‘‘ఆదిత్య సార్ మీ కోసం ఎవరో సినియా యాక్టర్‌లాంటి లేడీస్ వచ్చారు’’ అన్నాడు ఫ్యూన్ రాజన్న.

ఉదయం నుండి ఫైల్స్‌లో తలమునకలై ఉన్న ఆదిత్యకు సినిమా యాక్టర్‌లాంటి లేడీస్ అని వినిపించేసరికి చూస్తున్న ఫైల్ మూసి ‘‘నాకోసమా’’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘‘అవును సార్ మీ కోసమే. మీ పేరు చెప్పి అడిగారు’’
‘‘ ఎక్కడ ఉన్నారు?’’
‘‘వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టాను’’
‘‘అలాగా పద చూద్దాం’’ అంటూ ఫ్యాంట్ బ్యాక్ ప్యాకెట్ నుండి దువ్వెన తీసి తల దువ్వుకున్నాడు. చేతి రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు. వెయిటింగ్ హాల్లో ఒక యువతి కూర్చుని ఉంది. ఫ్యూన్ రాజన్న చెప్పినట్లు సినియా యాక్టర్‌లాగానే ఉంది అనుకున్నాడు.
తెల్లని ఛాయ, మంచి కలర్ చుడీదార్, కుర్తా, తలమీదకు కూలింగ్ గ్లాసులు, కాలు మీద కాలు వేసుకుని సినియా మ్యాగజైన్ చదువుతోంది. ఆదిత్య చూపు మరల్చకుండా చూస్తున్నాడు.
‘ ఎవరీ అందాలరాశి? తన కోసం ఎందుకు వచ్చినట్లు’ అని పరిపరివిధాలా ఆలోచిస్తున్నాడు.
‘‘ ఎస్ చెప్పండి మీకు ఎవరు కావాలి?’’ అన్నాడు.
ఆ యువతి తల పైకెత్తి ఆదిత్య వైపు ఓరగా చూసింది. ఆదిత్యయ కొంచెం అనీజీగా ఫీలయ్యాడు.
‘‘ ఏంది నన్ను గుర్తు పట్టనేదేంటి?’’ అంది.
ఆదిత్య కంగు తిన్నాడు. ‘మనిషి అందాలరాశిలా ఉంది. మాట తీరేమిటి ఇలా ఉంది?’ అనుకున్నాడు.
‘‘నాను రత్తాల్ని ఆదిత్యబాబూ’’ తనని తాను పరిచయం చేసుకుంది.
ఆదిత్య ఏం మాట్లాడలేదు.
‘‘అయిదారేళ్ల క్రితం మీ రూంలో పని చేసిన రత్తాల్ని’’ అంది.
‘‘ ఆ గుర్తుకొచ్చింది. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఇంతకాలం ఎక్కడికి వెళ్లావు?’’
‘‘ముంబై వెళ్లిపోయాను’’
‘‘అక్కడేం చేస్తున్నావ్? ఇంత బాగా తయారయ్యావు మాట తీరు మాత్రం మారలేదేమిటి?’’ అన్నాడు.
‘‘అదా ఆ స్లాంగ్‌లో మాట్లాడితేనే గుర్తు పడతావని. ఇక్కడ ఓ పది రోజులు మీతో హ్యాపీగా గడిపి వెళదామని’’
‘‘గుడ్ మా పరిచయం ఇంకా మరిచిపోలేదన్నమాట’’ అన్నాడు ఆదిత్య.
‘‘మరిచిపోయే స్నేహమా మనది?’’ అంది వ్యంగ్యంగా.
‘‘అయితే ఎక్కడ దిగావు?’’
‘‘నువ్వే ఒక రూం చూసి పెట్టాలి’’
‘‘నేనా? నీకు రూం చూసిపెట్టాలా?’’
‘‘ ఏం చూడవా? నేనంటే నీకిష్టం లేదా?’’ బుంగమూతి పెడుతూ అంది.
‘‘నోనో నీవంటే ఇష్టం లేక కాదు. ఇక్కడ రూం తీసుకుంటే మనకి ప్రైవసీ ఉండదని’’ అన్నాడు ఆదిత్య.
‘‘అలాగైతే నేను ఈవినింగ్ ఫ్లైట్‌కెళ్లిపోతాను’’
‘‘ ఆగాగు నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు’’ అన్నాడు.
సిటీ అవుట్‌స్కర్ట్స్‌లో ప్రాజెక్టు గెస్ట్‌హౌస్ ఉంది అనుకున్నాడు.
