రూపాయిబిళ్ల

ఆరోజు మంగళవారం.

మా కాలనీలోని పైడితల్లి అమ్మవారి ఆలయానికి వెళ్లాను.

భక్తులు పల్చగా ఉన్నారు. గుడిలో చంద్రవౌళి పూజారిచ్చిన తీర్థం పుచ్చుకున్నాను.

శఠగోపం పెట్టి, ప్రసాదం ఇచ్చాడు.

భక్తులు లేకపోవడం వల్ల పూజారిగారు, నేను పక్కన నిలబడి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాం.

ఇంతలో గుడి మెట్ల దగ్గర చిన్న అలజడి.

భక్తుడికి, భిక్షగాడికి మధ్య ఏదో తగవు అవుతోంది. నేను, పూజారిగారు చూస్తున్నాం.

బిచ్చగాడు రూపాయి బిళ్లను చూపిస్తూ ‘‘రూపాయి బిళ్ల ధర్మం చేసి బోల్డు పుణ్యం మూటగట్టుకుందామని అనుకుంటున్నావా?’’ అంటూ భక్తుడిని ప్రశ్నిస్తున్నాడు.

బిచ్చగాడు అడిగిన ప్రశ్నకు ఆ భక్తుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

ఏమీ మాట్లాడకపోయే సరికి బిచ్చగాడు మరింత రెచ్చిపోయాడు.

‘‘జేబులో రూపాయి బిళ్లలు వేసుకుని ఓ... ఊపుకుంటూ గుడికి వచ్చేస్తారు’’ అని వెటకారంగా మాట్లాడాడు.

అప్పుడు చూసాను ఆ భక్తుడిని. గుడిలో పూజారిగారు గోత్రనామాలు చదివి హారతి, తీర్థప్రసాదం ఇచ్చిన తరువాత ఆ భక్తుడు తనపై జేబు నుండి ఒక రూపాయి బిళ్ల హారతి పళ్లెంలోను, మరో రూపాయి బిళ్ల హుండీలో వేసాడు.

బయటకు వెళ్లి బిచ్చగాడి చేతిలో బుక్ అయిపోయాడన్న మాట అనుకున్నాను.

‘‘ ఏరా ఎక్కువగా మాట్లాడుతున్నావు’’ బిచ్చగాడిని గద్దించాడు ఆ భక్తుడు.

‘‘ ఏం బాబయ్య! నీవు వేసిన ఈ రూపాయి బిళ్లతో ఏం వస్తుందో గబగబా చెప్పగలవా?’’ వెటకారంగా అన్నాడు.

‘ధర్మం చేసాను. తీసుకుంటే తీసుకో లేదా మానెయ్’’

‘ధర్మం నేనడిగానా నిన్ను?’’ గర్జించాడు బిచ్చగాడు.

‘‘ ఒరేయ్! ఎక్కువ మాట్లాడావంటే...’’

ఇంతలో మధ్యలోనే పక్కన ఉన్న మరో ఇద్దరు బిచ్చగాళ్లు లేచారు.

‘‘ ఆ మాట్లాడితే ఏం చేస్తావ్ బాబయ్య’’ అని ప్రశ్నించే సరికి ఆ భక్తుడు బిక్క చచ్చిపోయాడు.

అప్పటికే ఆడ, మగ భక్తులు నలుగురైదుగురు ఈ తతంగం చూస్తున్నారు. ఇక తన పరువు బజారున పడేటట్లు ఉందనుకున్నాడేమో ఆ భక్తుడు నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నాడు.

గుడిలో పూజారిగారు గోత్రనామాలు చదివి హారతి ఇచ్చి తీర్థం, శఠగోపం పెట్టి ఉన్నంతలో ప్రసాదం కూడా ఇస్తే పళ్లెంలో రూపాయి బిళ్ల దక్షిణగా వేసినా పాపం పంతులుగారు కిక్కురమనలేదు.

అదే రూపాయి బిళ్ల ధర్మం అంటూ బిచ్చగాడి పళ్లెంలో వేస్తే నిలబట్టి మరీ పరువు తీసేశాడు.

పంతులు గారి దృష్టిలోనైనా, బిచ్చగాడి దృష్టిలోనైనా రూపాయి బిళ్ల విలువ ఒకటే. అయితే బిచ్చగాడికి లేని చైతన్యం పూజారిగారికి ఉంది

కనుక ఆయన కిమ్మనకుండా ఉండిపోయారనుకున్నాను నేను.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.