రేపటికోసం..

ప్రభాతసమయం. ఆ ఊరిలో వున్న వేణుగోపాలస్వామిగుడిలో అర్చకులు మాధవస్వామిగారు

స్వామికి ఆరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కారణం ఆ ఊరిలో పెద్ద మనిషిగా చలామణీ అవుతున్న ప్రసిడెంటుగారి మనవడి పుట్టినరోజు కావడమే. ఉదయమే కొడుకూ, కోడలూ, మనవడు, మనవరాలిని తీసుకుని గుడికొచ్చేరు ప్రసిడెంటుగారు. వారితోపాటే ఊరిలో పెద్దలుకూడా. ప్రె సిడెంటుగారి మనవడు ఎనిమదేళ్ళపిల్లాడు. జీన్స్ పాంటు, పైన బొమ్మలున్న టీ షర్ట్ వేసుకుని ఆ గుడి ఆవరణలో పరుగులు పెడుతున్నాడు. అతన్ని అందుకుందుకు అతని చిట్టి చెల్లెలు బుల్లి బుల్లి అడుగులతో వెనకపడుతోంది. దానికి అందీ అందకుండా పరిగెడుతున్న ఆ పిల్లాడి మొహంలోని సంతోషాన్ని కన్నార్పకుండా చూస్తోంది ఆ గుడి అర్చకులు మాధవస్వామిగారి కోడలు మీనాక్షి.

అలా చూస్తున్న మీనాక్షి మనసులో అదే వయసున్న తన కొడుకు మెదిలాడు. తన కొడుకు ఈపాటికి యేం చేస్తుంటాడా అని ఆలోచిస్తున్న మీనాక్షికి గుండు పిలకతో, ఓ అంగోస్త్రం కట్టుకుని, తెల్లవారకట్లే లేచి, సంధ్యావందనం ముగించి, తోటి సహాధ్యాయులతో మంత్రం వల్లెవేస్తున్న తన ఒక్కగా నొక్క కొడుకు గౌరీనాథశాస్త్రి కళ్ళముందు కొచ్చాడు. అలా ఆడుకుంటున్న ప్రెసిడెంటుగారి మనవడి వయసే వున్న తన కొడుకుకి ఓ ఆటా పాటా లేదు. ఎనిమిదేళ్ళు రాగానే మెళ్ళో ఓ జంధ్యంపోచ పడేసి, సంస్కృతం నేర్చుకుందుకు వేదపాఠశాలకి పంపేసేరు. అక్కడ చదువు చాలా నియమనిష్ఠ లతో చదవాలి. ఇదేదో రాజ్యాధికార మన్నట్టు వంశపారంపర్యంగా వస్తున్న ఈ గుడి అర్చకత్వం కోసం ఆ పిల్లాడు అంత చిన్నప్పుడే వేదపాఠశాలకి వెళ్ళవలసొచ్చింది.

కొడుకు తలపులలో పడిన ఆ మాతృమూర్తికి పిల్లాడిని దగ్గర పెట్టుకుని వాడి ముద్దుముచ్చట్లు తీర్చకుండా అలా కఠినమైన నియమాల మధ్యకి పంపడం కంటనీరు తెప్పించింది. మసకపడిన

హృదయంతో కొడుకుని చూసుకుంటున్న ఆ తల్లి మీనాక్షి ఒక్కసారిగా "బాబూ, బాబూ, వద్దు..వద్దు ..ఊరుకోండి..ఊరుకోండి.." అన్న మామగారి మాటలకి ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా

చూసింది. అక్కడ ప్రెసిడెంటుగారి అబ్బాయి అర్చకులు మాధవస్వామిగారి అబ్బాయి రామశాస్త్రి మెడలో కండువాని గట్టిగా పట్టుకుని తన ముందుకులాగి కొట్టడానికి చెయ్యెత్తుతున్నాడు.

