడు. చుట్టు అందరి బళ్ళు హారన్స్‌ గట్టిగా మోగుతున్నాయి.
పెద్దాయన స్కూటర్‌ ఆగిపోయింది.
బండి అప్‌లో ఉన్నందున తాను పొట్టిగా వున్నందున సడెన్‌గా ఆమె బండి దిగలేకపోయింది. ఆ పెద్దాయన బండి పక్కకు తీసి ఆపి పెళ్ళాన్ని చాలా కోపంగా తిడుతున్నాడు. ఆమె అంత లగేజీ మోస్తూ సహనంగా తిట్లన్ని భరిస్తోంది. కాసేపటికి ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యింది. ఆ పెద్దాయన స్కూటర్‌ గేట్‌ దాటించి డౌన్‌లో పెట్టి మళ్ళీ ఓ సారి వంచి స్టార్ట్‌ చేశాడు. త్వరగా ఎక్కు ''దరిద్రపు గొట్టు దానా'' అని గట్టిగా అరుస్తున్నాడు.
ఆమె భయంగా లగేజీతో ఎక్కి వెనక కూర్చున్నది. తప్పు చేసిన భావనతో ముఖాన్నంతా ముడుచుకొని కూర్చుంది. స్కూటర్‌ నన్ను దాటి ముందుకెళ్ళింది.
ఏంటిది?
అతనికి గేర్‌ మార్చడం రాకపోతే ఆమెనెందుకనాలి?
అంటె పడుతుందనా?
ఎందుకిలా?
ఆమె అయినా చెప్పొచ్చుగా?
నేనేం చేశాను? ఎందుకు తిడుతున్నారు?
లేదు. ఆమె ఏమీ అనలేదు. తనలో తను బాధ పడ్తూ అలాగే జాగ్రత్తగా లగేజీ మోసుకొని ఎక్కి కూర్చుంది. బంగారు దండ ఎవడో లాక్కుపోతే పరిస్థితి ఎలా వుందో?
పాపం ఆమెను భోజనం చేయనిచ్చారో లేదో?
సూటిపోటి మాటలతో బాధించారేమో?
ఇలా సాగుతున్న నా ఆలోచనలకు చక్కటి డ్రస్‌ సెన్స్‌ వుండే స్టూడెంట్స్‌ లాగా వున్న చైన్‌ లాక్కెళ్ళారన్న మాట గుర్తొచ్చింది.
ఏంటిది?
సమాజం ఎక్కడికి వెళ్తోంది? యువత తమ అవసరాల కోసం అందర్నీ బాధ పెడ్తోందా?
వాళ్ళసలు స్టూడెంట్స్‌ అయ్యుంటారా?
బైక్‌ వుంది మంచి డ్రస్‌ సెన్స్‌ ఉంది అంటే వాళ్ళదేమి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం అయ్యుండదు. అందునా ఆ వయసులోని అబ్బాయి కోసం బైక్‌ కొనిచ్చారంటే వాడి మీద వాడి కన్వేయన్స్‌ మీద వాళ్ళ పేరెంట్స్‌ను ఎక్కువ కన్సర్న్‌ వుండే వుంటుంది. మధ్యాహ్నం 3-30 తరువాత వాడు గోల్డ్‌ చైన్‌ కొట్టేసి ఇంటికెళ్ళినా వాళ్ళ అమ్మొ అయ్యో ఇంతసేపు కంబైన్డ్‌ స్టడీస్‌తో అలసిపోయి వుంటాడనుకొని నెయ్యి వేసి మరీ పప్పన్నం కలిపి ఇవ్వవచ్చు?
అయ్యో అక్కడ కూడా మోసపోతోంది అమ్మే కదా! ఐనా 20 ఏళ్ళు కూడా వుండని వాళ్ళకు దొంగతనం చేసైనా డబ్బు సంపాదించాల్సిన అవసరాలేముంటాయి? బేసిక్‌ నీడ్స్‌ అన్నీ పేరెంట్స్‌ తీర్చేస్తారు. వీళ్ళకు ఇంకా ఖర్చులెందుకుంటాయి? ఐనా తమ ఖర్చులకు ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎలాంటి సంస్కారం.
