విస్సన్న హాస్యం

(ఈ కథ జనవరి 12, 2012న విశాలాంధ్ర పత్రికలో ప్రచురితమైంది)

విదూషకుడు విస్సన్న రాజుసభలో చతుర సంభాషణలు చెప్పి రాజును, సభికులను నవ్విస్తుండేవాడు.

తను చేసిన హాస్యాన్నంతా, తండ్రికి చెప్పేవాడు ఇంటికొచ్చాక. ''ఏర్పాటు చేసిన సభలో కాదు, ప్రజల్లో కొచ్చి, వాళ్లను నవ్వించు, వాళ్ళు నవ్వితే నీవు నిజమైన విదూషకుడవుతావు'' అన్నాడు తండ్రి.

దాన్ని సవాలుగా తీసుకుని మరుసటిరోజు, విచిత్ర వేషం వేసుకుని గాడిదపై పల్లెటూరు వెళ్లాడు.

చిత్ర విచిత్రంగా మాట్లాడుతూ, పిల్లిలా అరుస్తూ, నక్కలా కూయసాగాడు.

జనాన్ని నవ్వించడానికి అష్టవంకరలు తిరగసాగాడు. అయినా వింతగా చూస్తున్నారే కానీ, ఎవరూ నవ్వడం లేదు. ''నేను మిమ్మల్ని నవ్వించడానికి, ఇంత అవస్త పడుతుంటే నవ్వడం లేదెందుకూ?'' అని అడిగాడు జనాన్ని.

''మేం పల్లెవాళ్ళం గదా. మొరటు హాస్యాలకే నవ్వుకుంటాం. మొరటు పద్ధతులనే ఇష్టపడతాం ''అన్నాడో పిల్లవాడు.

'' మొరటు హాస్యమా? అదేంటి? నేనెప్పుడూ వినలేదు, చూడలేదే...'' అన్నాడు.

''ఇప్పుడు చూపిస్తాము, అలాగే ఉండండి'' అని మరో బాలుడికి సైగ చేశాడు. వాడో తాటాకును తెచ్చి, గాడిద తోకకు కట్టి, దాని ముడ్డిమీద కర్రతో ఒక్కటి బాదాడు.

ఇంకేముంది. గాడిద పరిగెత్తుతుంటే, తాటాకు టపటపా చప్పుడైంది.

ఆ చప్పుడుకు భయంతో మరింత వేగంగా పరిగెత్త సాగింది గాడిద.

అప్పుడు జనం నవ్వడం మొదలు పెట్టారు.

గాడిద మీదున్న విస్సన్న భయంతో కేకలు పెడుతూ, గట్టిగా పట్టుకున్నాడు.

గాడిద వేగంగా ఓండ్రుపెడుతూ పరిగెత్తుతుండడంతో పట్టుతప్పి ఎగిరి కింద పడ్డాడు.

విరగబడి నవ్వసాగారు మూగినవాళ్లంతా.

కిందపడ్డ విస్సన్న మెల్లగా లేచాడు.

చేతికి, మోకాలుకు దెబ్బలు తగిలి రక్తం కారసాగింది.

అయినా అదేం పట్టించుకోకుండా, నవ్వుతున్న జనాన్ని చూసి, ''నేను సాధించాను. ప్రజల్ని వాళ్ల ప్రాంతంలోనే నవ్వించాను'' అని బిగ్గరగా నవ్వసాగాడు.

ఎందుకు నవ్వుతున్నాడో అర్థంగాక జనం ప్రశ్నార్థకంగా చూడసాగారు.

- పుప్పాల కృష్ణమూర్తి

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.