ఎదురుచూపు

ఉదయం పదిగంటలు కావొస్తోంది. కార్తీక్ స్నానం చేసి వచ్చి టిఫిన్ తినడానికి కూర్చుండబోతు తాతగారిని కూడా పిలుద్దామని ఆయన గదిలోకి వెళ్ళి చూస్తే పడుకుని ఉన్నారు. లేపడమెందుకులే అనుకుని పనిమనిషి రంగికి తాతయ్య లేచాక టిఫిన్ పెట్టమని చెప్పి తానొక్కడే టిఫిన్ చేసి కాఫీ త్రాగి కాలేజీకి బయలుదేరాడు.

‘ఈ మధ్య తాతయ్య ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. నాన్నకి ఈ విషయం ఫోన్ చేసి ఒక సారి వచ్చి చూసి వెళ్ళమని చెప్పాను కూడా. అలాగే వీలుచూసుకుని వస్తానని చెప్పారు నాన్న’ అనుకుంటూ వెళ్ళబోతుండగా ‘ధబ్’ మని ఏదో పడిన శబ్దం వినిపించింది.

“బాబూ తాతగారు పడిపోయారు” అన్న రంగి అరుపు వినిపించి చేతిలోని పుస్తకాలు సోఫాలోకి విసిరి తాతగారి గది వైపు పరిగెత్తాడు .

వెళ్ళి చూస్తే కార్తీక్ తాతగారు నీలయ్యగారు బాత్రూమ్ గుమ్మం దగ్గర స్పృహ లేకుండా పడి ఉన్నారు.

“తాతగారూ !” ఆందోళనగా పిలిచాడు.

ఆయన పలకక పోవడంతో వెంటనే ఆంబులెన్స్ పిలిపించి దగ్గరలోనే ఉన్న పెద్ద ఆసుపత్రిలో చేర్పించాడు . నీలయ్యగారి వయసుని కూడా పరిగణనలోకి తీసుకుని పరీక్షలన్నీ జరిపి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని తేల్చి వెంటనే ఇంటెన్సివ్ కేర్ లో చేర్చారు. సరైన సమయానికి వైద్యం అందటంచేత ఆ సాయంత్రానికి కొంచం కోలుకున్నారు నీలయ్యగారు. తాతగారి మంచం ప్రక్కనే దిగులుగా కూర్చుని ఆయననే చూస్తున్నాడు కార్తీక్........................

కార్తీక్ కి తాతయ్య నాన్నమ్మలంటే ఎంతో ఇష్టం. నాన్నమ్మ చనిపోయాక తాతగారు ఒంటరిగా ఉంటారు నేను ఆయన వద్ద ఉంటాను వెళ్ళి అని మొండి పట్టు పట్టి తల్లి తండ్రి తనని విడిచి ఉండలేమని అంటున్నా వినకుండా భారతదేశం వచ్చి తాతగారి వద్దనే ఉండి చదువుకోసాగాడు. కార్తీక్ తల్లిదండ్రులు గోపాల్, రాధ లండన్ లో ఉంటారు. అందరి తండ్రుల్లాగానే నీలయ్యగారికి కొడుకంటే పంచప్రాణాలు. ఎప్పుడు మనుమడు కార్తీక్ తో ఆ కబుర్లే చెపుతుంటారు.

‘నాన్న మాత్రం తాతగారిని అంతగా తలుచుకోగా నేనెప్పుడూ వినలేదు’ అనుకుంటాడు కార్తీక్. కానీ అదే మళ్ళీ నేను ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా ఎంతో ఆందోళన చెంది పది సార్లు తానే చేస్తారు నాన్న. మరి తాతయ్య కూడా ఆయనతో మాట్లాడటానికి అంతగాను ఎదురుచూస్తారేమో అని నాన్నకు అనిపించదా కొంత ఆశ్చర్యంగా ఎంతో బాధగా అనుకుంటుంటాడు కార్తీక్. ఎన్నో సార్లు ఈ విషయంలో తండ్రికి నచ్చ చెపుదామని ప్రయత్నించి విఫలమాయాడు కార్తీక్.

“కార్తీ! నాన్న ఫోన్ చేశాడా?” తాతగారు అలా అడగడం ఇప్పటికి పదోసారి.

‘నాన్న ఎందుకు ఇలా చేస్తారు? నాతో మాట్లాడినప్పుడే ఒక్కసారి తాతగారిని కూడా పలుకరించవచ్చుగదా?’ అదే ఆయనను అడిగితే ఇప్పుడు కాదు మీటింగు ఉంది, ఆదివారం చేసి మాట్లాడుతానులే అని పెట్టేస్తారు ఫోన్ . అలాగని ఆదివారం చేస్తారా అంటే మళ్ళీ ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు చేస్తారు.