అది పూర్తిగా తల్లిదండ్రుల నుండి వచ్చి వుంటుందంటే నేనొప్పుకోను. ఇంకా వీళ్ళబ్బాయి ఇలాంటి పనులు చేస్తున్నాడని కూడా వాళ్ళకు తెలియకపోవచ్చు. తెలిస్తే ఏ తల్లి అలా చేయమని ప్రోత్సహించదు. అయ్యో! యువత ఇలా పెడదారి పడుతుంటే వాళ్ళను ఎలా మార్చాలి?
చెడు ఆలోచనలనుండి వాళ్ళను ఎలా మార్చాలి?
వీళ్ళ నుండి సమాజం ఎటు వైపుకెళ్తుంది.వీళ్ళ సంతతి సమాజాన్ని ఇంకా ఎంత నాశనం చేస్తారో?
యువత ఇలాగుంటె ఇక రోడ్‌పై వెళ్ళటానికి కూడా భయపడాలా?
అయ్యో... ఎందుకిలా... ఎందుకిలా జరుగుతోంది. గుండెంతా పిండేసినంత బాధగా వుంది.. ఇక మిగిలిన వార్తలు చదవాలన్పించలేదు.
మళ్ళీ మామూలు స్థితికి రావటానికేం చెయ్యాలి?
చన్నీటి స్నానం చేశా.
ఇక మళ్ళీ రోజువారీ కార్యక్రమాలు ఉరకుల పరుగుల జీవితం. ఫోన్‌ సంభాషణలు, సంప్రదింపులు, సందేహాలు, సలహాలు, సూచనలు, సంజాయిషీలు, సంతోషాలు, సంతాపాలు, ఆలోచనలు, అభియోగాలు, ఆత్మీయ పరామర్శలు, ప్రశంసలు, ప్రసంగాలు, సమావేశాలు, సాలోచనలు నిర్ణయింపబడిన కార్యాలు నిర్దేశించాల్సిన కార్యాలు పరిశీలనలు పరిరక్షణలు అన్నీ కలిసి సాయంత్రం ఆరు అయ్యింది. అలసట శారీరక కష్టం లేకపోయినా చేయగల్గినవి. చేయలేనివి చేయాల్సినవి అన్నింటినీ ఆలోచించి కాస్తంత ఆలసట.
సరే, మళ్లీ కాస్తంత ఊరట కావాలి. స్నానం చేసి పెరట్లోకి వెళ్ళి గుండు మల్లెలు కోస్తున్నా ఆలస్యమైంది కదా! అన్ని మల్ల్లెలు విచ్చుకున్నాయి. మల్లెల వాసన. పూలు కోస్తుంటే '' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది'' పాట గుర్తొచ్చింది. పూలన్నీ గుచ్చి చక్కగా తల్లో పెట్టుకున్నా రాత్రి టైమ్‌ ''7'' అవుతోంది. ఇప్పుడేం చేద్దాం? టి.వి. చూడబుద్దేయలేదు. పోనీ పుస్తకాలేమైనా చదువుదామా అంటే కొత్తవేమీ కొనలేదు. సరే అక్కయ్య వాళ్ళింటికెళ్దాం.
కీ తీసుకొని ఇల్లు లాక్‌ చేసి బయటకు వచ్చాను. కార్‌ డోర్‌ తీశాక అన్పించింది.కార్లో అయితే చల్లగాలి ముఖానికి తాకదు. టూ వీలర్‌లో వెళ్దాం అన్పించింది. సరే అనుకొని కార్‌లోని బాగ్‌ నుండి ఓ 500/- నోట్‌ తీసుకొని కార్‌ లాక్‌ చేసి కీ తీసి బండి డిక్కిలో వేసి పెప్‌స్టార్ట్‌ చేశాను. చల్లగాలి, మల్లెల వాసన మనసుకు చాలా హాయిగా అన్పించింది. అక్కడకు ఇక వెళ్దాం అన్పించి టైమ్‌ చూశా. అబ్బ రాత్రి 11 అయ్యింది. కార్‌ కూడా తేలేదు. పెప్‌లో వెళ్ళాలి అనుకొని అందరికి బారు చెప్పి బయలు దేరా. ఒక్క కిలో మీటరు దూరం వచ్చుంటానేమో పెప్‌ సడన్‌గా పంచర్‌ అయ్యింది. బండి దిగి తోస్తూ అటు ఇటు చూశా.
