ఆత్మస్థైర్యం

(ఆంధ్రభూమి మెరుపు శీర్షికలో ప్రచురితమైన కథ)

‘‘ఎందుకురా నాయనా మనకు తగవులు. ఇంటి వద్ద ఉండవచ్చు కదా’’ అంటూ కుమారుని వారించింది కిరణ్ తల్లి.

కిరణ్‌ది పాతిక సంవత్సరాల వయస్సు. ఉడుకు రక్తం గల వయసది. రంగారావు ఆ గ్రామానికి నాయకుడు.

ఆయన చేయని కుట్ర లేదు.

ఆయన చేసిన ప్రతి పనిలోనూ ఉన్న అవినీతిని బయటికి లాగి ప్రజల ముందుంచే తత్వం కలవాడు కిరణ్.

ఒకసారి కిరణ్ ఉంటున్న వీధికి సిమెంట్ రోడ్డు మంజూరు అయింది. అది కాస్త పాచిక మార్చి రంగారావు తన ఇంటి ముందరగా వేయించుకున్నాడు. వచ్చిన అధికారుల చేయి తడిపి తన పనులు కానిచ్చుకున్నాడు.

దాని వల్ల సగం డబ్బు మిగిలింది రంగారావుకి. మరుసటి రోజుకి ఆ రోడ్డు రంగారావు ఇంటి ముందు బీటలు వేసి లోపలికి కూరుకుపోయింది.

అది తెలిసిన కిరణ్ అధికారులకు తెలియజేశాడు.

‘‘పోనీలేవయ్యా మరొక గ్రాంటులో పెడదాం’’ అంటూ అధికారులు తేలిగ్గా కొట్టిపారేయడంతో కిరణ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

వెంటనే అధికారులు వెళ్లి రంగారావు మింగిన డబ్బు కక్కించారు.

అప్పటి నుండి రంగారావుకి కిరణ్‌పై కోపం ఎక్కువైంది.

తర్వాత కిరణ్ చేసే ప్రతి పనిని అధికార బలంతో అడ్డుకోవడం మొదలుపెట్టాడు రంగారావు.

కొన్నాళ్లకు సర్వీస్ కమిషన్ ద్వారా కిరణ్‌కు ఉద్యోగం వచ్చింది.

అయితే ముందు కిరణ్ ప్రవర్తన గురించి మీ గ్రామంలో ఇద్దరు పెద్ద మనుషుల సంతకాలు చేయించమని అధికారులు తెలిపారు.

కిరణ్ తెలిసిన ఒక పెద్దాయనతో సంతకం పెట్టించి రంగారావు దగ్గరకు వెళ్లాడు.

ఇదే అదను అనుకుని రంగారావు కిరణ్ ప్రవర్తన బాగా లేదని రాసిచ్చేసరికి ఉద్యోగం పోయింది. కిరణ్ దీనిని జీర్ణించుకోలేకపోయాడు.

కిరణ్ తల్లి తల్లడిల్లిపోయింది. రంగారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు.

గ్రామంలో బంజరు భూమి, గెడ్డలు ప్లాట్లుగా వేసి అధికారుల అండతో అమ్మడం మొదలుపెట్టాడు.

చివరికి శ్మశానం కూడా ప్లాటుగా మార్చేశాడు. ఇది చూసిన కిరణ్ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశాడు.

వారు వచ్చి తూతూ మంత్రంగా వచ్చి సర్వే చేసి వెళ్లిపోయారు.

కిరణ్ ప్రతి పనికీ అడ్డు పడుతున్నాడని తెలిసి రౌడీలతో కొట్టించాడు రంగారావు.

తీవ్రంగా గాయపడిన కిరణ్ చివరికి రెండు కాళ్లు కోల్పోయాడు. కొన్నాళ్లకు పింఛన్ కోసం దరఖాస్తు చేయగా రంగారావు తన అధికారంతో తిరస్కరింపజేశాడు.

కాళ్లు కోల్పోయిన కుమారుడిని చూసి తల్లి కొన్నాళ్లకు కన్ను మూసింది.

కిరన్ పట్టువదలని విక్రమార్కుడిలా కొంత మంది స్నేహితుల సాయంతో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

దీంతో రంగారావుపై విచారణ జరిపి వెధవ పనులన్నీ బయటికి లాగి జైలుశిక్ష విధించారు.

అప్పటి వరకు ఎదురు లేని ఆధిపత్యంతో ఉన్న రంగారావు సామాజ్య్రం కూలే సరికి గ్రామంలో గల పౌరులంతా కిరణ్ చేసిన మంచి పనిని మెచ్చుకుని కృత్రిమ అవయవాలు కొని ఇచ్చారు.

తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో చిన్న పరిశ్రమ స్థాపించి పది మందికి ఉపాధి చూపే మార్గదర్శకుడయ్యాడు.

- కుబిరెడ్డి చెల్లారావు, చోడవరం, విశాఖ జిల్లా.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.