*తనకు మాలిన ధర్మం*{కథ}

రచయిత్రి పేరు"శశిరేఖా లక్ష్మణన్ "

*నా పేరు అనసూయ.వయస్సు అరవై ఏళ్ళు.ఒక కూతురు,ఒక కొడుకు.కూతురుకు పెళ్ళై ఇద్దరు పిల్లలు.కొడుక్కీ పెళ్ళై ఒక కూతురు.నా బిడ్డలంటే నాకు వల్లమాలిన ప్రేమ.ప్రతిక్షణం వారి బాగోగులు చూస్తూ వారిని అపురూపంగా పెంచాను.ఇంట్లో నా భర్త సంపాదన తక్కువ,నేను పెద్దగా చదువుకోలేదు.

అయినా ఖర్చులకుంటాయని సున్ని ఉండలు,జంతికలు,మైసూర్ పాక్ లు,వేరుశనగ బర్ఫీ చేసి షాపుల్లో అమ్మి కుటుంబం నడిపేదాన్ని.నా కూతురు సంతోషంగా ఉంది.

పెద్దగా ఇబ్బందులు లేని జీవితం.నా కూతురు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది.నా కొడుకు ,కోడలు ఇద్దరూ ఆణిముత్యాలు.నన్ను అపురూపంగానే చూసుకునేవాళ్ళు.

"ఈ వయస్సులో ఈ పనులెందుకమ్మా"అని నా కొడుకు కృష్ణప్రసాద్ మందలించేవాడు.

"నా చేతనైనంత వరకు చేస్తారా!ఆ తర్వాత నేనే వదిలేస్తా!" అని సమాధానం చెప్పేదాన్ని.

నా కొడుక్కి కొన్ని ఆర్థిక ఇబ్బందులు.వాడికి సాయంగా ఉండాలని నేను సంపాదించింది ఇచ్చేదాన్ని.వాడు మొహమాటపడుతూనే తీసుకునేవాడు.నా కొడుకు అవడానికి కృష్ణప్రసాదే కానీ శ్రీరాముడంతటి ఉత్తముడు.

ఒక్క చెడ్డ అలవాటు లేదు.వీధిలో ఎవరైనా గొడవపడినా "అమ్మా!ఏంటలా బైట నిలబడ్డావ్ ?లోనికి రా!"అని పిలిచేవాడు.చాలా మృదుభాషి.అజాత శత్రువు అంటారే అలాంటి వాడు.మరి వాడిలో ఏ లోపమూ లేదా?అంటే ఉంది చంద్రునిలో మచ్చలా వాడికీ ఉంది ఓ లోపం.అది తనకు మాలిన ధర్మం.

ఎవరైనా కష్టాల్లో ఉన్నా,ఆపద ఉన్నా,సాయం కోరి వచ్చినా వెంటనే చేతనైన సాయం చేస్తాడు.అది డబ్బు రూపేణా కావచ్చు లేదా మాటసాయం కావచ్చు.

నేను "వద్దు మొర్రో" అన్నా వినిపించుకోడు.చిన్నప్పటి నుండీ ఇదే వరుస.

చిన్న వయసులో స్నేహితులందరూ టైలర్ వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటుంటే వీడు ఆడుకునేవాడు.దీపావళి ముందు రోజులవి.అందరూ టపాసులు పేలుస్తున్నారు.

వీడు మా ఇంట్లోని టపాసులని టైలర్ వాళ్ళింటి అరుగు మీద కూర్చుని ఒక్కటొక్కటిగా పేలుస్తున్నాడు.

వాడి స్నేహితులు కొంచెం బీదవారు.దీపావళికి ముందు మాత్రమే టపాసులు కొంటారు.వీడు నేనిచ్చే అర్థ,పావలా దాచుకుని ఆ పొదుపు చేసిన డబ్బులతో టపాసులు కొని అందరూ కలిసి వారం ముందు నుంచే కాల్చేవాళ్ళు.

ఉన్నట్టుండి టైలర్ వీరేశం ఇంట్లో నుండి చింతనిప్పుల్లాంటి కళ్ళతో బైటకి వచ్చాడు.

అతను వచ్చే అలికిడికి అందరు పిల్లలు "పోలో" మంటూ చెదరిపోయారు.

మా వాడు దొరికిపోయాడు.నిద్ర చెడుగొట్టాడని మా ప్రసాదు టైలర్ వీరేశం చేత బాగా దెబ్బలు తిన్నాడు.