సీనియర్ ఇంజనీర్ దగ్గరికెళ్లి మధ్యాహ్నం ఆఫీసు రాలేనని చెప్పేసాడు. రత్తాల్ని కారులో ఎక్కించుకుని ప్రాజెక్టు గెస్ట్‌హౌస్ వైపు పోనిస్తున్నాడు. మధ్యమధ్యలో రత్తాల్ని పదేపదే ఓరగా చూస్తున్నాడు. ‘ ఏం అందంరా బాబూ? నిజంగా ఇది రత్తాలేనా?’ అనుకున్నాడు కారు డ్రైవ్ చేస్తూ.
పాత జ్ఞాపకాలు నెమరువేస్తూ ప్రాజెక్టు గెస్ట్‌హౌస్‌కి చేరుకున్నారు.
‘‘గెస్ట్‌హౌస్‌కి ఎవరైనా వస్తే మన ఉనికికి ప్రమాదమేమో’’ అంది రత్తాలు.
‘‘్ఫర్వాలేదు ఎవరూ రారు’’ అన్నాడు ధీమాగా.
‘‘ ఆ అడగడం మరిచిపోయాను. నీతో పాటు వాసు, శేఖర్, రమణ అనే స్నేహితులు ఉండేవారు కదా. వాళ్లెక్కడున్నారు?’’ అంది.
‘‘వాళ్లా? తలో ఉద్యోగాల్లో సెటిలైపోయారు’’ అన్నాడు.
‘‘వాళ్లకీ చెప్పు నేనొచ్చానని’’ అంది.
‘‘నేను అదే ఆలోచిస్తుంటే నువ్వే చెప్పావు’’
‘‘సరే నీవు బయట ఉండు నేను ఫ్రెషప్ అయి రెస్టు తీసుకుంటాను’’ అంది.
‘‘అలాగే సాయంత్రం మేము నలుగురం వస్తాం. వియ్ విల్ ఎంజాయ్’’ అంటూ బయటికి నడిచాడు ఆదిత్య.
డ్రైవ్ చేస్తుండగా అతనికి పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి.
* * *
అవి ఇంజనీరింగ్ చదివే రోజులు. ఆదిత్య, వాసు, శేఖర్, రమణ రూమ్మేట్స్. కాలేజీకి దగ్గరలో ఒక రూం అద్దెకి తీసుకుని ఉండేవారు. మొదట్లో నలుగురు కలసి పనులు వంతులవారీగా చేసుకునేవారు. మూడేళ్లు ఎలాగోలా గడిపినా ఫోర్త్ ఇయర్ నుండి ఈ పనులకు సమయం సరిపోయేది కాదు. రూం పక్కనే ఉన్నవారితో వంట, ఇంటి పనులు చేయడానికి పని మనిషిని చూసిపెట్టమని అడిగారు. ఆ ఇంట్లోనే పని చేస్తున్న సుబ్బాయమ్మ అనే పెద్దావిడ తానే పని చేస్తానంటూ ముందుకు వచ్చింది. అయిదారు నెలలు గడిచాయి. సుబ్బాయమ్మకు వయసు పైబడడంతో తరచూ అనారోగ్యానికి గురవుతోంది. చదువుకుంటున్న పిల్లలు యాతన పడుతున్నారని బాధపడేది.
పోనీ తన కూతురు రత్తాల్ని పనిలో పెడదామంటే వయసులో ఉన్న కుర్రాళ్లు అని సందేహించింది. కుర్రాళ్లు ఎంతో మంచివారు. తనని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. అలాంటి కుర్రాళ్ల వల్ల తన కూతురికి ఏమవుతుందిలే అనుకుని తన కూతురు రత్తాల్ని పనిలో కుదిర్చింది.
రత్తాలు రోజూ వచ్చి వంటపని, ఇంటి పని చేసి వెళ్లిపోయేది.
కుర్రాళ్లకి చదువు మీద తప్ప మరి దేని మీదా ధ్యాసలేదు.
నెలరోజులు గడిచాయి. ఒకరోజు రత్తాలు కొత్తబట్టలు వేసుకుని, తలనిండా పువ్వులు పెట్టుకుని పనిలోకి వచ్చింది. నెల రోజుల నుండి పని చేస్తున్నా రత్తాల వైపు ఆ నలుగురు కుర్రాళ్లు ఎప్పుడూ చూసేవారు కాదు. కానీ ఆరోజు ప్రత్యేకంగా కనిపించేసరికి రత్తాల వైపు నలుగురు తదేకంగా చూసారు.
‘‘ ఏమిటి రత్తాలు ఈరోజు ప్రత్యేకంగా కనిపిస్తున్నావు?’’ అన్నాడు ఆదిత్య.
‘‘ ఈరోజు నా పుట్టిన రోజు బాబూ’’ అంది రత్తాలు.