దూరంగా గర్భగుడిలోంచి ఆ దృశ్యాన్ని చూస్తున్న మాధవస్వామిగారు గట్టి గా కేకలు పెడుతూ, చేతులూపుతూ, "బాబూ, బాబూ, వద్దు..వద్దు ..ఊరుకోండి..ఊరుకోండి.." అంటున్నారు. అది చూసిన ప్రెసిడెంటు పరుగెడుతూ వెళ్ళి , కొడుకు చేతిలోంచి రామశాస్త్రి కండువా పట్టు తప్పించి, కొడుకుని బలవంతంగా అక్కణ్ణించి పంపించేసేరు. ఊరిలో నలుగురిముందూ జరిగిన అవమానానికి తలెత్తి

చూడలేక, ముఖం కందగడ్డ లా చేసుకుని రామశాస్త్రి "నువు చేసిన ఈ ఘోర అపచరానికి ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు" అంటూ గుడి వెనకాల వున్న వాళ్ళ ఇంట్లోకి పరిగెడుతున్నట్టే

వెళ్ళిపోయాడు.

ప్రెసిడెంటుగారబ్బాయి పెళ్ళాన్నీ, పిల్లల్నీ తీసుకుని విసురుగా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

ప్రెసిడెంటుగారు గర్భగుడిలో శిలలా నిలబడిపోయిన మాధవసస్వామి దగ్గరికి వచ్చి, గొంతులోకి గాంభీర్యం తెచ్చుకుని, "కానీయండి సామీ.." అన్నారు. చేష్ఠ లుడిగన మాధవస్వామిగారు బలవంతంగా తనను తాను అదుపులోకి తెచ్చుకుని అలవాటు ప్రకారం తీర్థప్రసాదాలిచ్చి ప్రెసిడెంటుగారిని పంపించేసి గుడి మంటపంలో స్తంభానికానుకుని కూలబడిపోయారు. మీనాక్షి నెమ్మదిగా మామగారి దగ్గరకొచ్చి, "ఏమైందండీ?"అనడిగింది.

ఆయన నిట్టూరిస్తూ, "ఇవాళ కొత్తేవుందమ్మా అతని ధాష్టీకం? పరిగెడుతున్న తన ఆ పిల్లాడు పడిపోతుంటే మనవాడు పట్టు కోలేదని.." ఇంక మాట్లాడలేదాయన.

మీనాక్షికి అర్ధమైపోయింది. సాక్షాత్తూ ఆ దేవదేవుని ప్రతినిధిగా అక్కడుండి, నియమనిష్ఠలతో ఆ స్వామిని ఆరాధిస్తూ, ఆ ఆలయానికొచ్చిన ప్రతిభక్తుని మనోరథం తీరాలని వారిని నిండుమనసుతో ఆశీర్వదించే పరమపూజ్యులు ఆ అర్చకులు. కానీ ఆ ప్రెసిడెంటు కొడుకు దృష్టి లో ఆ గుళ్ళో పూజారి కూడ వాళ్ళ ఇలాకాలో వున్నబంట్రోతే అనుకుంటాడు. అలాగేప్రవర్తిస్తాడు కూడా.

ఇటు మామగారూ అటు ఆ ప్రెసిడెంటూ వున్నన్నాళ్ళూ ఇలాంటివి వద్దంటే ఆగుతాయి. కాని రేప్పొద్దున్న తన భర్త ఈ గుడికి అర్చకత్వం చేస్తున్నప్పుడు ఆ ప్రెసిడెంటుగారికొడుకే కదా ఊరికి ప్రెసిడెంటవుతాడు. అప్పుడూ ఇలాగే కొట్టడానికి చెయ్యెత్తడమేకాదు ఆపడానికి తండ్రి లేకపోవడం వల్ల నిజంగా కొట్టెయ్యొచ్చు కూడా ఆ తర్వాత తన కొడుకు ఆ కొడుకు కొడుకు హయాంలో అర్చకుడవుతాడు.

మరి అప్పుడు ఇంకెంత తీవ్రంగా వుంటుందో తన కొడుకు పరిస్థితి? ఒకవేళ తన కొడుకు ఈ గుడికి

అర్చకుడయ్యేక ఈ ఎనిమదేళ్ళపిల్లాడూ పెద్దయి తన కొడుకుని కాలితో తన్నుతాడేమో కూడా. ఆ ఆలోచనకే వణికిపోయింది మీనాక్షి. యేం చెయ్యడం? తరతరాలుగా వస్తున్న ఈ దేవాలయ అర్చకత్వాన్ని కొనసాగించడానికి ఇలాంటి తిట్లూ, దెబ్బలూ తినాలా? రోజులు మారిపోయాయి. అందరూ మంచి మంచి డిగ్రీలూ అవీ చదువుకుని, చక్కగా పట్ట ణాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తన

కొడుకేవీ తెలివితక్కువవాడు కాదే.. ఆ మాత్రం ఆ ఇంగ్లీషు చదువులు చదివించుకోలేరా..?

