తెలంగాణారాష్ట్రంలోని హైదరాబాదులో బాగా పేరున్న ఓ ప్రాంతమది. ఆ ప్రాంతంలోని అతిపెద్ద అపార్ట్మెంట్లలో ఒకటి నలందాఎన్క్లేవ్. ఆప్రహరిలో మొత్తం పది భవనాలున్నాయి. ఒక్కో భవనంలో పది అంతస్తులు, అంతస్తుకు ఐదు కుటుంభాల లెక్కన మొత్తంగా ఒక్క భవనంలో యాభై కుటుంభాలుంటాయి. ఐదువందల కుటుంభాలు ఆ ప్రహరిలో కాపురముంటుంన్నాయంటే అతిశయోక్తికాదు.

ఇంచుమించుగా పదిహేను వందల మంది మనుషులు నివాసముంటున్న నలందా ఎన్‌క్లేవ్‌లో మొదటిభవనంలోని మూడోఅంతస్తులో 303 నెంబరుగల ఇంటిలో కాపురముంటున్న నాపేరు బండి వేంకటేశ్వరులు, రిటైర్డ్ బడిపంతులు.

ప్రతిరోజు ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలని సన్నిహితులు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టడంతో పోయిన ఏడాది షుగర్, బి.పిలు ఎక్కువైయ్యాయి. మా డాక్టర్ చివాట్లు పెట్టడంతో ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా మాత్రలు తీసుకోవటం అలవాటైపోయింది.

రోజు మా ప్రహరిలోని ఉద్యానవనంలో ఓ గంటపాటు కాలినడక తరువాత పాతిక సూర్య నమస్కారాలు చేసి తిరిగి ఇంటికి వచ్చేవాడిని. ప్రతిరోజులాగా ఆరోజుకూడా ఉదయం 5:30 గంటలకు నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని తయారయ్యి 6:00 గంటలకు ఉద్యానవనమునకు చేరుకున్నాను. ఆదివారం కావటంతో ఉద్యానవనానికి వ్యాయామం చేయటానికై కాస్త ఎక్కువమంది జనం వచ్చారు.

డయాబెటీస్ వున్నవారిది ఓ గ్రూపు, బ్లడ్ ప్రేజేర్ వున్నవారిది ఓ గ్రూపు, ఎముకల వ్యాది వున్నవాల్లదోగ్రూపు, ఇలా గ్రూపులుగా చేరి వారికి తోచిన వ్యాయామం చేస్తూ వేదాంతాలు మాట్లాడుకుంటున్నారు.

నాకు ఆ రోజెందుకో ప్రతి రోజులా కాక, మా ప్రహరి గోడ దాటి కాలినడకన వెళ్ళాలనిపించి, మనసుకు తోచినట్లే నడక మొదలుపెట్టి మా వీధి చివరిసందులో వెళుతుండగా ఓ దృశ్యం నా గమనానికి కళ్ళెం వేసింది.

ఓ తొమ్మిదేళ్ళ పిల్లవాడు నోట్లో టూత్ బ్రష్ ఉంచుకొని అతనికెదురుగా ఉన్న గోడమీది పోస్టర్ ను చిత్రముగా చూస్తున్నాడు.

నాకళ్ళు నా అనుమతి లేకుండానే పిల్లవాడు చూస్తున్న పోస్టర్ మీదకేల్లింది.

ఆ పోస్టర్ లో నీలిరంగు చొక్కా తొడిగిన ఓ ముసలతని బొమ్మ, క్రింది భాగంలో జననం : 9-12-1945 మరణం : 8-10-2016 అని తప్ప మరేమీ లేని ఆ పోస్టర్ ను తదేకంగా చూస్తున్న ఆ పిల్లవాడి ఆలోచనలు తెలుసుకోవాళ్ళన్న కోరిక నాలో అధికమై పిల్లవాడి దగ్గరకు అడుగులు వేసాను.

‘ఒరే అబ్బాయ్ ఎందుకలా ఆ పోస్టర్ ను చూస్తున్నావు’ అడగాను ఆ బుడతని.

‘ఈ తాతని నేను నిన్న ప్రొద్దున్న ఇక్కడే చూసాను. నేనొచ్చిన దారిని తన చూపుడువ్రేలుతో చూపుతూ ఇలా వెళుతున్నాడు. మరి ఇప్పుడేమో ఇలా గోడమీద బోమ్మేట్టారు. ఇంతకి ఆ తాత ఎక్కడికెళ్ళాడు తాత?’ నన్ను ప్రశ్నించాడు ఆ బాలుడు.

వాడి చేయి పట్టుకొని దగ్గరలో వున్న పెద్ద చెక్కదుంగ వద్దకెళ్ళి, దానిమీద కూర్చొని కొంత ఊపిరి పీల్చుకొని, ‘ఒరేయ్ అబ్బాయి ఆ తాత చనిపోయాడురా’ చెప్పాను.

‘చనిపోవటం అంటే’? క్షణం లో నన్ను ప్రశ్నించాడు.

నా 36 సంవత్సరాల ఉపాద్యాయ వృత్తిలో ఏ పిల్లవాడు నన్ను ఇంతటి ఖటినమైన ప్రశ్న అడుగలేదు.

దానికి జవాబు నాకు తెలిసినా, ఆ పిల్లవాడికి ఎలా చెప్పాలని ఆలోచిస్తూండగా, చనిపోయినతని శవాన్ని ఊరేగింపుగా మోసుకేలుతున్న నలుగురి వైపు ఆ పిల్లవాడు చూస్తూ, ‘తాత వాళ్ళు ఆయనను ఎక్కడకు తీసుకేలుతున్నారు’ తిరిగి ప్రశ్నించాడు.

నా చెవికి వాడి మాటలు చెరకముందే అక్కడ మ్రోగుతున్న తప్పెట చప్పుళ్ళు నా కర్ణబేరికి తగిలాయి.

ప్రస్తుతం ఆ నలుగురితో ప్రయాణిస్తున్న పుణ్యాత్ముడి మొహం చూద్దామని లేచి నిలుచున్న నాకు. అరవై సెకనుల తరువాత మోసుకేలుతున్న నలుగురిలో ఓకతను తన బొడ్డు క్రింది బట్ట సవరిస్తుండగా నిర్జీవమైన మొహముపై పడివున్న బంతిపూల మాల క్రిందికి జారటంతో నాకు దర్శనం కలిగింది.

గోడమీది పోస్టర్లో కనిపించే గంభీరత ఇప్పుడు ఆ శరీరంలో కనిపించలేదు. బహుశా ఆ గంభీరత అతనితోనే మాయమైనట్లుంది. అల్లరిచేసే పిల్లవాడికి అమ్మపెట్టిన నోటిముద్దలా ఉంది నోటిలోని ఆకువక్కల మిశ్రమం. అమ్మనాన్నలు ఎత్తుకున్నప్పుడు ఆ శరీరం చేసిన అల్లరి మరిప్పుడు ఆ నలుగురు ఎత్తుకోనిపోతుంటే చేయదేమి?

అవునుకదా అతనే లేనప్పుడు అల్లరేక్కడుంటుంది?. అతను చనిపోయాడు. అంటే?.

ఏదో ఆలోచిస్తున్న నాకు ఆ ప్రశ్న నా ప్రస్తుత కర్తవ్యాన్ని గుర్తుచేసేలోగా, ఆ పిల్లవాడు ‘తాతా..తాతా..’ అంటూ నా చేయిని పట్టి ఊపుతూ నన్ను వాడి లోకం లోకి లాగి, ‘వాళ్ళు ఆ తాతను ఎక్కడకు తీసుకేలుతున్నారు’ ప్రశ్నించాడు.

తిరిగి చెక్క దుంగ పై కూర్చుంటూ, ‘చూడు బాబు నువ్వు సైకిల్ తోక్కుతావా’ అడిగాను. ‘ఆ.. త్రోక్కుతానే. నా దగ్గర ఓ కొత్త సైకిల్ వుంది’ హుషారుగా బదులిచ్చాడు.

‘మరి ఆ సైకిల్ ఇప్పుడు క్రొత్తది, కొన్ని సంవత్సరాలు వాడాక అది పాతదై పూర్తిగా పాడవుతుంది కదా’ అడిగాను.

‘అవును. అయితే!’ సూక్ష్మంగా అడిగాడు పిల్లవాడు.

‘అలానే ఆ తాత శరీరం కూడా పాతదై పనిచేయటం లేదు. ఎవరి శరీరమైనా పాతదై పనిచేయక పోతే మనమంతా వారు చనిపోయారు’ అని అంటాము.

‘అలాగైతే మానాన్న నా చిన్నప్పటి సైకిల్ పాతదై పాడైపోతే, దాన్ని సాహేభు గారి పాత సామాను అంగడిలో ఇచ్చి డబ్బుతీసుకొని, దానికి ఇంకొంత డబ్బు వేసి ఇప్పుడున్న క్రొత్త సైకిల్ కొన్నాడు’ అని చెపుతూ కొంతసేపు ఆగి ఊరేగింపుగా వెళుతున్న శవం వైపు చూసాడు.

ఏదో కనుగోన్నవాడిలా సన్నగా నవ్వుతూ ‘ఓ.. నాకిప్పుడు అర్దమైంది వాళ్ళు తాతను సాహేభు లాంటి అయన దగ్గరకు తీసుకెళుతున్నారు కదా’ చెప్పాడు.

ఆ పిల్లవాడి మాటలకూ నాకు నవ్వువస్తున్నా.. నవ్వును ఆపుకొని, చనిపోవటం అంటే ఏమిటో వాడికి అర్ధమయ్యేలా చెప్పాలనిపించి, పిల్లాడి చేతిని పట్టుకొని దగ్గరగా తీసుకొని ‘ఒరేయ్ అబ్బాయ్ ఆ సాహేభు పాత పడ్డ వస్తువులను తీసుకొని ఏమిచేస్తాడో తెలుసునా’ అని నేను చెప్పడం ముగించక ముందే.

‘ఓ.. నాకు తెలుసుగా నాన్న చెప్పారు’ అంటూ సుమతి శతకం లొని పద్యం చెప్పినట్లు చకచకా చెప్పసాగాడు.

‘సాహేభు గారు అన్ని పాత సమానులు మన దగ్గర కొనుక్కొని దానిని తిరిగి ఓ ఫ్యాక్టరీ యజమానికి అమ్ముతారట. ఆ ఫ్యాక్టరీ యజమాని వాటిని క్రొత్తవి గా చేసి, తిరిగి సైకిల్ చేసే వారికి ఇస్తారట’ అని ఆ పిల్లవాడు చెప్పటం అయిపోగానే నేను మాట్లాడటం మొదలుపెట్టా. మరుక్షణం వాడు నా నోటిపై చేయివుంచి, ఏదో ఆలోచిస్తూ ‘అంటే.. ఆ తాతయ్య క్రొత్తగా మారి మరలా వస్తారనమాట..నా కొత్త సైకిల్ లా..’ చెప్పాడు.

ఈ సారి వాడితో పాటుగా నవ్వుతూ నేను ఆలోచనలో పడ్డాను. మరునిమిషం ఆ పిల్లవాడు కొత్త విషయాన్ని కనుగొన్న శాస్రవేత్త వలే సంతోషంగా ఉరకలు వేస్తూ నానుండి పరిగులు తీసాడు.

పరిపక్వత లేని వయస్సులో వున్న ఆ పిల్లవాడికి పరిపూర్ణత లేని సమాధానం త్రుప్తి నిచ్చినా, నాకు మాత్రం అసంతృప్తి గానే వున్నది.

ఈ శృష్టి లో కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇంకా ప్రశ్నార్ధకం గానే ఉన్నాయి.

అందులో కొన్ని నేను కూడా మా అమ్మను అడిగే వాడిని, చెట్టు ముందా విత్తనం ముందా అని, కోడి ముందా కోడిగుడ్డు ముందాని, చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తాడని.

మానవసమాజంలో ఇటువంటి ప్రశ్నలకు పెద్దలు చెప్పే సమాధానాలతో త్రుప్తిపడ్డ వారి సంఖ్య చాలా తక్కువేనని చెప్పవచ్చు.

పిల్లవాడు నన్ను విడిచి వెళ్ళిన క్షణం నుండి నా మెదడుని కొన్ని ప్రశ్నలు కబలించాయి.

ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమైవుంటుందని ఆలోచిస్తూ తిరిగి నా నడక మొదలుపెట్టాను.

ఆ పిల్లవాడు చెప్పినట్లు చనిపోయన వాడు మరల క్రొత్తగా వస్తాడా!.

మరి అయితే ఆత్మలు అనేది ఏంటి?.

నేను చిన్నప్పడు చూసిన భక్తి సినిమాలలో, దేవుడికి ఇష్టమైన భక్తుడు చనిపోగానే ఆ భక్తుడి శవం మీద నుండి ఓ దీపం వెళ్లి ఏర్రటి ముగ్గులు పెట్టిన దేవుడి కుడిచేతి హస్తం మద్యభాగం లోకి చేరుతుంది. తరువాత ఆ భక్తుడి శరీరాన్ని చూసిన అతని బంధువులు చనిపోయాడని అంతిమక్రియలు చేస్తారు.

అంటే?

పిల్లవాడి సూత్రం ప్రకారం ప్రతి వాహనం చలనానికి ఎలాగైతే ఇందనం, నిప్పు అవసరమో అలానే మన చలనానికి అలాంటివి అవసరము. అందులో ఇందనం ఆహారం అయితే ఆత్మ అనేది నిప్పా? ఆ నిప్పును దేవుడు మనము చనిపోయాక తీసుకుంటున్నాడా?.

మరి.. మరి అయితే.. ఈ సాహేభు గారు, ఆ ఫ్యాక్టరీ యజమాని ఎవరు?.

ఇంతకీ, చనిపోయిన వారు మరలా క్రొత్తగా వస్తారా?.

అలాగైతే, నేను నా చిన్ననాటి స్నేహితుడు రాము ని, నా పెళ్లిరోజున మండపం లో ఉరి వేసుకొని చనిపోయిన శకుంతలని, నాతో కలసి పన్నెండేళ్ళు పనిచేసిన సోషల్ మాస్టర్ సత్యం ని, దైవం తో సమానమైన మా అమ్మ ను తిరిగి చూస్తానా?.

ఆలోచనే నాలో ఇంత ఆనందము ఇస్తే. అసలు అలా జరుగితే!.

ఉదయిస్తున్న సూర్యకిరణాల వేడికి మబ్బులు మెల్లగా తోలిగిపోతున్నాయి. గాలిలో వెచ్చదనం పెరుగుకొద్ది నా అడుగుల వేగం పెరుగుతుంది. పిల్లవాడిని కలిసిన చోటినుండి నాలుగు ఫర్లాంగుల దూరం నడిచినట్లుండా!. ఏంత వడిగా నడుస్తున్నా ఎందుకో శరీరంలో ఇసుమంత అలసట లేదు.

సముద్రతీరంలోని ఆహ్లాదకరమైన వాతావరణం నను ఆవహించినట్లుంది. నన్నుచుట్టి ఇంతమంది నా గురించే మాట్లాడుతున్నా వారి మాటల శబ్దాలు నా చెవిని తాకటం లేదు.

నాలో ఇదివరకేప్పుడు కలగని అనందం, బహుషా రాము, శకుంతల, సత్యం, అమ్మ ఒక్కసారిగా నాకు గుర్తుకురావటమే దీనికి కారణం కాబోలు.

ప్రతి ఒక్కరి అంతిమ ఘడియలలో వారికి ఎంతో ఇష్టమైన వారు కనిపిస్తారని మా గురువు గారు అన్నమయ్య సినిమా చూసి వస్తున్నప్పుడు నాకు చెప్పాడు.

అంటే...ఇది నాకు అంతిమ ఘడియలా?.

కొన్ని కధలకు అంతిమమే ఆరంభమైతే ముచ్చటగా ఉంటుందనేమో నా కధను ఇలా ఆరంభించాడు ఈ రచయిత.

* * *

దాదాపు ముప్పైఎనిమిది సంవత్సరాల క్రితం..

చిత్తూరు జిల్లా లోని ఓ గ్రామం.

"సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా.

పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ నిత్యం

పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ."


ప్రతి మానవుడిలోను మాట అనే మహత్తర శక్తిని ప్రసాదించిన శబ్దస్వరూపిని ‘సరస్వతీ దేవి’. ఆమెది చైతన్య స్వరూపం.

చిన్నప్పటి నుండి నాకు సరస్వతి స్తోత్రం అంటే చాల ఇష్టం.

స్కూల్ నుండి కాలేజి దాకా ప్రతిరోజు చదువుకొనేటప్పుడు, పరిక్షలకు వెళ్ళేటప్పుడు ఆ స్తోత్రం చెప్పుకోనేవాడిని. దానికి ముఖ్య కారణం మా అమ్మ. ఆమె పేరు సరస్వతి.

డిగ్రీ పూర్తయ్యాక గవర్నమెంటు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగిపోయివున్న నేను చివరిగా అమ్మ చెప్పిందని ప్రాదమిక ఉపాద్యాయ వృత్తికి పరిక్ష వ్రాయటానికి బయలుదేరుతూ, సరస్వతి స్తోత్రం ఇదివరకటి కన్నా కాస్తా గట్టిగానే చెప్పా.

స్తోత్రం పూర్తవగానే కనులు తెరిచి చూసిన నాకు, నా ఎదురుగా ఉన్న పాతబడ్డ సరస్వతిదేవి చిత్రపటం అద్దంలో, నా వేనుక నిలుచుని నేను సరస్వతి స్తోత్రం చెప్పిన విధానం చూసి నవ్వుతున్న అమ్మ కనిపించింది.