కాస్త దూరంలో పెద్ద టైర్‌ వేలాడగట్టి షాపు ట్యూబ్‌ లైట్‌ వెలుగు కన్పించింది. హ్యాపీ, వెరీ గుడ్‌ అనుకుంటూ నెమ్మదిగా ఆ పంచర్‌ షాపు దాకా వెళ్ళాను. లైట్‌ ఐతే వెలుగుతోంది కానీ, ఎవరూ కన్పించలేదు.
''బాబూ.. బాబూ.. పంచర్‌ షాపు. బాబూ...ఎవరైనా ఉన్నారా?''
కాస్త గట్టిగా పిలిచాను. షెడ్‌ వెనుక నుండి ఓ 15-16 సంవత్సరాల అబ్బాయి బయటకు వచ్చి ''ఏంటి మేడమ్‌'' అన్నాడు నెమ్మదిగా. బాబూ టైర్‌ పంచర్‌ అయ్యినట్టుంది చూడవా? అన్నాను ప్రశాంతంగా. ఔను అంటూ టైర్‌ నుండి ట్యూబ్‌ బయటకు తీశాడు. అయ్యో వాల్వ్‌ ట్యూబ్‌ దగ్గర చిరిగిపోయింది. పంచర్‌ వేయడానికి రాదు. ట్యూబ్‌ మార్చాలి అన్నాడు. సరే మార్చేయి నో ప్రాబ్లమ్‌ అన్నాన్నేను. నా దగ్గర కొత్త ట్యూబ్‌ లేదు తెచ్చుకోవాలి అన్నాడబ్బాయి. టైమ్‌ చూశా 11-20 ఇప్పుడెక్కడ తెరచి వుంటారు.
ఒద్దులే బండి పంచర్‌ వేసి నీ దగ్గరే పెట్టుకో నేను రేపు తీసుకుంటా. ఇప్పుడు ఆటోలో వెళ్తా అన్నాను. ''లేదులే మేడమ్‌ చౌరస్తా దగ్గర మా ఫ్రెండ్‌ షాపు వుంది. అక్కడ తెరచి వుంటాడు. ఒక్కసారి వెళ్ళి వస్తాను. ట్యూబ్‌ వేసేస్తాను. మొత్తం ఓ 20 నిముషాలు'' అంతే అన్నాడు. అంతేనా?త్వరగా వస్తావా? అన్నాను. వెంటనే పోవడం రావడం అంతే అంటూ డబ్బు కోసం చేయి చాచాడు. పెప్‌ డిక్కి ఓపెన్‌ చేసి రూ.500 నోట్‌ తీసి ఆ అబ్బాయి చేతిలో పెట్టాను. వెంటనే ఆ అబ్బాయి రోడ్‌ మీదకు వెళ్ళి ఆటోలో వెళ్ళిపోయాడు. టైమ్‌ చూశా 11:30 రోడ్‌పై వెహికల్స్‌ చాలా తక్కువగా వున్నాయి. అంతవరకు తెరచి వున్న చిన్న చిన్న షాపులు కూడా మూసేశారు. నెమ్మదిగా ప్రదేశం అంతా ఖాళీ అయ్యింది. పక్కగా విశాలమైన హైవే ఫ్లై ఓవర్‌ సైడ్‌లో సర్వీసు రోడ్‌ ఓ మూలకు పంచర్‌ షెడ్‌ దగ్గర్లోనే నేను. కాస్తంత వెనకగా ఓ చెత్త కుప్ప పారేసిన పార్శిల్‌ నుంచి మిగిలిన ఆహారం కోసం పంది కొక్కులు చాలా స్పీడ్‌గా వస్తు వెళ్తు వున్నాయి. నిర్మానుషమైన రోడ్డు. టక్కున బుర్రలో ఓ చెత్త ఆలోచన. సడెన్‌గా ఇప్పుడెవరైనా వచ్చి నా మెడలో చైన్‌ లాక్కెళ్తే ? వెళ్ళినవాడు రాలేదు. కొద్దిసేపు సెకండ్‌ షో వదిలినట్టున్నారు. పలుచగా జనసంచారం కొద్దిసేపు రోడ్‌ కాస్త లైట్స్‌తో కన్పించింది. టైమ్‌ చూశా 12-30 అయ్యింది. ఈ పంచర్‌ అబ్బాయి రావడం లేదేంటి. చాలా సేపయ్యిందే !
