గురివింద గింజలు

స్వాతి వంటింట్లో పనిచేసుకుంటోంది . ఇంతలో “అమ్మా ఇవి చూడు !” అంటూ తొమ్మిదేళ్ళ శిరీష బయట ఆడుకుంటున్నదల్లా ఒగర్చుకుంటూ వచ్చి తన దోసిలి తెరిచి చూపించింది తల్లికి .

“ఏమిటమ్మా “ అంటూ చూసిన స్వాతికి కూతురు దోసిలినిండా ఎక్కువ ఎరుపు కొంచం నలుపు రంగులో ఉన్న చిన్న చిన్న గింజలు కనిపించాయి .

”అమ్మా ఈ గింజలని ఏమంటారమ్మా?” అడిగింది శిరీష

“వీటిని గురివింద గింజలు అంటారు”

“ఎరుపు నలుపు రంగులలో ఉండి ఇవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదమ్మా” అంది శిరీష.

“అవును కానీ ఇవెక్కడివి నీకు?” అన్న తల్లి ప్రశ్నకి బదులుగా గల గలా ఏమేమో చెప్పేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది శిరీష.

‘అవును గురివిందగింజలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి నాకూ అవంటే చాలా ఇష్టం కానీ బాధ కలిగించే విషయమేమిటంటే ఈ గింజలు పైన ఎరుపు క్రింది భాగం నలుపు కలిగి ఉండటంవలన , తమ తప్పులు గ్రహించకుండా ఎదుటివాళ్ళ తప్పులు ఎత్తిచూపించే మనస్తత్వం గల మనుషులను గురివింద గింజలతో పోల్చడం!’ అనుకుంది స్వాతి....................

వర్ధనమ్మగారి ఇంట్లోని ఒక వాటాలోకి స్వాతి వాళ్ళు ఈ మధ్యనే అద్దెకు దిగారు. స్వాతి మంచి కలుపుగోలు మనిషి. వర్ధనమ్మగారిని చూడగానే సొంతమనిషిలా అనిపించి ఆవిడంటే అభిమానం కలిగింది. దానితో తరచూ ఆవిడ వద్దకు వచ్చి కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటుంది. ఆవిడ చిన్న చిన్న అవసరాలు తీరుస్తుంటుంది.

కొంతకాలానికి స్వాతి వర్ధనమ్మగార్ల స్నేహం పెరిగి పెరిగి తమ స్వవిషయాలు ముచ్చటించుకునేదాకా వెళ్ళింది. ఆ సంభాషణలలో ఆవిడగురించి స్వాతికి తెలియవచ్చిన వివరాలు : ఆవిడకు ఇద్దరు అమ్మాయిలు. పిల్లలిద్దరూ చిన్నవయసులో ఉండగానే భర్త అకాల మరణం చెందటంతో ఆవిడ ఒంటరిగానే వాళ్ళని పెంచి పెద్దచేశారు. ఆవిడ ఒక ప్రభుత్వ ఉద్యోగిని. పదవిలో ఉండగానే ఇద్దఋ కూతుళ్ళకి వివాహం చేసేశారు. పెద్ద కూతురు అల్లుడు హర్యానా లో ఉంటున్నారు. అక్కడ పెద్ద అల్లుడుది రియల్ ఎస్టేట్ వ్యాపారం. చిన్న కూతురు అల్లుడు ఉద్యోగాలతో విశాఖ పట్టణం లో ఉంటున్నారు . గవర్నమెంటు ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన అనంతరం వచ్చిన డబ్బుతో వర్ధనమ్మగారు ఒక ఇల్లు కొనుక్కుని ప్రస్తుతం అందులో ప్రశాంత జీవనం గడుపుతున్నారు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆంధ్రాలో ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరుగుతుండటంతో హర్యానాలో ఉన్న కూతురు అల్లుడు గుంటూరు వచ్చేసి అదే వ్యాపారం ఇక్కడ మొదలు పెట్టుకుందామని నిర్ణయించుకున్నారని ఆవిడ ద్వారా తెలిసింది స్వాతికి.................