ఆమె నవ్వులోని అర్ధం గ్రహించిన వాడినై సిగ్గుతో ఆమె మోహము చూడలేక వెనుకకు తిరిగి ఆమె పాదాలకు మ్రొక్కగా, నన్ను ఆశీర్వదిస్తూ పైకి లేపి, ‘ఏరా సరస్వతి మీద బాగా కోపం వచ్చినట్లుంది’ నవ్వుతూ అడిగింది.

ఏమి చెప్పాలో తెలియక నవ్వుతూ ఇంటి నుండి బయటకు వెళుతుండగా అమ్మ పిలుపు నా గమనానికి అడ్డు పడింది.

‘నాన్న వెంకటేషులు మీ నాయన కు కూడా మొక్కుకోరా’ అంటూ సరస్వతిదేవి ఫోటోకి కుడిపక్కగా ఉన్న నాన్న ఫోటో ని చూపింది అమ్మ.

నాన్న ఫోటో నాకు మూడేళ్ళ వయస్సులో తీసినది. కాగితపు అట్టకు అతికించి ఉన్న ఆ ఫోటోకి చాలాకాలం నుండి ప్రతి శుక్రవారం మరియు పండగలకి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆయన ముఖం కనపడకుండా పోయింది.

నాన్న రూపం తన హృదయంలో నిలుపుకొన్న అమ్మకు ఆ ఫోటోని మ్రొక్కటం ఇబ్బందిగా లేకపోయినా, ఆయన రూపమే గుర్తులేని నాకు మాత్రం కొంత ఇబ్బందిగానే ఉంటుంది.

ఆ విషయం అమ్మకు ఇదివరకే ఏన్నోసార్లు చెప్పినా తను చేసేది లేక నవ్వి ఊరుకొనేది.

అమ్మ చెప్పిందని ఆ రోజు నాన్న ఫోటో ముందుకెళ్ళి నిలుచుని కనులు మూసి రూపం తెలియని ఆ దేవుడి పేరు ఓసారి మనసులో చెప్పుకున్నా..

"నాన్న"

* * *


నా చిన్నతనంలో నేను మరిచిన ప్రతిసారి అమ్మనడిగే వాడిని నాన్న ఏలా చనిపోయాడని.

నాకు ఊహతెలిసినప్పటి నుండి నాన్న గురించి అమ్మను అడిగి నేను ఆమెను చాలసార్లు ఇబ్బంది పెట్టాను.

నాన్న పేరు చంగయ్య.

వీధుల్లోని చెత్త కుండీలలో, కాలువలో పడివున్న ప్లాస్టిక్, ఇనుప వస్తువులు ఏరుకొని దానిని పాత వస్తువుల దుకాణంలో అమ్మేవాడు. అదే అయన వృత్తి.

మేనత్త కొడుకు కావటంతో అమ్మకు నాన్నంటే చాలా ప్రేమ. ఆయనకు ఆమె అంటే అంతే ప్రేమ.

తనతో పాటుగా అమ్మను పనికిరమ్మని ఏనాడు పిలిచేవాడు కాదని అమ్మ చెప్పేది.

ప్రతిరోజు తెల్లవారగానే స్నానంచేసి పూజచేసుకొని తయారయ్యి, గంజికూడు త్రాగి, రెండు పెద్ద గొనెసంచులు, ఓ ప్లాస్టిక్ సంచి, రెండు చెక్క దుంగలు తీసుకొని పనిలోకి వెళ్ళే వాడట.

గొనె సంచులలో చెత్తకుండీల వద్ద దొరికిన వస్తువులు దాచుకొని, చెక్కదుంగల సహాయంతో పెద్ద కాలువలో తిరిగి ఆ మురికినీటిలో దొరికిన వస్తువులను తన వద్దనున్న ప్లాస్టిక్ సంచిలో వుంచుకొని, అన్ని సంచులు నిండాక ఆ చెత్తను దుకాణంలో అమ్మేసి ఇంటికి వచ్చేవాడట.

ఇది ఆయన ప్రతిరోజు దినచర్య.

సెలవులేని ఉద్యోగి అని అమ్మ చెప్పేది (అమ్మకు తెలియని విషయం ఏమిటంటే నాన్న తనకు తెలియకుండానే ఈ సమాజాన్ని కాలుష్యం నుండి కాపాడెందుకు శ్రమించిన ఓ మంచి వ్యక్తి అని).

ఆ రోజు దీపావళి, ఐదు సంవత్సరాల క్రితం ఆ రోజునే నేను పుట్టాను.

ప్రతిరోజులా కాక ఆ రోజెందుకో నాన్న కొడికూయక ముందే లేచి పనికి బయలుదేరుతుండగా చూసి, ‘ఏంటయ్యా ఇంత పొద్దున్నే వేలుతున్నావని’ అమ్మ అడుగగా, అమ్మవైపు విసురుగా చూసి పిల్లాడికి పుట్టినరోజు పైగా దీపావళి కూడాను. వాడికి కొత్త చొక్కాయి, చుచ్చుబుడ్లు పట్ట్రావాలి అని చెప్పి హడావిడిగా వెళ్ళాడట నాన్న.

అమ్మ నవ్వుతూ అయన్ను పనికి పంపి, సాయంత్రమయ్యే సరికి స్నానంచేసి తనకున్న నాలుగు చీరలలో నాన్నకి ఇష్టమైన నెమలిరంగు చీరను కట్టుకొని, తలస్నానం చేయిస్తుండగా కంటిలో కుంకుడు రసం పడ్డదని ఏడుస్తున్న నన్ను ఓదారుస్తూ ఇంటి బయట కూర్చుని ఆమె నాన్న కోసం ఏదురుచూస్తుండగా, మా ఇంటిముందు వచ్చి ఆగిందట వీరయ్యతాత రిక్షాబండి.

మురికికాలవలు, చెత్తకుండీలవద్ద వచ్చే ధుర్ఘందమైన వాసనను తట్టుకుని పనిచేసేందుకు గాను ఆ వృత్తిని ఆధారముగా చేసుకొని బ్రతికేవాళ్ళు మత్తుపదార్ధాలు తీసుకునేవారట.

నాన్న కూడా లింగన్న కల్లు దుకాణంలో దొరికే నాసిరకపు మత్తుపదార్థములు అలవాటు పడ్డారట.

ఆరోజు ఆయన అనుకున్నట్లే నా కోసం చొక్కా, చుచ్చుబుడ్లు, అమ్మకు మల్లెపూలు తీసుకొని, ఆ సంతోషంలో తెల్లవారుజామున తనతో పాటుగా తీసుకెళ్ళిన కల్లు సీసాలోని మిగిలిన కల్లును త్రాగి తూలుతూ రిక్షాస్టాండ్ సెంటర్లో వస్తుండగా, సంఘం వాళ్ళు వెలిగించిన 1000 వాలా టపాసుల మీద పడటం వల్ల ఆయన వద్దనున్న చిచ్చుబుడ్లు కూడా ప్రేలటంతో, ఆ శబ్దాలకు భయంతో ఓ మూలకి ఒరిగిన నాన్నను వీరయ్యతాత చూచి గుర్తుపట్టి ఇంటికి తీసుకోచ్చాడట.

వీరయ్యతాత చెప్పిన విషయాన్ని విన్న అమ్మ, రిక్షాబండి వద్దకు పరిగెత్తుకేళ్లి చూడగా. అక్కడక్క కాలిన బట్టలు, మసినిండిన మోహముతో, ఓ చేతిలో పాతబడ్డ నా కొత్త చొక్కా మరోచేతిలో బాగా మసిబడ్డ మల్లెపూలతో మైకంగా రిక్షాలో పడుకొని ఉన్నాడట నాన్న.

విషయం తెలియక తన సంకన కూర్చుని ఏడుస్తున్న నన్ను క్రిందకు జారవిడచి, వీరయ్యతాత సాయంతో నాన్నను రిక్షా నుండి దించి ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకుని వస్తుండగా,

‘సరు (సరస్వతి) దాహం వేస్తుందే’ అని నీరసంగా అడిగాడట నాన్న.

గుమ్మంవద్ద ఆయనను కూర్చోబెట్టి, కనురెప్పపాటు సమయంలో ఇంటిలోనికి వెళ్లి నీళ్ళు తెచ్చి ఆయనకు నీళ్ళు త్రాగిస్తూ, అయన నుదిటి పైనున్న చెమటను తన చీర చెంగుతో తుడుస్తూ, ఆమె ఉచ్వాసను కాసేపు ఆపి ఆయన మోహముపై చల్లని గాలిని నిధానముగా ఊదుతుండగా, ఆ గాలిలో అమ్మ అనురాగాన్ని ఆనందిస్తూ శ్వాస విడిచారట.

* * *


నా కన్నుల నుండి వచ్చిన కన్నీటి బింధువు తాకిడికి నా ప్రస్తుత కర్తవ్యం గుర్తుకు రావటం తో, కనులు తెరచి నాన్న ఫోటో వైపు చూసి,

"నాన్న"

రూపం లేని దైవానికి నైవేద్యం పెట్టని సమాజంలో నేనున్నా, అమ్మ మాటలలో నీ రూపాన్ని మా మీద నీకున్న ప్రేమను చాలాసార్లు తెలుసుకొన్న, అమ్మ కోరిక మేరకు ఈరోజు నేను వ్రాయబోతున్న పరీక్షలో నాకు మంచి జరిగేలా చూసి, ఆమె కష్టాలకు ముగింపు చేకూరేలా ఆశీర్వదించండి.

నాన్న ఫోటో లోని అయన పాదాలను నా చేతులతో తాకి దణ్ణం పెట్టుకొని పోటోకి దగ్గరగా వుంచిన పరీక్ష హాల్ టికెట్ మరియు పెన్ను తీసుకొని ఇంటి నుండి బయలుదేరుతున్న నాకు మా ఇంటి గుమ్మం దగ్గర క్రిందికి దిగిన ఇంటి పైకప్పుకు ఆధారంగా వుంచిన కొయ్య తలకు తగిలింది.

తగిలిన చోట కుడి అరచేతితో రుద్దుతూ వెళుతున్న నన్నుచూసి, అలా జరగటం ఆశుభంగా భావించిన అమ్మ కొంచెం భాదతో ‘జాగ్రత్త.. చూసి వెళ్ళచ్చు కదరా’ అంటూ, నన్ను వెళ్ళకుండా ఆపి, ఇంటిలోనికి వెళ్లి నీళ్ళు తీసుకోని వచ్చి నా చేతిలో పెట్టి త్రాగమని చెప్పింది.

ఆమె తన చీర చెంగుతో దేబ్బతగిలిని చోట తుడిస్తూ తనలో తాను మాట్లాడుకుంటుంది.

ఆధారాలు లేని కొన్ని ఆచారాలు మనిషి జీవితాలతో ముడిపడి ఉండటం గురించి ఆలోచిస్తే నాకు చాలా కోపం వస్తుంది, కానీ ఇప్పుడు ఆ కోపాన్ని నాతల్లిపై చూపెంత మూర్ఖుడిని కాను.

ఊరికి బయటగా వున్న 30 గుడిసేలలో మాది ఒకటి.

వర్షాకాలం ముందున్నందున ఇంటి పైకప్పును కాపాడేందుకు పోయిన ఆదివారం అమ్మా నేను కలిసి, ఇంటి పైకప్పు వేసే పనివాడు అడిగిన 250 రూపాయలు మిగలపెట్టెందుకు గాను మేమిద్దరమూ కలసి చేసిన అమరికలో జారిన పొరపాటు వల్లనే మా అమ్మకిప్పుడీ భాధ.

నా తలపై దెబ్బతగిలిన బాగాన్ని తన చేతితో తాకుతూ ‘పోతే పోయింది 250 రూపాయలు వాడి దగ్గరే పని చేయించుంటే భాగుండేదేమో’ అంటూ భాదపడుతున్న అమ్మను ఓదారుస్తూ, నన్ను పరీక్ష జరిగే చోటికి సైకిల్ మీద తీసుకేళ్ళతానని చెప్పిన రాము కోసం ఏదురుచూస్తూ రోడ్డు వైపుకి వడిగా అడుగులు వేయసాగాను.

ఇంటి నుండి రోడ్డు వైపుకు వస్తున్న నాకు ఏదురైంది శకుంతల.

నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకిని చేతిలో వుంచుకొని, నోటిలో అప్పుడే కొరికి తీసిన జొన్నలను తింటూ మా ఇంటి వైపుగా వస్తూ, ‘సారుగారు ఎక్కడికి కంగారుగా బయలుదేరారు’ అడిగింది శకుంతల.

ఆ మాటలు విన్న నాకు తనపై కోపం రాకపోయిన, నా వెనుకనే వస్తున్న అమ్మ ఆ మాటలు విని ‘నోరు మూసుకొని ఇంటిలోకి రావే..శుభమా అంటూ వాడు వరీక్షకు వెళుతుంటే నీ ఆశుభపు మాటలు ఏంటే వేర్రిదానా.. అడ్డు తప్పుకో వాడిని వెళ్ళనీ’ అంటూ శకుంతలను అమ్మ చివాట్లు పెట్టింది.

శకుంతలకు మా అమ్మ దగ్గరున్న చనువుతో ‘అయ్యో ఎక్కడికేలుతున్నావని అడిగి తెలుసుకోవటం కూడా ఓ ఆశుభమేనా’ అంటూ వ్యంగంగా ప్రశ్నించింది.

శకుంతల మాటలకు అమ్మకు కోపం ఎక్కువై ‘మూతిపళ్ళు రాలుతాయ్ ముందు నోరుమూసుకొని ఇటు వస్తావా లేదా’ అంటూ ఈసారి కొంచెం గట్టిగానే శకుంతలను అరచింది.

పెద్దవాళ్ళ నమ్మకాలు ఆచారాల గురించి పెద్దగా తెలియని శకుంతలకు అమ్మ కోపంలోని భావం అప్పుడు అర్ధం కాలేదు.

అమ్మ కోపంగా అరవటంతో నాకు దారిచ్చి ఇంటిలోనికి కదిలింది శకుంతల.

ఇంతలో రాము తన సైకిల్ పై వచ్చి ఇంటి ముందు ఆగాడు.

‘సారీ రా వెంకటేషులు సైకిల్ టైర్ పంచరయితేను.. అందుకే లేట్ అయింది’. స్పీడుగా రావటం వల్ల తడి ఆరిన క౦ఠ౦తో రెండు ముక్కలుగా చెప్పాడు రాము.

అతని వెన్ను తట్టి ‘ఏమి పరవాలేదు నువ్వు సైకిల్ నిధానంగానే పోనియ్’ అంటూ సైకిల్ వెనుక భాగంలో కూర్చున్నాను.

సైకిల్ పై వెలుతూ శకుంతల వైపు చూడాలనిపించి తిరిగి చూసాను.

అమ్మకు పక్కగా నిలుచుని నావైపే చూస్తుంది శకుంతల.

కలువరేకుల లాంటి ఆమె కనులను చూసినపుడల్లా నాకు 'శకుంతల' (పాత) సినిమాలోని బి.సరోజాదేవి గారి కనులే గుర్తుకువస్తాయి. ఇంచుమించు అమె శరీరాకృతే తనది.

ఆ సినిమా లోని శకుంతల అమాయకత్వం కలిగిన ఓ స్వర్గలోక సుందరిని ఆ దేవుడు ఈ భూమిపైన పుట్టిస్తే ఏలా వుంటుందని నను అడిగితే శకుంతలలా ఉంటుందని అంటాను.

ఏమో మరి శకుంతల నా కనులకు అంతటి సౌందర్యవతిలా అనిపిస్తుంది.

చిన్నప్పటి నుండి ఆమెను చూస్తున్నా, ఎందుకో తెలియదుకాని గతకొన్ని నెలలుగా ఆమెను చూస్తున్నప్పుడు నాలో ఏవేవో కొత్త ఆలోచనలు నను కొత్తలోకం వైపుకు లాగుతుంది.

బహుశా ఇది యవ్వనములో హార్మోన్ల ప్రభావం వలన అందరిలో కలిగే మార్పెకావచ్చు. మార్పులమయమైన ఈ సృష్టిలో, ఋతువుల ఆగమనంతో ప్రకృతి తన రూపాన్ని ఏలామార్చుకొంటుందో అలానే ప్రతి వ్యక్తి జీవతచక్రంలో మార్పులు సహజం. ఆ మార్పుల వలన వారి వ్యక్తిత్వాలు, ఆలోచనలు మారటం కూడా సహజమే కావచ్చు.

మా ఎదిరింటి పాపారావుమామ అంకమ్మఅత్తల మొదటి సంతానం శకుంతల, రెండోది భోగిరాజు. శకుంతల పదోతరగతి అతి కష్టం మీద రెండోసారి పాసై, ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరము రెండోసారి చదువుతున్నది. చాలా సున్నితమైన స్వభావం కలిగినది.

శకుంతల తమ్ముడు భోగికి ఓ కాలు చచ్చుబడి వుండటం వలన రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకోనేందుకు ఇష్టపడేవాడు కాదు.

చదువు పట్ల ఇష్టం లేని భోగికి పదహారోఏటనే పాపారావుమామ ప్రభుత్వం వారు వికలాంగుల సహాయార్ధం బ్యాంకుల ద్వారా ఇచ్చే సబ్సిడి లోను (loan) తీసి సైకిల్ షాప్ పెట్టించాడు.

భోగి మంచి పనివాడు. అతను నాకు తయారు చేసి ఇచ్చిన సైకిల్ మీదనే నేను ప్రస్తుతం రాము తో కలిసి వెళుతున్నది.

అంకమ్మత్త గురించి అమ్మ ఎప్పుడూ చెప్పేది, తను ఆమెకు దేవుడిచ్చిన తోబుట్టువు, ఆడపడుచు అన్నికలసి ఓ తల్లిలా నాన్న పోయిన తరువాత కష్టమైన సమయంలో అమ్మకు తోడుగా నిలిచి కాపాడిందని.

