తనదాకా వస్తే కానీ...

(ఈ కథ 6 అక్టోబరు, 2013న ఆంధ్రభూమి మెరుపు శీర్షికలో ప్రచురితమైంది)

‘ఏమోయ్!సుబ్బారావు... మూడు నెలలయింది నా పెన్షన్ కాగితాల సంగతి ఏం చేసావ్?’’ అడిగాడు పరంధామయ్య.

‘‘మీకు తెలియంది ఏముంది సార్.... మన ఆఫీసులో వర్క్‌లోడ్ సంగతి’’ అన్నాడు సుబ్బారావు.

‘‘ఈ ఆఫీసులో వర్క్‌లోడ్ సంగతి గురించి నాకే చెప్పడం అమ్మ పుట్టుక మేనమామ దగ్గిర చెబుతున్నట్లుందోయ్’’ వ్యంగంగా అన్నాడు పరంధామయ్య.

పరంధామయ్య అదే ఆఫీసులో దాదాపు ముప్పై సంవత్సరాలు పని చేసి మూడు నెలల క్రితం పదవీవిరమణ చేసాడు. అదే సీట్లో ప్రస్తుతం సుబ్బారావు ఇన్‌చార్జ్‌గా పని చేస్తున్నాడు. పదవీ విరమణ చేసిన వెంటనే పరంధామయ్య తన పెన్షన్‌కు సంబంధించిన కాగితాలు సుబ్బారావుకు ఇచ్చి తొందరగా పని పూర్తి అయ్యేలా చూడాలని చెప్పాడు. మూడు నెలలు దాటిదా పెన్షన్ కాగితాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ‘‘ఈ ఆఫీసులో పని చేసిన నా పెన్షన్ కాగితాలే కదల్లేదంటే బయటి వాళ్ల పరిస్థితి ఏంటోయ్?’’ అన్నాడు పరంధామయ్య.

‘‘సార్! మీరు నిన్న, మొన్నటి వరకూ ఇక్కడ పని చేసిన వారే కదా! ఇక్కడ కాగితాలు కదిలే విధానం మీకు తెలియనది కాదు’’ ‘‘ఏది ఏమైనా ఇక్కడ పని చేస్తున్నప్పుడు నామీద ఉన్న గౌరవం, రిటైర్ అవ్వగానే తగ్గిందోయ్’’

మీకు అలా అనిపిస్తుందంటే ఒకప్పుడు మీతోటి ఉద్యోగస్తుడ్ని కదా! ఆ ఆలోచన కూడా మీకున్నట్లు కనబడలేదేయ్

మీరు పని చేసే రోజుల్లో తరతమ భేదం ఉండకూడదని చెప్పారు కదా సార్!మన బంధువైనా కూడా మన చేతిలో సొమ్ము పడిన తరువాతే ఏ పనైనా చెయ్యాలని ఉపదేశించే వారు మర్చిపోయారా? అన్నాడు సుబ్బారావు. పరంధామయ్య ఆలోచనలో పడ్డాడు.

పదిహేనేళ్ల క్రితం సుబ్బారావు ఈ ఆఫీసులో కొత్తగా అపాయింట్ అయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ మరియు పెన్షన్ల్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసే విభాగం కావడంతో నిత్యం ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు ఏదో ఒక పనికోసం వచ్చిపోతుంటారు. సుబ్బారావు ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒక పెద్దాయన ఆఫీసులోకి వచ్చి చుట్టూ చూస్తున్నాడు.

ఈ పెద్దాయనను ఎక్కడో చూసినట్లుందే అనుకున్నాడు. సుబ్బారావు. జ్ఞాపకం వచ్చింది ఆయన మాస్టారు కదూ! అనుకుంటూ ఎదురు వెళ్లి పలకరించాడు. మాస్టారుకి కావలసిన పని చకచకా చేసి, కాగితాలపై పై అధికారి సంతకాలు కొడా చేయించాడు. మాస్టారు వెల్తు... వెల్తూ సుబ్బారావును ఆశీర్వదించారు. ఈ వ్యవహారమంతా ఒకపక్క నుంచి పరంధామయ్య గమనిస్తున్నాడు. లంచ్ అవర్‌లో సుబ్బారావు పక్కకు చేరాడు పరంధామయ్య.

