దత్తత !

“ఒక ప్రముఖ సినీ హీరో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు . ఆ పనిమీద ఆ గ్రామాన్ని చూడటానికి వస్తున్నారు . ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజలలో ఆయన పరపతి విపరీతంగా పెరిగిపోయింది”.......... ఈ వార్తలు విన్నప్పటినుండి విశాల్ ఎంతో ఆనందంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన విశాల్ అభిమాన హీరో.. ఆయన దత్తత తీసుకున్న గ్రామం విశాల్ స్వగ్రామం !!!!

“ప్రొద్దునే ఎన్ని మంచివార్తలు విన్నాను. ఒకవైపు నా అభిమాన హీరో మా గ్రామానికి వచ్చే రోజు దగ్గర పడుతోంది.ఇంకోవైపు చేయవలసిన పనులు చాలా మిగిలిపోయాయి ” అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో గబగబా తయారై గ్రామంలో తనవాళ్ళనందరిని కూడగట్టడానికి బయలుదేరాడు.

“దత్తత” అంటే విశాల్ కి ఎంతో గౌరవం. అతని తల్లిదండ్రులకి విశాల్ దత్తపుత్రుడు కావటంవలన అదంటే కూడా ఏమిటో చాలా బాగా తెలుసు.

సుధీర్, స్వాతి దంపతులు తమకి చాలాకాలం వరకు పిల్లలు పుట్టక పోవటంతో విశాల్ని దత్తత తీసుకున్నారు. వాడికి అప్పటికి మూడు సంవత్సరాలు. వాడు పుట్టుకతో అనాధ కాదు. వాడి తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోతే చేసేవాళ్ళెవరూ లేకపోవటంతో అనాథాశ్రమానికి రావలసి వచ్చింది. వచ్చిన కొన్నాళ్లకే వాడి అదృష్టం కొద్దీ సుధీర్, స్వాతి దంపతులచే దత్తత తీసుకోబడ్డాడు. సుధీర్ స్వాతిల నించి అమితమైన ప్రేమ లభించటంతో క్రమేపి విశాల్ కన్న తలిదండ్రులను మర్చిపోగలిగాడు.

విశాల్ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం సుధీర్ దంపతులకు అన్నిటా బాగా కలిసి వచ్చింది. ఏడాది తిరక్కుండానే స్వాతి పండంటి పాపని కన్నది. పాపకి “వైశాలి” అని పేరు పెట్టారు.

విశాల్ పెరిగి పెద్దవుతున్నకొద్దీ కొంతమంది వాడిని “వైశాలి వాళ్ళ కన్నబిడ్డ. నువ్వేమో దత్తపుత్రుడివి, ఇంక నిన్ను పట్టించుకోరులే” అంటూ భయపెట్టడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆ మాటలని వాడు నమ్మలేదు. అటు సుధీర్, స్వాతి కూడా అలాంటి మాటలని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశారు.

విశాల్, వైశాలి ఎంతో అన్యోన్యంగా ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రాణంగా పెరిగారు. చెల్లెలి పైన ఈగ కూడా వాలనిచ్చేవాడు కాదు విశాల్. అన్నయ్యంటే అమితమైన గౌరవం, ప్రేమ వైశాలికి. చదువులో కూడా ఇద్దరు ఫస్టే ! విశాల్ “లా” లో పట్టభద్రుడై సొంత ఊర్లోనే ప్రాక్టీసు పెట్టి పేదవారి కేసులు ఉచితంగా వాదిస్తూ “మంచి లాయరు” గా పేరు సంపాదించుకున్నాడు. వైశాలి కాలేజీలో సైన్సు లెక్చరర్ గా పనిచేస్తోంది.

“దత్త పుత్రుడినైనప్పటికి నాకు ఎంతో ప్రేమ లభించింది ఈ ఇంట్లో, అలాంటిది ఒక గొప్ప హీరో మా గ్రామాన్ని “దత్తత” తీసుకుంటున్నాడంటే మా గ్రామం తప్పక బాగుపడుతుంది “ ఇదీ విశాల్ ఆశ . ఆ సదరు హీరో అభిమాన సంఘ అధ్యక్షుడు విశాల్. ఆయనచే వాళ్ళ గ్రామం “దత్తత” విషయం తెలిసిన వెంటనే ఊళ్లో యువతనందరినీ సమావేశపరచి హీరోగారి స్వాగతంకోసం ఏర్పాట్లు చేయటానికి ఉద్యుక్తుడయ్యాడు . గ్రామం అంతా అభిమాన హీరోని చూద్దామని గుమిగూడింది , పైగా గ్రామం “దత్తత” గురించి ఆయన ఏం చెప్తారోనని అందరూ ఆత్రంగా ఎదురుచూడసాగారు.