‘ఏ బంధుత్వం లేకపోయినా నా నుండి ఏమి ఆశించక అంకమ్మత్త చేసినదానికి ఋణం ఏలా తీర్చుకొంటానో నాకు తెలియటం లేదురా వెంకటేషులు’ అంటూ అమ్మ నా దగ్గర చాలా సార్లు చెప్పి భాదపడేది.

నాన్న చనిపోయిన తరువాత నుండి అమ్మ, అంకమ్మత్తలు ఒకే ఫ్యాక్టరిలో పనిచేస్తున్నారు.

పాపారావుమామ ఐదు అడుగులుంటాడు. అప్పటిలో అయిదో తరగతి వరకు చదువుకున్నాడు. తన ఇంటిలోని వారిగురించే కాక ఊరిలో వున్న అందరి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్లనేమో ఆయనకు తోందరగానే బట్టతల వచ్చింది.

అయన వృత్తి మాటలను అమ్ముకొని సంపాదించటం.

ఆయనది ఓ విచిత్రమైన వక్తిత్వము. ప్రొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి తన నుదిటి మీద మరియు బట్టతల లోని కొంత భాగాన్ని కలిపి, 4అంగుళానికి 8అంగుళముల ప్రాంతానికి ఏర్రటి కుంకుమ దిద్ది దానిపై రూపాయి బిల్లంత గంధపు బొట్టు పెట్టి తనలో వున్న దేవుడికి పూజచేసుకొని, తయారై ఇంటినుండి బయటపడతాడు.

పాపారావుమామ నాస్తికుడు కాదు. ఆమద్యనేప్పుడో దినపత్రికలలో చదివాడట ‘భగవంతుడు ప్రతిమనిషిలోనూ ఉన్నాడని, ఆయనకు రూపంలేదని. ప్రతిఒక్కరి ఆయుష్షు నుదుటి భాగంలో వుంటుందని అది తరగకుండా ఉండెందుకే నుదుటన కుంకుమ పెట్టి కాపాడుకుంటారని’.

అప్పటినుండి అలా తనలోని దేవుడికి పూజచేస్తూ, నుదుటన కుంకుమ పూసి తన ఆయుష్షుని కాపాడుకుంటుంన్నాడు పాపారావుమామ.

టీ కొట్టులో, మంగల షాపులో కూర్చొని దినపత్రికలు చదివి, అందులో ప్రభుత్వం వారు ఇచ్చే ఉద్యోగ ప్రకటనలు, పేదవారికి, రైతులకు, నిరుద్యోగులకు రాయితీల ప్రకటనలను గురించి, ప్రెవేటు ఉద్యోగ ప్రకటనలను గురించి తేలుకొని అవసరమైన వారికీ ఆ సమాచారాన్ని అమ్ముకుంటాడు.

అలాగే ఎదుటివారి అవసారాన్ని బట్టి ఒకరి రహస్యలను ఇంకొకరికి అమ్ముకుంటాడు. కొందరు ఇతనిని మంచివాడిగా దగ్గరకు చేరిస్తే, అతని స్వభావం తెలిసిన మరికొందరు దూరంగా ఉంచుతారు.

* * *

మాట్లాడుతూ సైకిల్ త్రోక్కితే ఎక్కడ పరీక్షా కేంద్రంకు వెళ్లేందుకు ఆలస్యం అవుతుందోననే భయముతో రాము నాతో మాట్లాడకుండానే సైకిల్ త్రోక్కుతున్నాడు.

పరిక్ష జరిగే చోటికి రాగానే, అక్కడ చెట్లక్రింద కూర్చుని చదివే వారిని చూసి ఊపిరి పీల్చుకొని సైకిల్ కున్న రెండు బ్రేకులు వేసి తను బార్ మీదుగా నిలుచుని ‘దిగరా వెంకటేషులు, మనము టైం కు వచ్చేసాము’ అంటూ గసపోస్తూ చెప్పాడు రాము.

సైకిల్ దిగి వెళుతున్న ననుచూసి బెస్ట్ అఫ్ లక్ చెప్పిన రాముకి ధన్యవాదాలు తెలిపి, పరీక్ష సమయం దగ్గరవుతున్నా చెట్లక్రింద కూర్చుని పుస్తకాలు తిరగేస్తున్న వారిని చూస్తూ పరీక్ష హాలు కేసి నడవసాగాను.

పరిక్ష హాలులోకి వెళుతున్న నాకు ‘వెంకటేషులు’ అని రాము బిగ్గరగా అరవటం వినిపించి తిరిగి అతని వైపు చూసాను.

‘పెన్, హాల్ టికెట్ తెచ్చావా చూసుకో’ కంగారుగా అడిగాడు రాము. కొంత దూరములో వున్న అతనికి నా చేతిలోని హాల్ టికెట్, జేబులోని పెన్ చూపించి చిన్నగా నవ్వాను. అతను బదులుకి సన్నాగా నవ్వి, ఓ చెట్టుక్రింద సైకిల్ వుంచి ఇక్కడే వుంటానని సైగచేసి చెప్పాడు.

నాకున్న కొద్దిపాటి మంచి స్నేహితులలో రాము ఒకడు.

అతని నాన్న మరణించడంతో పదహైనోఏటనే కుటుంబం భాద్యతలను మీద వేసుకొని, చదువు నిలిపివేసి వాళ్ళ నాన్నగారు నడిపిన ప్రభుత్వ చౌకదుకాణంలో కూర్చున్నాడు.

రెండు గంటల తరువాత పరీక్షహాలు నుండి బయటకు వస్తున్న నన్ను చూసి పరిగెత్తుకొని వచ్చి ‘ఏలా రాసావురా’ అడిగాడు రాము.

ఇదివరకటిలానే రాశా నీరసంగా చెప్పాను.

నా మొహములో ఆనందము లేకపోవటము మరియు నా సమాధానం అతనికి త్రుప్తి నీకపోవటంతో, ‘ఏమిరా బాగా రాయలేదా’ తిరికి కుతూహలం తో అడిగాడు రాము.

నాకు ఈ పరీక్ష ఎంత ముఖ్యమో, ఈ ఉద్యోగ మీద నా జీవతం ఏలా ముడిపడి ఉందో రాముతో నేను చాలా సార్లు చెప్పినందుకే వాడు ఇంత ఆందోళనతో అడుగుతున్నాడన్న విషయం నాకు తెలిసినందున, ‘ఒరేయ్ రాము ఇదివరకటి పరీక్షలు భాగానే రాసాను, కానీ ఆ ఉద్యోగాలు వేరే కారణాల వల్ల నా చేజారి పోయాయి అంతే’ చెప్పాను.

నా మాటలోని రహస్యాన్ని గ్రహించిన వాడిలా, ‘ఆ ఉద్యోగాలు పోతే పోయాయి ఇది మాత్రం నీకు తప్పకుండా వస్తుంది చూడు’ అంటూ నాలో నమ్మకాన్ని చిగురింపజేశాడు.

ఇద్దరం సైకిల్ తీసుకొని అక్కడికి దగ్గరలో వున్న టీకొట్టులో టీ త్రాగి బయలుదేరుతుండగా కనిపించాడు పాపారావుమామ.

ఎదురొచ్చిన నన్నుచూసి ‘ఏమిరా పరీక్ష ఎలా రాసావు’ హుంధాగా అడిగాడు. ‘బాగా రాసాను పాపారావుమామ’ వినయంగా సమాధానమిచ్చాను.

‘ఈసారి ఎక్కువ పోస్టులే ఉన్నాయి. పరీక్షలకి తక్కువ అభ్యర్ధులే హాజరైయ్యారట, తప్పకుండా ఉద్యోగం వస్తుందిలే, ఇంకే పరీక్షలు రాయనవసరం లేదులే’ అంటూ తన దినపత్రికల మరియు సామాజిక పరిజ్ఞానంతో జోస్యం చెప్పి, ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా నాలుక కరుచుకున్నాడు.

అయన నాలుకెందుకు కరుచుకున్నాడో నాకప్పుడు అర్ధం కాలేదు.

ప్రతి మనిషిలో దేవుడున్నాడనే నిజాన్ని బలంగా నమ్మి, తనలో వున్న దేవుడికే పూజచేసే పాపారావుమామ నాకు ఆ క్షణం ఓ దేవుడిలా అనిపించాడెందుకో.

నాకు తెలియకుండానే నారెండు చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలిపాను పాపారావుమామకి.

ఆ తరువాత అర్ధమైంది ఆయన నాలుక కరుచుకున్నందుకు కారణం. తను చెప్పిన మాటకు అంతకుముందే నాతో బేరం కుదుర్చుకోలేదు కాబట్టి.

బాధపడుతూ టీ షాపు లోకి వెళుతున్న పాపారావుమామను చూసి నేను, రాము నవ్వుతూ అక్కడి నుండి సైకిల్ పై బయలుదేరాము.

సృష్టిలోని ప్రతి జీవికి ఓ విధిని, దానిని పూర్తి చేయటానికి సమయంతో పాటు అవసరమైన శక్తిని, వ్యక్తులను, సందర్భాలను ఏర్పాటు చేసి, వాటికి మంచిచెడులను, ఆటుపోట్లను, ఒడిదుడుకులను జోడించి, జీవితకాలంలో సర్వ కోణాల్నిప్రభావితం చేసి, ఆ జీవి జీవితాన్ని ఓ ఆటగా వీక్షించే భగవంతుడు నా జీవిత ప్రయాణంలో ఇలాంటి మార్పును నిమిడీక్రుతం చేసివున్నాడని నేను ఆ రోజు ఉహించనే లేదు.

* * *

రెండు నెలల తరువాత..

నేను పడుకున్న మంచం మీద నుండి కనులు తెరచి చూసాను.

ఏప్పుడు పూరి కప్పు కనిపించే నా కనులకు ఆ రోజెందుకో తెల్లని సున్నం వేసిన పాతబడ్డ కాంక్రీట్ స్లాబ్ కనిపించింది. చూట్టూ ప్రక్కల నుండి వచ్చే అలకిడి నా చెవులను త్రాకుతుంది. ఆ శబ్దాలు నాకిదివరకు పరిచయము లేనివి.

పడుకున్న చోటు నుండి లేచి ఇరువైపుల చూడాలని ప్రయత్నించాను. కాని ఎందుకో నా శరీరం సహకరించటం లేదు, నడుము పై భాగంలో ఏదో గుచ్చుకున్నట్లు నొప్పి.

అలానే మోహము త్రిప్పి చూసా, నా చేతులకు ట్యూబులు గుచ్చి ఉన్నారు అవి స్టాండ్ కి ఉంచిన రంగులేని ద్రవం కలిగిన బాటల్ల నుండి ఆ ద్రవాన్ని నా శరీరంలోనికి పంపుతుంది. అలా నా రెండు చేతులు బందీలైవున్నాయి.

చివరికి.. నేను పడుకొనే ఇరువైపులా చూడసాగాను. కుడి వైపున 6 మంచాలు అన్నింటిలోనూ రోగులు ఉన్నారు. స్పృహ లేకుండా పడుకొని వున్న వారి దగ్గర నిలుచుని కొందరు ఏడుస్తుంటే, మరికొందరు వారిని ఓదారుస్తూ నిలుచొని ఉన్నారు.

ఎడమవైపున డ్యూటీ లో ఉన్న నర్సులూ, వారితో పాటుగా తెల్లకోటు వేసుకొని, మేడలో స్టేతస్కోపు ఉంచుకొని నిలుచున్న ఓ పొడుగాటి అతనితో మాట్లాడుతున్నది నీలిరంగు చీరను కట్టుకొని అమ్మ.

ఆమెను చూసి నా కనులలో నీళ్ళు కదిలాయి.

ఆమ్మను పిలిచేందుకు ప్రయత్నిస్తున్నాను కాని నాలోని నీరసత్వానికి ఆక్కడి శబ్దాలు తోడై నా స్వరం అమ్మను చేరటం లేదనుకుంటా ఆమె నావైపు చూడనే లేదు.

కొద్దిసేపటికి నాకు తెలియకుండానే నా కుడిచేయి అమ్మను పిలవటానికి లేసింది. మరుక్షణంలో స్టాండ్ కు వున్న బాటిల్ క్రిందపడి పెద్దగా శబ్దం, అక్కడంతా కొన్ని క్షణాలు నిశబ్ధం అలుముకుంది.

అమ్మ నన్ను చూసి ఓ క్షణం డాక్టర్ వైపు వింతగా చూసింది.

‘అయ్యా నా బిడ్డ బ్రతికాడయ్యా’ అంటూ అమ్మ నా దగ్గరకు పరుగులు తీసింది. ఆమె అన్న ఆ మాట నాలో చాలా ఆలోచనలకు దారితీసింది. చనిపోయేటంతగా నాకు ఏమిజరిగింది, అసలు నేను ఇక్కడికి ఏలా వచ్చాను. అమ్మ అలా పరుగులు తీయటం చూస్తుంటే నేను ఇక్కడికి వచ్చి చాలరోజులైనట్లుంది. నాకేదో పెద్ద ప్రమాదమే జరిగినట్లుంది.

అమ్మ నా దగ్గరకు రాగానే అసలు ఏమి జరిగిందని అడగాలని, ‘అమ్మ’ అని మొదలు పెట్టా ఆ తరువాత అమ్మ ఏమిచేప్పింది నాకు జ్ఞాపకం లేదు, బహుశా నేను నిద్రలోకి జరుకున్నానేమో.

* * *

మరుసటిరోజు.

నా కుడిచేతి మణికట్టు బాగంలోని ఓ నరాన్ని ఎవరో గట్టిగా పట్టి నొక్కుతున్నారు ఆ నొప్పికి కనులు తెరచి చూసాను.

నాకు నేరుగా నిలుచొని వున్నాడు పాపారావుమామ, నేను ఇక్కడికి రాక మునుపు మాట్లాడిన ఆఖరి వ్యక్తి.

నా చేతిని తిరిగి మునపటి స్థానంలో వుంచి, నా కనులను తన వద్ద నున్న టార్చిలైట్ సహాయం ఒకదాని తరువాత మరోకటిని పరీక్షించాడు, నిన్నటిరోజున నేను చూసిన ఆ పొడువాటి డాక్టర్.

నావద్దకు అప్పుడే వచ్చి నిలుచున్న నర్సు చేతిలోని ఫైల్ తీసుకొని, అందులోని పేజీలను తిరగేసి జారివున్న కళ్ళజోడు అద్దం పైభాగం లో నుండి చూడసాగాడు డాక్టర్.

అక్కడే నిలిచున్న అమ్మ, పాపారావుమామ, అంకమ్మత్త, శకుంతల అందరూ నా వైపు, డాక్టర్ వైపు మార్చి మార్చి చూస్తున్నారు.

వారిలో నాకు అర్ధం కాని భయం కనపడుతుంది.

కొద్ది నిమిషాల నిశబ్ధం తరువాత డాక్టర్ ఆ ఫైల్ ను తిరిగి నర్సుకు చేతికి ఇచ్చి, తన కళ్ళజోడుని సర్దుకొని అమ్మ వైపుగా తిరిగి అంతా బాగుంది.

ఓ రెండు రోజులు ఇక్కడే వుంచి తరువాత ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు.

ఆ మాటను విన్న అమ్మ తన కనుల నుండి ధారగా కారుతున్న కన్నీళ్లను చీర చెంగుతో తుడుచుకొంటూ డాక్టర్ కు చేతులు జోడించి నమస్కరించింది.

ఓ వ్యక్తి నుండి ఎటువంటి ప్రతిపలాన్ని ఆశించకుండా అతని బాగు కోసం ఆరాటపడే మనుషులుంటే ఆ వ్యక్తి నా దృష్టిలో అదృష్టవంతుడు.

ఇంత మంచి తల్లి, ఆమెకు తోడుగా వుండి నా బాగుకై ఏదురుచూసిన పాపారావుమామ, అంకమ్మత్త, శకుంతల ఉన్న నేను అదృష్టవంతుడునే.

కానీ ఈ దురదృష్టం ఎలా జరిగింది?.

అవును రాము కనపలేడలేదేమి?.

పాపారావు మామ జోస్యం విని టీ కొట్టునుండి రాముతో సైకిల్లో బయలుదేరిన తరువాత ఆ వీధి చివరనున్న మలుపులో మెయిన్ రోడ్డు ఎక్కుతుంటే, మెయిన్ రోడ్డులో స్పీడుగా వస్తున్న లారీ మా వెనుకగా వచ్చి రోడ్డు ఎక్కిన జీపును డీ కొన్నది.

మరుక్షణంలో జీపు అదే స్పీడుతో సైకిల్లో అటుగా వేలుతున్న రాము, నామీద పడ్డటంతో మేమిద్దరం అపస్మారకస్థితి లోకి వేళ్ళామని, ఆ తరువాత నేను రెండు నెలలుగా కోమాలో వుండి నిన్ననే కనులు తెరిచానని, రాముకి నెలక్రితమే సరయ్యిందని పాపారావుమామ చెపుతుంటే వింటున్న నాకే కాదు, అమ్మ, అంకమ్మత్తల కనులలో కూడా నీళ్ళు కారాయి.

అమ్మ కలిపిన చక్కెర పాలు స్పూనుతో నా నోటిలో పోస్తున్న శకుంతల నా కనుల నుండి జారిన కన్నీటిని తన చీర చెంగుతో తుడిచి, ‘సరేలే నీ సంబడం చెప్పమన్నారనుకో ఇంత వివరంగా చెప్పాలా, చాలుగానీ వెళ్లి మా భోజనాల సంగతి చూడు’ అన్నది శకుంతల వాళ్ళ నాన్న వైపు చిరు కోపంతో.

