షరతు

(షరతు' కథ 13/09/2015 న ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం 'స్నేహ' లో ప్రచురింపబడినది)

రాష్ట్ర సరిహద్దులలోని ఒక గ్రామంలో ఒక ఇంటిలో రాత్రి టి.వి. ముందు కూర్చుని వార్తలు చూస్తూ భోజనం చేస్తున్నాడు మల్లన్న. వార్తల మధ్యలో గ్రామాలకి సంబంధించిన విషయంపై ఒక ప్రకటన వస్తుంటే దీక్షగా చూస్తున్నాడు. మల్లన్న చెల్లెలు లక్ష్మి పక్కనే కూర్చుని అన్నకి కావలసిన పదార్థాలు వడ్డిస్తూ తాను కూడా టి.వి. చూస్తోంది. ఒక పెద్ద గది , ఒక వంటగది తో పాటు కనీస సౌకర్యాలు ఉన్న పాక ఇల్లు మల్లన్నది. ఒక పక్కగా అమ్మమ్మ పడుకుని నిద్రపోతోంది . పండగ రాబోతోందని అమ్మమ్మకి, చెల్లెలుకి కొత్త చీరలు తెచ్చాడు ఆవేళ మల్లన్న పట్నం నించి .

లక్ష్మికి ఆరేళ్ళ వయసప్పుడు ఒకరోజు పొలానికి ఎరువులకోసమని పట్నం వెళ్ళి వస్తూ బస్ ప్రమాదంలో మల్లన్న తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటిదాకా అప్పుడప్పుడు వచ్చి పోతుండే వరాలమ్మ కూతురు అల్లుడు చనిపోవటంతో మనుమలకి తోడుగా ఇక్కడే ఉండిపోయింది. తల్లిదండ్రులు అకస్మాత్తుగా చనిపోవటంతో పధ్నాలుగేళ్ల వయసులోనే మల్లన్న చదువు ఆగిపోవటమే కాకుండా ఇంటి బాధ్యత కూడా మీద పడింది. అప్పటినించీ అమ్మమ్మ సలహాలు తీసుకుంటూ, పొలాన్ని సాగు చేసుకుంటూ, వఛ్చే రాబడితో అమ్మమ్మకి , చెల్లికి ఏ కష్టం రానీకుండా చూసుకుంటున్నాడు . అందుకే లక్ష్మికి అన్న అంటే ప్రాణం . అన్న ఏం చెప్తే అది దానికి వేదం. అన్న ఏం చేసినా తన మంచికే చేస్తాడని దానికి గట్టి నమ్మకం.

భోజనం అయ్యాక పడుకోవడానికి వసారాలోకి వెళుతూ నిద్రపోతున్న అమ్మమ్మని చూసి “ఈ మధ్య అమ్మమ్మకి కొంచం సుస్తీగా ఉండటంతో అలసిపోయి పాపం తొందరగా నిద్రపోతోంది “ అనుకుని , ఇంకో పక్క చీర చూసుకుని సంతోషపడుతున్న చెల్లెలిని చూసి “లక్ష్మికి ఇరవైయ్యేళ్లు నిండుతాయి. మంచి సంబంధం చూసి ఒక అయ్య చేతిలో పెడితే తనకి బాధ్యత తీరుతుంది , అమ్మమ్మ కూడా కొంచం కుదుట పడుతుంది “ అనుకున్నాడు మనసులో.

మల్లన్నఆ ఊళ్ళో అందరికీ తలలో నాలికలా ఉంటూ ”మంచివాడు మా మల్లన్న” అనే పేరు సంపాదించుకున్నాడు. తల్లి తండ్రి లేని పిల్లలని ఆ గ్రామంలో అందరికీ లక్ష్మి , మల్లన్న అంటే ఎంతో అభిమానం.

ఒక రోజు ఉదయమే బయలుదేరి పొలం వెళుతుండగా ఆ ఊరి పెద్ద ఒకాయన దారిలో కనిపించి తన ఇంటికి తీసుకెళ్లి “ఒరే మల్లన్నా పక్క ఊరిలో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా లక్ష్మికి మంచి సంబంధం వచ్చిందిరా” అని ఆ సంబంధం తాలూకు వివరాలు చెప్పి “ లక్ష్మిని చూసుకోవటానికి ఈ శుక్రవారం వస్తామన్నారు , రమ్మని చెప్పమంటావా? ” అన్నారు.