ఏం ఓయ్ సుబ్బారావ్ కొత్తగా ఉద్యోగంలో చేరావు కదా! పనులన్నీ చకచకా పూర్తి చేస్తున్నావ్. కీపిట్ ఆప్ అన్నాడు పరంధామయ్య.

అయితే.... నీ వ్యవహారం మాత్రం నాకు బొత్తిగా నచ్చలేదోయ్

ఏ వ్యవహారం సార్?

ఉదయం మన ఆఫీసకు వచ్చిన పెద్దాయన మీ చుట్టమా? కాదు.... నాకు చదువు చెప్పిన మాస్టారు ఆయన

ఆయన నీకు చదువు ఊరికినే చెప్పారా? ప్రభుత్వం దగ్గిర్నించి జీత భత్యం తీసుకున్నారు కదా?

తీసుకున్నా.... ఆయన విద్యను బోధించిన గురువు గారు కదా సార్

చూడు సుబ్బారావు... మనకు వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలోయ్

అంటే మీ ఉద్దేశ్యం నాకర్థం కాలేదు సార్

ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందోయ్.... మన దగ్గరకు ఏదైనా పనికోసం వచ్చిన వారి దగ్గిర్నించి తరతమ బేధం లేకుండా చేసిన పనికి అంటూ కొంత డిమాండ్ చేసి తీసుకోవాలి అంతే.

ఏమిటి సార్! మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు.

అన్యాయం ఏముందోయ్? మనం వారికి కావాల్సిన పని చేసి పెడ్తున్నాం... దానికి ప్రతిఫలంగా వారి దగ్గర్నించి ఏదైనా ఆశించడంలో తప్పు ఏముంది?

ప్రభుత్వం మనకూ జీతం ఇస్తుంది కదా!

బోడి జీతం ఎక్కడ సరిపోతుందోయ్! నాలుగు రాళ్లు వెనుక వేసుకోడానికి ప్రయత్నించు

ఎన్నైనా చెప్పండి నాకైతే అన్యాయమనిపిస్తోంది

మొదట్లో నాకూ అలాగే అనిపించింది. ఆ తరువాత నాకు అలవాటు అయిపోలేదు. అలాగే నీకూ అలవాటు అవుతుంది ప్రయత్నించు అంటూ ప్రోత్సహించాడు పరంధామయ్య. పరంధామయ్య యధావిధిగా తన దగ్గిరకు వచ్చేవారి దగ్గర్నించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తుండేవాడు. ఏళ్లు గడుస్తున్నా సుబ్బారావు మాత్రం లంచం తీసుకోకుండా తన పని చేసుకుపోతున్నాడు.పరంధామయ్య రిటైర్డ్ అయ్యాడు, తాను పని చేసిన ఆఫీసే కదా! తనకు రావాల్సిన పెన్సన్, రిటైర్‌మెంట్ బెనిపిట్స్‌కు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతాయనుకున్నాడు. కానీ మూడు నెలలుగా కాళ్లు అరిగేలా ఆఫీసు చుట్టూ తిరుగుతున్న కాగితాల్లో కదలికలేదు.

పరంధామయ్యి సార్ పిలిచాడు సుబ్బారావు

ఆలోచనల నుండి బయటపడ్డాడు పరంధామయ్య. వెంటనే తేరుకుని

సుబ్బారావ్ నీవు కావాలనే కాగితాలను తొక్కిపెడ్తున్నావ్... నీ మీద డిపార్ట్‌మెంట్ హెడ్‌కి ఫిర్యాదు చేస్తాను కాస్తంత కోపంగానే అన్నాడు పరంధామయ్య

ఆలస్యం ఎందుకు? కానివ్వండి... మీ కాగితాలు ఆయన టేబిల్ మీదే ఉన్నాయి. వెళ్లి కలవలండి చిరుకోపంతో అన్నాడు సుబ్బారావు. ఏమిటీ? కాగితాలు నీ దగ్గర్నించి పంపించేవా? ఎప్పడు?

మీరు నాకిచ్చిన నాలుగైదు రోజుల్లోనే పని పూర్తి చేసి ఆయన వద్దకు పంపించేసాను.

మరి ఇన్నాళ్లు చెప్పలేదేం?