కూతురు మాటలకి తను కూర్చున్న కుర్చీ నుండి లేచి హాస్పిటల్ బయటకు వెళ్ళాడు పాపారావుమామ.

రాముకి ఇప్పుడు ఎలా వుంది? నన్ను చూడటానికి రాలేదే? నెమ్మదిగా అడిగాను అమ్మని.

అమ్మ సమాధానం చెప్పేలోపే ‘అయనకు ఎప్పుడో బాగైపోయింది. ఇప్పుడు ఇంటిలోనే వున్నాడు. అడుకడుకు పట్టణం రావాలంటే కుదురుతుందా. మనము ఇంటికి వెళ్ళాక వెళ్లి చూడచ్చులే’ అన్నది నా పక్కనే నిలిచున్న శకుంతల.

ఆమె మాటలతో నా మనస్సు చల్లారింది.

పది నిమిషాలకు ముందు శకుంతల నాకు వేసిన మాత్ర తన పని మొదలుపెట్టినట్లుంది. నా కనులు బలవంతముగా మూతలు పడుతున్నాయి.

అమ్మ నా నుదిటిపై తన చేత్తో నెమ్మదిగా నిమిరి ‘అంతా మంచిగుంది నువ్వు పడుకోరా నాన్న’ అన్న మాటలు మాత్రమే అప్పుడు నాకు వినపపడ్డవి.

* * *

మూడువారాలయింది నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి, రోజులు కనురెప్పపాటు కాలంలో మారుతున్నట్టుంది నాకు.

నేను హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుండి అమ్మ సరిగా పనికి పోవటం లేదు. నన్ను కూడా బయటకు పంపడం లేదు.

ఈ రోజు కూడా అమ్మ పనికి పోలేదు.

సమయం ఉదయం 10:00 గంటలు..

నేను ఇంటి గుమ్మం ముందు కూర్చుని నా నడుము పై భాగం లో ఆపరేషన్ జరిగిన భాగాన్ని నా చేతులతో తడుముతుంటే డిశ్చార్జ్ రోజున డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

జీపు నిన్ను వీపుభాగంలో బలంగా గుద్దడం వలన మీ మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. దానిని ఆపరేషన్ చేసి బాగు చేసాము.

మీరు ఎక్కువగా నీరు తీసుకొంటూ ఉండాలి. మాత్రలు ఓ రెండు నెలల పాటు క్రమము తప్పకుండా వేసుకోవాలి.

‘బండి వేంకటేశ్వరులు ఎవరండి’ అంటూ మా ఇంటిముందు నిలిచుని అరుస్తున్న పోస్టుమాస్టర్ మాటలు నా చెవిన పడగానే నా ఆలోచల దారం తెగింది.

అతను కొత్తగా ఈ ప్రాంతానికి మారినట్టున్నాడు.

‘నేనేనండి’ అంటూ అతని వద్దకు వెళ్ళాను.

‘మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది’ చెప్పాడు పోస్ట్ మాస్టర్.

అతను నా ముందుంచిన కాగితము మీద నా పేరున్న చోటు సంతకం చేసి పోస్టు కవరును తీసికొని ఆయనకు థాక్స్ చెప్పాను.

కవరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ముద్ర ఉండటం చూసి, నాలోని నవనాడులు ఓ సారి స్థంబించాయి. ఆత్రుతగా పోస్ట్ కవరు చించి చూసాను.

మా పక్క ఊరిలో ఉన్న ఓ ప్రభుత్వ ప్రాధమిక పాటశాల లో అక్టోబర్ 20 న సైన్సు మాస్టర్ గా ఉద్యోగం లో చేరవలసిందిగా టైపు చేసి ఉంది అందులో.

‘ఏందిరా ఆ లెటర్ వెంకటేషులు’ అంటూ నా దగ్గరకు వచ్చి నిలిచింది అమ్మ.

ఆమె ఓ చేతిలో రోజు ప్రొద్దున్నే నేను వేసుకోవలసిన మాత్రలు, మరో చేతిలో గాజు గ్లాస్ లో మంచినీళ్ళు పట్టుకొని వుంది.

అమ్మ చేతిలోని మందులు తీసి నోటిలో వేసుకొని గ్లాసు లోని నీళ్ళు త్రాగి తిరిగి గ్లాసును అమ్మకు ఇచ్చి, నా రెండు చేతులతో అమెను ఎత్తుకొని ఇంటిలోని పూజ అర వరకు వెళ్లాను. అక్కడికి వేల్లెంతవరకు అమ్మకు ఏమి అర్ధము కాక, నవ్వుతున్న నన్ను అలా చూస్తూ ఉన్నది.

పూజ అర ముందు ఆమెను దించి తన చేతిలో పోస్టు కవరు వుంచి, ఆమె పాదాలపై సాష్టంగముగా నమస్కరిస్తుండగా, అమ్మకు ఏమి జరిగినది అర్ధము కాక నను లేపుతూ ‘నాయన వెంకటేషులు ఏమిజరిగిందయ్యా’ ఆత్రుత గా అడిగింది.

‘అమ్మా నాకు ఉద్యోగము వచ్చింది.. నువ్వు కోరుకున్న ఉద్యోగము వచ్చింది..’ చెప్పాను. నా మాటలు విన్నాక ఆమె ఆనందానికి అవధులు లేవు.

‘నాయనా వెంకటేషులు’ అంటూ నన్ను అక్కున చేర్చుకుంది. తరువాత నాన్న ఫోటో ముందు పోస్ట్ కవరు పెట్టి నమస్కారము చేసుకున్నాను.

నాకు ఉద్యోగం వచ్చిన సంగతి మా ఇంటివద్ద వున్న అంకమ్మత్త, శకుంతల, భోగిరాజు ఇంకా చుట్టుప్రక్కల వాళ్లకి చెప్పింది అమ్మ.

ఆ రోజంతా అమ్మ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఏన్నిసార్లు నాన్న ఫోటో ముందు నిలుచుందో చెప్పలేను.

పాపారావుమామ మధ్యానం మా ఇంటికి వచ్చి నాకు ధన్యవాదాలు తెలిపాడు. ‘నేను ఆ రోజే చెప్పాను కదరా’ అంటూ తన బుర్ర మీసం మేలి వేసాడు.

‘నేను నీకు బాకీ పడ్డాను మామ తప్పకుండా తీర్చుకుంటాను’ చెప్పాను పాపారావుమామ తో.

నా మాటలు అర్ధమైన వాడిలా చిన్ననవ్వు నవ్వి పాపారావుమామ వెళుతుండగా, గుమ్మం వద్ద నిలుచొని చూస్తున్న నాకు ఇంటి బయట బట్టలు అరవేస్తూ శకుంతల కనిపించింది. వంగపూత కలరు పైట, తెల్లని బుడ్డ జాకెట్టు వేసుకొని తలనిండా ఎర్రని కనకాంబ్రాలు పెట్టుకొనివుంది.

ఆమెను అలా ఓ రెండు నిముషాలు చూసాక నాలో ఇదివరకేప్పుడు రాని ఆలోచన వచ్చింది.

పాపారావుమామకు నేను పడ్డ బాకీ, అంకమ్మత్తకు అమ్మ తీర్చుకోవలసిన ఋణం రెండూ నేను శకుంతలను పెళ్లి చేసుకొవటం వలన తీరుతుందని నాకప్పుడు అనిపించింది.

నాలో కలిగిన ఆలోచనను శకుంతలకు చెపుతామని వేదకాను, కాని అంతకు మునుపే ఆమె ఇంటిలోనికి వెళ్ళిపోయి ఉంది.

అప్పుడే పుట్టింది నాలో ఇదివరకేప్పుడు లేని ఓ కొత్త గుణం. ఆమెను ఏల్లప్పుడు నా బిగి కౌగిలిలో బందిగా ఉంచి, నా కనులముందే ఉంచుకోవాలని. బహుశా ఇదేనేమో యవ్వనములో ఉన్నవారికి కలిగే ప్రేమగుణం.

ఆలోచిస్తూ శకుంతల ఇంటి వైపు చూస్తుండగా, అటుగా వెలుతూ కనిపించాడు రాము తమ్ముడు. అతని పేరు నాకు గుర్తురాలేదప్పుడు, ఎంత పిలిచినా నా వైపు చూడకుండా సైకిల్ ను స్పీడ్ గా త్రొక్కుతూ వెళ్ళాడు.

రాము ను చూసి చాల కాలమైంది. నాకు ఉద్యోగం వచ్చిన విషయం వాడికి తెలిస్తే చాలా ఆనందిస్తాడు. అనుకుంటూనే షర్టు, ఫాంట్ వేసుకొని, నాన్న పోటో వద్ద ఉన్న పోస్టు కవరు తీసి చేత పట్టుకొని, పెరటులో పనిచేసుకోంటున్న అమ్మకు చెప్పకుండా ఇంటి నుండి బయలు దేరాను.

రాము ఇల్లు మా ఇంటి నుండి ఓ కిలో మీటర్ దూరం ఉంటుంది.

భోగిరాజు షాప్ దగ్గరకెళ్ళి సైకిల్ తీసుకొని రాము ఇంటికి బయలుదేరబోతుంటే, ‘రేపు మేము జాతరకు ఊరేలుతున్నాము. మేము వచ్చేంత వరకు నీదగ్గరే ఉంచుకో ఆ సైకిల్’ అన్నాడు భోగిరాజు.

రేపు ఊరికి వెలుతున్నారా!.

ఆ విషయం శకుంతల నాకు ఎందుకు చెప్పలేదో తిరిగి వచ్చి ఆమెను అడుగుతామనుకుని అక్కడినుండి వెళ్ళాను.

* * *


అప్పుడు సమయం సాయంత్రం 5-30 గంటలు, రాము ఇంటిముందు పదుల సంఖ్యలో చొప్పుల జతలు ఉన్నాయి. కొందరు కొత్త వ్యక్తులు రాము ఇంటి ప్రహరిలో నిలుచొని మాట్లాడుకొంటున్నారు.

అక్కడికి కొంత దూరంలో చూసాను రాము అమ్మ ‘జానకమ్మ’ గారు, ఓ లావుపాటి మగ వ్యక్తికి చేతులు జోడించి బ్రతిమాలుకుంటూ ఏదో చెపుతుంది.

ఆమె బాగా నీరసంగా కనిపిస్తుంది.

పరిచయమున్న ఇల్లెకదాని రాము కోసం వెదుకుతూ ఇంటిలోనికి అడుగులు వేసాను. ‘ఇంటిలోనికి వెళ్లి రాము ఉన్నాడండి’ అడిగాను అక్కడ నాకు ఎదురుపడ్డ ఓకతనితో.

అతను నా వైపు వింతగా చూసి పది అడుగుల దూరంలో లేత గులాబి రంగు చీర కట్టుకొని తలనిండా మల్లెపూలు పెట్టుకొని కూర్చొని వున్న రాము చెల్లెలు ‘భానుమతి’ వైపు చూసాడు.

నేనుకూడా ఆమె వైపు చూస్తూండగా నా కంటపడ్డ ఓ చిత్రాన్ని చూసి ఆచలితుడినయ్యి ఆ చిత్రాన్ని చూస్తూ గోడకు ఒరిగాను.

పదినిమిషాల తరువాత నాకు అర్దమైంది. ఆరోజు హాస్పిటల్ లో పాపారావుమామ అబద్దం చెప్పాడని. అమ్మ, అంకమ్మత్తలు రాము విషయం గుర్తుకు వచ్చే కన్నీళ్ళు పెట్టారని.

రాము ఇంటిలో ఇంతకు ముందు వున్నవాల్లంతా వెళ్ళిపోయారు. రాము ఫోటోకి నేరుగా గోడకు అనుకోని కూర్చుని భాదపడుతున్న నేను, నా పక్కన రాము అమ్మ. మాకు కొంత దూరంలో రాము చెల్లెలు, తమ్ముడు నిలుచొని వున్నారు.

నేనడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా, ‘సంఘటన జరిగిన రోజు ఇద్దరు అపస్మారకస్థితి లోకి వెళ్ళిన మాట నిజమే కాని వాడు ఆ పక్క రోజే మమల్ని విడిచి వెళ్లిపోయాడయ్యా’ అంటూ రాము అమ్మ వెక్కిల్లు పెడుతూ ఏడవసాగింది.

‘అయన పోయిన తరువాత వాడున్నడనే నమ్మకంతో బ్రతికాము ఇప్పుడు ఏ నమ్మకముతో బ్రతకాలో అర్ధము కావటం లేదు’ అంటూ రోదిస్తూ చెప్పింది.

నా కన్నులలో నీళ్ళు తిరిగాయి.

కాసేపటి నిశబ్ధం తరువాత..

‘అశుభం జరిగిన ఇంటిలో, మూడునెలలో ఏదైనా శుభకార్యం జరిగితే మంచిదని చెప్పారు. అందుకనే దానికి పెళ్లి చేయాలని సంబందాలు చూస్తున్నాము.

వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణం చెప్పి వెనకడుగు వేస్తున్నారు. సమయం లేదాయ. ఒంటి దాన్ని ఎక్కడికని వెళ్ళను’ అంటూ రోదిస్తున్న రాము అమ్మను చూసి మరల నా కనులలో నీళ్ళు రావటం మొదలైయ్యాయి.

ఏడుస్తూనే ఆమెను నా దగ్గరకు తీసుకొని ‘నా వల్లే మీకీ కష్టాలు, ఆ రోజు నన్ను తీసుపోయేందుకు వాడు రాకుంటే బాగున్ను’ అంటూ ఏలా వాళ్ళకు సహాయపడగలనని ఆలోచించడం మొదలుపెట్టాను.

కొంతసేపు నాలో నిశబ్ధం, ఆ నిశబ్ధం తరువాత నాలో కలిగిన ఆలోచనతో నేను అక్కడి నుండి బయలుదేరాను.

భగవంతుడు ఈ మలుపును నా జీవితములో ఎందుకు పెట్టాడని అప్పుడు నాకు అర్ధం కాలేదు.

* * *


రాము ఇంటి నుండి సైకిల్ పై వస్తూ అలోచించినది ఆ రాత్రి అమ్మకు చెప్పాను. అంకమ్మత్త వాళ్ళు ఊరిలో లేనందున నా నిర్ణయంలో వారి సలహా అమ్మ అడగలేదు. మరుసటి రోజు నేను, అమ్మ రాము ఇంటికి బయలుదేరాము.

ఇద్దరము అక్కడికి వెళ్ళాక, భానుమతి మాకిచ్చిన టీ త్రాగుతూ, అమ్మ ముందురోజు రాత్రి మేము మాట్లాడుకున్నది జానకమ్మ గారితో చెప్పింది.

ఆలోచిస్తూ కూతురి వైపు చూసిన జానకమ్మ గారితో ‘చూడండి మాకు ఇష్టం, మీ కిష్టమైతే ముహూర్తాలు పెట్టుకుంటాం’ సూక్ష్మంగా చెప్పింది అమ్మ.

సిగ్గు పడుతూ గదిలోకి వెళ్ళిన భానుమతి దగ్గరకు వెళ్లి తిరిగివచ్చి ‘మా బంధువులకు ఓ మాట చెప్పి మీకు కబురు పెడతానండి’ చెప్పింది రాము అమ్మ.

నేను తీసుకున్న నిర్ణయం గురించి పాపారావుమామ అంకమ్మత్తలకు వాళ్ళు ఊరినుండి రాగానే అమ్మ వెళ్లి చెప్పింది. వారు కూడా నా నిర్ణయానికి సంతోషించారని అమ్మ చెప్పింది.

నేను చాలాసార్లు శకుంతలతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ ఎందుకో తెలియలేదు వాళ్ళు జాతరకు ఊరు వెళ్ళిన రోజు నుండి తాను మా ఇంటికి వచ్చేది కాదు, నాతో మాట్లాడేది కాదు.

అక్టోబర్ 26, 1980 నాకు, భానుమతికి మా ఊరులోని రాములవారి మందిరము దగ్గర మండపం లో పెళ్లి అని నిర్ణయించారు.

పెళ్ళికి పది రోజులు మాత్రమే ఉంది.

పెళ్లి పనుల హడావిడిలో నేను శకుంతల విషయం గురించి ఆలోచించడం మరిచాము.

ఆ రోజు అక్టోబర్ 20, నేను ఉద్యోగంలో చేరవలసిన రోజు, అమ్మ చాలా కాలంగా ఆ రోజు కోసమే ఎదురు చూసింది.

ఉదయం 7:00 గంటలకే అమ్మనాన్నల దగ్గర ఆశీర్వదం తీసుకొని ఇంటి నుండి బయలుదేరాను.

మా ఊరినుండి నేనేల్లవలసిన స్కూల్ 20 km వుంది. స్కూల్ కి వెల్లటానికి బస్సు ఎక్కేందుకు వెళుతుంటే శకుంతల ఎదురైంది. నేను పలకరిస్తున్నా వినిపించు కోకుండా వెళ్ళిపోయింది.

ఏందుకు శకుంతల అలా వెళ్లిందో నాకు ఆర్ధం కాలేదు. ఏవేవో ఆలోచనలతో నేను బస్‌స్టాండ్ కెళ్ళి బస్సు ఎక్కి కూర్చున్నాను.

శకుంతల నాతో మాట్లాడక పోవటానికి కారణం, నా పెళ్లి విషయం ఆమెకు ముందే చెప్పక పోవటమా? అదేమీ పెద్ద తప్ప కాదే. ఒకవేళ నేను ఆమెను ఇష్టపడ్డట్టె తను నన్ను ఇష్టపడ్డదా? అలాగైతే ఇంత కాలం నాతో ఎందుకు చెప్పలేదు.

స్కూల్ నుండి వచ్చాక ఎలాగైనా శకుంతలను కలసి కారణం అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను.