అదే అడిగింది మామగారిని మీనాక్షి.

"తలతాకట్టు పెట్టయినా చదివించగలమమ్మా. గౌరి కూడా ఏకసంథాగ్రాహి. ఇట్టే పట్టేస్తాడు. కానీ మనకీ భగవంతుని సేవనే నిర్దేశించేరమ్మా పెద్ద లు. ఆ వేణుగోపాలుని చరణసన్నిధిలోనే మన జీవితాలు గడిచిపోవాలి. అంతే." మరోమాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయారాయన. మీనాక్షి ఊరుకోలేకపోయింది. భర్త రామశాస్త్రిని నిలదీసింది.

"భగవంతుని సేవ అని మామగారంటున్నారు. కాని మనం ఆ ప్రెసిడెంటుకి సేవకులేమవో అనిపిస్తోంది. మనపట్ల ఆయనకున్న గౌరవం ఆ కొడుకుకి లేదు. ఇంక మనవడిమాట యేం చెప్పగలం? ఇలా అందరిచేతా తిట్లూ, దెబ్బలూ తినమనే మన మొహాన రాసేడా భగవంతుడు?" అవమానభారంతో కుంగిపోతూ, కొడుకుగా తండ్రి మాటకి ఎదురుచెప్పలేక లోలోపల ఉడికిపోతున్న రామశాస్త్రి ఎఱ్ఱబడ్డ కళ్ళతో చూసేడు భార్యవైపు. రామశాస్త్రి మొహం చూసి భయపడింది మీనాక్షి. ఇంకేం వాదించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ రామశాస్త్రి మటుకు ఆ అవమానభారాన్ని తట్టుకోలేక, తెల్లారితే నలుగురికీ మొహం చూపించలేక ఆ అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళి పోయాడు. అలా వెళ్ళిపోయినవాడు వారాలు, నెలలయినా రాలేదు. మాధవస్వామి కొత్తలో కొడుకు కోసం వాళ్ళనీ వీళ్ళనీ పట్టుకుని వెతికించారు. కానీ రామశాస్త్రి తప్పిపోలేదుకదా. కావాలనే పారిపోయాడు. అందుకే ఆ తండ్రి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

*************************************************

సంవత్సరకాలం గిర్రున తిరిగిపోయింది. మళ్ళీ ప్రెసిడెంటుగారి మనవడి పుట్టినరోజుకి ప్రత్యేకపూజలు చేయించుకుందుకు సకుటుంబంగా వేంచేసేరు ప్రెసిడెంటుగారు. "మనోభీష్ఠఫలసిధ్ధిరస్తు..శ్రీవేణుగోపాల కృపాకటాక్షసిధ్ధి రస్తు.." అంటూ మాధవస్వామి ప్రెసిడెంటుగారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు. అది వింన్న మీనాక్షి కడుపు మండిపోయింది. హు... తమ కుటుంబం ఇలా చిన్నాభిన్నమైపోయినా అంత నిండుగా యెలా దీవిస్తున్నారో అనుకుంది. వాళ్ళు వెళ్ళాక అదే అడిగిందామె మామగారిని.

"అది మన ధర్మమమ్మా.."అన్నారాయన.

ఈ ధర్మాల కతీతంగా ఒక నిర్ణయం తీసుకున్న మీనాక్షి మావగారితో చెప్పింది. "నేను గౌరిని ఆ

వేదపాఠశాలనుంచి తీసుకొచ్చేద్దా మనుకుంటన్నానండీ.." అని.

మాధవస్వామి యేమీ మాట్లాడలేకపోయారు. ఆయన పుట్టి పెరిగిన జీవన పరిస్థి తులకీ, ఇప్పటివాటికీ తేడా ఆయనకి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అంతమాత్రంచేత మనవడిని వేదపాఠశాల మానిపించడానికి కూడా ఆయన మనసు అంగీకరించటంలేదు. కానీ కాదనడనికి తనెవరు? అప్పటికే కొడుకు యెక్కడి కెళ్ళిపోయాడోనని బాధపడుతున్న తను రేప్పొద్దున్న మనవడికి కూడా అలాంటి పరిస్థితే దాపురిస్తే . మరింకేమీ ఆలోచించలేకపోయారాయన.