“మీకు తెలిసిన వాళ్ళంటే ఇంక నాకేం సందేహంలేదు బాబాయి , తప్పక రమ్మనండి “ అన్నాడు మల్లన్న ఆనందంగా . వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మమ్మకి , లక్ష్మికీ బాబాయి చెప్పిన విషయమంతా వివరించి పొలం వెళ్లిపోయాడు .

బాబాయి చెప్పిన సంబంధం వివరాలు “ అబ్బాయి పేరు రాజు. రాజుకి తల్లిలేదు తండ్రిమాత్రమే ఉన్నాడు . ఆయన కొంచం కోపదారి మనిషి . తన కొడుకుకి ఎన్నో పెద్ద సంబంధాలు వస్తుంటే ఈ సంబంధం తాలూకు అమ్మాయి బుద్ధిమంతురాలని పనిమంతురాలని విని తన కొడుకు “నాకు అలాంటి అమ్మాయే కావాలని “ మంకు పట్టు పట్టడంతో ఆయనకి అంతగా ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. తండ్రీ కొడుకులిద్దరూ అమ్మాయిని చూడటానికి వచ్చారు . చూడగానే లక్ష్మికి రాజు బాగా నచ్చాడు.

రాజుకి కూడా లక్ష్మి నచ్చేసింది. రాజు తండ్రి ఇంక ఏమి అనలేక కొడుకు కోసం “సరే” నన్నాడు. మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకోవటానికి బాబాయి ఇంటికి రమ్మని మల్లన్న తో చెప్పి ఆయనతో కలిసి వాళ్ళింటికి వెళ్ళిపోయారు రాజు వాళ్ళు.

“లక్ష్మి నువ్వేంతో అదృష్టమంతురాలివే “ అంటూ “ అమ్మమ్మా ! నేను వెళ్ళి వాళ్ళతో అన్నీ మాట్లాడి ఖాయం చేసుకుని వస్తాను , నా కోసం ఎదురుచూడకుండా అన్నం తినేసి పడుకోండి ఇద్దరూ “, అని చెప్పి బాబాయి ఇంటికి వెళ్ళాడు మల్లన్న.

చెల్లెలికి సంబంధం ఖాయం చేసుకుని , మరో రెండు నెలలలో పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టుకుని పదిరోజులయ్యింది. ఒక రోజు ఏదో పని పడి రాజు వాళ్ళు ఉండే ఊరు వెళ్లాల్సి వచ్చింది మల్లన్నకి. ఆ రోజు వెళుతూ- వెళుతూ “మా ఇంటికి తప్పక ఒకసారి రా మల్లన్నా “ అని రాజు చెప్పటం గుర్తుకు వచ్చి “ ఇంకేం అయితే పనిలో పని ఇవాళ వెళ్ళి కాబోయే బావని , వాళ్ళ ఇల్లూ వాకిలి కూడా చూసి వస్తాను ” అనుకుని బయలు దేరాడు.

మల్లన్నకి ఇల్లంతా తిప్పి చూపించాడు రాజు. “ఇల్లు చాలా బాగుంది కానీ!!!!! ..........“ అని మనసులో అనుకుని కాసేపు కూర్చుని “వెళ్లొస్తాను బావా” అని చెప్పి బయలుదేరి వచ్చేశాడు.

ఊరు వెళ్ళి వచ్చినప్పటినించీ మల్లన్న అదోలా ఉండటం ఇటు లక్ష్మి అటు అమ్మమ్మా కూడా గమనించారు.

అన్నని “ఏంజరిగిందని” అడగడానికి జంకింది లక్ష్మి , కానీ “ ఏమైందిరా మల్లన్నా అలా ఉన్నావు? అడిగింది అమ్మమ్మ ఉండబట్టలేక ఒకరోజు. అసలు విషయం అమ్మమ్మకి ఎలా చెప్పాలో తెలియలేదు మల్లన్నకి . ఒక వేళ చెప్పినా “ పో రా నీదంతా చాదస్తం , మేమంతా ఇన్నాళ్లూ ఇవేమీ లేకుండానే బ్రతకలేదా ఏమిటి? అని కొట్టి పారేస్తేనో ?” అనుకుని ఇంకేమీ చెప్పకుండా

“ఈ సంబంధం లక్ష్మికి వద్దనుకుంటున్నాను అమ్మమ్మా!! ” అన్నాడు మల్లన్న.

