విలువ (కథ )

‘‘గురువుగారు! రానురాను సమాజంలో బ్రాహ్మణులంటే ఆదరణ, విలువ లేకుండా పోతోందండి’’ అన్నాడు శ్రీనివాసశర్మ.

‘‘ ఏమిటీ? మనకు విలువ లేకుండా పోతుందా?’’ ఆశ్చర్యంగా అడిగారు చంద్రవౌళి.

చంద్రవౌళి శైవాగ పండితుడు. ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు చేయడంలో దిట్ట. చుట్టుపక్కల ఉన్న అర్చకులు, సహచరులు ఆయన్ని

గౌరవంగా గురువుగారు అంటూ పిలుస్తుంటారు. ఆయన శిష్య బృందంలో శ్రీనివాసశర్మ ఒకడు. స్థానికంగా ఉన్న అమ్మవారి గుడి చంద్రవౌళి కేరాఫ్ అడ్రస్. ఆరోజు సాయంత్రం చంద్రవౌళి, శిష్యుడు శ్రీనివాసశర్మ పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు.

‘‘అవును గురువుగారు బ్రాహ్మణులంటే గౌరవం లేకపోగా ఎదురుపడితే తల పక్కకు తిప్పుకుపోతున్నారెందుకండి?’’

‘ ఓరేయ్ శర్మా! నీకెందుకు అలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ మనకున్న విలువ ఎక్కడికి పోలేదురా’’

‘‘మీరు ఎన్నైనా చెప్పండి నాకైతే అలాగే అనిపిస్తోంది’’ అన్నాడు శర్మ.

‘‘పోనీ! నీవనుకుంటున్నట్లు మనకు సమాజంలో విలువ లేకుండా పోతుందనుకుందాము. కారణమేమై ఉంటుందంటావ్?’’

‘‘ ఏం చెప్పమంటారు? మన చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో అర్చకులు ఎంత దుర్భర స్థితిలో ఉంటున్నారో చూస్తున్నారు కదా?’’

‘‘అయితే’’

‘‘అయితే అంటారేమిటండీ? ఆదరణ ఎక్కడుంది?’’

‘‘ ఆదరన కాలక్రమేణా తగ్గుతోందని నేనూ ఒప్పుకుంటాను’’

‘‘విలువ ఎక్కడుందండి?’’

‘‘దానికి నేను ఒప్పుకోను. మనకున్న విలువ, మర్యాద, గౌరవం ఎదైనా అనుకో వాటికైతే లోటు లేదంటాను’’

‘‘మీలాంటి వేద పండితులకు అయితే అవన్నీ ఉంటాయి. మాలాంటి బక్క బ్రాహ్మణులకు ఎక్కడున్నాయండి అవి?’’

‘‘ ఒక పని చెయ్యి. రేపు ఉదయం మన ఎమ్మెల్యే గారింట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. నీవూ నాతోరా. నాకూ సహాయంగా ఉంటావ్’’ అన్నారు చంద్రవౌళి.

మర్నాడు ఉదయం చంద్రవౌళి, శిష్యుడు శ్రీనివాసశర్మ ఎమ్మెల్యే ఇంట్లో వ్రతం జరిపిస్తున్నారు. చంద్రవౌళి పూజా కార్యక్రమం జరిపిస్తూనే

మధ్యమధ్యలో వ్రత ప్రాశస్థ్యాన్ని వివరిస్తుంటే ఎమ్మెల్యే దంపతులతో పాటు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు. పూజా కార్యక్రమం కానే వచ్చింది. దేవుడి దగ్గర ప్రసాదం నైవేద్యం పెట్టారు. పూర్వంలా ఎక్కువ సేపు నేల మీద ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నాను అంటూ నిలబడ్డాడు చంద్రవౌళి. శర్మ హారతి ఇచ్చాడు. అందరూ కళ్లకద్దుకున్నారు.

ఒక పెద్దాయన ముందుకు వచ్చి ‘‘పంతులుగారూ! ప్రసాదం ఇవ్వండి’’ అంటూ చేయి చాపాడు.