ఉద్యోగంలో మొదటిరోజు కొత్త పరిచయాల నడుమ కొంచెం హడావిడిగానే జరిగింది. మద్యాహనం భోజనము చేస్తున్నప్పుడు పరిచయమయ్యాడు సోషల్ మాస్టర్ సత్యం. మంచి మాటతీరు మనిషి. కొంత సేపటిలోనే మేము మంచి స్నేహితులైయ్యాము. సాయంత్రము అతనే తన సైకిల్ పై నను స్కూల్ నుండి బస్స్ స్టాండ్ దగ్గర దింపి, బస్సు ఎక్కేంతవరకు కబురులు చెప్పి ఆ తరువాత ఇంటికి వెళ్ళాడు.

బస్సు దొరకటం ఆలస్యం అవటం తో ఇంటికి వెళ్లేసరికి బాగా పొద్దు పోయింది.

బస్‌స్టాండ్ నుండి ఇంటికి వెలుతూ శకుంతలతో మాట్లాడదామని ఓ నిమిషం వాళ్ళ ఇంటి ముందు ఆగి, తెరిచి ఉన్న కిటికీ ద్వారా దీపాలు ఆర్పివుండటం గమనించి కాసేపు ఆలోచనలో పడ్డాను.

శకుంతల నాతో మాట్లాడక పోవటానికి కారణం ఏమన్నది తెలుసుకోవాలన్న కుతూహలం నాలో ఎక్కువవుతుంది.

శకుంతల నను ఇష్టపడుతుందా? బహుసా అందుకనేమో నేను భానుమతిని పెళ్ళాడటం ఇష్టంలేక ఆమె నాతో మాట్లాడటంలేదు?...కాదు..అది కాదు కారణం.. ఎందుకంటే శకుంతల ఇదివరకేప్పుడు నాతో అలా నడుచుకోలేదు?, వేరే ఇంకేదో కారణమైయ్యుండచ్చు. చీకటి పడుతున్నందున అక్కడి నుండి వడివడిగా ఇంటికి అడుగులు వేసాను.

అమ్మ నాకోసం ఎదురుచూస్తూ గుమ్మలో కుర్చుని ఉంది. ఏంటినాన్న ఆలస్యమైందన్న అమ్మ ప్రశ్నకు ఇష్టం లేకుండా బదులిచ్చి, బట్టలు తీస్తూ ఈ రోజు శకుంతల ఇంటికి వచ్చిందా అడిగాను. రాలేదురా! ఎందుకని అడుగుతున్నావు అమ్మ ప్రశ్నించింది. అమ్మకు సరైన సమాధానం ఇవ్వకుండా బుర్రనిండా ఆలోచనలతో నులకమంచం మీద వాలాను. భోజనానికి పిలిచిన అమ్మకు ఆకలి లేదని సమాదానమిచ్చి కనులు మూసాను.

మా ఊరినుండి స్కూలు కేల్లడానికి ప్రొద్దున్న ఒకటే బస్సు వెళుతుంది. అది మిస్సయితే ఆ రోజు సెలవే. ఉద్యోగం చేరిన కొత్తలో సెలవు పెడితే బాగోదని నిద్రలేచి బస్సు ఎక్కడ మిస్సవుతానన్న భయముతో తయారయ్యి బస్‌స్టాండు కేల్లెవాడిని. స్కూల్ కెళ్ళేటప్పుడు, సాయంత్రం స్కూల్ నుండి వచ్చేటప్పుడు శకుంతల కోసం వెదికే వాడిని, కాని ఆ రోజు తరువాత ప్రతిరోజు ఏదో ఒక కారణం వలన శకుంతలతో మాట్లాడటం కుదరలేదు.

* * *


ఆ రోజు శనివారం.

ప్రొద్దున్నే నేను, పాపారావుమామ, భోగి కలసి రాములవారి మందిరం దగ్గరకు పెళ్లి, మండపం వేసే పని వాళ్ళ తో కలిసి పనిచేసాం.

మధ్యాహనం సత్యం కూడా వచ్చి మాతో కలిసి పనిచేసాడు.

పెళ్లి ఏర్పాట్లు అయ్యేసరికి సాయంత్రం 6-00 గంటలు అయ్యింది.

అప్పటికే అమ్మ, అంకమ్మత్త, శకుంతల, భోగిరాజు, భానుమతి వాళ్ళ ఇంటిలోని వాళ్ళు మరియు వాళ్ళ బంధువులు అందరూ అక్కడి విడిధి ఇంటికి చేరుకున్నారు.

పక్క రోజు ప్రొద్దున్నే 5:00 గంటలకు పెళ్లి, ఆ రోజు రాత్రి అందరము తోందరగానే నిద్ర పోయాము.

వాతావరణం చాల చల్లగా ఉంది కాని నాకెందుకో నిద్ర పట్టటం లేదు.

మండపం లో పడుకుని అటూ ఇటూ పొర్లుతూ, అప్పుడప్పుడు ఆకాశం లో చుక్కలను చూస్తూ ఏదో ఆలోచనలో ఉండగా విడిధి గదిలో నుండి అలికిడి వచ్చింది.

బోర్ల పడుకొని విడిధి గదికేసి చూసాను. నాకు పది అడుగుల దూరంలో శకుంతల అందరితో కలసి పడుకొని వుంది. ఆమె మంచి నిద్రలో వుంది. నడుమ దగ్గర పైట చెంగు జారటంతో ఆమె నడుమ వంపులు వెన్నెల కాంతిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అప్పడనిపించింది నాకు శకుంతలతో మాట్లాడాలని, అలా అనిపించిన వెంటనే మండపం దిగి ఆమె వద్దకు మెల్లగా అడుగులు వెయ్యసాగాను.

శకుంతల దగ్గరకు వెళ్లగానే గమనించా అమ్మ ఆమె పక్కనే పడుకోనివున్నది.

ఇరుప్రక్కల చూసి శకుంతల లేపెందుకు మెల్లగా వంగాను.

‘మీతో ఓ నిమిషం మాట్లాడాలండి’ అన్న మాటలు నా వెనుక నుండి వినిపించి భయపడుతూ తిరిగి చూసాను.

‘భానుమతి’ ఎవరైనా చూస్తారానే భయంతో అటు ఇటూ చూస్తూ నిలుచుని ఉంది.

గోధుమ రంగు చీరకట్టి, బుగ్గన దిష్టి చుక్క, చేతులకు కాళ్ళకు పారాని పెట్టి రేపు జరగబోయే తొలిరేయి తంతుకి రెడీ అయ్యి వచ్చిన కిన్నెరసానిలా వుందామే.

‘తొందరగా ఇటురండి’ అంటూ మందిరం వెనుక వైపుకు కొంచెం కంగారుగా వెలుతుందామే. బానుమతి కంగారుకి గల కారణం తెలుసుకోవాలనే కుతూహలంతో ఆమె అడుగులను అనుసరిస్తూ నేను అడుగులు వేసాను.

కొంత దూరం వెళ్లి ఓ చెట్టుక్రింద నిలిచున్న ఆమె, వెన్నెల కాంతుల్లో బంగారు బొమ్మలా వుంది.

ఆమెకి నాలుగు అడుగుల దూరములో నిలిచివున్న నావైపు ఒక్క క్షణం చూసి తిరిగి తలదించుకొని ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి. నాకు చాల రోజులనుంచి మిమల్ని ఓ విషయం అడగాలని వుంది’ అన్నది.

‘ఏమిటది’ తలవంచుకొని తన చీర చెంగును మేలికలు పెడుతున్న భానుమతిని అడిగాను.

‘మీరు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారా లేక మా అన్న మీ వలన చనిపోయాడనే పశ్చాతాపంతో నను పెళ్లి చేసుకుంటున్నారా’ అడిగింది.

‘రెండూ’ తడుముకోకుండా చెప్పాను.

ఆశ్చర్యంగా నా వైపు చూసింది భానుమతి.

‘మొదట పశ్చాతాపంతో వచ్చిన ఆలోచన తరువాత ఇష్టంతో బలపడి పెళ్ళికి ఒప్పుకున్నా’ ఆశ్చర్యంగా నను చూస్తున్న ఆమెతో అన్నాను.

నా మాటలు అర్ధంకాక గందరగోళంతో ‘చూడండి; నేను B.A Degree మెదటి సంవత్సరం చదువుచున్నాను. పెళ్లయ్యాక కూడా చదువు కోవాలనుకుంటున్నాను. పిల్లలకు ట్యూషన్ చెప్పి అందులో వచ్చిన డబ్బులను నా చదువుకయ్యే ఖర్చులకు వాడుకుంటాను. మీరు దానికి అడ్డు చెప్ప కూడదు. ఇంకా.. నేను కొంచెం ముక్కు సూటి మనిషిని’..

‘కొంచెమేనా’ ఆమె మాటలకు అడ్డు చెపుతూ అడిగా..

‘అంటే.. మీ ఉద్దేశం’ కొంచెం కోపంగా అడిగింది.

‘నా..నా ఉద్దేశం మీరు చాలా ముక్కిసూటిగా ఉన్నారని’ నెమ్మదిగా అన్నాను.

‘అదంతా వద్దు..నేను మీకు నిజంగా నచ్చనా, ఇప్పుడు చెప్పండి’ అన్నదామే.

‘నీకు అభ్యంతరం లేకపోతే నీ జడలో ఈ పూలు తురమనా’ అంటూ దారిలో ఆమె జడ నుండి జారిన జాజిమల్లె చెండును చూపాను.

నా మాటలు విన్న ఆమె సన్నగా నవ్వి, సిగ్గు పడుతూ ఆమె వెన్ను నాకు చూపింది. ఆమె జేడలో జాజిమల్లె చెండును వుంచి, సన్నని ఆమె నడుము పై మెల్లగా గిల్లాను.

మరుక్షణం మండపం దగ్గర ఎవరో పెద్దగా అరిచిన కేక వినపడి ఇద్దరం తిరిగి మందిరం దిక్కుకు పరిగుతీసాము.

మందిరం దగ్గరున్న విడిధి గది వద్దకు ఆమె వెళ్ళిన తరువాత నేను మండపం వద్దకు పరిగెత్తాను.

అక్కడి చేరగానే నా కనులపడ్డ ఆ సన్నివేశం చూసి నిశ్చేష్టుడై నిలుచున్నా.

శకుంతల శరీరం మండపం చివరలోని ఓ కొయ్యకు కట్టిన త్రాడుకి వ్రేలాడుతుంది.

ఆమె తలకున్న ఉరిత్రాడు తీసి క్రింద పడుకోబెట్టి ఆమెకు శ్వాస వుందోలేదో చూస్తున్నాడు ఒకతను.

అతని పక్కన నిలుచుని బోరున ఏడుస్తుంది అంకమ్మత్త. ఆమెను ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది అమ్మ. మిగిలిన వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకొంటున్నారు.

మండపం ఎక్కుతుంటే తెలిసింది శకుంతల చనిపోయిందని, అక్కడ ఒక్కసారిగా ఏడుపులు ఏక్కువైయ్యాయి.

ఆమెను చూసే దైర్యము లేక నేను వెనకడు వేస్తూ మండపం దిగి, తను ఎందుకు ఇలా చేసిందని అలోచిస్తూ బయటకు నడిచాను.

మండపంకి కొంతదూరంలో ఉన్న ఓ ఇంటి అరుగు మీద కూర్చొని ఉండగా; కాసేపటికి అక్కడికి వచ్చాడు సత్యం.

‘ఏవరు ఆ అమ్మాయి’ అడిగాడు సత్యం.

‘బాగా తెలిసిన అమ్మాయి’ సమాధానం ఇచ్చాను.

‘తను ఎందుకు అలా చేసిందో వాళ్ళ తల్లిదండ్రులకే తెలియదంట. ప్రేమలో ఏమైనా విఫలమైదేమో పాపం’..అంటూ అక్కడి అరుగు మీద నడుము వాల్చాడు సత్యం.

సత్యం చివరిలో అన్న ఆ నాలుగు పదాలు ‘ప్రేమలో ఏమైనా విఫలమైదేమో పాపం’ నా చెవిలో మరోసారి వినపడ సాగింది.

అంటే.. శకుంతల.. నన్ను ప్రేమించిందా!.

నా కనులలో నీళ్ళు తిరుగుతున్నాయి.

పెదవులు కోరికిపట్టి దుఃఖాన్ని ఆపుకోంటూ నా నుదుటి పై రెండు చేతుల పిడికిలితో గుద్దులు గుద్దుకొని నేను చేసిన తప్పుకి భాదపడ్డాను.

ఒక్కసారి తనతో మాట్లాడివుంటే ఇలా జరిగివుండేది కాదేమో?. అయినా తనెందుకు ఇలా చేసింది?. ప్రేమ మాత్రమే కారణం కాకపోవచ్చు. ఇంకేదైనా బలమైన కారణం ఉందేమో ఆలోచిస్తూ ఉండిపోయాను.

ఇక్కడ జరిగేవి తనకేమి పట్టనట్టు భానుడు తన తల్లి దరణి ఒడిని విడచి నింగికేసి అడుగులు వేయసాగాడు.

మండపం వద్ద అలికిడి తగ్గింది. అమ్మ మందిరం వద్ద నాకోసం వెతుకుతూ ‘వెంకటేషులు’ అంటూ అరుస్తుంది.

మండపం వద్దకు వెలుతుంటే ఏదురు పడ్డది జానకమ్మ గారు. ‘బాబు గుడిలో పెళ్లి చేసుకోవచ్చని చెపుతున్నారు పంతులు గారు’, ఆమె చెపుతుండగా అమ్మ అక్కడికి వచ్చి ‘రే నాయనా పద తయారవుతువు గాని’ అన్నది.

‘మా.. శకుంతల’ అంటూ అమ్మను కౌగలించుకొని ఏడవసాగా.

‘పిచ్చిది అలా చేసింది మమమేమి చేస్తామురా. నువెల్లి తయారవ్వు అవతల ముహూర్తానికి వేలవుతుంది.’ అంటూ నా చేయి పట్టుకొని మందిరములోని విడిధి గదికి తీసుకువెళ్ళింది.

పాపారావుమామ వాళ్ళు కనపడలేదు, చనిపోయిన శకుంతలను తీసుకొని ఇంటికి వెళ్లిపోయినట్టున్నారు.

పెళ్లి జరుగుతున్నంత సేపు శకుంతల ఆలోచనలోనే ఉన్నాను.

* * *

గుడి నుండి ఇంటికి వెళ్ళగానే, శకుంతలను చూస్తామని వాళ్ళ ఇంటికి వెళ్లాను. తలుపులు వేసి తాళం పెట్టి ఉంది.

పక్కింటి వారు చెప్పారు శవాన్ని వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళారని.

నేనెంత చెప్పినా వినకుండా, శకుంతలను చూడటానికి వాళ్ళ ఊరికి వెళ్ళటం మంచికి కాదని నన్ను ఆపారు అమ్మ, జానకమ్మత్తలు. అమ్మ మాత్రమే అక్కడికి వెళ్ళింది.

ఆ తరువాత కాలం చాలా తొందరగా వెళ్లి పోయింది.

పాపారావుమామతో చాలా తక్కువ సార్లు మాట్లాడాను కానీ శకుంతల ఎందుకు అలా చేసిందో తెలిసిరాలేదు.

రోజు బస్సులో ప్రయాణం చేయటం కష్టమవుతుందని, భానుమతిని అమ్మను తీసుకొని నేను పనిచేసే ఊరికే కాపురం వచ్చేసాను.

అ తరువాత నేను పాపారావుమామ అంకమ్మత్తలను కలిసేది తగ్గిపోయింది. అమ్మ మాత్రం అప్పుడప్పుడు ఊరెళ్ళి కలిసేది.

* * *

ఆరు సంవత్సరాలు గడిచిపోయింది.

నాకు ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు బలరాం వాడి వయస్సు ఐదు సంవత్సరాలు, చిన్నవాడి పేరు చంద్ర వాడికి మూడేళ్ళు.

భానుమతి డిగ్రీ పూర్తి చేసింది.

నేను సత్యంతో కలసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం మొదలు పెట్టా.

పోయిన ఏడాది చివరలో సొంతంగా ఓ ఇల్లు తీసుకున్నా, ఆ నెలలోనే భానుమతికి తెలుగు టీచర్ గా ఉద్యోగం కూడా వచ్చింది.

అమ్మ, జానకమ్మత్త, రాము తమ్ముడు గోపిలు కూడా మాతోనో వుంటున్నారు.

గోపి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు.

భానుమతి మొదట్లో స్కూల్ కేల్లెందుకు రోజు 30km ప్రయాణం చేసేది. తరువాత మా స్కూల్ కే మార్చుకుంది. ఇప్పుడు ఇద్దరం కలిసి స్కూటర్ లో స్కూల్ కి వేలుతాం.

అమ్మకు సుస్తీ చేసి ఇప్పుడు ఎక్కువగా మంచం మీదనే ఉంటుంది. ఆమెకు హాస్పిటల్ కి వెళ్ళడమన్నా, ఇంగ్లీష్ మందులన్నా ఇష్టం ఉండేది కాదు.

భానుమతి రెండు సార్లు బలవంతముగా హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. కాని ఉపయోగం లేనందున అమ్మ మానుకుంది.

ఇప్పుడు తనకు తెలిసిన వైద్యం జానకమ్మత్త సహాయంతో చేసుకొని కాలం లాగుతుంది.

‘లోకంలో ఒక వస్తువు మరో వస్తువు సాంగత్యంతో దాని స్వభావాలు మార్చుకుని, విలువను పెంచుకుంటుంది. అలాగే వ్యక్తులు మరో వ్యక్తి సాంగత్యంతో అతని స్వభావాలు మార్చుకుని, తన విలువను పెంచుకుంటారని’ పుస్తకాలలో చదివాను.