సరే ఇంటికి ఆటోలో వెళ్ళిపోదాం! అనుకున్నా
సడెన్‌గా గుర్తొచ్చింది. ఇంటి తాళాలు బండి డిక్కిలో వున్నాయని బండి డిక్కి తీద్దామనుకునే లోపు ఇందాక ఆ పంచర్‌ అబ్బాయికి 500తో బాటు బండి కీ ఇచ్చిన విషయం. ఆ అబ్బాయి బండిని రోడ్‌కు అడ్డంగా వుండకుండా సైడ్‌కు జరిపి కీ జేబులో వేసుకున్న విషయం గుర్తొచ్చింది. అంటే నేనిప్పుడింటికి వెళ్ళాలంటే కీ కావాలి. కీ కావాలంటే పెప్ప్‌ డిక్కి తెరవాలి. పెప్ప్‌ డిక్కి తెరవాలంటే మళ్ళీ పంచర్‌ అబ్బాయి రావాలి. అయ్యో పొరపాటు చేశానే? ఎలా వెళ్ళేది. ఎలా?
టైమ్‌ చూశా 1 గంట. పోలీసు పెట్రోలింగ్‌ జీపు అటుగా వచ్చింది. మేడమ్‌ ఏంటిక్కడీ అన్నారు ప్రశ్నార్థకంగా పెప్ప్‌ను చూపుతూ పంచర్‌ అయ్యింది. ట్యూబ్‌ తేవడానికి వెళ్ళాడు అన్నాను. జాగ్రత్తలు చెప్పి త్వరగా ఇంటికి వెళ్ళమని అవసరమైతే కాల్‌ చెయ్యమని నంబర్‌ ఇచ్చి మరీ వెళ్ళాడు. కాస్త అటు ఇటు చూస్తున్నా దూరంగా ఓ బైక్‌ లైట్‌ హైవే నుండి సర్వీసు రోడ్‌లోకి దిగి కన్పించింది. చాలా స్పీడ్‌గా వస్తోంది. నాకు ఒక్కసారి ఉదయం చదివిన న్యూస్‌ గుర్తొచ్చింది.
ఔను వాళ్ళు నా దగ్గరగా వస్తున్నారు. చైన్‌ లాక్కెళితే? చుట్టూ చూశాను. జనసంచారం అసలు లేదు. వాడు లాక్కెళ్శినా ఏమీ చేయలేను?
ఎలా?
లాక్కెళితే?
ఔను లాక్కెళితే?
అంత త్వరగా తెగుతుందా?
ఏమో?
వాడు చైన్‌ లాగితే నేను ఊరకే చూస్తూ వుండనుకదా?
మరేం చెయ్యాలి?
నేను వాడి బైక్‌ను తోసేస్తా!
అవును బైక్‌ తోసేయాలి.
వాడు పడితే లేచాక గొడవ చేస్తాడా
మరి పడ్డవాడు ఊరికే వుంటాడా
కచ్చితంగా గొడవ చేస్తాడు వాడి దగ్గర చాకు కత్తిలాంటివి ఏమైనా వుంటే? పొడుస్తాడు, ఔనా పొడుస్తాడు.
ఎలా? వాడిని ప్రతిఘటించాల్నా వద్దా. అందరిలా నేను పోగొట్టుకొని ఓ రోజు ఏడ్చి పోలీసు కంప్లెట్‌ ఇచ్చి వూరకే స్టేషన్‌ చుట్టూ తిరగాలా... వాడు దండలాగితే నేను కచ్చితంగా ఎదుర్కొంటాను గొడవైనా పర్లేదు.
