కుక్క బతుకే మేలు

(ఈ కథ 07 జులై, 2013న ఆంధ్రభూమి మెరుపు శీర్షికలో ప్రచురితమైంది)

ఏమయిందో ఏమో సాయంత్రం నుండి భైరవ మూలుగుతూ, మధ్యమధ్యలో మెల్లగా అరుస్తూనే ఉంది. ఆగోల భరించలేకపోతున్నాను. రాత్రివేళల్లో భైరవ అరుపులు అలవాటైనవే అయినా ఈరోజెందుకో భైరవ అరుస్తుంటే భరించడం కష్టంగా ఉంది. మంచం మీద లేచి కూర్చున్నాను. మెల్లగా మంచం అంచుకు జరిగి అక్కడున్న చేతికర్ర అందుకున్నాను.

చేతికర్ర సాయంతో లేచి నిలబడ్డాను. మోకాళ్లు వణుకుతున్నా మెల్లగా వరండాలోకి వెళ్లి చూసాను. భైరవ ఒక మూలన పడుకుని మూలుగుతోంది. భైరవ అంటే మీకు ఈ పాటికే అర్ధమయి ఉంటుంది మా ఇంట్లో కుక్క అని. అప్పుడే అబ్బాయి సుందరం కూడా తన గదిలో నుండి బయటకు వచ్చాడు. భైరవ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. భైరవ తలను ఒళ్లో పెట్టుకుని నెమ్మదిగా తల నిమురుతూ... ‘‘ ఏమైందిరా భైరవా... అలా మూలుగుతున్నావు? ఒంట్లో బాలేదా’’ అని అడిగాడు.

అబ్బాయి అడిగిన దానికి సమాధానంగా భైరవ తల పైకెత్తి నీరసంగా చూసి పడుకుని మూలుగుతోంది. భైరవకు ఒంట్లో బాగోలేదు అనుకుంటూ అబ్బాయి తన గదిలోకి వెళ్లి సెల్‌ఫోన్‌తో బయటికి వచ్చాడు. వెటర్నరీ డాక్టర్‌కి ఫోన్ చేసినట్లున్నాడు ‘‘డాక్టర్‌గారూ! మా భైరవకి ఒంట్లో బాలేదు. సాయంత్రం నుండి మూలుగుతోంది. బాగా బాధ పడుతోంది’’ అని చెప్పాడు. ‘‘...........’’ ‘‘అలాగే వస్తున్నా డాక్టర్‌గారూ’’ అంటూ ఫోన్ ఆఫ్ చేసి గబగబా డ్రెస్ మార్చుకుని మోటారు బైకు మీద బయటికి వెళ్లాడు. ఈమధ్య ఎక్కువ సేపు నిలబడితే నాకు తల తిరుగుతున్నట్లు ఉంటోంది. నాలుక ఎండిపోతున్నట్లు కూడా అనిపిస్తోంది. మంచినీళ్లు తాగడానికి మంచం దగ్గరకి వెళ్లి పక్కనే ఉన్న వాటర్ జగ్గు అందుకున్నాను. జగ్గులో నీళ్లు లేవు. మెల్లగా కాళ్లీడ్చుకుంటూ వంటింట్లోకి వెళ్లి బిందెలో నీళ్లు తీసుకుని తాగాను. జగ్గు నిండా నీళ్లు నింపుకుని మంచం దగ్గర స్టూలు మీద పెట్టుకున్నాను. అసలే వయసు పైబడింది. చివరి దాకా తోడుగా ఉంటుందనుకున్న నా భార్య కాంతం నన్ను వదిలిపెట్టి పరలోకానికి వెళ్లిపోయింది. బయట అబ్బాయి వచ్చినట్లున్నాడు.

కిటికీ దగ్గరికి వెళ్లి చూసాను. వెటర్నరీ డాక్టరును వెంటబెట్టుకుని వచ్చాడు. భైరవను పరీక్షించి మందులు వేసాడు. డాక్టర్ వెళ్లిపోయాక అబ్బాయి పాత గొంగళిలాంటిది తీసుకొచ్చి భైరవకు కప్పి ‘‘బజ్జో... బజ్జో...’’ అంటూ తల మీద నిమురుతున్నాడు. నేను ఎక్కువ సేపు నిలబడలేక మంచం మీద చేరబడ్డాను. గొంతు తడారిపోతోంది. తల తిరుగుతున్నట్లుంది. మైకంలోకి జారిపోతున్నట్లుంది. ఈ మధ్య తరచూ ఇలాగే జరుగుతోంది. ఉదయం డాక్టరు దగ్గరకు తీసుకెళ్లమని అబ్బాయిని అడగాలని అనుకున్నాను.