ఇక్కడేమో తాతగారు నాన్న ఫోన్ కోసం ఆయనతో రెండు నిముషాలు మాట్లాడటం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఒకటికి పదిసార్లు అడుగుతుంటారు. ఆయనతో నిజం చెప్పి బాధపెట్టదానికి మనసొప్పక ‘లేదు తాతయ్య’ అని అబధ్ధం చెప్పి దాటవేస్తుంటాడు. తాతయ్య ఎంతవరకు తన మాటలు నమ్ముతాడో తెలియదు కార్తీక్ కి .................

నీలయ్యగారు కొంచంగా కదలటంతో ఆలోచనలలోంచి బయటపడి ఏదో చెప్పాలన్నట్లుగా ప్రయత్నిస్తున్న ఆయనను గమనించి ముఖం పైకి వంగి “ఏం కావాలి తాతగారూ ?” అడిగాడు కార్తీక్. ఆయన కళ్ళు గుమ్మం వైపు చూడటం గమనించిన కార్తీక్ ఆయన ఏమడగాలనుకుంటున్నారో అర్థం చేసుకున్నట్లుగా “నాన్నకి ఫోన్ చేసి చెప్పాను తాతయ్యా ఆయన వెంటనే బయలుదేరి వస్తానన్నారు” అన్నాడు.

“నిజంగా” అన్నట్లు మనుమడి కేసి చూసి అలసటగా కళ్ళూ మూసుకున్నారు నీలయ్యగారు. తాతగారు అలా ఎందుకు చూశారో తెలుసు కార్తీక్ కి. నాన్న త్వరగా వస్తే బాగుండును అనుకున్నాడు . ఆ రాత్రి నీలయ్యగారికి మరొకసారి హార్ట్ అటాక్ రావడంతో కళ్ళు గుమ్మం వైపు ఆశగా కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నాయా అన్నట్లుగా తెరిచే ఉండిపోయి , ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోగా తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారు ఆయన.

కర్మకాండలు చేయవలసినది కొడుకే కాబట్టి గోపాల్ వచ్చే వరకు ఆయన భౌతిక కాయాన్ని మంచు పెట్టెలో ఉంచారు. ఆ తరువాత రెండు రోజులకి గాని గోపాల్ రాలేక పోయాడు. అదేమని అడిగిన కార్తిక్ కి విమానాలు దొరకలేదు సమయానికి అని చెప్పి తప్పించుకున్నాడు.

నీలయ్యగారికి మంచి పేరు ఉండటం వలన ఆయనకు శ్రేయోభిలాషులు కూడా మెండుగానే ఉన్నారు. అందరూ ఆయన అంత్యక్రియలకి తరలి వచ్చారు. ఆయనని అందరూ ‘ఎంతో మంచి వ్యక్తి, ధర్మాత్ముడు... అంటూ కొనియాడిన వారే. అదే నోటితో ‘పాపం ఆ పెద్దాయన బ్రతికి ఉన్నంత కాలం కొడుకు వస్తాడని ఎదురుచూశాడు , ఇప్పుడు చనిపోయాక శవం కూడా కొడుకు కోసం ఎదురుచూపులు చూసింది. ఇలాంటి దుర్గతి శత్రువులకు కూడా కలుగకూడదు’.....అన్న మాటలు కూడా గోపాల్ చెవిన పడ్డాయి.

ఇవన్నీ ఒక ఎత్తైతే కొడుకు కార్తీక్ కూడా తనతో ముభావంగా ఉండటం చూసి గోపాల్ కి తానెంత తప్పు...కాదు కాదు మహాపాపం చేశాడో అర్థమయింది.

‘అవును ఒక్కరోజు కార్తీక్ నుండి ఫోన్ రాక పోతే నేనెంత తల్లడిల్లి పోయేవాడిని అలాంటిది పాపం నాన్నకి కూడా అలానే అనిపించి ఉంటుంది కదా? నాకెందుకు అంతమాత్రం ఇంగిత జ్ఞానం లేకపోయింది? జీవితాంతం నా కోసం, నాతో మాట్లాడటం కోసం ఎదురుచూసిన నాన్నకు , ఆఖరుకి మరణానంతరం కూడా నాకోసం ఎదురుచూపులు చూసే దుస్థితి కలుగచేసానే అయ్యో నేనెంత దురదృష్టవంతుడిని?’ అనుకుని తండ్రి పటం వద్ద మోకరిల్లి విలపిస్తూ పైలోకంలోనున్న తండ్రి క్షమార్పణ కోసం ఎదురుచూడసాగాడు గోపాల్.

*****సమాప్తం*****


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.