నేను వాడి బైక్‌ను తోసేయాలి. గట్టిగా వాళ్ళిద్దరు కిందపడేట్టుగా
తోయాలి. అవును తోయాలి.
ఐనా బండి స్పీడ్‌లో వుంది కాబట్టి కొంచెం బలమేచాలు ఒక్కతోపు తోస్తాను.
వాళ్ళు కచ్చితంగా పడ్తారు. ఆ లోపు ఎవరో ఒకరు వస్తారు. రాకపోతే రాకపోయినా పర్లేదు.
i shouid protect my self. yes i can ican i can

బండి నాకు దగ్గరగా వస్తోంది.
అవును నేను రెడీగా వున్నాను. వెహికల్‌ దగ్గరకు రాగానే బలంగా తోసేస్తాను. ready ready i can i can అనుకుంటున్నా.....
ఆ బైక్‌ కాస్త స్లో అవుతోంది. ఇంకా స్లో అంటే వాళ్ళు చైన్‌ లాగాక స్పీడ్‌ పెంచుతారేమో. ok. ఇదీ మేలే తోసేయడం సులభం.
గట్టిగా అరవడానికి టైమ్‌ సరిపోతుంది.
దూరంగా పెద్ద లారీ వస్తున్న దానికి గుర్తుగా powerful lights కన్పిస్తున్నాయి.
yes ఇదే మంచి సమయం వీళ్ళను వదలను. బండి నంబర్‌ గుర్తు పెట్టుకుంటా.
వెంటనే కంప్లైంట్‌ చేస్తా. చైన్‌ను పోనివ్వను వీళ్ళను వదలను.
yes నేను ready వచ్చేస్తోంది. దగ్గరగా..వచ్చేస్తోంది.
బాగా స్లో, బాగా స్లో....నా దగ్గరగా వచ్చి ఆగింది. వాడు chain లాగుతాడా? నేను బైక్‌ తోసేయనా?
నా ఆలోచనలకు బ్రేక్‌ వేస్తూఏంటి మేడమ్‌ బండి ప్రాబ్లమా? అన్నాడొకబ్బాయి.
నేనంత సేపు వున్న మానసిక స్థితికి పూర్తిగా విరుద్ధంగా ఆ పలకరింపు ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళిద్దర్నీ తేరిపారా చూశాను.
ఔనన్నట్లు తలూపాను.
షాపులో ఎవరూ లేరా అన్నాడు మళ్ళీ.ట్యూబ్‌ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. చెప్పాను. పొడిపొడిగా.
ఎక్కడికి? చౌరస్తా
ok ఒకబ్బాయి వెంటనే బండి దిగాడు.. మరొకనితో నీవెళ్ళి shops దగ్గరెవరైనా పంచర్‌ అబ్బాయి ట్యూబ్‌తో కన్పిస్తే త్వరగా తీసుకొచ్చెరు అన్నాడు ఒకడు. నాకు తోడుగా కాస్త దూరంగా నిలబడ్డాడు. మరొకబ్బాయి బైక్‌పై చాలా వేగంగా వెళ్ళాడు. వున్నవాడు మొబైల్‌ తీసుకొని ఎవరితోనో మాట్లాడాడు. లేట్‌ అవుతుందని చెప్తున్నాడు.
ఓ ఐదు, పది నిమిషాలు గడిచాయి.
బైక్‌లో వెళ్ళినవాడు పంచర్‌ అబ్బాయితోబాటు వచ్చాడు. చాలా స్పీడ్‌గా కొత్త ట్యూబ్‌ ఎక్కించడం గాలి కొట్టేయడం జరిగిపోయింది. పంచర్‌ అబ్బాయి ట్యూబ్‌ కొనగా మిగిలిన డబ్బులు నాకిచ్చి షాపు తెరిపించడానికి లేట్‌ అయ్యింది సారీ మేడమ్‌ అంటూ చేయి చాచాడు. రూ.50 తీసిచ్చా
మిగిలిన చిల్లర డిక్కిలో వేసి ఆ అబ్బాయిల కళ్ళలోకి ఒక్కసారి చూశాను. పర్వాలేదాంటీ మీరు స్టార్ట్‌ చెయ్యండి.
