ఒక్క కల

వాయుగుండ్ల శశి కళ (18-8-2016)

కాసిన్ని ఆశలు కోసి మదిలో ఒంపుకుంటూనే ఉన్నావు

రెప్పల కింద మలుగుతున్న జీవితానికి

ఒక్క మెరుపు అద్దడం కోసం

ఎన్ని కలలు అక్కడ పూచాయని

మూరెడు దేహం ఐదు మూరలుగా పెరిగేదాక

పెరిగే ఒకో అడుగు పొడవుకి

మారుతున్న కలల వర్ణాలు

మిఠాయిలు గోళీలు అద్దుకున్న కలలు

పరీక్షల భూతాల కోరలకు వేలాడాయి

ఉద్యోగ ఎడారులు అద్దుకున్న కలలు

నిస్పృహ వడగాలులను పెన వేసుకున్నాయి

వెన్నెల మెరుపులు అద్దుకున్న చెక్కెళ్ల కలలు

డబ్బు తూకాల్లో తేలిపోయాయి

జీవితమంతా

అందని లోకాన్ని నిద్రలో సృజించుకుంటూనే

మేలుకొలుపు లోవిసుగు రాజేసుకుంటూ ఉంటావు

ఒక్క కలనుండయినా మెలుకువ లేకుంటే

ఎంత బాగుంటుందో అనే ఆశ ఎప్పుడూ నీ

జీవితపు కొనను తగుల్కొని

కాలం వెంట పరుగులు తీయిస్తూ నే ఉంటుంది

ఒక రోజు నీ ఆశ తీరిపోతుంది

ఆ కల నుండి నువ్విక

లేవాల్సిన అవసరమేఉండదు

ఇప్పుడు గోడకు శాశ్వతంగా వేలాడుతూ

పూల పరిమళా ల మధ్య నీ నవ్వుల కలలు

నీ కలలు ను చిదిమేసిన బాధ్యతలు

ఇప్పుడు ఇంకొకరి కలలను వేటాడుతున్నాయి

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.