"చూడమ్మా, నీకెలా బాగుంటుందనుకుంటే అలా చేసుకో. అంతా నీ ఇష్టం." అన్నారాయన కోడలితో.

మర్నాడు ఉదయమే వేదపాఠశాల వున్న ఊరు వెళ్ళడానికి బస్ యెక్కింది మీనాక్షి. అదే బస్‌స్టాండ్‌లో పక్క ఊళ్ళో వున్న కాన్వెంట్‌కి వెళ్ళడానికి స్కూల్‌బస్ కోసం ఎదురుచూస్తున్నరోజామొగ్గల్లాంటి కాన్వెంట్ పిల్లల్ని చూసి మురిసిపోయింది. ఇంకో నాల్రోజుల్లో గౌరీనాథం కూడా ఇలాగే యూనిఫామ్ వేసుకుని, మెడలో కట్టిన టై గాలికి ఊగుతుంటే, తెల్లటి సాక్స్, నల్లటి షూ వేసుకుని, మధ్యలో స్కూల్ పేరున్న బెల్ట్ మధ్యనున్న ఇత్తడి బిళ్ళ యెండకి తళతళ మెరుస్తుంటే, ఇంగ్లీషు పుస్తకాలున్న బేగ్ వెనకాల వీపుకి తగలించుకుని, చేతిలో చిన్న ప్లాస్టిక్ బుట్టలో టిఫిన్బాక్సూ, మంచినీళ్ళూ పెట్టుకుని, మెరుస్తున్న కళ్ళతో వీళ్ళతో సరిసమానంగా ఈ స్కూల్ బస్సే యెక్కుతాడు. అందరిలాగే గలగలా ఇంగ్లీషు మాట్లాడేస్తాడు. చూస్తూండగా పరీక్షలన్నీ పాసయిపోయి పెద్ద ఉద్యోగస్తుడవుతాడు. అప్పుడు అందరూ తన కొడుక్కి వంగి వంగి దండాలు పెడుతుంటే, స్టైల్‌గా , నవ్వుతూ చెయ్యూపుతాడు. అప్పుడింక తన కొడుకుని ఎవరూ తిట్టరు, కొట్టరు. ఆ ఆలోచనలకే మురిసిపోతూ వేదపాఠశాల చేరింది మీనాక్షి.

మీనాక్షి పాఠశాల చేరేటప్పటికి ఉదయం ఎనిమదిగంటలు దాటింది. ఆశ్రమంలాంటి ఆ ఆవరణలో అడుగు పెట్ట గానే విద్యార్థు లు వల్లె వేసే వేదం ఆమె మనసుని ప్రశాంతతతో నింపేసింది. ఒకవిధమైన

అలౌకికానందంతో అడుగులు పెద్దస్వామి వుండే కుటీరం వైపు నడిచాయి. అక్కడ వున్న పెద్దాయనొకరు స్వామివారు ప్రత్యేకపూజలో వున్నారనీ, మధ్యాహ్నానికి కానీ పూర్తవదనీ చెప్పగానే హతాశురాలయింది. కానీ అక్కడివాళ్ళందరికీ మాధవస్వామిగారు బాగా తెలిసుండడంవల్ల, ఆయన కోడలు మీనాక్షిని కూడా గౌరవించి, మధ్యాహ్నం భోజనమయ్యాక స్వామితో మాట్లాడడానికి వీలు కల్పిస్తామని మాటిచ్చారు.

ఆవరణలో వున్న తిన్నె మీద కూర్చున్న మీనాక్షిని యెక్కడినుంచి చూసేడో గౌరి పరిగెట్టు కుని వచ్చి పట్టే సుకున్నాడు. ఆత్రంగా కొడుకుని దగ్గరికి తీసుకుంది మీనాక్షి.

"అమ్మా, యేంటిలా వచ్చేవ్?" అన్నాడు. "నిన్ను చూడాలనిపించింది నాన్నా." అంది.

గౌరి మెరుస్తున్న కళ్ళతో "అమ్మా, ఇప్పుడు మాకు ఓ పరీక్ష వుందమ్మా.. నేను యెంత బాగా చెపుతున్నానో. నేనే అందరికన్న ముందొస్తున్నాను తెలుసా..?" అన్నాడు.

"ఇంటికెడదాం వస్తావా?" అనడిగింది కొడుకుని. "ఎందుకు?" "నిన్ను కాన్వెంట్లో జేర్పిస్తాను. యెంచక్కా ఇంగ్లీషు చదువుకుందుదుగాని." అంది.

