నిశ్చయం

అది ఒక మహా నగరం. ఆ మహానగరంలో ఒక ప్రఖ్యాతి చెందిన బాలబాలికల పాఠశాల. అందులో అన్ని జాతులవారికి ప్రవేశం ఉంది కానీ అగ్రకులాలవారికి మాత్రం ప్రాధాన్యం!!!

హరిశ్చంద్రగారు ఆ స్కూలు ప్రిన్సిపాల్ గా గత నాలుగు సంవత్సరాలనించీ పనిచేస్తున్నారు. మంచి క్రమశిక్షణకు ఆయన పెట్టింది పేరు. విజ్ఞుడు, సహృదయుడు కూడా అయిన ఆయన హయాములో ఆ పాఠశాల సర్వతోముఖాభివృద్ధి చెందింది .

ఉదయం ఎనిమిది గంటలయ్యింది. అసెంబ్లీ టైమయ్యింది. కానీ ఇంకా చాలామంది పిల్లలు రాలేదు.

“ఏమైంది ఇవాళ?”

“అదే నాకు అర్థం కావటంలేదు!”

“నేను స్వయంగా ప్రతి క్లాసుకి వెళ్ళి చూసి వచ్చాను సార్ ! అక్కడ ఎవరూ లేరు”

ప్రిన్సిపాల్ హరిశ్చంద్రగారు , వైస్ ప్రిన్సిపాల్ నారాయణగారు మాట్లాడుకుంటున్నారు.

“సరే !” అనుకుని వచ్చిన పిల్లల చేతనే ప్రార్థన చేయించి , ఆ రోజు వార్తలు చదివించి , జాతీయగీతం ఆలాపన తరువాత ఎవరి క్లాసులలోకి వాళ్ళని పంపించేశారు.

హరిశ్చంద్రగారు నియమం ప్రకారం స్కూలు రౌండ్స్ కి వెళదామనుకుంటుండగా స్కూలు బయట గేటు దగ్గర పెద్ద కలకలం వినిపించింది.

“ ఏమిటో ?” అనుకుంటూ ఆయన అటు వెళ్ల బోతుండగా “నేను చూసివస్తాను “ అన్నారు నారాయణగారు.

గేటు ముందర విద్యార్థుల తల్లిదండ్రులు రెండు వర్గాలుగా నిలబడి నినాదాలు చేస్తున్నారు “మా పిల్లలు ఈ స్కూలులో చదవాలంటే మా డిమాండ్లని వెంటనే అంగీకరించాలి “ అంటూ , వాళ్ళతో పాటుగా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. నారాయణగారికి అప్పుడు అర్థమైంది అసెంబ్లీ లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తక్కువగా ఉందో!!!

“విషయమేమిటి?” అన్న ఆయనకి “ప్రిన్సిపాల్ గారితోనే ఇక మా మాటలు “ అన్న సమాధానం వచ్చింది . విషయం అంతుబట్టక పోయినా వీళ్ళేదో ఇవాళ తాడో పేడో తేల్చుకోవడానికే వచ్చారనిపించింది నారాయణగారికి.

“ఇదేదో జటిల సమస్యలానే ఉందే ?” అనుకుని ప్రిన్సిపల్ హరిశ్చంద్రగారికి తెలియచేద్దామని వెనుతిరిగిన నారాయణగారి దృష్టి తల్లిదండ్రులతో పాటు వచ్చిన పిల్లల మీద పడింది. అక్కడ అగుపడిన దృశ్యం ఆయనకి కొంచం ఆశ్చర్యాన్ని, ఆనందాన్నీ కలిగించింది .

ప్రిన్సిపాల్ గారికి గేటు దగ్గర తాను చూసినదంతా పూసగుచ్చినట్లు వివరించారు నారాయణగారు .

అంతా విని “ ఏనాడూ చిన్న వివాదం కూడా రాని ఈ స్కూల్లో ఇవాళ ఇంత పెద్ద ఎత్తులో , అదీ విద్యార్థుల తల్లిదండ్రులనించి అనుకోకుండా ఈ ధర్నా ఏమిటో? “ అనుకున్నారు హరిశ్చంద్రగారు .

కొంతసేపటికి “ మీ మీ వర్గాల నాయకులని మాత్రమే ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు “ అని ప్యూను వచ్చి చెప్పగానే ఇద్దరు పెద్దలు అతని వెనకాలే మీటింగ్ హాలుకి వెళ్లారు ప్రిన్సిపాల్ హరిశ్చంద్రగారిని కలుసుకోవటానికి. వెళుతూ వెళుతూ ఆ పెద్దలిద్దరూ ఒకరినొకరు మింగేసేలా చూసుకున్నారు.

ప్రిన్సిపాల్ గారితో సుమారు రెండుగంటలసేపు సమావేశం జరిగింది. అనంతరం బయటకి వచ్చిన ఆ పెద్దలిద్దరి ముఖాలలో సంతోషం కనపడుతోంది కానీ ఒకరితో ఒకరు మాత్రం మాట్లాడుకోలేదు. ఎవరి జట్టు దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఆనందంగా ఏదో చెప్పుకున్నారు.