ఆనక వీరేశం మా వాడిని గదిలో పెట్టి తాళం వేసాడు.నేను కోపంతో చెడామడా తిట్టి మా వాడ్ని విడిపించాను.అప్పుడు వాడికి పదేళ్ళు.

అప్పట్నుండి ఇప్పటి వరకూ ఇరవై ఏళ్ళుగా వాడికి తనకు మాలినధర్మం వల్ల నాకు తలనొప్పే మరి.

ఆ తర్వాత కొంచెం చదివే రోజుల్లో వాడికి మోపెడ్ కొనిచ్చాను కాలేజ్ కు త్వరగా వెళతాడని.

దారిలో ఎవరన్నా కూర్చుని ఉంటే ఎక్కడికెళ్లాలో అడిగి కనుక్కుని వారిని దింపవలసిన చోటు వెళ్ళే దారిలో ఉంటే లిఫ్ట్ ఇచ్చి దింపేవాడు.

ఎవరన్నా ముసలివాళ్ళు ఆకలితో అన్నం అడిగితే నేను పంపిన క్యారేజి లోని సాంబారన్నంలో నుండి కొంత ఇచ్చేవాడు కూరతో సహ.

అందుకే రోజూ ఇద్దరికి సరిపడేలా క్యారేజి కట్టేదాన్ని.నేను చిరుతిళ్లకని ఇచ్చే డబ్బు ఎవరి కోసమో ఖర్చు పెట్టేవాడు.

ఒకరోజు నేను రెండు షర్టులు కొనిస్తే ఒకటి వాడి స్నేహితుడికిచ్చేసాడు.దాంతో ఒళ్లు మండి తిట్టేసాను.

"మరీ ఇంత దానగుణం పనికి రాదు.గొప్ప గొప్ప ధనవంతులు కూడా కొంత డబ్బు దస్కం ఉంచుకుని మిగిలినదే ధర్మం చేస్తారు.నీలా సగానికి సగం ధర్మం చేయరు."కష్టపడి కోపం తెచ్చుకుని అన్నాను.మా వాడిని చూస్తే నాకు కోపం రాదు మరి.

అంత ఇష్టం వాడంటే నాకు.

దానికి వాడు ఎప్పట్లానే నవ్వుతూ,"వాడు చాలా పేదవాడు అమ్మా!ఇంటి నుండి పంపే డబ్బులు ఫీజులకే సరిపోతాయి.నేనిచ్చిన షర్ట్ వాడికున్న జతలలో నాలుగోదంటే చూడు.ఒకరికి ఇవ్వడంలో ఉన్న సంతోషం మనం మనకే ఖర్చు చేయడంలో రాదు."

వీడు మారడు.కోడలు అమృత భర్తకు తగిన భార్య.వాడేమంటే అదే అన్నట్లుంటుంది.వాడి చదువై ఉద్యోగంలో చేరగానే మాకన్నా ఉన్నతవర్గం నుండి తను మా ఇంటి కోడలిగా వచ్చింది.పెళ్ళై అయిదేళ్లయ్యింది మా వాడికి.

ఇప్పటికీ అప్పుడప్పుడు తెలిసినవారికి,అవసరంలో ఉన్న వారికి..., సాయం చేసే వాడి నైజం మారలేదు.

************************************

ఎప్పట్లానే ఆఫీసుకు మోపెడ్ మీద వెళ్తుండగా జరిగిందా సంఘటన.ఎదురుగా ఓ పల్లెటూరి బైతు.పంచె,కండువా,తెల్లటి షర్ట్ తో లిఫ్ట్ అడిగాడు మా వాడిని.

మా వాడు లిఫ్ట్ ఇచ్చాడు.దారిలో ట్రాఫిక్ పోలీసు మా వాడిని ఆపాడు.లైసెన్సు ,ఆర్ .సి.బుక్ అన్నీ చెక్ చేసాడు.

పల్లెటూరి బైతు చేతిలోని సంచిని చెక్ చేయబోయాడా ట్రాఫిక్ పోలీస్.

"ఇది నాది కాదండీ!ఈ అబ్బాయి చేతిలోని సంచీ నాకిచ్చి పట్టుకోమంటే పట్టుకుని,లిఫ్ట్ ఇస్తే వెనకాల కూర్చున్నానంతే...!!"

ఆ ఆసామి మాటలకి మా కృష్ణప్రసాద్ గతుక్కుమన్నాడు.