నా విషయంలో అది నిజమయిందనిపిస్తుంది, పెళ్ళయిన తరువాత ఈ ఆరు సంవత్సరాలలో నాలో ఏన్నో మార్పులు.

నాలోని మార్పునకు ముఖ్య కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకరు భానుమతి మరొకరు సత్యం.

* * *

‘సత్యం’ M.A దాక చదువుకున్నాడు. అమ్మ నాన్నలకు ఒకడే కొడుకు.

వాళ్ళ నాన్నది పప్పుదినుసుల హోల్ సేల్ బిజినెస్. పట్టణంలో వాళ్ళదే పెద్ద స్టోర్.

సత్యం తన తెలివితేటలతో రెండు పెద్ద ఇల్లు, ఊరు చివర 10 ఏకరాల పొలము సంపాదించాడు. అతనికి ఊరిలో మంచి పలుకుబడి కూడా వుంది.

సత్యం నాన్న అతనికి ఓ పెద్దింటి సంబందం తీసుకురావాలని ప్రయత్నిస్తూనే పోయిన వారం వరకు గడిపేసాడు. అతననుకున్నట్టుగా పోయిన వారమే M.L.A రామనాధుడు గారి రెండో కూతురి తో సత్యం పెళ్లి నిశ్చయించారాయన.

M.L.A రామనాధుడు ఇప్పటికి రెండు సార్లు అసెంబ్లికి ఎన్నికైయ్యారు, మంచి ధనవంతులు. అయన రెండో కూతురు పేరు మాధవి. ఇంటర్మీడియట్ వరకు చదువుకొని, ఆపైన చదువుకోవటం ఇష్టం లేక మానేసిందట. ఆమె ధనవంతుల బిడ్డ అని చూపించుకొనేందుకు ఎక్కువగా తాపత్రయపడే వ్యక్తి.

ఆమె వస్రధారణలో, మాటల్లో ఆ హెచ్చుతనం కనిపింస్తుంది. ఎప్పుడూ వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎదుటివారిలో తప్పులు వెదుకుతూ ఉంటుంది.

మాధవిని చూసినప్పుడు ఆ అమ్మాయి అతనికి సరైనది కాదేమోనని నా కనిపించింది.

M.L.A ఇంటి సంబంధం కదా, సత్యం వాళ్ళ ఇంట్లోవారికి, వారి బందువులకు బాగా నచ్చి వివాహం జరిపించారు.

సత్యం జీవితంలో మాధవి రాకతో, ఐశ్వర్యం, పలుకుబడి, గౌరవం పెరిగింది కాని, అతనిలోని వ్యక్తిత్వం దెబ్బతిన్నది.

కులమత తేడాలు లేకుండా అందరితో కలిసిపోయే గుణం కలవాడు సత్యం, కాని ఆ గుణం ఇప్పుడు దేబ్బతిన్నట్లుంది.

పెళ్లి అయిన తరువాత సత్యం స్కూల్ కి ఎక్కువగా వచ్చేవాడు కాదు. వచ్చినా క్లాసుకు వెళ్ళేవాడు కాదు. M.L.A అల్లుడు అన్న గౌరవం ఇచ్చి ప్రిసిపాల్ గారే అతనిని క్లాసు కు వెళ్ళనిచ్చేవారు కాదు.

పెళ్ళయిన కొత్తలో నేను భానుమతి సత్యం ఇంటికి వెళ్ళాము. మాధవి ప్రవర్తన భానుమతికి నచ్చక ఆ తరువాత మేము వెళ్ళలేదు.

సత్యం వైవాహిక జీవితానికి మూడు నేలలయింది.

అత్త గారింటిలో అందరు కలసి వుండటం తన సంసార జీవిత గోప్యతకు భంగం కలుకుతుందని మాధవి సత్యంతో గొడవపడి వేరే కాపురం పెట్టింది.

అసలు కారణం సత్యానికి అప్పుడు బోధ పడలేదు. తన వద్దనున్న పది ఎకరాల పొలం అమ్మి, స్విమ్మింగ్ పూల్ వగైరా హంగులతో పెద్ద ఇల్లే తీసాడు. కొత్త కారు కూడా కొన్నాడు.

‘వాసు’ మాధవికి మేనమామ కొడుకు బయట దేశంలో చదువుకొనివచ్చి ముంబైలో బిజినెస్ చేస్తున్నాడు. మన ఆచారాలన్న, సంప్రదాయాలన్న అతనికి తగని చిరాకు. అందుకనేమో ఆతను పెళ్లి కూడా చేసుకోలేదు.

సత్యం పెళ్ళిలో చూసానతనిని. చామనఛాయ రంగు, పొడువాటి మనిషి, అతనికి వయస్సు నాలుగు పదులు దాటుంటుంది.

తల్లిదండ్రులను చూడటానికి అతను ఇక్కడికి వచ్చినప్పుడు మాధవి వాళ్ళ ఇంటికి వేల్లెవాడట. అక్కడ అతనిని ఎక్కువగా ఇష్టపడేది మాధవి మాత్రమేనని పెళ్ళిలో సత్యంతో రామనాధం గారు చెపుతుంటే విన్నాను.

* * *

సత్యం నాన్న గారి వద్ద నెల చీటిలు కడుతుండటం వలన ప్రతి నెలలో మొదటి ఆదివారం నేను సత్యం వాళ్ళ ఇంటికి వేలుతుంటాను.

అప్పుడు సత్యంతో మాట్లాడెందుకు టైం దొరికేది. ఇప్పుడతను వేరే కాపురం పెట్టడం వలన ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది.

ఆరోజు ఆ నెలలో మొదటి ఆదివారం. సత్యం నాన్న గారి వద్ద నా పని అయిపోగానే తిరిగి వెలుతుంటే సత్యం అమ్మ గారు ఎదురై, ‘ఏమయ్యా అప్పుడే వెలుతున్నావు‘ అడిగింది.

చిన్నగా నవ్వి ఊరుకున్నా.

నా మీద వున్న చనువుతో ‘రా.. ఇలా కూర్చో’ అక్కడున్న కుర్చి చూపిస్తూ అన్నది సత్యం అమ్మ.

‘ఈ ఇంటిలో ఆయనకి నేను నాకు అయన తప్ప ఎవరున్నారయ్యా. ఉన్న ఒక్క కొడుకు పెళ్ళాం చెంగు పట్టుకుని వెళ్లి పోయాడు’ అంటూ ఇంటిలో నుండి తెచ్చిన కాఫీని, సత్యం వాళ్ళ నాన్నగారిచ్చిన మూడు కప్పులో పోసింది.

మూడు కప్పులో సమానంగా పోసి, ఓ కప్పును నాకిస్తూ ‘మాధవి మామ’ అంటూ మొదలు పెట్టి, ఆమె ఓ కప్పును తీసుకొని ఆకప్పులోని కాఫీని ఓ గుటక త్రాగి, తన కుర్చీలో కూర్చుంటూ సందేహంగా చూస్తున్న నాతో ‘అదేనయ్యా ఆ బొంబాయి వాడు’ తన కుడి చేయిని చుట్టలు త్రిప్పుతూ బలంగా చెప్పింది.

సత్యం నాన్నగారు మాత్రం తనకేమి పట్టనట్లు కాఫీ త్రాగుతూ నెలచీటి లెక్కలు చూసుకుంటుంన్నాడు.

‘వాడు పెళ్లి తరువాత, నెలలో ఒకసారి మన ఇంటికి మాధవిని చూడటానికి వచ్చేవాడు. ఇక్కడ మేము వాళ్ళకు అడ్డంగా వుండటం గమనించి సత్యానికి మాయ మాటలు చెప్పి వేరే కాపురం పెట్టించింది. ఆమెతో అతని నడవడిక బాగోలేదని చాలా సార్లు సత్యానికి చెప్పాను. వాడు నా మాటలను పట్టించుకోలేదు’ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిందామె.

‘ఉన్న ఒక్కగానొక్కడు దూరంగా వుంటే, మేము ఎవరిని చూసుకొని బ్రతకాలి. ఇదివరకు ప్రతి రోజు వచ్చి చూసి వెళ్ళేవాడు. రెండు వారాలుగా మూడురోజులకు ఓసారి వస్తున్నాడు. మనిషి కూడా బాగా చిక్కి పోయాడయ్యా’ వస్తున్న కన్నీళ్లను తన చీర చెంగుతో తుడుచుకుంటూ చెప్పింది.

సత్యం నాన్న ఆమె మాటలను పట్టించుకోకుండా మౌనంగా తన పని చేసుకుంటుంన్నాడు.

నేను కాసేపు మౌనం గా వుండి, తరువాత ఆమెకు దైర్యం చెప్పి, వాళ్ళ నుండి సెలవు తీసుకొని ఇంటికి బయలు దేరాను.

* * *

తల్లి ప్రేమ కళ్ళలో ఉంటుంది, తండ్రి ప్రేమ గుండెల్లో ఉంటుదని అమ్మ శకుంతలతో చెపుతుంటే వినేవాడిని, ఇప్పుడది ప్రత్యక్షంగా చూసాను.

‘శకుంతల’

కొందరు మనుషులు మనల్ని విడిచి వెళ్లిపోయినా, ఆ మనుషుల గుర్తులు వారి తాలుకు జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి.

భౌతికములైన గుర్తులను చెరిపివేయుట వీలుకలుగుతుందేమో కాని వారి జ్ఞాపకాలు మాత్రం మన మనసు పొరలలో చిరకాలం సజీవంగానే ఉంటుంది.

శకుంతల విషంయంలో నాలో అదే జరిగింది.

T.V లో బి.సరోజాదేవి గారిని చూసినప్పుడల్లా శకుంతల జ్ఞాపకం నా మనసులో మెదులుతుంది. ఆ సమయంలో నేను తప్పు చేసానన్న భావన నను ఓ హంతకుడిలా చిత్రికరిస్తుంది.

వెనువెంటనే నా మష్కికంలో సమాధానం దొరకని ప్రశ్నలు కొన్ని కదులాడుతాయి.

ఆమె కనుమరుగైన తరువాత, గడిచిన కాలంలో ఆమెను మరిచిపోయేందుకు చాలా సార్లు ప్రయత్నించా, కాని ఇంతవరకు ఆమె గుర్తులను కూడా మరవలేకపోతున్నా.

శకుంతల విషయం నేనెప్పుడు భానుమతితో చెప్పినా, ‘కొన్ని బందాలు కేరటాలాంటివి, ఎలా వచ్చాయో, అలానే వెళ్ళిపోతాయి. ఇక్కడ తప్పు నీది కాదు నీ నమ్మకానిది.’ అంటూ నాలో ఆమెను మరిచి పోగలనన్న నమ్మకాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంది.

ఆలోచిస్తూ మోటర్ బైక్ మీద బజారులో వెలుతుంటే ఎదురైంది అంకమ్మత్త, బాగా బక్క చిక్కిన శరీరంతో గుర్తు పట్టలేనట్లుగా మారిపోయింది.

చేతులో నాలుగు మందు బాటేల్లు, ఓ ప్లాస్టిక్ కవర్ తో కంగారుగా వెలుతుంది.

బైక్ ఆపి రెండు సార్లు పిలిచాను. రోడ్డు పైనా వెళుతున్న వాహనాల శబ్దాలకు నా పిలుపు ఆమెకు వినపడలేదనుకుంటా, దగ్గర లోని హాస్పిటల్ కేసి హడావిడిగా వెలుతుందామె.

మోటార్ బైకేను వెనుకకు త్రిప్పుకొని నేను ఆమె వెళ్ళిన హాస్పిటల్ కేసి వెళ్ళా.

హాస్పిటల్ పార్కింగ్ ఏరియాలో బైక్ పార్క్ చేసి, హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరకు వెళ్లి అక్కడున్న ఆమెతో అంకమ్మత్త గుర్తులు, ఊరిపేరు చెప్పి వివరాలు అడిగా.

రిసెప్షన్ లో అమ్మాయి నన్ను ఎమర్జెన్సీ వార్డ్ వైపుకి వెళ్ళమని చెప్పింది.

ఆ అమ్మాయి ఎమర్జెన్సీ అన్న పదం చెప్పగానే నా గుండెల్లో ఏదో తెలియని అందోళన. మా కుటుంభాన్ని కష్టాలలో ఆదుకున్న అంకమ్మత్త ఇప్పుడు కష్టపడుతుంది, ఎందుకు?.

ఎమర్జెన్సీ పాపారావుమామకా లేక భోగికా?.

ఆలోచిస్తూ నడుస్తున్న నాకు, అక్కడ నిలిపి ఉంచిన పేషంట్లను తీసుకువెళ్ళే వీల్ చైర్ కాళ్ళకు తగలటంతో, నా అడుగులు తడబడి పక్కగా వస్తున్న వ్యక్తికి గుద్దుకున్నాను.

క్రిందపడ్డ అతనిని పైకి లేపి, క్షమాపణ కోరి తిరిగి వెళుతుండగా చూసాను. మూతి నిండా గడ్డముతో ఉన్న భోగిని.

అంటే ఎమర్జెన్సీ పాపారావుమామకి.

భోగితో కలసి డాక్టర్‌ను కలిసినప్పుడు నాకర్దమైంది. పాపారావుమామకు atrial fibrillation అనే గుండెకు సంభందించిన వ్యాధని, తోందరగా ఆపరేషన్ చెస్తే పేషెంట్ బ్రతుకుతాడని డాక్టరు చెప్పాడు.

ఆపరేషన్ కు అయ్యే ఖర్చు గురించి డాక్టర్ ద్వారా తెలుసుకొని, ఓ క్షణం ఆలోచించి డాక్టర్ తో ఆపరేషన్ కి ఏర్పాటు చేయమని చెప్పి, నేను భోగి డాక్టర్ వద్ద నుండి సెలవు తీసుకొని, పాపారావుమామ వున్న వార్డు వైపుగా నడిచాము.

నోటికి తన చీర చెంగును అడ్డం పెట్టుకొని, పాపారావుమామ బెడ్ పక్కగా నిలుచుని, డాక్టర్ ఇచ్చిన సూది మందుకి నిద్రపోతున్న పాపారావుమామను చూస్తున్నది అంకమ్మత్త. ఆ గదిలోకి వెళ్ళిన నేను అంకమ్మత్త పక్కకు వెళ్లగానే ఆమె నన్ను గుర్తుపట్టి పాపారావుమామ ఆరోగ్య పరిస్థితి గురించి నాకు చెపుతూ ఏడవసాగింది.

కాసేపటి తరువాత భోగి అంకమ్మత్తకు ఆపరేషన్ విషయం చెప్పటంతో, ఆమె నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని ఏదో చెప్పబోతుంటే, నమస్కరిస్తున్నట్లుగా వుంచిన ఆమె రెండు చేతులని పట్టుకొని ‘పాపారావుమామను కాపాడుకోవటం నా భాద్యత. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అంకమ్మత్త’ వినయంగా అన్నాను.

చీకటి పడుతుండటంతో, భోగికి అక్కడ వుండటానికి కావలసిన ఏర్పాటు చేసి, అంకమ్మత్తను తీసుకొని ఇంటికి బయలుదేరాను.

* * *

అంకమ్మత్తను తీసుకొని మోటార్ బైక్ పై చీకటి రోడ్డుపై వెలుతూ ఆలోచనలో పడ్డాను. రేపు ఆపరేషన్ కు డబ్బు సర్దాలి. నావద్ద, భానుమతి దగ్గర బ్యాంకులో ఉన్న డబ్బు ఆపరేషనుకు సరిపోదు.

ఇప్పుడు నాకు సహాయం చేయగలిగేది సత్యం ఒక్కడే. కాని ఈ టైంలో అతను క్లబ్బు కేల్లుంటాడు. పెళ్ళయ్యాక ఈ మద్య అతనిలో చూసిన కొత్త మార్పది, క్లబ్బుల కేల్లి బాగా త్రాగి రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి వెళ్ళటం.

కొందరు ధనవంతులు అలా చేయటానికి చాలా కారణాలు చెపుతుంటారు.

క్లబ్బుకేల్లి డబ్బులడగటం మంచిది కాదు. పోనీ తెల్లవారి ఇంటికి వెలితే, వద్దు మాధవికి తెలుస్తుంది. ఎలా చేయాలి.

డ్రిల్ మాస్టర్ మోహన్ ను అడిగిచూస్తే.

అవును. నిన్ననే అతను చెప్పాడు. ఇల్లు కొనటానికి అతను డబ్బులు ఏర్పాటు చేసుకుంటున్నాడని. అతని వద్ద తప్పక దొరవచ్చు. అతని వద్ద తీసుకొని తరువాత సత్యం దగ్గర తీసి ఇచ్చేయచ్చు.

ఆలోచనలతో ఇంటికి చేరుకున్నా.

మొహం కడుకొని హలులోకి వచ్చిన నన్ను చూసి అమ్మ చాలా సంతోషించింది.

అంకమ్మత్త పాపారావుమామ ఆపరేషన్ విషయం చెప్పినట్లుంది.

అమ్మ నన్ను తన దగ్గరకు పిలిచింది.

నా నుదిటి పై ముద్దు పెట్టి, తన చేతులను నా మొహం చుట్టూ ఓ సారి తిప్పి చేతివ్రేళ్ళ మెటికలు విరచి, ‘నా ఆయుష్షు కూడా పోసుకొని నూరేళ్ళు బ్రతుకునాన్న’ అంటూ అమ్మ నన్ను ఆశీర్వదించింది.

చాలా రోజుల తరురాత ఆమ్మ కనులలో ఇంత అనందం చూసాను.

జానకమ్మత్త పిల్లలను ఆడిస్తుంది.