ఏదో వినకూడని విషయం విన్నట్లుగా నిర్ఘాంతపోయారు అమ్మమ్మా లక్ష్మి కూడా.

“ఏరా, ఒంటిమీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా?” అని అరిచింది అమ్మమ్మ గట్టిగా .

లక్ష్మి మాత్రం “ఇదేమిటీ ? అన్నీ నిశ్చయమైనాకా అన్న ఇలా అంటున్నాడేమిటి? నిన్న వాళ్ళ ఊరు వెళ్లొచ్చాడుగా అక్కడ ఏమైనా గొడవజరిగిందేమో?” అనుకుంది మనసులోనే. మొదటి సారిగా అన్న పొరపాటు పడుతున్నాడేమో అనిపించింది లక్ష్మికి. రాజు ని చూసిన వెంటనే అతనినే తన మనసులో కాబోయే పెనిమిటి గా ఊహించేసుకుంది లక్ష్మి. అలాగే ఆ దేవుడి దయవల్ల అన్నీ బాగా జరిగిపోయాయి ఇప్పటిదాకా. పెళ్లి ఇంకో నెలరోజుల్లోకి వచ్చేసింది కూడా. అన్న నిర్ణయం లక్ష్మిని కొంత మనస్థాపానికి గురిచేసింది.

విషయం తెలిసిన బాబాయి కూడా “ ఖాయం చేసుకున్న పెళ్ళిని ఇప్పుడు కాదంటే , ఏం జరుగుతుందో తెలిసే మాట్లాడుతున్నావా మల్లన్నా నువ్వు?” అన్నాడు .

సాధారణంగా చిన్న చిన్న వివాదాలేమైనా వస్తే గ్రామ సభలలో పెద్దలందరి సమక్షంలో పరిష్కారం చేయబడతాయి. కానీ “పెళ్లి” అనేది చిన్న సమస్య కాకపోగా రెండు వేర్వేరు గ్రామాలకి సంబంధించిన విషయం . వాళ్ళ పంచాయితీ నియమం ప్రకారం ఒకసారి “పెళ్లి” కుదిరిన తరువాత ఏకారణం చేతైనా అందులో ఒకరు ఆ పెళ్లి మానుకుంటే , ఎందుకు మానుకుంటున్నామో పంచాయితీ పెద్దలందరి ముందు కారణాన్ని తెలియజేయాలి . ఆ కారణం ఎంతవరకు సబబైనదో విచారణ జరుగుతుంది. సరైన కారణం లేకుండా పెళ్లి మానుకుంటే , ముందుగా ఎవరైతే పెళ్లి మానుకుంటారో వాళ్ళు అవతలి వాళ్ళకి పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కారణం సరైనదైతే పెళ్లి రద్దు చేయబడుతుంది కానీ అప్పుడు కూడా ముందుగా పెళ్లి వద్దనుకున్న ఫిర్యాదు దారుడు ఎంతో కొంత మొత్తం అవతలివారికి జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సాధారణంగా పెళ్లి వరకు వచ్చాక ఎంతో బలమైన కారణం ఉంటేగానీ ఎవరూ పెళ్లి మానుకునేంత సాహసం చెయ్యరు. అంతేకాకుండా అనవసరంగా పంచాయితీ సమయం వృథా చేసినా కూడా జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకనుకే మల్లన్న ఎలాంటి చిక్కుల్లో పడకూడదనే బాబాయి అలా హెచ్చరించాడు మల్లన్నని ఇందాక.

“ఆ ఇంటి పరిస్థితులు చూసాక ఆ ఇంట్లో పెళ్లి తరవాత లక్ష్మి కొన్ని విషయాలలో జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అనిపించింది బాబాయి. అందుకే జరిమానా అయినా కడతాను గాని ఆ ఇంటికి మాత్రం నా చెల్లిని పంపను “ అన్నాడు మొండిగా మల్లన్న.