వాడు కాసేపు ఆలోచించేడు. "మరి సుబ్రహ్మణ్యం, పతంజలి, విష్ణు కూడా వస్తారా..?" అనడిగాడు.

"ఊహు..రారు. కానీ అక్కడ నీకింకా మంచి ఫ్రెండ్స్ వుంటారు."

"అయితే నేను రాను. ఈసారి మా ముగ్గుర్నీ పెద్ద ఆశ్రమానికి తీసికెడతారుట." అంటూ మీనాక్షి చెయ్యి విడిపించుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు గౌరీనాథం.

అంతలో అక్కడికి ఒక బ్రహ్మచారి వచ్చి, మీనాక్షికి పళ్ళరసం అందిచాడు. అందుకుని తాగుతుంటే పక్కగా కూర్చుని, "మీరు మాధవస్వామిగారి కోడలుట కదమ్మా.." అనడిగేడతను. అవునంది మీనాక్షి.

"యేమైనా పనిమీద వచ్చారామ్మా?" "ఊ.." అని ఊరుకుంది.

"గౌరీనాథం చాలా చురుకైనవాడమ్మా. బాగా పైకొస్తాడు." అన్నాడు మాట కలుపుతూ.

"యెంత పైకొస్తాడు?" సూటిగా అడిగింది మీనాక్షి. ఆశ్చర్యంగా చూసాడతను.

"అవును.. గుళ్ళల్లో అర్చకత్వానికి పైకొచ్చే అవకాశా లేముంటాయి? పోను పోనూ దేవాలయాల ఆస్తులన్నీతరిగిపోతున్నాయి. గుళ్ళో దీపం పెట్టేందుకే ఇబ్బందిగా వుండే పరిస్థి తులు వస్తున్నాయి. ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది. అసలు డబ్బేలేని ఈ అర్చకత్వంలొ యెంత పైకని వస్తాడు? అందుకే ఇక్కణ్ణించి తీసికెళ్ళిపోయి కాన్వెంటులో జేర్పిద్దామని వచ్చేను."

మీనాక్షి మాటలు విన్న ఆ బ్రహ్మచారి నెమ్మదిగా అన్నారు. "ఈ ఆలోచన ఎవరిదమ్మా..?"అంటూ.

"ఎవరిదైన రోజులని బట్టి మారాలి కదండీ."

"నిజవేనమ్మా.. కానీ ఈ రోజులలో కూడా ఈ విద్యకి విలువుంది కదమ్మా. అందులోనూ ఆ

వేణుగోపాలస్వామిగుడి అర్చకత్వం మీ వంశానిదే కదా. మర ది ఇక్కడే నేర్చుకోవాలి కదా.."

"స్వామీ, మీకు తెలియందిలేదు. గుడికి వచ్చే ఆదాయం తగ్గి పోయింది. పాపం చేసేక దానధర్మాలు చేసే జనాలే తప్పితే పాపం చెయ్యకూడదన్న భావం ప్రజలలో లేదు. కేవలం డబ్బుని చూసి మాత్రమే గౌరవించే ఈ రోజులలో కాణీసంపాదన రాని ఈ అర్చకత్వం యెందుకండీ? "

"కానీ అమ్మా, మీ గౌరీ తెలివితేటలు, చరుకుతనం చూసి స్వామి అతన్ని తర్కంలో నిష్ణాతుణ్ణి

చెయ్యాలనుకుంటున్నారు. అదెంత గొప్ప విద్యో మీకు తెలుసా?"

"యెందుకొచ్చిన తర్కమండీ . డబ్బూ లేదు, గౌరవం లేదు, పాపభీతి లేదు, ఇవన్నీ యెలాగూలేవు సరే.. కానీ చిన్నప్పట్నించీ యింత నియమనిష్ఠలతో సంపాదించుకున్న జ్ఞానానికి లభించేవి వెక్కిరింపులూ, తిట్లూ, అవమానాలూ. అంతకన్నయే డిగ్రీ యో తెచ్చుకుంటే వున్నదాంట్లో కాస్త గౌరవంగానైనా బతకొచ్చుకదా . "