అంకమ్మత్తకు భోజనం వడ్డించాక, నాకు భోజనం వడ్డిస్తూ ‘సత్యంగారు వచ్చి వెళ్లారు’ చెప్పింది భానుమతి.

పెళ్ళయిన రోజు నుండి ఇంటికి రమ్మని ఎప్పుడు పిలిచినా ఏదోక సాకు చెప్పేవాడు. ఈ రోజు పిలవకుండానే వచ్చాడే అని ఆశ్చర్యంగా, ‘మాధవి తో వచ్చాడా’ చిరునవ్వుతో అడిగాను భానుమతిని.

‘లేదు అతనొక్కడే వచ్చారు. అమ్మతో కొంచెం సేపు మాట్లాడారు. పిల్లలను తీసుకెళ్ళి చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకొచ్చారు. మీకు ఈ కవర్ ఇమ్మనారు’ అంటూ నా చేతిలో ఓ తెల్లని కవరిచ్చింది భానుమతి.

ఆ కవరు చూడగానే నాలో చెప్పలేన్నని అనుమానాలు మొదలైయ్యాయి.

భోజనం ముగించి బెడ్రూమ్ వైపుగా వెలుతూ, భానుమతి ఇచ్చిన కవర్ ను చించి అందులో ఏమున్నదని చూసా.

రెండు లక్షల రూపాయలు!

అది రియల్ఎస్టేట్ బిజినెస్ లో అతని దగ్గర పెట్టుబడిగా నేను ఉంచిన డబ్బు అయిఉండవచ్చు. కానీ ఇవి ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు?.

దానితో పాటుగా ఓ లెటరు కూడా వుంది ఆ కవరులో.

నాకేమి అర్ధం కావటం లేదు. డబ్బును తీసి పక్కన పెట్టి, లెటర్ ను చదవటం ప్రారంభించా.

ప్రియమైన మిత్రునికి..

నీ స్నేహితుడు సత్యం వ్రాస్తున్న మొదటి, చివరి లేక..

ఆ లైను చదవగానో నాలో ఏవో చెడు ఆలోచనలు మొదలైయ్యాయి.

ఓ నిమిషం తల పైకెత్తి ఎదురుగా వున్న క్యాలండరులోని వెంకటేశ్వర స్వామికి మనసులో నమస్కరించి, తిరిగి లెటర్ చదవటం మొదలుపెట్టా.

“ఈ ప్రపంచంలో నూరుశాతం మంచివారు ఎవ్వరూ లేరు. అంతరిలో ఎంతోకొంత చెడు ఉంటుంది. మనమెప్పుడు మంచిని చూసేందుకు ప్రయత్నించాలి. ఏదుటి వారిలోని బలహీనతలు మాత్రమే చూస్తూ పోతే మనము ఓ రోజు బలహీనులం అవుతాం. నీ స్నేహ హస్తం ఎదుటివారికి బలం కావాలి కాని బలహీనత కారాదు” అంటూ మంచిమాటలు చెప్పి నా తల్లి నన్ను పెంచినందుకో ఏమో నేను ఈరోజు ఓ బలహీనుడిగా మిగిలిపోతున్నా.

అమ్మ తన రెండు కళ్ళుగా నన్ను చూసుకొంది. నాన్న నా ప్రతి ప్రయత్నం లో ఏదో ఒక రూపంలో నా వెంటే వుండి మార్గనిద్దేశం చేసేవాడు.

చిన్నతనము నుండి తల్లిదండ్రుల మీద నా కున్న గౌరవము వలన, వారి మాటలకు నేనేరోజు ఏదురుచెప్పలేదు.

మాధవి విషయంలోను అదే జరిగింది.

మాధవి నా జీవితలోకి వచ్చి ఈ రోజుకి నాలుగు నెలలయింది. ఆమె స్నేహంలో నేను పొందినది శూన్యం. ఆమెలోని బలహీనతలు చూడమని అమ్మ నాకు చెప్పినప్పుడు ప్రేమ కూడా స్వార్దమే అన్న భావన నా కోచ్చేది.

కాని ఏమి చేయను మాధవి లోని బలహీనతలను ప్రశ్నించే అధికారం నాకులేదంటుంది నా వ్యక్తిత్వం. బహుశా అది నా బలహీనత కావచ్చు.

నాకనుల ముందు జరుగుతున్న విరుద్దాలను చూస్తూ ఎంత కాలం ఓ శవంలా బ్రతకగలను. మాధవిని సాధించి తల్లిదండ్రులను సంతోష పెట్టలేను. అలాగని వాళ్ళను దూరం చేసుకోలేను. ఎటూ తెల్చుకోలేకనే త్రాగుడుకు అలవాటు పడ్డాను.

ప్రస్తుతం నా చుట్టూ వున్న ప్రపంచం నా ఇంటిలో జరుగుతున్నదాని గురించే మాట్లాడుతున్నా సమాధానం చెప్పలేని బలహీనత నాది. నాలాంటి బలహీనులకు బ్రతికే అర్హత లేదని నా అంతరాత్మ అప్పడప్పుడు చెపుతుంది.

నా బలహీనత నన్ను ఎప్పుడు బలిగొంటుందోనని భయంతో నీవద్ద నుండి తీసుకొన్న రెండు లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేస్తున్నాను. తప్పుగా అనుకోకు.

నా మీద నీ స్నేహం ఎప్పటికి తగ్గకూడదని ఆసిస్తూ..

నీ మిత్రుడు.

అప్పటికే రాత్రి 10:00 గంటలు అయ్యింది. సత్యం ని కలవాలన్న నా ఆలోచనను రేపటికి వాయిదా వేసుకొని నిద్రలోకి జారుకున్నా.

* * *

తెల్లవారి జామున లేచి అమ్మను, అంకమ్మత్తను తీసుకొని హాస్పిటల్ కెళ్ళాను. నిన్న నేను మాట్లాడిన డాక్టర్‌ను కలసి ఆపరేషన్ కి డబ్బులు కట్టి, మొలకువగా వున్న పాపారావుమామ తో మాట్లాడి, కొద్దిసేపటి తరువాత, ఆపరేషన్ మొదలవగానే అమ్మకు చెప్పి సత్యంను కలవటానికి వడివడిగా హాస్పిటల్ నుండి బయలుదేరాను.

హాస్పిటల్ నుండి బయటకు వస్తుంటే ఆటో దిగుతూ భానుమతి కనిపించింది.

తను బాగా కంగారుగా ఉంది.

మోటర్ బైక్ తీసుకొని ఆమె దగ్గర కెల్లగా, తడి ఆరిన క౦ఠ౦ తో ‘సత్యం అన్న ఆక్సిడెంట్ లో చనిపోయారట. పోలీసులు ఇంటికి వచ్చి మిమ్మల్ని స్టేషన్ రమ్మని చెప్పి వెళ్లారు’ మాట నిలపకుండా చెప్పింది భానుమతి.

ఆమె మాటలు వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురై, భానుమతిని తీసుకొని సత్యం ఇంటికి బయలుదేరాను.

బైక్ నడుపుతుంటే నా చేతులు వణుకుతున్నాయి.

ఓ మంచి మనిషి చనిపోవటానికి కారణం; “కొడుకుని ధనవంతుడిగా చూడాలనుకున్న అతని తల్లిదండ్రుల అత్యాశనా? లేక విలాసవంతమైన జీవితంలో బ్రతికి విలువలకు తిలోదకాలిచ్చిన మాధవినా? లేక ఈ సమాజంలో ప్రతి సమస్యకి ఓ జవాబు వుంటుందని తెలిసిన సత్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన అతని బలహీనతనా?”

ఎవరు?.. అతని మరణానికి కారణం ఎవరు?

నా చేతులు ఇంకా వణుకుతున్నాయి.

సత్యం ఇంటికి చేరుకోగానే, ఇంటి ముందు పెద్ద పెద్ద కార్లు, పోలీస్ జీపులు నిలుచున్నాయి.

సత్యం తన మంచితనంతో సంపాదించుకున్న పలుకుబడి, M.L.A అల్లుడుగా అది ఇంకా రెట్టింపు అవటం వలన జనం పెద్ద సంఖ్య లో వచ్చి ఉన్నారు అక్కడ.

మోటార్ బైక్ అక్కడికి దగ్గరలోవున్న ఓ చెట్టుక్రింద పార్క్ చేసి, బానుమతితో కలసి సత్యం ఇంటిదగ్గరకు నడచి వెళుతుంటే, అక్కడున్న వారిలో ఎవరో అంటున్నారు బాడీని post-mortem కి తీసుకు వెళ్ళారు, హాస్పిటల్ నుండి రావాలని.

మరుక్షణంలో ambulance సౌండ్ వినిపించింది.

Ambulance వస్తున్న సౌండ్ వినగానే, ఇంటి లోపలున్న సత్యం తల్లి దండ్రులు, వారి బంధువులు, మాధవి తరపు వాళ్ళు బయటకు వచ్చారు.

అప్పుడు చూసాను నీరసంగా ఏడుస్తూ ambulance వద్దకు పరిగెడుతున్న సత్యం తల్లిదండ్రులను. మాధవి కనపడలేదక్కడ.

జనం ఎక్కువగా అక్కడికి చేరుకోవటంతో సత్యం పార్దీవదేహాన్ని అప్పుడు చూడలేకపోయాము.

నేను, భానుమతి అక్కడున్న వారందరితో కలసి ఇంటిలోపలికి వెళుతుండగా, వెనుకనుండి పోలీస్ కానిస్టేబుల్ ‘ఏమయ్యా నువ్వేనా వెంకటేశ్వర్లు అంటే’ గట్టిగా పిలిచాడు.

నేను, భానుమతి ఒక్కసారిగా కానిస్టేబుల్ వైపు తిరిగి చూసాము.

అవునని తలవూపిన నన్ను చూసి ఆ కానిస్టేబుల్ ‘S.I గారు పిలుస్తున్నారు’ అన్నాడు బలమైన క౦ఠ౦తో.

బానుమతిని లోపలికి వెళ్ళమని చెప్పి నేను అతనితో కలసి వెళ్లాను.

S.I గారున్న చోటుకు వెలుతూ దారిలో ‘ఎలా జరిగిందని’ అభ్యర్దనగా అడిగాను కానిస్టేబుల్ని.

‘బాగా త్రాగి రాత్రి 1:00 గంటల ప్రాంతంలో కారు నడిపినట్లున్నారు. ఆగి వున్న లారికి గుద్దు కొని కారు గుంటలోకి పడిపోయింది. తెల్లవారి 6:00 గంటల ప్రాంతంలో ఏవరో అటువేలుతూ చూసినట్లున్నారు. అప్పటికే ప్రాణాలు పోయాయంట’ చెప్పాడు కానిస్టేబుల్.

S.I దగ్గరకు వెళ్ళాక నన్ను ఆయనకు పరిచయం చేసి, SI చెప్పడంతో కానిస్టేబుల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

S.I అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబు ఇచ్చి, సత్యం నాకు రాసిన లెటర్‌ను నా షర్టు పాకెట్ లోనుండి తీసి ఇచ్చాను.

నేనిచ్చిన లెటర్ చదివిన S.I, విషయం తెలిసిన వాడిలా ‘ఇదిసరే, నీకుతేలిసి ఇంకెవరితో నైనా బిజినెస్ పరమైన తగాదాలు ఉన్నాయా’ తిరిగి ప్రశ్నించాడు.

‘నాకు తెలిసి అటువంటిది ఏమిలేదండి’ వినయంగా బదులిచ్చాను.

‘సరే పిలిచినప్పుడు స్టేషన్ కి రావలసి ఉంటుంది’ అన్నాడు S.I.

సరేనని తల ఊపి అక్కడి నుండి సత్యం ఇంటి లోపలికి నడిచాను.

ఐస్ బాక్స్ లో వున్న సత్యం శవాన్ని చూసి, అక్కడ ఎక్కువ సేపు నిలబడ లేక బయటకు వచ్చేసాను.

అతని మొహం తప్ప తక్కిన బాగాలన్ని bandage తో కట్టి వున్నారు.

ఉత్తరంలో రాసినట్లు అతని బలహీనతే..! కాదు.. కాదు.. ధనవంతుడిగా చూడాలనుకున్న అతని తల్లిదండ్రుల అత్యాసే అతని చావుకి కారణమని నాకనిపించింది.

మోటార్ బైక్ స్టార్ట్ చేసి భానుమతితో కలసి తిరిగి హాస్పిటల్ కెళ్ళాను.

* * *

‘ఆపరేషన్ బాగా జరిగిందని, మందులు వాడితే సరిపోతుందని డాక్టర్ చెప్పారని’ చెప్పింది అంకమ్మత్త. ఆమె కనులలో సంతోషాన్ని చూసాను.

అమ్మ దగ్గరకు వెళ్లి సత్యం విషయం నెమ్మదిగా చెప్పి, అంకమ్మత్త దగ్గర సెలవు తీసుకొని నేను భానుమతి ఇంటికి వచ్చేసాను.

ఆ తరువాత అంతా షరా మాములే.

ఓ వారం రోజుల పాటు సత్యం మరణంపై ఏవేవో కధలు దిన పత్రికలో వచ్చాయి. చివరకి ఆక్సిడెంట్ లో చనిపోయినట్లుగా చెప్పి పోలీసులు కేసును కొట్టివేసారు.

సత్యం పేరు మీదన్న ఆస్తులన్నీ మాధవి సొంతమైయ్యాయి.

అతని తల్లిద్రంద్రులు ఒంటరిగా మిగిలిపోయారు.

నెల చీటి వేసినందున అది అయ్యెంతవరకు నెలలో ఓసారి సత్యం ఇంటికి వెళ్ళేవాడిని.

నేను అక్కడ ఉన్నప్పుడు, సత్యం వాళ్ళ అమ్మకు కొడుకు గుర్తుకువస్తే ‘బంగారం లాంటి కొడుకుని చేజేతులారా పోగొట్టుకున్నామని’ నాతో చెప్పి భాదపడేది. అప్పుడు ఆమెను ఓదార్చడం నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది.

మాధవిని నేనే కాదు ఆ తరువాత సత్యం తల్లిదండ్రులు కూడా చూడలేదు.

కొన్ని నెలల తరువాత ఎవరో చెప్పారు ఆవిడ బయట దేశాలకు వెళ్లిందని.

* * *

మా పెద్దవాడికి పదమూడేళ్ళ వయసప్పుడు అమ్మ ఓ రోజు నిద్రలోనే కనుమూసింది.

ఆమెను చూడటానికి వచ్చిన వారిలో కొందరు ఆమెను పుణ్యాత్మురాలు అని అన్నారు. నాకు నవ్వు వచ్చింది. గతజన్మలో పుణ్యం చేసుకొన్నందుకు ఆమె తక్కువ వయస్సు లో భర్తను కోల్పోతుందా, ఆత్మీయులందరూ దూరమై కష్టాలతో జీవించిందా. ఆ మాటకొస్తే మానవుడి గా పుట్టిన ప్రతి ఒక్కరు పుణ్యాత్ములే కదా.

గోపికి కలెక్టర్ గా ఉద్యోగం వచ్చి హర్యానాకు వెళ్ళాడు. అతనికి పెళ్ళయి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. జానకమ్మత్త కొడుకుతో ఉంటుంది.

సంవత్సరాలు రోజుల్లా గడిచిపోయాయి. నా ఉద్యోగ కాలపరిమితి పూర్తయ్యి నేను రిటైర్డ్ అయ్యాను.

నా పెద్దకొడుకు బలరాం ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి పెళ్లి చేసాము. పోయిన ఏడాది వాడికి కొడుకు పుట్టాడు. ప్రస్తుతం వాడు కుటుంబంతో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంటున్నారు.

సంవత్సరానికి ఓ సారి కుటుంబంతో ఇండియాకి వస్తుంటాడు.

చిన్నవాడు హైదరాబాద్ గోద్రెజ్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వాడికి పోయిన ఏడాదే పెళ్లి చేసాం.

భానుమతి కూడా ఈ సంవత్సరమే రిటైర్డ్ అయ్యింది. నాకు, భానుమతికి చిన్న పిల్లల పై నున్న మమకారం మాచేత children day care center ఓపెన్ చేసేలా చేసింది.

చిన్నవాడున్న apartment లోనే నేను బానుమతి కలిసి ఓ ఫ్లాట్ ను బాడుగకు తీసుకొని day care center నడుపుతున్నాము.

మొత్తం 20 పిల్లలు, ఇద్దరు babysitter లున్నారు మా సెంటర్ లో. ఆరునెలలలో day care center బాగా వృద్ధి చేసాము.


-ప్రస్తుతం-

ఆదివారం, ఉదయం 9:00 గంటలు..

ఇప్పుడు ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం వుంటుందో నేను ఊహించగలను.

చాలా రోజులతరువాత తీరిక చిక్కినందున నిన్న రాత్రి 11:00 గంటల వరకు ‘శ్రీ రామరాజ్యం’ సినిమా చూసింది బానుమతి.

చాలా ఆలస్యంగా నిద్రపోవటం వలన భానుమతి ఇంకా నిద్రలేచి ఉండదు. అదికాక టిఫెన్ తయారుచేయటం ఈవాళ నా పని.

ప్రతి ఆదివారం నేను టిఫెన్ తయారుచేసి ఆమెను నిద్ర లేపుతాను. భానుమతికి జీడిపప్పు ఉప్మా, కొత్తిమీర చట్నితో పెడితే చాలా ఇష్టంగా తింటుంది.

నేను ఈ రోజు అదే చేయ్యాలనుకున్నా, ఏందుకంటే ఈ రోజు భానుమతి పుట్టినరోజు.

నిన్న రాత్రి 12:00 గంటలకు పెద్ద వాడు ఆమెకు ఫోన్ చేసుండాడు. తెల్లవారి హాల్లో ఉన్న ఆమె మొబైల్ లో missed call చూసాను.