"లేదు సార్ !ఇది ఆయన సంచే! నేను అతనికి ఫ్రీ లిఫ్ట్ ఇస్తున్నానంతే.ఆయన ఎందుకలా అబద్ధం చెబుతున్నాడో అర్థం కావడం లేదు."అయోమయంగా అన్నాడుట మా కృష్ణుడు.

"ఎవరిదో ఏంటో ఇప్పుడే తేలుతుంది!" లాఠీతో మోపెడ్ పక్కనున్న తారు రోడ్డుపై ఒక్క దెబ్బ వేసి సంచిని క్రింద తలక్రిందులుగా వేలాడదీసాడు.

జలజలమంటూ తెల్లటి గంజాయి పొట్లాలు.

కృష్ణప్రసాద్ కు పై ప్రాణాలు పైనే పోయాయి.తనకేమీ తెలీదని నెత్తీనోరు బాదుకున్నాడు.చుట్టూ నిమిషాల్లో వందల కొద్దీ జనం గుంపు చేరిపోయారు.అందరిలో ఒకటే కుతూహలం ఏం జరుగుతుందోనని.కృష్ణప్రసాద్ తను పని చేసే కంపెనీ ఐడెంటిటీ కార్డు ,తన కంపెనీ మేనేజర్ సెల్ నెంబర్ ఇచ్చి తన కాండక్ట్ గురించి తెలుసుకోమన్నాడు.

అరగంటలో కంపెనీ యజమానితో సహా, అందరినీ కృష్ణప్రసాద్ గురించి విచారించి అడ్రస్ రాసుకుని ఇలా అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం ప్రాణాలకే ప్రమాదమని వారించాడు ట్రాఫిక్ పోలీస్ .

తర్వాత ఆ సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణకు పంపాడు ఆ పోలీస్.

"బ్రతుకు జీవుడా!"అనుకుని మా కృష్ణప్రసాద్ ఇంటిదారి పట్టి విషయమంతా చెప్పి నాతో ముక్క చివాట్లు తిన్నాడు.

************************************

తనకు మాలిన ధర్మం*

*ముఫ్ఫై ఏళ్ళు వచ్చాయి వాడికి.అయినా ఇన్ని సమస్యలెదురైనా తన నైజం మానలేదు.పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోతాయంటారు.అది ఇదేనేమో.కొన్నాళ్ళ తర్వాత ఈ విషయమై నాకూ మా వాడికి చిన్న వాగ్వివాదం."ఆ ట్రాఫిక్ పోలీస్ మంచివాడు కాబట్టి నిన్ను నమ్మి వదిలి పెట్టాడు.లేకుంటే ఈ పాటికి నీవింకా కటకటాల్లో ఉండేవాడివి."చిరుకోపంగా అన్నాను.దానికి వాడేమన్నాడో తెలుసా?"అమ్మా!ఒక చిన్న సంఘటనతో అన్నీ అలానే జరుగుతాయని ఎందుకనుకోవాలి?"నా ముఖం కోపంతో మొటమొటలాడింది."నేను అత్యవసరంలో ఉన్నవాళ్ళకి నా చేతనైనంతలో సాయం చేస్తాను.చెప్పలేము రేపు నాకే ఏదైనా ఆపద వస్తే ఈ చేసిన సాయం ఆదుకుంటుంది.మనిషన్నాక మానవత్వం ఉండాలి.నేను సాయం చేసిన అందరూ ఎప్పుడో అప్పుడు నన్ను తలచకుండా ఉండరు.పోయే ముందు మన వెంట వచ్చేది బంధుమిత్రులు కొంత దూరం వరకే.పోయిన తరువాత ఈ భూమిలో నిలిచేది మనం చేసిన మంచీ చెడు మాత్రమే.పోయిన తర్వాత మన వెంట వచ్చేది పాపపుణ్యాలు మాత్రమే.నీ కొడుకునైన నేను చేసే పుణ్యాల వల్ల తెలియక చేసే నా పాపాలు కొన్ని పరిహారమవుతాయి."ముఫ్ఫై ఏళ్ళకే అరవై ఏళ్ళ వృద్ధుడిలా నాకు నీతులు చెబుతున్న నా కొడుక్కి ఎవరు చెబుతారు...తనకు మాలిన ధర్మం వద్దని.**************శుభం*****************కథా రచన"శశిరేఖా లక్ష్మణన్ " "చెన్నై"ఈ కథ నవంబర్ 2009 ప్రముఖ మాస పత్రిక ఆంధ్రభూమి మంత్లీ లో ప్రచురింపబడింది.


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.