ఆయన చెప్పొద్దన్నారు. ఇప్పుడెళ్లి ఆయన్ని నిలదీయండి అంటూ తన పనిలో మునిగిపోయాడు సుబ్బారావు పరంధామయ్య మళ్లీ ఆలోచనలో పడ్డాడు. మూడు నెలలుగా ఆయన కాగితాలను ఎందుకు తొక్కిపెట్టినట్లు? డిపార్ట్‌మెంట్ హెడ్ చాలా సిన్సియరే కదా! ఏ రోజు కాగితాలు ఆరోజే సంతకాలు చేసి డిస్పాచ్ చేస్తారే! మరి నా కాగితాలు ఇన్నాళ్లు ఎందుకు పంపించలేదు?

పరిపరివిధాల ఆలోచిస్తున్నారు.

సార్! ఫ్యూన్ రాజన్న పిలుపుతో ఉలిక్కిపడ్డాడు పరంధామయ్య

క్యాబిన్‌లో పెద్దసార్ ఉన్నారా? అడిగాడు పరంధామయ్య

ఉన్నారు సార్.. ఆయన్ని కలుస్తారా? వెళ్లండి అన్నాడు రాజన్న

పరంధామయ్య క్యాబిన్ తలుపుతట్టి

మే ఐ కమిన్ సార్ అన్నాడు

ఎస్.... పరంధామయ్యగారూ రండి... రండి... ఎలా ఉన్నారు?

అడిగాడు డిపార్ట్‌మెంట్ హెడ్

మీ దయవల్ల బాగానే ఉన్నాను సార్

ఏమిటి? ఇలా దయ చేసారు?

ఏం లేదు సార్... మూడు నెలలయింది నా పెన్సన్ కాగాతాల విషయమై.... నసుగుతూ అన్నాడు.

ఆ! మీ పెన్సన్ కాగితాలు పెండింగ్‌లో ఉండిపోయాయి కదా?

అవును సార్

పరంధామయ్యగారూ.... మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు రిటైర్‌మెంట్, పెన్సన్ కాగితాలకోసం ఒక్కొక్కరూ ఎన్ని నెలలు తమ చుట్టూ తిప్పుకునేవారో గుర్తుందా? .............. మీ చేతిలో లంచం పడితే గానీ కాగితాలు నా టేబిల్‌మీదకు వచ్చేవి కాదుకదా? ............. మీ కాగితాలు మూడు నెలలుగా ప్రాసెస్ అవ్వలేదనరి నేరు నా దగ్గిరకు వచ్చారే? ............... ఆ రోజుల్లో మీ దగ్గిరపని అవలేదని ఎవరైనా నా దగ్గిరకు వస్తే మీరు మరింత పెనాల్టీవేసి, మరో నెల కాగితాలు తొక్కిపెట్టి ఉంచేవారు కదా? మీ వ్యవహారం గురించి నాకు అన్నీ తెలుసు. అయినా మిమ్మల్ని సస్పెండ్ చేయకుండా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? రిటైర్డ్ అయ్యేముందు సస్పెండ్ చేస్తే మీకు రావలసిన బెనిఫిట్స్ పోతాయని జాలిపడ్డాను. దీనికి ముఖ్యంగా సుబ్బారావుకు మీరు థాంక్సు చెప్పాలి. మీ మీద ఎటువంటి చర్య తీసుకోవద్దని రిక్వెస్ట్ చేసేవాడు అన్నారు హెడ్.

పరంధామయ్య తలవంచుకుని నిలబడ్డాడు. పరంధామయ్యను చూసి

ఇప్పుడు మీరు తలవంచుకోవడం కాదు మన ఆఫీసులో పని చేస్తున్నప్పుడు తలవంపులు తెచ్చే పనులు చేసినప్పుడు ఉండాలి ఈ బుద్ధి పరంధామయ్య నోట మాట రాలేదు.

మీ కాగితాలు నా టేబుల్ మీద భద్రంగా ఉన్నాయి. మరో నెల రెండు నెలలు అయ్యాక రండి. అప్పటికి మీలో గతంలో చేసిన తప్పులకు పశ్చాతాపం కలిగితేనే రండి కాస్తం కటువుగాను అన్నాడు హెడ్.

పరంధామయ్య తలవంచుకుని బయటికి వచ్చాడు. పరంధామయ్యవైపు జాలిగా చూసాడు సుబ్బారావు.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.