భానుమతి నిద్రలేచి ఉంటే నాకోసం ఇప్పటికే ఇళ్ళంతా వెతికి ఉంటుంది. ఆ తరువాత, నిన్న రాత్రి డైనింగ్ టేబుల్ పై తను వుంచిన మాత్రలను చూసుంటుంది. ప్రతి రోజు ఉదయం టిఫెన్ కి ముందు నేను మ్రింగవలసిన షుగర్, బి.పి మాత్రలవి.

అవి అక్కడే వుండటం గమనించి కంగారుగా ఓసారి హాలులో గోడమీదున్న గడియారం వైపు చూసి, నా మొబైల్ ఫోన్ కి ఫోను చేసుంటుంది.

నా మొబైల్ పోన్ బెడ్రూమ్ లో వుండట చూసి, బెడ్ రూమ్ కిటికీలో నుండి పార్క్ లో నను వెతికుంటుంది. అక్కడా నేను కనపడకపోయేసరికి, భయంతో చిన్నవాడికి ఫోన్ చేసుంటుంది.

అందరూ కలసి క్రిందకు వచ్చి, సెక్యూరిటీ ద్వారా నేను బయటకు వెళ్ళిన విషయం తెలుసుకొని, apartment బయటకు వచ్చి వెతకటం మొదలుపెట్టి ఉంటారు.

* * *

మబ్బుల లోకంలా వుంది అది.

నేను నిలిచున్న చోటునుండి దక్షణ భాగంలో వైతరణీ నది వెలుతుందనుకుంటా. అక్కడకి దగ్గరలో గాలిలో అడుగులు వేస్తూ తిరుగుతున్న నాలాంటి వారు చాలామంది ఉన్నారు.

ఒకరితో మరొకరి సంభందం లేనట్లు ఎవరిదోరణిలో వారుండటం గమనించి, నాలుగు అడుగులు దక్షిణం వైపుగా వేసాను.

అక్కడికి కొంత దూరంలో ఓ ఆరుగురు ఒకతను చెపుతున్న దానిని వింటున్నారు. వారందరూ 60 కి పైబడిన వయస్సు వారుగా కనిపిస్తున్నారు.

పది అడుగులు వేసిన తరువాత గమనించా వారందరూ పాపారావుమామ చెపుతున్నదేదో వింటున్నారని.

నను చూడగానే పాపారావుమామ మొహములో రంగులు మారాయి. ఏదో తప్పుచేసిన వాడిలా నా వద్దకు వచ్చి. నేను పాపాత్ముడిని బాబు అన్నాడు.

‘నేను చేసిన పాపాలకు పలితంగా వైతరణీలో నడచి నరకానికి వెళ్ళవలసిందిగా దేవదూతల నుండి సందేశం వచ్చింది. నా సమయం కోసం వేచివున్నా’ అని భాదగా చెప్పాడు.

‘ఏమిచేసారు’ కుతూహలంగా అడిగాను ఏదో తప్పుచేసి పశ్చాతాపపడుతున్నట్టు కనపడుతున్న పాపారావుమామని.

‘నీ పెళ్లిలో శకుంతల ఉరి వేసుకొని చనిపోవటానికి కారణం నేనే బాబు’ అని చెప్పి మౌనంగా తలదించుకున్నాడు.

అది విన్న తరువాత అతని పై నాకున్న గౌరవం కోపంగా మారింది. ‘కన్నకూతురి చావుకి కారణమైన నీలాంటి తండ్రులకు ఆ దేవుడు ఖటినమైన శిక్షే వేస్తాడు’ అని నాలో నేను అనుకున్నా.

కంటి నిండా నీళ్ళతో తలఏత్తి నావైపు చూసి కాసేపు ఆగి, ‘కులం పేరుతో దానికి నీ మీదున్న ప్రేమను చంపేసా. పిచ్చిది నీ పెళ్లిని ఆపేందుకు చావుని మార్గం గా చేసుకుంది’ రోధిస్తూ అన్నాడు పాపారావుమామ.

ప్రతి మనిషిలోనూ బయటకి కనపడని మరో మనిషి దాగి ఉంటాడంటారు. అది ఎంతవరకు నిజమో ఈ రోజు పాపారావుమామలో దాగివున్న ఆ మరోమనిషి గుణం తెలుసుకున్నాక అర్దమైంది.

ఇన్నాళ్ళుగా నను భాదిస్తున్న ఓ ప్రశ్నకి ఈ రోజు సమాధానం చిక్కిందన్న ఆనందం కన్నా, శకుంతల చావుకి కారణం మా ఇద్దరి కులాలు ఒకటి కాకపోవటమన్న విషయం నను క్రుంగదీసింది.

నా గుండెను ఏవరో బలంగా గుద్దినట్లుగా అనిపించింది.

నను ఎవరో అక్కడినుండి వెనుకకు లాగుతున్నట్లుంది.

* * *

నాకు ఏదురుగా ఉన్నతను వేసుకొని ఉన్న తెల్లకోటుని చూస్తుంటే, నేను ప్రస్తుతం 108-ambulance లో stretcher మీద పడుకుని ఉన్నట్లు అనిపిస్తుంది.

స్పృహ తప్పి ఏటువంటి చలనం లేకుండా రోడ్డు పై పడివున్న నన్ను చూసి ఎవరో 108 కి ఫోన్ చేసినట్టున్నారు.

నా మూతికి మాస్కు పెట్టి నా ఊపిరితిత్తులలోకి గాలిని పంపెందుకు ప్రయత్నిస్తున్నాడు తెల్లకోటు వేసుకున్నతను. అతను చాలా కంగారుగా కనిపిస్తున్నాడు.

డాక్టర్ అనుకుంటా. తన పక్కనున్న వ్యక్తికి ఏదో సూచనలిస్తున్నాడు.

గుండె కొట్టుకోవటాన్ని చూపే మిషన్ వైపు చూస్తూ, Electric shock paddles ను ఒకదానితో ఒకటి రుద్ది నా గుండెల మీద పెడుతున్నాడతను.

నను ఎలాగైనా బ్రతికించాలనే పట్టుదల అతని మొహంలో నాకు కొట్టోచ్చినట్లు కనపడుతుంది.

అప్పుడప్పుడు అతను నా నోటి లో నోరుపెట్టి గాలి ఊదుతున్నాడు.

సార్.. వేకటేశ్వర్లు సార్..అంటూ పిలుస్తున్నాడు. నా శిశ్యుడను కుంటా, గురువుని కాపాడుకొనేందుకు సర్వశక్తుల ప్రయత్నిస్తున్నాడు.

అతని ప్రయత్నానికి అనుగుణంగా నా శరీరం పని చేయటం లేదు.

కెమరాముందు నల్లని గుడ్డ కప్పినట్లుగా, నా మెదడును చీకటిపోర మెల్లగా కమ్ముకుంటుంది.

నా శరీరం తేలికై పోయింది.

* * *

గోధుమరంగు వన్నెలతో ఉన్న మబ్బుల లోకం అది.

ఇంతకుముందు నేను పాపారావుమామ చూసిన చోటు అదికాదు.

ఆక్కడి తేలుతున్న మబ్బులపైన పాపారావుమామను వెతుకుతూ మూడడుగులు ముందుకు వేసాను.

నాలుగో అడుగు వేస్తుండగా నా వెనుకనుండి ఏవరో పిలిచిన శబ్దం వినిపించి, తిరిగి చూసా.

లేత దొండపండు రంగులో ఉన్నాడతను.

కుడి చేతిలో మంత్రదండం లాంటిదేదో పెట్టుకోనున్నాడు. నెత్తిన చిన్న కిరీటంతో దేవదూతలా కనబడుతున్నాడు.

ఇదిగో ఇలారా అంటూ తన కనులతో పిలిచాడు.

అతని కనులలో ఏదో మాయ ఉన్నట్టుంది. మరుక్షణంలో నా కాళ్ళు అతనిని అనుసరించి నడువ సాగాయి.

బంగారువన్నె కలిగిన ద్వారముల నుండి వేలుతున్నాడతను.

మూడు ద్వారములు దాటగానే ఆ మబ్బులలో అతను ఏటూ వెళ్ళాడో నాకు కనబడలేదతను.

అతని కోసం వెతుకుతుంటే ఓ మబ్బు చాటున కనిపించాడు రాము.

అవును అది రామునే.

ఏందుకతను నేను పిలిచినా పలకడం లేదు. అర్ధం కాక, అతని ముందుకెళ్ళి నిలుచున్నా.

నిర్మలంగా నను చూసి నవ్వుతున్నాడు కానీ, నా మాటకు బదులీయ్యటం లేదతను.

ఎవరి పిలుపు కోసమో ఎదురుచూస్తున్న వాడిలా ఉన్నాడతను.

రాముని మాట్లాడించేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడ ఏవ్వరో నను పిలిచినట్టుగా అనిపించి తిరిగి చూసా.

మబ్బులపై పద్మాసనం వేసి కూర్చుని, తల నిండా జుట్టు చుట్టలు చుట్టుకొని, మూతినిండా గడ్డం పెట్టుకొని పెద్ద మహర్షిలా ఉన్నాడతను.

అతని దగ్గరకు వెళ్లి. ‘స్వామి మీకు నా పేరెలా తెలుసు’ వినయంగా అడిగాను.

‘సకల చరాచర సృష్టి ఆ పరమశివుని ఆధీనం, ఆ శివుని పరమభక్తులకు, ఆయన ముద్దు బిడ్డల పేర్లు తెలియకుండా ఉంటాయా నాయనా’ అన్నాడా మహర్షి.

ఆ మహర్షి చెప్పిన మాటలు అర్ధము కాక ఆలోచనలోవున్న నను చూసి, చూడు నాయన అతను పూర్వజన్మలో నీకు స్నేహితుడు. ప్రస్తుతం అతను పరమశివుని ఆజ్ఞ కోసం వేచివున్న పూర్వజన్మ ఆకృతి కలిగిన అత్మ, ఆటువంటి జీవాత్మ(జీవి-ఆత్మ)లకు పూర్వజన్మ జ్ఞాపకాలు ఏమి గుర్తుండదని చెప్పాడు మహర్షి.

‘మరి ఇంతకు ముందు పాపారావుమామ!’ నేను అంటుండగానే, నా మాటలకు అడ్డుతగులుతూ.

చూడు నాయనా, పాపారావు ఓ పాపి.

పాపాత్ములు వారు చేసిన పాపాలకు శిక్ష పడుతుందని తెలిసిన వెంటనే, తాము చేసిన పాపాలను గుర్తుకు తేచ్చుకొని పరిహార మార్గాలను వెదుకుతూ శిక్ష నుండి బయటపడేందుకు చూస్తారు.

నిను కలసిన పాపారావుది అటువంటి ప్రయత్నమే.

అర్ధముకాని ఆయన మాటలకు అలోచిస్తూ నిలిచున్న నను చూసి, చూడు నాయనా నీలోని వేదనలకు గల కారణాలు నివృతి గావించెందుకే ఆ భగవానుడు నీకీ సందర్బాన్ని ప్రసాదించాడు.

ప్రతి జీవికి ఓ ప్రయాణాన్ని, ప్రతి ప్రయాణంలో ఓ మలుపుని, ప్రతి మలుపులో ఓ మార్పుని, ప్రతి మార్పులో ఓ జీవితాన్ని రూపకల్పన చేసి వుంటాడు ఆ పరమేశ్వరుడు.

ప్రతిజీవి జీవితంలోని మార్పులకు ఆయనే మూలకారణం.

చెట్టు ముందా విత్తనం ముందా?, కోడి ముందా కోడిగుడ్డు ముందా?, చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తాడు? ఇలాంటి నివృతి కానీ కొన్ని ఆలోచనలు మనిషి లోని వేదనలకు కారణం.

వేదనలు జీవాత్మదే కానీ పరమాత్మది కాదు.

విత్తు జీవాత్మ అయితే చెట్టు పరమాత్మ.

తక్కినవన్ని కూడా అంతే.

వేదనలకు మూలం జీవాత్మను కలిగిన మనిషిలోని ఆలోచనల పలవరింతలు, తెలివితేటల పలకరింతలు, జ్ఞాన విజ్ఞానాల పులకరింతలు.

వేదనలన్నవి వాస్తవానికి మనిషి లోని జ్ఞాపకాలు.

ఆ జ్ఞాపకాలు లేనినాడు జీవిలో జీవం ఉండదు.

విత్తు నుండి మహావృక్షం వచ్చినట్లే, సూక్ష్మ రూపంలోకి పరమాత్మ అంశమైన జీవాత్మ చేరి కాలగమనంలో మనిషి రూపంగా రూపుదిద్దుకుంటుంది.

ఈ ప్రక్రియ ఆ పరమాత్ముని క్రియ.

కాలచక్రంలో ఒకే రూపం కలిగిన జీవి పుట్టుకలు జరగటం సహజం అంటూ ఉదయం పిల్లవాడు అన్న మాటలను నాకు గుర్తుచేసాడా మహర్షి.

కానీ జీవాత్మలు ఒక్కటవటం (మరుజన్మలు) మాత్రం దైవాధీనమే అని చెప్పుతూ.. ‘అదిగో చూడు శకుంతల’ అంటూ నాలుగో బంగారు వన్నె ద్వారం నుండి బయటకు వస్తున్న ఆమెను చూపాడు మహర్షి.

ఆమెలో ఏమార్పు కనబడలేదు నాకు. ముప్పైఎనిమిది సంవత్సరాల క్రితం ఎలావుందో అలానే కనబడుతుంది.

ఆమెతో మాట్లాడాలని సంతోషంగా తన దగ్గరకు అడుగులు వేస్తున్న నన్ను పిలిచాడు మహర్షి.

అయన పిలుపుతో తిరిగి చూసాను.

‘చూడు నాయనా. అమెది కూడా రాము స్థితియే. పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుండవు’ చెప్పాడు.

మహర్షి మాటలు విన్నాక, నిరాశతో తిరిగి అయన వద్దకు వచ్చి నమస్కరించి నిలిచున్న నన్ను చూసి.

నీకు తెలియవలిసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, నీ తల్లి, మీ సన్నిహితులు, బందువులు చెప్పినట్లు పుణ్యాత్మురాలే.

ఆమె చేసిన మంచి పనులలో ఒకటి; తన మూత్రపిండాలలో ఒకటి నీకు దానం చేసి నీకు మరోజన్మని ఇచ్చిందామె.

‘ఆమె చేసిన మంచి పనులకు ప్రతిపలంగా ఆమె జీవాత్మ పరమాత్మలో ఐఖ్యమయ్యింది’ చెప్పాడా మహర్షి.

ఆ మాటలు విన్నాక నా కనులలో నీరు నిండుకుంది.

‘అమ్మా’ అంటూ కనులు మూసుకున్నా..ఓ క్షణం నా కనులలో అమ్మ రూపం కదలాడింది.

మరుక్షణంలో నా గుండెపై 100 టన్నుల బరువు పడ్డమాదిరి ఒత్తిడికి లోనయ్యాను.

మరణంలో మరో మరణమా అన్నట్టుంది నాకు.

* * *
హాస్పిటల్ గది అనుకుంటా.

నా చుట్టూ ఉన్నవాళ్ళు తెల్ల కోటు వేసుకొని మూతికి పచ్చగుడ్డ కట్టుకొని ఉన్నారు.

ఆప్పటిదాక నాలోనే ఉంటూ దోబూచులాడుతున్న నా ఊపిరిని గాడిలో పెట్టినట్టున్నాడు నా శిష్యుడు. సంతోషంతో తన పక్కనున్న అతనిని కౌగలించుకున్నాడు.

చుట్టూ ఓ సారి దీనంగా చూసింది నా కనులు.

చిన్న చిన్న మిషన్లు, పచ్చరంగు కర్టెన్లు, మందు సీసాలను చూస్తూ, నాకు కుడి వైపుగా వున్న గ్లాస్ తలుపు దగ్గర ఆగింది నా కనులు.

తలుపుకున్న ఐదు అంగుళాల వ్యాసార్ధం కలిగిన వృత్తంలో నుండి దీనంగా లోనికి చూస్తున్నది ఓ రెండు కనులు.

ఆ కనులు భానుమతివే. ఆమె కనులు ఎంతసేపు వర్షించిందో తెలియదు బాగా తడి ఆరివున్నవి.

నిన్న రాత్రి ‘శ్రీరామరాజ్యం’ సినిమా చూసిన తరువాత, నిద్రపోవడానికి గదిలోకి వచ్చి మంచం పై పడుకుంటూ, సగం నిద్రలో వున్న నాతో ‘నయనతార సీత గా చాల బాగా చేసిందండి. ఆమె కన్నులు చాలా అందంగా ఉంటుంది కదా’ అంటూ సన్నగా నవ్వింది.

ఆమె మాటలకు నేను నవ్వుతూ లేచి ఆమె పక్కకి పడుకొని. భానుమతి కనులను ముద్దాడి ‘ఈ కనుల కంటే నా..’ ప్రేమగా బదులిచ్చాను.

ఆ అందమైన నయనాలు ఇప్పుడు ధీనంగా నా వైపే చూస్తున్నవి.

ఆమెను పిలవటానికి నా కుడి చేయి అచేతనంగా లేవటం చూసి, నా భుజం పై తట్టి బయటకు వెళ్ళాడు నా శిష్యుడు.

అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది ఆ మహర్షి చెప్పిన మాటలు.

“వేదనలన్నవి వాస్తవానికి మనిషి లోని జ్ఞాపకాలు,

ఆ జ్ఞాపకాలు లేనినాడు జీవిలో జీవం ఉండదు.”


మరల నాలో వేదనలు మొదలైయ్యాయి అనుకుంటా!

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.