గ్రామ పెద్దలతో సహా అందరూ కూడా “ అన్ని విధాలా మంచి సంబంధమని, ఒక సారి ఆడపిల్ల పెళ్లి కారణం లేకుండా ఆగిపోతే మళ్ళీ ఇంకో మంచి సంబంధం రావటం కష్టమని, పంచాయితీ దాకా వెళ్ళటం అంత మంచిది కాదని” ......ఇలా శతవిధాలా మల్లన్నకి నచ్చ చెప్పాలని చూశారు కానీ మల్లన్న మాత్రం తన పట్టు విడవలేదు.

ఎంత అడిగినా మల్లన్న అసలు పెళ్లి ఎందుకు వద్దంటున్నాడో అనే విషయం చెప్పమంటే మాత్రం నోరు విప్పటంలేదు సరికదా

“ నేను ఇంక పంచాయితీ పెద్దల ముందరే మాట్లాడేది” అని తేల్చి చెప్పేశాడు మల్లన్న.

గ్రామాలలో మాట దాగదు . ఆ నోటా ఈ నోటా రాజు వాళ్ళకి కూడా ఈ విషయం తెలిసింది. రాజుకి కూడా మతిపోయినట్లయ్యింది. అసలే కోపదారి అందులో కొడుకు ఇష్టపడ్డాడని మల్లన్న తమకంటే అంతస్థులో తక్కువైనా ఈ సంబంధం కొంచం అయిష్టంగానే ఒప్పుకున్న రాజు తండ్రి కూడా విషయం తెలిసి అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. “ఏమనుకుంటున్నాడు ఆ మల్లన్న ? అన్నీ కుదిరి పెళ్లిదాకా వచ్చాక ఇప్పుడేమో మా సంబంధం వద్దంటున్నాడా? ఎంత పొగరు చెప్తాను వాడి సంగతి “ అని పట్టరాని కోపంతో కొడుకు దగ్గిర అరిచేశాడు ఆయన.

రాజుకి కూడా కోపం వచ్చినప్పటికీ “ నేను మాత్రం లక్ష్మి నే చేసుకుంటాను నాన్నా. పంచాయితీ పిలిచారుగా . వెళదాము . అక్కడ అసలు కారణమేమిటో తెలుస్తుందిగా “ అన్నాడు తండ్రితో.

“మరీ ఇలా సంబంధం వద్దు అనేసి పంచాయితీ దాకా పోకుండా మల్లన్న తనతో అసలు విషయం చెపితే బాగుండేది” అని కొంత బాధగా అనుకున్నాడు రాజు. “ కానీ తన చెల్లెలి భవిష్యత్తుకి సంబంధించిన విషయం అని తెలిసీ పంచాయితీ దాకా వెళ్లడానికి ధైర్యం చేస్తున్నాడంటే , ఏదో గట్టి కారణమే అయి ఉంటుంది “ అనుకున్నాడు రాజు మళ్ళీ తనలో తానే.

ఆ రోజే పంచాయతీ . ఇరు పక్షాల వాళ్ళే కాకుండా, అసలు సమస్య ఏమిటో , పంచాయితీ తీర్పు ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందామనే ఉత్సుకతతో అక్కడ చాలా మంది గుమిగూడారు .

పంచాయితిలో మొత్తం అయిదుగురు పెద్దలు ఉన్నారు. మల్లన్నని ఎరిగిన పెద్దలందరూ కూడా మల్లన్న పై కొంచం కోపంగా ఉన్నారు. “కనీసం మా కైనా మల్లన్న కారణం చెపితే బాగుండేది . పంచాయితీ సమయం వృథా చేసినా కూడా జరిమానా కట్టాల్సి ఉంటుంది . కానీ వీడిని చూస్తుంటే అన్నింటికీ తెగించినట్లే ఉన్నాడు.” అనుకున్నారు మనసులో.

“ మల్లన్నా ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది, ఎందుకు ముహూర్తాలదాకా వచ్చిన పెళ్లిని కాదంటున్నావు? మీ మధ్యలో ఏమైనా గొడవలు జరిగాయా? “ అని అడిగారు పెద్దలు .