‘‘ ఆ ! పంతులుగారూ! అందరికీ ప్రసాదం పంచి పెట్టండి’’ శ్రీనివాసశర్మకు చెప్పాడు ఎమ్మెల్యే.

స్పూన్‌తో వరసగా అందరికీ ప్రసాదం పంచిపెట్టాడు శర్మ.

‘మహాప్రసాదం’ అంటూ అందరూ కళ్లకద్దుకుని నోట్లో వేసుకున్నారు. ‘‘శర్మా! ప్రసాదం పంచడం అయిందా?’’ అడిగారు చంద్రవౌళి.

‘‘అయింది గురువుగారు’’ అన్నాడు శర్మ.

తాంబూలంతో సంభావన ఇచ్చి చంద్రవౌళి కాళ్లకు నమస్కరించారు ఎమ్మెల్యే దంపతులు.

మరికొందరు శర్మ కాళ్లకు నమస్కరించారు.

ఎమ్మెల్యే ఇంటి నుండి బయటపడ్డారు చంద్రవౌళి, శర్మ.

‘‘శర్మా! ఎమ్మెల్యే గారింట్లో పూజా కార్యక్రమంలో నీవు ఏం తెలుసుకున్నావు?’’ అడిగారు చంద్రవౌళి.

‘‘ ఏముంది గురువుగారు ఎమ్మెల్యే గారింట్లో పూజ కదా! ఎంతో గ్రాండ్‌గా జరిపించుకున్నారు’’ అన్నాడు శర్మ.

‘‘అది కాదోయ్! నీకు మరే విధమైన విషయం తట్టలేదా?’’

‘‘నాది మట్టి బుర్ర! తట్టలేదు గురువుగారు’’

‘‘దేవుడి దగ్గర నైవేద్యంగా ప్రసాదం పెట్టారు చూసావా?’’

‘‘దాంట్లో వింతేముందండి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎవరు చేసుకున్నా ప్రసాదం చేస్తారు కదా’’ ‘‘ప్రసాదం తయారు చేయడానికి రవ్వ, పంచదార, నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్ ఇవన్నీ వాళ్లవే కదా?’’

‘‘అవును’’

‘‘అవును’’

‘‘ప్రసాదానికి కావలసిన పదార్థాలన్నీ వాళ్ల కొన్నారు. వాళ్లే ప్రసాదం తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టారు కదా’’

‘‘అవును’’

‘‘పూజ పూర్తయిన తరువాత ప్రసాదం ఎవరు పంచిపెట్టారు?’’

‘‘నేనే... అయితే?’’

‘‘ప్రసాదం తయారు చేసుకున్న వాళ్లే ఎందుకు పంచిపెట్టలేదంటావ్?’’ ‘‘..............’’ ‘‘ ఎందుకంటే పూజ చేసిన బ్రాహ్మణుడే ప్రసాదం పంచాలి. అప్పుడే అది మహాప్రసాదం అవుతుంది’’ అన్నారు చంద్రవౌళి. తిరిగి చంద్రవౌళే మాట్లాడుతూ ‘‘అంటే ఇక్కడ ఎమ్మెల్యేలాంటి వ్యక్తి కూడా బ్రాహ్మణుడిగా నీకు విలువ ఇచ్చి ప్రసాదం పంచి పెట్టండి పంతులుగారు అని అన్నారా? లేదా?’’

‘‘అన్నారండి’’

‘‘బక్క బ్రాహ్మణుడివని అనుకుంటున్న నీకు విలువేమైనా తగ్గిందా?’’

‘‘లేదండి’’

‘‘మనం కూడా సమాజంలో మన విలువ నిలబెట్టుకునేలా నడుచుకోవాలి’’ అన్నాడు చంద్రవౌళి.

‘‘అర్ధం అయింది గురువుగారు! బ్రాహ్మణుడికి ఉన్న విలువ తగ్గలేదని నాకు తెలిసేలా చేసినందుకు కృతజ్ఞుడిని’’ అంటూ కదిలాడు శర్మ.

- అనుపోజు అప్పారావు, సెల్ : 9247552649

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.