హీరో వచ్చే సమయం దాటి గంటల గడుస్తున్నాయి.. కానీ ఆయన వచ్చే జాడలే లేవు. అందరికీ కళ్ళు కాయలు కాసాయి ఎదురు చూసి చూసి . ఆయన రాకపోయేటప్పటికి గాలి తీసిన బుడగల్లా నిరుత్సాహపడిపోయారు.

“అత్యవసరమైన పని రావటంవల్ల హీరో రాలేక పోయారని , తిరిగి ఎప్పుడు వచ్చేది తెలియజేస్తామని” వార్త వచ్చింది విశాల్ కి.

“పోనిలే పాపం నిజంగానే ఏదో పని వచ్చి ఉంటుంది లేకపోతే ఆయన ఇచ్చిన మాటని తప్పేవాడు కాదు” అనుకున్న విశాల్ అందరిని సమాధాన పరిచాడు.

ఆ క్షణంలో విశాల్ ఊహకి కూడా అందని విషయమేమంటే సదరు హీరో ఎప్పటికీ వాళ్ళ గ్రామానికి రాబోరని!!????

అలా ఆ తరువాత చాలాసార్లు హీరో వస్తానని రాక పోవడం, ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడం జరిగింది. ఇలా కాదని విశాల్ ఒకసారి స్వయంగా వెళ్ళి హీరోని కలుసుకుని మాట్లాడటం కూడా జరిగింది . అభిమాన సంఘ అధ్యక్షుడు కనుక అప్పటికి విశాల్తో ఎంతో మర్యాదగా మాట్లాడి వాళ్ళ గ్రామానికి తప్పక త్వరలోనే వస్తానని వాగ్దానం చేసి విశాల్ ని పంపించేశాడు. కానీ ఎప్పటిలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు! ఇలా ఒక సంవత్సరం గడిచింది.

హీరో ఆధ్వర్యంలో గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న విశాల్ కి ఆయన నిర్లక్ష్య ప్రవర్తన వల్ల ఎంతో ఖేదం కలగటమే కాకుండా విపరీతమైన ఆగ్రహం కూడా వచ్చింది.

“మా గ్రామాన్ని దత్తత చేసుకుంటానంటూ ప్రకటన చేసి సంవత్సరమవుతున్నా.. ఇప్పటివరకూ గ్రామం ముఖమైనా చూడలేదు, ఎన్నోసార్లు వస్తానని చెప్పి అన్నిసార్లు ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇటు గ్రామస్థులను, అటు గ్రామాన్నీ నిర్లక్ష్యం చేశారు “ అని అభియోగం చేస్తూ ఆ సదరు హీరోపై కోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశాడు విశాల్. ప్రజా శ్రేయస్సుకోసం దాఖలైన వ్యాజ్యం కనుక విచారణకు స్వీకరించబడింది.

హీరోకి కోర్టు నోటీసులు జారీచేయడం జరిగింది. “ప్రఖ్యాత హీరోకి కోర్టు నోటీసులు” అన్న విషయం జన మాధ్యమంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. హీరోకి చిర్రెత్తుకొచ్చింది విశాల్ పై. భగ భగా మండిపోయాడు.

వ్యాజ్యం విచారణ మొదలయ్యింది. వాదోపవాదాలు ముగిశాయి. ప్రజల తరఫున న్యాయవాదిగా విశాల్ నియమితుడయాడు. ప్రతివాది లాయరు బలంగా వాదించి హీరోని కాపాడటానికి విశ్వప్రయత్నం చేశాడు.

ఆ రోజు జడ్జిగారు ఇరుపక్షాల కథనాల ప్రకారం తీర్పు చెప్పే రోజు, హీరో తరఫున లాయరు చెప్పవలసినది ముగించి కూర్చున్నాక విశాల్ మాట్లాడే సమయం వచ్చింది.

“గౌరవనీయులైన జడ్జిగారు అనుమతిస్తే నేను ఒక ముఖ్య విషయం విన్నవించుకుంటాను” అభ్యర్థించాడు విశాల్

“సరే మీరు చెప్పదలచినది కోర్టు సమయం ఎక్కువ వృధాకాకుండా సంక్షిప్తంగా చెప్పండి” అన్నారు జడ్జిగారు .