“ పెద్దలందరూ నన్ను మన్నించాలి. కానీ అలాంటిదేమీ లేదు. రాజు వాళ్ళు నన్నెంతో మర్యాదగా చూశారు కానీ వాళ్ళింటికి వెళ్ళి అక్కడి పరిస్థితులు చూశాక నా చెల్లెలు లక్ష్మి పెళ్లి తరవాత ఆ ఇంట్లో సౌకర్యంగా ఉండలేదనిపించింది . ఇది లక్ష్మి జీవితాంతం ఉండే సమస్య. ఈ పెళ్లి జరగాలంటే రాజు వాళ్ళు నా “షరతు” ఒకటి వెంటనే అంగీకరించాలి అప్పుడే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను.” అంటూ ఆ సమస్యేమిటో , తన “షరతు “ ఏమిటో గ్రామ ప్రజల సమక్షంలో పంచాయితీ ముందు వివరించి చెప్పాడు మల్లన్న.

“ఓస్ ! ఇదా విషయం ! ఇంత చిన్న విషయాన్ని ఏదో పెద్ద సమస్యగా చేసి బంగారం లాంటి సంబంధం వదులుకుని చెల్లెలి గొంతు కోస్తున్నాడు వీడు , అదీగాక ఇన్నాళ్లుగా మనమంతా బ్రతకటంలా? పైగా షరతు ట షరతు , సందేహంలేదు మల్లన్నకి ఖచ్చితంగా మతిపోయింది . “ అంటూ అక్కడున్న వాళ్ళందరూ చెవులు కొరుక్కోసాగారు.

రాజు మాత్రం మల్లన్న చెప్పినదాని గురించే ఆలోచిస్తున్నాడు ...........”రాజు వాళ్ళ ఇల్లు ఎంతో బాగున్నప్పటికీ అక్కడ ఆడవారికి (మగవారికి కూడా) ఉదయమే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కావలసిన కనీస సౌకర్యం అంటే “శౌచాలయం” (Toilet) లేదు .

ఆ ఇంట్లో ఉండే ఇద్దరూ మగవారే కాబట్టి వారికి ఇది ఒక సమస్య అని అనిపించక పోవటంలో ఆశ్చర్యంలేదు . కానీ నా చెల్లెలు లక్ష్మి ఒక ఆడపిల్ల . మరి లక్ష్మి తెల్లారి లేచి కాలకృత్యాలు తీర్చుకోవటం కోసం ఇంటినించి బయటకి వెళ్ళాలా? అది ఊహించుకుంటేనే నాకు ఒంట్లోంచి వణుకు వచ్చినట్లయ్యింది. నా చెల్లెలు ఎందుకు జీవితాంతం ఈ విషయంలో ఇబ్బంది పడాలి? “ఇది మనలాంటి ఎన్నో గ్రామాలలో ఎంతోమంది ఆడపిల్లల ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య అనే విషయం “ ఈ మధ్య తరచూ టి.వి.లో చూపించటం నేను దీక్షగా చాలాసార్లు గమనించాను. ఇది లక్ష్మి భవిష్యత్తుకి సంబంధించిన ముఖ్యమైన విషయం కాబట్టే పెళ్లికి ముందరే ఈ “షరతు” పెట్టాల్సి వచ్చింది. అంతే కాకుండా లక్ష్మి లాంటి మరెంతో మంది అమ్మాయిలకి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే కారణం చెప్పమని ఎవరెంత అడిగినా కూడా చెప్పకుండా ఈ విషయాన్ని పెద్దలందరి దృష్టికి తీసుకుని రావడానికే ఇలా చేశాను “ అని చెప్పాడు మల్లన్న ........

“ అవును ఇంత ముఖ్యమైన విషయం మల్లన్న పంచాయితిలో చెప్పేదాకా నాకెందుకు తట్ట లేదు . ఈ విషయం నా పెళ్లికే సమస్యగా మారుతుందని నేనెప్పుడు అనుకోలేదు. నాకు తల్లి , అక్కచెల్లెళ్లు లేకపోవటంతో అసలు ఎప్పుడు ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. పని జరిగిపోతోందిగదా అని నేనుగానీ నాన్నగానీ అసలు ఆ వైపు ధ్యాసే పెట్టలేదు. ఈ విషయానికీ , లక్ష్మి పెళ్లికీ ముడిపెడుతూ “షరతు” పెట్టాడంటేనే మల్లన్నకి చెల్లెలంటే ఎంత ఇష్టమో , అత్తవారింట్లో ఆమె సుఖంగా సౌకర్యంగా ఉండాలని ఎంత బలంగా కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. “చెల్లెలి పెళ్లి ఆగిపోతే “ అనికూడా భయపడకుండా , తన చెల్లెలు లాంటి ఎంతోమంది అమ్మాయిలకి కూడా ఈ విషయంలో న్యాయం జరగాలని కోరుకుని ఇంత సాహసం చేసి మల్లన్న పంచాయితీ దాకా వచ్చాడంటే మల్లన్న అంటే రాజు కి ఎంతో గౌరవం పెరిగింది. ఈ విషయంలో ఇంకా తర్కాలు అనవసరం . ఇప్పుడు నేను మాట్లాడే సమయం వచ్చింది “ అనుకుంటూ లేచి నిలబడ్డాడు.

