ఇది రొటీన్ ప్రేమలేఖ కాదు...

అతన్ని చూస్తే ఎప్పుడూ ప్రేమలేఖలు రాసే మొహంలా కనిపించదు. నువ్వు కూడా ప్రేమలేఖలు రాయగలవా.. అని అతని మనసే షాక్‌కు గురవుతుంటుంది. కానీ అతనూ ప్రేమలేఖలు రాస్తాడని తెలిసి ఆయన వూహల్లో ప్రయాణిస్తున్న విచిత్ర సైన్యమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అయినా ఆయన ప్రేమలేఖలు రాయడం ఆపలేదు. ఎప్పటి నుంచో రాయడం మొదలుపెట్టాడు . పెళ్లయి ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాక కూడా ఆ అలవాటు ఆపలేదు. విచిత్రమేంటంటే.. ఆ లేఖ చేరాల్సిన చోటుకి చేరిందో లేదా చేరకూడని చోటికి చేరిందో తెలియదు కానీ.. ఆ లేఖ చేరింది ఓ సారి అతని కూతురికి.

ఆ లేఖలో ఎన్నో భావాలున్నాయి. ఎన్నో ముచ్చట్లున్నాయి. ఎన్నెన్నో ఉద్వేగపూరితమైన క్షణాలను మిళితం చేస్తూ, ఓ మజ్ను లైలాకి రాసినట్లు, ఓ సలీమ్ అనార్కలికి రాసినట్లు, ఓ షాజహాన్ ముంతాజ్‌కు రాసినట్లు ఎంతో గొప్పగా ఉంది ఆ లేఖ. అదీ ఆయన ఫీలింగ్ అని ఆ లేఖ చదువుతున్న వ్యక్తికి అర్థమయ్యింది.

పోస్టుమ్యాన్ ఆ లేఖను తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇవ్వగానే , ఆమె తొలుత ఎందుకో చదవకూడదనుకుంది. కానీ స్టాంపులు అతికించకుండా తిరిగొచ్చిన లెటర్ కావడంతో ఆమెకు ఎందుకో ఆ లేఖపై ఆసక్తి ఏర్పడింది. అయినా ఆ లెటర్‌ను చింపకూడదనుకుంది ఆమె.

అయితే కవర్ మీదనుంది ఓ స్త్రీ పేరు.. అడ్రసు ఓ కాలేజీ అడ్రసు.

తన తండ్రి ఎవరికి ఈ ఉత్తరం రాసుంటాడా అన్న ఆసక్తి ఆమెకు ఇంకా పెరిగింది.

అలా ఆమె మనసులో ఆలోచనలు తొలిచేస్తున్నాయి కాబట్టి.. ఆమె ఆ ఉత్తరాన్ని చింపి చదవసాగింది.

. . .

ప్రియమైన తేజస్వికి,

మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ, ఆరాధిస్తున్న విశ్వాస్ రాస్తున్న లేఖ ఇది. ఏంటీ నా పేరు తేజస్వి కాదు కదా.. అని మీరు అనుకోవచ్చు. కానీ.. మీ పేరు అప్పుడు నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని చూడగానే నా మనసులో కలిగిన భావాలను బట్టి నేను అనుకున్న పేరుతోనే.. మిమ్మల్ని సంభోదిస్తున్నాను. మీ పేరు నాకిప్పుడు తెలిసినా.. ఎందుకో మిమ్మల్ని ఆ పేరుతోనే పిలవాలని అనిపించి అదే పేరుతో సంభోదించాను. నేను మీకు పూర్తిగా ఒకప్పుడు అపరిచితమైన వ్యక్తిని. కానీ మీరు ఇప్పుడు నా జీవితంలో ఎంతో విలువైన వ్యక్తి. నా జీవితాన్ని మార్చిన వ్యక్తి.

తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాలో కలిగిన ఆలోచనలు అన్నీ ఇన్నీ కావు. మీ అందం కంటే మీ వ్యక్తిత్వం, సమాజం పట్ల మీకున్న అవగాహన, మీ తెగువ, ఏ మాటనైనా కల్మషం లేకుండా మాట్లాడే మీ నిజాయితీ నన్ను మీ మీద అభిమానాన్ని పెంచుకొనేలా చేశాయి. అదే అభిమానంతో నేను మీకై ఎప్పుడో గుండెలో గుడి కట్టి ఉంచాను. మిమ్మల్ని చేరుకోవాలంటే అందరి కుర్రాళ్లా కాకుండా ఏదో చిత్రమైన పని చేయాలనిపించింది.

అందుకే మీ ఇష్టాలేమిటో మీకు తెలియకుండానే నా పరిధిలో అన్వేషణ సాగించి తెలుసుకున్నాను. అందుకనుగణంగా నన్ను నేను కొంతవరకు మలచుకున్నాను కూడా. కానీ అప్పుడు నేను మీకు ఎప్పుడూ దగ్గరవ్వడానికి ప్రయత్నించలేదు. మీకో విషయం తెలుసా.. నాకు మీ కుటుంబీకులందరూ తెలుసు. వాళ్లలో కూడా ప్రతీ ఒక్కరికీ నేనంటే తెలుసు. కానీ వారెవరికీ నాకు మీ మీద ఉన్న గాఢమైన ప్రేమ గురించి తెలియదు.