“దత్తత తీసుకోవడమనేది ఒక గురుతరమైన బాధ్యత. ఒక వ్యక్తినిగాని , గ్రామాన్నిగాని దత్తత తీసుకోవడమంటే వారి సొంతవాటికంటే ఎంతో ఎక్కువగా దానిని పరిగణించాలని నేను విశ్వసిస్తాను. అందుకు ఉదాహరణ నా జీవితమే. నా తల్లిదండ్రులకు నేను దత్త పుత్రుణ్ణి . కానీ ఆ భావం ఏనాడూ కలుగనీయకుండా. ఎటువంటి లోటు రానీయకుండా సొంతబిడ్డతో సమానంగా నన్ను వారు చూసుకున్నారు. అందుచేతనే నా అభిమాన హీరో మా గ్రామాన్ని దత్తత చేసుకున్నారని తెలిసిన రోజున నేను ఎంతో ఆనందించాను.

ఒక బిడ్డని దత్తత తీసుకుని జీవితాన్నిచ్చిన నా తల్లిదండ్రులు ఎంతో గొప్పవారు . అలాంటిది మా గ్రామాన్ని దత్తత చేసుకుని ఇంత మందిని తన బిడ్డలుగా భావించి వారి శ్రేయస్సుకోసం పాటుపడడానికి ముందుకు వచ్చిన ఆ హీరో నిజంగా దేవుడే అనుకుని మురిసిపోయాను. నా జీవితంలా మా గ్రామం కూడా బాగుపడుతుందని ఆశించాను. నా ఊహాలు తారుమారయ్యాయి, ఆయనకోసం ఎదురుచూసి చూసి మా గ్రామస్థుల ఆశలు అడియాశలయ్యాయి. స్వయంగా కలుసుకుని మాట్లాడిన అనంతరం కూడా సంవత్సరం కావస్తున్నా హీరోగారు మా గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. ఆయన తీరునిబట్టి చూస్తుంటే పేరు కోసం “దత్తత” ప్రకటించారని సందేహం కలిగింది. అదే ఈ నిర్ణయానికి దారితీసింది” అంటూ జడ్జిగారికి విన్నవించుకున్నాడు విశాల్.

విశాల్ చెప్తున్నంతసేపు అతని ముఖకవళికలనే గమనిస్తూ ఆసాంతం ఎంతో ఆసక్తిగా విన్న జడ్జిగారికి అతని మనోగతం అవగతమైంది. జడ్జిగారు తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది . తీర్పు వారికే అనుకూలంగా వస్తుందని హీరో, ఆయన లాయరు ధీమాగా ఉన్నారు. జడ్జిగారి ఏం తీర్పు ఇస్తారోనని అక్కడ గుమిగుడిన గ్రామస్థులంతా ఆత్రంగా ఎదురుచూస్తుంటే విశాల్ మాత్రం ముఖంలో ఏ భావం కనపడనీయకుండా వేచిచూస్తున్నాడు.

”విశాల్ అనే ఈ యువకుడు చెప్పినది విన్న తదుపరి వాళ్ళ గ్రామం అభివృద్ధిపై అతను ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో విశదమవుతున్నది. గ్రామాన్ని “దత్తత ” తీసుకుంటున్నట్లుగా నామ మాత్రపు ప్రకటన చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా జాప్యంచేసి నిర్లక్ష్యం వహించటమే కాకుండా పలుమార్లు వస్తానని చెప్పి మాట ఇచ్చి రాకుండా తప్పించుకుని గ్రామస్థుల సమయాన్ని వృధా చేశారు హీరో. అందుచేత హీరోగారు గ్రామాభివృద్ధికోసం, సత్వరం కార్యక్రామాలు చేపట్టి వాటిని స్వీయ పర్యవేక్షణలో త్వరితగతిన ముగించవలసినదిగా.. ఈ ప్రక్రియలో విశాల్ సహకారం తీసుకొనవలసినదిగా ఆదేశించడమైనది. గ్రామస్థుల అమూల్యమైన సమయం వృధాజేసినందుకుగాను ఒక్కొక్క ఇంటికి రూ .2000/- చొపున పరిహారం చెల్లించవలసినదిగా జరిమానా విధించడమైనది.

విశాల్ ని దత్తత తీసుకుని ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దిన అతని తల్లిదండ్రులను మనఃస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దత్త పుత్రుడిగా అతని జీవితం బాగుపడినట్లే “దత్తత” తీసుకొనబడిన అతని గ్రామంకుడా సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆశించి, ఆ ఆశయం నెరవేరే దిశగా పోరాడి విజయం సాధించిన విశాల్ని అభినందిస్తున్నాను “ అని జడ్జిగారు తీర్పు చెప్పారు.

“విశాల్కి జై , హీరోకి జై “ అనే నినాదాలతో కోర్టు ప్రాంగణమంతా మారుమ్రోగిపోయింది. గ్రామస్థులందరితో పాటు హీరో కూడా తనను అభినందనలతో ముంచెత్తుతుంటే విశాల్ ఆనందం అవధులు దాటింది.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.