నలుగురు పని చేస్తున్న ఆమెనే చూస్తుండిపోయారు.
రత్తాల్ని ఎలాగైనా లైన్లో పెట్టాలని అనుకున్నాడు ఆదిత్య.
మర్నాడు ఉదయం ముగ్గురు స్నేహితులు కాలేజీకి వెళ్లిపోయారు. ఆదిత్య కావాలనే రూంలో ఉండిపోయాడు. రత్తాలు వచ్చింది.
‘‘ ఏం ఆదిత్యబాబూ కాలేజీకి వెళ్లలేదా?’’ అంది.
‘‘లేదు తలనొప్పిగా ఉంది’’
‘‘అయ్యో ఉండండి టీ పెట్టి ఇస్తాను. మందు బిళ్ల వేసుకుందురు’’ అంది.
టీ చేసి ఆదిత్యకి ఇచ్చిన రత్తాలు పని చేసుకుంటూ ఉంటే ఆదిత్య రత్తాల పక్కన కూర్చున్నాడు.
‘‘బాబూ ఇదేమిటి నా పక్కన కూర్చున్నారు’’ అంది రత్తాలు.
‘‘నీ పక్కన కూర్చోకూడదా?’’ బుంగమూతి పెట్టి అడిగాడు.
‘‘సర్లే మీ ఇట్టం’’ అంది రత్తాలు.
ఆదిత్య మాట్లాడుతుంటే రత్తాలు కూరలు కోస్తుంది.
ఆదిత్య రత్తాలకి దగ్గర దగ్గరగా జరుగుతున్నాడు.
ఇంతలో రత్తాలు వేలు తెగింది.
‘‘అమ్మా’’ బాధగా అరిచింది.
‘‘ ఏమయింది?’’ అంటూ రత్తాలు చేయి పట్టుకున్నాడు. ఆమె వేలు తెగి రక్తం కారుతోంది. ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు. రత్తాలకి ఏదోలా ఉంది. ఆమె ముఖంలో మార్పులను గమనిస్తున్నాడు. మరింతగా విజృంభించాడు. రత్తాలు నాడి పట్టేసాడు. ఇవాళిటికి ఈ ట్రయల్ చాలు అనుకున్నాడు. అది మొదలు తరచూ కాలేజీకి డుమ్మా కొట్టేసి రత్తాల్ని ముగ్గులో దించేసాడు. రోజూ ఏదో సాకుతో కాలేజీకి ఎగనామం పెడుతున్నాడు. స్నేహితులకు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఒకరోజు ఆదిత్య, రత్తాలు ముగ్గురు స్నేహితులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
కొన్నాళ్లుగా కాలేజీ ఎగ్గొట్టి నడుపుతున్న బాగోతం ఇదా? అనుకున్నారు అతని స్నేహితులు.
విషయం బట్టబయలు కావడంతో స్నేహితులు కూడా బ్లాక్‌మెయిల్ చేసి రత్తాల్ని లొంగదీసుకున్నారు. నెలలు గడిచాయి. ఒక రోజు రత్తాలు వాంతులు చేసుకుంది. తల్లి సుబ్బాయమ్మకు అనుమానం వచ్చి కూతుర్ని నిలదీసింది. విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయింది. నెత్తీనోరూ బాదుకుంది. మంచికుర్రాళ్లు, అమాయకులని వాళ్ల దగ్గరకి పంపిస్తే ఇలా జరిగిందేమిటి అని వాపోయింది.
కుర్రాళ్ల గదికి వెళ్లి తన కూతురి పరిస్థితి చెప్పింది. అయిందేదో అయింది. తన కూతురికి అన్యాయం చేయవద్దని బతిమాలింది. ఆమెని పెళ్లి చేసుకోవాలని ఆదిత్యని వేడుకుంది.
ఆదిత్య అండ్ కో నిర్ఘాంతపోయారు.
సరదా పడుతున్నామని అనుకున్నాం గానీ ఇలా మెడకి చుట్టుకుంటుందని అనుకోలేదు అని భయపడిపోయారు వారంతా.
సుబ్బాయమ్మ కాళ్లావేళ్లా పడింది.
వాళ్లు ససేమిరా అన్నారు. అరిచి అల్లరి చేస్తామని బెదిరించింది.
‘‘చేసుకో మా సంగతి ఏమో గానీ, నీదీ నీ కూతురి పరువు బజారున పడుతుంది. అందరూ మీ ఇద్దరినే ఛీ కొడతారు అన్నారు స్నేహితులు.
మర్నాడు ఆ బాధతో సుబ్బాయమ్మ చనిపోయింది.
కొన్నాళ్ల తర్వాత రత్తాలు ఊరే వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆదిత్య, స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెళ్లిళ్లు చేసుకున్నారు.