తన అభిప్రాయంలో తప్పులేదని చెప్పుకుందుకు ఇంకా ఇలా అంది మీనాక్షి. "మీరే చెప్పండి. వాడి ఈడు పిల్లలందరూ ఆడుతూ పాడుతూ ఇంగ్లీషు చదువుకుంటున్నారు. వాళ్ళకి కావలసిన కేకులు, ఐస్‌క్రీములు తింటూ, సినిమాలు చూస్తూ, పుట్టినరోజు పార్టీలు చేసుకుంటూ బాల్యాన్ని సంతోషంగా గడుపుతున్నారు. కానీ, మా గౌరీ.. తెల్లరకుండా లేచి, గడగడవణికే చన్నీళ్ళస్నానంచేసి, చాలీచాలని అంగోస్త్రం చుట్టబెట్టు కుని వణికిపోవాలా? చిన్నపిల్లవాడికి ఇంత క్రమశిక్షణ అవసరమా..?"

మీనాక్షిలోని తల్లిబాధని అర్ధంచేసుకున్న ఆ బ్రహ్మచారి చిన్నగా నవ్వుతూ అన్నాడు.

"అమ్మా, ఆ ఇంగ్లీషు స్కూళ్ళలో క్రమశిక్షణ లేదంటారా? వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలు తప్పితే వాళ్ళు వేసే శిక్షలు మీకు తెలీవని నేననుకోను."

బ్రహ్మచారి మాటలకి మాట్లాడలేకపోయింది మీనాక్షి. ఆమెకి ఒకసారి టివీలో ఇంగ్లీషు బడులలో తెలుగు మాట్లాడినందుకు ఒక చిన్నపాపకు వేసిన శిక్ష చూడడం గుర్తొచ్చింది. ఆ బ్రహ్మచారి ఇంకా ఇలా అన్నాడు. "అమ్మా, మీ అబ్బాయి మీ ఇష్టం. కాదనడానికి మేమెవరం? కానీ ఒక్కమాట మటుకు చెప్పగలను. ఈ సంస్కృతం నేర్చుకున్నవాళ్ళు యే భాషనైనా యిట్టే నేర్చుకోగలరు. పన్నెండేళ్ళు మీరు ఇంగ్లీషుబడిలో చదివిస్తే మీకు డిగ్రీ ఒక్కటే వస్తుంది. అప్పుడు సంస్కృతం చదవాలంటే చాలా కష్ట పడాలి. కానీ, అదే పన్నెండేళ్ళు ఇక్కడ విద్య నభ్యసిస్తే , ఒక్క ఇంగ్లీషేకాదు యేభాషైనా ఇట్టే నేర్చేసుకోవచ్చు. మరింక క్రమశిక్షణ అంటారా.. అది లేనిదే విద్య యెక్కడా నేర్పరు. కానీ ఇంగ్లీషుబడులలో లేనిదీ, ఇక్కడ వున్నదీ, ప్రతివారి జీవితానికీ అత్యంత అవసరమై నదీ ఇటువంటి చోటే దొరుకుతుంది."

యేమిటదీ అన్నట్టు చూసింది మీనాక్షి.

బ్రహ్మచారి నెమ్మదిగా ఇలా అన్నాడు. "అమ్మా, ఇందాకా మీరే అన్నారు. జనాలలో పాపభీతి లేదని. అది యెందుకు కొరవడిందంటారూ? ఈ స్కూళ్లలో విజ్ఞానశాస్త్రాలూ, లెక్కలూ, కంప్యూటరూ, ఇంగ్లీషూ లాంటివన్నీ చాలా బాగా నేర్పిస్తారు. ఇప్పటి పోటీప్రపంచంలో ఆ మార్కులు, రేంకులే లెక్కలోకి వస్తాయి. వారికి అంతకన్న చెప్పడానికి సమయం వుండదు. కానీ,ఇక్కడ వాటన్నింటితోపాటూ మంచి విలువలు కూడా నేర్పిస్తారు. " అర్ధంకానట్టు చూసింది మీనాక్షి.