కానీ.. నా జీవితంలో నేను వేసే ప్రతి అడుగు వెనుకా మీ ప్రేరణ ఎంతో ఉంది. నా విజయాల వెనుక మీ స్ఫూర్తి తప్పకుండా ఎప్పటికీ ఉంటుంది. నా శ్వాస ఉన్నంతసేపు నా ఆలోచనలు మీ చుట్టూనే తిరుగుతాయి. ఈ రోజు మనకిద్దరికీ వివాహాలైపోయాయి. అయినా, నాకు తెలుసు మీ గుండె చప్పుడు ఎప్పుడూ నా కోసం కొట్టుకుంటుందని. అలాగే నా గుండె మాత్రం మరెవరికోసమో తపిస్తుందా.. కానేకాదు.. అది ఎప్పటికే మీకోసమే శ్వాసిస్తోంది.

ఇది ఎవ్వరూ నమ్మినా, నమ్మకపోయినా ఇది నా గుండెలో నుండి వచ్చే వాస్తవమైన మాట.

ఇట్లు

మీరే సర్వస్వమని బతుకుతున్న విశ్వాస్.

....

ఆ ఉత్తరం చదవగానే అతని కూతురికి తన తండ్రి మీద కోపం, ద్వేషం ఒకేసారి కలిగాయి. అయితే ఆ ఉత్తరం తీసుకొని ఆ అమ్మాయి తన తల్లి వద్దకు వెళ్లలేదు. ఎందుకంటే విషయం తెలిస్తే ఆమె బాధ పడుతుంది కదా.. అందుచేత తన తండ్రి మనసు దోచుకున్న కథానాయికని వెతకడం కోసం ఆ అడ్రసు ఉన్న కాలేజీకి వెళ్లాలనుకుంది. కానీ ఆమె ఇరకాటంలో పడిపోయింది. అసలు పేరు రాయకుండా తన తండ్రి ఈ ఉత్తరం ఎందుకు రాశాడు. ఒకవేళ అనుకున్న చిరునామాకి ఈ లేఖ చేరినా.. తను అనుకున్న వ్యక్తికి ఈ లేఖ చేరదు కదా.. ఇలా ఆలోచించిందామె.

ఇంతలో ఆమె తల్లి వచ్చి ఆ అమ్మాయి తలపై చేయి వేసింది.

కన్నీళ్లతో తన తల్లివైపు చూసిందామె.

‘అమ్మా ... నాన్న ఇలాంటి వాడనుకోలేదు..’ అని ఆ లేఖను ఆమె చేతిలో పెట్టిందామె.

ఆ లేఖ చూసి ఆమె తల్లి చిరునవ్వు నవ్వింది. అయితే ఆ నవ్వు చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది.

ఎందుకంటే.. తన గారాల కూతురికి ఆ తల్లి ఏం చెప్పిందంటే.. అది తనకొచ్చిన ప్రేమలేఖని.

‘నీకో విషయం తెలుసా… ఇది మీ నాన్న ఎవరికో రాసిన ప్రేమలేఖ కాదు. కచ్చితంగా ఇది నాకు రాసిన ప్రేమలేఖే. నీకు తెలియదు కానీ.. ఇలాంటి పేరూ, వూరూ లేని ప్రేమలేఖలు నాకు మీ నాన్న ఎన్ని రాసుంటారో నాకే తెలియదు. కానీ ప్రతి లేఖది ఓ స్పెషాలిటీ. మీ నాన్న నన్ను కాలేజీ రోజుల్లోనే ప్రేమించారట. అయితే ఆ విషయం నాకు ఎప్పడూ చెప్పలేదు. అందుకే ప్రతీ సంవత్సరం ఇలా నా కాలేజీకి నా పేరు మీద స్టాంపులు లేకుండా ప్రేమలేఖలు పంపిస్తుంటారు. అవి మళ్లీ మనింటికే తిరిగొస్తుంటాయి. వాటిని నేను చదివినా, చదవకపోయినా మురిపెంగా దాచుకుంటాను. చిత్రమేంటంటే.. ఆ ప్రేమలేఖలు పంపిస్తున్నారని నాకు తెలుసు. నేను వాటిని చదవకుండా దాచుకుంటాననీ ఆయనకీ తెలుసు. కానీ ఎప్పుడూ వాటి గురించి ప్రస్తావించుకోలేదు. ఈ రోజు నీకు దొరికిపోయాం’

తన తల్లి అలా చెబుతుంటే, ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

ఇలా కూడా ప్రేమలేఖలు రాస్తారా.. అని జస్ట్ ఆశ్చర్యపోయింది ఆ ఆధునిక విద్యార్థిని..

అయితే.. ఆమెకు ఒక విషయం మాత్రం అర్థమైంది.. తన తండ్రి రాసింది మాత్రం రొటీన్ ప్రేమలేఖైతే కాదని..

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.