రత్తాలు జ్ఞాపకాలు వాళ్ల మదిలో నుండి ఎప్పుడో చెరిగిపోయాయి.
ఆరేళ్ల తర్వాత రత్తాలు తిరిగొచ్చింది.
సాయంత్రం స్నేహితులు నలుగురికి రత్తాలు గురించి చెప్పాడు ఆదిత్య.
స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు.
‘‘మన స్నేహం మరిచిపోలేక మన దగ్గరకి వచ్చింది’’ అని ధైర్యం చెప్పాడు ఆదిత్య.
వారం పది రోజులు స్నేహితులు నలుగురు రత్తాలుతో ఎంజాయ్ చేశారు. రత్తాలు తిరిగి వెళ్లిపోయింది. కొంత కాలం గడిచింది. ఆదిత్యకి ఒంట్లో నలతగా ఉంటోంది. తరచూ జ్వరం వస్తోంది. స్నేహితుల పరిస్థితీ అలాగే ఉంది. ఫ్యామిలీ డాక్టర్ ఆదిత్యకి బ్లడ్‌టెస్ట్ చేయించాడు. హెచ్ ఐవి పాజిటివ్ తేలింది. స్నేహితులదీ అదే పరిస్థితి.
ఒకరోజు ఆదిత్య సెల్‌ఫోన్‌కి మెసేజ్ వచ్చింది.
‘హ్యాపీ డెత్ జర్నీ’
మెసేజ్ వచ్చిన నెంబర్‌కి ఆదిత్య ఫోన్ చేశాడు.
‘‘ ఒంట్లో ఎలా ఉంది?’’ అడిగింది.
‘‘ ఎవరు నువ్వు?’’ అడిగాడు ఆదిత్య.
‘‘నీ మృత్యువుని... రత్తాలిని’’
‘‘రత్తాలు నీవా? ఏంటిదంతా?’’ అన్నాడు.
‘‘ ఆదిత్యా నీదే కాదు నీ స్నేహితుల పరిస్థితీ బాగోలేదు కదూ’’
‘‘నీకెలా తెలుసు?’’
‘‘తెలుసంతే... నాకు ఎంత అన్యాయం చేశారో గుర్తుంది కదా’’ అంది కసిగా.
‘‘అంటే?’’ అన్నాడు ఆదిత్య.
‘‘నాకు మీరు చేసిన అన్యాయంతో మా అమ్మ ప్రాణాలు పోగొట్టుకుంది. అప్పుడే నిర్ణయించుకున్నాను మీ నలుగురిని నాశనం చెయ్యాలని’’ అంది.
‘‘మీకు మళ్లీ సుఖం అందించి నా పగ తీర్చుకున్నాను’’ అంది.
‘‘పగా?’’
‘‘ ఎస్ పగ తీర్చుకున్నాను. ఎలా అనుకుంటున్నావా? ఆ మధ్య మీ దగ్గరకి వచ్చాను గుర్తుంది కదా. మీ నలుగురు సంబరపడి నాతో విచ్చలవిడిగా గడిపి ఎంజాయ్ చేశారు’’
‘‘అయితే?’’ అన్నాడు ఆదిత్య.
‘‘ముంబైలో ఏం చేస్తున్నావు అని అడిగావు గుర్తుందా?’’
‘‘అవును’’
‘‘ముంబైకి వచ్చి ప్రాస్టిట్యూషన్ చేయాల్సి వచ్చింది. నాకు ఎయిడ్స్ వచ్చింది. నేను చచ్చిపోయే ముందైనా మీ నలుగురిపై పగ తీర్చుకోవాలనుకున్నాను. అందుకే మీ దగ్గరకి మళ్లీ వచ్చాను’’ అంది.
‘‘దుర్మార్గురాలా ఎంత పని చేశావే’’ కోపంతో అరిచాడు ఆదిత్య.
‘‘నేను అనుభవించిన మానసిక క్షోభ మీ నలుగురు అనుభవించాలి. నాకు చేసిన అన్యాయం క్షణక్షణం గుర్తుకు రావాలి’’ అంది.
‘‘ ఎంత పని చేశావే’’ గట్టిగా అరిచాడు ఆదిత్య.
‘‘ ఇప్పుడు నేను చివరి క్షణాల్లో ఉన్నాను. మీ కన్నా ముందే నేను జీవితం చాలిస్తాను. నా వెనకాలే మీరూనూ. టాటా బైబై హ్యాపీ జర్నీ’’ అని ఫోన్ కట్ చేసింది రత్తాలు.
ఆదిత్య అలాగే కూలబడిపోయాడు.


- అనుపోజు అప్పారావు

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.