"అమ్మా, మీరూ చూసే వుంటారు. వేల, లక్షల జీతాలు తెచ్చుకునేవారు కూడా మానసికంగా నలిగిపోయి, పరిస్థి తిని యెదిరించే ధైర్యం లేక హత్యలేనా చేస్తున్నారు, లేదా ఆత్మహత్యలైనా చేసుకుంటున్నారు. అదంతా యెందుకంటారూ. వారికి చిన్న వయసులో ఇవ్వవలసిన మానసిక స్థైర్యం ఇవ్వకపోవటం వలన. పిల్లాడు పుట్టినప్పటినుంచీ, వాడిని మార్కులతోనే కొలుస్తున్నారు. అదే జీవితమనే భావన కలిగిస్తున్నారు. అందుకే యే కాస్త తేడా వచ్చినా ఆ పిల్లలు తట్టు కోలేకపోతున్నారు. కానీ ఇక్కడ అలాకాదు. ప్రశాంతమై న వాతావరణంలో పెద్దలంటే భక్తిగౌరవాలు పెంపొందిస్తూ, తోటివారిని యెలా గౌరవించాలో చెపుతూ, దైవభక్తిని నేర్పడం వలన పిల్లలలో పాపభీతి కలుగుతుంది. "

"ఊరందరిదీ ఓదారీ, ఉలిపికట్టెది ఓదారీ అన్నట్టు అంతా డబ్బూ, అధికారం చుట్టూ తిరుగుతుంటే ఈ విలువలు, పాపభీతులు యెందుకు పనికొస్తాయి? నా కొడుకు ఉద్యోగస్తుడవాలని కోరుకోడం తప్పన్నట్టు మాట్లాడతారేంటి మీరూ?" నవ్వేసాడు బ్రహ్మచారి.

"తప్పేమీ లేదమ్మా. కానీ ఆ చదువుకి కూడా పునాది ఇక్కడే పడనీమంటునన్నాను.."

"ఇక్కడా?" ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి.

"అవునమ్మా. ఇక్కడ ఒక పదేళ్ళు క్రమపధ్ధ తిలో చదువు నేర్చుకుంటే బైటకొచ్చాక ఆ ఇంగ్లీషు చదువులు ఇట్టే చదివెయ్యొచ్చు." అర్ధంకానట్టు చూసింది మీనాక్షి.

"మీరు నన్నెవరనుకుంటున్నారూ?" అడిగాడు.

"ఇక్కడే ఏదో పాఠం నేర్చుకుంటూనో, చెపుతూనో వున్నావనుకుంటున్నాను." చిన్నగా నవ్వేసాడతను.

"నేను ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాను. కానీ నా ఈ అభివృధ్ధి కి పునాది మటుకు ఈ వేదపాఠశాలే." అతని మాటలను మీనాక్షి నమ్మకలేకపోయింది.

"నా పేరు గురుమూర్తి. నేను నా ఎనిమిదోయేట ఇక్కడ జేరేను. పధ్ధెనిమిదో యేట అన్నీ నేర్చుకుని బైటకొచ్చేను. అప్పుడు డైరెక్టుగా పదోతరగతికి ప్రైవేటుగా కట్టి ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను.

కాలేజిలో జేరేక ఇంక నన్ను యెవరూ పట్టు కోలేకపోయారు. నన్ను మించినవాడు ఆ కాలేజీలోనే కాదు, జల్లాలోనే లేకపోయాడు. సైన్సులో మాస్టర్స్ చేసాక, కొలంబియా యూనివర్సిటీలో పి.హెచ్.డి చేస్తున్నాను. ఇన్ని మెట్లెక్కేక కూడా నాకు యాడాది కోసారి ఇక్కడికొచ్చి కొన్నాళ్ళు గడిపితేకానీ తృప్తిగా వుండదు. వారంరోజులు ఇక్కడుంటే అది నాకు యేడాదిపాటు టానిక్‌లా పనిచేస్తుంది. ఇదంతా నాకు ఇక్కడ పడిన పునాది వల్ల వచ్చిందే. ఒక భాష మీద పట్టు వున్నవారికి మరిన్ని భాషలు నేర్చుకోడం పెద్దకష్టం కాదు. సంస్కృతం మీద అధికారం వుంటే యేదైన ఇట్టే వచ్చేస్తుంది. అదీ కాక ఇంకోమాట."

యేదో అద్భుతాన్ని చూస్తున్నట్టు మీనాక్షి ఇంకొంచెం ముందుకు వంగింది.

"పదోతరగతి, ఇంటరు, డిగ్రీలాంటి పరీక్షలన్నీ ప్రైవేటుగా రాసుకోవచ్చు. కానీ ఈ చదువు ఇక్కడే వుండి చదవాలి. ఇక్కడ పడ్డ గట్టి పునాది మీద మీరు యే భవంతైనా అవలీలగా కట్టేసుకోవచ్చు.”

కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది మీనాక్షి. "అందుకే అతనికి యేం కావాలో అతన్నే తేల్చుకోనీండి.

పధ్ధెనిమిదేళ్ళకి గౌరీ ఇక్కడినుంచి బయటకొచ్చేటప్పటికి అతనికి ముందు యేమిచేయాలనే దానిమీద నిర్ణయించుకుందుకు తగ్గ పరిణితి వస్తుంది. అప్పుడు కావాలంటే ఇంగ్లీషు చదువులు ఇట్టే

చదివెయ్యగలడు. అందుకు నేనే ఉదాహరణ."

ఆ బ్రహ్మచారి మాటలకి మీనాక్షి నిర్ఘాంతపోయింది.

"అమ్మా, మీకింకో మాట చెప్పనా.. ఆ మూలనున్న చెట్టుకింద ఒకతను కూర్చుని చదువుకుంటున్నాడు చూసేరా?" "ఊ." "అతను అమెరికను. ఇక్కడకొచ్చి ఇవన్నీ కావాలని నేర్చుకుంటున్నాడు. ఆ పక్కన వున్న ఇంకోకాయన్ని చూడండి." అటు చూసింది మీనాక్షి.

"అతను పెద్ద కంపెనీలో యెంతో పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఈ సంస్కృతిని చూసాడు. అంతే. ఆఉద్యోగం వదిలేసి ఇ క్కడే వుండి, ఇక్కడ వాళ్ళకి పాఠాలు చెపుతున్నాడు. మరి వీళ్ళంతా అలాగ తిట్లు తింటున్నారామ్మా.?" సూటిగా అడిగాడు.

మళ్ళీ తనే సమాధనం చెప్పాడు. "యెక్కడో కొంతమంది వుంటారమ్మా. కాదనను. కానీ వాళ్ళు మనకి దిశానిర్దే శకులు కాకూడదు. యెందుకంటే అలాంటివాళ్ళ ఆలోచన లౌకికదృష్టి దాటిపోదు. కానీ ఈ సంస్కృతి తెలిసినవారు అలౌకికమై న పారమార్ధిక చింతనతో వుంటారు. నా శరీరం, నా డబ్బూ అని మాత్రమే ఆలోచించేవారికి మరోజన్మ వుంటుందనీ, దానికి పునాది ఈజన్మలోనే పడుతుందనీ తెలీదమ్మా. అది తెలిసిన మనం కూడా వారి దారిలోనే నడిస్తే యెలా?”

యేమైనాసరే కొడుకుని తీసికళ్ళిపోవాలని వచ్చిన మీనాక్షి ఆ బ్రహ్మచారి మాటలకి చేష్టలుడిగి కూర్చుండిపోయింది.

"అదుగో చూడండమ్మా గౌరిని. ఆచార్యులు అడిగినదానికి సరైన సమాధానం చెప్పుంటాడు. తోటివాళ్ళందరూ అతని చుట్టూ మూగిపోయారు చూసేరా?"

అటు చూసింది మీనాక్షి. నిజమే. తోటివాళ్ళందరూ గౌరి చట్టూ చేరి చప్పట్లు కొడుతుంటే గౌరి మధ్యలో గర్వంగా నిలబడున్నాడు. కొడుకుని చూసుకుందుకు రెండుకళ్ళూ చాలలేదు మీనాక్షికి. ఇంతలో పెద్దస్వామి పిలుస్తున్నారని చెప్పగానే మీనాక్షి అటు వెళ్ళింది.

ఆమెని చూడగానే ఆదరంగా పలకరించారు స్వామి. "మాధవస్వామివారు ఆరోగ్యంగా వున్నారామ్మా?" తలూపింది మీనాక్షి. "యేమైన పనిమీద వచ్చారామ్మా?"

"లేదండీ. ఈ పక్కన చిన్నపనుండి వచ్చి, ఇక్కడే కదా అని గౌరిని చూసిపోదామని వచ్చాను."

"చాలా సంతోషమమ్మా. గౌరి మంచికుర్రాడు. వృధ్ధిలోకి వస్తాడు. మాధవస్వామిగారని కుశలమడిగామని చెప్పండి." అన్నారు. తలూపి బెటకొచ్చిన మీనాక్షి నెమ్మదిగా వేదపాఠశాల గేటు దాటి బైటకొచ్చేసింది.

జనవరి 17 –2015- ఆంధ్రభూమి – ఆదివారం అనుబంధం

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.