రెండు జట్లవారు “మాదే గెలుపు” అంటే “మాదే గెలుపు” అనుకుంటూ పిల్లలని తీసుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు.

మర్నాడు అన్ని తరగతులలోనూ విద్యార్థులు కూర్చోడానికి సాధారణంగా నాలుగు వరుసలుగా అమర్చి ఉండే కుర్చీలు అయిదు వరుసలలో ఏర్పాటుచేయబడ్డాయి. క్రితం రోజు ధర్నాలో కూర్చున్న జట్ల తాలూకు వారి పిల్లలని వేర్వేరుగా మొదటి వరుసలోను అయిదవ వరుసలోను కూర్చుండచేశారు.

అన్ని తరగతులలోకి వెళ్ళి ఈ నూతన ఏర్పాటు సరిగా జరిగిందో లేదో పరికించి తిరిగి వెళుతూ క్రితంరోజు పెద్దలతో జరిగిన ఒప్పందం గురించే ఆలోచింపసాగారు హరిశ్చంద్రగారు .........

“ ఆ రెండు వర్గాలకు చెందినవారు ఒకే అగ్ర కులానికి చెంది శాఖా భేదం కలిగిన వారు. వారు పూజించే దైవాలు , అలవాట్లూ ..ఇలా అన్నీ భిన్నమైనవే. తమ పిల్లలు ఆ వేరే శాఖ వారితో కూర్చుంటే వారి అలవాట్లన్నీ అలవరచుకుంటున్నారనీ అందువల్ల తమ ధర్మం భ్రష్టు పడుతున్నదని కనుక తమ తమ పిల్లలని తరగతిలో వేర్వేరుగా కూర్చుండచేయవలసినదనీ లేదంటే తమ పిల్లలని ఈ స్కూలు మాన్పించివేస్తామని బెదిరించారు”

“ సమాజం ఎంతో ముందుకు వెళుతున్నప్పటికీ వీళ్ళ ఆలోచనలు ఎంత సంకుచితంగా ఉన్నాయి?” అనుకుని ఎంతో మనస్తాపం చెందిన ప్రిన్సిపాల్ హరిశ్చంద్రగారు ఆ తల్లిదండ్రులందరికి శతవిధాల నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి.

దురదృష్టవశాత్తూ ఈ విషయంలో ఆయన చేయగలిగింది కూడా ఏమీలేదు ఎందుకంటే ఆ స్కూలు నడుస్తున్నదే ఆ అగ్రకులాలవారి ప్రాపకం పైనే . అందుచేత అప్పటికి వారి డిమాండుని అంగీకరించక తప్పలేదు ప్రిన్సిపాల్ గారికి. తత్ఫలితంగానే ఈ వేర్పాటు!!!

ఈ వేర్పాటు పర్యవేక్షిస్తున్న తరుణంలో అన్ని తరగతులలోనూ ఒక అసాధారణమైన నిశ్శబ్దం నెలకొని ఉండటం గమనించారు ప్రిన్సిపాల్ గారు. అది తన మనసులోని భావనో లేక నిజంగానే పిల్లలలో నిరుత్సాహం నెలకొన్నదో అనే విషయం స్పష్టం కాక ఆయన ఎనలేని వేదనకు గురయ్యారు.

“ఇప్పటికీ మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ కులాల తాలూకు పట్టింపులు ఛాందస భావాలు సమాజపురోగతికి పెను ఆటంకంగా మారుతున్నాయి. ఈ కుప్రథ ఇలాగే కొనసాగితే ముందుతరాలవారికి ఎంతో హానికరంగా పరిణమించవచ్చు. అలా జరగడానికి సుతరామూ వీల్లేదు. ఈ విషయంలో మార్పు తీసుకునిరాగలిగే దిశగా నేను తప్పక ప్రయత్నం చేయాలి , కానీ ఆ ప్రయత్నాన్ని ఎక్కడనించి ఆరంభించాలి ?” అని ఆలోచిస్తుండగా ఆ రోజు నారాయణగారు తాను చూసిన దృశ్యం “తల్లిదండ్రుల ధర్నాతో తమ కేమి సంబంధం లేనట్లుగా పిల్లలందరూ ఒకచోట గుంపుగా చేరి కబుర్లాడు కోవటం “ గురించి చెప్పటం జ్ఞాపకం వచ్చింది.

అంతే వెంటనే ఆయనకి ఒక ఆలోచన స్ఫురించింది . “ఈ సమస్యకి పరిష్కారం తేవాలంటే ముందుగా పిల్లలకు ఈ విషయంలో అవగాహన పెంపొందించి తద్వారా వారి తల్లిదండ్రులలో చైతన్యం తీసుకురావటమే సరైన మార్గమని , ఆ దిశగా నేను ప్రయత్నం ఆరంభించాలి “ అని ఆయన నిశ్చయించుకున్నారు . ఆ నిశ్చయం తన మనసులోంచి ఏదో పెద్ద బరువు తీయగా ప్రిన్సిపాల్ హరిశ్చంద్రగారికి ఎంతో నిశ్చింతగా అనిపించింది.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.