మేం వెనకాలే వస్తాం అన్నాడు ఆ అబ్బాయి.
నేను pep start చేశా.
రాత్రి 1:30. చల్లగాలి ప్రశాంతంగా అన్పించింది. నా బండి వెనకగా కాస్త దూరంలో వాళ్ళ బైక్‌ నాకు రేర్‌ వ్యూ మిర్రర్‌లో కనబడుతోంది.
ఓ ఐదు నిమిషాల్లో ఇల్లు చేరా.
డిక్కీలోని ఇంటి కీ తీసి లాక్‌ తీసి గేట్‌ దగ్గర లైట్‌ వేశా. ఆ వెలుగులో ఆ అబ్బాయి ముఖాలు ప్రశాంతంగా కాస్త అలసటగా కన్పించాయి. అంటీ మేం వెళ్తాం అన్నాడాబ్బాయి.
మీరు అడగబోయి ఆగా....''ఎగ్జామ్స్‌ టైమ్‌ కదా అంటీ కంబైన్డ్‌ స్టడీస్‌ అయిపోయాక ఇంటికి బయలు దేరాం. దార్లో మీరొక్కరే కన్పిస్తే మిమ్మల్ని సేఫ్‌గా ఇల్లు చేర్చాలన్పించింది.
వెళ్తాం మాకు మార్నింగ్‌ 8కు ఎగ్జామ్‌ వుంది'' అంటూ బైక్‌ స్టార్ట్‌ చేశారు.
ఒక నిముషం
ఆగారు. ''చెప్పండాంటీ...''
''మీ అమ్మ ఫోన్‌ నెంబర్‌ ఇవ్వవా.'' అడిగా అర్థింపుగా.
''దేనికాంటీ,'' ప్రశ్నార్థకంగా అడిగారు.
''ఒక్కసారి థ్యాంక్స్‌ చెప్పాలి'' అన్నా. గబగబ అబ్బాయి చెప్పిన నెంబర్‌ మొబైల్‌లో సేవ్‌ చేసుకున్నా. వాళ్ళ బైక్‌ వేగంగా ముందుకెళ్ళి పోయింది.
ప్రశాంతమైన చల్లగాలితో పారిజాతాల పరిమళం నన్ను తాకుతోంది.
ఒక్కసారి నాకు యూత్‌పై వున్న అభిప్రాయం మారిపోయింది.
సమాజం మంచి చెడుల కలబోత. దేన్నో ఒకదాన్ని చూసి అలాగే వుంటుందన్న ఆలోచన మారాలి. చెడును ఎదుర్కున్నంత సమర్థంగా మంచిని సమర్థించాలి. చెడుకు పబ్లిసిటీ తగ్గించి దానికంటే మంచికి పబ్లిసిటీి కావాలి. ఈ న్యూస్‌ రేపు పేపర్‌లో రావాలి. అది చూసి నాలా భయపడ్డ వాళ్ళు కూడా ధైర్యాన్ని పొందాలి. అందరూ ఒకలా వుండరు. సమాజంలో నీతి నియమాలు ఇంకా వున్నాయంటే ఇలాంటి యువతే కారణం. తన అభివృద్ధితో బాటు ఆర్తులకు సహాయాన్ని అందించగలుగుతున్న ఓ యువతా నీకు జోహారు. రేపు ఉదయాన్నే ఫస్ట్‌ కాల్‌ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మకు చేయాలి.
ఆమె పెంపకానికి ఒక్కసారి హ్యాట్సాఫ్‌ చెప్పాలి అనుకున్నా. ఉదయం చూసిన వార్తకు ఇప్పటి సంఘటనకు కార్యకరణాలు బేరీజు వేసుకుంటున్నా యువతకు చక్కటి భవిత, చక్కటి సమాజం ఆరోగ్యకరమైన సమాజం.ఆనందం జీవితం అన్నీ నాముందు పచ్చగా కనపడుతున్నాయి. హాయిగా వుంది.
మనసంతా మల్లెలవాన
కురిసినంత హాయిగా ఉంది.

- కళ్యాణ దుర్గం స్వర్ణలత

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.