ఒకరోజు మాటల సందర్భంలో వర్ధనమ్మగారు “మీ అమ్మాయి చదువుతున్న స్కూలు పేరేమిటని చెప్పావు స్వాతీ ?” అని అడిగారు

“కిరణ్ పబ్లిక్ స్కూలు” అని “ఎందుక అడుగుతున్నారు ఆంటీ?” అంది

“నీకు చెప్పాను కదా మా పెద్దమ్మాయి వాళ్ళు గుంటూరు వచ్చి స్థిర పడదామని అనుకుంటున్నారని”

“అవును”

“వాళ్ళ అబ్బాయిని అంటే నా మనుమడిని ఇక్కడే ఏదైనా మంచి స్కూలులో చేర్పించుదామని అనుకుంటున్నారు. అందుకని అడుగుతున్నాను”

“అలా అయితే ఇంతకంటే మంచి స్కూలు ఇంకోటి ఉంది . పేరు ‘సంయుక్త పబ్లిక్ స్కూలు’ . అందులో కొంచం ఫీజు ఎక్కువని మేము చేర్పించలేదు . మీరు మీ మనుమడికి అందులో ప్రయత్నించవచ్చు”

“అవును నువ్వు చెప్పింది బాగానే ఉంది. నువ్వు కొంచం ఆ వివరాలు సేకరించగలవా?”

“అలాగే ఆంటీ” అని స్వాతి , కూతురు స్కూలునించి వచ్చే వేళయ్యిందని వెళ్ళిపోయింది..........

వర్ధనమ్మగారి పెద్దకూతురు వాళ్ళు గుంటూరు మకాము మార్చారు. కూతురు అల్లుడు వర్ధనమ్మగారింటికి రెండువీధుల అవతలే ఇల్లు తీసుకుని అందులో ఉంటున్నారు. ఆవిడ మనవడు ఇప్పుడు ఎనిమిదవ క్లాసు చదువుతున్నాడు. మిగతా స్కూళ్లతో పోల్చిచూస్తే కొంచం ఫీజు ఎక్కువైనప్పటికి చాలా బాగా చదువు చెప్తారని స్వాతి సూచించిన స్కూల్లోనే చేర్పించారు. ఇది జరిగి సుమారు ఆరునెలలయ్యింది.........

ఒకనాడు ఉదయం భర్త ఆఫీసుకి , శిరీష స్కూలుకి వెళ్ళాక స్వాతి కాసేపు వర్ధనమ్మగారి దగ్గర కూర్చుందామని వచ్చింది. అప్పటికే ఆవిడ తీరుబడిగా కూర్చుని పేపరు చదువుకుంటున్నారు.

“ఇవాళ ఆంటీకి పని తొందరగా అయిపోయినట్లుందే ?” అంటూ వచ్చింది స్వాతి.

“అవునమ్మా . పనిమనిషి వచ్చి వెళ్ళగానే వంటకూడా చేసేసుకున్నాను “

“నీ పనంతా అయిపోయిందా ?”

“ఆ! అయింది . ఇంక బట్టలు వాషింగ్ మెషీన్ లో వెయ్యడమే మిగిలింది . కాసేపయ్యాక వెయ్యొచ్చులే అని ఒక సారి మిమ్మల్ని పలకరించి వెళదామని ఇలా వచ్చాను “

“చూశావామ్మా స్వాతీ ఈ అన్యాయం?” అన్నారు ఆవిడ ఉన్నట్లుండి .

“ఏం జరిగింది ఆంటీ ?” అంది స్వాతి ఆవిడ దేనిగురించి మాట్లాడుతున్నారో అర్థంకాక !

“వీడెవరో తన చేతికి మట్టి అంటకుండా చూసుకోవడం కోసం ఆఫీసులో తనకు సహాయకుడిగా ఒక మనిషిని పెట్టుకుని దిట్టంగా లంచాలు వసూలు చేసి లక్షలకు లక్షలు స్వాహా చేశాడుట . మరీ పేట్రేగి పోతున్నారు. లంచగొండితనం పెచ్చు మీరీ పోతోంది మన దేశంలో ................” అంటూ ఇంకేమేమో చెప్పసాగారు.

ఆవిడ చెప్పినది వింటుంటే కొన్ని రోజుల క్రితం వర్ధనమ్మగారు మనవడిని స్కూలులో చేర్పించడంకోసం తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ స్కూలు వాళ్ళకి పెద్ద మొత్తంలో ‘ఆమ్యామ్యా’ తినిపించి ప్రవేశం సంపాదించిన సంఘటన గుర్తుకు వచ్చి , ఒకవైపు తాను లంచ మిచ్చి పని జరిపించుకుని మరొకవైపు ఎదుటివాళ్ళని లంచగొండులని దూషిస్తున్న వర్ధనమ్మగారిని చూసి ‘గురువిందగింజలు’ అని ఈవిడలాంటివారిని చూసే అన్నారు కాబోలు అనుకుని నవ్వుకుంది స్వాతి.

***************

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.