రాజు నిలబడటం చూసి “ఏం చెప్తాడో” అనుకుంటూ అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయారు.

“ఇప్పుడు చూస్తాను మల్లన్న ఏంచేస్తాడో? రాజు వాడికి బాగా బుద్ధొచ్చేలా ఈ సంబంధం వద్దనేస్తాడు” అనుకున్నాడు రాజు తండ్రి. కానీ అలా జరగలేదు.

“పెద్దలందరికి నమస్కారం. మల్లన్న పెట్టిన “షరతు” కి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నా పెళ్ళికి వారం రోజుల ముందుగానే రాజు “షరతు” ని పూర్తి చేస్తానని , మా ఇంట్లో “శౌచాలయం” కట్టిస్తానని , లక్ష్మికి అన్ని సౌకర్యాలు కలుగచేసి ఏలోటు రాకుండా చూసుకుంటాననీ మాట ఇస్తున్నాను “ అన్నాడు రాజు . కొడుకు మాటలు విన్న రాజు తండ్రి అవాక్కై చూస్తుండిపోయాడు.

“రాజు లాంటి పెనిమిటి దొరకడం నిజంగా లక్ష్మి చేసుకున్న పుణ్యం “ అనుకున్నాడు అది విని మల్లన్న.

పెద్దలందరు రాజుని అభినందించారు . అంతే కాకుండా ఈ విషయాన్ని తన చెల్లెలు అనే దృష్టితోనే కాకుండా అలాంటి ఎంతోమంది ఆడపిల్లల సమస్య అని ఆలోచించి ధైర్యం చేసి పంచాయితీ ముందుకి తెచ్చినందుకు మల్లన్నని కూడా మెచ్చుకుని , ముందు ముందు తమ గ్రామాలలో తిరిగి ఇలాంటి సమస్య రాకుండా ఆ దిశగా తగిన చర్యలు వెంటనే చేపడతామని అక్కడ ఉన్న గ్రామస్థులందరికి మాట ఇచ్చారు పంచాయితీ పెద్దలు.

అయినప్పటికి తన సమస్యని గ్రామ సభలోనే పెద్దలందరి ముందు చెప్పకుండా "పంచాయితీ” దాకా ఈ విషయం తెచ్చి నియమాలని ఉల్లంఘించినందుకు రు. 500/- జరిమానా విధించబడింది మల్లన్నకి . ఇది ముందుగానే ఊహించిన మల్లన్న “ఫరవాలేదు జరిమానా కట్టాల్సి వస్తున్నప్పటికి , చెల్లెలు లక్ష్మి తో పాటుగా మరెంతోమందకి(ముఖ్యంగా అమ్మాయిలకి) ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకుని రాగలిగాను “ అనుకున్నాడు తృప్తిగా మల్లన్న.

మొండిధైర్యంతో “షరతు” పెట్టేశాడే కానీ తన చెల్లెలి భవిష్యత్తు ఏమవుతుందో అని మల్లన్న లోలోపల కొంచం కలవరపడిన మాట మాత్రం నిజం. కానీ రాజు పెద్దమనసుతో ఈ విషయం అర్థంచేసుకుని సహకరించటానికి ఒప్పుకోవటంతో కలవరం తగ్గి మనసు తేలికగా అనిపించింది మల్లన్నకి. రాజు ని ఆప్యాయంగా కౌగలించుకుని ధన్యవాదాలు తెలుపుకున్నాడు మల్లన్న. తన అన్న పెట్టిన “షరతుని” రాజు “బేషరతుగా” ఒప్పుకున్నాడని తెలుసుకున్న లక్ష్మికి రాజు పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ఇనుమడించాయి. మనసులోనే రాజుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంది లక్ష్మి.

***********

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.