అర్ధరాత్రి దాటింది. గబుక్కున మెలకువ వచ్చింది. భైరవకు మందులు వేసాక మూలుగు తగ్గినట్లు ఉంది. చేతికర్ర పట్టుకుని మెల్లగా కిటికీ దగ్గరకు వచ్చి చూసాను. భైరవ చక్కగా పడుకుంది. అబ్బాయి అక్కడే, మరో కుర్చీలో కాళ్లు చాపుకుని కునుకు తీస్తున్నాడు. భైరవ అంటే అబ్బాయికి ప్రాణం మరి. మంచం మీద పడుకున్నాను గానీ ఒంట్లో నలతగా ఉండడం వల్ల తెల్లార్లు నిద్ర పట్టలేదు. ఉదయం కోడలు ఇచ్చిన టీ తాగాక మెల్లగా వరండాలోకి వచ్చి కూర్చున్నాను. భైరవ ఆరోగ్యం కుదుట పడినట్లుంది. అటు ఇటు హుషారుగా కలియదిరుగుతోంది. తొమ్మిది కావచ్చింది. అబ్బాయి ఆఫీసుకి వెళ్లడానికి తయారవుతున్నాడు.

‘‘అబ్బాయి సుందరం’’ పిలిచాను.

‘‘ ఏం కావాలి?’’ అడిగాడు.

‘‘ ఏం లేదురా! ఈ మధ్య తరచూ తల తిరుగుతున్నట్లు మైకంలోకి జారుతున్నట్లు ఉంటోంది. ఒకసారి డాక్టర్ దగ్గరకి తీసుకెళతావేమోనని’’ అన్నాను.

ఒక్కసారే రయ్యిమని లేచాడు వాడు.

‘‘ ఒంట్లో బాగోలేకపోతే కళ్లు మూసుకుని పడుకో. అయినా బాగుంటే మాత్రం నీవు చేసేదేముంది గనుక?’’

‘‘అది కాదురా...’’ ఏదో చెప్పబోయాను.

‘‘నీవు మరింక ఏమీ చెప్పనక్కరలేదు. పెట్టింది తిని పడుకో. నిన్ను నేను డాక్టర్ల చుట్టూ తిప్పలేను. ఆ ఖర్చులు కూడా భరించలేను’’ అంటూ బైకు స్టార్ట్ చేసుకుని ఆఫీసుకి వెళ్లిపోయాడు. అబ్బాయి అంత కఠినంగా మాట్లాడేసరికి నన్ను నిస్సత్తువ ఆవరించింది. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది. ఇంక వరండాలో కూర్చోలేక మెల్లగా కాళ్లీడ్చుకుంటూ గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయాను. భైరవకు ఒంట్లో బాలేదని రాత్రికి రాత్రి డాక్టర్‌ని తీసుకొచ్చి వైద్యం చేయించాడు.

తెల్లార్లు దాని పక్కనే కుర్చీలో కునుకు తీసాడు. నోరు లేని జంతువు అడకపోయినా తానే తెలుసుకుని అన్ని సపర్యలు చేసిన అబ్బాయి నాకు ఒంట్లో బాగోలేదు, డాక్టరు దగ్గరకి తీసుకెళ్లమని అడిగితే అంతెత్తున ఎందుకు లేచాడు? అర్ధం కాలేదు నాకు. వాడికి భైరవ మీద ఉన్న ప్రేమ, అభిమానం వీసమెత్తు కూడా నా మీద లేవే అని నా మనసు వికలమయింది. ఈనాటి పిల్లల్లో మానవ సంబంధాట పట్ల విలువ లేకుండా పోతోంది అనిపించింది. ఛీ... ఛీ... ఈ ఇంట్లో నాది కుక్క బతుకు కంటే హీనంగా ఉంది. నాకు తెలియకుండానే నా కళ్లు కన్నీటి పర్యంతమయ్యాయి. అయినా నేనేం చేయగలను? ఊపిరి ఉన్నంత కాలం శారీరక, మానసిక బాధలతో కాలం వెళ్లబుచ్చడం తప్ప...

- అనుపోజు అప్పారావు, సెల్ : 9247552649

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.